[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]
[చరిత్ర మీద ఆసక్తితో పిజి చేసిన మేరుకి ఆర్కియాలజిస్టుగా స్టేట్ గవర్నమెంటు ఉద్యోగం వస్తుంది. చేరిన రోజే బాస్ వెంకటాచారి గారితో చక్కటి చర్చ జరుగుతుంది. కొద్దిరోజులకే ఆయనతో గొప్ప అనుబంధం ఏర్పడుతుంది మేరుకి. ఆయనో విజ్ఞాన నిధి. పురావస్తు తవ్వకాల గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు మేరు. ఆయన వద్ద నుంచి స్కెచింగ్, ప్రతీ చిన్న విషయాన్ని కాయితం మీద రాసుకోవడం నేర్చుకుంటాడు మేరు. కొత్త పోస్టింగ్‍లో శ్రీశైలంలో జరుగుతున్న తవ్వకాలకి ఇన్-ఛార్జ్‌గా వస్తాడు మేరు. ఆలయానికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకుంటాడు. శ్రీశైలం గురించి అమ్మానాన్నలు, నాయనమ్మ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. అక్కడకి దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడిని చూసి ఏదో అద్వితీయమైన భావనకి గురవుతాడు మేరు. ఇంతలో కొలీగ్ జి.వి. వచ్చి పలకరిస్తాడు. తన గదికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇద్దరు కలిసి దేవాలయం నుంచి తవ్వకాల ప్రాజెక్టు స్థలానికి బయల్దేరుతారు. అది చాలా చిన్న పల్లెటూరు. చారిగారు, ఎపిగ్రాఫిస్ట్ రమణ, ఫోటోగ్రాఫర్ చంద్రశేఖర్ అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఓ పొలంలో దొరికిన వస్తువుల గురించి విచారణ జరుగుతుంది. పొలం యజమాని రామిరెడ్డి, పాలేరు మల్లయ్య, మల్లయ్య భార్య గౌరమ్మ కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తారు. తమకి ఆ పూసలు, నాణేలు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో దొరికాయని చెప్తారు. వాటిని తవ్వి బయటకి తీసిన జంగయ్య చనిపోయాడని చెప్తారు. రామిరెడ్డి మాత్రం అదంతా కట్టుకథ అని అంటాడు. వాళ్ళందరికి హెచ్చరించి కలెక్టర్ గారు తవ్వకాలు జరుగుతున్న స్థలానికి వస్తాడు. చారి గారు, మేరు, చంద్రం, రమణ తమ పనిలో లీనమైపోతారు. మేరుని సైట్ ఇన్-ఛార్జ్‌గా నియమించి వాళ్ళంతా వెళ్లిపోతారు. రాజన్న, రాజన్న భార్య చెంచి, రంగమ్మ మొదలైన వాళ్ళతో పని మొదలుపెడతాడు మేరు. నిధిని కాపాలకాసే నాగుపాము నిధిని స్వాధీనం చేసుకుందామనుకునేవాళ్ళని కాటేస్తుందట కదా అని రాజన్న అడిగితే, అవన్నీ కల్పితాలని అంటాడు మేరు. చిన్నప్పుడు తనకి నాయనమ్మ, నాన్న చెప్పిన గాథలు గుర్తుచేసుకుంటాడు. భోజనానికి రమ్మని చెంచి పిలవటంతో జ్ఞాపకాల్లోంచి బయటపడతాడు మేరు. – ఇక చదవండి.]
అధ్యాయం 3
[dropcap]త[/dropcap]వ్వకాల దగ్గర రెండు వారాలు గడిచి పోయాయి. దాదాపు పది మీటర్ల లోతు తవ్వగలిగారు.. తవ్వకాల దగ్గర లోపలికి దిగడానికి రాజన్న మెట్లలాగే ఏర్పాటు చేసాడు. వాటి సహాయంతో మేరు, అతని కొలీగ్స్ లోపలికి దిగి కొత్త వస్తువు ఏదైనా దొరుకుతాయా అని పరిశీలన చేశారు. చిన్న కుండ పెంకు దగ్గర నుంచి లోహపు వస్తులు దాకా ఏది దొరికినా జాగ్రత్తగా బట్టలో చుట్టి పైకి తీసుకొచ్చేవారు.. వాటిని జాగ్రత్త చేసి, నెంబర్లు వేసి, మరింత పరిశోధన కోసం తన గదిలో పెట్టించేవాడు మేరు. లోహపు వస్తువులు దొరికితే ఇంకా శుభసూచకం. వాటి మీద వున్న చిహ్నాలు, లతలు, శాసనాలు.. ఇవన్నీ చారిత్రక ఆధారాలు.
ఆ రోజు సాయంత్రం చెప్పాపెట్టకుండా ఊడిపడ్డాడు చంద్రం. “హాయ్” అంటూ మేరుని పలకరించాడు. ‘తలచుకుంటే చాలు గుమ్మంలో దయ్యం ప్రత్యక్షం’ అంటూ నవ్వుతూ పలకరించే చంద్రం రాక మేరుకి చాలా ఆనందం కలిగించింది.
