సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-23

0
4

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఉమాదేవి గతం గురించి రాసి ఉన్న పుస్తకం చదువుతూంటాడు రవి. ఆదర్శాలు లేని, సనాతన ఆచారాల వాసనలు తొలగని అగ్రహారంలో పుట్టి పెరుగుతుంది ఉమాదేవి. బాల్యం లోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఆమెను నలుగురు అన్నదమ్ములు పెంచి పెద్ద చేసి చదివిస్తారు. గ్రామంలో చదువు పూర్తయ్యాకా, ఆమెని పై చదువుకి పట్నానికి పంపించరు. ప్రైవేటుగా చదువుకుంటుంది. పెద్ద వదినలు ముగ్గురూ ఉమతో బాగానే ఉన్నా, ఆఖరి వదిన మాత్రం ఎప్పుడూ ఉమ మీద మీద చిటపట లాడేది. ఆ గ్రామం పూజారి గారి పిల్లలు సుకుమార్, సరస్వతి – ఉమకి మిత్రులు. బాల్యంలో ముగ్గురూ కలిసి ఆడుకునేవారు. యవ్వన ప్రాయం మొదలయ్యేసరికి వారి శారీరకాకృతిలోనూ, వారి భావాల్లోనూ మార్పులు వస్తాయి. ఆడపిల్లలపై ఆంక్షలు మొదలవుతాయి. వాటికి నెమ్మదిగా అలవాటు పడుతుంది ఉమ. ఇద్దరు ముగ్గురు దాత సహాయంతో చదువుకున్న సుకుమార్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ఇంటికి వస్తాడు. ఉమాని కలవాలని, పిలిపించమని చెల్లెలు సరస్వతిని అడుగుతాడు. అన్నయ్య ఉద్దేశం అర్థం చేసుకున్న సరస్వతికి వాస్తవ పరిస్థితి అర్థం అవుతుంది. అందని ద్రాక్ష పండ్ల కోసం అర్రులు జాస్తున్నాడు అన్నయ్య అనుకుంటుంది. అయినా అతని కోరికని కాదనలేక, ఉమ గుడికి వచ్చేలా చేస్తుంది. ఉమకి సుకుమార్ ఆలోచనలేవీ తెలియవు. చిన్ననాటి స్నేహితుడు ఒకసారి చూడాలనుకుంటున్నాడు కాబోలని వస్తుంది. ఆలయ ప్రాంగణంలోని వటవృక్షం నీడలో కూర్చుంటారు ఉమ, సుకుమార్. కాసేపు మామూలు మాటలయ్యాకా, తాను ఆమెని ప్రేమిస్తున్నట్లు చెప్తాడు. మర్నాడు మళ్ళీ కలుస్తారు. నిన్న తాను తొందరపడ్డానని అంటాడు సుకుమార్. ఆమె అన్నలను ఒప్పించి ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు. అయితే ముందు అతను జీవితంలో స్థిరపడాలని అంటుంది. పార్వతీదేవి విగ్రహం పాదాల చెంత ఉన్న కుంకుమ తీసి ఆమె పాపిట మధ్యలో ఉంచబోతాడు. ఇంతలో ఉమ నలుగురు అన్నలు అక్కడ ప్రత్యక్షమవుతారు. అతన్ని బాగా కొడతారు. కొట్టద్దని ప్రాధేయపడిన పూజారి గారిని, ఉమని పక్కకు తోసేస్తారు. ఉమ చిన్న అన్నయ్య గుడిలో నున్న దీపపు సెమ్మ తీసి సుకుమార్ తల మీద కొడ్తాడు. రక్తం కారుతున్న సుకుమార్ పడిపోతాడు. గబుక్కున తన రుమాలుని ఆ గాయంపై అద్దుతుంది. రుమాలు రక్తంతో తడిసిపోతుంది. ఆమెను బరబరా ఈడ్చుకుని ఇంటికి తీసుకు వచ్చి గదిలో పెట్టి గడియ పెడ్తాడు ఆఖరి అన్నయ్య. నిస్సహాయంగా విలపిస్తుంది ఉమాదేవి. ఇక చదవండి.]

