[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
~
VII. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో భాషాపరమైన నవ్యత
[dropcap]“భా[/dropcap]ష యనగా శబ్దరూపమై భాషించుటకు సాధనమైనది” అన్నారు సుప్రసిద్ధ నైఘంటుకులు బహుజనపల్లి సీతారామాచార్యులు. “సమాజంలో ఒకరి భావాలు మరొకరికి తెలియటానికి వీలుగా ఏర్పడిన ధ్వని సంకేతాల నియత నిర్మాణం – భాష!” అంటారు పోరంకి దక్షిణామూర్తి. దీన్నే మరో రకంగా “భాషలు ప్రపంచ సృష్టికి వెంబడిన నానావిధజన సమాజ సంకేతితములై యేర్పడినవి. అవి తొలుదొల్త కేవలము దోష యుక్తములై, యల్పములై వ్యవహార మాత్రోపయుక్తములై యుండి, యవల క్రమక్రమంబున వృద్ధి బొంది, ఋషి ప్రభృతులచే పరిష్కృతంబులై కావ్య రచనలకును నుపయుక్తములయినట్లు తెలియబడుచున్నది. మొదట నేనేనియు సామాన్య రూపముగా నేర్పడి, మీద మీద నది యుక్త విశేషముచే జక్కబడుచు వచ్చును” అని విపులంగా వివరించారు బహుజనపల్లివారు.
దీన్ని బట్టి భాష రెండు విధాలుగా ఉంటుందని తెలుస్తోంది. ఒకటి గ్రాంథిక భాష లేక కావ్య భాష, రెండవది వ్యవహార భాష. వీటిలో వ్యవహార భాష ముందు పుట్టి పండితుల పరిణత పరిష్కరణం వల్ల గ్రాంథిక భాష ఏర్పడుతుందన్నది సుస్పష్టం. అందుకే గ్రంథస్థ యోగ్యమైన భాష గ్రాంథిక భాషయని గౌరవిస్తూ, వ్యవహారంలో ఉన్న భాష అల్పమైనదన్న భావన మన ప్రాచీన పండితులకు ఉండేది. కానీ, 20వ శతాబ్ది ప్రారంభంలో తెలుగు భాషా క్షేత్రంలో వ్యవహార భాషోద్యమం తలెత్తి పండితులను రెండు వర్గాలుగా చీల్చింది. గ్రాంథిక భాషావాదులకు, వ్యవహార భాషావాదులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అయితే అంతకుముందే 19వ శతాబ్దిలోనే చాలా మంది కవులు వ్యవహార భాషా శబ్దాలను, అన్యదేశ్యాలను తమ కావ్యాలలో ప్రయోగించి భాషాపరమైన నవ్యతను సాధించారు. సందర్భానుసారం వ్యవహార భాషా శైలిని, వృత్తి ఉద్యోగాల పరిభాషను ప్రయోగించి, వాటికి కావ్య గౌరవాన్ని కల్పించి తెలుగు కావ్య భాషకు నూతనత్వాన్ని సంతరించారు కొందరు 19వ శతాబ్ది కవులు. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని ఆ భాషా పరమైన నవ్యతను ఈ అధ్యాయంలో సోదాహరణంగా పరిశీలిద్దాం.
అసలు తెలుగు భాషలో అన్యదేశ్యాలు, ముఖ్యంగా పారశీక, ఉర్దూ శబ్దాలు ప్రాచీన కాలం నుండే అడపాదడపా వచ్చి చేరుతూనే ఉన్నాయి.
“అదె ఘృత తండుల ప్రకర మల్లవె చీరలు భూషణాది సం
పదలవె రాజు రాక కులుపా యొనరించిన యట్లు మీరెడిన్”
అన్న పద్యంలో పింగళి సూరన ‘ఉలుపా’ (ఉల్పా – పారశీకంలో బహుమానం) అన్న శబ్దాన్ని ప్రయోగించాడు.
“ఖుసి మీరన్ సురధాణి నిండు కొలువై కూర్చున్నచో” అన్న పద్యంలో శ్రీనాథుడు ‘ఖుసి’ (ఖుషీ – ఉరుదూలో సంతోషం) అన్న శబ్దాన్ని ప్రయోగించాడు.
“శ్రీవల్లభు గతి చేరని పదవులు,
దావతులు – కపట ధర్మములు”
అని తొలివాగ్గేయకారుడు అన్నమయ్య ఒక కీర్తనలో ‘దావతులు’ (దావత్ – ఉర్దూలో విందు) అన్న శబ్దాన్ని ప్రయోగించాడు.
“తిరుమలకును బోవ తురక దాసరి గాడు” అంటూ ‘తురక’ (పారశీకంలో మహమ్మదీయుడు) అన్న శబ్దాన్ని ప్రయోగించాడు వేమన.
అయితే ఇలా ఒకటి, అర శబ్దాలను అక్కడక్కడా ప్రయోగించడం పెద్ద విశేషమేమీ కాదు. 19వ శతాబ్దిలో కొందరు కవులు తెలుగు, ఉరుదూ భాషలను కలగలిపి ఒక మిశ్రభాషగా వాడుతూ మణి ప్రవాళ శైలిలో పద్యాలు రచించి నవ్యతను చూపారు. ఈ మణి ప్రవాళ శైలికి పాల్కురికి సోమనాథుడు ప్రారంభకుడయితే, ‘ఆముక్త మాల్యద’లో శ్రీకృష్ణదేవరాయలు –
“ఆ నిష్ఠానిధి గేహ సీమ నడురే యాలించిన త్రోయు నెం
తే నాగేంద్ర శయాను పుణ్య కథలుం దివ్య ప్రబంధాను సం
ధాన ధ్వానము, ‘నాస్తి శాక బహుతా, నా స్తుష్ణతా, నాస్త్యపూ
పో, నాస్త్యోదన సౌష్టవం చ కృపయా భోక్తవ్య’ మన్మాటలున్”
అన్న పద్యంలో సంస్కృతాంధ్రాలను మణి ప్రవాళరీతిలో ప్రయోగించడం సాహితీ వేత్తలకు విదితమే. అయితే 19వ శతాబ్దిలో మొట్ట మొదటిసారిగా ఉరుదూ, తెలుగు భాషలను మణి ప్రవాళ శైలిలో ప్రయోగించిన ఘనత శ్రీమత్తిరుమల వేదాంతము శ్రీనివాస దీక్షితయ్యరు, బెండా పెంటయ కవి, శిష్టు కృష్ణమూర్తి, దిట్టకవి నారాయణ కవి మొదలైన వారికి దక్కుతుంది.
క్రీ.శ. 1860లో శ్రీమత్తిరుమల వేదాంతము శ్రీనివాస దీక్షితయ్యరు రచించిన ‘రంగ శతకము’లోని రెండు పద్యాలను మచ్చుకు పరిశీలిద్దాం.
“సైరే శ్రీరంగ జమీం
దారు బరాబర్ నవాబు తాఖతువర్ పా
చ్చారే బహుదుర్ ఖాబు స
వారు సలామనిరి తురక వారలు రంగా!”
