ఆకాశవాణి పరిమళాలు-13

0
3

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

హైదరాబాద్ స్టేషన్‌కి కొత్త డైరక్టరు:

[dropcap]1[/dropcap]984 జనవరి నాటికి హైదరాబాదు ఆకాశవాణికి కొత్త డైరక్టరుగా లీలా బవ్‌డేకర్ వచ్చారు. నేను 1982 అక్టోబరులో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా చేరేనాటికి సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన మైసూరు వాసుదేవాచార్ మనుమడు, సౌమ్యుడు అయిన యస్. రాజారాం డైరక్టరుగా వున్నారు. ఆయన 1983 జనవరి 31న రిటైరయ్యారు. కొంతకాలం వరకూ ఎవరూ లేరు. నేను, నా సహ అసిస్టెంట్ డైరక్టర్ శివ శంకరన్ బండి లాగాము. యన్.టి.రామారావు గారి ప్రసంగం విషయంలో తలెత్తిన వివాదంతో ఆఘమేఘాల మీద ఢిల్లీనుండి అత్యంత సీనియర్ డైరక్టర్ అయిన కేశవపాండేను హైదరాబాద్ డైరక్టర్‌గా వేశారు. ఆయన అక్టోబర్ 31న ఢిల్లీ వెళ్ళి డిప్యూటీ డైరక్టర్ జనరల్, దూరదర్శన్‌గా చేరిపోయారు. కొద్ది రోజులలో శివ శంకరన్ బదిలీ మీద త్రివేండ్రం వెళ్ళిపోయారు. ఇంతలో లీలా బవ్‌డేకర్‌ను హైదరాబాదుకు మార్చారు. అప్పుడు నేనొక్కడినే అసిస్టెంట్ డైరక్టర్‌ని.

ఆవిడ యు.పి.ఎస్.సి. ద్వారా నేరుగా స్టేషన్ డైరక్టర్‌గా సెలెక్ట్ అయ్యారు. లోగడ ఆకాశవాణి అనుభవం లేదు. చాలా కరకుగా, కటువుగా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడేది. దాదాపు 16 మంది ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు తలలు నెరిసినవారున్నారు. వారు తయారు చేసిన ప్రపోజల్స్ అన్నీ నా ద్వారా డైరక్టర్ సంతకానికి వెళ్ళేవి. నేను నాతో పని చేసే ప్రోగ్రాం నిర్వాహకులపై అధికారం చెలాయించడం లేదని ఆమె అభియోగం. నేను అనవసరంగా వారి ప్రపోజల్స్‌ని ఆమోదించడం లేదని క్రిందిస్థాయి అధికారులు నాపై నేరం మోపారు. ఒకసారి మిత్రులతో అన్నాను – “నేను మృదంగం లాంటి వాడిని. ఇటువైపు కార్యక్రమ నిర్వాహకులు, అటు వైపు డైరక్టరు బాగా వాయిస్తున్నారు” అని. అంతా నవ్వుకున్నాం.

ఆకాశవాణిలో వుండే మంచి సంప్రదాయాలలో ఒకటి -ప్రతి నిత్యం ఉదయం 10.30 గంటలకు ప్రోగ్రాం మీటింగ్ జరుగుతుంది. అందులో 16 మంది కార్యక్రమ నిర్వాహకులు, నేను, డైరక్టరు హాజరవుతాం. నిన్నటి కార్యక్రమాలపై సమీక్ష, తప్పొప్పుల బేరీజు, ఈ రోజు రేపు కార్యక్రమాలు క్షుణ్ణంగా సమీక్షిస్తారు.

ఆ తర్వాత డైరక్టర్ తమ మనసులో మాట, డైరక్టరేట్ వారి ఆదేశాలు వివరిస్తారు. అదొక సమీక్షా సమావేశం వంటిది. దేశంలోని అన్ని రేడియో కేంద్రాలలోనూ ఈ కసరత్తు రోజూ జరుగుతుంటుంది. ఒకరోజు నిండు సభలో మా డైరక్టర్ లీలా బవ్‌డేకర్ కటువుగా సహజ ధోరణిలో మాట్లాడుతోంది. మూడు నెలలకొకసారి తయారు చేసే షెడ్యూల్స్ గురించి పేరు పేరునా అడుగుతోంది. తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా రావూరి భరద్వాజ ఆ మీటింగ్‌లో ఉన్నారు. ఆయన ఆ షెడ్యూల్ పూర్తి చేయలేదు. ఆమె కటువుగా మందలించింది.

సోఫాలో కూర్చున్న భరద్వాజ గుండె నొప్పితో వాలిపోయారు. వెంటనే వి.వి. శాస్త్రి ఆఫీసు కార్లో ఆయనను నిజాం ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకెళ్ళారు. ముందుగా అక్కడ కార్డియాలజీ విభాగాధిపతికి ఫోన్ చేశారు. 15 నిముషాలలో వారు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు చేరగలిగారు. డైరక్టరు నివ్వెరపోయారు. కోపంగా ఆమెగదిలోకి వెళ్ళిపోయారు.