అధ్యాయం-45

[dropcap]ఈ[/dropcap] సంఘటన జరిగి మూడు నెలలయినా ఉమకి ఇంటిలో స్వతంత్రం లేదు. స్వేచ్ఛ అంత కన్నా లేదు. ఒక విధంగా చూస్తే తను తన ఇంట్లోనే ఖైదీ అని అనుకుంది ఆమె. వేళకి ఇంత తిండి పడేసేవారు. గదిలో కూర్చుని పిచ్చిగా ఆలోచించుకుంటూ ఒంటరి జీవితం గడిపేస్తోంది. సుకుమార్ ఎలా ఉన్నాడో? అతనికి ఏమయ్యందో ఆమెకి తెలియదు. అతని రక్తంతో తడిసిన రుమాలు మాత్రం తన దగ్గర పదిలంగా ఉంది. దాన్ని చూస్తూ కుమిలిపోతూ కాలం గడిపేస్తోంది ఆమె. భగవంతుడి దయ వల్ల అతను క్షేమంగా ఉండాలి. అతనికే హానీ జరగకూడదు అని అనుకునేది మనస్సులో ఒక్కొక్క పర్యాయం. అయితే అతని గురించి ఒక్క విషయం కూడా ఆమెకి తెలియలేదు ఈ మూడు నెలల కాలంలో.

ఒంటరి చీకటి బ్రతుక్కి ఆమె విసిగిపోయింది. మనస్సు అశాంతితో నిండి పోయింది. భగవంతుడి సన్నిధిలోనైనా తనకి శాంతి లభిస్తుందేమో! ఓ మారు గుడికి వెళ్ళి రావాలనుకుంది. ఆమె తన మనస్సులో అదే కోరికను పెద్ద వదినతో చెప్పింది. అందరికంటే ఆమె సౌమ్యురాలు. ఉమ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వదిన మగవాళ్ళని ఒప్పించి ఉమ గుడికి వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేసింది.

ఉమ పెద్ద వదినకి మనస్సులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంది.

“తల్లీ! మమ్మల్ని ఈ మాత్రమేనా బ్రతకనీయవా? మా బ్రతుకు ఇలా కూడా సాగించడం నీకిష్టం లేదా? నీ వల్ల ఎంత అనర్థం జరిగిపోయిందో తెలుసా? చేతికందికొచ్చిన చెట్టంత కొడుకుని పోగొట్టుకుని, కుమిలిపోతూ జీవచ్ఛవంలా రోజులు నెట్టుకొస్తున్నాం. వాడు చేసిన తప్పేంటి? వాడు నిన్ను ప్రేమించడమే తప్పయితే ఆ తప్పులో నీకు కూడా భాగముంది. ఆ తప్పుకి వాడొక్కడే శిక్ష అనుభవించాలా? ఆ తప్పులో నీవూ భాగస్తురాలివే. నీకు ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడు. నీవేం సుఖపడ్తావు? జీవితాంతం మరిచిపోనంత నరక యాతన అనుభవిస్తూ క్షణక్షణం కుమిలిపోతూ అశాంతికరమైన జీవితం నీవు గడుపుతావు. అలా నేను నిన్ను శపిస్తున్నది శాపం అనుకోకు, ఇది బాధ. గుండెల్లో గూడు కట్టుకున్న బాధ. శరీరం అణువణువునా దహించి వేస్తున్న బాధ. నా కొడుకు జీవితం బుగ్గి పాలయిందన్న బాధ.

