[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]
[కాశీ నగరం మొదటిసారిగా వచ్చిన నందిని, సందీప్‍లు అసీఘాట్ నుంచి నడక మొదలుపెడతారు. కాశీ క్షేత్రాన్ని, గంగానదిని చూస్తూ – వాటి వెనుక ఉన్న చరిత్రని, ఆధ్యాత్మిక భావాలను గుర్తు చేసుకుంటారు. నది ఒడ్డున, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విభాగం విద్యార్థులు కాబోలు, కొన్ని బొమ్మలు గీసుకుంటూ కనబడతారు. వాళ్ళని ఓ ఫోటో తీసుకుంటుంది నందిని. చిన్నగా పాడుకుంటూ నడుస్తుంది. కొంచెం దూరం వెళ్ళాకా, క్షేమేంద్రఘాట్ కనబడుతుంది. తన సాహిత్య గురువు డా. మూర్తి గారిని స్మరించుకుంటుంది. అక్కడ్నున్న క్షేమేంద్రుడి విగ్రహానికి నందిని నమస్కరిస్తుండగా, సందీప్ ఫోటో తీస్తాడు. కాసేపు ఘాట్‍ల మీద తిరిగి, ఒడ్డుకు వచ్చి ఒక పడవ ఎక్కి నదీ విహారానికి వెడతారు. సూర్యాస్తమయ కాంతులు నదీజలాలలో పడి రంగు రంగులుగా మెరుపులీనుతూ ఆమె కళ్ళలో, బుగ్గలపైన ప్రతిఫలిస్తాయి. వంగి నదిలోంచి కొంచెం గంగాజలం తీసుకుని తలపై జల్లుకుని పడవ నడిపేతనిపై జల్లుతూ సందీప్ మీద కూడా పడేట్టు జల్లుతుంది. ఇంతలో నదిలో ఒక పూలదండతో పాటు ఒక ఫొటో ఆల్బమ్ కొట్టుకుని వస్తూ కనబడుతుంది. సందీప్ వద్దని వారించినా, దాన్ని అందుకుని పైకి తీస్తుంది. ఆ పూలదండ ఆ కాలుతున్న శవానికి వేసినదని, ఆ ఫోటో ఆల్బమ్ కూడా వారిదే కావచ్చనీ, అందుకే తీయవద్దాన్నానని అంటాడు సందీప్. ఆసక్తిగా అందులో ఉన్న ఫోటోలు చూస్తుంది. షహనాయీ వాద్య పరికరం, రాష్ట్రపతి పురస్కారం అందుకుంటున్న ఒక యువకుని ఫోటో, అదే యువకుని సన్నాయి వాద్య ప్రదర్శనల ఫోటోలు, పేపర్ కటింగ్స్, ఉంటాయందుంలో. ఆ యువకుడి పెళ్ళి ఫోటోలు, చివర్లో వృద్ధాప్యంలో అతని ఫోటో ఉంటాయి. విచలితమైన నందిని ఆ ఆల్బమ్‍ని నదిలోకి వదిలేస్తుంది. రైల్వేలలో పనిచేసే నందిని తండ్రి ఉద్యోగంలో ఉండగానే గుండెపోటుతో చనిపోతే, తల్లి సుమతికి అనౌన్సర్ ఉద్యోగం ఇస్తారు. ఇంటర్ వరకు చదివిన సుమతి సంగీతం నేర్చుకుంది. ఇంటిని చక్కగా నిర్వహించుకుంటూ, కూతురుని పెంచి పెద్దచేస్తుంది. తెలుగుభాష పట్ల తనకు గల ప్రత్యేకాభిమానానికి సరిపోతుందని తెలుగు ప్రధానాంశంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసింది నందిని. నందిని, సందీప్‍ల పరిచయం యాదృచ్ఛికంగా జరుగుతుంది. – ఇక చదవండి]
[dropcap]నం[/dropcap]దిని ఒకసారి ‘వానప్రస్థం’ లోని ఒక వృద్ధురాలికి ఒంట్లో బాగులేదని హాస్పిటల్‌కి తీసుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షలు చేసి ఆమెకు బ్లడ్ కౌంట్ చాలా తక్కువ ఉందని రక్తం ఎక్కిస్తే మంచిదని చెప్పారు.
నందిని అంతకు నాలుగు రోజుల క్రితమే వేరెవరికో కావాలంటే బ్లడ్ ఇచ్చింది.
ఇప్పుడీమెకు బ్లడ్ ఎక్కించకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చును..