పది నిముషాలలో ఆమె గదిలోకి నేను వెళ్ళాను. ఆమె కోపం ఇంకా తగ్గలేదు. “All of you are against me. Do you think he had heart attack because of me?” అని ప్రశ్నించింది.

“యస్ మేడమ్” అన్నాను.

ఆమె కది నచ్చలేదు. ఏమీ మాట్లాడలేదు. నేను లేచి వచ్చి, నేరుగా ఆసుపత్రికెళ్ళి పరామర్శించి వచ్చాను. భరద్వాజ మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి ఇంటికొచ్చి సెలవు పెట్టారు. నిముషాల మీద వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళడం, సరియైన వైద్య సేవలు అందడం వల్ల ఆయన ప్రాణాలు దక్కాయి.

మా డైరక్టర్ నాతో మాట్లాడడం మానివేసింది. ఒక వారం అలా గడిచింది. పరిస్థితి బాగుండలేదు.  నేను ఆమె గదిలోకి వెళ్ళి ఒక మాట చెప్పాను. “మేడం, నా పై అధికారి  ఏమి చెప్పినా ‘యస్’ అనడం నాకు అలవాటు. మీరు మీ ప్రశ్నను “I hope it is not because of me” అని ఉంటే నేను ‘యస్ మేడం’ అని ఉండేవాడిని” అన్నాను. ఆమె నవ్వింది. అంతటితో మాట పట్టింపులు సడలిపోయాయి.

ఆమె డైరక్టరుగా ఉన్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. వివిధ పార్టీల వారు ఎన్నికల ప్రసంగాలు మా స్టూడియోలో రికార్డు చేయడానికి వచ్చారు. అన్ని పార్టీల హేమాహేమీలు తమ ప్రసంగ పాఠాలతో వచ్చారు. ఆ ప్రసంగాలను ఆమోదించే కమిటీ ఉండేది. సీనియర్ నాయకులు స్టూడియోకి రావడం, వారిని రికార్డు చేయడం ఒక అనుభవం.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంగ్లీషులో ప్రసంగం రికార్డు చేయడానికి అప్పట్లో విదేశాంగ శాఖా మంత్రి శ్రీ పి.వి. నరసింహారావు ఒక రోజు ఉదయం 11 గంటలకు వస్తారని ఢిల్లీ నుంచి సందేశం వచ్చింది. ఆ మరునాటి రాత్రి జాతీయ స్థాయిలో ఆ ప్రసంగ ప్రసారం వుంది. వారి ప్రసంగ పాఠాన్ని ఢిల్లీ కేంద్రం వారు ఆమోదించారు.

సరిగ్గా 11 గంటలకు పి.వి.గారు స్టూడియోకు వచ్చారు. ముఖద్వారం వద్దనే మా డైరక్టరు, నేను తదితర మిత్రులం సాదరంగా స్వాగతించాం. ఆయన కారు దిగగానే “పద్మనాభరావు! నేను సాయంకాలం ఢిల్లీ వెళుతున్నాను. రికార్డు చేసిన టేపు సీలు చేసి నాకిస్తే నేను మీ రేడియో స్టేషన్‌కు పంపుతాను” అన్నారు. మా డైరక్టరు వారిని తమ గదిలోకి తీసుకెళ్ళింది. ఎదురు కుర్చీలో పి.వి.గారు కూర్చుంటే తన దర్పం చూపాలని ఆమె కోరిక. ఆయన చాణక్యుడు గదా! “మనం స్టూడియోకి వెళదాం” అంటూ బయటకి దారి తీశారు.

అరగంటలో రికార్డింగ్ పూర్తయింది. ఎడిటింగ్ చేయాల్సి ఉంది. రెండు గంటలలో పూర్తి చేశాం. ఆ టేపును రాజభవన్‍లో బస చేస్తున్న పి.వి.గారికి అందించే బాధ్యతను మా డైరక్టరు నాకు అప్పగించింది. వెళ్ళి ఇచ్చి వచ్చాను. రాగానే ఆమె నన్ను అడిగింది.

“మీకు పి.వి.గారు తెలుసనని నాకెందుకు చెప్పలేదు?”

నిజానికి నేను పి.వి.ని ఎరుగను. ఢిల్లీ డైరక్టరేట్ వారితో ఎన్నికల ప్రసంగం రికార్డింగ్‌కు నేను ఇన్‌చార్జి అని తెలుసు. వారు పి.వి.గారికి కాంటాక్ట్ పర్సన్ కింద నా పేరు, పోన్ నెంబరు ఇచ్చారు. ఆయన అపర చాణక్యుడు గాబట్టి – ‘పద్మనాభరావ్’ అని పేరుపెట్టి పిలిచారు. అంతకు మించి నాకేమీ పరిచయం లేదు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా వాస్తవమిది.