ఇలాంటి బాధ ననుభవించే కంటే ఆ భగవంతుడు నన్ను తీసుకుపోయినా బాగుండును. పేదవాడి కోపం – ఆక్రోశం ప్రాణానికే ముప్పు అన్నట్టు నేను ఎవరి మీద కోపం చూపించగలను? ఎవరిని నిందించగలను? నా దురదృష్టాన్ని నేనే నిందించుకోవడం తప్ప” నుదురు కొట్టకుంటూ అన్నారు పూజారి గారు.

అపరాధం చేసిన అపరాధిలా అలా నిలబడిపోయింది ఉమాదేవి. అశాంతితో అలమటిస్తున్న తన మనస్సుకి శాంతి పొందుదాం అన్న తలంపుతో తను గుడికి వచ్చింది. అయితే ఇక్కడ కూడా ఆమె మనస్సు కలిచి వేసే మరింత అశాంతిమయం చేసే సంఘటన జరిగేటప్పటికి ఆమె మనస్సు విలవిల్లాడింది. పూజారి గారి శాపం తనకి తప్పకుండా తగుల్తుంది అన్న ఆలోచన రాగానే కళ్ళలో నుండి కన్నీరు క్రిందకి జారుతోంది. ఆ కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంటున్న ఉమాదేవి భుజాలు మీద రెండు చేతులు పడ్డాయి. తల పైకెత్తి చూసింది సరస్వతి ఎదురుగా అగుపడింది.

“సరస్వతీ!” అంటూ ఆమె గుండెల మీద తల ఆన్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఉమాదేవి. సరస్వతి కళ్ళలో కూడా కన్నీరే. ఉమని నడిపించుకుంటూ ఇంటిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది సరస్వతి. త్రాగడానికి ఇన్ని మంచి నీళ్ళు ఇచ్చింది. ఆ నీళ్ళు త్రాగగానే ఉమాదేవికి స్వస్థత చేకూరింది. ఆ తరువాత సరస్వతి ఉమకి ఒక్కొక్క సంఘటన వివరిస్తోంది.

***

సుకుమార్ తల నుండి రక్తం కారుతోంది. తెలివి తప్పిపడిపోయాడు. ‘ఆ విషయం ఎవరికైనా చెప్పారో నిలువ నీడలేకుండా చేస్తాం’ అని పూజారి గారిని బెదిరించి వెళ్ళారు ఉమాదేవి అన్నదమ్ములు.

తను పౌరోహిత్యం చేస్తున్న ఓ పేరు మోసిన డాక్టరు దగ్గరికి కొడుకుని తీసుకెళ్ళారు ఆయన. అసలు విషయం మరుగుపరిచి ఈ అవస్థలో గుడి దగ్గరపడి వుంటే తీసుకు వచ్చామని చెప్పారు పురోహితులు గారు.

‘బ్రతకడం కష్టం. ఒకవేళ బ్రతికినా మతిస్థిమితం లేకుండా ఉంటాడు. మెదడుకి పెద్ద దెబ్బ తగిలింది’ అని డాక్టరు గారు చెప్పారు. అతని మాటలు వినగానే పూజారి గారు కుప్పలా కూలబడిపోయారు. ఆయనకి కళ్ళు చీకట్లు క్రమ్ముతున్నాయి. గుండెలనిండా బాధ, చేతికందుకొస్తున్న కొడుకు ఇలా తయారయినందుకు ఆత్మక్షోభ ఆయన్ని మరింత కలవర పెడ్తోంది. తన కొడుకు మతిస్థిమితం లేకపోయినా పరవాలేదు. మనిషి చనిపోకుండా తన కళ్ళెదుట ఉంటే అదే చాలు. ఇదే ఆయన కోరిక. ఆశ కూడా. తన కోరిక డాక్టరు గారికి తెలియజేసి ఎలాగైనా తన కోరిక నెరవేర్చమని డాక్టరు గారి రెండు చేతులూ పట్టుకుని బ్రతిమాలారు పూజారి గారు.