~
“తీరు కమాన్దాస్తా తర
వారు జమాయించి కట్టి బలమా తరహా
దారీ ఠాంగన్ విూదన్
స్వారి వెడల నిన్ను గంటి సామి రంగా!”
కవి కంద పద్యాలలో ఉర్దూ, తెలుగు భాషలను మిశ్రభాషగా ప్రయోగించిన తీరు నిజంగా ప్రశంసనీయం. ముఖ్యంగా రెండవ పద్యంలో ‘జమాకే బాంద్‍కే’ అన్న అర్థాన్ని ఇచ్చే విధంగా – ‘జమాయించి కట్టి’ అని తెలుగు చేసిన విధానం ఎంతో ముచ్చట గొలుపుతుంది. ఇప్పటికీ ఈ పలుకుబడి తెలంగాణంలో విస్తృతంగా వినిపిస్తూ ఉంటుంది.
19వ శతాబ్ది ఉత్తరార్థంలో రాజమండ్రి పట్టణంలో తాలూకా పోలీసు స్టేషన్‍లో రైటరుగా పని చేసిన బెండా పెంటయ్య కవి ఆత్మ సంబుద్ధిగా 108 పద్యాలతో ‘పెంట శతకము’ రచించాడు. అందులోని ఒక పద్యం –
“దిల్సే జానో తేరా
అల్లాయన నెచటనుండు – కల్లరి భువిలో
కల్లుడిగిన తానిల్చిన
బాలుడు బ్రహ్మానుభవుడు – బస్‌కరొ పెంటా!”
కవి ఈ పద్యంలో ప్రాస నియమాన్ని తన కిష్టమైన రీతిలో వెసులుబాటుగా సడలించుకొన్నా, ఈయనకు ఉర్దూ భాషలో మంచి ప్రావీణ్యమున్నట్టు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పుట్టి, రాజమండ్రిలో నివసించిన ఈ కవికి ఇంతటి ఉర్దూ ప్రావీణ్యం ఉద్యోగ ధర్మం వల్లే అబ్బి ఉంటుంది. దీనిని బట్టి, 19వ శతాబ్ది ఉత్తరార్థంలో బ్రిటిష్ పాలన ఆంధ్ర ప్రాంతంలో సుస్థిరమైనా, ఇంకా క్రింది స్థాయి ఉద్యోగులలో అంతకుముందు నిజాము పాలన ప్రభావం మిగిలి ఉందని రూఢి అవుతుంది. పద్యంలో ప్రథమ పాదంలో ‘దిల్సే జానో తేరా’, ఇంకా చివరి పాదంలో ‘బస్‍కరొ’ అన్న ఉర్దూ వాక్యాలను పొందుపరిచిన తీరును మెచ్చుకోవలసిందే!
పందొమ్మిదో శతాబ్ది పండిత కవులలో ప్రసిద్ధులైన శిష్టు కృష్ణమూర్తి (ఆంధ్ర తులసీ రామాయణ కర్తలలో ఒకరు) కాకర్లపూడి జమీందారుపై ఒక ఉత్పల మాలికను రచించి అందులో పుష్కలంగా పారశీక పదాలను గుప్పించారు. అంతే కాదు ఆ పదాలతో అద్భుతమైన అనుప్రాసను కల్పించి, మనోహరమైన నవ్యతను సాధించాడు. అన్య దేశ్యాల ప్రయోగమే వింతగా భావించే రోజులలో ఆ పదాలతో అనుప్రాస సౌందర్యాన్ని సృజించడం బహుధా ప్రశంసాపాత్రం.
“వీరు తెనుంగు సాము లరబీత రబీయతు నొప్పు గొప్ప స
ర్కారు వలే జమీలు దరఖాస్తుగ నేలిన రాజమాన్య హం
వీరులు ఢక్కణేలు తజవీజు కులహికులన్న యేటి మం
జూరు జొహారు యాఖిద మషూరు ఖరారు మదారు బారు బ
ర్దారు మిఠార్గురాల పరదారుల ఠౌరు కడాని తేరులం
బారు మిఠారు నౌబతు సుమారు పుకారును మీరు కుడ్తినీ
దారు పఠాణి బారు దళదారు సవారు షికారులందు బి
ల్కూరు సతాస వారు పిలగోల తుపాకుల ఫైరులందు లే
ఖ్యారుగ బెక్కుమారులు తయారుగ వీరి హుజూరులందు వె
య్యారులు పెద్ద పేరుల జొహారులు చూచి హమీరు లెంచి ద
ర్బారు పసందు మీర వహవా యని మెచ్చు నవాబు ఖాను షం
షేరు బహాదరుల్ పెర వజీరుల నూరుల మారకెన్న తా
ర్మారుగ మోది గీములు తమాము వదల్చి ముఖాములెల్ల ఫీ
ర్ఫారొనరించి మిక్కిలి మరాతబు లందరి చేరుమాలు త
ల్వారుల జేరు దారు దళవాయుల చాయల మీరు చారుకై
జారు కరారు బాకు నెలజాళు తళుక్కున బందు బస్తుగా
పోరు భుజోరు కాకరల పూడి వజీరులదేయనన్..”
ఈ మాలికలో ‘ర’ కార అనుప్రాసం ధారాపాతంగా సాగి పరుగు లెత్తిస్తుంది. కవి ఒక చోట ‘తుపాకుల ఫైరు’ అని ఆంగ్ల శబ్దాన్ని కూడా ప్రయోగించడం గమనార్హం.
వీటిన్నిటి కంటె ముందే 19వ శతాబ్ది ప్రథమ చరణంలోనే, అంటే క్రీ.శ. 1800 ప్రాంతంలోనే దిట్టకవి నారాయణకవి, బొబ్బిలి సంస్థానాధిపతి రంగారావుకు, ఫ్రెంచి దొర బుస్సీకి మధ్య జరిగిన యుద్ధాన్ని ‘రంగరాయ కదనరంగ చరిత్రము’ అన్న కావ్యాన్ని రచించాడు. దీనికి ‘రంగరాయ చరిత్రము’ అన్న నామాంతరం కూడా ఉంది. ఇందులో కవి సందర్భనుసారం పాత్రోచితంగా, ఉర్దూ భాషను తెలుగు భాషతో రంగరించి పద్య నిర్మాణం చేసారు.
“హల్లా సేయుదు – బొబ్బిలి
కిల్లా తజ్జయము నీకు గీల్గొల్పుదు నే
కల్లాడ జుమ్మి – యిదినా
యల్లా చరణంబు లాన ! యధిపవతంసా!”
ఈ పద్యాన్ని గురించి కవిత్వవేది కల్లూరి వేంకట నారాయణ రావు ప్రశంసా పూర్వకంగా ఇలా వ్యాఖ్యానించారు –
“హల్లా సేయుట, అల్లా చరణంబులాన అను జాతీయము లీ పద్యమునకు ఎంతయు సొగసును గూర్చినవి. మిశ్రమ భాషాశైలి సందర్భశుద్ధి కలది యగుచో రస పుష్టికి దోడ్పడుచుండును. నుడికారములు భావమును పటిష్టముగ వ్యక్తీకరించుటకు దోహద మొసగును. పాత్రోచిత భాషను ప్రయోగించి కవి ఈ కావ్య శైలికి వన్నె చిన్నెలు కూర్చెను.”
