పూచే పూల లోన-17

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తాను గోవాని తెలుసుకుందామని వస్తే, తన చుట్టూ ఏవేవో జరిగిపోతున్నాయని అనుకుంటాడు సుందర్. సమీర్ వ్యక్తిత్వంలోకి తొంగిచూసే ప్రయత్నం తాను చేయలేదని భావిస్తాడు. అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ డైరీలో ఏవో రాసుకుంటాడు. ఆ ప్రాంతానికీ, దాని చరిత్రకి ఒక చక్కని నివాళి ఇవ్వాలని తలుస్తాడు సుందర్. కొద్ది రోజుల క్రితం కృష్ణప్రసాద్ గారు చూపించిన ఓ పుష్పం తాలూకు ప్రతిబింబం సుందర్ కళ్ళముందు కదలాడుతూనే ఉంటుంది. ఓరోజు ఆయనతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. నడుసున్నవాడల్లా ఒకచోట ఆగిపోయి ఒక పువ్వును చూస్తూ ఉండిపోతారాయన. ఆ పువ్వుని స్థానికంగా దేవఖేల్మో అంటారనీ, ఆంగ్లంలో కాన్నా అంటారని చెప్పి ఆ పువ్వు గురించి, దాని గింజల ప్రయోజనాన్ని చెప్తారు. దాని గింజలు గట్టిపడ్డాకా, బుల్లెట్లలా ఉంటాయని, సిపాయి తిరుగుబాటు సందర్భంగా తమ వద్ద బుల్లెట్లు అయిపోతే, సైనికులు ఈ గింజలని బుల్లెట్లుగా వాడారని చెప్తారాయన. ఈ గింజలు కాయంబ్ అనే సంగీత వాయిద్యంలో కూడా ఉపయోగపడతాయని చెప్తారు. స్టెల్లా గురించి తలచుకున్నప్పుడల్లా, దేవఖేల్మో పుష్పం గుర్తొస్తుంది సుందర్‍కి. ఇంతలో సుందర్ ఉన్న చోట సందడి మొదలవుతుంది. కొందరు కుర్రాళ్ళు సంగీతంలో హంగామా చేస్తారు. ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] రాత్రి చాలా చేపు నిద్ర పట్టలేదు. సమీర్ నాకు అన్నీ నిజాలే చెబుతున్నాడన్న గ్యారంటీ ఏమిటి? నేను కొద్దిసేపు అలా నిలబడిపోయి ఏం చెయ్యాలో తెలియక మెల్లగా ఆ బంగళా లోంచి ఇవతలికి వచ్చేసాను. వాన ఎడతెరిపి లేకుండా కురుస్తుండగా అక్కడ వరండాలో ఉన్న ఓ కేన్ కుర్చీలో కూలబడ్డాను. దాదాపు నలభై నిముషాల తరువాత సమీర్ వచ్చాడు. నేనెక్కడున్నా అన్నట్లు చుట్టూతా చూసాడు. నేను కళ్ళు మూసుకుని కునికిపాట్లు పడుతున్నాను. ఓసారి కళ్ళు తెరిచి చూసాను. అతను అక్కడున్న స్తంభానికి ఆనుకుని సిగరెట్ ముట్టించి ఏదో ఆలోచిస్తున్నాడు. మెల్లగా లేచి దగ్గరకెళ్ళాను. ఇటు తిరిగాడు.

“వెళదామా?” అన్నాడు.

ఇదీ సమస్య. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అతని ఇల్లని ఆ ముసలివాళ్ళు చెప్పి, నమ్మించి లోపలికి తీసుకుని వచ్చి ఆ అ అమ్మాయిని పిలిపించారు. అక్కడ నేనుండటం సరికాదని ఇవతలికి వచ్చాను. ఇక్కడేదో టిఫిన్ చేసి ఇక వెళదామా అని అడిగినట్లుంది. మెల్లగా అతని వెనుక నడిచాను. కారులో కూర్చున్నాం. అది ఆ వింత ప్రదేశం లోని మలుపుల్లో సాగిపోతోంది.

“నాకేమీ అర్థం కావటం లేదు” అన్నాను.

“నాకూ అర్థం కావటం లేదు”

“మీరు ఇంట్లోంచి పారిపోయినట్లు అర్థమైంది.”

నన్ను సీరియస్‍గా చూసాడు.

“నిజమే. నేను హీరో ఎవరు? అని అడిగితే మీరు ఏం చెప్పారు?”

