[బాలబాలికల కోసం ‘పసుపు మహత్తు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
[dropcap]కొ[/dropcap]న్ని వందల సంవత్సరాల క్రితం దండకారణ్యంలో అటవిక జాతి పోడు వ్యవసాయం (అడవిలో కొంత ఖాళీనేలలో వ్యవసాయం) చేసుకుంటూ అడవిలో కాసే కుంకుడుకాయలు మొదలైన చెట్ల ఉత్పత్తులు,తేనె మొదలైనవి సేకరించి పక్కన ఉన్న ఊర్లలో అమ్ముకుని బతికేవారు.
అలా వారు హాయిగా జీవితాలు గడుపుతున్నప్పుడు ఎక్కడినుండో అడవిలోకి ఒక రాక్షసుడు ప్రవేశించాడు. వాడు జింకలు, కుందేళ్ళు వంటి జంతువులను చంపి తినేవాడు! వాడు అటవికుల జోలికి రాకున్నా జంతువుల్ని చంపటం చెట్లను విరిచివేయడం వలన అటవికులకు ఇబ్బంది అయిపోయింది!
ఒకరోజు వాడు గూడెం పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును విరవ సాగాడు. ఆ శబ్దానికి గుడిసెలో నుండి రంగి బయటకు వచ్చింది. అప్పుడు ఆమె పసుపు రంగు చీర కట్టుకుని ఉంది. చేతిలో పసుపు కొమ్ములు దంచిన పొడి ఉంది. రంగి ఆ పొడిని ఎండలో ఆరబెట్టడానికి వచ్చి దూరంగా ఉన్న రాక్షసుణ్ణి చూసి బెదరి ఆ పసుపుని కింద పారేసింది. ఆమె కట్టిన పసుపురంగు చీర, ఆ పడిన పసుపుని చూసి రాక్షసుడు హాహాకారాలు చేశాడు!
అప్పుడే బయటికి వచ్చిన రంగి భర్త వీరేశం ఆ రాక్షసుడి హాహాకారాలు వాడు అడవికేసి పరుగెత్తడం చూసి ఆశ్చర్య పోయాడు. పడిన పసుపుని చూసి వాడు భయపడినట్టు రంగికి, వీరేశానికి అర్థం అయింది. అంటే వాడికి పసుపు రంగు లేక పసుపు అంటే భయం అని తెలుసుకున్నారు.
వెంటనే గూడెంలోని వారందరినీ పిలచి ఓ మర్రి చెట్టు కింద సమావేశం ఏర్పరిచాడు వీరేశం. రాక్షసుడి భయం గురించి తాను అర్థం చేసుకున్న విషయాన్ని అందరికీ చెప్పి వారు తమ వంతు సహాయం చేస్తే అడవికి ఆ రాక్షసుడి పీడ విరగడ చేయవచ్చునని ఈ విధంగా చెప్పాడు.
“చూడండీ వాడికి పసుపు రంగన్నా, పసుపన్నా భయం కదా! మనం తలా పెద్ద డబ్బాలతో పసుపు పొడి తీసుకవెళ్ళి మన గూడెపు పరిసరాల్లో, అడవిలో చల్లుతాము. దానివలన మన గూడెం వైపు రాలేడు! వీలు చూసుకుని పసుపుగుడ్డలను చెట్లకు కడదాము. వాడు భయటతో అడవి వదలి వెళ్ళి పోతాడు ఆలోచించండి” అని వివరించాడు.
వీరేశం చెప్పిన మాటలు అందరూ అర్థం చేసుకున్నారు. అదిగాక అది ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. అందుకని అందరూ వీరేశం చెప్పిన ఉపాయాన్ని అమలు చేయదలచుకున్నారు.
రెండవ రోజే గూడెంలోని వారందరూ చెట్లకి పసుపుగుడ్డలు కట్టి పసుపు చల్లారు. గూడెంవద్దకు వచ్చిన రాక్షసునికి పసుపు గుడ్డలు నేలమీద పసుపు కనబడ్డాయి. ఆ దృశ్యాలు చూసే సరికి వాడిలో తీవ్రభయం కలిగింది. అంతే వాడు భయంతో హాహాకారాలు చేసి అడవిలోకి పరుగెత్తాడు. గూడెం లోని వారు వాడి భయాన్ని గమనించి మరిన్ని పసుపు గుడ్డలు కట్టి, పసుపు చల్లారు. ఇక వాడు అప్పటినుండి కనబడలేదు. చెట్టువిరగక జంతువులు చావక అడవి సుభిక్షంగా ఉంది. అప్పటినుండి ఆ రాక్షసుడు ఏమయి పోయాడో ఎవ్వరికీ తెలియకుండా పోయింది!
పసుపుకి అంత శక్తి ఉన్నదన్న మాట. క్రమేపీ పసుపు రోగాలను నయం చేస్తుందని దెబ్బలు తగిలితే పసుపు రాసుకుంటే తగ్గుతాయని తెలుసుకున్నారు. దగ్గుకి జ్వరాలకు పసుపు పాలల్లో కలుపుకుని త్రాగడం మొదలు పెట్టారు. ఇప్పుడు అనేక ఆయుర్వేద మందుల్లో పసుపు ఉపయోగిస్తున్నారు. దాని మంచి గుణాల వలన పసుపును పవిత్రంగా చూస్తూ పూజలలో కూడా ఉపయోగిస్తున్నారు. పసుపు కాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆ విధంగా పసుపు మానవాళికి మేలు చేస్తూనే ఉంది.