కానీ.. ఎక్కిస్తే కొంచెం ఆరోగ్యం పుంజుకుని బాగుంటుంది.
నందినికి ఒక ఆలోచన వచ్చింది. రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి అడిగింది. “రక్తదాతల లిస్ట్ మీ దగ్గర ఉంటుంది కదా! ఎవరైనా వస్తారేమో కనుక్కోండి”
“ఉంటుందమ్మా! అది మేము ఎమర్జెన్సీ లోనే వాడాలి.”
“మరి ఈమెకు కూడా ఎమర్జెన్సీ వే కదా!”
“మేము చెయ్యకూడదు. కావాలంటే చార్ట్ అక్కడుంది. మీరు ఫోన్ చేసి తెప్పించుకోండి.” అన్నారు.
ఛార్టులో పదిహేను ఇరవై పేర్లు ఉన్నాయి. ఎవరికి చేయడమో అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆలోచించి, తొమ్మిదవ నెంబర్ పేరుకి చెయ్యాలని అనుకుంది.
ఆ పేరూ, నెంబర్, మొబైల్ లోకి ఎక్కించుకుని రింగ్ చేసింది.
రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయలేదు.
మరొకసారి చేసింది. అప్పుడూ అంతే!
కానీ..
ఆమె మొబైల్‌కి మెసేజ్ వచ్చింది.
“నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాను. అర్జంటా?”
వెంటనే మెసేజ్ పెట్టింది.
“అవునండీ! మా అవ్వకు బాగులేదని హాస్పిటల్‌కి తీసుకొచ్చాను. బ్లడ్ ఎక్కించాలి అన్నారు. ఇక్కడ చార్ట్‌లో మీ నెంబర్ చూసి చేసాను. నందిని” అని రాసింది.
“ఒక్క అరగంట వెయిట్ చేయగలరా?”
“తప్పకుండా. చాలా సంతోషం, ధన్యవాదాలు.”
అరగంట అయ్యేసరికి హాస్పిటల్ ముందు స్కూటర్ ఆగింది. సందీప్ దిగి లోపలికి వచ్చాడు. రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి “ఎవరో బ్లడ్ కావాలి అన్నారు కదా ఇవ్వటానికి వచ్చాను.” అన్నాడు.
ఆమె వెంటనే లోపలికి తీసుకు వెళ్ళింది. పేషంట్ దగ్గర నిలబడి ఉన్న నందినిని చూశాడు.
“మీరే నా ఫోన్ మెసేజ్ పెట్టారు” అని అడిగాడు చిరునవ్వుతో.
“అవునండీ! మీరేనా సందీప్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి. మా అవ్వ మీద నాకు గల ప్రేమతో..” అంటూ ఆపేసింది.
“ఫర్వాలేదండీ!” అంటూ వెంటవెంటనే డాక్టర్‌కి చెప్పి బ్లడ్ డొనేట్ చేసి ఒక పది నిమిషాలు రిలాక్స్‌గా కూర్చున్నాడు.
నందినికి ఇబ్బందిగా అనిపించింది. అవ్వ కోసం తెచ్చిన కమలాఫలం ఒలిచి తినమని ఇచ్చింది.
“నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే తెలుగు లిటరేచర్ చేస్తున్నాను. నిజానికి నేనే అవ్వకు బ్లడ్ ఇవ్వవలసింది. కానీ నాలుగు రోజుల క్రితమే వేరే వారికి ఇవ్వటం వలన కుదరలేదు.” సంజాయిషీగా అంది.
“ఫర్వాలేదు.” అంటూ అవ్వని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు.
వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాడు.
ముట్టుకుంటే మాసిపోయేంత మేని ఛాయ. పట్టుకుంటే కందిపోయేంత సున్నితత్వం. పాలూ, పసుపూ, గులాబీ రేకుల మిశ్రమం నందిని మేని ఛాయ. ఉంగరాలు తిరుగుతూ నాజూగ్గా జారిపోయే పొడవైన కేశ సంపద, సంపెంగ మొగ్గలాంటి నాసిక, వెడల్పైన వాలు కన్నులు, శంఖం లాంటి మెడ, అరుదుగా కనిపించే అందం నందిని స్వంతం.
ప్రబంధనాయికలను మనం చూడలేదు కనుక వాళ్ళతో పోల్చుకోవద్దు.
కృతజ్ఞతా భావంతో కూడిన ఆమె చూపు, కరుణను కురిపించే నయనాలు అతనికి చాలా బాగా నచ్చి మనసుకి హత్తుకుంది.
