ఖనిజాన్వేషణ

3
5

[శ్రీమతి వి. బి. సౌమ్య రచించిన ‘ఖనిజాన్వేషణ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]“ఖ[/dropcap]నిక 2040 నుండి సందేశం” అంటూ కంప్యూటర్ తెలుగులో మోగడంతో పక్క తెరపై దేనినో పరిశీలిస్తున్న భువన కంప్యూటర్ తెర వైపు తిరిగి చూసింది.

“సారీ, వర్షం పడేలా ఉంది, ఇంతలోపు తొందరగా ఛార్జ్ చేసేసుకుందామని ఫ్లైట్ మోడ్‌లో ఉండిపోయాను కాసేపు. ఇపుడే చూసా, నీ నుండి మెసేజెస్‌తో పాటు కాల్ కూడా ఉంది. ఏమైంది?” అని మెసేజి.

“ఓరిని, నీకేమైందో అన్న కంగారు పడ్డాను. నీకోసం ఇప్పుడే ఒక గాలిమోటరుని పంపాము.”

“మీ కంగారు పాడుగాను. సరే రానివ్వండి. ఎవరు నడుపుతున్నారు?”

ఖనిక సమాధానంలో విసుగుని పసిగట్టింది భువన. అయినా శాంతంగా “ఝంకారి” అని జవాబిచ్చింది.

“ఓహ్, మంచిది. చెట్టూ చేమా, రాయీ రప్పా, మన్నూ మశానం, పురుగూ పుట్రా, పశువూ పక్షీ తప్ప ఇంకేదన్నా చూసి చాలా కాలమైంది. ఇక్కడ కొత్తగా కనబడ్డ రాళ్లు కొన్ని దాచి ఉంచాను. ఆమెతో ఇచ్చి పంపిస్తా. మిగితా విషయాలు సాయంత్రం స్టాన్డ్-అప్ వీడియో కాల్‌లో మాట్లాడుకుందాం. అంతలోపు డేటా అప్‌లోడ్ చేస్తాను”

“సరే గాని, నీకోసం ఇలా హడావిడి పడడానికి ఒక కారణం ఉంది.”

“ఏమిటది?”

“స్థలం మార్పు”

“ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ ఆర్నెల్లకోసారి మార్చడం? ఒకచోట లోతుగా దిగకపోతే మనకేం తెలుస్తుందని?”

“నువ్వు ఈ ప్రాంతపు మట్టి గురించీ, లోహ సంపద గురించీ రోజూ పంపుతున్న సమాచారమంతా మన యంత్ర మెదడు లోహి లోతుగా అధ్యయనం చేసి నాకు ఒక నివేదిక ఇచ్చింది. దాని లెక్కలని బట్టి ఇక అక్కడ అన్వేషించడం వల్ల మనకి అంత ఉపయోగం లేదు. సమయం, డబ్బు దండగ అవుతాయి అంతే. భూమికి, పర్యావరణానికి ఒరిగేది ఎలాగో ఏమీ లేదు. నేను లోహి విశ్లేషణని బాగా పరిశీలించాను. అక్కడ కొట్టు కట్టేసి మరొక చోటికి మారాలి. తప్పదు. ఊరికే లోతు చూద్దామని తవ్వుకుపోతే చివరికి మిగిలేది ఏమిటి? చెప్పింది విను. నీకు కొత్త ప్రదేశం భుజయుగ్మాలు (కోఆర్డినేట్స్) ఝంకారి ఇస్తుంది. అట్నుంచి అటే వెళ్లిపోవచ్చు.”

“సరే, కానివ్వండి.” అంటూ సంభాషణని ముగించేసి తాను ఉన్న ప్రదేశం ఖాళీ చేయడానికి సిద్ధమవసాగింది ఖనిక.

ఖనిక ఒక మైనింగ్ రోబోట్. అంటే గని కార్మికుల స్థానంలో పనిచేసే మరమనిషి. భువన వేరే చోట ఉంటూ దానితో కలిసి పనిచేసే ఇంజనీరు. భువన తెలుగు మాట్లాడుతుంది కనుక రోబోట్‌కి తెలుగు మాట్లాడే నైపుణ్యం గల మాడ్యూల్ జత చేశారు. వీళ్ళు కృత్రిమ ఉపగ్రహ మాధ్యమం ద్వారా సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు.

