అభినందనీయ ప్రయత్నం – ‘ప్రాచీన పట్టణాలు తూర్పు గోదావరి జిల్లా’

0
3

[శ్రీ బొల్లోజు బాబా రచించిన ‘ప్రాచీన పట్టణాలు తూర్పు గోదావరి జిల్లా’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]తె[/dropcap]లుగులో చరిత్ర గురించి చెప్పే పుస్తకాలు ఇటీవలి కాలంలో బహు తక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు చరిత్ర పరిశోధకులు, తమ పరిశోధనల ఫలితాలను  ప్రజలతో రచనల ద్వారా పంచుకునేవారు. పత్రికలు చరిత్ర సంబంధిత అంశాలకు చర్చావేదికలుగా ఉండేవి. చరిత్ర పరిశోధకులు, పండితులు తమ చర్చల ద్వారా అనేక అద్భుతమైన చారిత్రిక సత్యాలను ఆవిష్కరించేవారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి దాదాపుగా అదృశ్యమయిపోయింది. ఇప్పటికీ ఆంగ్ల పుస్తకాల అనువాదాలు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, పరబ్రహ్మశాస్త్రి, వకుళాభరణం రామకృష్ణ, నేలటూరి వెంకట రమణయ్య వంటి వారి రచనలు తప్ప కొత్తగా పరిశోధించి రాసిన పుస్తకాలు అరుదు. దాంతో పరిశోధకులు కాని వారు, ఆసక్తి కొద్దీ చరిత్ర పుస్తకాలు పఠించేవారూ, చరిత్ర గురించి రాయాల్సి వస్తోంది. జువాలజీ అధ్యాపకుడిగా పని చేస్తూ, కవిగా, రచయితగా గుర్తింపు పొందిన బొల్లోజు బాబా, ఆసక్తి కొద్దీ చరిత్రను పఠిస్తూ, తాను తెలుసుకున్న విషయాలు పదిమందికీ తెలియజేయాలన్న తపనతో, స్వయంగా చరిత్ర పరిశోధకుడు కాకున్నా, చరిత్ర గురించి రచిస్తున్న రచయిత. యానాం విమోచనోద్యమం (2007), మెకంజీ కైఫియత్తులు – తూర్పు గోదావరి జిల్లా (2020) వంటి చరిత్ర సంబంధిత పుస్తకాలు రచించిన బొల్లోజు బాబా సరికొత్తగా అందించిన చరిత్ర పుస్తకం ‘ప్రాచీన పట్టణాలు తూర్పు గోదావరి జిల్లా’.

బొల్లోజు బాబా మౌలికంగా చరిత్ర పరిశోధకుడు కాదు. చరిత్ర పట్ల ఆసక్తితో చరిత్రను అధ్యయనం చేస్తూ, తాను తెలుసుకున్న విషయాలను రచనల రూపంలో పదిమందికీ చేరువ చేస్తున్నారు. అందులో భాగమే ఈ ‘ప్రాచీన పట్టణాలు’ పుస్తకం. బొల్లోజు బాబా ప్రధానంగా  తూర్పు గోదావరి జిల్లాపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు కాబట్టి, ఈ పుస్తకం కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రాచీన పట్టణాలకు పరిమితం కావటంలో ఆశ్చర్యం లేదు. ఈ పుస్తకంలో మొత్తం 13 ప్రాచీన పట్టణాల పరిచయం ఉంది. పిఠాపురం, రాజమహేంద్రి, బిక్కవోలు, కోరంగి, కోరుకొండ, ఆదుర్రు, చాళుక్య భీమవరం, సర్పవరం, దాక్షారామం, బెండపూడి, పలివెల, తొలితిరుపతి, పెద్దాపురం వంటి పట్టణాల ప్రాచీనత్వాన్ని వివరిస్తూ, అలనాటి వైభవాన్ని, గడచిన చరిత్రను వివరించే ప్రయత్నం చేశారు రచయిత. అయితే ఆధునిక సమాజంలో చరిత్ర విషయానికి వచ్చేసరికి ప్రతి వ్యక్తికి ఓ ప్రత్యేక దృక్పథం, దృక్కోణం ఉండటంతో చరిత్ర రచనలో నిష్పాక్షికత (objectivity) కొరవడుతోంది. ఎవరికి వారు తమ సిద్ధాంతాన్నో, తమ ఆలోచననో సమర్థించుకునే రీతిలో చరిత్రను అందిస్తున్నారు తప్ప నిష్పాక్షికంగా నిజాన్ని అందించే ప్రయత్నం చేయటం లేదు. ఇందుకు భిన్నంగా ఈ పుస్తకంలో బొల్లోజు బాబా వీలయినంతగా తన వ్యక్తిగత దృక్కోణాన్ని పట్టణ చరిత్రను వివరించటంలో పక్కనపెట్టి, నిష్పాక్షికంగా వ్యవహరించే ప్రయత్నం చేశారనవచ్చు.

