జ్ఞాపకాలు

1
3

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘జ్ఞాపకాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సు[/dropcap]బ్బారావుకి స్వంత వూళ్ళో ఆ పాత ఇల్లు ఇంక ఎలాగయినా అమ్మేయాలని వుంది. కానీ దాన్ని తన బాబయ్యకి మాత్రం అమ్మకూడదు అని అతని పట్టుదల. ఎందుకు అతను తన బాబయ్యకి అమ్మకూడదు అనుకుంటున్నాడో తెలియాలంటే, వాళ్ళ కుటుంబ కథ తెలుసుకోవాలి.

సుబ్బారావు తండ్రి పరశురామయ్య వాళ్ళది విశాఖపట్నం దగ్గర తగరపువలస అనే పల్లెటూరు. పరశురామయ్య తమ్ముడి పేరు కేశవరామయ్య.

చాలా కాలం అన్నదమ్ములు ఇద్దరూ చాలా సఖ్యం గానే వుండేవారు. తండ్రి తర్వాత సంక్రమించిన రెండున్నర ఎకరాల ఆస్తి విషయంలో ఏర్పడిన మనస్పర్ధలు వాళ్ళిద్దర్నీ ఒకరికి ఒకరిని దూరం చేసేయి. ఊరి కరణం చేసిన మోసం గ్రహించక, కేశవరామయ్య అన్నయ్యకి ఎదురు తిరిగేడు. లెక్కలు, కొలతలు తేడా చూపించి ఒక అర ఎకరం తన పొలంలో కలిపేసుకున్నాడు కరణం.

మనస్తాపానికి గురి అయిన పరశురామయ్య తన వాటా పొలం అమ్మేసుకుని ఇల్లు కట్టేసుకున్నాడు. దాంతో బాటే, తమ్ముడికి తనకి మధ్య గోడ కట్టేసేడు. కరణం గారు ఆడిన నాటకంలో తానూ పాత్రధారి అయినట్లు లేటుగా తెలుసుకున్నాడు కేశవరామయ్య.

కేశవరామయ్య, తన తప్పు ఒప్పుకుని, అన్నగారిని క్షమించమని వేడుకున్నా, పరశురామయ్య కరగలేదు. ఆయన మహా మొండి మనిషి, కోపిష్ఠి కూడా. ఒక సారి ఒక నిర్ణయానికి వస్తే, చచ్చినా అతన్ని మార్చలేం.

ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటి మీద వాలేది కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, మనస్పర్ధలు పోతాయని కేశవరామయ్య గారు ఎదురు చూసేరు. కానీ, ఆయన దురదృష్టం, వాళ్ళ మధ్య మనస్పర్ధలు మరింత పెరిగేయి. దీనికి అంతటికీ కారణం ఇరవై ఒక్క ఏళ్ళ క్రితం కస్తూరి చేసుకున్న వివాహం. ఆమె కేశవరామయ్య గారి బావమరిది రాజాని ఇష్ట పడింది. కూతురి కోసమయినా అన్నయ్య తన పంతం వీడి, రెండు కుటుంబాలు కలుస్తాయని కేశవరామయ్య గారు భావించేరు.

పరశురామయ్య గారు తనకి నచ్చని కుటుంబంలో సంబంధం చేసుకోడానికి ఇష్టపడలేదు. అగ్గి మీద గుగ్గిలం అయ్యేడు. కానీ కస్తూరి, రాజాని తప్ప ఎవరినీ చేసుకోనని తెగేసి చెప్పింది. ఆమె కూడా పరశురామయ్య కూతురే కదా. పట్టుదల ఎక్కువ ఆ పిల్లకి.

తండ్రికి ఇష్టం లేకుండా చేసుకునే పెళ్లి మరింత వైభవంగా చేసుకోవడం ఇష్టపడలేదు కస్తూరి. అందుకే గుళ్లో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది. పరశురామయ్య గారికి తల కొట్టేసినట్లయింది. కూతుర్ని, అల్లుడిని లోపలకి రానీయలేదు. పైగా, కస్తూరికి కన్యాదానం చేసింది కేశవరామయ్య అని, ఎవరూ లేని అనాథల్లా గుళ్లో పెళ్లి చేసేరని తెలిసి, తమ్ముడిపై ద్వేషం మరింత పెంచుకున్నారు ఆయన. చేసేది లేక, భర్త తో వెళ్లి పోయింది ఆమె. రాజా, కస్తూరి హైదరాబాద్‌లో కాపురం పెట్టేరు.

