[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘అడవి తల్లి ఒడిలో’ అనే బాలల నవలికకి కొల్లూరి సోమ శంకర్ రాసిన ముందుమాటని అందిస్తున్నాము.]
[dropcap]స[/dropcap]మస్త జీవజాలానికి అడవులకు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. జీవులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించే అడవులకు గత కొన్ని దశాబ్దాలుగా ముప్పు వాటిల్లుతున్న సంగతి మనమెరిగినదే. విపరీతంగా పట్టణీకరణ జరుగుతూ, ఆవాస స్థలాల కోసం అడవులను యథేచ్ఛగా నరికేస్తూ.. ప్రకృతికి చేటు చేస్తున్నాం. కొన్ని చోట్ల పరిశ్రమల కోసం అటవీ భూములకు కేటాయించి తాత్కాలిక ప్రయోజనాల మైకంలో పడి, దీర్ఘకాలపు దుష్పరిణామాలను విస్మరిస్తున్నాం. మరి దీనికి నివారణ ఏమిటి? ప్రజలలో అడవుల పట్ల చైతన్యం రావాలి. ముఖ్యంగా పిల్లలలో ఆ చైతన్యం కలిగిస్తే, కనీసం రాబోయే తరం వారైనా దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
ఈ దిశలో తన వంతు బాధ్యతగా ప్రముఖ రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ బాలబాలికల కోసం ‘అడవి తల్లి ఒడిలో’ అన్న నవలిక రాసి, పిల్లలలో అడవుల పట్ల కుతూహలాన్ని, అడవుల సంరక్షణ పట్ల అవగాహనని కల్పించడానికి ప్రయత్నించారు.
అడవంటే అద్భుతం! అడవంటే విజ్ఞానం! అడవంటే పచ్చదనం! అడవంటే హాయిగొల్పే మలయ మారుతం. అడవంటే మనకి తెలియని వృక్షాలు, పక్షులు, జంతువుల నిలయం! మనకి కాస్తో కూస్తో పరిచయం ఉన్న ఆటవిక జాతుల నెలవు! భిన్న సాంప్రదాయాలు, వింతైన ఆచారాలు కలిగి ఉండి, నిరాడంబర జీవితం జీవితం గడిపే తెగల మనుషులు! మంచితనం మీద విశ్వాసం సడలని వ్యక్తులు!
***
వనస్థలిపురంలోని చైతన్యభారతి పబ్లిక్ స్కూలులో ‘మిత్రవింద’ అనే టీచరు అడవుల గురించి పాఠం చెప్తుండడంతో మొదలయిన నవలిక – నచికేత్, ఖలీల్, నిఖిల అనే ఆరో తరగతి పిల్లలకు – రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ శాంతిస్వరూప్ గారిని పరిచయం చేసి – ఆయన వాళ్ళకు – రెండు రోజుల పాటు నల్లమల అడవిని చూపించి తీసుకురావడంతో ముగుస్తుంది.
కథా ప్రారంభంలోనే మిత్రవింద అడవుల ప్రాముఖ్యత ఏమిటో పిల్లలకి అర్థమయ్యేలా వివరించి, అడవులు చూడాలన్న కోరికకి బీజం వేస్తారు. స్నేహితులైన పై ముగ్గురు పిల్లలు భిన్నమైన నేపథ్యాలకు చెందినవారైనా, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు, తల్లిదండ్రులు చదువుకున్నవారు. విజ్ఞానం విలువ తెలిసినవారు. పార్కులో ఆడుకోవడానికి వచ్చిన ఈ ముగ్గురు పిల్లలకు శాంతిస్వరూప్ పరిచయమై, వారి మధ్య సాన్నిహిత్యం పెరగగా – తల్లిదండ్రుల అనుమతితో ఆ ముగ్గురిని నల్లమల అడవులకు ప్రయాణం కట్టిస్తారాయన.