1997లో నేను ఢిల్లీ కేంద్ర డైరక్టర్‌గా వెళ్ళాను. అప్పటికి పి.వి.గారు మాజీ ప్రధాని. అప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. వారి పి.యస్.గా ఖండేకర్ అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ఆయన వద్ద పని చేసేవారు. ఆయన ఒక రోజు ఫోన్ చేసి పి.వి.గారికి ఒకటి, రెండు కర్నాటక, హిందుస్థానీ సంగీత సి.డి.లు కావాలని చెప్పారు. నేను ఆర్కైవ్స్‌లో పనిచేసే గోపాలకృష్ణన్‌ కలిసి పి.వి.గారి బంగ్లాలో యిచ్చి వచ్చాము. అది మొదలు నెలకొకసారి అయినా వారిని కలిసేవాణ్ణి. ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆంధ్రదేశంలోని సాహితీరంగ ప్రముఖుల యోగక్షేమాలు విచారించేవారు. రాష్ట్రపతి భవన్ సమావేశాలలో కలిసినా పేరుపెట్టి పలకరించేవారు.

***

అవి 1984 చివరి రోజులు. డైరక్టర్ ప్రవర్తన మితి మీరిపోయింది. ఆఫీసు మెయిన్ గేట్ వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని 10 గంటల తర్వాత వచ్చినవారి నందరినీ మందలించేది, కసురుకునేది. ‘Pot Bellies’ అని ఎగతాళి చేసేది. ఈ వాతావరణంలో పనిచేయడం కంటే బయటపడి మరో చోటకి వెళ్ళడమే భావ్యమని తోచింది.

ఢిల్లీ నుండి మా ట్రాన్స్‌ఫర్లు చూసే అధికారి హెచ్.సి. జయాల్ ఒక రోజు ఒక ఎంక్వయిరీకి హైదరాబాదు వచ్చారు. నా పనితీరు, స్వభావము ఆయనకు బాగా నచ్చాయి. ఆయన వచ్చిన ఎంక్వయిరీ యోజన ఆఫీసుకు సంబంధించినది. ఆయనతో పాటు మరో డైరక్టరు ఏ.కె. భట్ ఎంక్వయిరీ ఆఫీసరుగా వచ్చారు. మూడు రోజులు వారి బాగోగులు మేమే చూశాము.

రెండు, మూడు నెలల తర్వాత నేను జయాల్‌కు ఫోన్ చేశాను. “త్వరలో హైదారాబాద్ వాణిజ్య విభాగం అసిస్టెంట్ డైరక్టర్‌కి ప్రమోషన్ వస్తోంది. అప్పుడు మార్పులు, చేర్పులు ఉంటాయి గదా! నన్ను మరో ఊరికైనా సరే మార్చండి” – అని మొరపెట్టుకున్నాను.

1985 జనవరిలో హైదరాబాదు వాణిజ్య విభాగాధిపతిగా ఉన్న యస్. కృష్ణమూర్తిని ప్రమోషన్ మీద తిరునెల్వేలి డైరక్టరుగా వేశారు. అదే భవనంలో (ఏ.సి.గార్డ్స్) ఉన్న ట్రయినింగ్ సెంటర్ కూడా ఖాళీగా ఉంది. అక్కడ పని చేస్తున్న పి.యు. ఆయూబ్ నాగర్‌కోయిల్ వెళ్ళారు. ఈ రెండు పోస్టులకు ఖాళీ ఏర్పడింది. నన్ను ఆ రెండిటినీ చూసుకోమని జనవరి ఆఖరులో ఆర్డర్లు వచ్చాయి. నేనున్న మెయిన్ స్టేషన్‌కి ఎవరినీ వేయలేదు.

1985 జనవరి 31న హైదరాబాదు ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగాధిపతిగా చేరాను. అదే బిల్డింగ్‌లో వున్న ట్రయినింగ్ సెంటర్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా నాకే అప్పగించారు.

నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా గొప్పతనం మా లీలా బవ్‌డేకర్ మేడం గుర్తించింది. ఒకటి, రెండు మీటింగులలో ఆ విషయం బహిరంగంగానే చెప్పింది. ‘Good Worker’ అని కితాబు ఇచ్చింది. ఆమె కూడా కొద్ది రోజులకే లక్నో దూరదర్శన్ కేంద్రం డైరక్టర్‌గా వెళ్ళింది. 1989 ప్రాంతాలలో ఆమె డిప్యూటీ డైరక్టర్ జనరల్ అయ్యింది. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధితో మరణించింది. చాలా విచారకర సంఘటన.

(సశేషం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here