పరశురామయ్యకి ఇద్దరు పిల్లలు. కూతురు పెద్దది. ఆమె పుట్టిన పది సంవత్సరాలకి కొడుకు సుబ్బారావు పుట్టేడు. ఆమె పెళ్లి నాటికీ సుబ్బారావు 11 ఏళ్ళ వాడు. తండ్రి అదుపు ఆజ్ఞలలో పెరిగిన సుబ్బారావు బాబయ్య కుటుంబాన్ని, అక్కను మర్చిపోయి పెరిగేడు. ఆతను తండ్రికి తగినట్లుగా ఉంటూ వుండేవాడు. పరశురామయ్యని ఎదిరించలేని ఆయన భార్య వరలక్ష్మి తనలో తాను కుమిలిపోయేది.

కేశవరామయ్యకి ఇద్దరూ మగపిల్లలు. కూతురు లేని కేశవరామయ్య కస్తూరిని కూతురిలా చూసుకునేవాడు. ఆమె, కుటుంబానికి దూరం అవడం నచ్చక, అన్నగారికి అనేక విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించేడు. కానీ పట్టుదల మనిషి అయిన పరశురామయ్య తమ్ముడి మాటలు లెక్క చేయలేదు. కస్తూరి జ్ఞాపకాలు కూడా ఆ ఇంట్లో వుండకూడదు అని శాసించేరు.

కూతురు చనిపోయిన దానితో సమానం అని మొండిగా బతుకుతున్న పరశురామయ్య, అలా పట్టుదలతో కుటుంబ బంధాలను చెడగొట్టుకున్నారు.

3 నెలలకి పూర్వం పరశురామయ్య గారు చనిపోయేరు. పరశురామయ్య గారు మరణించినప్పుడు కూడా కేశవరామయ్యని వాళ్ళ ఇంటికి రానియ్యలేదు సుబ్బారావు. అంతేకాక, అక్కని పిలిచినా రానివ్వనని కేశవరామయ్య గారి మొహం మీదే చెప్పేసేడు. అవమాన భారంతో వెనుకకు వెళ్లి పోయాడాయన.

తగరపు వలసలో ఉన్న ఇల్లు పరశురామయ్య గారి పేరు మీద వుంది. అయన చనిపోయే వరకు, ఆ ఇల్లు ఎవరికో అద్దెకి ఇచ్చినా, ఇంట్లో ఒక రూము ఉంచుకున్నారు. వారానికి ఒకసారి వెళ్లి, అక్కడ ఇంట్లో పెరటి తోట చూసుకుని, దగ్గర్లో భీమిలి బీచ్‍కి వెళ్లి రావడం ఆయనకి సరదా.

ఆయన చనిపోయే ముందు కొడుకు పేరు మీద విల్ రిజిస్టర్ చేసేరు. పెద్దాయన చనిపోవడంతో, ఇంక ఆ పల్లెటూర్లో ఇల్లు ఉంచుకోవడం ఎందుకు అని, సుబ్బారావు ఆ ఇల్లు అమ్మేయాలని అనుకున్నాడు. అందుకని అద్దెకి ఉన్న వాళ్ళని ఖాళీ చేయించేడు. అతని తల్లి వరలక్ష్మికి భర్త పేరు మీద ఉన్న ఇల్లు, తాను బతికి వున్నప్పుడు అమ్మడం ఇష్టం లేదు. ఎప్పుడయినా, తన భర్త జ్ఞాపకాలలో గడపడానికి ఆ ఇంటికి వెళ్లి రావాలని కోరిక. కానీ, ఆమె నిస్సహాయురాలు. ఆమె మాట చెల్లుబాటు అవదు అని, కొడుకు మహా మొండివాడు అని తెలుసు. అందుకని మౌనంగా రోదిస్తూ ఉంటుంది. కూతుర్ని ఫోటోలో చూసుకుని కళ్ళలో నీరు కక్కుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

మరిది కేశవరామయ్యని అయినా కూతురి గురించి అడుగుదామంటే, భర్త, కొడుకు కూడా ఆ కుటుంబంతో తెగతెంపులు చేసేసేరు. పైగా, స్వంత వూరు నుండి దూరంగా వచ్చేసి బతుకుతున్నాడు సుబ్బారావు.