ఇలాంటిదే మరొక పద్యాన్ని చూద్దాం .
“హైదరు జంగు సాహెబు రయమ్మున నిట్లనియెన్
నాదరమొప్ప బైకమునకైన విచారము లేటి కమ్మదీ
నా దరగా మొలాజిమతు నామది రంజిలు దద్రిరంస నే
కాదన రా దవశ్యము శ్రీ కాకుళ మానగ వత్తు మిత్తరిన్!”
ఇందులో మదీనా యాత్రా సంకల్పాన్ని కవి, ‘మదీనా దరగా మొలాజీమతు’గా వివరించారు.
నారాయణ కవి ఈ కావ్యంలో ఉరుదూ, పారశీక శబ్దాలే కాకుండా అనేకమైన ఫ్రెంచి శబ్దాలను వికృతం చేసి, తెలుగులో ప్రయోగించారు. ఈ పద్యాన్ని గమనించండి –
“సమరోజ్జృంభిత శౌర్యధుర్యలను సార్జంతుల్, మయూరుల్, కుముం
దములన్ వీరులు, సోలుదాదులు, సుబేదారుల్ మొదల్గల్గు సై
న్యము లాత్మీయులు గొల్వ నుద్ధతుల ముల్కాఖ్యా మహా ఖ్యాతి మ
త్సముదగ్ర ప్రతి భావి భాసియగు మూసా బూసి యుల్లాసియై!”
ఈ పద్యంలో ఫ్రెంచి శబ్దాల వికృతులను గమనిద్దాం –
సార్జంతులు: ఇది ఆంగ్లంలో ‘సార్జెంట్’ అన్న పదాన్ని ఫ్రెంచి ఉచ్ఛారణను అనుసరించి చేసిన ప్రయోగం.
మయూరులు: ఆంగ్లంలో ‘మేజర్’ అన్న శబ్దాన్ని ఫ్రెంచి వారు ‘మయోర్’ అని ఉచ్చరిస్తారు. ఆ ఉచ్ఛారణను అనుసరించి కవి తెలుగులో ‘మయూరులు’ అని ప్రయోగించారు.
కుముందములు: ఫ్రెంచి భాషలో ‘కమాండెంట్’ను ఇలా పలుకుతారు. కవి తెలుగులో అందుకే అలాగే ప్రయోగించారు.
సోలుదాదులు: ఆంగ్లంలోని ‘సోల్జర్’ అన్న శబ్దాన్ని ఫ్రెంచి భాషలో ‘సోల్డాట్’ అంటారు. దానినే ‘సోలుదాదు’ అని ప్రయోగించారు కవి.
మూసా: ఇది ‘మోన్సూర్’ అన్న ఫ్రెంచి పదానికి వికృతి. ఆంగ్లంలో ‘మిస్టర్’ లాగే ఇది ఫ్రెంచి భాషలో పురుష నామాలకు ముందు ప్రయోగిస్తారు. కవి అందుకే బుస్సీ దొరను ‘మూసా బూస్సీ’ అని ప్రయోగించారు.
ఇలా 19వ శతాబ్ది ఉషోదయ కాలంలోనే దిట్టకవి నారాయణకవి పాశ్చాత్య భాషా శబ్దాలను తెలుగు పద్యాలలో ప్రయోగించి నవ్యతను సాధించారు.
ఆ తరువాత ఒకటి రెండు దశాబ్దాల పిదప, అంటే క్రీ. శ. 1810-1820 ప్రాంతంలో చట్రాతి లక్ష్మీ నరసు అనే కవి – విజయ నగర సంస్థానానికి, ఈస్టిండియా కంపెనీ వారికి జరిగిన పద్మనాభ యుద్ధాన్ని ‘విజయ రామ యశోభూషణము’ పేర కావ్యంగా మలచారు. కవి దీనిలో ‘కుంఫిణీ’ (కంపెనీ), ‘సోలు దాదులు’ (సోల్జర్లు); ‘ఆప్సరులు’ (ఆఫీసర్లు); ‘కుముందాను’ (కమాండెంట్); ‘కెప్తాను’ (క్యాప్టెన్), ‘కర్నేలు’ (కల్నల్); ‘మేస్తరు కల్కటేరి’ (మిష్టర్ కలెక్టర్); ‘ఇంగిలీజు’ (ఇంగ్లీష్); ‘పిస్తోలు’ (పిస్టల్); ‘కంసలేరి’ (కౌన్సిల్); ‘రశీదు’ (రిసీట్); వంటి ఎన్నో ఆంగ్ల శబ్దాలను ప్రయోగించారు.
వరుసలో నిల్చోవడాన్ని మనం వ్యవహారంలో ఆంగ్లభాషా ప్రభావంతో ‘లైన్’లో నిల్చోవడం అంటాం. లక్ష్మీనరసు కవి ఈ పదాన్ని అలాగే ‘లయను’ అని ప్రయోగించారీ పద్యంలో –
“త్వర పడకు డనుచు ధరణీ
శ్వరు డానతి యిచ్చునంత జాతి పటాలం
రుచి నిలిచె తంబుర
మొరయింపుచు ‘లయను’ దీర్చి ముంగల నంతన్”
తుపాకీని ప్రేల్చడాన్ని ‘ఫైరింగ్’ అంటాం. కవి ఆ పదాన్ని ఆంగ్లంలో యథాతథంగా అలాగే ప్రయోగించారీ కావ్యంలో-
“కాంచి మరీ యూరుకుండుట కాని మాట –
గుండు మోమీనుగా వచ్చె కుంపిణీలు
తొలి ‘ఫయరు’ వారు జేసిన గెలువ యంచు
నూహ సేయుచు జాగ్రత్త నున్న యంత-”
ఇక్కడ ‘ఫయరు’ అన్న ఆంగ్ల శబ్దాన్ని యథాతథంగా ప్రయోగించడం ఎంతో సముచితంగా ఉంది. దానికి తెలుగు అనువాదంగా ‘నిప్పు’, ‘అగ్ని’ లేక ‘ప్రేలుడు’ అంటూ తెలుగు పదం ప్రయోగించి ఉంటే తుపాకి ‘ఫైరింగ్’ అన్న అర్థం స్ఫురించదు కదా! అందుకే తరువాతి కవులు కూడా ఇదే స్ఫూర్తితో తమ కావ్యాలలో ఈ శబ్దాన్ని ఇలాగే యథాతథంగా ఆంగ్లంలోనే ప్రయోగించారు.