తనకి సాధ్యమైనంత వరకు ప్రయత్నించి పూజారి గారి కోరిక నెరివేరేటట్టు చూస్తానని మాటిచ్చారు డాక్టరు గారు. అతను చెప్పినట్టే సుకుమార్ ప్రాణ గండం తప్పి బ్రతికాడు కాని మతిస్థిమితం లేదు. పిచ్చి చూపులు, పిచ్చి చేష్టలూ ఇదీ సుకుమార్ పరిస్థితి.

కొడుకు స్థితి చూసి కుమిలి పోయింది పూజారి గారి పితృ హృదయం. ఎలాంటి కొడుకు ఎలా అయిపోయాడు అని అనుకుంటూ కుమిలి పోతున్న పూజారి గారికి తిండి తినబుద్ధి వేయటం లేదు.

సంఘటన జరిగిన తరువాత చాలా రోజులు వరకూ ఆయన మనిషి అవలేకపోయారు. అలా క్రుంగిపోతున్న ఆయన్ని మరింత క్రుంగదీస్తూ ఓ రోజు తెల్లవారు జామున పక్క మీంచి లేచిన పూజారి గారికి కొడుకు సుకుమార్ కనిపించక పోవడం మరింత మనస్తాపానికి గురి చేసింది. ఎన్నో చోట్ల వెతికించినారు. ఎందర్నో వాకబు చేశారు. అయితే వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.

***

‘అయ్యో! అంత పని జరిగిందా? ఇవేవీ నాకు తెలియవు’ అనుకుని బాధపడ్తున్న ఉమాదేవి తన బాధ స్నేహితులరాలి దగ్గర తెలియజేసింది.

“నాన్నగారు ఇప్పుడిప్పుడే మనిషి అవుతున్నారు, తేరుకుంటున్నారు. ఉమా! ఆయన హృదయానికి అయిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఇటువంటి పరిస్థితిలో నీవు కంటబడే సరికి మానుతున్న గాయం తిరిగి కెలికినట్లు అయ్యింది. అందుకే నిన్ను అలా నిందించారు. ఆయన మాటల్లో నీ మీద కోపం కన్నా చెట్టంత కొడుకు దూరమయ్యాడన్న బాధ ఉంది,” సరస్వతి ఉమాదేవితో అంది.

“మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీ జీవితాల్ని అశాంతి పాల్జేసాను. చిన్నాభిన్నం చేసాను. పాపిష్టి దాన్ని, దుర్మార్గురాల్ని. నాకు మీ నాన్నగారిచ్చిన శాపం తగినదే,” బాధగా నుదురు కొట్టుకుంటూ అంది ఉమాదేవి.

“జరగవల్సింది ఎలాగూ జరిగిపోయింది. ఇప్పుడు ఎవర్ని ఎవరు ఎన్ని విధాలుగా నిందించుకున్నా ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది ఉమా?” అంది సరస్వతి.

“ఏమీ బాగా లేదు,” అని అంటూ తనకి ఇంటిలో జరుగుతున్న సత్కారం. తను ఇంటిలో గడుపుతున్న నరక జీవితాన్ని వివరించి బావురుమంది ఉమ. సరస్వతి కళ్ళల్లో కూడా ఉమ స్థితి తెలియగానే కన్నీటి తెర తళుక్కుమంది. గాఢంగా నిట్టూర్పు విడిచి అలాగే ఉండిపోయింది.