“ఏమిటి చంద్రం అనుకోకుండా వచ్చావు, ఆఫీస్ పని మీదా?”
“కాదు బాబూ, హైదరాబాదు ఆఫీసులో కూర్చుని బోరుకొట్టింది. అందుకే ఇలా వచ్చాను. అయినా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, హాయిగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చావు..”
“ఈ మాట మాత్రం నిజం.. శ్రీశైల క్షేత్రానికే ఒక మహిమ వుంది.. ఈ నది ప్రవాహపు హొయలకు మెచ్చి మల్లికార్జునుడు ఇక్కడ వెలసాడో లేక, మల్లికార్జునుడిని పూజించటానికి ఈ నదే ఇటు ప్రవహిస్తోందో? ఒడ్డున నడుస్తున్నప్పుడల్లా ఈ విషయమే ఆలోచిస్తాను. ఆ కృష్ణవేణి ప్రవాహం చక్కటి పాటలా సాగుతున్నట్లుంటుంది. నది ఒడ్డున నడుస్తూ.. ఆ నదీ ప్రవాహాన్నీ చూడాలంటే నాకు చాలా ఇష్టం..” అన్నాడు మేరు భావుకతతో.
“నాయనా నీ భావుకతకి, నీ కలలకి ఓ దండం.. నేను వచ్చింది మా మేనమామ కూతురు శైలజ కోసం. మా మేనమామ ఇక్కడ ఆయుర్వేద డాక్టరు” అన్నాడు కన్ను కొడుతూ కొంటెగా.
“మరీ చెప్పవేం, పెళ్ళి చేసుకుంటున్నావా?”
“అది అంత సులభం కాదు. మనం స్టేట్ గవర్నమెంటు ఉద్యోగులం. అందులోనూ నేను ఫోటోగ్రాఫర్‌ని. ప్రమోషన్స్ వుండవు.. అదనపు ఆదాయాలంత కన్నా వుండవు. ఎవరు ఇస్తారురా పిల్లని..”
“పోని కట్నం లేకుండా చేసుకుంటానని చెప్పు..”
“అది మా అమ్మానాన్నలకి నచ్చదు.. నా కట్నం మీద వాళ్ళ ఆశ.. దానితో మా చెల్లెలి పెళ్ళి చెయ్యాలని”
“నీ పరిస్థితి అర్థమైంది మరిప్పుడు ఏం చేస్తావ్?”
“నాకు ఒకటే ఆశరా.. ఇలా తరుచు వచ్చి శైలజని కలుస్తుంటే ఏనాటికైనా మా ఇద్దర్ని మా మేనమామ కలుపుతాడని..”
మాట్లాడుతున్నగాని కెమెరా కళ్ళలాంటి చంద్రం దృష్టిలో చెంచి పడింది. చెంచి వంగి రాళ్ళు ఏరి గమేళాలో వేస్తుంది. ఆమె పడుచుదనం అద్దాల జాకెట్టులో నుంచి తొంగి చూస్తోంది.. అరటి దూడలాంటి కాళ్ళు.. పాదాలకున్న తెల్లటి పట్టీలు, జాకెట్టుకి మెరుస్తున్న అద్దాలు.. అడవిలో పూసిన కొండమల్లెలా వుంది.. రాళ్ళు ఏరి గమేళా నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయింది.. చంద్రం కెమెరాకు బంధీ అయింది చెంచి రూపం.. చంద్రానికి అందమైన వస్తువు ఏదైనా కెమెరాలో బంధించడం అలవాటు.. ముఖ్యంగా శృంగార దృశ్యాలు ప్రకృతిలో వున్న దేనినైనా, అవి మనుషులే కావచ్చు, జంతువులే కావచ్చూ.
“చెప్పు మేరు ఉద్యోగం ఎలా వుంది.. ప్రాజెక్టు ఎలా వుంది..” అడిగాడు చంద్రం, కెమెరా షటర్‌ని మూసేస్తూ.
“చాలా బాగుంది, నాకిష్టమైన ఉద్యోగం కదా.. ఈ ప్రశ్న ఇప్పటికి ఎంతమంది అడిగారో తెలుసా? అయినా ఇది నా కల” చెప్పాడు మేరు.
“కలా? అసలు నీకు ఈ చరిత్ర అంటే ఇంత ఇష్టం కలగడానికి కారణం ఎవరు? దేవదూతలా?”
“చిన్నప్పుడు స్కూల్లో టీచర్ వసుధా మేడం!” మేరు గొంతులో ఆత్రుత ధ్వనించింది. తనలో దాచుకున్నదంతా గబగబా చెప్పేయాలనుకున్నాడు.