19వ శతాబ్దిలో ఇలా కేవలం ఆంగ్ల శబ్దాలను, ఆంగ్ల పద బంధాలను పద్యాలలో ఒకటి రెండు చొప్పున ప్రయోగించడమే కాకుండా, తెలుగు భాషతో కలిపి మిశ్రభాషగా రూపొందించి భాషాపరమైన నవ్యతను సాధించిన కవులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన కవి ‘చెన్నపురీ విలాసము’ కర్త – మతుకుమల్లి నృసింహ శాస్త్రి కవి. క్రీ.శ. 1860లో రచించిన ఈ యాత్రాకావ్యంలో కవి సందర్భాన్ని బట్టి చాలా ఆంగ్ల పదాలను పద్యాలలో ప్రయోగించారు. తెలుగు సాహిత్యంలో ఇంత విరివిగా ఆంగ్ల పదాలను ప్రయోగించిన తొలి కవి ఈయనే అని చెప్పవచ్చు. అంతే కాదు – నృసింహకవి ఈ కావ్యంలో కొన్ని ప్రకరణాలకు కూడా ఆంగ్లంలోనే పేర్లు పెట్టి, ఈ కావ్యాన్ని ఆ నాటికి ఒక నవ్యాతినవ్య కావ్యంగా తీర్చిదిద్దారు. ‘ఫోటోగ్రాఫీ ప్రకరణము’, ‘ఇలక్ట్రో గేల్వానిక్మిషన్ ప్రకరణము’ మొదలయినవి అందుకు ఉదాహరణలు. ‘చెన్నపురీ విలాసము’ కావ్యంలోని భాషా పరమైన నవ్యతకు ఉదాహరణగా ఒక పద్యం –
“పురికిం దక్షిణ పశ్చిమంబుల వనా భోగంబులం జూడ గౌ
ర్నరులుం, గర్నలు, సెక్రిటేరులు, కమాండర్లిక జడ్జీ ల్కల
క్టరులుం, బాదరులుం, గమాష్ణరులు, మేష్టర్లింజినీర్లాదిగా
దొరలుండందగు బంగళాలు చెలువొందు న్నూరు వేలుందగన్”
19వ శతాబ్ది మధ్యకాలంలోనే గవర్నరులను, కల్నల్లను, సెక్రటరీలను, కమాండర్లను, జడ్జీలను, కలెక్టరులను, కమీషనర్లను, మాస్టర్లను, ఇంజనీర్లను ఒక తెలుగు పద్యంలో ఇమిడ్చి భాషాపరమైన నవ్యతను చాటారు మతుకమల్లి సుకవి. క్రీ.శ. 1860 నాటి ఆంగ్ల నాగరకత మూర్తీభవించిన చెన్నై నగరాన్ని వర్ణిస్తూ, సుప్రీంకోర్టు, ఆఫీసు వంటి ఆంగ్ల శబ్దాలను ఆయన యథాతథంగా ప్రయోగించారు. అంతే కాదు – సముద్రపు రేవులో Customs ని ఉట్టంకిస్తూ – ‘సీ కష్టము’ అని ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఈ పద్యాన్ని చూడండి –
“పెను పొందున్నగరంబు తూర్పునను, సూప్రీమ్ కోర్టు నా జిన్నికో
ర్టును సీ కష్టమునా గమిస్సరియునా రూపింప నాఫీసులీ
జన లోకంబున సర్వధర్మములు సంస్థాపింప నేతెంచి ని
ల్పిన పాకారియమాంబునాథ ధన రాళ్ళీలా సభావైఖరిన్”
నగర వర్ణన లేక పుర వర్ణన అన్నది ప్రబంధాలలో ఒక అంశం. అలాంటిది, 19వ శతాబ్ది మధ్యకాలంలోనే ఆధునిక నగర వర్ణననను ప్రధాన కావ్యవస్తువుగా ఎంచుకొని ప్రబంధ నిర్మాణం చేయడమే కాకుండా, అందుకు తగినట్లుగా ఆంగ్ల భాషా శబ్దాలను ప్రయోగించి, భాషా పరమైన నవ్యతను సాధించిన మతుకు మల్లి నృసింహకవి ఎంతో అభినందనీయులు.
ఇంకా, గోపీనాథము వేంకట కవి (బ్రహ్మానంద శతకము); దాసు శ్రీరాములు కవి (చక్కట్ల దండ) మొదలైన ఎందరో 19వ శతాబ్ది కవులు తమ కావ్యాలలో సందర్భానుసారం అన్యదేశ్యాలను ప్రయోగించి నవ్యతను చూపారు. గ్రంథ విస్తరణ భీతితో వాటినన్నిటినీ వివరించడం లేదు.
ఇలా 19వ శతాబ్దిలో అన్యదేశ్యాలను తెలుగు భాషతో రంగరించి ప్రయోగించి నవ్యతను చూపిన కవులు కొందరయితే, వ్యవహార భాషాశైలికి కావ్య గౌరవాన్ని కల్పించి, పాత్రోచితంగా ఆ భాషను ప్రయోగించి నవ్యతను చాటిన కవులు కొందరున్నారు.
సుప్రసిద్ధ కవయిత్రి తరిగొండ వెంకమాంబ రచించిన ప్రసిద్ధ కావ్యం ‘వేంకటాచల మాహాత్మ్యము’లో కవయిత్రి మొట్ట మొదటిసారిగా ఈ నవ్య మార్గాన్ని త్రొక్కారు. ఈ కవయిత్రి క్రీ. శ. 1840లో జీవించి ఉన్నట్లు బ్రౌను మహాశయుడు పేర్కొన్నారు. డా. ముదిగంటి సుజాతారెడ్డి ఈమె గురించి వివరిస్తూ ఈమె బాల వితంతువని, ఆనాటి ఆచారాన్ని అనుసరించి గుండు గీయించుకోమంటే, మళ్ళీ వెంట్రుకలు మొలవవని పూచీ ఇస్తే గీయించుకొంటానని తిరుగుబాటు చేసిన మహిళగా అభివర్ణించారు.
‘వేంకటాచల మాహాత్మ్యము’లో శ్రీనివాస కల్యాణానికి ముందు శ్రీనివాసుడు కురవంజిగా (ఎరుకల సానిగా) వచ్చి ఆకాశరాజు కుమార్తె పద్మావతికి ‘ఎరుక’ చెప్పిన సన్నివేశంలో, ఎరుకల సాని పద్మావతి తల్లితో మాటాడే భాషగా, కవయిత్రి సహజమైన వ్యావహారిక భాషను వచనంలో ప్రయోగించి నవ్యతను చూపారు. ఈ చంపూ కావ్యంలోని ఆ వచనాన్ని పరిశీలిద్దాం.
