[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ఆదిపర్వము నాలుగవ ఆశ్వాసము ప్రారంభము
పూరువంశ చరిత్ర కథలు -దుష్యంతుడి జన్మవృత్తాంతము
[dropcap]శౌ[/dropcap]నకుడు మొదలైన మహర్షులకి దుష్యంతుడి పుట్టుక గురించి చెప్తున్నాడు వైశంపాయనమహర్షి.
యయాతి కుమారుడు పూరుడు భూమండలం మొత్తాన్ని పాలిస్తూ తన మంచి నడవడికతో వంశానికి ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగించాడు. పూరుడు, కౌసల్య దంపతులకి ‘జనమేజయుడు’ జన్మించాడు. అతడు మూడు అశ్వమేధ యాగాలు చేశాడు. జనమేజయుడు, అనంత దంపతులకి ‘ప్రాచిన్వంతుడు’ జన్మించి తూర్పుదిక్కుకి రాజుగా ప్రసిద్ధి పొందాడు.
ప్రాచిన్వంతుడు, అశ్మకి దంపతులకి ‘సంయాతి’ పుట్టాడు. సంయాతి, వరాంగి దంపతులకి ‘అహంయాతి’ కలిగాడు. అహంయాతి, కృతవీర్యుడి కుమార్తె భానుమతి దంపతులకి ‘సార్వభౌముడు’; అతడికీ, కేకయరాజ కుమార్తె సునంద దంపతులకి ‘జయత్సేనుడు’ జన్మించాడు. జయత్సేనుడికీ, విదర్భరాజు పుత్రిక సుశ్రవస దంపతులకి ‘అవాచీనుడు’ కలిగాడు. అవాచీనుడికి, విదర్భ రాజు కుమార్తె మర్యాదకి ‘అరిహుడు’; అరిహుడికి ఆంగి యందు ‘మహాభౌముడు’ పుట్టాడు.
మహాభౌముడికి ప్రసేనజిత్తుడి కుమార్తె సుపుష్ట యందు ‘అయుతానీకుడు’; అయుతానీకుడికి పృథుశ్రవసుడు కుమార్తె కామకి యందు ‘అక్రోధనుడు’ కలిగారు. అక్రోధనుడికి కళింగరాజు కుమార్తె కరంభ యందు ‘దేవాతిథి’; దేవాతిథికి విదేహరాజు కుమార్తె మర్యాద యందు ‘ఋచీకుడు’; ఋచీకుడికి అంగరాజు కుమార్తె సుదేవ యందు ‘ఋక్షుడు’; ఋక్షుడికి తక్షకుడి కుమార్తె జ్వాల యందు ‘మతినారుడు’ పుట్టారు.
మతినారుడు సరస్వతీ నది ఒడ్డుమీద పన్నెండు సంవత్సరాలు శాస్త్రప్రకారం శ్రద్ధాభక్తులతో సత్రయాగం చేశాడు. సరస్వతీ నదికి మతినారుడి మీద అనురాగం కలిగింది. అందువల్ల ధర్మ మార్గంలో అతడిని తన భర్తగా చేసుకుంది. వాళ్లిద్దరికీ ‘త్రసుడు’ కుమారుడుగా జన్మించాడు. త్రసుడు, కాళింది దంపతులకి ‘ఇలునుడు’; అతడికీ రథంతరికీ ‘దుష్యంతుడు’ పుట్టాడు. దుష్యంతుడు చిన్నతనంలోనే దట్టమైన అడవుల్లో తిరిగే సింహాల్ని, పులుల్ని, ఏనుగుల్నీ, శరభమృగాల్నీ వెంటాడి పట్టుకునేవాడు. పెద్ద వృక్షాలతో పాటు పర్వతాల్ని కూడా పెకిలించి తీసి వేరే పర్వతాల మీదకి విసిరేసేవాడు.
దుష్యంతుడి వేట
అంతులేని భుజబలంతో దిక్కుల చివర్లో ఏనుగులే సరిహద్దులుగా (భూమిని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది ఏనుగులు మోస్తూ ఉంటాయట) ఉన్న భూమండలం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. సూర్యకిరణాలు, గాలి కూడా ప్రవేశించలేనంత దట్టంగా ఉన్న అడవులతో నిండి ఉన్న భూమిని కూడా తన భుజబలంతో రక్షించాడు. తన కంటే ముందు పాలించిన రాజుల కంటే ఎక్కువ భుజబలాన్ని ప్రదర్శించి, శత్రువులందర్నీ ఓడించి తనకు శత్రువులే లేకుండా చేసుకున్నాడు.
దుష్యంతుడి పరిపాలనలో ప్రజలు రోగాలు, దుఃఖాలు, అవరోధాలు. నష్టాలు, అనుమానాలు ఏవీ లేకుండా తమ ప్రభువు నడుచుకున్నట్టే ధర్మ ప్రవర్తనతో జీవించారు. ఒకరోజు దుష్యంతుడు సూర్యుడి రథం కంటే ఎక్కువ వేగంతో పరుగెత్తే గుర్రాలు కట్టబడిన రథం మీద ఎక్కి వేటకి వెళ్లాడు. మహా వీరులు ఈటెలు, చిల్లకోలలు, బాణాలు, కత్తులు మొదలైన ఆయుధాలు ధరించి దుష్యంత మహారాజుని అనుసరించారు.