“నేను కౌమారంలో, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ‘హోమ్‍కమింగ్’లో పథిక్ లా ఉండేవాడిని. వసుధా మేడం మాకు హిస్టరీ టీచర్‌గా వచ్చారు. ఆమె చాలా అందంగా వుండేది.. ఇప్పటికీ జ్ఞాపకం.. ఆమె కళ్ళు విశాలంగా బాదంకాయ ఆకారంలో వుండేవి.. నల్లటి పొడువైన జుత్తు.. బోర్డు మీద రాయడానికి ఆమె వెనక్కి తిరిగినప్పుడు ఆమె జడ నడుం మీద నాగుపాములా నాట్యం చేసేది.. ఆవిడ పాఠం చెబుతుంటే కొంచెం కూడా విసుగ్గా అనిపించేది కాదు.. చరిత్ర అంటే అందరికి బోర్, కాని ఆవిడ చెప్పే విధానం వలన ఎంతో ఆసక్తి కలిగేది.. నాలో మన సంస్కృతి పట్ల అభిమానం పెంచింది” అంటూ ఓ క్షణం ఆపాడు మేరు.
వసుధ మేడమ్ క్లాస్ చెప్తున్నట్టు భావించుకున్నాడు మేరు.
“ఆవిడ గొప్ప కమ్యూనికేటర్. భాష కేవలం ఓ పరికరం ఆవిడకి. అసలు ఆవిడ ఏ రోజూ నోట్సు తయారుచేసుకొని చెప్పగా చూడలేదు. అంతా ఆవిడ మెదడులో వుండేదనుకుంటా, సంవత్సరాలు, తేదీలు, చరిత్రకి కావలసినదంతా వేళ్ళ మీద చెప్పేది.. ఆవిడ చెబుతుంటే, పల్చటి వేళ్ళు అందమైన చేతులు, నాట్య భంగిమల్లా అనిపించేవి.. నా ఆసక్తి, ఇష్టం గమనించి నన్ను దగ్గరకి తీసుకొని, చరిత్ర గురించి చెప్పేది.. – ‘చరిత్ర గతాలని గుర్తుపెట్టుకొనే సంఘటన లాంటిదే కాదు! వర్తమానానికి భవిష్యత్తుకి రహదారి లాంటిది. చరిత్ర పట్ల ఆసక్తి వుంటే గాని దాని గురించి తెలుసుకోవాలనిపించదు’ అని. తొమ్మిదో తరగతి చదివే మేమంతా మంత్రముగ్ధులం అయిపోయేవాళ్ళం. ఆవిడ క్లాస్ ఎప్పుడూ మిస్ అయ్యేవాళ్ళం కాదు.
అప్పుడు నాకొక సందేహం కలిగింది.. ఆవిడ చెప్పేవనీ అతిశయోక్తులుగా కూడా అనిపించేవి. చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పేది. అశోకుడు పుడతాడా, పుట్టి ఏం చేస్తాడు. గాంధీజీ మళ్ళీ పుడతాడా, స్వాతంత్ర్యం వచ్చేసిందిగా పుట్టి ఏం చేస్తాడు అనుకొనేవాడ్ని.. చంద్రం, ఆవిడ నా చేతులు పట్టుకొని, చరిత్ర ఎందుకు పునరావృతం అవుతుందో చెబుతుంటే, ఆశ్చర్యమనిపించింది. ఆమె చెప్పినదాన్ని ఇప్పటికీ మరచిపోలేనురా.. ఆవిడ చెప్పిన వన్నీ శ్రద్ధగా విన్నాను. చరిత్ర మీద అభిమానం పెంచుకొన్నాను.. అందుకే చరిత్రలో ఒక భాగం అయిపోవాలనుకొన్నాను.. చరిత్ర చదువుతూ పాఠకుడిలా వుండి పోకుండా చరిత్రని సృష్టించాలని ఆకాంక్ష..” ఆవేశంగా చెబుతున్న మేరు మాటలను ఆసక్తిగా వింటున్న చంద్రం.. “సారూ.. సారూ..” అంటున్న రాజన్న కేకతో ఉలిక్కిపడ్డాడు.
ఇద్దరూ పరుగులాంటి నడకతో తవ్వకం జరుగుతున్న దగ్గరకి చేరుకున్నారు.
“ఇటు చూడండి సారు..” అంటూ ఉద్వేగంగా లోపలికి చూపించాడు రాజన్న.
మూడు రోజుల నుండి, పెద్ద బండరాయిని తొలగించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు పనివాళ్ళు.. వాళ్ళ శ్రమ ఫలించింది. తొలిగిన బండరాయి లోపలికి చక్కటి మెట్లు వున్న దారి కనిపిస్తోంది.
“చంద్రం చూడూ, నీకు కుడివైపుగా మెట్ల పక్కన సన్నటి వెలుగు కూడా కనిపిస్తోంది, ఎడమవైపు సొరంగం ఉండి ఉండచ్చు” అన్నాడు మేరు. అతని స్వరంలో ఉత్సాహం.