“అవ్వోయవ్వ! నీ తలంచిన తలంపు మేలౌతాదంట. దేవుళ్ళు పలుకుతుండారు. తలంచిన తలంపేమంటివా? విను – ఆడ బిడ్డ కడుగుతుండావే, అవ్వోయవ్వ! ఆ యాడ బిడ్డ కొక సింత కలిగుండాది. ఆ సింత యేమంటివా? నిన్నటి దినము నీ బిడ్డ సవారేగినది. ఆడ తురగారూఢుండైన నల్లనయ్యను జూచి మోహించి యుండాది. వాడు నీ బిడ్డను బెండ్లాడ వలెనని యుండె వాని నీ బిడ్డ పెండ్లాడ నెంచి యుండాదె. కాబట్టి నీ పుత్రికను ఆ సామి కిచ్చి పెండ్లి చేసి కన్నులార సూడుము తల్లీ! సుకంగా నుంటాది. లేకుంటే కష్టాలు రాబోతుండాదె యమ్మ!”
ఈ వచనాన్ని చదువుతుంటే పఠితకు కళ్ళముందు ఎరుకల సాని ప్రత్యక్షమై సోదె చెబుతున్నట్లు అనుభూతి కలుగక మానదు. 19వ శతాబ్ది పూర్వార్థంలోనే ఒక పద్య కావ్యంలో పాత్రోచితమైన వ్యావహారిక భాషను ప్రవేశపెట్టి, నవ్యతను సాధించిన వేంకమాంబ ప్రతిభ ప్రశంసనీయం. ఆ తరువాత 70, 80 సంవత్సరాల పిదప తెలుగు సాహితీ క్షేత్రంలో వ్యవహార భాషోద్యమం తల ఎత్తిందన్న విషయం ఇక్కడ గమనార్హం.
ఈ కావ్యంలో కవయిత్రి భాషాపరంగా మరొక సరిక్రొత్త ప్రయోగం కూడా చేశారు. సాధారణంగా ఎవరైనా అప్పు తీసుకొంటున్నప్పుడు ఆ రుణం ఇచ్చేవారికి పత్రం వ్రాసి ఇవ్వడం కద్దు. ఇలాంటి రుణ పత్రాల్లో ఒక ప్రత్యేకమైన పరిభాషను వినియోగించడం ఇప్పటికీ జన వ్యవహారంలో ఉంది. సాధారణంగా ఎవరు అప్పు తీసుకొన్నా అదే పద్ధతి (Format) ని ప్రయోగించడం మనం చూస్తుంటాం. దీనినే మనం ‘ప్రామిసరీ నోటు’ అంటున్నాం. అది ఇలా ఉంటుంది –
ప్రామీసరీ నోటు :-
……………………. తేదీన ……… అను నేను ………………….. గారి నుండి ………………….. నిమిత్తము రూ.లు………………… అక్షరాల రూ.లు …………………….. అప్పుగా తీసుకొంటిని. ఇందుకొరకు ప్రతినెల రూ.లు……………….. వడ్డీ చెల్లించగలను. అసలు పైకాన్ని……… సంవత్సరాలలోపు ముట్టజెప్పగలను. ఇది నా ఇష్ట ప్రకారము స్వదస్తూరీతో వ్రాసి ఇచ్చిన పత్రము.
సాక్షులు:-
1.
2.
XXXX
(సంతకము)
కవయిత్రి ఒక పద్యకావ్యంలో ఈ రకమైన పరిభాషతో కూడిన వడ్డీ పత్రాన్ని (ప్రామిసరీ నోటును) పొందుపరచడం కించిత్తు ఆశ్చర్యాన్ని, ఎనలేని రసానందాన్ని కలిగిస్తుంది. శ్రీనివాసుడు తన వివాహపు ఖర్చుల నిమిత్తం కుబేరునివద్ద అప్పుతీసుకొంటూ వ్రాసి ఇచ్చిన ఆ వడ్డీ పత్రాన్ని రెండు పద్యాలలో చక్కగా పొందు పరచారు తరిగొండ వేంకమాంబ.
“శ్రీకరలీల స్వస్తిశ్రీ జయాభ్యుద
యాష్టాదశ ద్వాపరాంత మందు
గల కలినాది వేంకట నాయకుడు ధన –
పతి కొసంగిన వడ్డీ పత్రమెట్ల
యనిన నా వైవాహమునకు నీచే నప్పు
గొనిన టెంకీలును గోటి సంఖ్య
లలిని జతుర్దశ లక్షలందుకు వడ్డి
ప్రతి వత్సరంబును బరగనిత్తు
కలి యుగాంతమునందున గాను వీస
ముంచ కొగిదీర్చి వేయుదు; మొనసి దీని
కజుడు, శంభుడు మరియు హిమాంశు డినుడు
సాక్షులు – నిజంబు వృక్షరాజంబు సాక్షి!
~
ఇట్లునా యిష్టమున వ్రాసి ఇచ్చినట్టి
స్వకర లిఖితంబటంచును వనజ భవుడు
చదివి వినిపించి పార్వతీశ్వరుని చేత
నిచ్చి చూడుమటంచును మెచ్చజెప్పి..”
అద్భుతమైన రీతిలో ఛందోబద్ధంగా ఇమిడిన ఈ వడ్డీపత్రం 19వ శతాబ్దినాటి వడ్డీ పత్రాలకు (ప్రామిసరీనోట్లకు) ఒక నమూనాగా భావించ వచ్చు. స్త్రీ విద్య అంతగా లేని రోజులలో రసరమ్యమైన
కావ్యరచన చేయడమే కాకుండా ఇలా భాషాపరమైన నవ్యతను ప్రదర్శించిన కవయిత్రి తరిగొండ వేంకమాంబ తెలుగు జాతి గర్వించదగ్గ విదుషీమణి అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు.
19వ శతాబ్ది పూర్వార్ధంలోనే వద్దిపర్తి కోనమరాజు అనేకవి విశాఖపట్నం జిల్లా ‘సర్వసిద్ధి’ అనే గ్రామానికి కరణంగా ఉండేవారు. ఈ కవి, పోలవరం సముద్ర తీరంలో జమాబంది లెక్కలు తయారు చేసేందుకు నియోగింపబడిన కరణాల సమస్యలను పద్య రూపంలో ఒక ఉత్తరంగా రచించి, కమిటీకి అందజేస్తే, ఆ కమిటీవారు ఈ కరణాల బాధను అర్థం చేసుకొని, కొన్నాళ్ళ పాటు సెలవు మంజూరు చేశారట. ఆ పద్య కవితకు ‘కమిటీ ఉత్తరం’గా ప్రఖ్యాతి లభించింది. ఆ ‘కమిటీ ఉత్తరం’లో కోనమరాజు కవి వృత్తిపరమైన ఉర్దూ పారిభాషిక పదాలను మేళవించిన వ్యావహారిక భాషను ప్రయోగించడం విశేషం. ‘మహా లక్ష్మీ పరిణయము’, ‘జానకీ రామ శతకము’ వంటి ప్రౌఢ ప్రబంధ రీతి రచనలను సైతం చేసిన ఈ కవి అందుకు భిన్నంగా, సీసపద్యమాలికగా రచించిన ఈ ‘కమిటీ ఉత్తరం’లో ఇలా భాషా పరమైన నవ్యతను ప్రదర్శించారు. క్రీ.శ. 1834లో మృతిచెందిన ఈ కవికి గల (19వ శతాబ్ది తొలి నాళ్ళలోనే రూపుదిద్దుకొన్న) నవ్యదృష్టిని ఇది ప్రస్ఫుటం చేస్తుంది.