తగరపువలసలో ఆ ఇల్లు కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చిన వాళ్ళు 20, 25 లక్షల కంటే ఎక్కువ బేరానికి రావడం లేదు. ఊరి పెద్దలతో కబురు పెట్టించేడు కేశవరామయ్య – ‘తాను ఆ ఇల్లు కొంటాను’ అని. “౩౦ లక్షలు ఇస్తాను” అన్నాడు. కానీ, సుబ్బారావు పట్టుదలగా వున్నాడు. బాబయ్యకి ఇల్లు అమ్మడం అతనికి ఇష్టం లేదు. అందుకని, 25 లక్షలు ఇస్తానన్న ఆసామికి ఇల్లు ఇచ్చేస్తాను అని కబురు పెట్టేడు. అతని పేరు వరదరాజులు. వూళ్ళో కిరాణా వ్యాపారం.

విషయం తెలిసి కేశవరామయ్య బాధ పడ్డాడు. ఆతను ఆ ఇల్లు అడగడంలో ఉద్దేశం, ఆ ఇల్లు కస్తూరి కొనుక్కుంటాను అని చెప్పడం వలన. కస్తూరికి అన్న, వదిన, తమ్ముడి యోగక్షేమాలు చేరవేసేది అతనే. సుబ్బారావు, తనకి ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు అని అర్ధం అయింది. ఇంకేం చేయలేక ఊరుకున్నాడు.

ఈ మధ్య కొడుకు సుబ్బారావు, “మన ఇల్లు అమ్మకం పూర్తి అయ్యేలా వుంది” అని చెప్పడంతో “ఒకసారి నేను వస్తాను, మన ఇల్లు చూడాలని వుంది” అంది వరలక్ష్మి.

సుబ్బారావుకి బాబయ్య వాళ్ళు ఎక్కడ తల్లికి ఎదురు పడతారో, ఈవిడ కరిగి పోతుంది అని భయం.

“అమ్మేసేక, రిజిస్ట్రేషన్ రోజు కావలిస్తే, ఆఖరిసా గా నువ్వు చూద్దువు గానివి లే”, అని ఆమెని ఊరుకోపెట్టేసేడు.

రేపు వస్తే, అగ్రిమెంట్ రాసుకుందామని కబురు వచ్చింది వరదరాజులు దగ్గర నుండి.

మర్నాడు బయలుదేరి తగరపువలస వెళదామని అనుకున్నాడు సుబ్బారావు. అయితే ఆ రాత్రి అతనికి ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది.

“హలో సుబ్బారావు గారేనా?” అవతలి వ్యక్తి అడిగేడు.

“అవును, మాట్లాడుతున్నాను”.

“మీ ఇల్లు మాకు అమ్ముతారేమో అని అడుగుదామని ఫోన్ చేసేను అండీ.”

“మీ పేరు?”

“నా పేరు సాగర్ అండీ. నేను చెన్నైలో వుద్యోగం చేస్తున్నాను. మా వాళ్ళ కోసం ఆ ఇల్లు కొనాలని అనుకుంటున్నాను. వాళ్ళు విశాఖపట్నంలో వుంటారు” అన్నాడు అతను.

సుబ్బారావుకి ఆశ పుట్టింది. “మీరు యెంత ఇస్తారు?” అన్నాడు.

“నేను 32 లక్షలు ఇస్తాను అండీ. “

ఈ బేరం నచ్చింది సుబ్బారావుకి. కానీ పట్టు బిగించాలని.. “మరి వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకోగలరా?” అన్నాడు.

“15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, రేపు మీరు తగరపువలస వస్తే, మీ ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం” అన్నాడు.

ఫోన్ చేసి, వరదరాజులుకి చెప్పేసేడు. తాను ఇల్లు వాళ్ళకి అమ్మదలుచుకోలేదని.

