[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
భైరవి
ఏమాయనే రమణుని నీ వెంతదూరినాను
నేమమున నీపైనేల నేర మెంచుకొనినే ॥ పల్లవి॥
వేడుక వెగ్గళమైతే విసువు గొంత గలుగు
వీడెములోనే కారము వెదకితేను
నీడలోనే వుండినాను నిందింపించుఁ జలువను
కూడినవా రొకవేళ గుంపించు టేమరుదు ॥ ఏమా॥
సరసమాడేయందే చలమూఁ గొంత గలుగు
విరులలోనే కాదా మరుబాణాలు
సురతము సేయఁగానే చొక్కి మేను మరపించు
సరినున్న దంపతులు జంకించు టేమరుదు ॥ ఏమా॥
కలిసిన కడువలపు గలుగు
వెలసితేఁ దురుమందే వేఁకము నుండు
యెలమి శ్రీ వేంకటేశుఁ డేలె నీ వొక్కటైతివి
వలచినవారు గొంతసొలయు టేమరుదు ॥ ఏమా॥ (183)
భావము: విముఖత చూపుతున్న నాయికతో చెలి ముచ్చటలాడుతోంది.
ఓ భామా! మీ యిద్దరి మధ్య ఏమి జరిగింది? నీవతనిని ఎంతగా దూషించినా అతడు నీ మీద నేరారోపణ చేస్తున్నాడు? అతడిచ్చిన తాంబూలంలో కారం వెదికితే ఎలా? సరదాపడటం అధికమైతే కొంత విసుగుపుడుతుంది. నీడలో వున్నా చల్లదనాన్ని నిందిస్తాడు. ఇద్దరూ కలిసినపుడు విజృంభించడం కొత్తగాదు. పూలతోనే గదా మన్మథుని బాణాలు వుండేది. సరసాలాడే సమయంలో కొంత పట్టుదల కూడా వుంటుంది. ఈడుజోడుగా వున్న దంపతులు ఒకరినొకరు బెదిరించడం అరుదా? రతిక్రీడ చేసి శరీరం అలసిపోయి మైమరపించేలా జేస్తాడు. ఇద్దరూ కౌగిలించుకొన్నపుడే అధికమైన ప్రేమ కలుగుతుంది. కొప్పులోనే ఉపద్రవం పొంచి వుంటుంది. ప్రేమించినవారు కొద్దిగా అలసిపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. శ్రీ వేంకటేశ్వరుడు నిన్ను ఏలుకొన్నాడు. ఇద్దరూ ఏకమయ్యారు గదా!
మాళవిగౌళ
వసుధలో నిటువంటివారూఁ గొందరు గలరు
కొసరక రమణుఁడు గుట్టుతో నోరుచునే ॥ పల్లవి॥
సిగ్గరికత్తెకుఁగాని చెక్కిటి చెయ్యమరదు
యెగ్గులాఁడిగాని మరి యీసునేరదు
బగ్గడికిఁగాని వట్టిపంతము లీడేరవు
వెగ్గళించ నీతలనే వేగెనటవే ॥ వసు॥
కతలకారికిఁగాని కాఁతాళము గలుగదు
మతకరిగాని మర్మము లంటదు
అతిగర్వికిఁగాని గయ్యాళితనము రాదు
గతిమాలి కొసర నీకడమాయనటవే ॥ వసు॥
మాయదారికిఁగాని మాటలు నోరికి రావు
కాయాటుదిగాని రతికాఁక కోర్వదు
యీయెడ శ్రీ వేంకటేశుఁ డిన్నిటా నన్నుఁ గూడె
చాయసేసుకొని నీవే జాణ వైతివటవే ॥ వసు॥ (184)
భావము: చెలి తన సఖి ప్రౌఢత్వాన్ని వివరిస్తోంది:
