‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -21

0
3

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 7 – కాకతీయుల కాలం నాటి మతసంప్రదాయాలు – స్త్రీలు: మొదటి భాగం

[dropcap]భా[/dropcap]రతదేశం ప్రాచీనకాలం నుంచి వేదవేదాంగాలకు, ఉపనిషత్తులకు, ధర్మశాస్త్రాలకు నిలయమై ప్రపంచానికంతటికీ జ్ఞానజ్యోతిని అందించింది. ఎందరో మహర్షులు, మునులు పైవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి బ్రహ్మతత్త్వ జ్ఞానాన్ని సంపాదించడమేకాక ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేశారు. కానీ గొప్పవారు, సాధువులు, మహాత్ములు మాత్రమే అలౌకికమైన జ్ఞానాన్ని పొంది, ఇంద్రియ నిగ్రహంతో జీవించి ఆధ్యాత్మికోన్నతిని సాధించగలరు. సాధారణ ప్రజానీకం ఈ స్థాయికి ఎదగలేదు. కాయకష్టం చేసి కడుపు నింపుకోవలసిన వారికి ఈ జ్ఞానమార్గం అభిలషణీయమూ, అనుసరణీయమూ కాదు. మన పూర్వులు భగవంతుని చేరుకోవడానికి లేదా మోక్షప్రాప్తికి చెప్పిన జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలలో చివరి రెండు మార్గాలూ సామాన్య ప్రజానీకం ఆచరించగలిగినవి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మి తమ వృత్తులను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తూ ఉండే ప్రజలు జ్ఞానమార్గాన్ని అనుసరించలేరు. వారు మొదటినుండి ఆచరిస్తున్నదానికి కొద్దిమార్పులు చేర్పులు చేసి ప్రవేశపెట్టిన ఏ మతాన్నయినా ఆదరిస్తారు. సామాన్య ప్రజలకి అర్థమయే భాష, అందుబాటులో ఉండే ఆచరణ విధానము, ఆకర్షించగలిగే విషయాలు అంటే అలౌకిక శక్తులు, మహిమలు వంటివి ఏ మతంలో ఉంటే ఆ మతాన్ని అధిక సంఖ్యాకులు ఆదరిస్తారు. ఈ విషయాన్ని వైదిక మతం కంటే ముందుగా గ్రహించినవి బౌద్ధ, జైన మతాలు. వాటిననుసరించినవి శైవ వైష్ణవ మతాలు.

ఆంధ్రదేశంలో కూడా మొదట వ్యాప్తిలో నున్న మతం వైదికమతమే. ఆర్యులు ఉత్తర ప్రాంతం నుండి దక్షిణానికి వచ్చి ఇక్కడ స్థిరనివాస మేర్పరచుకున్న తరువాత వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, స్మృతులు ప్రధానంగా ఉన్న వైదిక మత సంప్రదాయాలనే ఆంధ్రదేశంలో ప్రచారం లోనికి తెచ్చారు. ఆపస్తంబ మహర్షి రచించిన కల్పసూత్రాలు ఆంధ్రుల ముఖ్యంగా బ్రాహ్మణుల మతాచార వ్యవహారలన్నిటికీ ఆధారమైంది. మౌర్యుల కాలం నాటికి వైదిక మతానికి ప్రాధాన్యత తగ్గి జైన బౌద్ధాలు వర్ధిల్లసాగాయి. శాతవాహన ఇక్ష్వాకుల కాలంలో వైదిక మతాన్ని రాజులు బౌద్ధమతాన్ని వారి రాణులు, సాధారణ ప్రజలు ఆదరించసాగారు.

అయిదు ఆరు శతాబ్దాల కాలంలో ఆంధ్రదేశంలో గొప్ప మతపరివర్తన జరిగింది. అప్పటి వరకు జనాదరణకు పాత్రమైన బౌద్ధమతానికి ఆదరణ తగ్గింది. విష్ణుకుండినులు, పల్లవులు, కళింగంలో మాఢర, వాసిష్ఠీ గోత్రోద్భవులైన రాజులు వైదికమతాన్ని అనుసరించి వేద బ్రాహ్మణులకి అనేక అగ్రహారాలిచ్చి, ఘటికాస్థానాలు, వైదిక విద్యాకేంద్రాలు స్థాపించి తాము స్వయంగా యజ్ఞయాగాలు చేసి, బ్రాహ్మణుల చేత చేయించి వైదికమతాన్ని పునరుద్ధరించసాగారు. త్రినయన పల్లవుడనే బిరుదు వహించిన పల్లవరాజు వైదికమతోద్ధరణలో ప్రధానపాత్ర వహించాడు. రాజాదరణ సన్నగిల్లినా ఇంకా బౌద్ధమతం ఆంధ్రదేశంలో నుండి పూర్తిగా తొలగిపోలేదు. బౌద్ధానికి ముఖ్యకేంద్రమైన ధాన్యకటకాన్ని ఏడవ శతాబ్దిలో సందర్శించిన మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు యువాన్‌చువాంగ్ కొన్ని విహారాలలో మాత్రమే భిక్షులున్నారని, ఆ ప్రాంతాలలో దేవాలయాలనేకం నిర్మితమైనట్లు వ్రాసినాడు.

