రుక్మిణీ కల్యాణం..!!

3
4

[శ్రీమతి సుగుణ అల్లాణి రచించిన ‘రుక్మిణీ కల్యాణం..!!’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]“కృ[/dropcap]ష్ణా!! ఎప్పుడొచ్చినవు? నేను నీళ్ల కోసం మంచినీళ్ల బాయికి పోయినా.. మీ పెద్దత్త చెప్పింది నువు వచ్చినట్టు..” అంటూ లోపలికి వచ్చింది సీతమ్మ.

“అందరు బాగున్నరా అక్కడ..?” అడిగింది.

“ఆ బాగానే ఉన్నారమ్మా!!”

“లే మరి స్నానం జేసిరా! అన్నం తిందువు గానీ!!” అన్నది.

“నాకు నెత్తినొప్పిగా ఉందే అమ్మా, తినబుద్దైతలేదు” అన్నాడు కృష్ణ.

“అవునా! ప్రయాణంలో ఏం తినలేదు కదా! ఆకలైతే కూడా తలనొప్పొస్తది.. కొంచెం తిని పండుకో!!” అని వెళ్లి పోయింది తల్లి సీతమ్మ.

మంచం మీది నుంచి దిగలేదు కృష్ణ.. నిండా కప్పుకొని పండుకున్నడు.

రామభద్రయ్య పొలం నుండి వస్తూనే.. “కిష్టుడొచ్చినాడా?” అని అడిగినాడు.

“ఆ! ఆ! వచ్చిండు రా! అర్రల పండుకున్నడు” అన్నది రామభద్రయ్య తల్లి కౌసల్యమ్మ.

“పండుకునుడేంది? తిన్నడా?”

“లేదు నెత్తినొప్పంట!” మెల్లెగ చెప్పింది సీతమ్మ.

“నెత్తినొప్పి ఏంది నేను అడిగొస్త!” అని రామభద్రయ్య లోపలికి వెళ్లాడు.

“కిట్టూ!!” అని పిలిచినాడు.

కృష్ణ నిద్ర పోలేదు..

“ఆ.. బాపూ!!” దుప్పటి తీసి చూసిండు.

“ఏమైంది బిడ్డా!! నెత్తినొప్పి అన్నావట.. అలిసి పోయినవా?”

ఏమీ మాట్లాడలేదు కృష్ణ.

అంటే తలనొప్పి కాదు.. ఏంటి మరి..?

రామభద్రయ్యకు తొలి సంతానం కృష్ణ.. ఆ తరువాత ఏడుగురు పిల్లలు.

ఇద్దరాడపిల్లల పెళ్లిల్లు చేసారు.. ఇంకా ఇద్దరాడపిల్లలు ముగ్గురు మొగపిల్లలు ఉన్నారు.

తల్లి, భర్తను కోల్పోయిన అక్క రమణమ్మ కూడా ఈయనతో ఉంటారు. అక్క అంటే రామభద్రయ్య కు చాలా గౌరవం.. ఇష్టం కూడా.. ఆమె కూడా తమ్ముని పిల్లలను తన పిల్లల్లా చూసుకుంటుంది.

***

“ఏమైంది రా!! చెపితే కదా తెలిసేది..” అన్నాడు రామభద్రయ్య ఏదో చెప్పడానికి సంశయిస్తున్న కొడుకును చూసి.

“బాపూ!! పెళ్లి సంబంధాలు చూడకండి నాకు..”

“ఎందుకు.. మొన్న వచ్చిన వాళ్లు కట్నం కూడా బాగా ఇస్తామన్నారు.. పిల్ల చదువుకున్నది..”

“వద్దు బాపూ!! కట్నం తీసుకోవడం నాకు ఇష్టం లేదు..”

“సరే!! తీసుకోవద్దు.. దానికోసం పెళ్లి ఎందుకు మానుకోవడం..”

కృష్ణ మౌనంగా ఉండిపోయాడు.

“సరే అయితే.. కట్నం వద్దు లాంఛనాలొద్దు.. పెళ్లి చేసివ్వండి అని ఉత్తరం రాస్తాను మరి..”

“బాపూ!!!” అని కంగారుగా పిలిచాడు కృష్ణ.

“ఏందిరా చెప్పు..”

నేను మామయ్య వాళ్ల మరదలు కూతురు రుక్మిణిని ఇష్టపడుతున్నాను.. పెళ్లి చేసుకుంటానని వాళ్ల నాన్నకు మాటిచ్చాను.. పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. లేకుంటే..” అని తలొంచుకుని నిలబడ్డాడు కృష్ణ.