నందినికి బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. అంతరంగంలో కూడా ప్రశాంతమైన మనసుతో, నిత్యం ఆనందడోలికల్లో తేలియాడుతున్నట్లే ఉంటుంది.
అలసటే తెలియనట్లు ఎప్పుడూ ఏదో పనిలో మునిగి ఉంటుంది. ఆ పనులు ఏమిటని ఆరా తీద్దామనుకుంటే దొరకనే దొరకదు. ఊహకే అందవు.
కొన్ని పనులు తనకు అమితానందాన్ని ఇస్తాయి. కొన్ని ఇతరుల ఆనందం కోసమే ఎంపిక చేయబడతాయి.
ఆ సాయంత్రం నందినికి మళ్ళీ మెసేజ్ వచ్చింది.
‘మీ అవ్వ బాగున్నారా? ఇంటికి తీసుకెళ్లి పోయారా?’ అని.
‘ఆమె బీచ్ రోడ్ లోని వానప్రస్థంలో ఉంటారు. పెద్దామె కదా అని అవ్వా! అని పిలుస్తాను. మీరు పెద్ద మనసుతో రక్తదానం చేసి ఆమె ఆయుష్ పెంచారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’
అలా.. అలా.. వారి మధ్య స్నేహం పెరిగింది.
***
బ్యాంకు ఉద్యోగస్తులైన సూర్యారావు, మరుద్వతి దంపతులకు సందీప్, స్పందన రెండు కళ్ళు.
ఒకే మాట, ఒకే పాట, ఒకే ఆనందం, ఒకే దుఃఖం నలుగురికీ.
బ్యాంకు ఉద్యోగం అంటేనే నిత్యమూ టెన్షన్. అందులో రెండేళ్ల తేడాగల ఇద్దరు పిల్లలతో ఉద్యోగం చేయడం కత్తిమీద సాము చేసినట్లే! అయినా పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఇద్దరూ అత్యంత శ్రద్ధ తీసుకునేవారు.
పరీక్షలూ, రేంకులూ మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్య మరియు శారీరక మానసిక ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచే యోగా శిక్షణలకు పంపిస్తూ ఉండేవారు.
సాధారణంగా పిల్లలు ఏం చదవాలో తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. కానీ పిల్లలు ఇద్దరూ ఇంజనీరింగే చదవాలనుకున్నారు. అందువలన మంచి యూనివర్సిటీలలోనే నచ్చిన సబ్జెక్టులలో సీటు తెచ్చుకుని అనాయాసంగా పూర్తిచేసేసారు.
ఫైనల్ ఇయర్‌లో ఉండగానే కాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయారు. ఆ సమయానికి సందీప్ తన ఇంజనీరింగ్ సబ్జెక్టులో మాస్టరీ కూడా చేసేసాడు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎల్.కె.జి. నుండి కూడా విద్యపై ఖర్చు చేస్తూ ఉండడం వలన ఆర్ధికంగా భారం అనిపించడం సుమారు ఇరవై సంవత్సరాలు చదువుతూనే ఉండడం వలన పిల్లలు మానసికంగా అలసిపోవడం ఇంకా చదువేనా? అనిపించడంతో మార్పు కోరుకుంటారు. అది ఎన్ని వెర్రితలలు వేస్తోందో అందరికీ తెలిసినదే!
ముందుగా స్పందనకు పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ సందీప్, నందినిల ప్రేమ గురించి తెలిసాక కుమారుని పెళ్ళే తలపెట్టారు.
నందినికి తండ్రి లేడని తెలిసాక మరుద్వతి ఈ సంబంధం చేసుకుందామా? వద్దా? అని ఆలోచనలో పడింది.
కానీ.. నందినిని చూసాక “మా అదృష్టం. ఇంత బంగారు బొమ్మ లాంటి కోడలు రావడం” అంటూ బాహాటంగానే అంగీకారాన్ని అక్కడే తెలియజేసింది.
సుమతి సంతోషంగా మరుద్వతి చేతులు పట్టుకుని “వదినగారూ! నందినికి ఆత్మాభిమానం ఎక్కువ. అలాగని ఎవరినీ నొప్పించదు. ఎప్పటికీ మీకు అనుకూలంగా. అందరి మనసెరిగి నడుచుకుంటుంది. ఇంక పెళ్ళి మీరు ఎలా చేయమంటే అలాగే చేస్తాము.”
“అలాగేనండీ! ముహూర్తాలు పెట్టుకున్నాక మళ్ళీ మాట్లాడుకుందాం.” మరుద్వతి హుందాగా అంది.