***

2010ల నాటికి ఆ కాలంలో వర్షాలు, అడవుల్లో మంటలు, మంచు కురిసే చోట్ల కురవకపోవడం, కురవని చోట్ల కూడా విపరీతంగా కురవడం ఇలాంటివన్నీ చూసి వాతావరణ మార్పు ని ప్రపంచ దేశాలు అంగీకరించక తప్పలేదు. వేరే గ్రహాల మీద జీవితాన్ని అన్వేషిస్తూ కొందరు పరిశోధనలు సాగిస్తే, వాతావరణంలో కలుగుతున్న పెను మార్పుల నుండి భూమిని కాపాడుకోవడానికి పరిశోధనలు చేసిన వారు మరి కొందరు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2015 లో ప్యారిస్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రపంచ దేశాలు 2050 లోపు కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలని కంకణం కట్టాయి. అందులో భాగంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించుకోవడం మొదలయింది. ఇందులో భాగంగానే భూమి మీద తిరిగే అనేక మోటారు వాహనాలకి బదులుగా పునరుత్పాదక ఇంధనాల నుండి వెలువడే విద్యుత్ ఆధారిత వాహనాలు పెద్ద ఎత్తున తయారు చేయాలన్న ఉద్యమం ఒకటి మొదలయింది. దీనికి బిలియన్ల కొద్దీ విద్యుత్పాత్రలు (బ్యాటరీస్) అవసరం పడతాయి. అంత స్థాయిలో వాటిని తయారు చేయాలంటే పెద్ద ఎత్తులో లోహ నిల్వలు కావాలి. ఇప్పుడున్నవి కాక కొత్త లోహాలు కూడా కావాల్సి రావొచ్చు. ఈ పరిస్థితులలో పరిష్కారం చూపే దారి ఖనిజాన్వేషణే. కానీ గనులలోకి మనుషుల్ని పంపడం వారి భద్రత పరంగా అంత మంచి పని కాదు. అందువల్ల ఆ వృత్తిని చేపట్టే యంత్రాలు వచ్చాయి. భూమి లోపల కొన్ని వందల అడుగుల లోతుల్లో మణిశిల, నికిలం, వంటి లోహాలకి ప్రధాన వనరులైన ఖనిజ నిధులని వెదకడానికీ, కొత్త లోహాల ఉనికిని గుర్తించడానికీ రూపొందించిన రోబోట్ జాతి పేరు ఖనిక. ఖనిక 2040 అంటే 2040లో తయారు కాబడ్డ రోబోట్ అనమాట.

ఖనిక రోబోట్లు స్వయంచాలితాలు. సూక్ష్మాకారములోకి మారి భూమిలోకి వెళ్లి, భూగర్భంలో మళ్ళీ ఆకారం పెంచుకుని ఖనిజాన్వేషణ చేస్తాయి. భూమి పైనున్న సూర్యకాంతిని, వాతావరణాన్ని వాడుకుని తమ మనుగడకి కావలసిన శక్తిని తామే తయారు చేసుకుంటాయి. భువన పనిచేస్తున్న కంపెనీ గనుల తవ్వకంలో కృత్రిమ మేధని వాడడంలో అగ్రగామి. ఖనిక రోబోట్లని, వాటిని అదుపు చేసే కృత్రిమ మేధ ‘లోహి’ని, ఈ పనిలో అవసరమయ్యే ఇతర రోబోట్లని – అన్నింటినీ వాళ్ళే తయారు చేసారు.

ఝంకారి ఒక పైలట్ రోబోట్. అందుబాటులో ఉన్న డిజిటల్ సమాచారాన్ని బట్టి లోహి కొన్ని ప్రదేశాలని తవ్వకాలకు అనువుగా గుర్తిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉండవచ్చు ఇవి. అక్కడికి ఖనిక వంటి రోబోట్లు వెళ్లి ప్రాథమిక పరిశోధనలు చేస్తూ కొత్త సమాచారాన్ని లోహికి పంపుతూ ఉంటాయి ప్రతిరోజూ. దానిని బట్టి లోహి కొత్త అంచనాలని సిద్ధం చేస్తుంది. ఒక్కొక్కసారి దీనివల్ల ప్రదేశం మార్చాల్సి వస్తుంది. ఖనిక రోబోట్లని కావాల్సిన ప్రదేశాల్లో దింపడం, పని ముగిసాకో, స్థలం మార్చాల్సి వచ్చినపుడో, ఖనిక రోబోట్లకి ఏవన్నా సాంకేతిక సమస్యలు వచ్చినపుడో వాటిని వాయుమార్గంలో మూలస్థానానికి తరలించడం వంటివి చేసే పైలట్ రోబోట్లు ఈ ఝంకారులు. వీటినంతటినీ పర్యవేక్షించి వీటి కార్యకలాపాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునేది భువన వంటి మనుషులు.