“బారాస్న నౌ ఫసలీని యాదస్తు
మసగణే వుప్పలం పక్కినాడ
ఫిబరేవయి తేది భిన్నవో రోజ్సరికి
కరణాల భోగట్ట కరుణ వినుడి
‘యేమయా తాతగారూ ! మీకు క్షేమమా?’
‘మామయ్య గారూ! నమస్కృతంబు!’
‘పదివేలు! పదివేలు! భావగా రోహోహో!
యిప్పుడయా మీరు?’-’యిప్పుడేవే!’
…………………………
…………………………
‘మీ బసెక్కడనయ్య?’ – ‘మాబసేటావల!
వసతి కాకర కాయ పాటమయ్య!’
జిల్లెడాకుల మేత, చీకటి చెయ్యూత –
పాలుడప్పి యజీర్తి పాలు సేత !
నొక నూత స్నానంబు, నొక నూత పానంబు
నొక చోట భోజనం బొంటి పూట
కాని కాని యిట్టి కబురుల కేమొచ్చె –
ముంద దారికి నీవు మొదలు జెప్పు!
మీ మధురా లెన్ని? మీ యెడ భూమెంత/
మీ వూరు బీడెంత? మెట్టు యెంత?
పల్లపు భూమెంత? పదునాలు గేళ్ళకు
పంటెంత? ఖరైంత? ప్రజలు యెంత?
నాగళ్ళు నాఖర్డు నాడె తడవు లెంత?
చెల్లెంత? బాకెంత? శిస్తు యెంత?
………………………………
……………………………….
మూడు ముద్దత్తులు మూటికి యేకట్ట?
దిసుక కుళుద్దాది దినుసు మెట్టు
ఝాడాదరో బస్తు సనధిల రాబడి
పంట మిరాశీల వంట రుసుము
చాకర్ల పంటయు సకలము రాబడి
గాముగా నా వసూల్ కట్టుబళ్ళు
……………………………………..
……………………………………….
పూర్వపు మాన్యముల్ తరువాత మాన్యముల్
కొన్న భూములు ప్రతిగొన్న యట్టి
ఫేరస్తు కల్గిన ఫారమాఖీఖతు
యిష్టేమెంటు కాగితము లిచ్చివార
కరువులో గడివి లెక్కలు బోయె – మా వద్ద
కరువులో లెఖ్ఖలు గానరావు
నాలుగేళ్ళవి జూడ నా దగ్గరను లేవు
కడగి ఐదేళ్ళ కాకరము లేదు
పదునాలుగేళ్ళకు వదపరచుచున్నారు
యింకా పదేళ్ళకు యిస్తునేను
ఝాము ప్రొద్దెక్కెను శాలికుడా! కచే
రీకి వస్తున్నావ? లేక మాను
తున్నావొ జెప్పుము – తుప్పు జుల్మానాకు
కాసుకు గతి లేదు – కాపు లివరు –
ఇదిగో వస్తినటంచు, అదిగో వస్తినటంచు
చంక లెఖ గదించి, సరవి నేగి
ఈ పంచ గూర్చుండ, నా పంచ గూర్చుండ
నంత లోపల రవి అస్తమింప
బిరబిర లేచి ముందర సాగు వారల
గూడి డేరా చేరి కొంత సేపు
తాటి యాకులు విప్పి తారుమారులు చేసి
దీపాల ముందర తిరగ వేశి
ఆరు యేడ్నెల్లు వీరు చీకాకు పడిరి
గాన వారల రక్షించి కరుణ జేసి
శెలవు వేగం బొసంగవె సార సాక్ష!
వినుత గౌరీశ వుపమాక వేంకటేశ!”
కవి ఇందులో అన్యదేశ్యాలతో బాటు, ‘భావగారు’, ‘యిస్తునేను’, ‘వస్తున్నావ?’, ‘ఏ మొచ్చె’, – ఇదిగో వస్తి’ వంటి వ్యావహారిక భాషా శబ్దాలను ప్రయోగించడం గమనార్హం. వద్దిపర్తి కవి ఈ పద్యాన్ని ఆశువుగా చెప్పి ఉంటాడు. అక్కడక్కడ ఛందో భంగాలున్నాయి. ఈ కవి ‘జమాబంది దండకం’ కూడా రచించినట్లు కొందరు పేర్కొంటున్నారు. అది అలభ్యం. అది నిజంగానే వేరే రచనో లేక – జమాబంది లెక్కల గురించి వ్రాసిన పై కవితనే వ్రాత ప్రతిలో పాదం విరుపులు లేకుండా చూసి, కొందరు దండకంగా భ్రమించారో?- తెలియదు. ఒక వేళ అది వేరే రచన అయినా కవి ఇలాంటి భాషనే ప్రయోగించి ఉంటారు.
19వ శతాబ్దిలో ఇలా వ్యావహారిక భాషకు కావ్య గౌరవాన్ని సంతరించిన మరొక కవి దాసు శ్రీరాములు. ఏలూరులో ఫస్టుగ్రేడు ప్లీడరుగా పని చేసిన ఈ కవి రచించిన ‘తెలుగునాడు’ కావ్యం – ప్రథమ భాగం మాత్రమే వెలువడింది. ఆపైన కవి అస్తమించడం వల్ల ఆ కావ్యం అసంపూర్ణంగా మిగిలింది. అయితే, ‘ఆంధ్ర వీధిలో బ్రాహ్మణ ప్రశంస’ అనే ఈ మొదటి భాగమే ఒక స్వతంత్ర కావ్య స్థాయిలో నిలిచి, నవ్య కిరణాలను ప్రసరించింది. కవి ఈ కావ్యంలో వ్యవహార భాషతో పాటు అక్కడక్కడ, ఒక ప్రాంతంలోని బ్రాహ్మణులు మాట్లాడే మాండలిక భాషను కూడా ప్రయోగించారు. ఒక పద్య కావ్యంలో ఇలా మాండలిక వ్యావహారిక భాషను ప్రయోగించడం నవ్యతకే పరాకాష్ఠగా భావించవచ్చు. 19వ శతాబ్దిలోనే కవి ఈ నవ్యతను సాధించి నవ్యతకే నవ్య భాష్యాన్ని పలికారని చెప్పవచ్చు. క్రీ.శ. 1892లో రచింప బడిన ఈ ‘తెలుగు నాడు’ కావ్యంలో దాసు శ్రీరాములు కవి చూపిన భాషా పరమైన నవ్యతను పరిశీలిద్దాం.
స్మార్త బ్రాహ్మణ స్త్రీలు మొట్ట మొదటిసారి రైలు బండిని చూసి మాట్లాడుకొనే సంభాషణను కవి ఎంతో హృద్యంగా, స్వాభావికంగా, సహజంగా చిత్రించారు.
“అచ్చమ్మా! యిది యేమిటే? రెయిలటే? ఆసీ యిదేనా?”