అడవిలో తిరుగుతూ నాలుగు వైపుల నుంచి మృగాల మీద దాడి చేశారు. అటు రాజు సైన్యము, ఇటు అడవిలో ఉన్న మృగాలూ వేసే కేకలు అరణ్యమంతా ప్రతిధ్వనించాయి. ఆ శబ్దం మందర పర్వతంతో మహాసముద్రాన్ని చిలికినప్పుడు కలిగిన శబ్దంలా భయంకరంగా ఉంది.
మహా పరాక్రమవంతుడైన దుష్యంతుడు భయంకరమైన అరణ్యంలో ఉండే శరభాలు, సింహాలు, పందులు, పెద్దపులులు, మదపుటేనుగులు మొదలైన క్రూరజంతువుల్ని వేటాడుతున్నాడు. తప్పించుకుని పారిపోతున్నవాటిని వెంటాడి, దగ్గరికి వచ్చిన వాటిని తరిమి, వాటితోపాటు కుప్పించి పరుగులు తీస్తూ వేటాడుతున్నాడు. అనేక మృగాల్ని వేటాడుతూ తరిమి తరిమి చంపుతున్నాడు. అలా వేటాడుతూనే వేటమీద ఉన్న ఇష్టంతో చాలా దూరం వెళ్లిపోయాడు.
అతడి వేగాన్ని అందుకోలేక; అతణ్ని అనుసరించే ఓపికలేక; ఆకలి, దాహం తట్టుకోలేక అతడి సైన్యం ఒకచోట ఆగిపోయింది. అప్పటికే దుష్యంతుడు కొంతమంది మంత్రులతోను, పురోహితులతోను కలిసి మరో ప్రదేశానికి వెళ్లిపోయాడు.
కణ్వుడి ఆశ్రమము
దుష్యంతుడు ‘మాలిని’ అనే పవిత్రమైన నది ఒడ్డుమీద అనేక మంచి సువాసనలతో నిండిన పూలు, ముగ్గిన పండ్ల బరువుతో వంగిన చెట్లు, తీగలు, పొదలతో అందంగా ఉన్నఉద్యానవనాన్ని చూశాడు. అది ఇంద్రుడి ఉద్యానవనమైన ‘ఖాండవ వనము’, కుబేరుడి ఉద్యానవనమైన ‘చైత్రరథం’ ఉన్నంత అందంగా ఉంది. వాటితో సమానంగా ఉండాలని బ్రహ్మే భూమి మీద కట్టించాడేమో అన్నంత మనోహరంగా ఉంది.
దాని అందాన్ని మనస్సులోనే మెచ్చుకుంటూ ఆ ఉద్యానవనంలోకి అడుగు పెట్టాడు. లోపలికి వెడితే ఇంకా ఎన్ని అద్భుతాలు కనిపిస్తాయో అనుకుంటూ నడుస్తున్నాడు దుష్యంతుడు. అతడు అనుకున్నట్టుగానే పెద్ద వృక్షాల్ని అల్లుకున్న లతలు, ఝంకారం చేస్తూ తిరుగుతున్న తుమ్మెదలు, మెల్లగా వీస్తున్న గాలికి అక్షతలు చల్లినట్టు మీద రాలి పడుతున్న రంగు రంగుల పువ్వులు వేటాడి అలిసిపోయిన దుష్యంతుడి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించాయి.
నది మీద నుంచి వచ్చే చల్లటి గాలి అతడికి సేద తీరుస్తోంది. పొడవుగా పెరిగి ఎర్రగా చిగురించిన గోరంట్ల చెట్లు, గుబురుగా పూలు పూసిన అశోక చెట్లు, సురపొన్నలు, పొన్నలు, మొగలి పొదలు, తియ్యగా ముగ్గిన పండ్లతో మామిడి చెట్లు, గుబురుగా ఉన్న అరటి చెట్లు చూస్తూ.. చిలుకల పలుకులు, కోయిలల మధురమైన కూతలు వింటూ నడుస్తున్నాడు.
యజ్ఞకుండాల్లో పోసిన నేతి వాసనలు గాలిలో తేలుతూ వస్తున్నాయి. పొగచూరిన లతలతో అల్లుకున్న చెట్ల కొమ్మల మీద పువ్వులు లేకపోయినా తుమ్మెదలు గుంపులుగా అతుక్కుని ఉన్నాయి. అక్కడి వాతావరణాన్నిచూసి ఆ ప్రాంతం తపోవనమని, ఎవరో గొప్ప మహర్షి నివసిస్తూ ఉండచ్చని అనుకున్నాడు.