“దీని వెళ్ళి చూద్దామా అసలు ఎంతదూరం వుందో?” అడిగాడు మేరు చంద్రాన్ని.
చంద్రం మేరు దిగిచూడాలని నిశ్చయించుకొన్నాక పని వాళ్ళందర్ని భోజనానికి పంపించేసి రాజన్న సహాయంతో ఫ్లాష్ లైట్ల సహాయంతో కిందికి దిగారు. రాజన్న ముందు నడుస్తున్నాడు. మరో పది నిమిషాల్లో సొరంగం ముందుభాగానికి వచ్చారు.
అదొక గ్రానైట్ నిర్మాణం. అక్కడ నిర్మించబడ్డ మెట్లు మూడు అడుగుల వెడల్పుతో, నేరుగా ఓ బావిలోకి సాగుతున్నాయి. మేరు గోడలని అరచేత్తో తట్టి చూసాడు, ఆ కాలం నాటి రాతి పలకలని వాటి ఆకారాన్ని తెలుసుకోవడానికి. తల మీద వెలుగుతున్న ఫ్లాష్ లైట్ కొంచెం మందగించినట్లు అనిపించింది. ఆ మసక వెలుతురుతో గోడలపై రంగురంగుల చిత్రాలు, వరుసగా ఒక పద్దతి ప్రకారంగా కనిపించాయి. పెద్ద పెద్ద బుట్టలు, వాటిల్లో పూల దండలు.. వాటిని తీసుకువెళుతున్న మనుషుల చిత్రాలవి.
జాగ్రత్తగా దిగుతున్నారు వాళ్ళు ముగ్గురూ.. తవ్వకాల కోసం, అడ్డదిడ్డంగా పడి వున్న ఇనుప చువ్వలను తప్పించుకుంటూ మెట్లు దిగుతూ బావి అడుగు భాగానికి చేరుకొన్నారు. సొరంగం చేరుతున్న కొద్ది వెలుగు పల్చబడింది.. ఎత్తు బాగా తక్కువగా వున్న మనిషి వెళ్ళడానికి వీలుగా వుంది.. రాజన్నకి కూడా చాలా ఆసక్తిగా వుంది.
“ఈ దారి ఎక్కడికి వెళుతుందో ఆ భగవంతుడికి తెలియాలి. ఇది బహుశ భూగర్భ సొరంగం పల్లెటూరులోకి వెళ్ళడానికి వేసిన దారి అయ్యుండచ్చు” అన్నాడు చంద్రం మేరుతో.
మేరు ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ సొరంగం అంచుకి వచ్చేయడంతో మౌనంగా ఉండిపోయాడు. సొరంగం అంచులోకి చేరడానికి అయిదు నిమిషాలు పట్టినా పోనూ పోనూ దాని స్వరూపం మారిపోయింది. ఆ సొరంగం మరో నిర్మాణంలోకి తెరుచుకుంది. అది సగం కూలిన ఓ భవనంలా ఉంది. విరిగి పడిపోయిన గోడల మీద కుడ్యచిత్రాలు – బావి చుట్టూ ఉన్న పిట్టగోడ మీద చిత్రాల్లానే ఉన్నాయి.
అది తప్పకుండా ప్రాచీన దేవాలయమే. అయితే దేవతా విగ్రహాలు ఏమి లేవు. కాని విశాలమైన అడుగు భాగంలో పెద్ద లోహపు పెట్టె ఉంది.. దాని మీద చిత్రాలు, అంకెలు వేసి ఉన్నాయి. మేరు దాని దగ్గరగా వెళ్ళాడు పరీక్షించి చూడడానికి. అదేదో కాలనాళికలా ఉంది.
ఇంతలో గుండెలవిసేలా చంద్రం పెట్టిన కేకకి మేరు ఉలిక్కిపడ్డాడు. రాజన్న, మేరు చంద్రం దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మేరు తన తల మీద ప్లాష్ లైట్ తీసి, దేనిని చూసి భయపడి చంద్రం కేకలు వేసాడో దాని మీద ఫోకస్ చేసాడు.
“అరే ఏంటి సార్ ఇంత భయం. ఇది విరిగిన పుర్రె.. దీనికి అంత భయమెందుకు?” అన్నాడు రాజన్న పుర్రెని చూస్తూనే. అయినా ఇంకా చంద్రంలో భయం తగ్గలేదు.
“ఇదొక పురాతన దేవాలయం అన్నారు కదా సారూ, నరబలి ఏమైనా ఇచ్చి ఉండాలి, అప్పట్లో అలాంటి ఆచారాలుండేవి” అన్నాడు రాజన్న, చంద్రం నుదుటన కారుతున్న రక్తాన్ని తుడుస్తూ.
