[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘శ్మశానం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]త[/dropcap]ల్లి గర్భంలో హాయిగా నవ మాసాలు
నిదురించి ఊపిరి పోసుకొని
భూమాత ఒడిలో వచ్చి పడతారు
రాజు పేద పండిత పామరులంతా
తల్లి కడుపులో తల్లడిల్లక హాయిగా
ఉన్నవారు నేల మీదకు కాలు మోపి
నింగి వైపు చూస్తుంటారు అందలం
అందుకుందామని ఆరాటం మొదలు
ప్రేమ కోపం ఈర్ష్య ద్వేషం స్వార్థం
వంచనల వలువలు కట్టుకుంటారు
విలువలు వదిలేసి కొట్టుకుంటారు
జానెడు పొట్ట కోసం యోజనపు
యోజనాలు వేసి ఎదురు చూస్తారు
కోట్లు కూడబెట్టి కోటలు కడతారు
బంధు మిత్ర సపరివారమంతా
చూట్టూ చేరగా ఏదో సాధించామని
అంబరమంత సంబరం పొందుతారు
ఆయువు ఒకటి ఉంటుందని
అది కాస్తా తరిగిపోతుందని
మరచిపోతారు సాటి మనిషికి
సాయం చేయటం చేయరు వీరు
కాలుడు వచ్చి కాలం తీరిందని
పాశం వేసి తీసుకుపోతాడు
ఒంటరిగా వస్తారు ఒంటరిగా పోతారు
కోట్లు కోటలు వదిలిపోతారు
అమ్మ గర్భాన రూపుదిద్దుకున్న
దేహం కోరికల దాహంతో పెరిగి
చివరకు శవమై ప్రకృతి వశమై
శ్మశానానికి చేరుకుంటుంది
మరు భూమిలో కనుమరుగయ్యి
మరో జన్మకు ఎదురు చూస్తుంటారు
ఓ మనిషి నీ జీవితంలో చివరి మజిలీ
శ్మశానమే కదా భస్మమే నీ గమ్యం కదా