‘జీవనోత్సవం’

0
3

[box type=’note’ fontsize=’16’] “జీవిత సమరాంగణంలో నీ ప్రవేశానికి అమ్మా నాన్నల కృషే తొలియోగం, వారిచల్లని నీడలోనే నీ గళవీణ తొలిరాగం” అంటున్నారు డా. పెరుగు రామకృష్ణజీవనోత్సవం” అనే కవితలో. [/box]

[dropcap]ఈ [/dropcap]పారభౌతిక ధూళిలో
ఎన్నాళ్లుగా పడివున్నానో
ఏ స్వప్న కనీనికలో
ఎన్ని రాత్రిళ్లు పరితపించానో
కన్నతల్లి మమతల నెమలి పింఛం తొడిగి
తిరిగీ మనిషిగా పుట్టాలని
ఎన్నెన్ని యుగాల తపసో అది
తమ సోమా జ్యోతిర్గమయ అంటూ
అంధకార బంధుర మార్గాల గుండా
ఎన్ని రాత్రిళ్లు పయనించానో
నిరంతరం వర్షించే ఆకాశంలో
వెండి వెన్నెల రజనై
సూర్య కిరణాల సౌరునై
చుక్కల దారుల వెంబడి
ఎన్నెన్నో అగమ్య పయనాలధిగమించానో
చినుకునై కురిశానేమో
సముద్రంలో ముత్యమై మెరవటానికి
నదినై ప్రవహించానేమో
ఎడారుల దాహం తీర్చటానికి
అమ్మకు అనురాగాన్ని నాన్నకు మమకారాన్ని
అందించాలని ఆకాశం కోరుకుంటేనే కదా
వొక కొత్త జీవితానికి నాంది
జీవనోత్సాహ పయనానికి పునాది
ఏడుస్తూ పుట్టి ఏడ్పుల మధ్య వెళ్లిపోవటం
జీవితానికి అర్ధం కాదు కదా!
మనిషి వొక మల్లె తీగలా పాకి
సుగంధాల సిరిమంత్రమై
డస్సిన హృదయాలకి నీడనిచ్చే ఛత్రమై…
కన్నీటిని మకరంద బిందువుగ మార్చినప్పుడే
జీవితానికి సరికొత్త అర్ధం భావిస్తుంది
బాల్యంలా అది అందరినీ రంజింప చేస్తుంది
అమ్మపెట్టిన పాలబువ్వ ముద్ద
తొలి పలుకులు తెరలిన తరళ కెరటం
నీకు నిన్ను భాగ్య విధాతగా తీర్చటానికి
బతుకు నేర్పే తొట్ట తొలిపాఠం
అమ్మ తన వొడిని బడి చేసి
నీగళ వీణలో స్వరతంత్రులు నాటుతుంది
నీలోని ముద్ద పలుకులు మీటుతుంది
లోకంలో నిన్నొక జెండాగా ఎగిరేయటానికి
తానే వొక గడకర్రగా నిలబడుతుంది
తడబడే నీ అడుగులకు మడుగులొత్తి
నీ నడకను, నడవడికను రూపుదిద్దుతుంది
నిన్ను నీ బతుకు చౌరస్తాలో నిలబెట్టేందుకు
మీ నాన్న చేతిలో నీ చేయి పెట్టి
కన్నుల్లో కోటి దీపాలు వెలిగించుకుంటుంది
నీ దారంటా అవి కార్తీక దీపాలవ్వాలని
జీవిత సమరాంగణంలో నీ ప్రవేశానికి
అమ్మా నాన్నల కృషే తొలియోగం
వారిచల్లని నీడలోనే నీ గళవీణ తొలిరాగం
నీ బాల్యాన్ని నందనవనం చేసి
నీ రాత్రింబవళ్లకి తొలి కాంతుల తోరణాలు కట్టి
అదిగో నిన్ను నువ్వెత్తు కెరటాల బాటపై
ఆశలాశయాల పడవచేసి నిలబెట్టినప్పుడే
నీ జీవితానికి తొలి సూర్యోదయం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here