చంద్రం భయంతో వణికిపోతున్నాడు. ఇంక ఏ మాత్రం అక్కడ వుండడానికి ఇష్టపడలేదు చంద్రం. పైకి వెళ్ళిపోదామని పట్టుపట్టాడు. తిరిగి వెళుతున్నప్పుడు కళ్ళు కూడా విప్పలేదు. మేరుని గట్టిగా పట్టుకొని నడిచాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో.. వేగంగా తీసుకుంటూనే ఊపిరి శబ్ధం తప్పించీ.. మరో శబ్దం లేదు. వాళ్ళు సొరంగం నుంచి పైకి వచ్చేసరికి సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. సొరంగంలో వున్న ఆ పల్చటి వెల్తురు కూడా మాయమైయింది.
వాళ్ళు పైకి చేరేసరికి సాయంత్రమైపోయింది. రాజన్న ఏర్పాటు చేసిన ఎద్దుల బండిలో జి.వి. ఇంటికి బయల్దేరారు మేరు, చంద్రం.
“ఏం మేరూ, చంద్రం ఎక్కడ దొరికాడు? సొరంగంలోనా?” అంటూ హాస్యమాడాడు జి.వి.
పాలిపోయిన మొహంతో, వేడి వేడి టీ తాగుతున్న చంద్రం – జి.వి. వేసిన జోక్‌కి నీరసంగా నవ్వాడు. జరిగిన దానిని తలచుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు చంద్రం.
తాను చూసిన సొరంగం, బావిలను సమగ్రంగా స్కెచ్ గీసుకునే దాక.. మేరుకి నిద్రపట్టలేదు. పని పూర్తి చేసుకొని తెల తెలవారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు.
అధ్యాయం 4
ఆగకుండా తలుపు కొడుతున్న చప్పుడికి మేరుకి మెలకువ వచ్చింది. టైము కోసం వాచి చూసుకొన్నాడు. తొమ్మిది గంటలు కావొస్తుంది. ‘అరె తొమ్మిది దాక పడుకొన్నానా..’ అనుకుంటూ మంచం మీద నుంచి ఓ దూకు దూకి తలుపు తీసాడు.
ఎదురుగా చంద్రం.. ఎంతో ప్రెష్‌గా మెడలో కెమెరాతో..
చాలా ఆశ్చర్యంగా అనిపించింది!!! నిన్నటి మనిషేనా.. సాయంకాలం విరిగిన పుర్రె చూసి చావు భయంతో అల్లాడి పోయిన మనిషేనా అని ఆశ్చర్యంతో చూస్తూన్న మేరుని.. “హే మేరు.. ఏమిటలా చూస్తున్నావ్.. నేను చంద్రాన్ని.. ఇంకా నిన్నటి దాని గురించే ఆలోచిస్తున్నావా.. ఎందుకో ఆ క్షణంలో అలా భయపడ్డానంతే.. మా శైలు ఇచ్చి కాఫీ కప్పుతో చూడు ఎంతో ప్రెష్‌గా వున్నానో… సరేగాని ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావ్ పద తొందరగా.. చారీ సాబ్ కబురు పంపించారు – ఈ రోజు ఆయనా, కృష్ణశాస్త్రి గారు వస్తున్నారట.. బహుశా మనం రెండు రోజులు పని ఆపేయాల్సి ఉంటుంది” అంటూ ఎప్పటిలాగే గలగలా మాట్లాడుతున్న చంద్రాన్ని చూసి మేరు రిలాక్స్ అయ్యాడు.
స్నానాన్ని సాయంకాలానికి వాయిదా వేసి గబగబా రడీ అయిపోయి, చంద్రంతో పాటు సైట్‌కి బయలుదేరాడు.
అప్పటికే చారి సాబ్ సైటులో సిద్ధంగా వున్నారు. పనివాళ్ళు ఎవరూ లేరు. బహుశా రావద్దని చెప్పి వుంటారు. సీనియర్ ఆర్కియాలజిస్ట్ కృష్ణశాస్త్రి గారి పక్కన ఇద్దరు కొత్తవాళ్ళు కనబడ్డారు.
“హలో మేరు” అంటూ పలకరించారు చారి గారు. “నిన్నటి తవ్వకాలలో మనకి మంచి ఆధారాలు దొరికినట్లున్నాయి కదా.. అవి పురాతన రాజవంశానికి చెందినవి. వాటి సహాయంతో అందకుండా పోయిన వాటిని పరిశోధించడానికి ద్వారాలు తెరుచుకున్నట్లే కదా.. నిన్నటి వాటి మీద రాసిన నోట్స్, స్కెచెస్ ఏవి? వాటి పేపర్లు వున్నాయా.. మనం పని మొదలు పెట్టక ముందు వాటిని ఒకసారి పరిశీలించుకోవాలి..” అని, “అన్నట్లు మరచిపోయాను..” అంటూ ప్రభాకర్, కేతకిలను పరిచయం చేస్తూ.. “కొత్తగా వచ్చిన రీసర్చ్ స్కాలర్స్ వీళ్ళు, ఇదే డిపార్ట్‌మెంట్‌కి వచ్చి చేరారు” అంటూ.. “వీళ్ళిద్దరూ మనతో పాటు ఈ సైట్లో పనిచేస్తారు.” అని చెప్పారు. ఈ సైట్ ఇన్-ఛార్జ్ అని మేరుని వాళ్ళకి పరిచయం చేశారు.
