కర్మ సిద్ధాంతము

1
3

[box type=’note’ fontsize=’16’] ” కర్మకే ప్రారబ్ధమని, పురుషకారమని రెండు పేర్లు ఉన్నవి. దైవము, ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడు. మనకు దుఃఖము వచ్చినపుడు దైవమును నింద చేయుట అపరాధము” అని వివరిస్తున్నారు డా. వి. ఎ. కుమారస్వామికర్మ సిద్ధాంతము” అనే వ్యాసంలో. [/box]

[dropcap]హిం[/dropcap]దూ జనాభాలో నూటికి నూరు మంది అని చెప్పినా తప్పులేదు, అందరు “ప్రారబ్ధమును తప్పించుకోజాలము అను దృఢ విశ్వాసముతో ఉన్నారు. దీని వల్ల సమాజము బలహీనము అనగా ప్రధానముగా మనోబలరహితము కాగా, నిరాశావాదము ప్రబలుచున్నది”. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అంటూ ఒక ముక్క గట్టిగా పట్టుకొని దానిని మించిన మాట లేదనియు, మరియు అదే వేదాంతమనియు నమ్ముకొని, గట్టిగా ముడి వేసుకుని కూర్చున్నారు. ప్రస్తుతము ప్రజలలో దెబ్బతిన్న ఆత్మవిశ్వాసమును మేలుకొల్పుటకు కర్మ సిద్ధాంతమును పడగొట్టుటకు తగిన ఆలోచనలను అందజేయుచున్నాను.

జీవుల అవిద్యా కామ కర్మల ప్రకారం జన్మలు వస్తున్నవి అని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. జీవుల కర్మానుసారము సృష్టి సంభవమగుచున్నది అంటారు. మరి మొట్టమొదటి సృష్టిలో కర్మ (ప్రారబ్ధం) జీవులకు ఎక్కడి నుండి వచ్చింది అను ప్రశ్న పుట్టింది. దానికి తట్టుకొనలేక, మొదటి సృష్టి అను మాట లేనే లేదు అని శాస్త్ర నిర్ణయము అయినది. అయినపుడు, దానిని మరల మరల చింతనము చేసికొనుచు మనకు సుఖదుఃఖాలను కలగజేయుచున్న ఈశ్వరును మరల మరల ప్రతిదినము స్మరించుకొనవలసియున్నాం. జడమయిన కర్మ ఫలమివ్వదు. సృష్టికర్త, చైతన్య భాండాగరము; అతడే సుఖదుఃఖములను ఇస్తున్నాడు. ఇవ్వడంలో ఆయనకు విషమ స్వభావం లేదు. జీవుల కర్మలను బట్టి ఆచి తూచి ఫలితమును ఇస్తున్నాడు అన్నారు. ఇక ఆ మాటను పట్టుకొని ఈశ్వరునకు ఇవ్వవలసిన ప్రాధాన్యమును తొలగించి నా కర్మ నా కర్మ అనుకొనడానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈశ్వరుని ప్రాధాన్యమును తొలగించడము కాదు, ఈశ్వరుణ్ణే మనస్సు నుండి తొలగించుకొని, నామ్ కే వాస్తే ‘ప్రారబ్ధ కర్మ! ఏమి చేస్తాము?’ అనడం నేర్చుకొన్నారు.

ఈశ్వరుడెవరు? ఆయనకు మనకు ఏమిటి చుట్టరికం? అను ఆలోచనయే రావడం లేదు. గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా జీవితంలో తడబాట్లు పొరపాట్లు అగచాట్లు తింటూ రోజులను వెళ్ళబుచ్చుతున్నారు.

తల్లి గర్భములో మనకు శరీరమిచ్చి పోషించిన ఈశ్వరుని ఎలా మరచిపోయినామో మనకే తెలియడం లేదు. ఆ లెక్కన తల్లిదండ్రులు తమ ప్రాధాన్యమును నిలబెట్టుకొనుచు ఈశ్వరుని లెక్కజేయకుండా పిల్లలను పెంచుతున్నారు అని చెప్పవలసి వస్తున్నది. ఆ కారణముగా పిల్లలు, పెద్దలకు ఎదురుతిరిగి, “మాకు మాకవలసినవి అన్నీ ఇవ్వండి. మరి ఎందుకు కన్నారు?” అని అడగడం కనబడుతున్నది. జాతక శాస్త్రం ప్రకారం పదిమంది పిల్లలు పుట్టాలి, కాని కుటుంబ నియంత్రణ కోసం ఆపరేషను చేయించుకుంటే నీ కర్మను నీవు గెలిచినట్లే కదా!