ఏమమ్మా! భూమి మీద నీవంటి వారు కొందరున్నారు. నీ ప్రియుడు కొసరక రహస్య మంతనాలకు ఓర్చుకొంటాడా? సిగ్గులాడికిగాని చెక్కిటిపై చేయి కుదరదు. నింద్యురాలికి గాని ఈర్ష్య కలగదు సుమా! పనికి మాలిన వనితకు దప్ప పంతాలు, పట్టింపులు శక్యం కాదు. వద్దనడం నీ తలమీదనే జరుగుతుందా? నీవలె కథలు చెప్పే నేర్పరికి తప్ప భయం కలగదు. మాయావి తప్ప మర్మస్థానాలు ముట్టుకోదు. మిక్కిలి గర్విష్ఠి తప్ప గయ్యాళితనం కుదరదు. గతిలేక నిన్నే కొసరడానికి నీకు వెలితి కలిగిందా? నీవంటి మాయలాడికి గాని నోటికి మాటలు రావు. పుష్టిగల శరీరం గలదానికి తప్ప రతిశ్రమలోని వేడి ఓర్చుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ ఆ శ్రీ వేంకటేశుడు ఇన్ని రకాలుగా నా పొందు కలిశాడు. దగ్గరగా చేరిన నీవు జాణవైనావటే! అని మరో వనిత ప్రశ్నిస్తోంది.
బౌళి
ఇన్నిటా దొరవు నీవు యేమిసేసినాఁ జెల్లు
యెన్ని చూచితే నే నీయిచ్చలోనిదానను ॥ పల్లవి॥
మంతనాన నీవు నాపె మాటలాడుకొన్న వెల్లా
వింతగా మాటుననుండి వింటిమి నేము
చెంత నామొగము చూచి సిగ్గువడ నింక సేల
అంతటా సంతోసము నీకైతేనే మంచిది ॥ ఇన్ని॥
సరసాన మీరిద్దరు సన్నలు సేసుకొన్నవి
గరిమతోఁ గన్నులారం గంటిమి నేము
శిరసెత్తి నీవందుకు చిఱునవ్వు నవ్వనేల
సరుస నీకవియెల్లా చవులైతే మంచిది ॥ ఇన్ని॥
సులభాన మీరింతలో చుట్టాలైనందుకు
కొలువులోఁ జూచి ఇయ్యకొంటిమి నేము
వెలయ శ్రీ వేంకటేశ వేఁడుకొన నింత యాల
యిలు నన్నుఁ గూడితివి యెట్టున్నా మంచిది ॥ ఇన్ని॥ (185)
భావము: శ్రీ వేంకటేశునితో కాంతామణి సరసాలాడుతోంది:
శ్రీవేంకటేశ! నీవు అన్ని రకాలుగాను మహారాజువు. దొరవు. ఏమి చేసినా నీకే చెల్లుతుంది. గణించి చూచితే నేను నీ ఇష్టులలో ఒకదానిని. ఏకాంతంలో నీవు, ఆమె సంభాషించుకొన్న మాటలన్నీ చాటుమాటున నుండి వింతలుగా మేమంతా విన్నాము. దగ్గరగా వున్న నాముఖం చూచి నీవు సిగ్గుపడ నవసరమేముంది? అన్ని రకాలుగా నీవు సంతోషంగా వుంటే మాకదే చాలు. సరససల్లాపాలాడుతూ మీరిద్దరూ చేసుకున్న సైగలు మేమందరం ఘనంగా కళ్లారా చూశాము. అందుకుగా నీవు మొగమెత్తి చిరునవ్వులు చిందించనవసరం లేదు. అవి అన్నీ నీకు రుచికరములైతే మంచిది. మీరు ఇద్దరూ ఇంతలోనే సులభంగా బంధువులైనందుకు కొలువుదీరిన మిమ్ములను చూచి మేము సంతోషించాము. నీవు ఇంతగా మమ్ములను వేడుకొన నవసరములేదు. ఇలా నన్ను కూడిన నీవు ఏవిధంగా ప్రవర్తించినా మంచిదే. నిందారోపణ చేస్తూ ప్రశంసాత్మకంగా మాట్లాడిన తీరు ఇది.