అందరూ ఒకరినొకరు పలకరించుకొన్నారు. అందరూ సైటులో వున్న బావిలోకి దిగడానికి సిద్దమైయ్యారు. వాళ్ళు వేసుకొన్న జాకెట్లు, ప్లాష్ లైట్లు, హెల్మెట్లతో అందరూ మైన్స్‌లో పనిచేస్తున్న వాళ్ళలా కనిపించారు. లోపలికి దిగడం కోసం వెడల్పాటి ఇనుప మెట్లు సిద్ధం చేసారు, దిగుతున్న వాళ్ళు జారిపడిపోకుండా పట్టుకొని దిగడానికి.
మేరు ముందు దిగుతూంటే అతని వెనకాలే అందరూ మెల్లగా దిగుతున్నారు. కృష్ణశాస్త్రిగారితో పాటు అందరికన్నా వెనకాలగా కేతకి దిగుతోంది.
అందులో ఎవరు కొద్దిగా వెనకపడ్డా, “ఏం బాబు నా కన్నా ముసలివాడిలా వున్నావే” అంటూ జోక్స్ వేస్తూ హుషారుగా కనిపించారు కృష్ణశాస్త్రి.
ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ నెమ్మదిగా కిందకి దిగారు. సొరంగంలోంచి కనబడే పలచని వెలుగు, వీళ్ళ తలలపైన ఫ్లాష్ లైట్లు ఆ ప్రదేశాన్ని కాంతిమంతంగా చేశాయి. ప్రతీదీ అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. కాస్త దూరంగా పడి ఉన్న విరిగిన పుర్రెని చంద్రానికి చూపుతూ నవ్వాడు మేరు. చంద్రం కూడా తలూపాడు, తన కెమెరా లెన్స్‌ని కేతకి చూడకుండా, ఆమె మీదకి ఫోకస్ చేస్తూ.
“చారీ, ఇవి బావి కాకపోవచ్చు. బహుశా వృత్తాకారంలో నిర్మితమైన ఆలయం కావచ్చు. కానీ, నాకు తెలిసినంత మటుకు మన ఆలయాలకి ఇటువంటి నిర్మాణశైలి ఉండదు” అన్నారు కృష్ణశాస్త్రి, మేరు ‘కాలనాళిక’ అని భావిస్తున్న పొడవాటి పెట్టెని చూస్తూ.
“కాదు శాస్త్రి, నా ఉద్దేశంలో ఇది బావిలో కూలిపోయిన ఆలయం” అన్నారు చారి.
“అదెలా సాధ్యం? మన ప్రాచీన ఆలయాలన్నీ కొండల మీద లేదా నదుల ఒడ్డున్న నిర్మితమయ్యాయి. ఆలయానికి అత్యంత సమీపంలో ఇటువంటి బావులు ఉండకపోవచ్చు” అన్నాడు వాసు.
“ఖచ్చితంగా ఆలయమే. కాని మన నిర్ధారణలో ముందుకు వెళ్ళాలంటే ఇది ఏ కాలానిదో తెలియాలి. ఈ గోడల మీద ఉన్న రాతలని చదవగలిగేందుకు రమణకు కాస్త సమయం ఇద్దాం” అన్నారు శాస్త్రి.
“శాస్త్రీ, దీన్ని మేరు ‘కాలనాళిక’గా భావిస్తున్నాడు” అన్నారు చారి, కృష్ణశాస్త్రి పట్టుకున్న ఆ పెట్టెని చూపిస్తూ.
“అయివుండవచ్చు. చంద్రం, ఈ రాతిపలకకి, పెట్టె నిర్మాణానికి మొత్తంగా ఫోటోలు తీసావా” అని అడిగారు శాస్త్రి దానిని పరిశీలిస్తూ…
“తీసానండి ఎన్లార్జ్ చేసి సాయంకాలానికి సిద్ధంగా వుంచుతాను..” అన్నాడు చంద్రం.
“సార్” అంటూ మెల్లగా పిలిచింది కేతకి, చారిగారిని. అందరూ కేతికి వైపు చూసారు.
“సార్, ఇది క్షుద్ర దేవతల పూజలు చేయించడానికి రహస్యంగా నేల అడుగున కట్టిన గుడిలా ఉంది” అంది.
“ఏ ఆధారాలతో ఇలా చెప్పగలుగుతున్నావ్?” అడిగారు చారి గారు.
“ఇక్కడ చూడండీ, ఈ వంపులు తిరిగిన పాము చిహ్నం. అప్పటి రోజుల్లో దీనిని గౌరవసూచకంగా, తల మీద ధరించేవారు.. ఈ స్తంభాల మీద కూడా అలాంటివే కనిపిస్తున్నాయి.. స్తంభాల మీద చెక్కిన వాటి ఆకృతులు రాక్షసాకృతుల్లా వున్నాయి. వాళ్ళు ధరించిన ఖడ్గాలు చూస్తుంటే నాకలా అనిపిస్తోంది. సాధారణంగా, మామూలు దేవాలయాల మీద ఇలాంటివి చెక్కబడి వుండవు..” అంది.
