[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]
16. వైధవ్యం – వివక్ష
సీ॥
పూర్వసువాసినుల్ ముందు నిల్వగ చాల
దుశ్శకునమంచును దూరుజనము
కనగ వైధవ్యంబు కఠినాతి కఠినమౌ
దోషమై, హేయంపు దుష్టనీతి
విధవలైనటు వారి బాధ వర్ణన చేయ
కలము శక్తము గాదు, కలుగువెతయు
శుభకార్యములలోన సుంతైన దయలేక
వారిని యవమాన బాధితులుగ
తే.గీ.॥
చేసియానందమును బొందు చెడుగుణంబు
భారతీయుల సంస్కృతి మచ్చగాదె
జనని, సోదరి, వదినెల సంభవించు
పాడు వైధవ్యముకు వారు బాధ్యులెట్లు?
కం॥
“స్త్రీలకు స్త్రీలే శత్రువు
లిల” యనుమాటలను మహిళలే, నిజమవగా
విలపించెడు ముత్తైదువ
తిలకము గాజులును దీయ తేకువజూపున్
కం॥
పతిమరణించిన తదుపరి
సతిజూడగ తిథులు వార సకలములన్నిన్
మతి దలచుచు తడయుదురటు
అతి కఠినము శాస్త్రమకట! అది సబబగునే?
తే.గీ.॥
ఆమె యెదురైన నదియెంతొ హాని గూర్చు
ననెడు మౌఢ్యంబు తలకెక్కి ఆమెనటుల
పరిహరింపగ బాడియే పాడునియమ
ములను బోద్రోవగా వలయు సలిలములను
తే.గీ.॥
విధిగ బూజింపవలయును విధవయైన
స్త్రీని తగ గారవింపని తీరుమారి
ఆమె మన తల్లి, మనకొక్క యనెడు భావ
ముద్భవించిన, లోకంబు ముదమునొందు
17. అపర కర్మలు – తద్దినాలు – వ్యాపారీకరణ
తే.గీ.॥
మరణము తదుపరి జీవికి
పరలోకము దక్కవలయు ప్రారబ్ధములన్
మరి నశియింపగ కర్మలు
తరియింపగ నాత్మ, జేయు తనయులు బంధుల్
తే.గీ.॥
పెళ్లికంటెను చావుకే పెక్కు ఖర్చు
ల శుభమంచును రెట్టింపులడుగు ద్విజుడు
దశదినంబులు కర్మలు తాము చేసి
ధనము వెచ్చించి క్రుంగియు ధన్యులగుచు
కం॥
అస్తులు కలుపగ గంగను
మస్తుగ ఖర్చగును; కాశి పయనము కొరకున్
విస్తార క్రతువు పేరిట
నస్తోకపు నష్టమదియు నటు నొనగూడున్
కం॥
వైకుంఠ సమారాధన
సకలమునౌ బంధుజనము సాదరమొప్పన్
పాకములవి వివిధములై
తాకును గగనాన్ని ఖర్చు తప్పని తంతే!
కం॥
తరువాత మాసికంబులు
మరి తద్దినములను బెట్టవలయును, ఏటన్
కూరలు, బూరెలు, వ్యంజన
భారముతో భోక్తలెంతొమదితనియంగన్
ఉ॥
క్రొత్తగ తద్దినంబులను కోరిన కర్మల జేసియివ్వగన్
యిత్తరివచ్చె పద్ధతది, యింపగు మార్గమునయ్యె, సంస్థలో
విత్తముగట్ట సర్వమును వీరె యొనర్చుదురట్లు, డబ్బుకై
ఉత్తమమైన మార్గమిది యోపిక లేనటువంటి వారికిన్
సీ॥
వ్యాపార దృక్పథంబాయె తద్దినకాండ
మొక్కుబడిగ మారె నక్కజముగ
శ్రద్ధతో చేయునది శ్రాద్ధంబు, కర్మలు
ఈవెంటుగా మలిచిరిట్టితరిని
ప్యాకేజలును జూపి ప్రాచుర్యమును బొంది
కాంట్రాక్టు తంతులన్ కార్యములను
తాము నిర్వర్తింప దనియునే ఆత్మలు
పరమును జేరక వరలుగాదె
తే.గీ.॥