అధ్యాయం-46

“అమ్మాయ్ అనసూయా! ఇంత ఆస్తి, సిరి సంపదలు ఉన్నా ఏంటి లాభం. నీ తమ్ముడు ఆ రాజకీయాల్లో తిరుగుతూ తిరుగుబోతు అయ్యాడు. జూదగాడయ్యాడు. ముందు ముందు త్రాగుబోతు కూడా అవుతాడని నా భయం. ఒక ఆడపిల్ల తలచెడి ఇంట్లో ఉంది. మరొకతి పెళ్ళయినా ఇంట్లోనే ఉంది. వీడు చూస్తే ఇలా తయారయ్యాడు. మా మనస్సులు ఎంత క్షోభిస్తున్నాయో తెలుసా? మేము ఉన్నన్నాళ్ళు పరవాలేదు ఆ తరువాతో? మేము కళ్ళు మూసుకోగానే ఆస్తిని హారతి కర్పూరంలా హరింప చేస్తాడన్నదే మా బాధ,” అనసూయ దగ్గర పింతల్లి తన సంతాపాన్ని వెల్లడించిది.

‘ఆ శంకరం ఇలా తయారయ్యాడా? పిన్ని ఎంత బాధపడుతోంది. వాడికి బుద్ధి చెప్పి సరియైన దారిలో పెట్టాలి,’ ఇలా ఆలోచిస్తోంది అనసూయ.

“వాడికి తగిన అమ్మాయిని చూసి ఓ ఇంటి వాడ్ని తొందరగా చేసేయ్యాలే అమ్మాయ్! అప్పుడే వాడికి బాధ్యతలు తెలిసి వస్తాయి. బాగుపడ్తాడు. ఇదే నా ఆలోచన” అంది పింతల్లి.

పిన్ని మాటలు అనసూయకి నచ్చాయి. “నిజమే! అలాగే చెయ్యండి, పిన్నీ! పిల్లా జెల్లా పుట్టుకొస్తే వాడికే బాధ్యతలు తెలిసొస్తాయి,” అంది అనసూయ.

“వాడి సంగతి తెలిసి ఎవరు పిల్లనివ్వడానికి ముందుకొస్తారే అమ్మాయ్! నా పిచ్చిగాని,” నిరాశగా అంది పింతల్లి.

“ఆఁ ఎందుకివ్వరు? పిన్నీ? మగవాడు వాడు. ఆ మాత్రం తిరగకపోతే ఎలా? వాడికేం తక్కువ? మీరు వాడికి పెళ్ళి చేయాలని అనుకోవాలే కాని ఆడపిల్లలున్న తల్లిదండ్రులు మీ ఇంటి ముందు క్యూ కడ్తారు,” అంది అనసూయ.

“ఏమో అమ్మాయ్! వీడి వరస తెలిసిన ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు వస్తారన్న నమ్మకం నాకు లేదు” పింతల్లి గొంతుకలో అనసూయకి నిరాశ – బాధ అగుపించాయి.

“ఒక్క పని చేయకూడదూ?”

“ఏంటి పిన్నీ?”

“అదేనే! మీ ఆడబడుచుని శంకరం గాడికి ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.”

పింతల్లి మాటలు విన్న తరువాత అనసూయ ఆలోచన్లలో పడింది. ‘నిజమే! పిన్నీ వాళ్ళయితే తక్కువ కట్న కానుకలిచ్చినా చేసుకుంటారు. ఎందుకంటే శంకరంలో లొసుగులున్నాయి కాబట్టి. తన ఆడబడుచు ఉమ బాగుంటుంది. అదొక ప్లస్ పాయింట్. శంకరం ఆస్తిపరుడు. మంచి పలుకుబడి ఉన్నవాడు. అటువంటి వాడు ఇంటికి అల్లుడుగా రాబోతున్నాడంటే ఎగిరి గంతేసి తన అత్తవారి తరుపు వాళ్ళందరూ అంగీకరిస్తారు. అదే పై సంబంధమయితే లక్షలకి లక్షలు కట్న కానుకులు ఇవ్వాలి, పెళ్ళి చేయాలి. ఇప్పుడయినా అన్నదమ్ములందరూ కల్సి పెళ్ళి ఖర్చు భరించాలి. లక్షలకి లక్షలు ఖర్చు చేసి, పెళ్ళి చేయడానికి తన భర్త కూడా డబ్బు ఇయ్యవల్సి వస్తుంది. రేపొద్దున్న తను సంతానానికి ఏం నిర్వాకం చేయగలరు. ఇలా అయితే? అలా జరగకూడదు. ఈ సంబంధమే అయ్యేటట్లు చూడాలి,’ ఇలా ఆలోచిస్తోంది అనసూయ.