చారి వాటి మీద లైట్లని ఫోకస్ చేస్తే, వాసు భూతద్దాన్ని దగ్గరగా పెట్టి పరిశీలించాడు.
చంద్రం దానికి దగ్గరగా వెళ్ళి మట్టి దుమ్ముని దులిపాడు తన కర్చీఫ్‌తో. అది ఒక మామూలు సర్పంలా కాకుండా డ్రాగన్‍లా కనిపించింది.
“చారీ సాబ్ ఈ అయిదు వేళ్ళు చూడండీ, ఇది చైనా చక్రవర్తులకు సంబంధించిన గుర్తుగా కనిపిస్తుంది. ప్రాచీన డ్రాగన్ (చైనా దేశపు పౌరాణికంలో సరీసృపం). ఇది పురాణ కాలంలో భూమిని, ఆకాశాన్నే, కాక భూమండలం మీద వుండే సకల ప్రాణులకు జీవం పోసే వర్షానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.. ఈ డ్రాగన్ పక్షి నడుం భాగం మీద లిఖించబడిన లిపి ఏదైతే వుందో అది దైవ సంబంధమైనదిగా భావిస్తారు. దీని నుంచే చైనా భాష వుద్భవించిందని చైనీయుల ప్రగాఢ నమ్మకం.” అన్నారు శాస్త్రి.
“కాదు, ఇది డ్రాగన్‌లా కూడా అనిపించటం లేదు. ఈ విరిగి పోయిన కళాఖండాన్ని చూడండి సార్, ఇది ఒక గుర్తులా కనిపిస్తోంది. బాగా గమనిస్తే, ఒక శిరస్త్రాణంలా కూడా అనిపిస్తుంది. అయితే ఇది మయన్ నాగరికతకు చెందిన ‘కుకుల్‍కన్’ పూజారిలా ఉంది. “
“కానీ, కుకుల్‍కన్ జాతికి చెందిన ‘పక్షి సర్పము’ మెక్సికన్ పురాణాలకి చెందింది కదా.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో దొరకడమేమిటి?” అన్నాడు వాసు సందేహంగా..
“మరి విశ్వజనీనమైన కల్పనల సంగతి ఏమిటి వాసు. మన పురాణాల్లో సర్పాలు లేవూ.. మనకి ఆదిశేషువు, తక్షుడు, వాసుకి.. ఇవన్నీ పౌరాణికమైనవి అయినా వీటన్నింటినీ మన ప్రజలు నమ్ముతున్నారు.. వాటిని నేటికీ దేవతలుగా కూడా పూజిస్తున్నారు. ముఖ్యంగా నాగ పంచమి రోజు.” అన్నారు శాస్త్రి.
“కానీ, ఈ కాల్పనిక గాథ గురించి నేను విన్నాను, ఇది మెక్సికన్ దేశానికి చెందిన జానపద గాథ. అయితే కుకుల్‍కన్ – 19 మంది సహచరులతో పశ్చిమ దేశాల నుంచి వచ్చారనేది మెక్సికన్ల విశ్వాసం. అందులో ఇద్దరు మత్స్య దేవతలు, మరో ఇద్దరు వ్యవసాయ దేవతలు. ఒకరు పిడుగు దేవత. వీళ్ళు పది సంవత్సరాలు యుకటాన్‌లో వున్నారు. కుకుల్‍కన్ చాలా తెలివైన న్యాయ సూత్రాలని నిర్మించి సూర్యుడు ఉదయించే దిక్కుగా మాయం అయ్యాడు” కేతకి ఇచ్చిన వివరణ, దానిని వివరించే పద్ధతి, విషయం పట్ల వున్న పరిజ్ఞానం, అందరిని ఆకట్టుకుంది.
“చాలా బాగుంది కేతకి నీ పరిశోధన, జ్ఞాపక శక్తి” అంటూ చారి మెచ్చుకొన్నారు.
“సార్ నాకు ఇతిహాసాలన్నా, పురాణాలన్నా చాలా ఆసక్తి, అందుకే నేను పురావస్తు శాఖ మీద అభిమానం పెంచుకొన్నాను. అందుకే ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. వీటి మీద వుండే అభిమానం, ఆసక్తీ కారణం, ఇవన్నీ జ్ఞాపకం వుండడానికి” అంది.
అందరి దృష్టిని సొరంగంవైపు మళ్ళించి ఆ సంభాషణని ఆపుజేశాడు మేరు.