ఇంతయేటికి పదిమందికింత బువ్వ
పేదవారికి బెట్టిన కాదె క్రతువు
‘భోక్త’ లనగను యాకలి బొందువారు
వారి కడుపు నింప కూరు తృప్తి
కం॥
నీ ‘కర్మ’కు భగవంతుడు
సాకగు సంబంధిగాడు, సరియగు ఫలితం
బొక ప్రతి కర్మకు నుండును
ప్రకటించెను ‘గాంధీ’ యట్లు ప్రారబ్ధములన్
కం॥
తాహతులేకున్నను, జన
వాహిని యేమనునొయన్న భావన వీడన్
నీ హితమగు, కర్తవ్యము
సహితము నీకెపుడు శాంతి సౌఖ్యములిలలో
18. కార్పొరేట్ విద్య – ప్రభుత్వ విద్య
తే.గీ.॥
విద్య యొసగును వినయమున్ వీడజేయు
తిష్ఠవేసిన యాజ్ఞాన తిమిరములను
నిన్ను నీ చుట్టు నున్నట్టి నిఖిలజనుల
మంచి యవగాహనను పెంచి మించు ధనము
కం॥
చోరులు చేరని విత్తము
నేరిపి ఇంకొకరి కివ్వ నెంతయు బెరుగున్
కోరరు భాగము యనుజులు
దొరలును దూరముగనుంద్రు తుదివరకపుడున్
చం॥
తన ప్రజకెల్ల విద్యను విధానమనంగ, ప్రభుత్వమే సదా
నెనరును గూర్చు బాధ్యతను నిష్ఠగ దీర్పగ రాజ్యగ్రంథమున్
యనువుగ వ్రాసిరట్టి తరి అట్టిది బాసిప్రవేటు రంగమున్
గొనకొని ప్రోత్సహించి మన కూనల నిక్కటుపాలు జేతురే!
కం॥
చదువును వైద్యమును చితం
బది, మరిసరకారు, విధిగ పాటింపవలెన్
అది హక్కు ప్రజలకెన్నడు
విదితము సంక్షేమ స్ఫూర్తి విస్తారగతిన్
శా॥
కానీ పుట్టగొడుంగులట్లు వెలిసెన్ కారుణ్యరాహిత్యులై
పెనుస్వార్థంబది హద్దుగాగ ప్రజలన పీడించి ఫీజుల్, మహా
ఘనమౌ హాస్టలు ఖర్చులంచు, జలగల్ కార్పించు రక్తాశ్రువుల్
తనదైనట్టి నియంత్రణన్ విడి, ప్రభుత్వంబే వారి కాపాడునే!
సీ॥
గ్లోబల్ స్కూలని గోరంత కొండంత
జేసి ఫీజుల దండు; నాసిరకము
అంతర్జాతీయమౌ అపురూప ఘనమని
చుట్టున్న పిల్లల పట్టుచుండు
కాన్సెప్టు స్కూలని కర్ణభేరిని చీల్చు
వానికాన్సెప్టది బడయు ధనము
ఐ.ఐ.టి, సీటది అత్యంత సులువని
ఇంటరులోననే ఎసరుపెట్టు
తే.గీ.॥
లక్షలాదిగ ఫీజుల నక్షయముగ
పాలబుగ్గల పిల్లల వద్ద గుంజి
జాతి నిర్వీర్యమును చేయు రీతి కనగ
రోత బుట్టెడు, ప్రయివేటు మేతచూసి
కం॥
తలిదండ్రుల దోషంబును
కలదిట, మతిలేకవారు కడువెర్రిగ, తా
మలుసుగ మారుచు చేర్తురు
విలువల నశియింపు విద్య, వీడుచు తెలివిన్
సీ॥
సర్కారు బడులలో చక్కని వసతులు
కలిగింపజాలిన కలదు మార్పు
ఆడపిల్లలకును నాదరంబున గట్ట
మరుగుదొడ్లను వారు మరలగలరె?
ఉపకార వేతనాల్ ఊరించు జీతాలు
గురుశిష్యులకు గూర్పకూడుగరిమ
ఆట స్థలంబులు యనువైన భవనాలు
సమకూర్ప తలిదండ్రి సంతసింత్రు
తే.గీ.॥
ప్రభుత తలచినది యెల్ల ప్రాప్తమగును
దొంగబడులవి తముతామె భంగపడును
సకలవిద్యార్థి సంక్షేమ శాలియైన
మనదు దొరవారు కంకణబద్ధులైన
(సశేషం)