“సరే! బుచ్చమ్మా! వినలేదటే? గడియలో బోవచ్చునే కాశికిన్!”
“అచ్చో! దేహము గ్రుద్దుకోదటే?” – “అయో! ఆ సౌఖ్యమేమందునే?”
యిచ్ఛా రాజ్యమటండ్రు ట్రైను గని యెంతే వింత విప్రాంగనల్!
మరో పద్యంలో “ఈ యిసుకోలు (స్కూలు) బళ్ళకడ నింగిలిపీసులు పీసుపాసుగా గూయగ జొచ్చి —-” అంటూ, ఆనాటి కుర్రకారును స్మార్త వితంతువు ఈసడించుకొన్నట్లు వర్ణించారు శ్రీరాములు కవి.
వైదిక వృద్ధ బ్రాహ్మణుడు ఒకచేత అక్షమాలను త్రిప్పుతూ చేసే భగవన్నామ స్మరణను, మరోవైపు శిష్యునిపై ప్రయోగించే బండబూతు తిట్టును కలగలిపి మాట్లాడే భాషను ఒక పద్యంలో ఇమిడ్చిన తీరు పరమాద్భుతం.
“విడువకురా! ఉతోత ఇషవే నమరా! అది దుడ్డురా – ముడాః
కొడక !” యటన్న మాటవిని కొంకి – “ఉతోత ఇస్తే నమం”చు శి
ష్యుడు దనవెంట రా, వడకుచుం గుడిచే నొక యక్షమాల చొ
ప్పడ, నొక చేత దండమిడి బాటను వైదిక వృద్దు డేగెడిన్!”
వృద్ధ వైదిక బ్రాహ్మణుని ఉచ్చారణ – పళ్ళూడడం వల్లో, లేక పై బడ్డ వయస్సువల్లో అపభ్రంశం అయినట్టుంది – అందుకే
‘ముండా కొడక’ అన్న దూషణ “ముడాః కొడక” అయింది – అలాగే ఆ వృద్ధ వైదికుని ఉచ్చారణలో “హృశీకేశాయ నమః”నో లేక మరొకటో – “ఉతోత ఇషవే నమ” గా మారింది. ఆ వృద్ధుని ఉచ్చారణను యథాతథంగా ప్రయోగించి కవి తన వ్యంగ్య రచనా వైభవాన్ని చాటుకొన్నారు. దానికి కొంటె శిష్యుడు అలాగే “ఉతోత ఇసే నమ” అంటూ వెంటనడిచినట్లుగా వ్రాసి, కవి చక్కని హాస్యాన్ని కూడా పండించారు. ఒక పద్య కావ్యంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఆ కాలంలో ఎంత నవ్యత!
ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణులు ఆ రోజుల్లో ‘ట’ కారాన్ని ‘ష’ కారంగా పలికే వారట. ఆ ప్రత్యేక మాండలిక భాషను కవి పద్యాల్లో ప్రయోగించారు.
ఒక నియోగి బాలికను వైదిక బాలునికిచ్చి పెళ్ళి చేస్తే, ఆ నియోగి బాలిక “ఇట్టు నట్టు” అనగా, ఆ బాలిక అత్త – “అషు నిష్షు” అనుమని అభ్యాసం చేయించిందట. దాంతో ఆ కోడలు – ‘పీషష’, ‘పెష్షష’ అంటూ మాట్లాడడం మొదలు పెట్టిందట. అంతే కాదు – “పెట్టు పెట్టుమను మాటలె పల్కనటండ్రు గట్టిగన్” అనడానికి బదులు “పెష్షు పెష్షు మను మాషలె పల్కెనషండ్రు గగన్” అన్నట్లుగా కవి చమత్కరించారు. ఆ పద్య చాలనాన్ని చూద్దాం –
“వసుధ నియోగి బాలికను వైదిక బాలున కిచ్చి చేయగా
బస నది యిట్టు నట్టనిన, బా గఘు నిష్టనుమంచు నత్త య
బ్బెస మొనరింప నొక్కతరి, పీషష పెన్షష మామగారికిన్
మసలక పెష్షు పెష్షు మను మాషలె పల్కెనషండ్రు గషిగన్
మరొక పద్యంలో మరింత విస్తృతంగా వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాట్లాడుకొనే నిత్యవ్యావహారిక మాండలిక భాషను ఎలా పొందుపరిచారో గమనించండి.
“ఆస్సే – చూస్సివషే? వొషే – చెవుడషే? – అష్టాగషే! యేమిషే?
విస్సావఝ్జల వారి బుర్రినష యా విస్సాయ కిస్సారుషే?
విస్సండెంతటి వాడె? యేళ్ళు పదిషే? వెయ్యేళ్ళ కీడే షుమా!
ఓస్సే – బుర్రికి యీడషే? వొయిషుకే ముంచుందిలే! మంచి వొ
ర్బెస్సే!” యందురు శ్రోత్రియోత్తమ పద స్త్రీ లాంధ్ర దేశంబునన్!
శార్దూల విక్రీడిత ఛందంలో ఇలాంటి భాషతో నాలుగు పాదాలు నడపడమే కత్తి మీది సాములాంటిది. కాని కవి ఐదు పాదాలు నడపడం విశేషం.
ఒక చోట కవి – “వైదికు పిల్లి వ్రత్తి మేవ్ మేవనునండ్రు” అంటూ చమత్కరించారు. అయితే కవి ఈ చమత్కారాలను హేళన భావంతో చేయలేదని గమనించాలి. ఆయన ఈ మాండలిక భాషను గురించి వ్రాస్తూ –
“పావనమైన వైదికుల భాష గొరంతలు పట్టి తెల్పుటబ్బా? వినరాదుగా ! జెరకు వంకరబోయిన యంత మాత్రనే పోవునే తీపి?” అని సమర్థించారు.
మాధ్వులు (మధ్య మతస్థులు) కన్నడ భాష కలగలిసిన తెలుగుతో ఏర్పడిన మిశ్రభాషను మాట్లాడుతారని ఈ పద్యంలో వివరించిన తీరు శ్లాఘనీయం.
“మాతు గళిల్లె నమ్మ గురు రాయర మహా
మధ్వరాయ స్తోత్ర మాడు బేకు
మంత్రగళ్ హేళి నామగళు స్మరిసి హను
మద్దేవ రార్చన మాడు బేకు
మహిమ దత్రైలోక్యమాత శ్రీతులసి క
నోడి ప్రదక్షిణ మాడుబేకు
అతి భక్తి శ్రీ భాగవత కేళి నందకు
మార నమస్కార మాడు బేకు
మహిత పుణ్య నదీ తీర్థ మాడు బేకు
దూని తాంగార పుండ్రగల్ మాడు బేకు
బేకు బేకు సదా బేకు బేకు బేకు
అనుచు మాధ్వులు భాషింతు రనుదినంబు”
ఒకప్పుడు నవాబుల పాలనలో ఉండి, కన్నడ ప్రాంతం సరిహద్దుల్లో ఉన్న తెలుగు జిల్లాలలోని మాధ్వుల భాషలో కొంత ఉర్దూ కూడా కలిసి ఉండడాన్ని తెలియ జేస్తారు దాసు శ్రీరాములు కవి ఒక పద్యంలో –
“హుకుం అంపించినావా? మదార్ ఖానున్ చిత్తము వాని బంపిన పనుల్ కావచ్చు – సందేహమా? సానా బోగముదా? మహా ప్రభు ఖులాసాకేమి? యే ముండయో?” అంటూ ఉర్దూ తెలుగు మిశ్ర భాషతో సాగుతుంది ఆ పద్యం.