“ఏది ఏమైనా మనం దీని గురించి వివరంగా చర్చించాలంటే ఎపిగ్రాపిస్ట్ నుంచి దీనికి సంబంధించిన నోట్స్ రావాలి. అయినా మయన్, కుకుల్‍కన్ నాగరికత మన భారత దేశ నాగరికతను పోలి ఉండవచ్చు” అన్నాడు శాస్త్రి. నిచ్చెన అవసరం లేకుండా నున్నటి గ్రానైట్ రాతి పలకలతో నిర్మించిన మెట్లు వున్నాయి బావిలో పది దాకా. వాటి సహాయంతో బావి లోపలి నుంచి సులభంగా వచ్చేయవచ్చు.
అందరూ సొరంగంలోకి నడిచారు. మేరు ముందుగా నడుస్తున్నాడు. ఎత్తు తక్కువగా వున్న ద్వారం గుండా కొన్ని గజాల దూరం నడిచాక ఆ ప్రదేశం బాగా విశాలంగా వెడల్పుగా వుంది. దారి ఏటవాలుగా దిగువవైపుకి జారుతున్నట్లుగా వుండి చిన్నపాటి ఖాళీ ప్రదేశానికి వచ్చి ఆగిందా దారి. పైన ఆకాశం నిశ్చలంగా కనిపిస్తోంది.
ఇంక పరిశోధించడానికి కూడ ఏమి లేకపోవడంతో.. అందరూ భోజనాలు చేయడానికి నిశ్చయించుకొన్నారు. కేతకి ఎవరి గురించి ఆగకుండా ముందుకి సాగింది. కృష్ణశాస్త్రి చారితో ముందరి విషయాలు ఇంకా చర్చిస్తూనే వున్నారు. తననే అనుసరిస్తున్న మేరుని, వాసుని గమనించింది కేతకి.
“మేరూ, ఈ సర్ప పురాణాలకన్నా నీవనట్లు నాకు కూడా ఆ కాలనాళిక మీద చాలా ఆసక్తి కలుగుతోంది, దీని గురించి నీ అభిప్రాయం?” అన్నాడు వాసు నడుస్తూ.
“ఇటువంటి దాన్ని నేను మహాబలిపురం (చెన్నై దగ్గర) తవ్విన తవ్వకాలలో చూసాను. ఒక పొడవాటి తామ్రపత్రం మీద అన్ని వివరాలు రాసివున్నాయి. దానిని పరిశీలించడానికి ఎక్కువ టైమ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అది మన ప్రస్తుత కాలానికి దగ్గరగా వుంది. పల్లవ రాజుల గుర్తులన్నీ విశ్లేషిస్తూ భద్రపరిచారు” అన్నాడు మేరు.
“అయితే ఆ పెట్టెలో ఉన్న వస్తువులు ఒక్కసారి చూద్దామంటావా” అన్నాడు వాసు.
“దాన్ని సంపాదించగలిగితే, గొప్ప విషయమే. ఈ ప్రదేశం దేవాలయమైన మరేదైన చాలాసార్లు తీవ్రమైన వరదలకు గురి అయింది. అందుకే మనకు కావలసినవి ఇందులో దొరకవనుకుంటాను” అన్నాడు మేరు.
ఇంతలో మేరు దృష్టిని ఒక వస్తువు ఆకర్షించింది. రెండు అడుగులు వెనక్కి వేసి దగ్గరగా చూద్దామనుకున్నాడు. కానీ వెళ్ళిపోతున్న వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికై గబగబా అడుగులు వేయక తప్పలేదు.
రాసుకున్న నోట్సులు సరిచూసుకోవడంలోను, ఒకరితో ఒకరు చర్చించుకోవడంలోను అందరూ నిమగ్నమయ్యారు. మళ్ళీ ఈ కళాకృతులు చూడడం కోసం రావలసిన తేదీలను సరిచేసుకుంటూ చాలా సందడిగా ఉన్నారు.
“మేరూ, మేము ఇంక బయలుదేరుతున్నాము. ఇక్కడి పురోగతి బావుంది. నీవిచ్చిన సమగ్రమైన సమాచారానికి థ్యాంక్స్, మాతో పాటూ వస్తున్నావా?” అని అడిగారు చారి.
“కుదరదు, నా ఇనపగుర్రం నన్ను వదలదు” అంటూ మోటార్ బైక్‌ని చూపించాడు మేరు.
చంద్రం కూడా వాళ్ళతో పాటూ వెళ్ళడానికి సిద్ధమయ్యి, మేరు వైపు చేయి ఊపాడు. చేయి ఊపుతూ వీడ్కోలు చెప్తున్న మేరుకి – వాళ్ళతో పాటూ వెళుతున్న కేతకి తనని చూసి చిన్నగా నవ్వడం కనిపించింది. ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు. అది తన భ్రమ కావచ్చు అనుకుని ఓ క్షణం ఆగిపోయాడు మేరు. ఇంతలో మరిచిపోయినదేదో తీసుకోవాలనుకున్నట్లుగా గబగబా సైట్ లోకి పరుగుతీశాడు.
(ఇంకా ఉంది)