“తెగింపు ఉన్నవాడు అన్నాను”

“కరెక్ట్. నేను బంధాలను తెంచుకుని ఇవతలికి వచ్చేసాను. నన్ను చాలామంది చేత వెతికించారు. నేను రెవాన్‍లో ఉంటున్న ఒక మిత్రుని ఇంట్లో ఉండేవాడిని..”

“ఇల్లు ఎందుకు వదిలారు?”

“మీరు కొద్దిగా చరిత్రలోకి వెళ్ళాలి”

“చెప్పండి. ఇక్కడ అన్నీ నన్ను ఆశ్చర్యపరుస్తునే ఉన్నాయి”

“తరతరాలుగా మా ఇల్లు, మా కుటుంబం అలా ఎందుకు తయారైంది అనేది నన్ను తీవ్రంగా కలవరపెట్టింది. పోర్చుగీస్ ఇక్కడికి చాలా తీసుకొని వచ్చారు. దక్షిణ అమెరికా నుండి వాళ్లు తీసుకువచ్చిన పండ్లు, పూలు చాలా గొప్పవి. టొమాటోలు, ఆలుగడ్డలు భరతభూమివి కావు. ఈ రోజు ఇక్కడ ఏ గుడిలో చూసినా వాడే పూలు ఈ భూమివి కావు. అదలా ఉంచండి. పోర్చుగీస్ ఇన్క్విజిషన్ గురించి అందరికీ తెలుసు. టొబాకో 1604లో అక్బర్ దాకా వచ్చింది. కానీ జహంగీర్ దానిని నివారించాడు. పర్షియా, అరేబియా నుండి గుర్రాలతో పాటు దాసీజనం గోవాకి దిగేవారు. వీరిలో కన్యలను వేలం వేసేవారు. వీళ్ళల్లో కొందరు సంగీత వాద్యాలను మ్రోగించి అలరింపజేసేవారు. ఇక్కడి వ్యవహారాలు ఎక్కువగా మనకి పైరార్డ్ వ్రాసిన చరిత్రలో తెలుస్తుంది. ఈ ప్రాంతంలోని స్త్రీలను చాలా హీనంగా వర్ణించాడు. ఏ మాత్రం అవకాశం దొరికినా శృంగారానికి వెనక్కి తగ్గరన్నాడు. భర్తలకు మందు తినిపించి పరుండబెట్టి ఇంట్లో పనిచేసేవారితో విచ్చలవిడిగా క్రీడించారని చెప్పాడు. డచ్, ఇంగ్లీష్ వారి ఆగమనం ఎక్కువవుతున్నప్పటి నుంచీ పోర్చుగీస్ వారి వ్యాపారం, సముద్రం మీద వారి పెత్తనం తగ్గుతూ వచ్చింది. కానీ ఆ సమయంలోనే ఇక్కడ వైస్రాయ్ హోదాలో పని చేయాలని ఉవ్విళ్ళూరేవారు. దానికి ప్రధాన కారణం – ఈ విలాసవంతమైన జీవన విధానం. ఒక విధంగా చెప్పాలంటే ఒక జాతిని పూర్తిగా డ్రగ్స్ తోనూ, ఇతర హీనమైన అలవాట్ల తోనూ పలువురూ చిన్న చూపు చూసేలా తయారు చేసారు పోర్చుగీస్ వాళ్ళు. దాని పర్యవసానం తరతరాలుగా పేరుకొనిపోయిన ఈ ఒరవడి.”

“కాలం అక్కడి నుండి కరిగిపోయి చాలా కాలం అయింది. అదే ఎందుకు మిగిలిపోయిందనుకోవాలి?”

“స్త్రీల సౌశీల్యం చెడిపోయిన ఏ జాతీ శతాబ్దాల కాలం కరిగిపోయినా ఒక పట్టాన కోలుకుని సరైన విధనంలో గర్వంగా బ్రతకటం చరిత్రలో లేదు. ఒక పంథా ప్రకారం ప్రస్తుతం ఉన్న హైందవ సమాజాన్ని ఇదే ప్రక్రియలో కంకణం కట్టుకుని చెడగొడుతున్నారు చాలామంది. ఆ కుళ్ళుకు తోడై మనవాళ్ళే లోపలి నుండి కుళ్ళదీస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి”

ఆలోచించే పనే పెట్టాడు సమీర్! దూరంగా ఎందుకో ఇంత సూటిగా నిజాన్ని చెప్పినందుకు ఓ మెరుపు మెరిసింది. అప్పుడూ వ్యాపారమే, ఇప్పుడూ వ్యాపారమే! భారతజాతి ఏం నేర్చుకుంది? గోవాలో శతాబ్దాల క్రితం జరిగింది ఇప్పుడు యావత్ భారతదేశంలో జరుగుతున్నది. ఒక దేశం యొక్క అస్తిత్వం, దాని సంస్కృతి వ్యాపారంలో భాగమవటం ఎంత దుష్పరిణామాలకు దారి తీయగలదో ఎవరైనా ఆలోచిస్తున్నారా?

