[శ్రీ జోశ్యుల సూర్య ప్రకాశ్ రచించిన ‘హిచ్‍కాక్ నుంచి నోలన్ దాకా’ అనే పుస్తకం సమీక్షని అందిస్తున్నాము.]
[dropcap]తె[/dropcap]లుగులో హాలీవుడ్ సినిమాల విశ్లేషణాత్మక పరిచయ వ్యాసాలను గతంలో పాలకోడేటి సత్యనారాయణ, కె. పి. అశోక్ కుమార్, శ్రీదేవి మురళీధర్ వంటి వారితో సహా పలువురు రాశారు. అందరూ ఒకే సినిమాని చూసినా దాన్ని అర్థం చేసుకునే విధానం, సినిమాలోని అంశాలకు స్పంచించే విధానం, సినిమాను చూసే విధానం, విభిన్నాంశాలను విశ్లేషించే విధానంలో ఎన్నో తేడాలుంటాయి. కాబట్టి సినిమాల విశ్లేషణాత్మక వ్యాసాలు సహజంగా ఆసక్తికరంగా ఉంటాయి.
సూర్య ప్రకాశ్ జోశ్యులకు సినిమాలపై ఆసక్తి అధ్యయనం చేయడంలో మాత్రమే కాక, సినిమా రంగంలో చురుకుగా పనిచేస్తుడంతో, ‘హిచ్‍కాక్ నుంచి నోలన్ దాకా’ మూడు భాగాలలోని వ్యాసాలు సినీ విశ్లేషణతో పాటు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలతో పాఠకులకు సమాచారాన్ని అందించటంతో పాటు సినిమాకు సంబంధించిన సూక్ష్మ విశేషాలను వివరిస్తూ అలరిస్తాయి.
మూడు భాగాలలో మొత్తం 109 సినిమాల పరిచయ వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాలన్నీ ‘నవ్య’ వారపత్రికలో వారం వారం వెలువడ్డవి కావటంతో, ప్రింట్ పత్రికలకు ఉండే పేజీల పరిమితుల దృష్ట్యా వ్యాసాల నిడివి నిర్ణీతమవటంతో వ్యాసాల నిడివి అనవసరంగా పెరిగిన భావన ఎక్కడా కలగదు. అయితే, సినిమాలను వర్గీకరించకుండా, కనీసం క్రొనలాజికల్ ఆర్డర్‍లో నయినా పెట్టకుండా వారం వారం ప్రచురితమైన క్రమపద్ధతిలోనే పుస్తకంలో పొందుపరచటంతో ఏదైనా సినిమాను ప్రస్తావించారో, లేదో, తెలుసుకోవాలంటే, ఏదైనా సినిమా గురించి చదవాలంటే మొత్తం మూడు భాగాల ఇండెక్స్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ఒక్క లోపం తప్పిస్తే, పుస్తకాన్ని ఎంతో అందంగా రూపొందించారు. మూడు పుస్తకాల ముఖచిత్రాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. పుస్తకాల సైజు కూడా మామూలు పుస్తకాలకు భిన్నంగా ఉండి ఈ మూడు పుస్తకాలను ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ విషయంలో కవర్ డిజైన్ చేసిన పపూరి రాజు, డిజైన్ చేసిన లేపాక్షి, లేఅవుట్ డిజైనింగ్ చేసిన నలపరాజు రమేష్ లను ప్రత్యేకంగా అభినందించాల్సి ఉంటుంది. పుస్తకం చూడముచ్చటగా ఉండి, ఇండెక్స్ నుంచి ప్రతీ పేజీ అత్యంత శుభ్రంగా, ఆకర్షణీయంగా రూపొందించిన వారందరికీ అభినందనలు.
సినిమా పరిచయ వ్యాసాల విషయానికి వస్తే , జోశ్యుల సూర్య ప్రకాశ్ ప్రతి వ్యాసాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సినిమాలోని సీన్లతో కొన్ని వ్యాసాలు ఆరంభిస్తే, సినిమా చూస్తే కలిగే స్పందనలను వివరిస్తూ కొన్ని వ్యాసాలు ఆరంభిస్తారు. సినిమా కథ, సినిమా గొప్పతనం, ప్రత్యేకతలు వివరించటంతో ఆగక, సినిమా నేపథ్యం, రూపొందించేందుకు ఆలోచనలు వచ్చిన పద్ధతి, ఇతర సాంకేతిక వివరాలను, ఆ సినిమా గురించి సినిమాలో పనిచేసిన కళాకారులు చెప్పిన వివరాలను పొందుపరుస్తారు. సినిమాకు సంబంధించిన ఇతర ఆసక్తికరమైన విషయాలను చెప్తారు. దాంతో వ్యాసం కేవలం సినిమా పరిచయం వ్యాసంగానో, విశ్లేషణాత్మక వ్యాసంగానో లేక ఇతర సంబంధిత అంశాలు చెప్పే వ్యాసం గానో కాక సినిమా గురించిన సంపూర్ణ, సమగ్రమైన వ్యాసంగా రూపొందుతుంది. అందువల్ల ప్రతి వ్యాస పఠనం ఒక సినిమాను చూసిన అనుభూతిని కలిగించటం మాత్రమే కాదు; సినిమా ఆలోచన బీజం పడినప్పటి నుంచి – అది ఎదిగి వృక్షమై – పూలు, పళ్ళు ఇచ్చేంత వరకూ తెలుసుకున్న భావన కలుగుతుంది. చక్కని అనుభూతిని కలిగిస్తుంది ప్రతి ఒక్క వ్యాసం.