ప్రజాసామాన్యం ఏ దేవతలను పూజించినప్పటికి వారికి తగిన విధంగా పూజావిధానాలు, పండుగలు, వ్రతాలు, జరుపుకొనడానికి అనుకూలమైన ఆచార వ్యవహారాలను సులభసాధ్యంగా ఉండేటట్లు పురాణాలు వ్రాయబడినాయి. కులదేవతలతో పాటు శైవ వైష్ణవ సంప్రదాయాలకు చెందిన దేవతలను కూడా పూజించేటట్లు పూజావిధానం రూపొందింది. మత సామరస్య సాధనకు పూజావిధానంలో పంచాయతన పద్ధతి అంటే శివుడు, విష్ణువు, దేవి, గణపతి, సూర్యుడు ఉన్న దేవతా సమూహము లేదా కార్తికేయుడు, బ్రహ్మ, తమ కులదేవత చేరిన వేరొక దేవతా సంపుటిని గానీ పూజించే విధానం ఏర్పడింది. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, జ్ఞాన, భక్తి, కర్మలకు సమమైన ప్రాధాన్యత కలిగి జనసామాన్యానికి ఆచరణయోగ్యంగా ఉండే ఈ పూజావిధానాన్ని స్మార్త సంప్రదాయం అంటారు. దీనివల్ల మతాల మధ్య పరస్పర వైషమ్యాలు లేకపోవటమే కాక అవైదికాలైన జైన బౌద్ధాలతో కూడా వైరం తొలగిపోయింది. పౌరాణిక విగ్రహారాధనలో పంచాయతన, హరిహరాత్మక, అర్ధనారీశ్వర పరివార దేవతాది దేవతారాధన విధానాలుండేవని నాటి ఆలయ నిర్మాణాలను బట్టి అక్కడి శిల్పాలను బట్టి తెలుస్తున్నది. కొన్ని బౌద్ధక్షేత్రాలు క్రమంగా శైవ వైష్ణవ క్షేత్రాలుగా పునరుద్ధరింపబడినాయి. దాని ఫలితంగా అమరావతి, దాక్షారామం, క్షీరారామం, భీమారామం, కుమారారామం అనే శైవ పంచారామాలు; సర్పవరం, బాపట్ల, శ్రీకూర్మం వంటి వైష్ణవక్షేత్రాలు బౌద్ధానికి ప్రత్యామ్నాయంగా పునరుద్ధరింపబడినాయి. బుద్ధుడు దేవుడనే భావించి పూజించడం జైన తీర్థంకరులను దైవాంశ సంభూతులుగా భావించడం ప్రజలలో వ్యాపించింది. జైన బౌద్ధదేవతలు కూడా రూపాంతరం చెంది పౌరాణిక దేవతా పరిధిలోనికి చేరారు. ఇది మధ్యయుగం నాటికి ఆంధ్రదేశంలో వ్యాప్తిలోనున్న మత సంప్రదాయాలు కాకతీయ రాజులు స్వతంత్రరాజ్యం స్థాపించేనాటికి ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ మతాలకు మధ్య సామరస్యం సాధించే ప్రయత్నంలో చతుస్సమయ సముద్ధరణ ఆనాటి పాలకులకు సామంతులకు విధిగా మారింది. రాజకీయ సుస్థిరత సాధించడానికి ప్రజలలో మతవైషమ్యం తొలగి ఐకమత్యం సాధించడానికి కాకతీయ రాజులు సామంతులు తెలుగుదేశంలో ఆలయ నిర్మాణం చేసి దానాలు చేశారు. బెక్కలు మల్లిరెడ్డి అనే కాకతిరుద్రుని సామంతుడు జైనమతావలంబియైనప్పటికీ తన పితృపితామహుల పేరున ఇరవైయొక్క శివాలయాలు నిర్మించి వేయించిన శాసనంలో ఈ విధంగా చెప్పుకొన్నాడు.

అమరంగ శైవ వైష్ణవ నిజారుహ బౌద్ధములైన యిచ్చ తు

స్సమయములుం బృథఙ్మతము సంశయ హేతువు దైవమెల్ల నే

కమయమని యైక్య భావమునం గల్మష హరుండు మల్లిరెడ్డియ

త్యమిత గుణాఢ్యు డీయతులితాయ తనంబులు నిల్పె బ్రీతితోన్

కొలనుపాక శాసనంలో స్వామి దండనాయకుడు తనను ‘హరిహర జిన బుద్ధ పదాంబురుహ సముద్ర మరుడ’ని, ‘చతుస్సమయ సముద్ధరణుడ’ని కీర్తించుకొన్నాడు. దీన్నిబట్టి ఆనాటి వారికి భక్తి విషయంలో దైవమేదైనా ఒక్కటేననే విశ్వాసం ఉన్నదని స్పష్టమౌతున్నది.

ఆనాటి మతసాంప్రదాయాలలో స్త్రీలు ఏ పాత్ర వహించారు? ఏ మతాన్ని అభిమానించి ఆదరించారు, ఏఏ దానాది ధర్మకార్యాలు చేశారు, ఏ ఫలితాన్ని ఆశించేవారు. గ్రామదేవతారాధన శక్త్యారాధనలలో వారు పాల్గొనేవారా లేదా? వారు ఏ వ్రతాలు, పూజలు, నోములు, యాత్రలు చేసేవారు, అనే విషయాలను చర్చించవలసి ఉన్నది. ముందుగా ఒక్కొక్క మతం గురించి దానిని అభిమానించి, ప్రోత్సహించిన స్త్రీల గురించి వివరించబడుతుంది.

జైనమతం:

కాకతీయులు రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్నపుడు వారి చక్రవర్తులనుసరించిన జైనమతాన్నే వారూ అభిమానించారు. ఆ కాలంలో ఆంధ్రదేశంలో ముఖ్యంగా తెలంగాణాలో జైనం వ్యాప్తిలో ఉన్నది. ఆంధ్రలో వ్యాప్తిలో నున్న శాఖ యాపనీయ జైనం. వీరు విలక్షణమైనవారు. శ్వేతాంబరులలాగా స్త్రీలకు కూడా మోక్షం లభిస్తుందని నమ్మేవారు. దిగంబరులలాగా వస్త్రాలను నిరసిస్తారు. జైనులు విద్యాప్రియులు. ఈ యాపనీయ జైనులు స్త్రీ పురుషులకు సమంగా విద్యను బోధించేవారు. రాయదుర్గం యాపనీయులు స్త్రీ పురుషులకు సామూహికంగానూ, విడిగానూ పాఠాలు చెప్పే దృశ్యాలు అక్కడి శిల్పాలపై నేటికీ నిలిచి ఉన్నాయని అంటారు. జైన బసదులలో విద్యార్ధులకు భోజన, ఆహార వసతి ఉండేది. విద్యను బోధించేవారు. స్త్రీలకు మోక్షం లభిస్తుందనే జైనమతాన్ని స్త్రీలు అభిమానించి ఆ బసదులకు దానాలు చేసేవారు. కాకతి రెండవ ప్రోలుని దండాదినాధుడు, మంత్రి అయిన బేతన భార్య మైలము. “అతిశయ జైనధర్మ సమయోచిత శాసనదేవి భారతీసతి” అని హనుమకొండలోని పద్మాక్షి ఆలయంలోని శాసనంలో కీర్తించబడింది. క్రీ.శ. 1117లో పద్మాక్షిగుట్టపైన కడలాలయ బసది అనే జైనబసది కట్టించి, తన భర్త బేతన తవ్వించిన చెరువు క్రింద రెండు మర్తుర్లు మాగాణి, రెండు మర్తుర్లు నల్లరేగడినేల ఆరు మర్తుర్లు మెట్టభూమి నిత్యపూజ ధూపదీప నైవేద్యాలకు పూజారి అన్నవస్త్రాలకు దానమిచ్చి శాసనం వేయించింది. కాకతి రెండవ ప్రోలుడు పరమమాహేశ్వరుడు. వీరి చక్రవర్తి పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్ల ఆరవ విక్రమాదిత్యుడు శైవమతాభిమాని. రెండవ ప్రోలుని మంత్రి బేతన భార్య జైనమతాన్ని అభిమానించి జైనబసది కట్టించింది. దీన్నిబట్టి రాజులే మతాన్ని అనుసరించినా స్త్రీలు స్వతంత్రించి తాము అభిమానించిన మతానికి సేవ చేశారు అని చెప్పవచ్చును.