సమీర్‍లో ఒక బాధ అనుకున్నాను. అది విశేషమైనది అని అర్థమవుతోంది!

“మీ తండ్రి అంత గొప్పవారైనప్పుడు మిమ్మల్ని కనుక్కోలేకపోయారా?”

“నేనున్నది రెవాన్‍లో. మీకు అప్పుడు చూపించిన ప్రాంతం. మీరు నమ్మలేరు కానీ అది మహిమాన్వితమైనది! అంతే కాదు, నాకు తోడుగా ఉన్నవారు సామాన్యులు కారు.”

“ఇల్లు వదిలి ఏమి సాధిద్దామనుకున్నారు?”

“ఇల్లు వదలటమే”

“అంటే?”

“ఈ ప్రక్రియకు నాకు మధ్య గీత గీయటం సామాన్యమైన విషయం కాదు”

కారు ఆపాడు సమీర్. దూరంగా కుశావతి నది అలా తళతళా మెరుస్తోంది. అక్కడున్న గట్టు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించాడు.

“నేను దొరకకపొతే, లేదా చేతికి చిక్కకపోతే నన్ను చంపించే ఆలోచన కూడా ఆయనకు లేకపోలేదు.. ఏంటి? నమ్మలేరా?”

నేను ఎందుకో చిరునవ్వు నవ్వాను.

“మాస్టారూ, ఇక్కడ రెండు సమస్యలుంటాయి. మొదటిది మగాడు తనకు తాను మహారాజు అనుకున్నప్పుడు ఎవరినీ ఎదురు తిరగనీయడు. రెండు, తన సంతతిలో తానుంటాడని తెలుసు. మరొకడు ఆ సంతానాన్ని వాడుకోకూడదనే ఒక తీవ్రమైన పట్టుదలతో ఉంటాడు.”

“కన్న కొడుకు మీద వాత్సల్యం..”

చెయ్యి అడ్డు పెట్టాడు సమీర్.

“ఒక ఆడా, ఒక మగ కలిసి ఒక గూడు కట్టుకుని మరొకరికి జన్మ నిచ్చిన చోట ఒక అందమైన ప్రపంచం, ఒక కుటుంబం, ఒక అనురాగం గట్టిగా ఉంటాయి. సంతాన ప్రాప్తి కోసం శృంగారం కాకుండా తామసికపరమైన సంతృప్తి కోసం జీవించేటప్పుడు అందులో భాగంగా సంతానం కలిగింది కానీ మరో విధంగా కాదు..”

“ఒక సినిమా హీరో ఇన్ని బరువైన మాటలు చెప్పగలడని నాకు తెలియదు”

నవ్వాడు సమీర్.

“సార్, నేను పుస్తకాలనూ చదివాను, జీవితాన్నీ చదివాను. నా పరిస్థితులను ఛాలెంజ్ చేసాను. రండి..” అంటూ కారెక్కించాడు.

చీకటి పడింది. మంగేశీ దాటేసాం. దాదాపు రాత్రి పదకొండు గంటలకి ఏదో ఊళ్ళోకి వెళ్లినట్లనిపించింది. రోడ్డుకు ఆవలి ప్రక్క చాలా పాతవి – కొన్నిళ్ళున్నాయి.

“రండి”, అన్నాడు డోర్ తీసి.

కారు దిగి అతన్ని అనుసరించాను. అక్కడ టీ కోసం ఆపాడు అనుకున్నాను. కానీ అక్కడ అటువంటిదేమీ లేదు. వీధి దీపాల కాంతిలో అక్కడ ఓ కారు షెడ్డు లాంటిది కనిపిస్తోంది. పూర్తిగా పాడైపోయిన కార్లు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరెవరో అక్కడ కూర్చుని తాగే పారేసిన బాటిల్స్ కనిపిస్తున్నాయి.