రచయిత ఈ పుస్తకం రచన కోసం ఎంతో పరిశోధించారని, ఎన్నెన్నో పుస్తకాల నుండి విషయ సేకరణ కోసం ఎంతో శ్రమ పడ్డారనీ తెలుస్తుంది. కానీ పుస్తకం ఆరంభంలో  ఒక పరిచయ అధ్యాయం చేర్చి ‘పట్టణం అంటే ఏమిటి?’, పట్టణానికీ , నగరానికీ తేడా ఏమిటి?  ‘ప్రాచీన కాలంలో పట్టణంగా గుర్తింపు పొందాలంటే ఎలాంటి లక్షణాలుండాలి?’, ‘పట్టణం అనేందుకు ప్రామాణికాలేమిటి?’ వంటి చరిత్ర పరిశోధకులు ఆమోదించిన ప్రామాణికాలను పొందుపరిచి పట్టణాన్ని నిర్వచించి ఉండాల్సింది. లేకపోతే  ఈ పుస్తకంలో ప్రాచీన పట్టణాలుగా రచయిత ప్రతిపాదించిన అనేక ప్రాంతాలను పట్టణాలుగా పరిగణించటం పట్ల అభ్యంతరాలు వ్యక్తపరిచే వీలుంది.

చరిత్ర పరిశోధకులు ఒక ప్రాంతాన్ని ప్రాచీన పట్టణంగా వర్గీకరించటంలో కొన్ని ప్రామాణికాలు ఏర్పరిచారు. ఒక ప్రాంతాన్ని పట్టణంగా గుర్తించేందుకు ఆ ప్రాంతానికి ఉండాల్సిన లక్షణాలను నిర్ధారించారు. చరిత్ర పరిశోధనల వల్ల లభించిన ఆధారాలు ఈ లక్షణాలను నిరూపిస్తేనే ఆ ప్రాంతాన్ని పట్టణంగా గుర్తించే వీలుంటుంది. పట్టణం అన్నది పల్లె కన్నా పెద్దది, నగరం కన్నా చిన్నది. ఒక ప్రాంతాన్ని పట్టణంగా గుర్తింఛాలంటే దానికి ఉండాల్సిన  లక్షణాలలో కొన్ని:

  1. ఆ ప్రాంతంలోని జనసంఖ్య
  2. కట్టడాల నైపుణ్యం, నిడివి
  3. కట్టడాలు, జనసంఖ్య పరిమాణం
  4. ఆ ప్రాంతంలోని ప్రాచీన మురుగు వ్యవస్థ
  5. అక్కడ ఏర్పడిన పాలనా వ్యవస్థ
  6. గోడలు, కోటలు వంటి కట్టడాల ఆనవాళ్లు
  7. ఆ ప్రాంతపు భౌగోళిక స్థితిగతులు
  8. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతం పట్టణంగా  పరిగణనకు గురైనట్టు ఆనవాళ్ళతో పాటు పై లక్షణాలు కొన్నయినా ఉండాలి

ఇవన్నీ లభిస్తేనే ఒక ప్రాంతాన్ని పట్టణంగా పరిగణించాల్సి ఉంటుంది. అంతే కాని కొన్ని మందిరాలు ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతం ప్రాచీన పట్టణం అని నిర్ధారించటం ఆమోదనీయం కాదు. చారిత్రికంగా ప్రముఖమైన ప్రతి ప్రదేశాన్ని పట్టణంగా భావించే వీలు లేదు.