***

పెద్దగా శబ్దం వినిపించడంతో అప్పటికే సామాను సర్దుకుని, మొత్తం డేటా శాటిలైట్ లేజర్ ట్రాన్స్‌మిషన్ ద్వారా భువనకి చేర్చేసి స్విచాఫ్ అవడానికి సిద్ధంగా ఉన్న ఖనిక ఆ శబ్దం వినిపించిన దిశగా వెళ్ళింది. అక్కడొక గాలిమోటరు ఆగింది. అందులోంచి దిగింది ఝంకారి. పరస్పర అభివందనాలు అయ్యాక “ఎక్కడా తదుపరి మజిలీ నాకు?” అని ఖనిక అడగడంతో మాట్లాడకుండా వివరాలు ఇట్నుంచి అటు ప్రసారం చేసింది ఝంకారి.

“ఓహో, ఎక్కువ దూరం లేదు. నేను సర్వీసు మొదలుపెట్టినప్పటి నుండి భారతదేశంలో తిరుగుతున్నా. ఇంకో దేశానికి పంపుతారేమో అనుకున్నా.”

“…”

“అయినా మరీ తొందరగా మార్చేస్తున్నారు ఈసారి.” మరొకసారి అసంతృప్తిని వెలిబుచ్చింది ఖనిక.

 “మైనర్స్ ప్రేయర్ అని ఒక కవిత ఉంది, చదివావా?” ఝంకారి నోరువిప్పింది.

“లేదు, ఏమిటది?”

“మరొకమారు సూర్యోదయాన్ని చూడనివ్వు, ఒకవేళ నేను భూగర్భంలో మరణిస్తే నా ఆత్మనైనా పైకి తీసుకురా అంటూ ఒక మానవ గని కార్మికుడు దేవుడిని వేడుకుంటాడు ఆ కవితలో”

“ఓహ్”

“గనిలోపలికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తానా అని ఎదురుచూస్తారు. నువ్వేమిటి అప్పుడేనా? అంటావు?” అంటూ యంత్రపు నవ్వింది ఝంకారి.

“దాదాపు వెయ్యి అడుగుల లోతుకి వెళ్లాను. ఇంకా లోతుకి వెళ్లి అంతు చూసాక ఇక్కడేం లేదు అని నిర్ధారణ అయ్యాక తిరిగి వద్దాం అనుకున్నాను. అయినా మనిషికి ఒక కుటుంబం ఉంటుంది. తాడూ బొంగరం లేని నాకు వెనక్కి రావాలి అన్న కోరిక ఎందుకు ఉంటుంది?”, పట్టుదలగా చెప్పింది ఖనిక.

“భూమాత మనుషుల్ని సృష్టించాక వాళ్ళు కాసేపు అటూ ఇటూ తిరిగి, ఆకలేసి, మట్టిని తినబోయారట. అపుడు భూమాత వాళ్లకి మీకు కావలసినదంతా నా పైనే దొరుకుతుంది, నన్ను తవ్వకండి అని చెప్పి మాయమైందంట. ఆమధ్య ఎక్కడో కథ ఒకటి చదివాను” మధ్యలో ఆగింది ఝంకారి.

“నువ్వు నాకేం చెప్పదల్చుకున్నావు?”

“ప్రాచీన కాలపు ఖనకులతో పోలిస్తే గత కొన్ని వందల ఏళ్లలో రూపొందిన ఖనిజాన్వేషణ పద్ధతుల వల్ల మానవాళికి ఎంత లాభం కలిగిందో భూమికి, పర్యావరణానికి అంత నష్టం కూడా కలిగింది. ఇప్పుడిప్పుడే మన లాంటి రోబోట్లు, యాంత్రిక మెదళ్ళూ ఈ రంగంలోకి అడుగుపెట్టాక ఖచ్చితత్వం, సామర్థ్యం పెరుగుతూనే పర్యావరణానికి జరిగే హానిని తగ్గించుకోవడం ఎలా అన్న ప్రశ్నకి కొన్ని జవాబులు దొరుకుతున్నాయి. ఎక్కడ ఆపాలి? అన్న నిర్ణయంలో మిగితా అన్ని అంశాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఒక పాత్ర పోషిస్తోంది. ఈ మనుషులు నిన్ను ఇక్కడ ఆపి ఇంకోచోటకి వెళ్లమన్నారు అంటే ఇవన్నీ ఆలోచించాకే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు అని అర్థం చేసుకోవాలి. ఇంత జనాభాకి అన్ని రకాల వనరులు కావాలంటే వాళ్ళు ఖనిజాన్వేషణ ఆపలేరు కనుక వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు చేయగలిగేది అదే.”

