అమ్మ ఊరు

0
3

[శ్రీ ప్రమోద్ కుమార్ ఆవంచ గారి ‘అమ్మ ఊరు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]మ్మ..

మనస్పూర్తిగా అమ్మ నవ్వే నవ్వులో ఎంత నిర్మలత్వం ఉందో కదా.. తన మనసులా.

చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, నాన్నే జీవితంగా, నాన్న కుటుంబమే తన కుటుంబంగా, జీవితాన్ని సాగించింది..

నిజంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ తరుపు బంధువులను నేను చూసి ఎరగను. ఒక్క అమ్మ తమ్ముడు, చెల్లెలు తప్పించి ఇంకా ఎవ్వరూ మాకు తెలియదు. అమ్మ తోడబుట్టిన తమ్ముడు అంటే మాకు ఒకే ఒక మామయ్య ఆర్మీలో పనిచేస్తూ, ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేసేవారు. ఆయన పుణ్యమా అంటూ, నా చిన్నతనంలోనే ఔరంగాబాద్, బీహార్, జమ్ము, బెంగుళూరు వంటి ప్రదేశాలు చూసే అవకాశం లభించింది. ఇక అమ్మ చెల్లెలు వాళ్ళాయినది గొల్లపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా. చాలా కష్టాలను అనుభవించి, ఆ తరువాత హైదరాబాద్ షిఫ్ట్ అయి, తమ తుది రోజుల్లో మామయ్య ఆసరా చాలా ఉపయోగపడింది. నా చిన్నప్పుడు నెల్లుట్ల వెంకటేశ్వరరావు గారు తరుచుగా మా ఊరికి అంటే చర్లపల్లికి వచ్చేవారు. ఆయన అప్పట్లో నల్గొండ టౌనులోని రామగిరి లోని డీవిఎం స్కూలుకి కరస్పాండెంట్‍గా పనిచేసేవారు. ఆయన మా అమ్మ చిన్నాయన.

ఆయన సతీమణి దేవులపల్లి రామానుజరావు గారి సొంత చెల్లెలు. ఒక్క తాతయ్యను తప్ప అమ్మమ్మను ఎప్పుడూ చూడలేదు. ఆయన మా ఇంట్లో ఆరు బయట పండు వెన్నెల్లో మా నాన్నగారితో, జరిపే సాహిత్య సంభాషణ, మాకు అర్థం కాకపోయినా, మా అక్కయ్య మంజుల మాత్రం చెవులు రిక్కరించి వినేది. అదే ఆమెను గొప్ప కవయిత్రిగా, కథకురాలిగా, రచయితగా, సాహితీవేత్తగా మార్చింది.

ఇంతకూ మా అమ్మ ఊరు పేరు చెప్పలేదు కదా, కూనూరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలంలోనీ ఒక పల్లెటూరు. నెల్లుట్ల వెంకట రామారావు, యశోదమ్మ దంపతులకు మొదటి సంతానంగా అమ్మ  జన్మించింది. ఆ తరువాత చెల్లెలు అహల్యమ్మ. ఆమె భర్త కోదండరామారావు. తమ్ముడు జగతీరామ్, ఆయన భార్య విజయలక్ష్మి.

వెంకటరామారావు తాతయ్యకు ఒకే ఒక తమ్ముడు నెల్లుట్ల వెంకటేశ్వరరావు, ఒకే చెల్లెలు నర్సమ్మ. నెల్లుట్ల వెంకటేశ్వరరావు గారి సతీమణి అనసూయమ్మ. వారికి అయిదుగురు సంతానం. నవీన్ చంద్ర, ఇందుకీర్తి, ఈశ్వర్ చంద్ర, చంద్రకీర్తి, ఇందుశ్రీ.