ఉదాహరణకు ‘అనీ హాల్’ సినిమా గురించి చెప్తూ, “ఏనుగు శిల్పం ఎలా తయారు చేశారు అని అడిగితే, మీరు ఓ పెద్ద రాయిని తీసుకురండి.. నేను అందులోంచి ఏనుగు కానిది మొత్తం తీసేస్తాను. అప్పుడు మిగిలేది ఏనుగు” అని సినిమా రూపొందిన విధానం గురించి చెప్పిన విషయం గొప్పగా అనిపిస్తుంది. ఇదే పద్ధతి మన సినిమాల్లోనూ అవలంబిస్తే, అప్పుడు సినిమాల నిడివి తగ్గటమే కాదు, సినిమాలు కూడా ఆసక్తికరంగా, సరిగ్గా తయారవుతాయి అనిపిస్తుంది.
‘డన్‍కిర్క్’ సినిమా గురించి వ్యాసం “అలా దర్శకుడు క్రిస్టాఫర్ నోలన్, అతని భార్య ఎమ్మా థామస్ పెళ్ళి ముందు కన్న కల, ఓ ఇరవై ఏళ్ళ తరువాత వెండి తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైంది” అంటూ ముగిస్తారు. అంతకు ముందు వారి కల, అది సాకారమైన రీతిని సినిమాతో పాటూ వివరిస్తారు.
‘ఫౌంటెన్‍హెడ్’ సినిమా గురించిన వ్యాసంలో సృజనకూ, నిజజీవితానికి తేడా తెలియని అయాన్ రాండ్ పెట్టిన షరతుకు నిర్మాత ఒప్పుకోవటం వల్ల సినిమా ఎలా దెబ్బతిన్నదో చెప్తూ, “సినిమా చూసి పుస్తకం చదివితే కథని పట్టించుకోకుండా ఫిలాసఫీతో ప్రయాణం పెట్టుకోవచ్చు. అదే మొదట పుస్తకం చదివితే మాత్రం.. ఏంటి సినిమా ఇంత దారుణంగా ఉంది అనిపిస్తుంది” అని వ్యాఖ్యానించటం రచయిత అవగాహన లోతును చూపిస్తుంది.
‘రోమన్ హాలీడే’ సినిమా గురించిన వ్యాసం లోని పలు విషయాలను చక్కగా వివరించారు. ముఖ్యంగా, సినిమాలో వాడిన ‘వెస్పా’ డిమాండ్ పెరగటం నుంచి, ఈ సినిమా ప్రేరణతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో సినిమాలకు ప్రేరణ లభించటం వరకూ పలు ఆసక్తికరమైన అంశాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. అయితే 1934లో వచ్చిన ‘ఇట్ హాపెన్డ్ వన్ నైట్’ను ‘రోమన్ హాలీడే’తో సహా, ఇలాంటి ఇతర సినిమాలకు మాతృకలా భావిస్తారు.
ప్రతి సినిమా గురించి కేవలం కథ కాకుండా ఇలా పలు విషయాలను వివరిస్తూ సాగిన ఈ వ్యాసాలు సినీ ప్రేమికులనే కాదు, సామాన్య పాఠకులను కూడా అలరిస్తాయి. సినిమా పట్ల ఆసక్తి కలవారికే కాదు, ఇప్పుడు ఓటిటి ప్లాట్‍ఫారం ద్వారా ప్రతి ఒక్కరికీ బోలెడన్ని సినిమాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో చూడాల్సిన సినిమాల ఎంపికలో ఈ మూడు భాగాలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కొని ఇంట్లో ఉంచుకోవాల్సిన పుస్తకం ఇది.
అయితే పుస్తకం పేరు ‘హిచ్‍కాక్ నుంచి నోలన్ దాకా’ అని పెట్టడం వల్ల ఈ పుస్తకం ‘హాలీవుడ్’ సినిమాల పరిచయాలకే పరిమితం అయిందన్న అపోహ కలుగుతుంది. కానీ ఇందులో హాలీవుడ్ సినిమాలతో పాటు, యూరోపియన్ సినిమాలు, ఏసియన్ సినిమాలు, ఇరానీ సినిమాలు, హిందీ సినిమాల పరిచయాలు కూడా ఉన్నాయి. పుస్తకంలో వీటన్నిటినీ చివరకు ఒక చోట వరుసగా పొందుపరిస్తే బాగుందేది. కానీ వారపత్రికలో ప్రచురణ అయిన క్రమంలోనే పుస్తకంలో ప్రచురించటంతో అన్నీ కలగాపులగం అయిపోయాయనిపిస్తుంది. అయితే ఇది పుస్తక పఠనీయతను కానీ, వ్యాసాల పట్ల ఆసక్తిని కానీ ఏ మాత్రం తగ్గించదు.
ఒక చక్కటి సినిమా పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించిన జోశ్యుల సూర్య ప్రకాశ్ అభినందనీయులు. ఆయన భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలను, ఈ పుస్తకంలో పరిచయం చేయని మరిన్ని క్లాసిక్ సినిమాలను పరిచయం చేస్తూ చక్కటి పుస్తకాలను అందిస్తారని ఎదురుచూడటం అత్యాశ, దురాశ కానే కాదనిపిస్తుంది.
***
హిచ్‍కాక్ నుంచి నోలన్ దాకా (మూడు భాగాలు)
రచన: జోశ్యుల సూర్య ప్రకాశ్
ప్రచురణ: జోశ్యుల పబ్లికేషన్స్
పుటలు: (232+184+184)
వెల: ఒక్కో భాగం ₹ 250. సెట్ ₹ 750
ప్రతులకు:
రచయిత: 9704683520
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Hitchcock-Nolan-Books-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2/dp/B0BW4BYNB4