ఆత్మకూరు దాటి నల్లమల్ల అడవి లోకి ప్రవేశించాకా, కొద్ది దూరం వెళ్ళాకా చెక్ పోస్ట్ దగ్గర ఒకతను ఎదురై, శాంతిస్వరూప్ గారికి నమస్కరించి, వాళ్ళని డి.ఎఫ్.ఓ. నవీన్ కృష్ణ గారి వద్దకు తీసుకువెళ్తాడు. నవీన్ కృష్ణ ఒకప్పుడు రంపచోడవరంలో శాంతిస్వరూప్ గారితో పని చేశారు. ఆయన వీళ్లని ఆదరంగా ఆహ్వానించి, బసకి ఏర్పాటు చేసి, అడవి చూపించటానికి చెన్నకేశవులు అనే ఫారెస్టు గార్డుని వెంట పంపిస్తారు.
ఆ సాయంత్రం ‘దెయ్యాల గరువు’ మీదుగా ‘పాతాళ కనుమ’కి వెళ్తారు. ఆ రెండూ చూసి చీకటి పడుతుండగా గెస్ట్ హౌస్‌కి వచ్చేస్తారు. ఈ రెండు ప్రదేశాలను రచయిత పాఠకుల కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. చెట్లు, కొండలు, లోయ, లోయలో పారే వాగు, మనుషుల అలికిడికి బెదిరిన పక్షులు, కోతులు – పాఠకుల మనసుల్లో ముద్రితమవుతుంది.
మర్నాడు ఉదయం ‘సుంకులమ్మ గుట్ట’కి వెడతారు. అక్కడి చెంచుల ఆలయాన్ని దర్శించుకుంటారు. తరువాత ‘కిష్టమ్మ కోన’కు వెళ్తారు. అక్కడ ఎక్కువగా ఉన్న సీతాకోకచిలుకలని గమనిస్తుంది నిఖిల. సీతాకోకచిలుక జీవితంలోని నాలుగు దశలను పిల్లలకి వివరిస్తారు శాంతిస్వరూప్. మర్నాడు ఆత్మకూరు – దోర్ణాల మధ్యలో ‘భవనాశి వనం’ మనే ప్రాంతానికి వెళ్తారు. ఆ తర్వాత ‘తుమ్మల బయలు’ చూస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుతారు.
పిల్లలు ఈ అటవీ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు – దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘ఆకులో ఆకునై పూవులో పూవునై; కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై; ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అనే పాట గుర్తొస్తుంది. దేవులపల్లివారు ఒకసారి రైల్లో గిద్దలూరు-నంద్యాల మధ్యనున్న నల్లమల అడవి గుండా ప్రయాణించినప్పుడు ఆ అటవీ సౌందర్యం చూసి ఆయన మదిలో ఉద్భవించిన గేయమిదని అంటారు. కాబట్టి ఈ పాటని ప్రస్తావించుకోడంలో అనౌచిత్యం లేదు.
నల్లమల అడవుల లోపలికి వెళ్ళాక అక్కడి పరిసరాలను చూస్తుంటే (చదువుతుంటే), పాఠకులకు బిభూతిభుషణ్ బందోపాధ్యాయ గారి ‘వనవాసి’ గుర్తొస్తుంది. కథనంలో లీనమై, తాము కూడా అడవిలో తిరుగాడిన భావన కలుగుతుంది.