రామభద్రయ్య ఏమీ మాట్లాడక “ముందు అన్నం తిందువు రా!! తర్వాత మాట్లాడుదాము” అన్నాడు.

తినే దగ్గర రామభద్రయ్య చాలా ఖచ్చితంగా ఉంటాడు. అన్నం మీద అలగడం, తిరస్కరించడం చేస్తే.. అసలు అంగీకరించడు.

కృష్ణ మారు మాట్లడకుండా వచ్చి కూర్చుని తిన్నట్టు చేసినాడు.

మనుసులో భయంగానే ఉంది, తండ్రి తన మాట కాదనడనే నమ్మకం ఉంది.

***

రెండు గంటల తర్వాత.. మధ్యాహ్నం నిద్ర లేచి.. “కిట్టూ!!” అని పిలిచాడు రామభద్రయ్య.

ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న కృష్ణ పరిగెత్తినట్టు వచ్చాడు.. అత్త రమణమ్మ కూడా ఉన్నది.. గుండెల్లో రాయి పడ్డది కృష్ణకి.

రమణమ్మ ఎంత ప్రేమగా చూస్తుందో కొన్ని విషయాల్లో అంత కఠినంగా కూడా ఉంటుంది.

“అక్కా!! విన్నావు కదా!! ఏం చేయమంటావు?”

అత్త కళ్లలోకి ఒకసారి చూసి తలదించుకొని నిలబడ్డాడు కృష్ణ..

“కిట్టూ!! నీవు ఇంటికి పెద్దోడివి. ఈ వంశానికి ఈ తరానికి తొలి సంతానానివి.. మీ నాన్న పట్వారీ పని చేసి నిన్ను డాక్టర్ చదువు సదివించడంలో ఎన్ని కష్టాలు పడ్డడో ఎన్ని అవమానాలు సయించిన్రో నీకు తెలుసు. నీవు మా అందరి కంటెలుగువి, మా పంచప్రాణానివి.. నీ మీద ఆధారపడి ఉంది ఈ సంసారం. ఆ పిల్ల కన్నడం, మనం తెలుగు.. మరి బాస రాక అందరం కష్టపడతం కాదా?”

“అమ్మ కన్నడనే కదా!!” అని గబుక్కున నాలుక కర్చుకున్నాడు.

రామభద్రయ్య చిన్నగా నవ్వి.. “మీ అమ్మ తొమ్మిదేళ్ల పిల్లగ ఇక్కడికొచ్చింది.. సరే ఆ విషయం వదిలేయి.. నీవు నిర్ణయించుకున్నావని అర్థమైంది.. నీ తరువాత ఉన్న పిల్లలను చూసుకునే బాధ్యత నీదే అని నీకు తెలుసు.. ఆ పిల్లకు తెలుసా మరి..”

“చెప్పిన.. వాళ్ల నాన్నతో మాట్లాడిన.. పాపం ఆయనకు ఇంటినిండ ఎదిగిన ఆడపిల్లలు. ఈ అమ్మాయి పదకొండో తరగతి వరకు చదువుకొని చిన్న ఉద్యోగం చేస్తూ తండ్రికి సహాయం చేస్తుంది. కష్టం తెలిసిన అమ్మాయి. మన ఇంటి పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటుంది బాపూ!! నన్ను నమ్మండి..”

రమణమ్మ రామభద్రయ్య ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు.

“నేను చెప్పిన కదా రాముడూ! నా కిట్టూ మనలను నిరాస చెయ్యడులేరా.. వాడికి నచ్చినట్టే చేద్దాము” అన్నది రమణమ్మ.

“సరే అక్కా.. అమ్మకు కూడా చెప్పు..”

“సరే రా!” అని లేచి వెళ్లిపోయింది రమణమ్మ.

“సరే కిట్టూ!! నేను మీ మామయ్యకు ఉత్తరం రాస్తాను, వాళ్లతో మాట్లాడి ఇక్కడికి తీసుకురమ్మని” అన్నాడు రామభద్రయ్య.

కృష్ణ కళ్లలో ఆనందపు వెలుగులు విరజిమ్మాయి.

వంటింట్లో తలుపు చాటు నుండి ఇదంతా వింటున్న సీతమ్మ ఆనందానికి అంతు లేదు.

రామభద్రయ్య బయటకు వెళ్లగానే తను లోపలికి వచ్చి కృష్ణ చేతులను గట్టిగా పట్టుకొని “ఎంత ముచ్చటజెప్పినవ్ రా” అని చేతులు కృష్ణ ముఖం చుట్టూ తిప్పి మెలికలు ఇరిచింది!!

