[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
గతం.. స్వగతం
ఏది జరిగనా మన మంచికే అనుకుంటూ వుంటాం. అలా జరిగిపోయినదంతా మన గతమే. నిజానికి గతమెప్పుడూ బావుంటుంది. ఎందుకంటే అందులో మనకి అన్నీ తెలిసిన మలుపులే. ఇంకా భవిష్యత్తే మనకి తెలీని అయోమయం. అందుకే గతం మధుర జ్ఞాపకాలు, బాధాసంఘటనలతో కూడినదై మర్చిపోలేని విధంగా వుంటుంది.
ఓ అరవై డభ్భై సంవత్సరాల వ్యక్తులని పలకరించి కదిలిస్తే చాలు వారి బాల్యం నుండి ప్రస్తుత వృద్ధాప్యం వరకు పూస గుచ్చినట్లు గతాన్ని తవ్వుకుంటూనే వస్తారు. నిజానికి గతాన్ని తవ్వుకోకుండా ఎవరుంటారు చెప్పండి. గతం గతహ అనీ past is past అంటారు కానీ ఆ గతంలోనే అమ్మచేతి గోరుముద్దలుంటాయి. ఆడుకున్న గుజ్జనగూళ్ళు వుంటాయి. తిన్న గోరుమీటీలుంటాయి. గోడలు దూకి కింద పడితే తగిలిన గాయాల మచ్చలుంటాయి. పలకల మీద రాతలు, అల్లరి చేతలు, నాన్న పెట్టిన వాతలు, స్నేహితులతో కోతలు ఇలా అన్నీ మనకి తెలిసిన గతంలో మనతో పెనవేసుకుపోయి వుంటాయి.
గతంలో మనం కోల్పోయిన మన ఆత్మీయులుంటారు. వారిని తలుచుకోగానే మనసు బరువెక్కడం కంటనీరు తిరగడం జరుగుతుంది. గతం లోని సంతోష సంఘటనలు గుర్తొచ్చే సరికి ఆనందంగా పెదాల మీద నవ్వుల పూవులు విరబూస్తాయి. గతాన్ని తవ్వుకోకు అని అంటూ వుంటారు కానీ తలచుకోకుండా ఎవరుండగలరు.
ప్రయాణంలో కిటికీలో నుండి చూస్తూ వుంటే వేగంగా వెనక్కి వెళ్లి పోయే దృశ్యాల లాగా మన జీవితంలో కష్టాలు సుఖాలు అన్ని అలా వెళ్లి పోతూ వుంటాయి. అవి అన్నీ మన గతంలో నిక్షిప్తబడి మనం తలచిన వెంటనే మనో నేత్రం ముందు కదలాడుతూవుంటాయి. సినిమాలలో ఫ్లాష్‌బాక్ చెప్పినప్పుడు తిరిగే రింగులు రింగులుగా కళ్ళముందు కనపడతూవుంటాయి. గతం గురించి స్వగతంలో అనుకుంటూనే వుంటాం
ఈ గతమే మనకి అనుభూతులనిచ్చేది. అనుభవాలనిచ్చేది. ఆనందాలనిచ్చేది. అలాగే బాధలనిచ్చేది. గుండె బరువును పెంచేదీ. గతం పాఠాలను నేర్పుతుంది. కొంతమంది పెద్దవారు రాసిన వారి జీవితచరిత్రలు ఆత్మకథలలో వారి గతం ప్రతిబింబిస్తూవుంటుంది. అది మనకి ఆదర్శవంతంగా కూడా వుంటుంది.
గతాన్ని గుర్తు పెట్టుకోవడం నిజంగా అదృష్టం. కొందరు గతం చేదు అని తలచుకోవడం ఇష్టపడరు. నిజమే కొన్ని భయానకాలు కూడా ఆ గతంలోనే వుంటాయి. కానీ గతాన్ని మార్చలేము. మంచిదైనా చెడ్డదైనా గతం మనతో ముడిపడిపోయివుంది. గతానుభవాలు, గత జ్ఞాపకాలు, గత పరిచయాలు గత సంఘటనలు చాలా వరకు మర్చిపోలేము. ఒక్కోసారి ఏదైనా ఊరు పేరు విన్నా, ఏదైనా సంఘటన విన్నా దానికి సంబంధించిన మన గతం వెంటనే గుర్తువచ్చేస్తుంది. ఇలాంటివి మన స్వగతంలో అనుకుంటూ వుంటే సరిపోతుంది కానీ ఆపుకోలేక పక్కవారితో పంచుకుంటే వారు బాబోయ్ మళ్లీ ఏదో గుర్తువచ్చినట్టుంది అని పారిపోతారు. ఎందుకంటే ఎవరి గతం వారికి అందమైన అనుభూతి కానీ ఇతరులకి కాదు కదా. మతిమరుపు వున్నవారికి పాపం ఇలాంటి గతాలు తవ్వుకోడాలు ఎంత ఇబ్బందో. సినిమాలలో చూపిస్తారు ప్రమాదంలో గతాన్ని మర్చిపోయారు అని. అలా నిజంగా వుంటుందో లేదో మరి?
నా మటుకు నాకు గతం ఎంతో ఇష్టం అయినది అంతా నాకు తెలిసినదే. ఏదైనా నేను తడుముకోకుండా చెప్పగలిగేదే.
కన్నీరైనా, ఆనందం అయినా
గతం బావుంటుంది
తలుచుకోవడానికీ
ఊహల్లో బ్రతికెయ్యడానికీ
ఎందుకంటే అందులో
మనకి తెలీని మలుపులుండవు.