[శ్రీ ఆవుల వెంకటరమణ రచించిన ‘జల రాగం’ అనే కవితని అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]మ్మ కడుపులోంచి ఉమ్మనీటితో పుట్టి
తులసి నీళ్లతో ప్రాణం వదిలేదాకా
మనిషికి నీరే ప్రాణాధారం.
పచ్చదనం పరవల్లు తొక్కే ఉద్యాన వనాలుమొదలు
ఇంద్రధనస్సు వర్ణాలకు
క్రోటన్ కోటరీలకు సైతం నీరే ఆధారం.
విచక్షణారహిత వనహనన క్రీడతో పొడిబారిన
భూమాత నోటికి అమృత జలాల నందించాల్సిన
రుతువులు గతితప్పి
దుర్భర కరువు గజ్జల తల్లి కరాళ నాట్యం చేస్తున్న
ఒకానొక సంక్షుభిత ఘట్టాన
ఎల్ నినో.. లానినో పిడుగుపాట్లు..
ఈపర్యావరణ ఉత్పాతావిష్కరణలకు
కారణమెవ్వరు..?
ఆకాశపు రంగస్థలం నుంచి జారిన వానబిందువులు
సిందువు ఒడిలో చేరే లోపు ఒడిసిపట్టే చైతన్యమే
నేడు ఆవశ్యకం.
ప్రతి బిందువునొడిసి పట్టి పాతాళం పంపిద్దాం
జగమంతా సస్యశ్యామల విభవోద్భవ రంగాన్నలంకరిద్దాం రండి..
కదలిరండి.. కదలిరండి.