దుష్యంతుడు తన హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్న ఆ వనంలో ప్రవేశించాడు. ఉత్తములైన బ్రాహ్మణులు అపకుండా చెప్తున్న వేదపఠనాలు; అగ్నిలో స్వాహా శబ్దాలతో ఆపకుండా వేస్తున్న హవిస్సులు; రకరకాల విషయాల మీద జరుగుతున్న చర్చలు; వాటి మీద తీసుకుంటున్న నిర్ణయాలతో అనేక మంది మహర్షులు నివసిస్తున్న ఉద్యానవనంలో నడుస్తున్నాడు.
పండిత సభలనుంచి వినబడుతున్న సంభాషణల ఘోష; ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకి చిక్కు విడదీయలేని ప్రమాణాలతో వేదార్థ విచారణ చేస్తున్న మీమాంసకుల చర్చలు; వాదప్రతివాదాల వల్ల కలిగే ప్రతిధ్వనులతో అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. యజ్ఞాలు నిర్వహించడంలో గొప్ప నైపుణ్యం కలిగిన ఋత్విక్కులకి, వేదాల్లో చెప్పబడినట్టు ప్రతి రోజూ కర్మల్ని చేసే నిష్ఠాపరులకి, గొప్ప తపస్సంపన్నులకి నివాసమైన ప్రదేశంలా కనిపించింది. గంగానదీతీరంలో ఉన్న నరనారాయణులు నివసించే ప్రదేశం ఎలా ఉంటుందో.. అదే విధంగా లోకానికి పవిత్రతని కలిగిస్తూ పుణ్యనదీ తీరంలో ప్రకాశిస్తున్న కణ్వమహర్షి ఆశ్రమాన్ని ఎంతో తన్మయత్వంతో చూశాడు దుష్యంతుడు.
చిలుకలు సస్వరంగా పాడే సామవేదాన్ని వింటూ తన్మయత్వంతో కదలకుండా నిలబడి పోయిన ఏనుగులు; చెట్ల నీడల్లో చల్లగాలిలో హయిగా స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాలు; బ్రాహ్మణులు పెట్టే పిండాలు తినడం కోసం తొందర పడుతూ కలిసి మెలిసి తిరుగుతున్న ఎలుకల్నీ, పిల్లుల్నీ చూశాడు. సహజంగా వాటి మధ్య ఉండే శత్రుత్వాన్ని వదిలి పెట్టి స్నేహంగా కలిసి మెలిసి తిరుగుతున్న జంతువుల్ని చూసి ఆశ్చర్యపోయాడు దుష్యంతుడు.
ఆ ప్రదేశంలో కణ్వమహర్షి తపోమహిమ వల్ల క్రూరమృగాలన్నీ కూడా శత్రుత్వం లేకుండా కలిసి మెలిసి జీవిస్తున్నాయి. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టిన కణ్వమహర్షిని దర్శించి నమస్కారం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని అనుకున్నాడు. తన వెంట వస్తున్న ముఖ్యులైన మంత్రుల్ని, అనుచరుల్ని అక్కడే ఆగమన్నాడు. తనొక్కడే ఒంటరిగా కణ్వమహర్షి ఆశ్రమంలోకి వెళ్లాడు.
తామరపువ్వుల్లా నల్లటి పెద్ద కళ్ళు, తుమ్మెదలు ఒకే చోట గుమిగూడినట్టు నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టుతో ఉన్న శకుంతలని చూశాడు. అక్కడ దుష్యంతుడికి కణ్వమహర్షి కనిపించలేదు. ఎప్పుడూ మహర్షులే తిరుగుతూ కనిపించే తమ ఆశ్రమంలో ఇంద్రుడి కుమారుడు జయంతుడికి ఉన్నంత సౌందర్యంతో వెలిగిపోతున్న మహారాజుని చూసి తొట్రుపడింది శకుంతల.
అంతలోనే తండ్రి నుంచి నేర్చుకున్న సంస్కారంతో ఆసనం చూపించి కూర్చోమని చెప్పింది. ఆశ్రమ ధర్మ ప్రకారం ఆదరంతో అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించింది. మహారాజు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. దుష్యంతుడు ఆమెను చూసి “నేను వేటకోసం అడవికి వచ్చాను. కణ్వమహర్షిని కూడ కలిసి వెడదామని ఈ ఆశ్రమానికి వచ్చాను” అన్నాడు.
ఆ మాటలకి శకుంతల “మహారాజా! తండ్రిగారు ఇంతకు ముందే పండ్లు తీసుకుని రావడానికి అడవికి వెళ్లారు. వస్తూనే ఉంటారు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి” అని చెప్పింది. అమితమైన సౌందర్యంతో వెలిగిపోతున్న శకుంతల వినయము, మాటల మృదుత్వము, రూపము దుష్యంతుణ్ని మొదటి చూపులోనే అకర్షించాయి. గొప్ప పరాక్రమవంతుడైన మహారాజు దుష్యంతుడు కూడా శకుంతలని ఆకర్షించాడు.