మర్నాడు బయలుదేరి, తగరపువలస వెళ్ళేడు. సుబ్బారావు ఇంటికి సాగర్ వచ్చి అగ్రిమెంట్ చేసుకుని, 20 లక్షలు ఇచ్చి వెళ్ళేడు. సుబ్బారావుకి డీల్ త్వరగా తేలిపోవడంతో బాటు, మంచి రేటు వచ్చింది అని సంతోషంగా వుంది. కేశవరామయ్య గారు వూళ్ళో ఎదురయినా, తల తిప్పుకుని వెళ్లిపోయాడు సుబ్బారావు.

15 రోజులు గడిచేయి. ఆ రోజు రిజిస్ట్రేషన్. తగరపువలస బయలుదేరి పొద్దున్నే వెళ్ళేడు సుబ్బారావు. అనుకున్నట్లే, తల్లిని తీసుకుని వెళ్ళేడు.

వరలక్ష్మికి భర్త కట్టించిన ఇల్లు చూసుకుని, దుఃఖం ఆగలేదు. 2 నెలల నుండీ ఎవరూ వుండట్లేదేమో, ఇల్లంతా బూజులు పట్టి, పాడయిపోతోంది ఇల్లు. ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసింది.

సుబ్బారావు రిజిస్ట్రేషన్‌కి వెళ్ళేడు. ఆమెకి మనసంతా బెంగగా వుంది. ఆ ఇంటికి, తమకీ ఋణం ఈ రోజుతో తీరిపోతోంది. భర్త వున్నన్ని నాళ్ళు, ఆ ఇంట్లో మహారాణిలా తిరిగింది ఆవిడ. ఇప్పుడు కొడుకు అధీనంలోకి వచ్చేసరికి, ఆవిడకి కాళ్ళు, చేతులు కట్టేసినట్లు వుంది.

ప్రతి గదినీ కలియ తిరిగి, గోడల్ని తడిమి తడిమి చూసుకుంటోంది.

మధ్యాహ్నం అవుతుండగా బయట కారు ఆగింది.

కారు లోంచి ఒక పొడవైన కుర్రవాడు దిగేడు. కార్ వెనక డోర్ తీసుకుని ఒక జంట దిగేరు.

ఆవిడకి వార్ధక్యం వల్ల సరిగ్గా కనపడటం లేదు. కొడుకు రాలేదేమిటా అని చూస్తోంది.

ఆ అబ్బాయి వస్తూనే, కాళ్లకి దండం పెట్టి, “ఎలా వున్నావు అమ్మమ్మా” అన్నాడు.

ఆశ్చర్యపోయింది.

ఇంతలో వచ్చి తల్లిని చుట్టేసుకుంది కస్తూరి.

“అమ్మా, ఈ ఇల్లు నేనే కొనుక్కున్నాను. నాన్నగారు నన్ను దూరం పెట్టినా, నేను మిమ్మల్ని వదులు కోలేను అమ్మా. మేము ఇప్పుడు హైదరాబాద్ నుండి విశాఖపట్నం షిఫ్ట్ అయి పోయాం. ఇదిగో మావారు” అని పరిచయం చేసింది. వరలక్ష్మికి కలలా ఉంది.

కస్తూరి మళ్ళీ ఇలా అంది “నా కొడుకు సాగర్ చేత వాళ్ళ తాతగారి ఇల్లు నేనే కొనిపించేను. నాన్నగారి జ్ఞాపకాల కోసం ఈ ఇల్లు కొనాలనుకున్నాను. నాకు తెలుసు, నువ్వు ఈ ఇంటి కోసం, నా కోసం ఎంతగా పరితపిస్తావో. అందుకే నీకు దగ్గరగా వుండాలని ఈ ఇల్లు కొనిపించేను. వాడు చెన్నైలో వుద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఎంతకాలమయినా ఉండచ్చు” అంది.

వరలక్ష్మి నిర్ఘాంత పోయి చూస్తోంది. ఆమె కళ్ళు వర్షిస్తుండగా, కూతురిని, మనవడిని దగ్గరకి తీసుకుంది.