మృత్యుంజయ జపం చేసి చేయించుకొని మరణం నుంచి బయటపడిన వాళ్ళున్నారు. అయితే, పురుషకారముతో దైవమును (ప్రారబ్ధము) గెలిచినట్లే కదా! సతీ సావిత్రిని, మార్కండేయుని తలచుకొని వాళ్ళ త్రోవలో మనమెందుకు పయనించరాదు? ఈశ్వరుని అనుకూలం చేసుకొంటే ప్రతికూల ప్రారబ్ధం నీటిమీద గీటు లాగా తొలగిపోవును కదా!

సత్యసాయి, షిరిడీ శాయి భక్తులు అనేకానేక కష్టాల నుండి రక్షింపబడటం కళ్ళారా చూస్తున్నాము కదా! ప్రారబ్ధం వాళ్ళను ఏమి చేసింది?

“ఎవరు చేసిన కర్మ, వారనుభవింపకా, ఏరికైనను తప్పదన్నా!” అనుచు పాటలను నేర్చుకొన్నాము గాని ప్రాణిక్ హీలింగ్‌లో సుశిక్షుతులైనవారు ఇతరుల బాధలను తొలగించి తమపైకి తెప్పించుకొనుచున్నారు.

వేదాంత శాస్త్రగ్రంథాలలో పరేచ్ఛ ప్రారబ్ధమని ఒకటి ఉన్నది. పరుల ఇచ్ఛ వల్ల మనకు ప్రారబ్ధం (దుఃఖం) వస్తుంది. ఇది ఎట్లా కుదురుతున్నది? కాబట్టి కర్మ సిద్ధాంతం అనేక విధాలుగా, విచారిస్తే నిలబడలేక పోతున్నది.

“కర్తా కారయితా చైవ ప్రేరకశ్చాను మోదకః” అనడంలో కర్త ఒక్కడే కాదు చేయించువాడు ప్రేరణ చేసేవాడు అనుమోదము తెలుపువాడు నలుగురు సమాన భాగస్వములు అని ఎలాగన్నరు?

పూర్వ పురుషుల నుంచి పుణ్యము లాగానే పాపము, వాళ్ళ రోగాలు మనకు సంక్రమించుచున్నవి. నిస్సందేహముగా హోమ్యోపతి దీనినొప్పుకున్నది.

తండ్రి సత్యవాక్యమును తాను నిలబెట్టి శ్రీరామ ప్రభువు తండ్రిని స్వర్గానికి చేర్చగలిగాడు. భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొనివచ్చి పూర్వ పురుషులను ఉద్ధరించాడు. ఎవరి కర్మ వారిదే అనే మాట దెబ్బతిన్నది కదా!

“ధర్మేణ పాప మపనుదతి” – ధర్మాచరణం ద్వారా పాపక్షయం అన్నారు. మరి పురుషకారం చేత ప్రారబ్ధ క్షయమగుచున్నది కదా!

శ్రాద్ధకర్మ, శ్రాద్ధము పెట్టువానిని, పోయినవానిని సమానముగా ఉద్ధరించుచున్నది. ఇక్కడ ఎవరి కర్మ వారిదే ఎలాగ?

ఒకే కర్మ వల్ల అనేక జన్మలు వచ్చునా? అనేక జన్మల వల్ల ఒక కర్మ ఆచరించబడునా? అనేక కర్మల వల్ల ఒక జన్మ వచ్చునా? – ఇదమిత్థమని ఎవరు నిర్ణయింపలేరు. నిర్ణయించినట్లు ఏ గ్రంథములోనూ కనబడినను ప్రామాణికం కావలసిన పని లేదు.