“అమ్మా నన్ను మన్నించే.. నీకు ముందు చెప్పలేదు.. అసలు నాన్న అత్త ఏమంటారో అని భయపడ్డాను”

“యెహే అట్లంటవేంది. వాళ్లు పెద్దోళ్లు. వాళ్ల  అనుమతి ముందు గావాలె.. మీ బాపు ఒప్పుకున్నారు.. నీకు నచ్చిన పిల్ల నాకు కోడలుగా వస్తే అంతకన్నా నాకేం గావాలెరా” కళ్లలో ఆనంద బాష్పాలు రాలుతుండగా అన్నది సీతమ్మ.

మూడు నెలల్లో తిరుపతిలో నిరాడంబరంగా రుక్మిణీ కృష్ణల కల్యాణం జరిగింది.

సీతమ్మ కోడలిని ఎంతో ఆదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది. ఒకే భాష కావడంతో అత్తాకోడళ్లు తొందరగాకలిసి పోయారు. అత్తను అత్తా అని పిలవక అమ్మా అని పిలవడం చూసి ఊరిలో వారు చుట్టాలు అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు.

రుక్మిణి పై చదువులు చదుకోవడానికి రామభద్రయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. “మన పిల్లలలో ఆ పిల్ల.. చదుకుంటా అంటే అభ్యంతరం ఏముంది?” అన్నాడు.

ఇద్దరు కలిసి తర్వాతి ఐదుగురు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించారు.

రుక్మిణి మరదళ్ల మరుదుల బాగోగులు చూసుకుంటూనే తన చదువు కొనసాగించింది.

తెలుగు చక్కగా మాట్లాడడం చదవడం రాయడం నేర్చుకున్నది.

పిల్లందరి పెళ్లిళ్లు పురుళ్లు చేయడంలో రామభద్రయ్యకు ఇద్దరు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నారు.

పదిమందికి ఆదర్శంగా నిలిచారు. తల్లితండ్రులకు చివరిదాకా సేవ చేసారు.

వైద్యులుగా ఇద్దరు కలిసి ఎందరినో ఆదుకున్నారు

***

ఇప్పటికి దాదాపు అరవై ఏళ్లు అయింది వాళ్ల పెళ్లై. వాళ్లిద్దరూ అంత కన్నా ఎక్కువ ప్రేమతో ఉన్నారు..

పెళ్లి అనేది రెండు జీవితాలను కాదు, రెండు కుటుంబాలను కలిపే ఒక బంధం. ఒకరిపై ఒకరికి నమ్మకం, నిబద్ధత, కట్టుబాటు.., మానసికమైన విశ్వాసం ఉండడం తప్పనిసరి.

తమ ఇంటికి కలిసి జీవించడానికి తన వారినందరినీ వదిలి వచ్చిన అమ్మాయిని తల్లిలా ఆదరించే అత్తలు.. తమ బంధం భర్త ఒక్కడితో కాదు కుటుంబం మొత్తానికి ముడిపడివుందని అనుకునే కోడలు ఉండే అలనాటి ఉమ్మడి కుటుంబాలు కావాలి.

కుటుంబ సభ్యులు కూడా పిల్లల ఇష్టాన్ని గౌరవించడం ముఖ్యం.. తమ పెంపకంలో తప్పు చేయరని నమ్మకం పిల్లలపై ఉంచాలి.

పెళ్లికి ముందు ముఖ పరిచయం లేకున్నా.. తల్లితండ్రులు తమకు మంచే చేస్తారు వారికన్నీ తెలుసనే నమ్మకంతో పెళ్లిని సఫలం చేసుకున్నవారూ కోకొల్లలు. 4-5 దశాబ్దాల క్రితం జరిగిన పెళ్లిళ్లలో ఎక్కువ శాతం చక్కటి సంసారాలుగా మన్నాయి. అటువంటి జంటల పిల్లల పిల్లల పెళ్లిళ్లు జరుగుతుయిప్పుడు. పెళ్లి అంటే ఫోటోలు డెకొరేషన్‍కి ముందు ప్రాముఖ్యత ఇచ్చే రోజులు. అవగాహన లేని పెళ్లిళ్లు అర్థం లేని పంతాలు.. ప్రతీది ధనం తోని ఆడంబరం తోనూ ముడివేసుకుంటున్నది.. అలా కాకుండా ఒక పెళ్లి వంద బంధాలతో ముడివడి ఉంటుందని తెలుకుసుకున్న జంటలు పెళ్లి మీద గౌరవం నమ్మకంతో ఉంటే.. అటువంటి జంటల దాంపత్యం నిత్యనూతనమై ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here