[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘నవయువ తేజాలకు జేజేలు పలుకుదాం..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap]వు మాత్రమే కాదు
నేను కూడా కోరుకునేది అదే కదా
వక్రమార్గాలను సక్రమం చేయాలనే తపనతో
ఉద్బోధనలు చేస్తూనే వున్నాము
జీవనంలో ముడిపడిన చేదు జ్ఞాపకాల్లో
నిండా మునిగి కొట్టుమిట్టాడుతున్నాము
సమయం దాటిపోయిందని
సాధన చేయడాన్ని మానట్లుగానే
వ్యవస్థ భవితవ్యంకై
కార్యసాధకుడిలా విశ్రమించకుండ
ఆవరించిన పక్షపాతపు గాఢాంధకారంలో
చైతన్యపు కాంతి కిరణంలా దూసుకెళ్లాలి..!
ఈ ఊగిసలాట బతుకులు
మనల్నెప్పుడు వెక్కిరిస్తూనే వుంటాయి
పగడ్బందీ వ్యూహకర్తలుగా
ప్రణాళికలను రూపొందిస్తూనే ఉంటాం
విచిత్రంగా వెనక్కిలాగే వాళ్ళే ఎక్కువైపోయారు
సలహాల రూపాల్లో భయపెడుతూ
నెమ్మదిగా హెచ్చరిస్తుంటారు అనేకులు
అలవాటైపోయిందని చల్లని కబుర్లు
బహు చక్కగా వివరిస్తుంటారు సోమరులు
విడమర్చి చెప్పే విశ్లేషకుడిగా విలసిల్లాలి..!
మనమంతా అంతే కావచ్చు
ఏది ఒక పట్టాన నచ్చదెవ్వరికి
అయినా సరే అన్నీ నచ్చినట్లుగానే
అన్నీ మనం కోరుకున్నట్లుగా వున్నాయని
అందరు మనల్ని మెచ్చుకుంటున్నారని
ఊహల వలల్లో చిక్కి తేలిపోతుంటాం
మన చుట్టు కనపడని అడ్డు గోడల్లా
విష వాయువుల్లా అల్లుకున్న
ద్వేషం, స్వార్థాలను కూకటి వేళ్ళతో సహ
నామరూపాలు లేకుండా అంతం చేయడానికి
కదిలిన నవయువ తేజాలకు జేజేలు పలుకుదాం..!