నాట
మేలురా నీకతలకు మెచ్చితి నేను
మేలములాడితి నీవు మెచ్చులాఁడివంటానే ॥ పల్లవి॥
వెన్నలేల తీసేపురా చిన్నవాఁడా నీ
చన్నులపై పయ్యదేల జారెనె నీకు
యెన్నిక నేమాటకు నీవేమాడేవు అవి
జన్నెపాలువట్టినమాచాడెలంటానే ॥ మేలు॥
పుట్టులేల యెక్కేవురా వుద్దండీఁడా చక్కఁ –
గట్టుకోవె పోఁకముడి కదలె నీకు
వొట్టుక నేనొకటంటే నొకటాడేవు అది
తొట్టి రతులసిగ్గులదొడ్డియంటానే ॥ మేలు॥
చేరి యిల్లు చొచ్చేవేరా శ్రీ వేంకటేశ నీవు
తారసిల్లి వొంటినే వుందానవంటానె
కోరి నన్నుఁ గాఁగిలించి కొత్తలుగా నాడేవు
దూరనేలె గొల్లవారిదోమటంటానే ॥ మేలు ॥ (186)
భావము: “శ్రీకృష్ణుడు పరబ్రహ్మమే అయినను, తాను స్వీకరించిన మానవత్వము, గొల్లకులము దోమటి, చిన్న వయసు చిలిపితనము ఈ కీర్తనలో ప్రతిఫలించాయి” అని గౌరి పెద్దిరామశర్మగారభిప్రాయపడిరి.
ప్రియురాలు: నీ కథలకు నేను మెచ్చాను. మేలులేరా!
నాయకుడు: నీవు సరసాలాడుతున్నావు. నీవు గొప్పమెప్పులు పొందిన స్త్రీవి.
ప్రియురాలు: ఓ చిన్నవాడా! నీవు వెన్నలెందుకు దొంగిలించావు?
నాయకుడు: నీకు చనులమీద నుండి పైట జారిన దెందుకే?
ప్రియురాలు: లెక్క కట్టి నీవు మాటకు మాట ఎదురు చెపుతున్నావే.
నాయకుడు: అవి నాకోసం మీదుకట్టిన మాకుండలంటానే!
ప్రియురాలు: ఓ సాహసీ! ఉట్లు ఎందుకెక్కావురా?
నాయకుడు: ఓసీ! నీ పోకముడి వదలిపోయింది, సరిగా కట్టుకో!
ప్రియురాలు: ఒట్టు పెట్టుకొని నేనొకటంటే, నీవు మరొకటి అంటున్నావు.
నాయకుడు: పరిపూర్ణమైన రతులవలన కలిగిన సిగ్గులదొడ్డి యంటాను.
ప్రియురాలు: ఓ స్వామీ! నీవు ఇంట్లోకి ప్రవేశించావేల?
వెంకటేశ కృష్ణుడు: నాకు ఎదురుపడి వొంటరిగా వున్నదానవంటాను.
ప్రియురాలు: నీవే కోరి వచ్చి నన్ను కౌగిలించి, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావే? నాయకుడు: నన్ను నిందించనేల? ఇది గొల్లవాని కంబళిలో అన్నం వంటిదే.