ఇంటికొచ్చాక నలుగురూ హాలులో కూర్చున్నారు.
పెళ్ళి ఎలా చేద్దామా? అని. సరదా సంభాషణ మొదలుపెట్టారు.
ఇంట్లో మొదటిసారిగా చేసే కార్యక్రమం. అందరి వదనాలూ ఆనందంతో చిరునవ్వులు కురుస్తున్నాయి.
సూర్యారావుగారు “అమ్మ బ్యాంక్ వాళ్ళకూ, నా బ్యాంక్ వాళ్ళకూ పెళ్ళినాడు మంచి భోజనం పెట్టిస్తే చాలు” అన్నారు.
“అన్నయ్య ఆఫీస్ వాళ్ళకూ, మా ఆఫీస్ వాళ్ళకూ రిసెప్షన్ రోజున భోజనం పెట్టిస్తాము. ఏరా! అన్నయ్యా! అంతేనా?” అంది.
“సరే! మిగతా సరదాలు ఎవరెవరికి ఏమున్నాయో చెప్పండి.” అడిగింది మరుద్వతి
“అమ్మా! పెళ్లి రెండు రోజులే! ఒకటి పెళ్లి రోజు. ఇంకొకటి రిసెప్షన్ రోజు. పెళ్ళి వాళ్ళు చేస్తారు. రిసెప్షన్ మనం చక్కగా చేద్దాము.” సందీప్ అన్నాడు.
“అదేంటీ?” అంటూ స్త్రీ సహజంగా ఆమె మొహం కొంచెం వాడింది.
“స్పందనా! పెళ్లి ఎలా జరగాలో నీ ఐడియా చెప్పు.” చెల్లిని ఉత్సాహపరిచాడు.
స్పందన తను హాజరైన బంధువులు, స్నేహితుల వివాహ ఘట్టాలను గుర్తుచేసుకుంటూ ఎంగేజ్మెంట్ దగ్గర నుండి, హనీమూన్ వరకూ టకటకా చెప్పేస్తూ ఉంటే సందీప్ పెన్ను పుస్తకం తీసుకుని నిశ్శబ్దంగా రాయసాగాడు. అంతా పూర్తి అయ్యేసరికి సుమారుగా 50 లక్షలు చేరింది.
“ఆ! అన్నట్టూ..” అంటూ ఇంకేదో చెప్పబోతూంటే..
“ఆపుతావా? ఇప్పటికే 50 లక్షలకు చేరింది.”
“మీ అందరికీ ఒక విషయం చెప్పనా? పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు చేసుకునే వేడుక రెండు కుటుంబాలను కలిపేది.
పూర్వకాలం బ్రాహ్మీ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, పైశాచ, అని అష్టవిధ వివాహాలు ఉండేవి. ఇందులో మొదటి నాలుగు శాస్త్రం ఆమోదించినవి. చివరి నాలుగు శాస్త్రం ఆమోదించలేదు.
ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే నాలుగు పురుషార్థాలను పొందడం కోసం పెద్దలు ఎంచుకున్న మార్గం వివాహము.
బాలసారె నుండి వివాహం వరకు అనేక సంస్కారాలు జరుపబడతాయి. మగ పిల్లవాడి కుటుంబాన్ని నిలబెట్టే సంజీవని వివాహం. తల్లిదండ్రులు జాతకాలు చూసి వివాహం నిశ్చయించి చేస్తే అది అరేంజ్డ్ మ్యారేజ్.
1954; 1955 మరియు 1956 హిందూ వివాహ చట్టం ప్రకారం వధూవరుల కనీస వివాహ వయస్సు 16, 18, 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంతకంటే తక్కువ వయసు వారికి వివాహం చేస్తే వివాహాన్ని ఆపేందుకు, తల్లిదండ్రులను హెచ్చరించేందుకు చట్టం ప్రయత్నిస్తుంది. వివాహం రిజిస్టర్ చేసుకోవడంతోపాటు శుభలేఖ, ఫోటోలు, ఆ వివాహానికి హాజరైన వారి సంతకాలు కూడా పరిగణనలోకి తీసుకొని రిజిస్టర్ చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా వివాహం అనేది జరగడానికి సుమారు మూడు వందల బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నట్లు సర్వేలు పరిగణిస్తున్నాయి.
ఈ ఖర్చు ప్రతి సంవత్సరము రెండు శాతం పెరుగుతోంది.
వివాహవ్యవస్థపై ఆధారపడినవారు ప్రత్యక్ష పరోక్ష రూపంలో అనేకమంది ఉన్నారు.