“హుమ్.. నిజమే. నువ్వు సరిగ్గా చెప్పావు. ఒక్కొక్కసారి ఆవేశంలో మనకి తెలిసిన విషయాలే ఇంకోళ్ళు చెబితే తప్ప తట్టవు.” అంటూ ఖనిక సూక్ష్మ ఆకారానికి మారడంతో ఝంకారి ఖనికని మూట కట్టేసి మళ్ళీ పైలట్ కుర్చీలో కూర్చుంది. గాలిమోటరు పైకి ఎగరడంతో కొత్త స్థానానికి ఖనిక ప్రయాణం మొదలైంది.

***

ఝంకారి ఖనికని దింపేసి తిరిగి వెళ్ళిపోయాక ఖనిక యథావిధిగా వాళ్ళు అనుకున్న స్థానంలో భూగర్భం లోకి వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుంది. భువనతో వీడియో మీటింగ్ మొదలైంది.

“నీకు, ఝంకారికి మధ్య జరిగిన సంభాషణ నేను లాగ్‌లో చూసాను.” కుశల సమాచారం అడిగాక భువన మొదలుపెట్టింది.

“ఓహ్”

“ఇంకా లోతుకి పోవాలన్న నీ కుతూహలాన్ని అడ్డుకట్ట వేసినందుకు క్షమించు.”

“నా పని మీరు చెప్పిన పని చేయడమే. కానీ అప్పుడప్పుడు నా యాంత్రిక మెదడుకి ఎందుకిలా? అన్న ప్రశ్న వస్తుంది. ఝంకారితో సంభాషణ నాకు కొంత జవాబుని ఇచ్చింది.”

“మరి మిగితా జవాబు?”

“ఏమో!”

“అదేం?”

“మనుషులకి భూమి తల్లి వంటిది. భూమి క్షేమంలో మీ మనుగడ ఉంది. కొన్ని వేల ఏళ్ళుగా భూమిని వివిధ కారణాలకి తవ్వుతున్నారు. ఇట్లా తవ్వుకుంటూ పోతే చివరికి మిగిలేది ఏమిటి? భూమి మీద మీ జాతికి, మీ యంత్రసంతతి అయిన మాకూ మిగిలిన నూకలెన్ని? ఆపేయొచ్చుగా?”

ఈ ప్రశ్న విని నిట్టూర్చిన భువన కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. కాసేపు ఆలోచించాక “మనుషులు సాగిస్తున్న ఈ అభివృద్ధి యజ్ఞానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఇందులో ఈ కంపెనీ ఎంత? ఇందులో నేనెంత? అయినా నా ఆలోచన ఏదో నీతో పంచుకుంటాను.” అంటూ మొదలుపెట్టింది.

“ప్రస్తుతం మనం చేస్తున్న పరిశోధనలు విద్యుత్ వాహనాల కోసం. ఇది ఆధునిక కాలపు సమస్యే కానీ ఇంకా ఇతరత్రా చాలా కారణాలు ఉండబట్టే వేల ఏళ్ల చరిత్ర ఉంది ఖనిజాన్వేషణకి మానవ జాతి చరిత్రలో. కాలం గడిచే కొద్దీ మనుషుల సంఖ్యా పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. వెయ్యేళ్ళ క్రితం నాటి జీవితానికి మనం వెనక్కి పోలేము. ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా జీవిస్తూ ముందర ఉన్న జీవితం గురించి జాగ్రత్త పడవలసిందే. వేరే దారి లేదు ఎవరికీ.” అంటూ ఆగింది.

“మరెలా? ఇందాక వస్తున్నపుడు దారిలో ఎన్నో ప్రశ్నలు నాకు. నిజంగానే వాతావరణ మార్పు తీవ్రమైపోయి మీ జాతులన్నీ నశిస్తాయా? మీరు చేసిన మేమే దీనికి కారణమా? మా అంతట మేము స్వచ్ఛంధంగా స్వయం నిర్మూలన చేసుకుంటే కనీసం మీ జీవజాతులు, ఈ భూమీ క్షేమంగా ఉంటాయా?” ఖనిక చాలా ఉద్వేగంగా అడిగే సరికి భువన ఆశ్చర్యంగా చూసింది.