రామక్రియ
కన్నెగొల్లపడుచులఁ గాకుసేతురా ఇంత
మిన్నకే వయసులెల్లా మీఁగడలు గట్టెను ॥ పల్లవి॥
వుమ్మడివలపులు నీవువిదల పైఁ జల్లఁగ
పమ్ముచుఁ గుచములై కుప్పలుగట్టెను
తెమ్మలుగా సారెఁ దరితీపుల మాటలాడఁగ
దిమ్మురేఁగి మోవులను తేనె లూరఁ జొచ్చెను ॥ కన్నె॥
అప్పటి దాఁగిలి ముచ్చటలాడి సతులనంటఁగా
కొప్పులై చీఁకట్లు గుంపుగూడెను
తప్పక నఖచంద్రులు తనువులపై నించఁగా
విప్పుచు చిరునవ్వుల వెన్నెలలుగాసెను ॥ కన్నె॥
కారుకమ్మినరతులఁ గరఁగించి కూడఁగాను
యేరులై చెమటలు యీఁతలఁ బారె
యీరీతి శ్రీ వేంకటేశ ఇంతచనవియ్యగాను
కోరినకోరికలెల్లా గొబ్బున నీడేరెను ॥ కన్నె॥ (187)
భావము: రతి పారవశ్యాన్ని వర్ణిస్తోంది నాయిక.
శ్రీ వేంకటేశ! ఈవిధంగా కన్నెలైన గొల్లభామలను హింసించడం భావ్యమా! వారు కేవలం నీ కోసమే తమ యౌవనాన్ని మీదుగట్టారు. నీవు ఈ కాంతలపై యౌవనపు ప్రేమలు చల్లగా అవి విస్తరించి చనోదోయిగా కుప్పలు గట్టాయి. మాటిమాటికి తియ్యగా వయ్యారపు మాటలు మాటలాడగా దిమ్మరేగి పెదవులపై తేనెలూరసాగాయి. నీవు రహస్యంగా ముచ్చటలాడుతూ సతులను ముట్టుకోగా అవి వృద్ధిపొంది తలకొప్పుల చీకట్లుగా మారాయి. నీవు వారి శరీరాలపై గోళ్లతో చంద్రులను నింపగా విరిసిన చిరునవ్వుల వెన్నెలలు కాచాయి. గాఢమైన రతులలో మరపించి సుఖించగా ఇటువైపు చెమటలు ఏరులై పారాయి. స్వామీ! ఈ విధంగా నీవు చనవు ప్రదర్శించగా కోరిన కోర్కెలన్నీ సమకూరాయి.
వరాళి
చెప్పనరుదాయఁగదె చెలిసింగారము నేఁడు
వొప్పగుమరుబండారు మొనగూర్చినట్లు ॥ పల్లవి॥
తొడిఁబడ సేమంతులు దురిమెఁ గొప్పునఁ జెలి
కడుఁజీఁకటీ వెన్నెలాఁ గలసినట్లు
గుడిగొన నొసలఁ గుంకుమతిలకమువెట్టె
యెడయక సూర్యచంద్రు లేకతమాడినట్టు ॥ చెప్ప॥
నెమ్మదిఁ జన్నులమీఁద నీలహారముల్ వేసె
తుమ్మిదలు జక్కవలు దొరలినట్టు
వుమ్మడి నడుమఁ బైఁడివొడ్డాణము గట్టుకొనె
నెమ్మది మెరుపు(పు?) మిన్ను నేస్తముసేసినట్టు ॥ చెప్ప॥
అంచితపుఁజేకట్లు హస్తములు ధరియించె
యెంచఁ జిగుళ్లుఁదామర లెనసినట్టు
పొంచి శ్రీ వేంకటేశుతోఁ బొసంగె సమరతుల-
నంచల బొమ్మపెండ్లి యమరినయట్టు ॥ చెప్ప॥ (188)
భావము: స్త్రీల అవయవాలను వర్ణించే కవిసమయాలతో కీర్తనను సమకూర్చాడు అన్నమయ్య.
