పద్య వైభవానికి పట్టాభిషేకం:
[dropcap]సె[/dropcap]ప్టెంబర్ 9, 10 2023 తేదీలలో, విజయవాడ గాంధీనగర్ లోని, శ్రీ కౌతాపూర్ణానంద కళావేదికలో ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలోని పద్యాలను గానం చేసే పోటీలు నిర్వహించారు. శ్రీదేవి కళానాట్య మండలి, గుమ్మడి జైరాజ్ కళాపీఠం, శ్రీసాయి హృదయ నాట్య మండలుల సంయుక్త సహకారంతో అపూర్వమైన ఈ పోటీలు జరిగాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే గాక, పొరుగున ఉన్న ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల నుండి కూడా 69 మంది పాల్గొని, ఈ వేడుకను సుసంపన్నం చేశారు. వారిలో స్వయముగా హరిశ్చంద్ర, నక్షత్రక పాత్రలను పలు మార్లు రంగస్థలం మీద ప్రదర్సించిన ఉద్ధండులున్నారు. వారి పద్యగాన వైభవం అద్భుతం. వారిలో కొందరు రంగస్థల నాటక దర్శకులు కూడ ఉన్నారు. ప్రఖ్యాత రంగస్థల నటులు శ్రీ గుమ్మడి జయరాజ్ గారి కుమారులు శ్రీ గుమ్మడి విజయకుమార్, శ్రీ గుమ్మడి జీవన్ కుమార్ గారులు తమ తండ్రి గారి ‘లెగసీ’ ని ఈ రకపు కార్యక్రమాల ద్వారా సజీవంగా ఉంచడం విశేషం.
‘సత్యహరిశ్చంద్ర’ నాటకాన్ని శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు 1912లో రాశారు. ఆయన స్వయంగా నక్షత్రకుని పాత్రను జనరంజకంగా పోషించేవాడంటారు. తర్వాత 1935లో శ్రీ గుర్రం జాషవాగారు ‘స్మశాన వాటిక’ ను రచించారు. అది ఒక కావ్యఖండిక. అందులోని పద్యాలను కూడ ‘హరిశ్చంద్ర’ నాటకములో ఉపయోగించుకోనేవారు. అవి కూడ విశేష ప్రజాదరణ పొందాయి. ఇరువురి పద్యాలు పండిత పామరుల నోళ్లలో సజీవంగా నిలిచాయి. శతాబ్దం పైన కాలం గడిచినా ఆ పద్యాలు ఇంకా పద్య ప్రేమికులను ఆకర్షింస్తున్నాయనడానికి, ఈ పద్య పోటీలే నిదర్శనం.
కృష్ణబాబు జోస్యుల అనే ఆయన హరిశ్చంద్ర నాటకపద్యాల మీద పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా పొందారు.
1965లో కె.వి.రెడ్డిగారు ఎన్.టి.ఆర్, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ముక్కామల, రేలంగి, రాజనాల వంటి ప్రసిద్ధ నటులతో ‘సత్యహరిశ్చంద్ర’ సినిమా తీశారు. కాపీ రైట్ సమస్యల వల్ల ఆ సిమాలో బలిజేపల్లి, జాషువా గారల పద్యాలు ఉపయోగించకుండా వేరే పద్యాలు పెట్టారని, అందుకే ప్రజలు ఆ చిత్రాన్ని ఆదరించలేదని అనేవారు అప్పట్లో.
పోటీలో, నిబంధనలలో, కొండవీటి చాంతాడంత రాగాలు తీయకూడదని, భావ వ్యక్తీకరణ, స్పష్టమైన ఉచ్చారణలకే ప్రాధాన్యత ఉంటుందని, నాలుగు పద్యాలు మాత్రమే పాడాలని, 10 – 12 నిముషాలు మాత్రమే సమయం ఇవ్వబడుతుందని, ప్రకటనలో తెలిపారు. అంతే గాక, పోటీల ప్రారంభంలో కూడా న్యాయనిర్ణేతలు ముందుగానే చెప్పారు. హార్మోనియం సహకారం, సౌండ్ సిస్టమ్ నిర్వాహకులే ఏర్పాటు చేశారు.
తెలంగాణ నుండి సంచిక రచయిత, ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ పాణ్యం దత్తశర్మ ఈ పోటీలో పాల్గొన్నారు. ఆయన ప్రసిద్ధమైన రాగాలలో కాకుండా, తన స్వంత రాగాలు స్వరపరచుకొని, భావాలకి పెద్ద పీట వేసి నాలుగు పద్యాలను ఆలపించారు. అవి, 1. వాకొనరాని 2. తన మహీ రాజ్య మంతయు 3. అంతటి రాజచంద్రునకు 4. జవదాటి యెరుగదు. ఆయన మిత్రులు డా. జెట్టి యల్లమంద (నర్సీపట్నం) కూడ పాల్గొన్నారు. వీరిద్దరినీ, సత్కార సభలో పద్య వైశిష్ట్యాన్ని గురించి ప్రసంగించమని నిర్వాహకులు కోరగా, వీరిరువురు ప్రసంగించి, మన్ననలు పొందినారు.
ఈ పోటీలలో పాణ్యం దత్తశర్మగారికి విశిష్ట ప్రత్యేక పురస్కారం లబించింది. విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు బహుమతి ప్రదానం చేశారు. ప్రేక్షకులు దాదాపు రెండు వందల మంది హాజరై పద్యం హృద్యమైనదని, దానికి ఆదరణ తగ్గలేదని నిరూపించారు.