కుమార సంభవం పీఠికలో డా. కోరాడ మహాదేవశాస్త్రిగారు ఈ విధంగా రాశారు. జైనమత ప్రభావం ఆంధ్రుల జీవితం పైన ఎంతగానో ఉన్నది. ఆనాటి సాహిత్యంలో ప్రసక్తమైన దీపవృక్షాలు, మండనాంగానోకహములు, వస్త్రాలను, భోజన సామగ్రిని, కావలసిన వస్తువులనిచ్చే వృక్షాలు ఉండడం జైన సంప్రదాయమే కానీ వైదిక సంప్రదాయం కాదు. తెలుగు విద్యార్థి విద్యారంభానికి ముందు నేర్పే ఓం నమశ్శివాయ అన్న మంత్రంతో పాటు సిద్ధం నమః అనే జైన మంత్రాన్ని కూడా చెప్పే సంప్రదాయాన్ని బట్టి, తెలుగువారి సంస్కృతిపై జైనమత ప్రభావం ఎంత ఉందో ఊహించవచ్చును.

తెలుగు పురుషుల మీదకన్నా తెలుగు స్త్రీలమీద జైన ప్రభావం ఎక్కువగా ఉందని ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యం అన్న గ్రంథంలో చెప్పారు. స్త్రీల రామాయణ పాటలలో విడ్డూరాలలాగా కనపడే ఘట్టాలు చాలావరకు జైన రామాయణం నుండి సంక్రమించినవేనని, రంగనాథ రామాయణ, భాస్కర రామాయణాలలో కనబడే అవాల్మీకాలకూ జైన రామాయణానికీ సంబంధం ఉందని వారు అన్నారు. దీన్నిబట్టి ఆంధ్రస్త్రీలు జైనాన్ని అభిమానించే వారని చెప్పవచ్చును. వర్ణభేదం లేనిమతంగా ప్రారంభమైన జైనంలో చాతుర్వర్ణాలు ప్రవేశించాక హైందవ మతానికీ, జైనానికి తేడాలు తగ్గసాగాయి. జైనుల్లో కూడా తొలి మూడు వర్ణాల వారికే దీక్షాధికారం ఉందనే జైనమతం అధిక సంఖ్యాకులకు నిరుపయోగమై ప్రజాదరణకు దూరమైంది. ఈ ప్రాంతంలో పౌరాణికమతం శైవం ప్రబలి జైనమతం తగ్గిపోయింది.

బౌద్ధమతం:

కాకతీయుల కాలానికి ఎంతో ముందు అంటే క్రీ.శ. 8-9 శతాబ్దాల నాటికే బౌద్ధమతం వజ్రయానశాఖలోని తాంత్రిక విధానంవల్ల పతనం చెందడం జరిగినప్పటికీ పౌరాణిక మతానుయాయులు బుద్ధుని మాత్రం అవతారపురుషునిగా ఎంచి విష్ణువు దశావతారాలలో ఒకనిగ భావించి పూజించడం ప్రారంభించారు. కాకతి రుద్రుని మంత్రి వెల్లకి గంగాధరుడు శైవ వైష్ణవవాలయాలు కట్టించడమే కాక బుద్ధుని విష్ణువు అవతారాలలో ఒకనిగా ఎంచి పట్టశాలలో బుద్ధునికి ఆలయం కట్టించాడు. అసురులను వంచించడానికి విష్ణువు బుద్ధస్వరూపుడై వచ్చాడని ఆ బుద్ధుని ప్రతిష్ఠ చేశానని క్రీ.శ. 1171 నాటి తన కరీంనగర్ శాసనంలో తెలిపాడు. గంగాధరుని తల్లి తుఱుకమాంబ బౌద్ధముని ఆశీర్వాదం వల్ల జన్మించి ఉంటుందని ఇంతకుముందు చెప్పడమైంది. బహుశా ఆమె తన పుత్రునికి బుద్ధునిపై భక్తి కలిగించి అతడు బుద్ధుని ప్రతిష్ఠ చేయటానికి ప్రేరేపించి ఉంటుంది.

క్రీ.శ. 1182 లో కోటకేతరాజు భోగస్త్రీలు సూరమదేవి, ప్రోలమదేవి అనేవారు బుద్ధుని దీపారాధనకై నేతి కొఱకు గొట్టెలను దానంచేశారు. ఈ సందర్భంలో కోట కేతరాజు ధాన్యకటకంలోని బుద్ధదేవునికి కండవాటిలోని క్రంతేరు కొండపడుమటి సీమలోని మేడికొండూరు, డొంకిపఱ్ఱు అనే గ్రామాలను దానం చేశాడు. కేతరాజు శైవుడైనప్పటికీ బుద్ధుని ఆరాధనను కూడా చేశాడంటే ఆనాటికి అంతకుముందు ప్రజలలో బౌద్ధమతం పట్లనున్న విముఖత్వం తగ్గి బుద్ధుని స్మార్తదేవతా పరిధిలోనికి చేర్చారని అర్థమౌతుంది. బుద్ధపూర్ణిమ వంటి బౌద్ధ పర్వదినాలను స్మార్తపర్వదినాలుగా స్వీకరించి ఆనాడు తమ యిష్టదైవాలను కులదైవాలను ఆరాధించడంతో బౌద్ధం తన అస్తిత్వాన్ని కోల్పోయి ప్రత్యేకమైన మతంగా ఆంధ్రదేశం నుంచి అదృశ్యమైంది.

శైవము:

కాకతీయుల కాలంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నదీ, సామ్రాట్టుల నుంచి సామాన్య ప్రజల వరకు అభిమానించి ఆదరించిన మతం శైవమతం. మొదట ఇందులో కాలాముఖము, కాపాలికము, పాశుపతము అనే శాఖలు మూడు ఉండేవి. తరువాత కన్నడదేశంలో బసవన ప్రచారం చేసిన వీరశైవం ఆంధ్రదేశంలో వ్యాపించింది. దాక్షారామంలో జన్మించిన పండితారాధ్యుడు వీరశైవ మతాన్ని అభిమానించినా బ్రాహ్మణ్యాన్ని వదులుకోలేక “భక్తిమీది వలపు, బ్రాహ్మ్యంబుతో పొత్తు బాయలేను నేను బసవలింగ” అని వీరశైవమతంలో ఆరాధ్య మత సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబాలవారు కాకతీయుల మంత్రులుగానూ, సేనానులుగానూ ఉండి ఆరాధ్యమత వ్యాప్తికి తోడ్పడ్డారు. బసవన వీరశైవ మత ప్రభావము, పండితారాధ్యుని ఆరాధ్య సంప్రదాయ ప్రభావం, పాల్కురికి సోమనాధుని రచనలపై ఉన్నట్లు చెప్పవచ్చును. పాల్కురికి సోమనాథుడు వీరశైవమతాన్ని ఎక్కువ అభిమానించినా, అతని రచన ఆరాధ్య, వీరశైవ సంప్రదాయాల కలగలుపు అని డా. అమరేశం రాజేశ్వరశర్మగారు అభిప్రాయపడినారు. వీరశైవ మత ప్రాబల్యం వల్ల స్త్రీలు, తక్కిన బడుగువర్గాల వారి జీవితాలు ప్రభావితమైనాయి. జైనబసదులను బౌద్ధారామాలను ధ్వంసం చేసి బౌద్ధ జైన సన్యాసులను వీరశైవులు హింసించినట్లు పాల్కురికి సోమన రచించిన పండితారాధ్య చరిత్రను బట్టి గ్రహించవచ్చును. ఆ కాలంలో ఎన్నో వీరశైవాలయాలు వెలసినాయి. జంగాలు, మాలజంగాలు మొదలైనవారు తెలుగుదేశంలో ఉన్నారంటే వీరశైవ ప్రభావము వల్లనని చెప్పవచ్చును.