నల్లమల అడవులని పిల్లలకి చూపించే క్రమంలో శాంతిస్వరూప్, చెన్నా పిలల్లకి ఎన్నో విషయాలు చెబుతారు. పశుపోషణ గురించి, అడవుల్లో చెట్లు ఏర్పరిచే క్యానోపీ గురించి చెప్పి, వాటి ప్రయోజనాలను వివరించి వాటిని రాసుకోమని చెప్తారు. ఆటోట్రాఫ్స్, హెటిరోట్రాఫ్స్, శాప్రోటాఫ్స్ గురించి, శిలీంద్రాల గురించి వివరిస్తారు. ప్రకృతిలోని ఫుడ్ చెయిన్ గురించి వివరిస్తారు. అటవీ భూములలో కర్మాగారాలు ఎందుకు నెలకొల్పకూడదో చెప్తారు. అడవులను ‘గ్రీన్ లంగ్స్’ అని ఎందుకంటారో వివరించి, కిరణజన్య సంయోగక్రియను వివరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద అడవులను ప్రస్తావిస్తారు. మనదేశంలోని వెస్ట్ బెంగాల్ లోని సుందర్‌బన్స్, గుజరాత్ లోని గిర్ అడవులు, మేఘాలయలోని సేక్రెడ్ గ్రోవ్, ఖాసీ హీల్స్, అరుణాచల్ ప్రదేశ్ లోని నందఫ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కర్నాటకలోని బందిపూర్ ఫారెస్ట్, తమిళనాడులోని నీలగిరి బయోస్ఫియర్ రిజర్వు, ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల ఫారెస్ట్ – వంటి అరణ్యాల గొప్పతనాన్ని వివరిస్తారు. అడవిని ‘డైనమిక్ లివింగ్ ఎంటిటీ’ అని ఎందుకంటారో అర్థమయ్యేలా చెప్తారు.
శాంతిస్వరూప్ రాత్రి పూట నిద్రపోయే ముందు సేపు ‘జిమ్ కార్బెట్’ వ్రాసిన ‘ది మ్యాన్ ఈటింగ్ లియోపర్డ్ ఆప్ రుద్రప్రయాగ్’ అన్న పుస్తకం చదువుకున్నారని రచయిత రాయడం సందర్భోచితం.
అటవీ అధికారి నుంచి క్రిందిస్థాయి సిబ్బంది వరకు వారి బాధ్యలను కథాక్రమాన్ని అనుసరించి క్లుప్తంగా చెప్తారు. అడవులలో తారసపడిన సుగాలీల జీవనాన్ని పిల్లలకి అర్థమయ్యేలా వివరిస్తారు. కథానుగుణంగా, శాంతిస్వరూప్ తన విధులను ఎంత నిజాయితీగా నిర్వహించారో చెప్తారు రచయిత. ఆయన హుందాతనం, పిల్లల పట్ల ఆపేక్ష; పిల్లల ఒద్దిక – పాఠకులను ఆకట్టుకుంటాయి.
ఈ రెండు రోజుల ట్రిప్‍లో వాళ్ళకి రాయలసీమ వంటకాలతో టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేసి – ఆ రుచులను పాఠకులకీ చవిచూపిస్తారు రచయిత.
మాటల సందర్భంలో చెన్నా ఓసారి ఖలీల్‍ని ఉద్దేశించి, “అదీ! అదీ! మోగోని మాట!” అని అంటే, నిఖిల తప్పుపడుతుంది. ఆడపిల్లలు దేనిలోనూ తక్కువ కాదంటుంది. అది కర్నూలు జిల్లాలో అనే మాట అని, ఆడామగా మధ్య తేడాలు చూపడం తన ఉద్దేశం కాదని అంటాడు చెన్నా. ఆ చిన్న వయసులో ఆ పాపకి అవగాహనకి ముచ్చటేస్తుంది.
ఈ నవలిక పిల్లల కోసం ఉద్దేశించినదే అయినా, పెద్దలనీ ఆసక్తిగా చదివిస్తుంది. పిల్లల ప్రయత్నాలకు చేయూతనివ్వాలనే తలంపుని పెద్దలలో కలిగిస్తుంది. తెలుసుకుందామనే కుతూహలంతో పిల్లలు చేసిన ఈ అటవీ ప్రయాణం హాయిగా సాగుతుంది. పర్యావరణ పరిరక్షణకై నడుం కట్టడానికి ప్రేరేపిస్తుంది. శ్రీ పాణ్యం దత్తశర్మ గారికి అభినందనలు.
***
అడవి తల్లి ఒడిలో (బాలల నవలిక)
రచన: పాణ్యం దత్తశర్మ
పేజీలు: 52
వెల: 50
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: 9550214912