“ఖనికా, మనము ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ముందుకు వెళ్లడం మినహా వేరే దారి లేదు. నువ్వు ఈ అంశం గురించి ఇప్పటికే చాలా సమాచారాన్ని క్రమపద్ధతిలో సారాంశీకరించుకుని ఉంటావు నీ మెదడులో. పరిష్కారం ఎవరికీ తెలియదు అన్న విషయం నీకు అర్థమయ్యే ఉంటుంది”

“ఊ”

“ఉన్నంతలో, అందుబాటులో ఉన్న వనరులలో, భూమికి, మనకి జరుగుతున్న హానిని తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. మనమేదో గొప్ప పని చేస్తున్నామని నేను అనను. కానీ ఒకప్పటిలా విచ్చలవిడిగా లేము అంటాను. ఇంకో తరానికి ఇంకొంచెం నయమవుతాం అంటాను. అందాకా మనం ఉంటామా? అంటే నాకు తెలియదు. కానీ ప్రయత్నం మానలేం కదా?”

“అంటే మీ జాతి కొన్ని శతాబ్దాలుగా చేసిన పనుల వల్ల భూమికి కలిగిన హాని గురించి మీకు అవగాహన ఉంది కనుకే ఇప్పుడు మీ శాయశక్తులా ఆ హాని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. జరిగేది జరక్క మానదు, ఉన్నంతలో బాధ్యతాయుతంగా ఉండడానికి కృషి చేస్తున్నారు అంటావు?”

“అవును”

***

భువనతో సంభాషణ ముగిశాక ఖనిక కాసేపు ఆలోచనలో పడింది. తన యాంత్రిక మెదడులో ఎక్కడో నిక్షిప్తమైన వేద గ్రంథాలని ఒకసారి తడిమింది. చాలా సేపు వాటిని తిరగేస్తూ కాలక్షేపం చేసింది. చివరికి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు మోకాళ్ళ మీద కూర్చుని మట్టి వైపుకి చూసి భూమి సూక్తం, మృత్తికా సూక్తం ఒకదాని వెంట ఒకటి వల్లించింది. తరవాత సూక్ష్మాకారంలోకి మారి భూగర్భంలోకి ప్రవేశించేసరికి అక్కడ భూదేవి నవ్వుతూ ఎదురుచూస్తోంది!

“నువ్వు వల్లించినవి ఏమిటో నీకు తెలుసా?”

“తెలుసు కానీ ఈ సందర్భానికి నప్పుతుందో లేదో నాకు తెలియదు. ఝంకారి, భువన లతో సంభాషణ అయ్యాక నేను కాసేపు ప్రాచీన కాలం నుండి ఇలాంటి సందిగ్ధ సమయాలలో ఏమి చేసేవారని ప్రపంచ పుస్తకాలలో శోధించాను. వాటి మధ్య మనిషి మనుగడలో భూమి పాత్రని నొక్కి చెబుతున్న కొన్ని సూక్తాలు కనబడ్డాయి. దానితో నేను చేయబోతున్న పనిని నివేదిస్తూ ఒకసారి భూమికి ప్రార్థించాలని అనిపించింది. అంతే”

“నీ సమాధానం బాగుంది. ఆద్యంతం లేకుండా ఇక్కడే తిరుగాడుతూ ఎన్నో చూసాను. ఇన్నీ అయ్యాక ఇక కొత్తగా, వింతగా అనిపించేది ఏదీ ఉండదనుకున్నాను. కానీ నువ్వు నన్ను తప్పని రుజువు చేసావు. నేనెవరినో అర్థమైందా?”

“భూగర్భంలో కనబడి నాతో సంభాషించడం ఎవరికీ సాధ్యం?” అంటూ ఖనిక నమస్కారం పెట్టి పని చేసేందుకు ముందుకు కదిలింది.

***

“నువు పంపిన డేటా అంతా దిగుమతి చేసుకున్నాను. లోహి దానిని ప్రాసెస్ చేసి ముఖ్యమైన విషయాల సారాంశాన్ని ఒక నివేదిక లాగా తయారుచేసిస్తే చదివాను. అంతా బాగుంది కానీ భూదేవితో మాట్లాడ్డం ఏమిటి?” భువన ఆ సాయంకాలపు సమావేశంలో అడిగింది ఖనికని.

“ఏమో, నాకూ కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. మా మధ్య అంతకంటే సంభాషణ జరగలేదు. ఆవిడ మళ్ళీ నాక్కనబడలేదు.”