కాకతి రాజులు రెండవ బేతరాజు నుండి కాలాముఖ శైవాన్ని అభిమానించారు. రెండవ బేతరాజు కాలాముఖ తపోధనుడు శ్రీ పర్వతంలోని మల్లికార్జున శిలామతాచార్యుడు పర్వతావళి శాఖకు చెందిన రామేశ్వర పండితునికి, శిష్యపరంపరకు చెల్లే విధంగా అనుమకొండ సమీపంలో శివపురమనే గ్రామాన్ని తన పేర నిర్మించిన శివాలయానికి సమర్పించాడు. ఇతని కొడుకులు దుర్గరాజు, ప్రోలరాజు రామేశ్వర పండితుని శిష్యులే. ఈ కాలాముఖ సంప్రదాయం ఆ కాలంలో వెలువడిన నన్నెచోడుని కుమారసంభవంలో కనిపిస్తుందని, కుమార సంభవ కృతిభర్త మల్లికారున యోగి కాలాముఖ సంప్రదాయానికి చెందినవాడని కొందరు చారిత్రకుల అభిప్రాయం. కుమార సంభవం పీఠికా కర్త అభిప్రాయం కూడా అదే. అయితే డా. అమరేశం రాజేశ్వర శర్మగారు తమ నన్నెచోడుని కవిత్వము అనే గ్రంథంలో నన్నెచోడుని శైవసంప్రదాయం ఆగమ సంప్రదాయానికి చెందినదని రుజువులతో నిరూపించారు.

కాలాముఖ సంప్రదాయానికి చెందిన ఎన్నో విషయాలు కుమారసంభవంలో ఉన్నాయని విమర్శకులు అంటారు. పార్వతీ పరమేశ్వరుల వివాహం అయిన తర్వాత స్త్రీలందరూ వలయాకారంగా కూర్చొని మద్యం సేవించి శివపార్వతుల గురించి పాటలు పాడి మండలార్చన చేశారు.

వ. అందకొందఱు మధుపాన గోష్ఠికింజొచ్చి మండలార్చన దీర్చి మూలజ వృక్షజ గుడమధుపిష్ట కుసుమ చషకాదులన్నించి హర్షించి,

మ. శివు గౌరీ సహితంబు సన్మనంబులం జింతించి, మైతెంచిభై

రవు, యోగీంద్రుల గొల్చి, యోగినుల వీరవ్రాతముం దనియా

నవ నాథాదుల కాది సిద్ధులకు నానందించి, విందిచ్చి, యా

సవ పాత్రల్ సతులర్థి నెత్తికొని యాస్వాదించి మోదించుచున్

ఈ మండలార్చన సంప్రదాయం కాలాముఖ శైవంలోనే ఉన్నది. వీరశైవ మతవ్యాప్తి చెందిన కాలంలోనిదే అయినప్పటికీ నన్నెచోడుని కుమారసంభవంలో పాల్కురికి సోమనాథుని గ్రంధాలలో ఉన్న మతావేశం లేదు. శక్తిపూజను గురించి కూడా నన్నెచోడుడు ప్రస్తావించాడు. హిమవంతుడు మేనక శక్త్యారాధన చేసి పార్వతిని పుత్రికగా పొందారు. శక్తిపూజ కూడా కాలాముఖ సంప్రదాయమే. ఆంధ్ర కర్ణాటకలలో ఉద్భవించినదనే యాపనీయ జైనశాఖ స్త్రీలకు మోక్షం లభిస్తుందని నమ్ముతుంది. కాలాముఖులూ జైనులను అనుకరించారు. అంతకుముందు జైనాన్ని అభిమానించిన స్త్రీలు శక్త్యారాధన ద్వారా స్త్రీలను గౌరవించిన కాలాముఖ శాఖను కూడా అభిమానించారు. స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం వల్లను, బ్రహ్మచర్యాన్ని షరతుగా పెట్టకపోవడం వల్లను, కాలాముఖం ప్రజలు అభిమానించి పాల్గొనే మతమైంది. కాలాముఖుల గుడులు మఠాలు భక్తుల దానాలతో అభివృద్ధి చెందసాగాయి. శ్రీశైలం ఆ కాలంలో కాపాలిక కాలాముఖ, పాశుపత శాఖలకు ప్రధానకేంద్రంగా ఉండేది. కాకతీయులు మొదట జైనాన్ని అభిమానించి, తరువాత రెండవ బేతరాజు నుంచి కాలాముఖాన్ని అనుసరించారు. బేతరాజు కొడుకు దుర్గరాజు రామేశ్వరపండితుని వద్దనే దీక్షపొంది శక సం. 1098 లో శాసనం వేయించాడు.

రెండవ ప్రోలరాజు కూడా రామేశ్వర పండితుని వద్దనే శివదీక్ష పొందాడు. కాకతి రుద్రుడు ఎవరి వద్ద దీక్షను పొందాడో తెలియదుగానీ మహదేవరాజు ధ్రువేశ్వర పండితుని వద్ద దీక్ష పొందాడు. ఇతని కుమార్తె మైలమ ధర్మ శివాచార్యుల వద్ద దీక్ష తీసుకుని అతనికి కొంతభూమిని దానం చేసిందని కోటగడ్డ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఆలంపురం లోని బ్రహ్మేశ్వరాలయం కాలాముఖ సంప్రదాయానికి చెందినదే. రాణులు అభినవ సరస్వతి మన్నాదేవి, చందలదేవి ఆ ఆలయానికి దానాలు చేశారు. కాకతి గణపతి దేవుని కాలంలో పాశుపతం శాఖకి ఉచ్చస్థితి వచ్చింది. నర్మదాతీరంలోని డాహళదేశానికి చెందిన గోళకి మఠం ఆనాడు మిక్కిలి ప్రసిద్ధమైన పాశుపత కేంద్రంగా ఉండేది. ఆ మఠాచార్య పరంపరకి చెందిన విశ్వేశ్వర శివాచార్యుడు కాకతి గణపతి దేవునికి, రుద్రమకు దీక్షనిచ్చిన గురువు. ఇతడే రెండవ ప్రతాపరుద్రునికి కూడా దీక్ష నిచ్చాడు. వీరి ఆదరణ వల్లనే విశ్వేశ్వర శివాచార్యుడు మందరము, కాళేశ్వరం, చంద్రవల్లి, త్రిపురాంతకము, ఏలేశ్వరం, అమరావతి, శ్రీశైలం మొదలైన శైవక్షేత్రాలలో శివాలయాలు, మఠాలు నిర్మించాడు. మందర గ్రామాన్ని రుద్రమ వద్దనుంచి దానంగా గ్రహించి ఒక శివాలయాన్నీ, శుద్ధ శైవమఠాన్ని నిర్మించి అందులో అనేక శైవ బ్రాహ్మణులకు వసతి కల్పించాడు. ఆ మఠానికి అనుబంధంగా ఒక వేదశాస్త్ర ఆగమ విద్యాలయాన్ని స్థాపించి, అందులోని ఆచార్యులకు, శిష్యులకు వసతులు, సత్రము ఏర్పాటు చేశాడు. ప్రసూతి ఆరోగ్యశాలలను కూడా నిర్మించి ప్రజల అభిమానాన్ని సంపాదించాడు. కాపాలికులకు కూడా శ్రీశైలం ముఖ్యస్థానమే. వీరు తాంత్రిక విధానాలను ఎక్కువగా ఆచరించేవారు. వీరి ఇష్టదైవం కాలభైరవుడు. ఎముకలు కపాలాలు ధరించి త్రిశూలం చేతబూని కొండలలో, కోనలలో సంచరిస్తారు. నెల్లూరు జిల్లాలోని భైరవుని కోనలో దుర్గా, భైరవుల గుహాలయాలు ఉన్నాయి. కాకతి మైలమ ఇనుగుర్తిలో వేయించిన శాసనాన్ని బట్టి యినుంగుత్తిలో వాయువ్య దిశలో నున్న పర్వతం గుహలో జలంధరేశ్వరుని భైరవుని ప్రతిష్ఠ చేయించినదని తెలుస్తున్నది. కాకతి మైలమ శైవమత శాఖలైన కాలాముఖ, పాశుపత, కాపాలికాలను మూడింటినీ సమానంగా ఆదరించినదని తెలుస్తుంది.

