కొత్త ఉపాయం

9
4

[బాలబాలికల కోసం ‘కొత్త ఉపాయం’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

[dropcap]పి[/dropcap]ల్లలూ, వేటగాడూ, పావురం కథ మీరు వినే వుంటారు కదా. అదేనర్రా, ఒక వేటగాడు పావురాలని పట్టుకోవటానికి ఒక చెట్టుకింద చాలా గింజలు జల్లి దానిమీద వల పరచి వెళ్తాడు. మొదట్లో ఈ పావురాలన్నీ ఆ గింజలమీద ఆశతో వెళ్ళి వలలో చిక్కుకుని వేటగాడి చేతిలో చచ్చిపోయాయి. తర్వాత చెప్పే కథలో అవీ ఆలోచించటం నేర్చుకున్నాయి. అందులో ఒక పెద్ద పావురం సలహా మీద వలలో చిక్కిన పావురాలన్నీ ఒకే సారి ఎగిరి వాటి స్నేహితుడైన ఎలుక దగ్గరకి వలతో సహా వెళ్తే, ఆ స్నేహితుడైన ఎలుక వలని కొరికేసి పావురాలని రక్షిస్తాడు.

ఈ కాలంలో పావురాలు ఇంకా తెలివితేటలు పెంచుకున్నాయి. పైగా సమయానికి సహాయ పడే స్నేహితులు కూడా వుండటం లేదాయే. మరి ఇప్పటి కథ ఎలా వుందంటే..

వేటగాడు వచ్చాడు. పిట్టలు చాలా వున్న చెట్టు చూసుకుని, దాని కింద కొంచెం ఎక్కువగానే గింజలు జల్లి దాని మీద వల పరచి వెళ్ళిపోయాడు. పిట్టలన్నీ ఆ గింజలని చూశాయి. ఆహారం చూస్తే ఎవరికైనా ఆశే కదా. ఎన్ని గింజలో!! అందరికీ రెండు మూడు రోజుల పైన సరిపోతాయి. కనీసం ఈ రెండు రోజులూ రెక్కలు నొప్పులు పుట్టేటట్లు ఎక్కడెక్కడకో ఎగిరి వెళ్ళక్కరలేదు. హాయిగా ఈ గింజలు తింటూ విశ్రాంతి తీసుకోవచ్చు. వేటగాడు వస్తే మనకి ఉపాయం తెలుసుకదా.. అందరం ఒక్కసారి ఎగిరిపోదాము. మన ఎలుక స్నేహితుడు మళ్ళీ సహాయం చెయ్యక పోతాడా అనుకున్నాయి.

కానీ పెద్ద పావురం వాటిని ఆపింది. “ప్రతిసారీ అదే ఉపాయం పని చేస్తుందనుకోకండి. మన జాగ్రత్తలో మనం వుండాలి. తొందర పడద్దు” అని చెప్పింది.

“మరయితే ఎదురుగా ఆహారం పెట్టుకుని మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిందేనా? మనం కొన్ని రోజులన్నా సుఖంగా వుండలేమా?” అని అడిగాయి మిగతా పావురాలు.

“రోజులు మారుతున్నాయి. మనం కూడా పరిస్ధితులకు తగ్గట్లు మారాలి. లేకపోతే అన్యాయంగా నష్టపోయేది మనమే” అన్నది పెద్ద పావురం.

“మరయితే ఇంకేదన్నా ఉపాయం చెప్పి మాకా గింజలు దొరికేటట్లు చెయ్యి అన్నాయి” మిగతా పావురాలన్నీ ఒకేసారి.

కొంచెం సేపు ఆలోచించి పెద్ద పావురం చెప్పింది. “ప్రస్తుత పరిస్ధితుల్లో ఓపిక, సహనమే మనకు మార్గాలు. రెండు మూడు రోజులు ఆ గింజల జోలికి వెళ్ళవద్దు. రెండు మూడు రోజులు చూసి వేటగాడు వలలో మనం చిక్కలేదని నిరాశపడి వెళ్ళిపోతాడు. ఆ గింజలు అక్కడే వుంటాయి. మనమంతా అప్పుడు వాటిని నిర్భయంగా తినవచ్చు” అన్నది. “ఈ లోపల మీరు రోజూకి మల్లేనే ఆహారం సంపాదించుకోండి” అన్నది. మిగతా పావురాలన్నింటీకీ కూడా ఆ ఉపాయం బాగానే వుందనిపించింది.

కొంచెం ఓపిక పడితే ఇప్పుడు బదులు రెండు రోజుల తర్వాత నిర్భయంగా ఆ గింజలు తినవచ్చుకదా. కొంచెం ఓపిక పడదామనుకుని ఆ రోజు ఆహారం కోసం ఎగిరి వెళ్ళాయి.

పెద్ద పావురం చెప్పినట్లే 2, 3 రోజులు చూసిన వేటగాడు ఒక్క పిట్టకూడా పడలేదని నిరాశగా వల తీసుకుని వేరే చోటకి వెళ్ళాడు. ఆది చూసిన పావురాలన్నీ అక్కడ వాలి ఆ గింజలని సంతోషంగా తిన్నాయి.

మంచి సలహా ఇచ్చిన పెద్ద పావురాన్ని అభినందించాయి.

Image courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here