బిచ్చగానికి మనము ధనము, అన్నము, వస్త్రము ఇస్తాము. దాని వల్ల ఋణగ్రస్తుడై అతడు ఆ పై జన్మలో మనకు తీర్చివేయవలెనా? లేక మన ఋణమును మనము తీర్చుకొనుటకు బిచ్చగాడికి ధనము, అన్నము, వస్త్రములను ఇస్తున్నామా? తెలియదు.

నహుషుడు అగస్త్య శాపం వల్ల అజగరమయినాడు. ఒక కర్మ వల్ల ఒక జన్మ వచ్చింది. జయవిజయులకు శాపము మూడు జన్మలలో తీరినది కదా! దేని త్రోవ దానిదే!

అనేక పురాణ గాథలలో విరోధములు కలవు. అనేక కల్పాలలో అనేక విధాలుగా పూర్వగాథలు కన్పడుచున్నవి. అయితే బ్రహ్మదేవుడు ఇది వరకు కల్పములలో లాగానే సృష్టిరచన చేస్తూంటాడు – అన్న మాట ఏమయినట్లు?

ఈశ్వరుడు ఎవనిని ఉద్ధరింప దలచునో అతని చేత మంచి పని చేయించును – అను వేద వాక్యము కలదు కదా! అందుచేత ఈశ్వరునిపై ధ్యాసను పెట్టుకొనుట మంచిది కదా! కాదా!

ఒకడు కష్టపడి ధనవంతుడయితే అది ఆతని పుణ్యప్రారబ్ధమా లేక పురషకారము సఫలమయిందా? ఈ జన్మలో ఇంతవరకు ప్రారబ్ధ క్షయమైనది, ఇక పురుషకారము అని చెప్పగలమా?

ఫలాపేక్షతో చేసిన పుణ్యము దుష్టచేష్టల వల్ల క్షీణించును. దురితక్షయం కోసం చేసుకొంటున్న పుణ్యకర్మల ప్రభావం కూడా పాపాచరణం వల్ల తగ్గుముఖం పెట్టుతున్నది. దేని బలం ఎప్పుడు ఎక్కువ? ఎలా తెలుసుకొనగలము?

కాబట్టి తాను పూర్వము చేసిన కర్మను ప్రారబ్ధమనుకొనుచు దానికే దైవమని పేరు పెట్టుకొనుచు దైవనిందను చేయడం తెలివితక్కువ, అపరాధం, అపచారమని తెలిసికోవలె.

తన కర్మకే ప్రారబ్ధమని, పురుషకారమని రెండు పేర్లు ఉన్నవి. దైవము, ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడు. మనకు దుఃఖము వచ్చినపుడు దైవమును నింద చేయుట అపరాధము.

ఈశ్వరుడను పదానికి సర్వ శక్తిమంతుడని అర్థము. ఈశ్వరుడు నిర్లిప్తుడు, సాక్షీమాత్రుడు అన్నారు కదా – దీనికి ఇంతకు మునుపు చెప్పిన దానికి అనగా వేదము చెప్పినట్టు తాను ఉద్ధరింపదలచిన వానిచే సత్కర్మ ఆచరింప జేయును అను మాటకు వ్యతిరేకము రాదా? మరియు “భ్రామయన్ సర్వభూతాని” అన్నచో ప్రేరకత్వము కలదు. కావున సాక్షిత్వమెట్లు కుదురును? అను ప్రశ్న అలాగే ఉన్నది. తన్ను ప్రపత్తి (శరణాగతి) చేసిన వారికి దాక్షిణ్యమును చూపిస్తాడు. దుష్టులయిన వాళ్ళు దీనిని సహింపక పక్షపాతమను పదం వాడుతారు. “ఆశ్రితజన పక్షపాత” అను బిరుదును ఈశ్వరుడు వేయించుకొన్నాడు. తన వారిపై తాను దాక్షిణ్యమును, దయను చూపుతాడు. ఇది తప్పు కాదు. అది కూడా తప్పయితే ఈశ్వరుని నమ్ముకొని జీవించువారును, ఆతని ఆస్తిత్వాన్ని ఋజువు చేయువాళ్ళును భూమిపై కనుమరుగు అయిపోరా? పోతే ఎలాగా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here