సాంకేతికత అందుబాటులోకి వచ్చి ఖర్చులు పెరిగాయి. ఆడపిల్ల తల్లిదండ్రులు తమ స్తోమతను మించి ఖర్చుచేయడం, అప్పుల పాలవడం అందరికీ తెలిసినదే! అరుంధతి నక్షత్రాన్ని పురోహితుడు చూపిస్తుంటే ఆరు లక్షల అప్పు కనిపిస్తోందని పెళ్లికూతురు తండ్రి వాపోవడం 50 సంవత్సరాల క్రితం మాట.
ఇప్పుడు చెల్లి చెప్పిన లిస్టు ప్రకారము నేను రాసిన అంచనా చూడండి.
పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేస్తారో అంతకంటే గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేస్తున్నారు.
శుభలేఖలతో మొదలుపెట్టి పెళ్లి మండపం, పెళ్లి వారికి ఇచ్చే విడిది, రవాణాఖర్చులు, బ్యూటీషియన్ ఖర్చు, వధూవరుల అలంకరణ, వారు ధరించే ప్రత్యేక ఆభరణాలు, దుస్తులు, బ్యాండ్ వాయిద్యాలు, అతిధులను పిలవడం, వారికి మర్యాదలు, మగపెళ్ళివారు వారు ఇచ్చిన మెనూ ప్రకారం భోజనాలు, రవాణాఖర్చులు, పెళ్లి సామానులూ, పురోహితుడు, మంత్రాలు, వీడియోలు, ఫోటోలు, ఆల్బమ్‌లు, వివాహానంతరం జరిపే రిసెప్షన్ వేడుకలు ఇంకా కొంతమంది సంగీత కార్యక్రమాలు, ఆర్కెస్ట్రాలు పెడతారు. ఈ ఖర్చు సుమారు 50 లక్షల నుండి కోట్లకు ఎగబాకింది.
ఇంత ఖర్చుపెట్టినా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు బ్రాహ్మణుడు చెప్పే మంత్రాలపై కాక వీడియోగ్రాఫర్ బ్యూటీషియన్ చేతులలో బందీలు. ఇదివరకు వివాహానికి ముందు తరువాత ఆహూతులైన పెద్దలకు నమస్కరించి ఆశీస్సులు పొందే అలవాటు ఉండేది.
అది ఇప్పుడు రిసెప్షన్ దగ్గరకు జరిగి పోయింది. ఆ సమయం కూడా ఫోటోగ్రాఫర్ తీసుకుంటాడు.
ఇంత చేసినా ఏదో కారణాలతో భార్యాభర్తల మధ్య తగవులు విడాకుల దాకా దారితీస్తున్నాయి. వివాహ మంత్రాలలో ఉన్నదానిని పాటించని వారికి ఇన్ని లక్షల ఖర్చులు అవసరమా? నిజంగా అవి పాటించాలి అనుకుంటే ఇంత ఖర్చు అవసరమా?
అమ్మా! నాన్నా! మనం చదువుకున్నవారము, ఉద్యోగస్తులము. సమాజంలో ఒక మెరుగైన స్థానంలో ఉన్నాము కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగే శక్తి మనలో ఉంది.
అవునమ్మా! పెళ్ళిలో మా ఇరువురి బంధాన్ని పట్టిఉంచే ముఖ్యమైన మంత్రాలు తంతులు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చేద్దాము.
అనవసర ఖర్చుని తగ్గించడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది.”
వింటున్న మరుద్వతికి చాలా ఆనందం కలిగింది. ఎంతో ఉన్నతంగా ఎదిగినట్లు కనిపించాడు కొడుకు.
“అలాగే దీపూ! నువ్వూ, చెల్లీ, నందిని కలిపి ప్లాన్ చేయండి. డబ్బులు కోసం కక్కుర్తి కాదు. మన వివాహ వ్యవస్థ మీద గల నమ్మకంతో, వృథాని అరికట్టడానికి వేస్తున్న ఒక ముందడుగు.” అన్నారు సూర్యారావుగారు.
“అమ్మా! నీ అభిప్రాయం చెప్పు.” తల్లి వైపు చూసాడు.
“చెప్పేదేముంది? నేను నా కొడుకు పార్టీ.” అంటూ కుమారుని శిరసు ప్రేమగా నిమిరింది.
అనుకున్న విధంగా అన్నీ జరిగి ఆనందంగా రోజులు జరిగిపోతూంటే వారి ఇల్లు ఎందరికో ఆదర్శంగా మారింది.
(ఇంకా ఉంది)