ఆంధ్ర దేశంలోని వైష్ణవులను వర్ణిస్తూ, వారి నిత్య వ్యవహారంలో ఉపయోగించే పదజాలాన్ని ప్రయోగించారు కవి, ఒక పద్యంలో –
“చీటికి మాటికి ‘శ్రీమతే రామాను
జాయ నమో’ యంచు జదువు సొగసు
నిరుపమ భక్తి చే ‘బెరుమాళ్ళమ ఫిరాట్టు
దిరువడిఘల్’ గొల్చి యెరగు సొగసు
సారె సారెకు ‘దిరువారాధనంబుల,
దిరువాయి మొడి’ నోట దెలుపు సొగసు
జ్ఞానుల గని ‘యడియే నడియేను దా
సోహ’ మ్మనుచు బల్కునట్టి సొగసు
పరగ ‘బన్నిద్ద రాళ్వార్ల’ బరమ భక్తి
మించి ‘తిరు మంత్ర’ మొనర ‘సాయించు సొగసు
బొగడుచో వేయి నోళ్ళకు మిగులు గొంత
వైష్ణవ బ్రాహ్మణులదె దైవ ప్రపత్తి!”
వైష్ణవ పరిభాషలో ‘తిరు’ అన్న పదంతో ఏర్పడ్డ పదబంధాలన్నింటినీ గుది గ్రుచ్చి రూపొందించిన మరో పద్యం కడు రమణీయం.
“తిరుమణి, తిరుచూర్ణ, తిరుణాళ్ళు, తిరు మంత్ర,
తిరుమాళిగయు, దిరుక్కరియ మధులు,
తిరు వీధి, తిరుగలు, తిరునామములు, తిరు
వారాధనము, తిరువాయి మొడియు,
తిరువధ్యయనమును, తిరుమంగ యాళ్వారు,
తిరువేళికయు, మరి తిరువడిఘళ్లు,
తిరుపతి, తిరుమల, తిరు వీసములు, తిరు
ప్పణ్నేరములు, తిరుప్పావు మరియు
తిరువలిక్కేణి, తిరువటూర్తిరువనంద
పురమును, తిరువళ్ళూరును, తిరు తులసియు
తిరు తిరు తిరు తిరు తిరు తిరు తిరు తిరు
దిరుగు వైష్ణవ పరిభాష – తెరవు మరుగు!”
‘తిరు తిరు తిరు’ అని తిరుగుతుంది వైష్ణవ పరిభాష – అనడం కవి చమత్కార చాతుర్యానికి తార్కాణం.
అంతే కాకుండా దాసు శ్రీరాములు కవి, బూరల శబ్దాలను, ఢంకాల మ్రోతలను, గిలక కర్రల రావాలను, శిష్యుల గురుస్తుతుల గోలను వర్ణించేందుకు ఒక సరిక్రొత్త భాషను సృష్టించి ప్రయోగించారు ఒక పద్యంలో –
“భుం భుం భురూం భురూం భుంభుమ్మటంచును
బూర గొమ్ముల వారు ముందు నడువ
ఢండండ డండడం ఢండమ్మటంచును
ఢంకాల వారొక వంక నడువ
ఖణ్నీల్ఖిణీల్ఖిణీల్ ఖిణ్నీలటంచును
గిలక కర్రల వారు కెలన నడువ
గుళు గుళుగ్గుళుగుళుగ్గులు గుళ్ళటంచును
గురు సంస్తుతుల వార లొరసి నడువ
రంజితములైన ముత్యాల పింజరీల
పైడి యడ్డల బంగారు పల్లకీల
చెలగి తిరువీధి వేంచేపు జేసికొనుచు
వచ్చు జియ్యల వారు శ్రీవైష్ణవులను”
వైష్ణవ వంటకాలకు సంబంధించిన పరిభాషను ప్రయోగిస్తూ కవి రచించిన పద్యం చదువుతుంటే చవులూరిస్తుంది సుమా!
“బారుంబూరుగ నారగింతురు వడప్పణ్నేరముల్, పూర్ణ ప
ణ్నేరంబు, ల్పుళిహూర, తైరువడ పణ్నేరంబు, దధ్యోదనం,
బారు గర్య, మధుల్కొళంబు, పురి తొహ్యా, తైరు, మోరున్మహె
దార స్వైర విహార వైభవు లుదాత్త ప్రాభవుల్ వైష్ణవుల్!”
ఇలా ‘ఆంధ్ర వీధిలో బ్రాహ్మణ ప్రశంస’ అన్న ఉప శీర్షికతో రచించబడిన ‘తెలుగు నాడు’ కావ్యంలో వివిధ శాఖల బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలకు సంబంధించిన పరిభాషలతో బాటు, వారి మాండలిక వ్యావహారిక భాషలను కూడా ప్రయోగించి, దాసు శ్రీరాములు మహా కవి అబ్బురపరిచే నవ్యతను గుప్పించారు. ఆ విధంగా 19వ శతాబ్దిలోని ఇతర కవుల కావ్యాలలోని భాషాపరమైన నవ్యత అంతా ఒక ఎత్తయితే కేవలం దాసు శ్రీరాములు కవి రచించిన ‘తెలుగు నాడు’ కావ్యం ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పవచ్చు.
ఆ ప్రకారంగా 20వ శతాబ్ది ప్రారంభంలో అంకురించిన వ్యవహార భాషోద్యమం కన్న ఎంతో ముందే, 19వ శతాబ్దిలోని కవులు కావ్యాలలో జన వ్యవహారంలో ఉన్న వ్యావహారిక, మాండలిక భాషలను, అన్య దేశ్యాలతో కూడిన మిశ్ర భాషలను, వృత్తి, కుల, మత వ్యాపార, ఆచార వ్యవహారాల సంబంధమైన పరిభాషలను ప్రయోగించి, అమూల్యమైన భాషాపరమైన నవ్యతను చూపారని ఘంటాపథంగా చెప్పవచ్చు. బహుశః కావ్యాలలో 19వ శతాబ్ది కవులు ఇలా వ్యావహారిక భాషను నిరభ్యంతరకరంగా, నిర్దోషంగా, సమర్థవంతంగా ప్రయోగించి చూపడం వల్లే, 20వ శతాబ్ది ఆరంభంలో వ్యవహార భాషోద్యమ కారులకు, ఆ స్ఫూర్తి కలిగించి ఉండవచ్చని నా భావన.
(ఇంకా ఉంది)