ఓ చెలీ! అందమైన మన్మథుని బొక్కసంవలె ఈ చెలి శృంగారము ఈనాడు చెప్పనలవిగాని రీతిలో ఆశ్చర్యకరంగా వుంది. మిక్కిలి గాఢమైన చీకటి, వెన్నెల రెండూ కలబోసినట్లు చెలి తన కొప్పున చేమంతులు తురిమింది. సూర్యచంద్రులు వదలకుండా ఒకచోట చేరినట్లు నొసట (చంద్రవంక) కుంకుమరేఖ (సూర్యబింబం) కలిసిపోయాయి. తుమ్మెదలు, జక్కవలు దొర్లినట్లుగా చనుదోయిపైన నీలమణి హారాలు ధరించింది. ఆకాశము, మెరుపు స్నేహం చేసినట్లు సన్నని నడుముపై బంగారపు వొడ్డాణము ధరించింది. లేతచిగుళ్లు, తామరలు ప్రకాశించినట్లు అందమైన చేతి ఆభరణాలు చేతికి ధరించింది. వరుసగా బొమ్మల పెండ్లి సమకూరినట్లు శ్రీ వేంకటేశునితో కాంతకు సమరతులు సమకూరాయి.
హిజ్జిజి
మఱచి వూరకుండితే మనసే కఱకుపడు
యెఱుకఁ దలపెట్టితే నీడేరుఁ బనులు ॥ పల్లవి॥
మొగములు చూడఁగాను మోహములు గడుఁబుట్టు
నగఁగానే పాయరానిననుపు లౌను
తగిలి మాటలాడఁగా తమకము లుప్పతిల్లు
బగివాయ కెప్పుడూఁ బతివద్ద నుండవే ॥ మఱ॥
చేరి జూజాలాడఁగానే చిమ్మిరేఁగు వేడుకలు
సారె సన్నలుసేయఁగ చవులు పుట్టు
నేరుపుతోఁ జెనకఁగా నిండుకొను మచ్చికలు
వూరకే యాతనివద్ద నూడిగాలు సేయవే ॥ మఱ॥
కందువఁ బాదాలొత్తంగా కాంగిళ్లు సమకూడు
అంది విడెమియ్యఁగానే ఆసలు మించు
చెందె నిన్ను నింతలోనే శ్రీ వేంకటేశ్వరుఁడు
ముందుగా నింపులతోడ మోవితేనె లియ్యవే ॥ మఱ॥ (189)
భావము: ముగ్ధ అయిన చెలికి ప్రణయ సూక్ష్మాలు చెబుతోంది.
సఖి! ఓ చెలీ! నీవు అమాయకంగా వూరకుండిపోతే మనసు గట్టిపడిపోతుంది. సఖ్యాన్ని మొదలెడితేనే పనులు సమకూరుతాయి. ముఖాముఖీ చూచుకొంటేనే మోహాలు అధికమవుతాయి. నీవు నవ్వగానే విడదీయరాని ప్రేమలు పుడతాయి. దగ్గరగా చేరి మాట్లాడగా మోహం పెరుగుతుంది. పతికి దూరంగా నిలువక సమీపంలోనే వుండవే. దగ్గరగా చేరి జూదాలు మొదలెడితే సరదాలు గుమిగూడుతాయి. మాటిమాటికీ సైగలు చేయగా రుచులు కలుగుతాయి. నేర్పుగా ఎదిరిస్తే మచ్చికలు పెరుగుతాయి. నీవు వూరకనే అతని వద్ద సేవలు చేయవే. ఏకాంతంలో అతని పాదాలొత్తగా కౌగిళ్లు సమకూరుతాయి. అందుకొని తాంబూలం అందించగానే ఆశలు పెరిగిపోతాయి. ఇంతలోనే శ్రీ వేంకటేశుడు నిన్ను కూడాడు. నీవే ముందుగా ప్రేమతో పెదవితేనెలు అందియ్యవే – అని వలపించుకొనే సూత్రాలు చెబుతోంది.