ఇంతలో వీధి గేటు చప్పుడు అయ్యింది. సుబ్బారావు వచ్చేడు.

హాల్‌లో దృశ్యం చూసి ఆశ్చర్యపోయేడు.

అక్కని గుర్తు పట్టెడు. ఆమె భర్తని ఒక్కసారి పెళ్లి అయిన వెంటనే మాత్రమే చూసేడు. మళ్ళీ చూడలేదు అందువల్ల, గుర్తు పట్టలేక పోయాడు. సాగర్‍ తమ ఇల్లు కొన్న వ్యక్తిగా మాత్రమే తెలుసు.

వరలక్ష్మి ఆనందంగా, కొడుకుకి అన్నీ వివరించింది. ఆమెకి కూతురు దగ్గరగా మళ్ళీ రావడంతో బాటు, వాళ్ళ ఇల్లు అమ్మేయలేదు, పైగా మనవడు దక్కించుకున్నాడు అన్న భావన చాలా బావుంది. ఇల్లు కొన్న వ్యక్తి తన మేనల్లుడు అని ఇప్పుడే తెలిసింది సుబ్బారావుకి.

సుబ్బారావు మొహం ఎర్రగా మారిపోయింది.

తల్లిని ఉద్దేశించి – “అమ్మా, ఇంక బయలు దేరు, మనం ఈ ఇల్లు అమ్మేసేం. ఇంక వెళ్లి పోదాం.” అన్నాడు

అప్పుడు సాగర్ కలగజేసుకున్నాడు – “మామయ్యా! గతం మర్చిపొండి. మీ కుటుంబంతో కలవాలని ఎన్నో సార్లు ప్రయత్నించింది అమ్మ. కానీ, తాతయ్య పట్టుదల వల్ల కుటుంబాల్లో అనవసరపు గొడవలు సృష్టించు కున్నారు. మీకు తెలియని ఒక రహస్యం చెపుతాను వినండి..” అన్నాడు.

అప్పటి దాకా, సాగర్‌ని బిల్డింగ్ కొనుక్కున్న వ్యక్తిగా మాత్రమే చూసేడు. ఇప్పుడు చూస్తున్నాడు అతని భావ ప్రకటనలో గాంభీర్యం.

“అమ్మమ్మకి వైద్యం చేసే డాక్టర్ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. గత ఏడాది అమ్మమ్మని అపోలో హాస్పిటల్‌లో జేర్చినప్పుడు, బ్లడ్ ఇచ్చేరు అమ్మ, నాన్న. అమ్మమ్మకి బాలేదని అమ్మ, నాన్న వైజాగ్ వచ్చి ఒక వారం హోటల్‌లో వుండి ఆమె ఆరోగ్యం కోసం కృషి చేసేరు. కానీ, డాక్టర్ గారిని ఆ విషయం రహస్యంగా వుంచమని చెప్పేరు. తాతయ్యకి దగ్గిర కాలేమని తెలిసే, దూరంగా ఉండి పోయేము, ఇంక అమ్మమ్మని మాత్రం దూరం చేసుకోలేము. పైగా ఇది మేము కొనుక్కోవాలి అంటే, సగం ధర ఇస్తే చాలు. తాతయ్య ఆస్తిలో అమ్మకి వాటా ఉంటుందిగా..” అన్నాడు స్థిరంగా.

సుబ్బారావుకి గతం గుర్తుకు వచ్చింది. ‘తల్లిని బతికించింది ఆ డాక్టర్ మాత్రమే కాదన్న మాట. అక్కా, బావ తన తల్లిని కాపాడుకోవడం కోసం రక్తదానం చేసి, డాక్టర్ ద్వారా, ఆమె బాగోగులు తెలుసుకున్నారన్న మాట..’ అనుకున్నాడు.

ఇప్పుడు అతనిలో ద్వేషపు జ్వాలలు చల్లారిపోయాయి. తండ్రి, తానూ చేసిన తప్పు అర్థమవుతోంది.

ఆప్యాయంగా అక్క కేసి చూసేడు. “నన్ను క్షమించు అక్కా” అని, అక్కాబావలకి నమస్కరించేడు. సాగర్ కేసి ప్రేమగా చూసేడు. మళ్ళీ ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసేయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here