‘పలివెల’ అన్న ప్రాంతం ‘ఉమామాహేశ్వర స్వామి’ ఆలయానికి ప్రసిద్ధి. అంతే తప్ప ఈ ప్రాంతంలో ప్రజలు పెద్దసంఖ్యలో నివసించినట్లుగానీ, పెద్ద కోటలున్నట్లు కానీ, ఎలాంటి ప్రాచీన కట్టడాలు కానీ,  నీటి పారుదల వ్యవస్థలు కానీ ఉన్న దాఖలాలు లేవు. ఇది బిక్కవోలుతో సహా ‘చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇతర పట్టణాలు’ విభాగంలో ఉన్న అన్ని ‘ప్రాచీన పట్టణాలు’గా పేర్కొన్న ప్రాంతాలకు వర్తిస్తుంది. బిక్కవోలులో కూడా వివిధ మందిరాలు ఉన్నాయి కాని ‘పట్టణం’గా పరిగణనకు గురయ్యే లక్షణాలు ఏవీ లేవు. ఈ విభాగంలో ‘బెండపూడి’లో కోట ఉంది. అది ‘కేంద్రం’ తప్ప, ప్రధాన పట్టణంగా పరిగణనకు రాదు. రచయిత పరిశోధన విషయంలో కాని, చారిత్రక అధ్యయనంలో కానీ, సేకరించిన విషయాలను ఆసక్తికరంగా అందించటం విషయంలో కాని ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు లేకున్నా; మౌలికంగా ‘పట్టణం’ నిర్వచనం లేకపోవటంతో ఆయా ప్రాంతాలకు, ఎంత ప్రాచీన చరిత్ర ఉన్నప్పటికీ పట్టణంగా ఎలా నిర్ధారించారన్న సందేహం కలుగుతుంది.

“Pithunda was another important port of Kalinga. The Jaina text Uttaradhyana Sutra mentions that being a famous centre during the time of Mahavir, merchants from Champa used to come to this place for trade. The Hatigumpha inscription mentions Pithunda as metropolis of Kalinga. This Pithunda is the same as Pitthundra in the Periplus and the Geography of Ptolemy. Sylvain Levi located Pithunda to south of Pallur near Chicacola and Kalingapatanam.” [Ports And Port Towns Of Early Odisha: Text, Archaeology And Identification, Benudhar Patra – Proceedings of the Indian History Congress vol 74].

రమేష్ చంద్ర మజుందార్, అనంత్ సదాశివ అల్టేకర్‍లు రచించిన The Vakataka-Gupta Age: circa 200-550 పుస్తకంలో “There was an old kingdom covering the present Bandar (Masulipatam) taluk of the Kistna District and the adjoining region with its capital at a city called Pithunda (Prithūda?) lying not very far from Masulipatam. According to the Hathigumpha inscription, king Khāravela of Kalinga, who may be assigned to the second half of the first century B.C., devastated the royal city of Pithunda. About the middle of the second century A.D. the Greek geographer Ptolemy mentions ‘the metropolis of Pitundra’ which is located in the Masulipatam area. There is hardly any doubt that the inscription of Kharavela and the Geography of Ptolemy refer to the same royal city. Towards the end of the third century A.D., a king named Jayavarman is known to have been ruling over the above region very probably with his capital at the city of Pithunda.” అని పేర్కొన్నారు.

అంటే చరిత్ర అంశాలను పరిశోధించిన చరిత్ర పరిశోధకులెవరి దృష్టిలో ‘పిథుండ్ర’ అంటే పిఠాపురం అన్న ఆలోచన కూడా లేదు. కానీ రచయిత పిథుండా పిఠాపురం కావటానికి కారణాలను చూపించి నిరూపించాలని ప్రయత్నించారు. చరిత్రను ఇతరుల పరిశోధనల ఆధారంగా విశ్లేశించేవారు ఏదైనా ప్రతిపాదన చేయాలంటే దానికి తిరుగులేని ఆధారాలు చూపించాలి. అయివుండవచ్చు, ఇలా జరిగివుంటుంది, అంటూ ఊహలు చేయటం అంతగా ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుతం సమాజంలో నెలకొని వున్న పరిస్థితుల్లో ఒక ఊహ తమకు లాభకరం అనిపిస్తే దాన్ని నిజంగా నిర్ధారించేసి, వాదించి, కాదన్నవాడిపై హింస నెరపే రోజులివి. కాబట్టి, చరిత్ర అధ్యయనపరులు ఎలాంటి ఊహల తీర్మానాలు చేయాలన్నా ఎంతో జాగరూకత వహించాల్సివుంటుంది.