మేఁచబౌళి
నన్ను నేల దూరేవు నడుమ నీవు
యెన్ని లేవు నీవేసాలు యెంతసేసేవే ॥ పల్లవి॥
చలపట్టి నీవతని సాధించి నేరుపుతో
వలపించుకోఁగాను వద్దంటినా
మొలక నవ్వులు నవ్వి ముందె యాతనిచిత్త-
మలర వలపించఁగా నడ్డము వచ్చితినా ॥ నన్ను॥
గొంటరితనాన నీవు కొంగుపట్టుకొని పతి –
నింటికి రప్పించుకోఁగా నేలంటినా
జంపునీచన్నులనొత్తి సమరతులకుఁ దీసి
అంటి దక్కఁగొనఁగా నేనందుకుఁ గాదంటినా ॥ నన్ను॥
ఇరగ నప్పటి నీయెంగిలిమోవి చూపి
మరపుకోగాఁ బెట్టిమాటాడితినా
గరిమ నింతలో శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ గూడె
వొరసి నీవూఁ గూడఁగా నొడిపట్టితినా ॥ నన్ను ॥ (190)
భావము: ఇద్దరు పత్నుల రమణుని కూరిమికి అలవాటుపడిన వనిత మరొక స్త్రీతో ఎకసెక్కములాడుతోంది.
ఏమమ్మా! మధ్యలో నన్ను నీవు నిందించనేల? నీ వేషాలు ఎన్నిలేవు – నీవు ఎంతటి దానవే! నీవతనిని నేర్పుగా సాధించి ప్రేమించేలా చేసుకొంటే నేను వద్దన్నానా? నీవు చిరునవ్వులు చిందించి నాకంటే ముందుగా అతని మనసు దోచుకొంటే నేనేమైనా అడ్డుపడ్డానా? దిట్టతనంతో నీవు పతి కొంగు పట్టుకొని నీ యింటికి రప్పించుకోగా నేను ఎందుకని ప్రశ్నించానా? గాఢమైన నీ చనుదోయితో అతనిని వొత్తి సమరతులకు లొంగదీసి పెనవేసుకోగా నేను కాదన్నానా? అందంగా అప్పటి నీ ఎంగిలి పెదవిని చూపి మరులుకొనగా నేను వాదులాడానా? ఇంతలోనే నేర్పుగా శ్రీ వేంకటేశుడు నాతో క్రీడించాడు. నీవు కలిసిరాగా నేను ఎదిరించానా? సపత్నీ మాత్సర్యాన్ని ఎక్కడా కనిపించని రీతిలో నాయిక మాట్లాడటం విశేషం.
నారాయణి
ఇంతులకుఁ బతులకు నివే తారుకాణలు
నింతలేక మెలఁగేటివేడుకలే మేలు ॥ పల్లవి॥
పెక్కుమాట లాడితేను ప్రియములు చప్పనౌను
కక్కసించితే వలపు గడుసుపడు
వెక్కసానఁ జెనకితే విరుగు నట్టె మనసు
యెక్కువతక్కువలేనియిచ్చకమే మేలు ॥ ఇంతు॥
వట్టిపంతా లాడితేను వడిఁబడుఁ జలములు
పెట్టగాఁగ నవ్వితేను వేసటలౌను
బెట్టుగాఁ గొసరితేను బెండుపడుఁ దమకము
గుట్టుతోడఁ బొందుసేసేగుణమే మేలు ॥ ఇంతు॥
కడువెంగే లాడితేను కాంతాళము లెసఁగు
యెడయనిసిగ్గులైతే నింపు పుట్టడు
అడరి శ్రీ వేంకటేశుఁ డాదరించి నిన్ను నేలె
విడువకు చెలి నీకు వినయమే మేలు ॥ ఇంతు॥ (191)
భావము: ముగ్ధయైన నాయికకు సూచనలందిస్తోంది చెలి.