“ఏంటి ఆలోచిస్తున్నావే అమ్మాయ్!”

“నీవన్న మాటలు గురించే పిన్నీ!”

“ఆలోచిస్తూ అలా కూర్చోడం కాదే అమ్మాయ్! ఆచరణలోకి పెట్టి చూడు,” సలహా ఇచ్చింది పింతల్లి.

“ప్రయత్నిస్తాను,” అనసూయ భరోసా ఇచ్చింది.

“ప్రయత్నించడం కాదు సాధించి తీరాలి,” నొక్కి పలుకుతూ అంది పినతల్లి.

మరుసటి రోజు నుండి ఇంట్లో వాళ్ళకి ఉపదేశం చేయడం ఆరంభించింది అనసూయ. మొదట అనసూయ మాటల్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు గాని ఆ తరువాత ఆలోచన్లలో పడ్డారు. ఆలోచించిన తరువాత అనసూయ మాటల్లో నిజం ఉందన్న విషయం గ్రహించారు ఆ ఇంటి మిగతా కోడళ్ళు. తమ భర్తలకి ఉపదేశం చేయడం ఆరంభించారు. తమ సంతానం భవిష్యత్తు కూడా చూడాలన్న ఆలోచన వచ్చింది ఆ ఇంటి కొడుకులకి, కోడళ్ళకి.

‘శంకరానికేం తక్కువ? ఆస్తిపరుడు. రాజకీయంగా పలుకుబడి గలవాడు. చెల్లెలు సుఖపడ్తుంది. సుకుమార్ సంగతి తెలుస్తే చెల్లెలికి పెళ్ళి కూడా అవడం కష్టం’ ఇలా ఆలోచన్లలో పడిన అన్నదమ్ములు, చెల్లెల్ని ఒప్పించి శంకరంతో ఉమాదేవి పెళ్ళి నిశ్చయించారు.

శంకరం మంచివాడు కాదని ఉమకి కూడా తెలుసు. అయితే అందరి మాటా ఒకటయిన నాడు తను ఒక్కర్తే ఏం చేయగలదు? తన అభిప్రాయంతో ఎవ్వరికీ సంబంధం లేదు. చిన్నప్పుడు అపురూపంగా పెరిగిన ఒక్కగాని ఒక్క చెల్లి ఉమ పరిస్థితి తిరిగి ఇలా తయారయింది. ఇప్పుడు అన్నీ కష్టాలే. తన బాధలన్నీ సరస్వతితో చెప్పుకుని కరువు తీరా ఏడుద్దామంటే బయటకి వెళ్ళకుండా తనకి అన్నీ ఆంక్షలే. తను నిస్సాహయురాలు. కుటుంబ సభ్యుల్ని ఎదిరించి పోరాడలేదు. అందుకే జీవితంతో రాజీపడాలి. తను ఓ యంత్రంలా మారిపోవాలి. యాంత్రిక జీవితం గడపాలి. మనసు లేని మర మనిషి అయిపోవాలి. ‘ఇదంతా నా నుదుటి రాత. పూజారి గారు ఇచ్చిన శాపం తన జీవితంలో ఆరంభమవుతోందా అని అనిపిస్తోంది’ అనుకుంది ఉమాదేవి. ఇప్పుడు తన పరిస్థితి పంజరంలో బంధించిన పక్షి. ఇప్పుడు తనకి స్వేచ్ఛ లేదు. స్వాతంత్రం అంతకన్నా లేదు. ఓ వ్యక్తిత్వం లేదు – గదిలో కూర్చుని ఇలా ఆలోచిస్తోంది ఉమాదేవి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here