[అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ‘జీవన సంధ్య’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ.]
[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రచయిత, కాలమిస్టు, కార్టూనిస్టు శ్రీ సుధామ గారు ‘వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్’ మాసపత్రికలో మూడు సం.ల పాటు నిర్వహించిన ‘సీనియర్ కబుర్లు’ కాలమ్ నిజానికి వయోవృద్ధుల గుండె చప్పుడు.
పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ల గూడు వారు నిర్మించుకున్నాక ఒంటరిగా మిగిలిపోయిన గూటిలో గువ్వా గోరింకల వంటి వృద్ధుల వెతలు వర్ణనాతీతం. ఒకవేళ జంటలో ఒకరు శాశ్వతంగా దూరమైతే ఆ ఒంటరి చక్రవాకం వ్యథ చెప్పనలవి కాదు. వృద్ధాప్యంలో వచ్చి పడే శారీరక అనారోగ్య సమస్యలతో పాటు, ఒంటరితనం, దూరమైన ఆప్యాయతలు, స్వార్థపూరిత బంధాలు, ఆత్మీయత కోసం ఎదురుచూపులు, ఓపిక తగ్గిపోయి, వయసు తెచ్చే నీరసం, ఒక ఆప్యాయమైన పిలుపు కోసం, ఓదార్పు నిచ్చే పలకరింపు కోసం మొహం వాచిపోవడం, ఏం చేయాలో తోచక, చేయలేక భారంగా రోజులు వెళ్ళదీయటం.. ఇలాంటి సమస్యలన్నిటినీ నెల నెలా ప్రస్తావించారు సుధామ గారు. వాటినన్నిటినీ కలిపి 2022 లో ‘జీవన సంధ్య’ పేర పుస్తకంగా వెలువరించారు.
సీ‘నియర్’ అంటే దగ్గరగా చూడమని. ఏదైనా సమీపం నుండి, దగ్గరగా, పరిణతితో పరిశీలించినప్పుడే ఆ విషయపు లోతుపాతులు బాగా తెలుస్తాయి. జీవితాన్ని అలా దగ్గరగా చూసి అనుభవం గడించిన వారు కనుకనే సీనియర్ సిటిజన్లు అయ్యారు. ‘సీ’నియర్ అంటే సముద్రానికి దగ్గరగా అనీ, ‘జూ’నియర్ అంటే జంతుప్రదర్శనశాలకు దగ్గరగా అని ఒకాయన చమత్కరించాడు. కుప్పిగంతులు వేసే జంతు దశ నుండి ఆటుపోట్లు ఎన్ని ఉన్నా నిశ్చల గంభీరతతో ఉండే సముద్రస్థితికి ఎదగడమే జూనియర్లు సీనియర్లు కావటం అంటారాయన. వయోవృద్ధులకు శారీరక మానసిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పైకి చెప్పుకునేవి. కొన్ని చెప్పుకోడానికి మనస్కరించక లోలోపల కుమిలిపోయేవి. సుధామ గారు ఇలాంటి బరువైన, బాధాకరమైన విషయాలను కొన్నిసార్లు సున్నితంగా, కొన్నిసార్లు సూటిగా చెప్తూనే, మనసుకు ఆహ్లాదం కలిగించే విషయాలను హాస్యంగా చెప్పడంతో సీనియర్ సిటిజన్స్ ఈ కాలమ్‌ను మనసారా ఆదరించారు. ప్రతినెలా ఏం చెప్తారా అని ఎదురుచూడడమే కాక, తమ స్పందనని పత్రికకు తెలియజేసారు. దానితో ఈ కాలమ్ ‘సూపర్ హిట్’ అయింది.