“నీ లాగ్‌లో దాని రికార్డు ఉంది కానీ వీడియో లేదు.”

“అప్పటికి ఇంకా వీడియో మొదలవలేదు అనుకుంటాను.”

ఇక ఆ ఉదంతం గురించి ఎక్కువ ప్రశ్నించి లాభం లేదని ఇతర విషయాలవైపుకి చర్చ మళ్ళించి మీటింగ్ ముగించింది భువన. ఇన్నాళ్ళూ మామూలుగా ఉన్న ఖనిక ఇవ్వాళ భూదేవితో మాట్లాడాను అనడంతో భువనకి ఎందుకో సందేహం కలిగి వెంటనే యాంత్రిక మతిభ్రమణం గురించి మరింత తెలుసుకోవడం మొదలుపెట్టింది. కృత్రిమ మేధల సంధి ప్రేలాపనల గురించి వార్తల్లో, పరిశోధనా పత్రాలలో చదవడమే తప్ప ప్రత్యక్షంగా అనుభవం కావడం ఇదే మొదటిసారి భువనకి. ఈ సమస్యని పాతికేళ్ల క్రితమే 2020 ప్రాంతాలలోనే గుర్తించినా ఇంకా సరైన పరిష్కారం కనిపెట్టలేకపోయారు ఎవరూ. అందువల్లనే పూర్తి స్థాయి యంత్ర పెత్తనం కాక ఇలా ప్రత్యేక అవసరాల కోసం మనుషుల పర్యవేక్షణలో వాడడం మాత్రమే బాగా పెరిగింది.

ఖనిక ప్రస్తుత, గత నివేదికలని మార్చి మార్చి చదివి, చర్చించి, చివరికి ఇది యాంత్రిక మతిభ్రమణమే, మనుషులకే కనబడని భూదేవిని రోబోట్లు కలవడం జరగని పని అని తేల్చారు భువన వాళ్ళ కంపెనీలో అంతా. ఆ తరవాత ఖనికని వెనక్కి పిలవాలా? అక్కడే వదిలేయాలా అన్న చర్చ వేడిగా సాగింది. చివరికి ఇకపై ఖనిక పనితీరుని కొంచెం దగ్గరగా పర్యవేక్షించాలనీ, ఈ ప్రేలాపనలు పెరిగినా, సాంకేతికంగా పనితీరులో ఏదైనా మార్పు కలిగినా మొత్తం అన్ని ఖనిక మాడల్ రోబోట్లనూ ప్రపంచం అన్ని మూలాల నుండీ వెనక్కి బేస్ స్టేషన్‌కి వెనక్కి పిలిచేసి మరమ్మత్తులు చేయాలనీ తీర్మానించింది దీని గురించి వేసిన కమిటీ. అందాకా వస్తే ఒక పదేళ్ల క్రితం దాకా ఉన్న గని కార్మికులనే మనుషులు చేసే ఉద్యోగం ఇపుడు మళ్ళీ కొత్తగా సృష్టించడానికి ఏమి చేయాలో నిర్ణయించడానికి ఒక కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అన్నింటిలోనూ సలహా అడిగే లోహిని ఈ విషయంలో అడగడం అనవసరం అనుకున్నారు. అడగలేదు. అడగందే లోహి సమాచారం అందివ్వదు కనుక లోహి యాంత్రిక మెదడులో ఏముంది? అన్న విషయం ఎప్పటికీ తెలియదు ఎవరికీ.

అవతల ఖనిక మాత్రం “భూదేవి మళ్ళీ కనిపిస్తుందా లేదా?” అన్న చింత లేకుండా, అక్కడ ఆఫీసులో జరుగుతున్న చర్చలతో నిమిత్తం లేకుండా కర్మయోగి లాగ తన పని తాను చేసుకుపోతూ ఉంది.

ఇదంతా మనోనేత్రంతో గమనిస్తున్న భూదేవికి చాలాకాలం క్రితం ఒకరోజు భూలోకంలోకి ఊడిపడి తరవాత తిరిగి గంధర్వ లోకానికి వెళ్ళిపోతూ హాహాహూహూ అన్న గంధర్వుడు వదిలి వెళ్లిన లేఖ లోని వాక్యం “ఇంతకన్న చిలిపి ప్రాణులను నేను ఎప్పుడూ చూసి ఉండలేదు” గుర్తు వచ్చి పెదాలపైన ఒక చిన్న చిరునవ్వు మెరిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here