కలవల కబుర్లు-36

0
12

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]పి[/dropcap]దప కాలం పిదప బుద్ధులూ! అని ఓ పక్కన వాపోతూనే వుంటున్నాము. పాత కాలాన్ని వదులుకోలేక, ప్రస్తుత కాలంతో పరుగులు తీయలేక సతమతమయే జీవుల కబుర్లు ఇవి.

కొత్త నీరొచ్చి పాత నీరు కొట్టుకుపోతుంది. అది సర్వ సాధారణం. అందరికీ తెలిసినదే.. కానీ, అటుపాత అలవాట్లు వదులుకోలేక పోతాము. ఇటు కొత్త అలవాట్లకి అలవాటు పడక తప్పడం లేదు. ఒకోసారి ఒకరకమైన త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నామేమో అనిపిస్తుంది. ఆనాటి పాత, ఈనాటి కొత్త తరాలకి ప్రతినిధులుగా మారిపోయిన మధ్యతరం వాళ్లం మనం.

కానీ.. ఈనాటి పద్దతులు, వ్యవహారాలు, అలవాట్లని అప్పటితో పోల్చుకుంటే.. బోలెడు సదుపాయాలు సమకూరాయి. అన్నీ అనువుగానే మారాయి. అంతా బావుందనే అనిపిస్తోంది కానీ.. ఏదో మూల అసంతృప్తి. ఓ పక్క ఇప్పటి లగ్జరీలని హాయిగా అనుభవిస్తూనే.. అప్పటి ఇష్టమైన ఇబ్బందులే బావున్నాయని అంటూండడం పరిపాటైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏసీలు లేకుండా వుండలేమని తెలుసు కానీ.. అప్పటి ఆరు బయట డాబాల మీద, కొబ్బరాకుల వెన్నెల నీడలో పడుకుని ఆకాశంలో చుక్కలని లెక్కపెట్టిన రోజులే బావుంటాయంటాం. నిజంగా కూడా అంతేగా!

ఆనాటి మడులు, తడులు, ఆచారాలు.. ఇంచుమించుగా కనుమరుగైపోతున్నాయి. బిపీలూ, సుగర్లూ ముందుకు తోసుకువచ్చేసి, ఆ ఉపవాసాలూ, గట్రాలని వెనక్కి తోసేస్తున్నాయి. శుచి, శుభ్రతలు, హైజీనిక్ లతో కార్తీకాలలోనూ, గ్రహణాలలోనూ సముద్ర స్నానాలు, నదీ స్నానాలు అబ్బే.. వద్దు వద్దంటున్నాము.

నెయ్యి గిన్నె, పెరుగు గిన్నె అసింటా ఉండేవి.. అంటు చేత్తో అవి ముట్టుకోకూడదు. అన్నం, కూర వడ్డించుకున్నాక ఓ నీటిబొట్టుతో వేలు ముంచితే సరిపోయేది..

ఇప్పుడు ఏ చేత్తో ఏది ఎలా వడ్డించుకున్నా పట్టించుకునేవారే ఉండడం లేదు. వరుసగా కూర్చుని తినే బంతి భోజనాలు, ‘భోజనకాలే హరి నామ స్మరణలు’ మాయమైపోతున్నాయి.

ఎంగిలి కంచాలు తీసి పెరట్లో బావి దగ్గరో.. నీటి గోలెం దగ్గరో.. పడేసాక తిన్నచోట కిందపడ్డ మెతుకులు అన్ని ఎత్తడం.. నీళ్లు చల్లి చేత్తో శుభ్రం చేయడం ఉండేది. ఆ తర్వాతే మరో బేచ్‌కి వడ్డించడం జరిగేది.

మరి ఇప్పుడు డైనింగ్ టేబుల్ భోజనాలకి ఈ తంతులు పెద్దగా ఉండక్కర్లేదు..

అన్నం వండుకున్న స్టౌ కాఫీలకి పనికివచ్చేది కాదు.. శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి.. లేకపోతే మరో స్టౌ కాఫీలకి ఉండేది. రాత్రి భోజనాలు అయ్యాక.. గేస్ స్టౌ అయినా కుంపటి అయినా సరే నీళ్లు పోసి కడిగేసి.. ఆ గొట్టాలు, ఫ్రేమ్ లు ఆరబెట్టి.. వంటిల్లు కడిగేసి ముగ్గు గీత పెట్టాకే పడుకునేవారు. వంటింటిలోనే పైకి ఎత్తుగా కట్టిన దండెం మీదకి మర్నాటి కోసం మడి చీర కర్ర సహాయంతో ఆరేసుకోవడం.. ఎంతమందికి గుర్తుంది?

అప్పుడు రోజుల్లో.. స్నానాలకీ, మిగిలిన కార్యక్రమాలకీ.. దూరంగా పెరట్లోకి వెళ్ళాల్సివచ్చేది.. ఆ గదులు ఇంటికి దూరంగానే ఉండాలనేవారు.. ఆ వెంటనే బావి దగ్గర నాలుగు చేదలు తోడుకుని నెత్తిన గుమ్మరించుకుని ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించేవారు. మరి ఇప్పుడో.. ఒకొక్క బెడ్ రూమ్‌కీ ఒకొక్క బాత్ రూమ్‌లు అటాచ్డ్ అయిపోయి ఉంటున్నాయి. తప్పడంలేదు.. ఇప్పుడు తప్పుకాదు అని చెప్పడంలో మనమే ముందుంటున్నాము. ఈ అపార్ట్‌మెంట్ కల్చర్‌లో.. హాలుని ఆనుకునో.. వంటగదికి సమీపంలోనో కూడా నిర్మాణం చేసేస్తున్నారు.. మనం కూడా వీటికే అలవాటు పడిపోతున్నాము.. అప్పట్లో లాగా అంతటి పెద్ద ఇళ్లు, పెరడులు ఇప్పుడు వుంటే కదూ.. ఒకవేళ ఉన్నా.. ఇప్పుడున్న మోకాళ్ల నొప్పులతో అంతంత దూరం కూడామాటి మాటికీ వెళ్ళలేని పరిస్థితులు ఇప్పటివి.. చేయగలిగిందేం లేదు..

ఇంకా ఇలా ఎన్నో మార్పులు. ఆనాటి వంటలు, వంటకాలు ఏవీ? ఎవరంత ఓపికగా వండుతున్నారు? సాంప్రదాయ వంటకాలన్నీ ‘స్వగృహ ఫుడ్స్’ లో అతుక్కుపోతున్నాయి. వినాయక చవితి ఉండ్రాళ్ళు, పులిహోర ఆర్డర్ పెట్టి తెప్పించేసి నైవేద్యం పెట్టడం కూడా వచ్చేసింది.

ఉమ్మడి కుటుంబాలు కాగడా వేసి వెతికినా కనపడ్డం లేదు. ఎవరికి వారే యమునా తీరే!

ఇలా చెప్పుకుంటూ వెడితే ఇదో అనంత సాగరమే!

అప్పటి రోజులకీ ఇప్పటిరోజులకీ వారధులుగా ఉన్నాము కాబట్టి, నవ్యత్వాన్ని ఆస్వాదిస్తూ, పురాతనాన్ని కాస్త గుర్తు చేసుకోగలం.. అంతే.. మన తర్వాత ఈ గుర్తులు కూడా వుండవేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here