పిఠాపురం విషయంలో, రచయిత ‘పిథుండ్ర’ను పిఠాపురం అని నిరూపించాలని ప్రయత్నించటం సమంజసం అనిపించదు. రచయిత ఆసక్తి కొలది చరిత్ర అధ్యయనం చేయటం అభినందనీయమే అయినా, ఆధారాలు ఇవ్వకుండా ఊహ ఆధారంగా చారిత్రక తీర్మానాలు చేయటం ఔచిత్యం అనిపించదు. ఊహ, వాదన, తర్కం ద్వారా చారిత్రిక సత్యాలను నిర్ధారించటం కూడని పని. చారిత్రికంగా సత్యాన్ని నిరూపించాలంటే , సాక్ష్యాలు కావాలి.

“When some non-historian writes about history and writes to establish a fact unreported by historians earlier, he needs to present solid irrefutable and incontrovertible evidence or his theory can be dismissed as a figment of imagination of a romantic. Historians should represent facts  as it actually happened.   [Leopals Von Ranke].

Walter Benjamin  “science can aim at certainty, history cannot, in theory at least, go beyond probability” అన్నాడు. కాబట్టి ఏ చరిత్ర పరిశోధకుడు కూడా పిఠాపురాన్ని పిథుండాగా పరిగణించనప్పుడు కేవలం ఖారవేలుడు కళింగ రాజ్యాన్ని జయించాడు కాబట్టి, పిథుండాని జయించటమనే ప్రసక్తి లేదు. కాబట్టి పిథుండా పిఠాపురం కావచ్చు అనటం beyond probability. ఎందుకంటే చరిత్ర పరిశోధకులు – ‘Located Pithunda to south of Pallur near Chicacola and Kalingapatanam’ లేక ‘Pithunda lying not very far from Masulipatam’ అని తీర్మానించారు కాబట్టి. పైగా ‘పిఠాపురం నేరుగా రేవు పట్టణం కాకపోయినా సముద్ర తీరానికి చేరువలో ఉండిన ప్రాచీన పట్టణం అయి ఉండవచ్చు’ అనటం కూడా ‘beyond probability’. ఎందుకంటే చరిత్ర పరిశోధకులు కానివారు, పరిశోధకులు అందించిన ఆధారాల పరిమితుల్లోనే తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ఇక పిఠాపురం చిన్న ఊరు అయితే, సముద్రగుప్తుడి ప్రశస్థి శాసనంలో చోటు దక్కేది కాదనటం కూడా చరిత్రలో లభిస్తున్న  ఆధారాలకు విరుద్ధం. జన సంచారం లేని కొండలు, గుట్టలు, గుహలలో శాసనాలు అశొకుడు  ఎందుకు వేయించాడన్నది ఈనాటికీ పరిశోధకులు తలలు బ్రద్దలు కొట్టుకుంటున్న విషయం. అశోకుడు శాసనాలు వేయించాడు కాబట్టి ఆయా ప్రాంతాలు పట్టణాలు అయివుండవచ్చు అనటం  beyond probability. రచయిత చివరలో తన ప్రతిపాదనకు స్పష్టత రావాలంతే శాస్త్రీయమైన పరిశోధనలు జరగాల్సివుంటుందనటం  ప్రశంసనీయం.

అయితే ఈ పుస్తకంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన పలు చారిత్రక సాహిత్యపరమైన అంశాలను రచయిత చక్కగా ప్రస్తావించారు. నిజానికి ఇలాంటి రచనల ఆవశ్యకత ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ఎంతో ఉంది. పలు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన పలితాలను, ఆవిష్కరిస్తున్న సత్యాలను సామాన్య పాఠకులకు చేరువ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ పుస్తకం ప్రాచీన చరిత్ర పట్ల ఆసక్తిని కలగజేస్తుందన్న విషయంలో సందేహం లేదు. ఇందుకు బొల్లోజు బాబా అభినందనీయులు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర సంబంధిత పుస్తకాలను ఆయన వెలువరించాలని విజ్ఞప్తి.

***

ప్రాచీన పట్టణాలు తూర్పు గోదావరి జిల్లా
రచన: బొల్లోజు బాబా
ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ
పేజీలు: 142
వెల: ₹ 150/-
ప్రతులకు:
పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ 098661 15655
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేందుకు:
https://logilitelugubooks.com/book/pracheena-pattanalu-thoorgodavari-zilla-bolloju-baba

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here