“ఏంటిది?” అడిగాను.

“నా రెండో జన్మను ఇక్కడే పొందాను”

“అంటే?”

ఒక గోడ దగ్గరకెళ్ళి ఆలోచిస్తున్నాడు సమీర్. ఓ సిగరెట్ తీసి ముట్టించాడు. తన కుడి కాలు పైకెత్తి వెనుకనున్న గోడకి ఆన్చాడు.

“సరిగ్గా ఇక్కడా, ఈ పరిస్థితిలోనే ఇరుక్కున్నాను. నన్ను దుండగులు వెంబడించి, వెంబడించి ఇక్కడ ఆగినప్పుడు చుట్టుముట్టారు. వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నప్పటికీ నన్ను కేవలం కాళ్ళతో తన్నటం, చేతులతో గుద్దడమే చేస్తున్నారు. గొంతు ఎండిపోతోంది. కళ్ళ ముందు ఒకరు బదులు ఇద్దరు కనిపిస్తున్నారు..

ఒక్కో దెబ్బ తగులుతున్నప్పుడు లోపలి పేగులు తెగిపోతున్నట్లున్నాయి. కొట్టీ కొట్టీ వాళ్ళు నా కళ్లని చూస్తున్నారు. అవి కొద్దిసేపు మూసి ఉంటున్నాయి, అప్పుడప్పుడు తెరుచుకుంటున్నాయి. వాళ్ళు నా చొక్కా చించేసారు.

‘చచ్చిపోతావా?’ అడిగాడు ఆ కొడుతున్నవాడు. నా నోట్లోంచి శబ్దం రానీయలేదు నేను. దింపుడు కళ్ళలోంచి చూస్తున్నాను.

‘హీరోవా’, అరిచాడు. లోలోన అనుకున్నాను.. ‘అవును, హీరోనే!’

‘మరి తిరిగి కొట్టవేం?’

‘..’

దారుణంగా చెంప పగలగొట్టాడు నన్ను.

అటు తిరిగాడు.

‘వీడేంట్రా?..’ ఎవరితోనే అంటున్నాడు.. ‘..సౌండ్ చెయ్యడు. ఇలాగే కొడితే పోతాడు’.

‘ఈడ్చుకుని పోదాం ఇంటికి’

వాడు నన్ను తమాషాగా చూశాడు.

‘నువ్వు దొరికిపోయావు, పద’

నేను కదలలేదు. మోకాలితో తన్నాడు. అక్కడ చేతులతో గట్టిగా పట్టుకున్నాను. ఇద్దరొచ్చి రెండు చేతూలూ అటూ ఇటూ లాగి పట్టుకున్నారు. వాడు నా కళ్ళల్లోకి చూసాడు. ఏదో అర్థం కాని ఆలోచన అతనిలో కలుగుతున్నట్లయింది.

..నేను హీరోనే, అనుకున్నాను. నాకేం కాదు. నేను మరో సృష్టి చేయటానికి బ్రతికి ఉంటాను. నాకేం కాదు..

‘ఇంకో దెబ్బకి పోతాడు, వదిలెయ్’ అంటున్నాడు ఎవడో.

‘నిజమే, కానీ వీడిలో ఏదో ఉంది. ఒక్కసారి అమ్మా, అయ్యా అనే శబ్దం కుడా చెయ్యటం లేదు’

‘నిజమే’

‘అదీ సంగతి. కనీసం ఆ ఊ అని ములిగినా వదిలేస్తాను. వీడు అదీ చెయ్యటం లేదు.’

భయంకరమైన గుద్దు గుద్దాడు.

నేను హీరోని.. అనుకున్నాను! ఒక్క మూలుగు కూడా నాలోంచి రానీయలేదు.

రోడ్డు మీద ఓ బండి మమ్మల్ని దాటి వెళ్లిపోయింది.

‘నువ్వు బాధపడవా?’ మెల్లగా అడిగాడు. నేను మాట్లాడలేదు. బాధపడటం, భయపడటం నాకు తెలియదు! అలా ముందరికి వెళ్ళిపోయిన బండి వెనక్కి వచ్చింది. అందులోంచి భీకరమైన ఆకారం గల ఒక మనిషి దిగి ఇటు వస్తున్నాడు. వీళ్ళు నా చేతులు వదిలేసారు.

‘వీరమణిరా..’, భయంగా అన్నాడొకడు!”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here