సమాజాన్ని ప్రశ్నించిన నవల ‘కడలి’

0
4

[అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ‘కడలి’ నవలని పరిచయం చేస్తున్నారు శ్రీమతి షామీర్ జానకీదేవి.]

[dropcap]అ[/dropcap]త్తలూరి విజయలక్ష్మి గారి నవల ‘కడలి’ చదవబోయే ముందు ప్రముఖ రచయిత్రి కె ఉషారాణి గారి ముందు మాట చదివితే చాలు ఈ పుస్తకం విలువ తెలుస్తుంది..

“సంతోషం లేని స్వర్గం ఎందుకు? ఆనంద ఇవ్వని ఐశ్వర్యం ఎందుకు? కనిపించే ప్రతి పచ్చటి తోట వెనుకా ఆ తోటను దహించి వేసే ముళ్ళు ఉంటాయి.. ఆ ముళ్ళు అగ్ని కణాల్లా రేగి తోటను దహిస్తే ఆ తప్పు తోటదా? మాలిదా? ఆనాడు ఈనాడు ఏనాడు స్త్రీ జన్మ సారవంతమైన పవిత్ర భూక్షేత్రమే.. ఆ క్షేత్రం విష బీజాలు మొలకెత్తే మరుభూమిగా మారిందంటే అందుకు కారణం ఈ వ్యవస్థే..”

ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వవచ్చు.. ఇప్పుడు విడాకులు కూడా త్వరగానే లభిస్తున్నాయి.. కానీ విడిపోకుండా కట్టుకున్న భార్యని ఇలా హింసించడం సంస్కారమా..? రచయిత్రి విజయలక్ష్మి గారు ఈ సమాజాన్ని ప్రశ్నించినట్టుగా ఉంది.. ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు అందులో స్త్రీల జీవితాలలో కనిపించని పంచుకోలేని అనుభవాలను కళ్ళ ముందు నిలిపారు.. పెళ్లికి ముందు ప్రేమించడం నేరమా? ఆ ప్రేమను పెద్దవాళ్లు ఒప్పుకోనప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆమెకు ఒక మనసు ఉండకూడదా..? అది స్పందించ కూడదా..?

పెళ్లి అయిన తరువాత భర్తనే నమ్మి తన ప్రేమ గురించి నిజాయితీగా చెప్పడం ఆమె చేసిన నేరం అయింది.. దానికి ఎక్కడో అమెరికాలో ఉంటూ ఆమెను దారుణంగా హింసించడం.. అమెరికాపై మోజు కాని మన బుద్ధులు ఇంకా అలానే ఉంటున్నాయి.. ఇలాంటివి చదువుతుంటే స్త్రీ జీవితంపై ఆవేదన కలుగుతుంది.

ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు పెళ్లి అంటేనే భయపడుతున్నారు.. ఆడపిల్లలకు భద్రత ఎక్కడుంది..? సమాజంలో లేదు.. కార్యాలయాల్లో లేదు.. ఆఖరికి కుటుంబంలో కూడా భద్రత లేకపోతే ఎక్కడ బ్రతుకుతుంది..?

“శృంగారం ఒక మధురమైన సృష్టి కావ్యం. దానిని వికృత చేష్టలతో భయంకరం చేస్తే ఏ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటుంది”

ఇలాంటి దారుణాలను కథలో చొప్పించి స్త్రీ పడే మానసిక వేదన, ఆమె పోరాటం తన జీవితాన్ని మలుచుకున్న విధానం ఈ నవలలో చూపించారు.

“మన భారతదేశంలో ఎంత మంది అమ్మాయిలు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటున్నారు.. పెళ్ళైయ్యాక ఇష్టపడక తప్పదు..” ఒక నగ్న సత్యాన్ని రచయిత్రి రాధ పాత్రతో చెప్పించారు..

కనీసం పెళ్ళికొడుకుని కూడా చూడకుండా పెళ్లి చేసుకుంటుంది.. ఆ తర్వాత ఆమె జీవితంలో జరిగే మార్పులు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాయి..

ఆధునిక భావాలతో ఉద్యోగం చేస్తూ తన కూతురు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోని ఒక తల్లి.. తండ్రి తమకున్న ఒకే ఒక కూతురిని కూడా వదులుకోవాలని అనుకుంటారు.. తర్వాత జరిగే మార్పులు కొంత నాటకీయంగా అనిపించినా అందరికీ నచ్చేలా చక్కటి ముగింపు ఇచ్చారు రచయిత్రి.

స్త్రీ జాతిలో నిండి ఉన్న ఛాందసాలు అవి అలాగే మూసపోసినట్లుగా తరతరాలకు అంటుకుంటోంది.. ఒక్కసారి వాటినుండి బయటకు వచ్చి క్రొత్త తరానికి చేయూతనిద్దాం..

రచయిత్రి మాటల్లో.. ఒక చక్కటి పోలిక..

“సముద్రుడు అంటూ సముద్రాన్ని పురుషుడుతో పోల్చారు కవులు.. కాని స్త్రీ హృదయమే ఒక సాగర గర్భం.. సమాజం సజావుగా సాగాలంటే సాగరమథనం చేసినట్లే సాగర గర్భం లాంటి స్త్రీ హృదయాన్ని శోధించండి.. హాలాహలాన్ని గుండెల్లో దాచుకుని, ప్రేమామృతాన్ని ప్రపంచానికి పంచుతుంది.. సమస్త ప్రకృతినీ ప్రేమ మయం చేస్తుంది..”

***

కడలి (నవల)
రచన: అత్తలూరి విజయలక్ష్మి
ప్రచురణ: రాజేశ్వరి పబ్లికేషన్స్
పేజీలు: 242
వెల: ₹ 200
ప్రతులకు:
అచ్చంగా తెలుగు (8558899478)
ఆన్‍లైన్‍లో:
https://books.acchamgatelugu.com/product/kadali-%E0%B0%95%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here