[సుగుణ అల్లాణి గారు రచించిన ‘కొడిగట్టిన దీపాలు..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]జ్వలంగా ఒక వెలుగు వెలిగి
ఆ వెలుగును నలుగురికీ పంచి
తమచుట్టూ ఏర్పడిన చీకటి వలయాన్ని
తమలోనే దాచుకుని తమ తేజాన్ని
అందరిలోకీ ప్రసరింప జేసిన దీపాలు
కొడిగడుతున్నాయి..!
గాలివానలకు సోలిపోకుండా
తుఫాను బీభత్సాలను తడబడకుండా
తట్టుకొని నిలబడి —
తన చుట్టూ వెలుగు నింపాలని
తాపత్రయపడిన దీపాలు
కొడిగడుతున్నాయి..!
అరచేతులు అడ్డు పెట్టి
ఆరనివ్వకుండా —
కాపాడమని అడగడంలేదు
చిరుగాలికే రెపరెపలాడే
చిరుదీపాలను గాలికి వదిలివేయొద్దని
వేడుకుంటున్నాయి
కొడిగట్టిన దీపాలు..!
సూర్యుని తేజస్సుతో పోటీపడి
ప్రజ్వలంగా వెలుగమంటున్నాయి
కానీ.. తనను వెలిగించిన ఒత్తిని
మరువొద్దంటున్నాయి..
కొడిగట్టిన దీపాలు..!
ప్రమిదలో చమురు
అయిపోయింది..
ఒత్తికి అంటిన చమురుతో
వెలగలేక వెలగలేక
బలవంతంగా ఆరిపోలేక
దేవదేవుని పిలుపుకోసం
ఎదురుచూస్తున్నాయి..
కొడిగట్టిన దీపాలు..!!