శరీరానికి వ్యాయామమే కాక మేధస్సుకి వ్యాయామం కావాలంటే పజిల్స్, పదబంధ ప్రహేళికలను నింపే పని పెట్టుకోవాలి. మనసుకి వ్యాయామం అంటే మెడిటేషన్ (ధ్యానం) చేయాలి. పదవీవిరమణ అంటే బాధాకరం కాదు. జీవిత పయనంలో, పరుగుల్లో మన కోరికలను, హాబీలను, అభిరుచులను అణుచుకునే ఉండి ఉంటాం. వాటినన్నిటినీ హడావుడి లేకుండా హాయిగా నేర్చుకోవచ్చు. నెరవేర్చుకోవచ్చు. పరిపక్వ దశకు చేరుకుని, అసలైన జీవితానందాన్ని నిదానంగా, నిమ్మళంగా ఆస్వాదించవచ్చు. తన వయసు వారితో కలిసి ‘వాకింగ్’కి వెళ్ళడం వల్ల ఆరోగ్యంతో పాటు తమ జీవితానుభవాలను పంచుకోవచ్చు. పిల్లలు ఎలాగూ ఆలకించరు. బోర్ అంటారు కూడా. ఆడవారు కూడా టివి ముందు కూర్చుని శారీరక శ్రమ లేక ఊబకాయం వచ్చి, దానితో వచ్చే అనారోగ్యాలతో కంగారుగా డాక్టర్ల వద్దకు పరుగెత్తుతారు. ఆ సీరియల్స్‌లో పగలు, ప్రతీకారాలు చూసి మనసు పాడుచేసుకునే బదులు, ఇరుగుపొరుగు వారిలో నిరుపయోగకరమైన ముచ్చట్లు చెప్పుకుంటూ టైం ని యథార్థంగా ‘కిల్’ చేసే బదులు ఆరోగ్యకరమైన హాబీలను ఎంచుకోవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మనసు, శరీరం, ఆలోచనలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. విసుగు, చికాకు, నెగెటివ్ భావాలతో వారు బాధపడడమే కాక ఇంటిల్లిపాదినీ ఆవేదనకు గురిచేస్తారు. అన్నిటికన్నా మంచి అలవాటు ‘పుస్తక పఠనం’. తాము చదువుతూ ఉంటే చూసి ఇంట్లో చిన్న పిల్లలూ చదవడం నేర్చుకుంటారు. తాము కబుర్లలో, టివి సీరియల్స్‌లో మునిగిపోయి, పిల్లల్ని మాత్రం చదువుకోమనడం న్యాయమా! మన ఉనికి తర్వాతి తరం వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ చాదస్తంతో వారికి విసుగు కలిగించకూడదు. దానివల్ల పెద్దలే విలువను, గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
సీనియర్ సిటిజన్స్ శారీరక సమస్యలను కొంతవరకైనా తగ్గించుకోవడానికి కేవలం వైద్యుల పైననే ఆధారపడకుండా, తమకు చేతనైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మానసికంగా ఒత్తిడికి లోనవ్వడమూ, క్రుంగుబాటుకు లొంగిపోవడం, తనకు తానే ఐసోలేట్ అయి ఒంటరితనంతో బాధపడడం మంచిది కాదు. దాని వల్ల శారీరక రుగ్మతలు పెరిగే అవకాశం ఉంది. స్ట్రెస్ మేనేజ్‌మెంట్, ఒత్తిడిని నియంత్రించుకునే నైపుణ్యం పెంచుకోవాలని, పుస్తక పఠనం, తోట పని, లలితకళలు, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలని సూచించారు సుధామ. ఒక వయసు వచ్చాక తమ శక్తికి మించిన పనులను చెప్తే మొహమాటం లేకుండా నిరాకరించాలి. ఆందోళన కలిగించే వాటిని లోలోపల దాచుకుని కుమిలిపోయే కంటే, బైటకు వెల్లడించడానికి ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, హాయిగా ఇష్టమైన కీర్తనో పాటో పాడుకోవడం, లేదా కొత్తగా ఏదైనా కళను నేర్చుకోడానికి ప్రయత్నం చేయడం వల్ల జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, దాని ప్రకారం నడుచుకుంటే అవకతవకలుండవు. అయోమయం ఉండదు.
తమ మాట ఎవరూ వినడంలేదని, తమ పెద్దరికానికి గౌరవం ఇవ్వడం లేదని, అసలు తమని పట్టించుకోవడం లేదని కొందరు వాపోతుంటారు. ఒక్కోసారి ‘చావు రాదేమి దేముడా’ అనుకునేంత డిప్రెషన్ లోకి జారిపోతారు. అది అర్థరహితమే కాక ప్రమాదకరం కూడా. ఒంటరితనం బాధాకరమైనదే. కానీ ఇలాంటి ‘ఆత్మన్యూనత’ భావం వలన తమకే కాక ఇంటిల్లిపాదికీ ఒక ఇబ్బందికర వాతావరణాన్ని కల్పించినట్టు అవుతుంది. కోరి తెచ్చుకునే కష్టాలంటే ఇలాటివే. చాలామంది వృద్ధులకు సాధారణంగా ఉండే అలవాటు – చేసే పనేమీ లేక, తోచక, ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతూ ఉండడం. నిజానికి అది కడుపుకు ‘ఆకలి’ కాదు. మనసుకు, మేధకు ‘ఆకలి’. కాబట్టి ఆ ఆకలిని తీర్చుకుంటే ఈ ఆకలి ఉండదు. దాని కొరకు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచుకోవాలి. ఆకలితో పాటు అసంతృప్తులు, అశాంతులు పోయి ప్రశాంతత పొందుతారు.
‘రెండో బాల్యం’ లోని వృద్ధులకు ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక వైద్య విభాగం ‘జేరియాట్రిక్స్’ ప్రాచుర్యంలోకి వస్తోంది. వృద్ధాప్యం ఒక భిన్నమైన జీవన దశ.
(2023 సెప్టెంబర్ 10 న ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో జేరియాట్రిషియన్స్ గురించిన వ్యాసంలో అనేక వివరాలు ఇచ్చారు బి. నర్సన్) వైద్య విధానాలు మెరుగుపడడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం వల్ల ఆయుః ప్రమాణం పెరిగింది. దానితో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారి సమస్యలు పెరుగుతున్నాయి.