కాకతీయుల కాలంలో స్త్రీలు శైవమతాన్ని ఎక్కువగా అభిమానించడానికి గల కారణాలు:

శైవమతం ఏ శాఖకి చెందినప్పటికీ స్త్రీలకు పురుషులకు సమానత్వాన్ని ప్రతిపాదిస్తుంది. వర్ణ, వర్గ వివక్ష లేని సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. వీరశైవ ధర్మప్రతిపాదనలు స్త్రీలకు అనుకూలంగా ఉండేవని పండితారాధ్య చరిత్ర బసవ పురాణాలను బట్టి ఈక్రింద పేర్కొనబడినాయి.

బసవని వీరశైవ సంప్రదాయ సిద్ధాంతములు:

శివుడే పరమదైవము, కులవర్ణ వర్గ విభేదములేదు, స్త్రీ పురుషులు ఇరువురు సమానహక్కులు గలవారు, వైదికాచారాలను విసర్జించవలెను.

సంగమేశ్వరుడు బసవనికి తెలిపిన వీరశైవమత సంప్రదాయాలు:

శివభక్తుల కులమెప్పుడు అడగకుము, ఇతర స్త్రీలను ఎప్పుడూ కన్నెత్తి చూడకుము, శివభక్తులెట్టివారైనా వారిని గూర్చి అన్యధా తలపకుము, ధర్మమునకు భక్తి మూలము, శివనింద చేసినవారిని చంపుటకు వెనుదీయకుము.

కాలాముఖ తపోధనుడైన రామేశ్వర పండితుడు దాక్షారామ దేవాలయంలో స్థానాపతి అని దాక్షారామంలోని శాసనాన్ని బట్టి చెప్పవచ్చు. దాక్షారామ భీమేశ్వరాలయం కూడా కాలాముఖ శైవమత శాఖకు సంబంధించినదే. కాలాముఖ సంప్రదాయం వారు శక్త్యారాధన చేస్తారనటానికి భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోనే ఉన్న సప్తమాతృకలు, చండీశ్వరికి చెందిన ఆలయాలు నిదర్శనం. వేశ్య శక్తిస్వరూపిణి అని తంత్రాలు చెబుతాయి. ఈ అభిప్రాయం బసవ పురాణంలో ముగ్ధ సంగయ్య కథలో ఒక వేశ్య ‘సాక్షాత్గదంబా సమాన లధికంబు గలరు దాక్షారామమున’ అనడం వల్లను, మాణిక్యాంబ అనే వేశ్య బాలికతో భీమేశ్వరునికి కల్యాణం చేసే సంప్రదాయం వల్లను వెల్లడవుతుంది. శక్తితో సమానంగా భావించడం వల్లను, స్త్రీలను ముక్తికి అర్హలని భావించడం వల్లను, స్త్రీ పురుష సమానత్వాన్ని చాటే కాలాముఖ సంప్రదాయానికి చెందిన దాక్షారామం, సిరిపురం కాంజనరీంద్రీశ్వరాలయం వంటి తక్కిన ఆలయాలలో సాని మున్నూర్వురు సంఘాలు స్థానపతితో సమానమైన అధికారం కలిగి ఉండేవి. ఈ ఆలయాలలో మహాదేవునికి మన చారిత్రక కాలంలో స్త్రీలు అత్యధిక సంఖ్యలో దానాలు చేశారు. ఈ దేవాలయాలలో సానులు సంఘంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొంది దాతలు దేవాలయాలకు ఇచ్చే దానాలను సక్రమంగా ఉండేటట్లు చూసేవారు. ఆ విధంగా దాతలు శాసనాలు చేసేవారు. వీరు వివాహితలై దేవాలయాలలో రంగభోగాలు వంశపారంపర్యంగా నిర్వహించే హక్కును పొంది ఉండేవారు.

సంఘంలోని అన్ని వర్గాల స్త్రీలు శైవమత సంబంధమైన నోములు, పూజలు నిర్వర్తిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేసే పురుషులకు తీసిపోని విధంగా మతపరమైన స్వేచ్ఛను అనుభవించేవారు.

పాశుపత శైవ సంప్రదాయం వర్ధిల్లిన గణపతి దేవుని కాలంలో కూడా స్త్రీలు శివలింగ ప్రతిష్ఠలు చేసి, ఆలయాలు, చెఱువులు, మఠాలు, సత్రాలు వంటివి నిర్మించి ప్రజోపయోగ కార్యాలను చేశారు. గోళకీమఠంలో స్త్రీల సదుపాయానికై ప్రత్యేకంగా ప్రసూతి ఆరోగ్యశాల నిర్మించబడింది. పుత్రులు లేని స్త్రీలు ఇతరుల చేత తమ పనులు చేయించుకొని వృత్తులను, భూములను అనుభవించవచ్చుననే హక్కులను పొందారు. రంగ భోగాలను నిర్వర్తించడంలో పురుషులతో సమానమైన జీతభత్యాలు స్త్రీలకు కూడా ఉండేవి అని మల్కాపురం శాసనంలో వృత్తివివరాల వల్ల గ్రహించవచ్చును.

చనిపోయినవారి పేరుతో లింగ ప్రతిష్ఠ చేస్తే వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని శైవులు నమ్మేవారు. ఆ కారణం వల్ల భర్త చనిపోతే భార్య అతని శవంతో సహగమనం చెయ్యవలసిన అవసరం లేదు. సిద్ధేశ్వర చరిత్రలో రుద్రమదేవి తన భర్తతో సహగమనం చేయబోయినపుడు రాచగురువు శివదేవయ్య ఆమెను వారించాడు.