అనసూయమ్మ దేవులపల్లి కుటుంబానికి చెందినది. వాళ్ళు దేవులపల్లి రామానుజరావు, కేశమ్మ, అనసూయమ్మ, విద్యాసాగర్ రావు, శ్యాంసుందరరావు, మదన్ మోహన్ రావు, ప్రభాకర్ రావు, లక్ష్మి. వీరిలో దేవులపల్లి రామానుజరావు గారు, గొప్ప సాహితీవేత్తగా, దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, జర్నలిస్టుగా, కాలమిస్ట్‌గా ప్రసిద్ధి చెందారు.

దేవులపల్లి విద్యాసాగర్ రావు గారు, మా నాన్న ఆవంచ సీతారామారావు గారు ఇద్దరు మంచి మిత్రులు. ఆ కారణంగానే మా అమ్మ ఇంటి పేరు నెల్లుట్ల నుంచి ఆవంచగా మారింది. విద్యాసాగర్ రావు గారే అమ్మానాన్నల పెళ్ళికి పెద్ద. నాన్న రెండు వేల పన్నెండు సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. అమ్మ గత సంవత్సరం నవంబర్‌లో కన్నుమూశారు.

ఆమెకు తన ఊరు మీద ఉన్న మమకారాన్ని, అనురాగాన్ని పదే పదే వ్యక్తపరుస్తుంటే, తను రాలేని స్థితిలో ఉన్నందున నేను స్టేషన్ ఘనపూర్ మండలంలోనీ కూనూరు గ్రామాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. పెద్ద ఊరు. రంగనాథస్వామి ఆలయాన్ని ఆనుకుని కొద్ది దూరంలో వకుళమ్మ‌‌‌ గారి ఇల్లు.

ఆమె మా అమ్మకు దూరపు బంధువు. ఆ ఇంటికి వెళ్ళి, దర్వాజాకు ఉన్న ఇనుప గొలుసు గొళ్ళాన్ని గట్టిగా కొట్టాను. ఎవరూ అంటూ తలుపు తెరిచి, బయటకు వచ్చారు వకుళమ్మ గారు. ఆమె ఎం.ఏ.ఇంగ్లీషు లిటరేచర్ చదివారు. పుస్తకాలు బాగా చదువుతారు. నన్ను నేను పరిచయం చేసుకుని, అమ్మ వాళ్ళ ఇల్లును చూపించమనీ అడిగాను. “అరే, నువ్వు ప్రమీలమ్మ కొడుకువా..” అంటూ, పక్క వీధిలో ఉన్న మా తాతయ్య ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళారు.

పాతబడిన గోడలు, పై కప్పు కూలిపోయి ఉంది. కూలిపోయిన గోడలు మాత్రమే ఉన్నాయి. ఇంకో విషయం నా కూనూరు ప్రయాణంలో నాతో పాటు సీనియర్ జర్నలిస్టు, పెద్ద పెండ్యాల గ్రామస్థులు నెల్లుట్ల రాధామనోహర్ రావు కూడా ఉన్నారు. ఆయన నా ఫోన్‌లో మా అమ్మ ఇంటిని, నన్నూ కలిపి వీడియో తీసారు.

అక్కడ కట్ చేస్తే.. హైదరాబాద్.. ఇంటికి వచ్చాను.

అమ్మకు నా ఫోన్ లోని వాళ్ళ ఇంటిని చూపించాను.

అమ్మ కళ్ళల్లో ఆనందం కన్నీరై మెరిసింది. తాను పుట్టిన ఊరు.. ఆ ఇంట్లో ఆమె తొలిచూరు బిడ్డ.. బిడ్డ లక్ష్మితో సమానం. అమ్మ ఆ ఇంట్లో వేసిన బుల్లి అడుగులు.. తన లేత పాదాలతో నడిచిన నేల.. నడక రాక కింద పడే సమయంలో ఆసరాగా చేతులతో పట్టుకున్న గోడలు లేత పాదాలతో నాన్నను గుండెల మీద తన్నిన దృశ్యం.. తండ్రి కళ్ళల్లో ఆనందం, అమ్మ గారాబం.. అన్నీ జ్ఞాపకం వచ్చి మా అమ్మ కళ్ళు చెమర్చాయి.

“సంతోషం రా కొడుకా..” అంటూ దగ్గరికి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here