చెలీ! సతులకు, పతులకు వింత లేకుండా తిరిగే వేడుకలే మేలని ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. ఎక్కువ మాటలు పలికితే ప్రేమలు చప్పబడతాయి. నొప్పిస్తే ప్రేమ గడుసుపడుతుంది. వెక్కసం కలిగేలా నొక్కితే మనసు విరిగిపోతుంది. ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ – అనే భేదం లేని ప్రేమయే మేలు. అదేపనిగా పట్టింపులకు వెళితే పట్టుదలలు పెరిగి పోతాయి. అధికంగా నవ్వితే శ్రమలు అధికమవుతాయి. బెట్టుగా కొసరితే మోహం బలహీనపడుతుంది. రహస్యంగా క్రీడించే గుణమే మేలు. మిక్కిలి వ్యంగ్యంగా మాట్లాడితే కోపాలు పెరుగుతాయి. వదలని సిగ్గులు కలిగితే ప్రేమ పుట్టదు. ఓ చెలీ! శ్రీవేంకటేశుడు నిన్ను ఆదరించి ఏలుకున్నాడు. ఆయనను వదలబోకు! నీకు అన్ని రకాలుగా వినయమే మేలు. అని హెచ్చరిస్తోంది చెలి.
ఆహిరి
పాసివున్న విరహపుబడలికేల చూచేవు
వేసరక ఇచ్చకమే వేమారుఁ జేయవే ॥ పల్లవి॥
చెక్కు నొక్కి బుజ్జగించి చెలువుఁడు వేఁడుకొనీ
మొక్కవే పాదాలు మొగమెత్తి
అక్కరతో నవ్వుమని ఆనవెట్టీఁ దనమీఁద
మక్కళించి యతనితో మాటలాడవే ॥ పాసి॥
కొంచక తొడపై నిన్నుఁ గూచుండఁబెట్టుకొనీ
ముంచి వినయానఁ బ్రియములు చెప్పవే
పొంచి తములమెల్లా నీపుక్కిటనిండాఁ బెట్టీ
వంచనలెల్లాఁ జేసి వలపులు చల్లవే ॥ పాసి॥
సారె శ్రీ వేంకటేశుఁడు చన్నులపైఁ జేయిచాఁచీ
గారవించి మోవితేనె కప్పమియ్యవే
యీరీతి నిన్నుఁ గూడి యితవులెల్లాఁ జేసీ
వూరడించి రతులను వోలలాడఁజేయవే ॥ ఇంతు॥ (192)
భావము: ప్రియుని వేడికోలును మన్నించమని చెలి హితవు పలికింది:
ఓ చెలీ! నిన్ను నీ ప్రియుడు ఎడబాసిన విరహముతోకూడిన బడలికలను ఏల చూపెదవు? బాధపడక మాటిమాటికీ ప్రీతిని కనబరచవే. నీ ప్రియుడు నీ బుగ్గలు నొక్కి బుజ్జగిస్తూ వేడుకొనగా నీవు ముఖాన్ని పైకెత్తి పాదాలకు మొక్కవే. వెంటనే నవ్వవలసిందిగా నీ ప్రియుడు వొట్టు పెట్టుకొంటున్నాడు. ప్రేమను పెంపొందిస్తూ అతనితో మాట్లాడవే. ఏ విధమైన బెరుకు లేకుండా నిన్ను తన తొడపై కూర్చుండబెట్టుకొన్నాడు గదా వినయంతో నిండిన ప్రీతికరమైన మాటలు చెప్పవే. సమయానికై వేచి చూస్తూ తాంబూలాన్ని నీ పుక్కిటినిండా కూరాడు గదా! రకరకాల మాయలు చేసి నీవు వలపులు వెదజెల్లవే. నీ విభుడైన శ్రీ వేంకటేశుడు మాటిమాటికీ నీ చన్నులపై చేయి చాచాడు గదా నీవు గౌరవంగా నీ పెదవులపై తేనెను ఆతనికి కప్పంగా చెల్లించవే. ఈ విధంగా నిన్ను కలిసి నీకు అనేక విధాల హితవులు చేస్తున్నాడుగదా! అతనిని ఓదార్చి రతిక్రీడలలో మునిగి తేలే విధంగా చేయవే అని హితవు పలికింది.
(ఇంకా ఉంది)