వీరశైవాచారవిమలులకిట్టి

దూరవిచార విస్ఫారతవలదె

జీవుడు, శివునాజ్ఞ జనియించుచుండు

జీవుడడంగును శివునాజ్ఞ నెపుడు

కాననిచ్ఛా స్వతంత్రతగల, శివుని

గాన బోయిన జీవి గానక యేడ్చు

అతని పేర శివలింగ ప్రతిష్ఠ చేస్తే అతనికి శివసాయుజ్యం లభిస్తుంది. ఆ రూపేణా సహగమనం చేయదలచుకోని స్త్రీలు మరణించిన భర్తల పేర్లతో లింగ ప్రతిష్ఠలు చేసి ఆలయాలు కట్టించారు. వైష్ణవ భక్తుడైన గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక సుమంగళీత్వం కోరి అరుంధతీ వ్రతం, లక్ష్మీనారాయణ వ్రతం, అనంతవ్రతం వంటి విష్ణు సంబంధమైన వ్రతాలు చేసినప్పటికీ, భర్త మల్యాల గుండన చనిపోయినప్పుడు శైవ సంప్రదాయ పద్ధతిలో అతని పేరుమీద బూదపూరులో లింగప్రతిష్ఠ చేసి, ఆలయం కట్టించి దానాలనేకం చేసింది. వీరశైవంలో శవదహనం లేదు కనుక భర్తతో చితిలో కాలిపోవలసిన పరిస్థితి శైవమతాన్నవలంబించిన స్త్రీలకు తప్పిపోయింది. ఆనాడు శివాలయాలలో స్త్రీలు అధికసంఖ్యలో లింగప్రతిష్ఠలు, అఖండ దీప దానాలు చెయ్యడానికి బహుశా అదే కారణమై ఉంటుంది.

అధిక సంఖ్యాకులైన స్త్రీ శూద్రాదులను ఆకర్షించడానికి వీరశైవమతం వైదిక మతానుయాయులు అభిమానించిన మార్గ విధానాన్ని త్రోసిపుచ్చి దేశి పద్ధతిని స్వీకరించింది. భాష, ఛందస్సు, సంగీతం, నృత్యం ఒకటేమిటి అన్ని రంగాలలోనూ దేశీయత, తెలుగుదనం శైవమత వ్యాప్తివల్ల ఎక్కువైనాయి. పాల్కురికి సోమనాథుని వంటి వీర శైవకవులు ద్విపదలలో కావ్యాలు రచించారు. గణపతి దేవ చక్రవర్తి బావమఱది జాయపసేనాని నృత్తరత్నావళి, గీత రత్నావళిలో ఎన్నో దేశి ప్రక్రియలకు చెందిన నృత్యాలను, గీతాలను కూర్చి రచించాడు. శివరాత్రి ఉత్సవాలు, జాతరలు, పండుగలు ప్రజలు సామూహికంగా పాల్గొని చేసుకొనేవారు. ఈ విధంగా సామాన్య ప్రజలని ఆకర్షించిన వీరశైవ మతంలో ఇంకా కొన్ని అంశాలు స్త్రీలను, సంఘంలో హీనంగా చూడబడేవారిని ఆకర్షించాయి. శైవమతం స్త్రీలకు పురుషులతో సమాన గౌరవ ప్రతిపత్తి నీయడమే కాక భర్త శైవుడు కాకపోతే వదిలివేయవచ్చునన్నది. స్త్రీలు భర్తలను ఆ కారణంగా వదిలివేసినట్లు ఆధారాలెక్కువ లేకపోయినా ఆ మతం స్త్రీలకు భావస్వేచ్ఛను, మతస్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని మాత్రం చెప్పవచ్చును.

బసవన్న ప్రబోధించిన వీరశైవమతంలో గురులింగ జంగములకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ముఖ్యంగా జంగముడేది కోరినా దాన్ని శివుడు కోరినట్లే భావించి కోర్కె తీర్చాలి. వీరు వేశ్యాలోలురైనా విషయాసక్తులైనా ప్రజలు తప్పు పట్టక గౌరవించాలి.

శూలి భక్తాలి దుశ్శీలముల్ గన్న – మేలకా గైకొనుమీ బసవన్న

ఏ ప్రొద్దు జంగమంబేన కా జూడు

అన్న వాక్యాలను బట్టి జంగములను శివభక్తులెంత ఆదరించేవారో తెలుస్తుంది. వేశ్యాలోలత్వం తప్పుకాకపోవడం, ఆంక్షలెక్కువ లేకపోవడం, భావస్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛను ప్రోత్సహించిన వీరశైవమతం సామాన్య ప్రజలను, స్త్రీలను ఎక్కువగా ఆకట్టుకొన్నది.

వైష్ణవం:

మనదేశంలోని ప్రాచీన మతాలలో వైష్ణవం కూడా ముఖ్యమైనది. కాలం గడిచిన కొద్ది భక్తి మార్గాలు బయలుదేరాయి. కాకతీయ యుగంలో వీరశైవానికి పోటీగా వీరవైష్ణవ మనే వైష్ణవమత శాఖ బయలుదేరింది. పలనాటి బ్రహ్మనాయకుడు రామానుజాచార్య ప్రతిపాదితమైన విశిష్టాద్వైత మార్గాన్ననుసరించి కులమత వ్యవస్థను తోసివుచ్చి అన్ని కులాల వారు సహ పంక్తి భోజనం చేయాలని బోధించే వాడని పల్నాటి వీర చరిత్రను బట్టి తెలుస్తుంది.

