జ్ఞాపకాల పందిరి-180

18
3

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

లైఫ్ సర్టిఫికెట్..!!

[dropcap]మ[/dropcap]నిషి సజీవంగా వున్నా, బ్రతికివున్నట్టు కొన్ని సందర్భాలలో నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికి అనేక మార్గాలు. భౌతికంగా మనిషి కంటికి కనిపిస్తున్నా, అధికారికంగా నిరూపించుకోవాల్సిన సందర్భాలు కొన్ని మనకు జీవితంలో ఎదురవుతాయి. మనిషి ఆరోగ్యంగా వుండి, జీవించే వున్నాడని, ప్రభుత్వ వైద్యుడు నిర్ధారణ ధ్రువపత్రం ఇవ్వాలి. దాని కోసం ఆయన చుట్టూ తిరగాలి. ఆయన కరుణించినప్పుడు ఆ పత్రం తీసుకోవాలి. ఉచితంగా పొందాలంటే తొంబై తొమ్మిది ప్రశ్నలు ఎదుర్కోవాలి. సమర్పణలు జరిగితే ధ్రువపత్రం క్షణాల్లో వెలుగు చూస్తుంది. అలా అని అందరూ అలా వున్నారని చెప్పలేము. ఒక బాధ్యతగల ప్రభుత్వ దంతవైద్యుడిగా నేను గమనించిన విషయం ఇది.

అదృష్టావశాత్తు, దంతవైద్యుడు, లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అర్హుడు కాదు. ఇకపోతే, ఉద్యోగ విరమణ జరిగిన తర్వాత, ఉద్యోగపర్వంలోని చివరి భాగం ‘పెన్షనర్’ పాత్రతో ప్రారంభం అవుతుంది. పదవీ విరమణ చేసిన ప్రతి ఉద్యోగి, ప్రతి నెల పెన్షన్ పొందాలంటే, సంవత్సరానికోసారి తప్పని సరిగా తాను బ్రతికి ఉన్నట్టు, ఋజువు పత్రం పత్రం సమర్పించాలి. మొదట్లో ఇది తప్పనిసరిగా బౌతికంగా సంబంధిత కార్యాలయంలో హాజరై, ప్రభుత్వ వైద్యుడు ధ్రువీకరించిన ఋజువు పత్రం సమర్పించవలసి ఉంటుంది. అది కొన్నాళ్ళు కొనసాగింది. తర్వాత ‘సెల్ఫ్ డిక్లేరేషన్’ పద్ధతి (స్వయంగా -బ్రతికి ఉన్నట్లు హామీ పత్రం ఇవ్వడం) కొనసాగింది. తర్వాత ఈ పద్ధతిని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. అసలు వ్యక్తిగతంగా కార్యాలయంలో హాజరు కానక్కర లేకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, ఇంటి నుండే ధ్రువపత్రం సమర్పించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇది సర్వహంగులు వున్న మొబైల్ ఫోన్ ఆవిష్కరణతో సుసాధ్యమయింది.

అయితే ఇది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోలేని సామాన్యులకు కాస్త ఇబ్బందిగానే మారింది. అలాంటి వారికి, ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రభుత్వం కలుగజేసింది. అయితే ఈ రోజున ఎక్కువ శాతం ప్రజలు మొబైల్ ఫోన్ వినియోగిస్తుండడం మూలాన వారికి కనీస సాంకేతిక పరిజ్ఞానం ఉండడం వల్ల లైఫ్ సరిఫికేట్ సమర్పించడం సులభతరమైంది. స్వయంగా ఎక్కువమంది ఈ పద్ధతిని వినియోగించుకుంటున్నారు.

తర్వాత పుట్టిన రోజుల గురించి కొంచెం చెప్పాలి. అదేంటి, ఈ లైఫ్ సర్టిఫికెట్‌కు సంబంధం ఏమిటని, చాలామందికి ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న మనసులో ఉదయించవచ్చు. దానికి సరైన సమాధానం ఈ వ్యాసం చివరికంటూ చదివిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కాస్త సంయమనం పాటించండి మరి!