వాటి గురించి ప్రతి నెలా చర్చించడమే కాక, సరళ భాషలో, సున్నితంగా పరిష్కారాలను సూచించారు సుధామ. నిజానికి వృద్ధాప్యం అనేది జీవితాన్ని ఏ బాదరాబందీలు లేకుండా స్థిమితంగా ప్రశాంతంగా గడపడానికి. పదవీవిరమణ అనేది అందుకే ఆహ్వానించదగిన పరిణామం. పిల్లలతో, బంధువులతో సర్దుబాటు చేసుకోకపోతే ఇబ్బందులు పడకతప్పదు. చిన్నవారు ఏదైనా అనినా సంయమనం పాటించాలి. తమ జీవితానుభవంతో సహనం వహించి, తమ వ్యక్తిత్వంతో పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. పెద్దరికంతో వివేకవంతంగా ప్రవర్తిస్తే గౌరవాన్ని పొందుతారు.
అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా పాటింపబడుతోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1990 డిసెంబర్ 14న సమావేశమై అక్టోబర్ 1 అంతర్జాతీయ వయోధికుల దినంగా పాటించాలని నిర్ణయించింది. 1991 నుండి అది అమల్లోకి వస్తున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, కెనడాలో అప్పటికే ‘నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే’, చైనాలో ‘డబుల్ నైన్త్ ఫెస్టివల్’, జపాన్ లో ‘రెస్పెక్ట్ ఫర్ ద ఏజ్డ్ డే’ అమలులో ఉన్నాయి. 1984లో వియన్నాలో మొదటిసారి వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. ‘సీనియర్ సిటిజన్’ అన్న పదం అప్పుడే పుట్టింది. 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల వృద్ధుల సంక్షేమ సమావేశంలో 46 తీర్మానాలను ఆమోదించారు (అవి ఎంతవరకు అమలయ్యాయో చెప్పలేం).
“బంధాలు పెంచుకొని లేనిపోని మమకారాలతో ఆందోళనలు పడకుండా, ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతత కోసమే ప్రయత్నించటం సబబు. ఎందుకంటే బ్రతికినంత కాలం ఇక ఎలాగూ బ్రతకం. కనుక ‘అనాయాసేన మరణం. వినాదైన్యేన జీవనం’ అన్న సూక్తి పథంలో సమాపనం కావటమే జీవన సార్ధక్యం” అంటారు సుధామ.
ఆయా నెలలలో వచ్చే పండుగలు, ముఖ్య దినాలను సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ, అంతలో ప్రపంచవ్యాప్తంగా వచ్చి పడిన ఆపద ‘కరోనా’ గురించిన వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసారు. ఆప్తులను కోల్పోయిన సమయంలో ఆత్మస్థైర్యం పెంచుకుంటూ, వైరాగ్య భావనతో, జీవితపోరాటంలో శక్తివంచన లేకుండా, స్థిమితంగా తమను తాము సన్నద్ధం చేసుకోవాలని హితవు పలికారు.
తెలుగు అధ్యాపకులుగా ఉద్యోగ జీవనం ప్రారంభించి, 1978లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి, క్రమంగా పదోన్నతులు పొందుతూ, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా, కార్యనిర్వహణాధికారిగా పనిచేసి, 2008లో ఆకాశవాణి వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం నుండి స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. సుదీర్ఘ కాలం రేడియోలో పనిచేయడం వల్ల సుధామ గారికి ‘టైం మేనేజ్‌మెంట్’, ‘స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ బాగా తెలుసు. తన అనుభవాలను రంగరించి, సమాజాన్ని పరిశీలించి, వృద్ధుల గురించి ఆలోచించి, అంతటితో ఆగక, నెలనెలా మూడేళ్ల పాటు కాలమ్ రాసినందుకు ఆయనను అభినందించాలి. ఈ వయసులో కూడా ఖాళీగా రోజులు వెళ్ళదీయక, ఉత్సాహంగా, ప్రతి నెలా మొదటి, మూడవ గురువారాలలో ‘ఓసారి చూడండి.. అంతే’ పేరిట వాట్సాప్ మాధ్యమంలోను, టెలిగ్రాం మాధ్యమంలోను నిర్వహిస్తున్న ప్రసార సంచిక వినూత్న ప్రయోగంగా సమాదరణ పొందుతోంది. దానికి మనందరమూ సాక్షులమే కదా!
మరి ‘జీవన సంధ్య’ను చదవండి పెద్దలూ! పిల్లలు కూడా చదవాల్సిన అవసరం కూడా ఉందని అందరికీ చెబుదాం ఈ ‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ సందర్భంగా.
***
జీవన సంధ్య (వ్యాససంపుటి)
రచన: సుధామ
ప్రచురణ: స్నేహిత స్రవంతి
పేజీలు: 144
వెల: ₹120.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఎ. ఉషారాణి: 9849297958, 9848276929
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/te/products/jeevana-sandhya