దేవాలయాలు

ఆనాటి ప్రసిద్ధశైవ క్షేత్రాలైన దాక్షారామం (పాలకొలను), కుమారారామం అమరామం, భీమారామం వంటి ప్రదేశాలలోని దేవాలయాలలో భక్తులు విశేషసంఖ్యలో దర్శించుకొని దానాలిచ్చేవారు. ముఖ్యంగా శివరాత్రి వంటి పర్వదినాలలో, సూర్య చంద్ర గ్రహణాది సమయాలలో ఉత్తరాయణ, దక్షిణాయనాది సంక్రాంతుల సందర్భాలలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి దేవుని దర్శించుకొనే వారు. రాజులు, రాణులు, సామంత దండనాయకుల నుంచి సామాన్య ప్రజ వరకు వారి శక్తి కొద్దీ దానాలిచ్చేవారు. ప్రజోపయోగకార్యాలైన సత్రాలు, మఠాలు నిర్మించడం, చలివేంద్రాలు పెట్టించడం, చెరువులు, కుంటలు తవ్వించడం, పుష్పవనాలు, తోటలు వంటివి పెంచి దేవాలయాలకు అర్పించడం చేసేవారు. పితృదేవతల కొరకు, తమ బంధువులు, ఆప్తులకు, తమకు ధర్మార్ధం అఖండవర్తి దీపాలను సమర్పించి అందుకై గోవులను, మేకలను, ఇనపయెడ్లను కొని బోయలు, గొల్లలు, తెలికవారు మొదలైన వారి అధీనంలో ఉంచేవారు. అంగరంగాది భోగకార్యక్రమాలు నిర్వహించేవారికి వృత్తులనేర్పాటు చేసేవారు. ఈ విధమైన దానధర్మాల కార్యక్రమాలు ఆ కాలంలో స్త్రీలు కూడా అధిక సంఖ్యలో చేయడానికి శైవ, వైష్ణవ మతాలు ముఖ్యంగా అందులో శైవమతం ప్రోత్సహించినదని చెప్పవచ్చును. ఆనాటి దేవాలయాలు కేవలం దైవ పూజకే కాక ప్రజల సంస్కృతి, జీవనోపాధికి కూడలి స్థానాలుగా ఉండేవి. ఈ దేవాలయాలు రకరకాల వృత్తుల నిర్వహించే స్త్రీలను; లలిత కళాకుశలలైన స్త్రీలను పోషించడమే కాక ఆ ఆలయాలకు చెందిన మఠాలు పుత్రులు లేని స్త్రీలకు, చికిత్సకు, ప్రసూతి సదుపాయాల కోరివచ్చే స్త్రీలకు కూడా ఆశ్రయమిచ్చేవని ఆనాటి శాసనాలను బట్టి తెలుసుకోవచ్చు. దాక్షారామ శాసనంలోని గోళకీమఠం అటువంటిదేనని మల్కాపుర శాసనాన్ని బట్టి చెప్పవచ్చును.

వైష్ణవాలయాలు శివాలయాల కంటే వైభవోపేతంగా ఉండేవి. భక్తులు విష్ణ్వాలయాలకు అతి విలువైన కానుకలు చెల్లించేవారు. ఉత్సవాలు, ధూపదీప నైవేద్యాది కార్యక్రమాలు గొప్పగా జరిపేవారు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధమైన వైష్ణవ దేవాలయాలలో సర్పవరంలోని భావనారాయణ దేవాలయం, పిఠాపురంలోని కుంతీమాధవ స్వామి ఆలయం, శ్రీకాకుళంలోనీ ఆంధ్ర మహ విష్ణువు ఆలయం, ధర్మపురి, అహోబిలం, వేదాద్రులలోని నరసింహ స్వామి ఆలయాలు, శ్రీకూర్మంలో నరసింహ స్వామి ఆలయం ముఖ్యమైనవి. కళింగ ప్రాంతంలో ద్వైత సంప్రదాయ వైష్ణవ మతం గాంగ రాజుల ఆదరణ వల్ల వర్ధిల్లింది. రాధామాధవ ప్రేమతత్త్వం, శృంగారాత్మక భక్తి తత్త్వం బాగా ప్రచారమవటమేగాక వాని ప్రభావం నృత్య సంగీత కవిత్వాది కళలపైన పడింది. శ్రీకూర్మంలో అనేక మంది కవులు నటులు, గాయకులు, నర్తకులు దేవాలయాలని ఆశ్రయించుకొని ఉండేవారు. వారు తమ విద్యలు, కళల ద్వారా రాధా మాధవ తత్త్వాన్ని ప్రచారం చేశారు. అక్కడ కవి పండితులు అనేకులు దేశం నలుమూలలనుంచి వచ్చి వారివారి శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. అటువంటి వారిలో రాధామాధవ ప్రేమ గీతగోవిందంలోని తన అష్టపదుల ద్వారా అమరం చేసిన జయదేవ కవి, ముఖ్యులు. జయదేవుని అష్టపదులకు అక్కడ నృత్యమభ్యసించే తెలుగు దేశపు నృత్యాంగనలు అద్భుతంగా అభినయించేవారు. పూరీలోని జగన్నాథాలయంలో నర్తించడానికి ప్రత్యేకంగా తెలుగు దేశపు నట్టువరాండ్రను గాంగరాజులు తీసుకొనిపోయారు. కనుకనే పూరీ క్షేత్రంలని జగన్నాథాలయానికి చెందిన ఒక శాసనంలో తెలంగాణాకు చెందిన ప్రాచీనమైన నట్టువ మేళానికి వారి వంశం వారికి జయదేవుని గీతగోవిందం కీర్తనలు నేర్చి, అభినయించే హక్కు లభించింది. ఈ హక్కు పూరీ ప్రాంతపు నర్తకులకు లభించలేదు అని డా. సత్యనారాయణ రాజగురు గారు తెలిపారు. శ్రీకూర్మంలోని శిష్యులందరూ అతడిని సాధుప్రధాన గా మన్నించేవారని అతడు ‘కూర్మపాటక’ అనే పదవి నిర్వహించే వాడని కూడా అయన తెలిపారు. ఆ విధంగా వైష్ణవంలోని ద్వైత మతశాఖ రాధామాధవ ప్రేమ భక్తి తత్త్వాలను సంగీత నృత్యాల ద్వారా ప్రచారం చేసి ఆ కళలు పెంపొందేందుకు దోహదం చేసింది. కాకతీయ సామంతులు అనేకులు విష్ణు భక్తులు. కాకతీయ రుద్రదేవుని మంత్రి గంగాధరుడు అనుమకొండలో ప్రసన్నకేశవాలయం గొప్పగా నిర్మించినట్లు తన శాసనాలలో చెప్పుకొన్నాడు. మహాసామంత విరియాల నాగ సానమ్మ ప్రసన్నకేశవునికి రంగ భోగనైవేద్యార్ధమై దానాలిచ్చినట్లు పమ్మిశాసనం వల్ల తెలుస్తున్నది. గాంగరాజు అనంతవర్మ చోడగంగు రాణులు విష్ణ్వాలయాలకు ఎన్నొదానాలు చేసినట్లు శాసనాధారాలున్నాయి. కాకతిమైలమ ఇనుగుర్తిలో గోపాల కృష్ణాలయాన్ని కట్టించింది. కాకతి గణపతిదేవుని కుమార్తెకోట గణపాంబ గోపీనాధునికి ఒక పూదోటను, గానుగను అర్పించినట్లు యనమదలలోని ఒక శాసనంలో ఉన్నది. రెండవ ప్రతాపరుద్రునిదేవి లక్మాదేవమ్మ కరీంనగరు జిల్లాలోని యెన్గేడులోని రామనాధ దేవునికి కానుకలు సమర్పించింది

ఆనాటి రాజ వంశాల స్త్రీలు వైష్ణవ మత ప్రతిపాదితమైన నోములెన్నో నోచే వారని నాటి సాహిత్యం వల్ల తెలుస్తుంది. పలనాటి వీర చరిత్రలో అనుగురాజు భార్య వీరవిద్యలదేవి చెన్నకేశవుని నోము నోచి మలిదేవుని కన్నదని, బ్రహ్మనాయుని భార్య విష్ణువుకింపైన గజనిమ్మ ఫలాల నోము నోచి బాలచంద్రుని కన్నదనీ ఉన్నది. కుప్పాంబ వేయించిన బూదపూరు శాసనంలో ఆమె చేసిన ధర్మకార్యాలు వ్రతాలూ ఎక్కువగా విష్ణు సంబంధమైనవే. అనంత వ్రతం, లక్ష్మీనారాయణాఖ్య వ్రతం, జలశయనవ్రతం, అశూన్యశయ్యా వ్రతం, అసితసిత ద్వాదశీ వ్రతం మొదలైన వన్నీ మత్స్యపురాణంలో చెప్పబడిన వ్రతాలే, ఇవన్ని విష్ణు కృపను అశించి చేసేవి. కుప్పాంబ ముకుంద ప్రతిష్ఠ కూడా చేసిందని పై శాసనం వల్ల తెలుస్తుంది.