మా చిన్నప్పుడు, పుట్టిన రోజుకు ఈ రోజుల్లో ఉన్నంత హడావిడి ఉండేది కాదు. మహా అయితే కొత్త బట్టలు, తినడానికి పాయసం వగైరా. హంగులూ, హంగామాలు పట్టణాలకు మాత్రమే పరిమితం అయి ఉండేవి. ఇప్పుడు గ్రామాలలో సైతం వారి వారి స్థాయిని బట్టి, పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఘనంగా పుట్టిన రోజు పండుగలు జరుపుకోవడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు ఆర్భాటాలు అనుకరించడం మొదలు పెట్టారు. దీనికి తోడు గిఫ్టులు, రిటర్న్ గిఫ్టుల సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో అంటువ్యాధిలా వ్యాపించింది.

నా మట్టుకు నాకు పెళ్ళై, నా శ్రీమతి నా జీవితంలోకి ప్రవేశించేవరకూ నా పుట్టినరోజుకు పెద్దగా ప్రాధాన్యత లేదు. తర్వాత, ప్రతి పుట్టినరోజుకు కొత్తబట్టలు, కేక్ కటింగులు, ప్రత్యేక భోజనాలూ తప్పనిసరి అయినాయి. నాకు ఇష్టం లేకపోయినా ఇంటి వాళ్ళ కోసం తలవంచక తప్పడం లేదు.

ఇక నా మనుమల స్థాయి వచ్చేసరికి సంబరాల స్థాయి పెరిగిపోయింది. నెలవారీ పుట్టినరోజులు కూడా మొదలు అయ్యాయి. ‘నలుగురితో నారాయణ’ అన్న పద్ధతిగా మారిపోయింది.

అయితే కరోనా కాలంలో నాలుగు గోడల మధ్య బంధింపబడిన అనుభవాల నేపథ్యంలో, ఏదో ఒక రూపంలో మనకు ఆత్మీయ కలయికలు అవసరం ఏమో అనిపిస్తున్నది. సందర్భం లేకుండా నలుగురూ ఒకచోట కలిసే అవకాశం లేదు కదా! ప్రస్తుత శుభకార్యాలన్నింటిని అలా సమర్ధించుకోక తప్పడం లేదు.

ఈ మధ్య (సెప్టెంబర్ 12, 2023) నా శ్రీమతి పుట్టిన రోజు, సికింద్రాబాద్ (సఫిల్ గూడ) లోని, నా కూతురు ఇంట్లో జరుపుకోవడం జరిగింది. హన్మకొండలో వుంటే మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఇక్కడ, కూతురు, అల్లుడు, మనుమరాలు, మనుమడు ఉండడం వల్ల మాకు చాలా సంతోషంగానే గడిచింది. మేము ఒంటరిగా లేము అన్న భరోసా ఏర్పడింది.

శ్రీమతి అరుణ పుట్టినరోజు సంబరం
రచయిత లైఫ్ సర్టిఫికెట్

ఎట్లాగూ అబ్బాయి అమెరికాలో (బోస్టన్) మాకు దూరంగా ఉంటున్నాడు. కనీసం కూతురి సంరక్షణలో గడపగలుగుతున్నామన్న తృప్తి మిగులుతున్నది. నా శ్రీమతి పుట్టినరోజు హడావుడి ముగిసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, ఈ వయస్సులో పుట్టిన రోజు పండుగ తప్పనిసరిగా జరుపుకోవాలి. మన కోసం కాకపోయినా, మన రక్త సంబంధీకుల కోసం, బంధు మిత్రుల కోసం. ప్రతి సంవత్సరం వీళ్ళందరికీ మన లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినట్లుగా ఉండాలి. మేము ఇంకా బ్రతికే వున్నాం అని చెప్పినట్టు ఉండాలి, అందుకే పుట్టినరోజు పండుగ తప్పక జరుపుకోవాలి!

కూతురు, మనుమలతో శ్రీమతి అరుణ

ఇది లైఫ్ సర్టిఫికెట్‌తో సమానమే కదా! అది అధికారుల కోసం, ఇది మన ఆత్మీయుల కోసం. ప్రస్తుతం వయసు మళ్లినవారి పుట్టినరోజుకు, లైఫ్ సర్టిఫికెట్‌కు వున్న సంబంధం ఇదే..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here