ఆ కాలంలోని వైష్ణవ కవులలో ప్రసిద్ధుడు కృష్ణమాచార్యులవారు. ఆయన రచించిన సింహగిరి వచనాలు తెలుగు వచన కవితకు వరవడి పెట్టినాయి. రాజులను భక్తులను ఆకర్షించేందుకు శైవ వైష్ణవాలు పోటీపడినట్లే వేశ్యాలోలత్వంలో కూడా పొటీ పడినట్లు అనిపిస్తుంది. శ్రీకాకుళం తిరునాళ్ళలో వ్యభిచారం ఎంతగా జరిగేదో క్రీడాభిరామాన్ని బట్టి తెలుసుకోవచ్చు. పరమ భక్తుడైన కృష్ణమాచార్యుల వేశ్యాలంపటత్వం గురించి సింహగిరి వచనాలలో వర్ణింపబడింది.

వైష్ణవ మతానుమాయులు అనేకులు తమిళ దేశం నుంచి వచ్చి వీర చోడరాజుదాన మిచ్చిన చతుర్వేదమంగళంలో గోదావరి మండలంలోని పిఠాపుర ప్రాంతం ఇతర ప్రదేశాలలోనూ స్థిరపడ్డారు. దీనివల్ల దేవాలయాలలో పూజలు, నైవేద్యాలు అన్నిటిపైన తమిళ దేశ ప్రభావం హెచ్చయింది. తెలుగు దేశాల శైవ మఠాలు కాశ్మీరు వంటి దూర ప్రాంతాల వారికి ఆశ్రయమిస్తే వైష్ణవక్షేత్రాలు దక్షిణదేశపు వారికి కూడలి స్థానాలైనాయి. ఈ మతాల వల్ల, దేశంలో కాకతీయుల నాటి రాజకీయ పరిస్థితులవల్ల విదేశీయులు, ఆరె, సౌరాష్ట్ర మొదలైన పొరుగు ప్రాంతాలవారు కాకతీయుల రాజ్యానికి రావడం వల్ల వారి సంస్కృతులు వేషభాషలు ఆదాన ప్రదానాల వల్ల తెలుగు సంస్కృతి సుసంపన్నం అయింది. ఈనాడు రాజకీయాలు నిర్వహించిన పాత్ర ఆనాడు మతం నిర్వహించింది. ఆనాడు దేవాలయాలు నిర్వహించిన సాంస్కృతిక కార్యకలాపాలు, కళాసేవ ఈనాటి చలనచిత్ర రంగం చేస్తున్నది. బాగా పరీశీలస్తే ఈనాడు మనం చూస్తున్న భిన్న సంస్కృతుల మేళగింపు (కాస్మోపోలిటన్ సంస్కృతి) కాకతీయుల నాడే ఉన్నట్లు గోచరిస్తుంది.

హరిహరారాధన:

కాకతీయుల పూర్వకాలం నుంచీ ఈ హరిహరారాధన ఉన్నది. శంకరాచార్యుని ఆద్వైత సిద్ధాంతం ఇందుకు మూలం కావచ్చు. కాకతి రాజులలో రెండవ ప్రోలరాజు నాటినుంచి కూడా ఈ హరిహరారాధన ఉన్నట్లుగా అనిపిస్తుంది. హరిగానీ, హరుడు గానీ ఒకరి కంటే ఒకరు అధికులు కాదనీ, ఇద్దరు ఒకే మూర్తికి రెండు స్వరూపాలనీ అతడే హరిహరమూర్తి అనీ, అతడే అర్చింపదగిన వాడని తెలిపి కొదరు ఈ సంప్రదాయాన్ని వెల్లడిచేశారు. కాకతి ప్రోలుడి మొదటి కొడుకు రుద్రుడు. రెండవ కొడుకు మహాదేవుడు. ఆతడికి మాధవ మహదేవ అనేది అసలు పేరు. ఈ విషయం కుందమాంబ తన కుందవరం నిడిగొండ శాసనాలలో తెలిపింది. ఆమె తన కొడుకుకు తండ్రి పేరైన మాధవ మహదేవ అనే పేరు పెట్టినట్లు ఆ శాసనాన్ని బట్టి తెలుస్తుంది. కాకతి ప్రోలునికి ఇంకా ముగ్గురు పుత్రులు వారిలో హరిహరుడు అనే అతనున్నట్లు కాకతి మైలమ త్రిపురాంతకం శాసనం వల్ల తెలుస్తున్నది. కాకతిరుద్రుడు కట్టించిన వేయిస్తంభాల గుడి ఒక త్రికూటాలయం వాసుదేవునికి, మహదేవునికి, ఆదిత్యునికి ఒకే దేవాలయం కట్టించడం అతను హరిహరతత్వాన్ని కూడా ప్రోత్సహించాడనడానికి నిదర్శనం. కాకతీయుల ఆడపడుచులు కుందమాంబ, మేలమాంబ, రుద్రాంబ, గణపాంబలు కూడా శైవ విష్ణ్వాలయాలకు దానాలిచ్చారు. మల్లికార్జున పండితుడు ఈ హరిహరమతాన్ని ఇతరమతాలతో పాటు ఖండించాడు. హరిహరుడనే మూర్తి ఉన్నప్పటికీ అతనికి దేవాలయం లేదని, ప్రమాణపూర్వకంగా ఖండించాడు. ఈ విధంగా పండితారాధ్యుని కాలంలో తగ్గిన హరిహరారాధన తత్త్వాన్ని తిరిగి పదమూడవ శతాబ్దిలో తిక్కన సోమయాజి తన మహాభారతంలో పునరుజ్జీవింప చేశారు.

కాకతీయుల కాలంలో పై మతాలేకాక శక్త్యారాధన కూడా విశేషంగా ఉండేది. కాకతీయుల కులదైవం కాకతమ్మ. కాకతి రుద్రాంబ కాకతి దేవతకు జాతర చేయించింది. ఏకవీరకు కూడా ఉత్సవాలు చేయించిందని ప్రతాపరుద్రుని చరిత్రను బట్టి తెలుస్తున్నది. ఓరుగల్లులో ఆమెకు గుడి ఉండేదని క్రీడాభిరామాన్ని బట్టి తెలుస్తున్నది. నూంకనమ్మ, బ్రోసినమ్మ, ఈరుగల సాని అనే దేవతలకు కూడా ఆలయాలు ఉండేవి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here