‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-6

1
5

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

VIII. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో ప్రక్రియా పరమైన నవ్యత – మొదటి భాగం

“ప్రక్రియా బాహుళ్యము నవ్య కవితకు ప్రత్యేక లక్షణము” అన్నారు ఆచార్య సి. నారాయణరెడ్డిగారు.

20వ శతాబ్ది నవ్య సాహిత్యంలో విరాజిల్లిన ప్రక్రియలలో ప్రముఖంగా పేర్కొనదగిన వాటిలో ఇవి ముఖ్యమైనవి.

  1. రూపపరంగా – నాటకం, ఖండ కావ్యం, గేయ కావ్యం, వచన కవిత, కథానిక, నవల, వ్యాసం మొదలయినవి.
  2. వస్తు పరంగా – హాస్య వ్యంగ్య కావ్యాలు, స్మృతి కావ్యం, యాత్రా చరిత్ర, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర మొదలయినవి.

వీటిలో ఒక్క ‘వచన కవితా ప్రక్రియ’ తప్ప మిగితా అన్ని కూడా 19వ శతాబ్దిలోనే అంకురించాయన్నది గమనార్హం. ముఖ్యంగా కవిత్వానికి సంబంధించినంత వరకు ‘పద్య నాటకం’, ‘ఖండ కావ్యం’, ‘గేయ కావ్యం’, వంటి ప్రక్రియలు మొట్ట మొదటిసారిగా 19వ శతాబ్దిలోనే వెలువడ్డాయి. కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన ‘అభాగ్యోపాఖ్యానం’ అన్న తొలి వ్యంగ్య కావ్యం కూడా 19వ శతాబ్దిలోనే వెలువడింది. తొలి తరం స్మృతి కావ్యాలు కూడా అదే శతాబ్దిలో రూపు దిద్దుకున్నాయి. 20వ శతాబ్దిలో గద్య రూపంలో విస్తృతంగా వెలువడ్డ యాత్రా చరిత్రలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రల వంటి ప్రక్రియలకు 19వ శతాబ్దిలో పద్య రూపంలో బీజాలు పడ్డాయన్నది గమనించదగ్గ విషయం. ఈ ప్రక్రియలన్నీ 19వ శతాబ్దిలోనే అంకురించడానికి పాశ్చాత్య సాహిత్య ప్రభావం – ముఖ్యంగా ఆంగ్ల సాహిత్య ప్రభావం ఎంతైనా ఉందని అంగీకరించక తప్పదు. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో అవతరించిన ఈ నూతన ప్రక్రియా విశేషాలను గురించి ఇప్పుడు సవిస్తరంగా పరిశీలిద్దాం.

పద్య నాటకం :

“కావ్యేషు నాటకం రమ్యం” అన్నారు అలంకారికులు. సంస్కృత వాఙ్మయంలో నాటక ప్రక్రియ బహుళ ప్రసిద్ధం. నన్నయ భట్టారకుని ఆంధ్ర మహా భారత సభాపర్వంలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో కొంత నాటకీయ శైలి గోచరమౌతుందని మన పండితులు భావిస్తుంటారు. తిక్కన తాను రచించిన పదునైదు పర్వాలలో సందర్భానుసారంగా నాటకీయ శైలిని ప్రవేశపెట్టి రక్తి కట్టించిన విషయం రసిక వర్యులందరికీ విదితమే. 15వ శతాబ్దిలో కందుకూరి రుద్రకవి ‘సుగ్రీవ విజయం’ పేరిట దేశిరూపకమైన ‘యక్షగాన’ ప్రక్రియను ప్రారంభించాడు. 17వ శతాబ్దిలో ఎలకూచి బాల సరస్వతి ‘రంగ కౌముది’ పేరిట ఒక నాటకాన్ని రచించినట్లు తెలుస్తున్నది. అది ఇప్పుడు అనుపలబ్ధం. అంతకు మించి వివరాలు ఏవీ తెలియడం లేదు. అది నాటక ప్రక్రియా రూపంలో ఉందా – అన్నది కూడా అనుమానమే. బహుశః అది యక్షగాన ప్రక్రియ పద్ధతిలోనే ఉండి ఉండాలి. ఎందుకంటే ఆ తరువాత 17వ శతాబ్దిలో గాని, 18వ శతాబ్దిలోగాని ఒక్క నాటకం కూడా వెలువడ లేదు. కాబట్టి 19వ శతాబ్దికి పూర్వం ఒక ప్రక్రియగా తెలుగులో నాటకం లేదనే చెప్పుకోవాలి.

19వ శతాబ్దిలో కోరాడ రామచంద్ర శాస్త్రి రచించిన ‘మంజరీ మధుకరీయం’ తో తెలుగులో నాటక ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. క్రీ.శ. 1860లో సంస్కృత పద్ధతిలో రచించబడిన ఈ నాటకం తెలుగులో వెలువడిన తొలి నాటకం. ఇందులో అక్కడక్కడ పద్యాలను పొదిగినా, ఇది ప్రధానంగా వచన సంభాషణల నాటకమే. అందువల్ల దీనిని కవిత్వంలో భాగంగా పరిగణించలేము. ఈ పరిశోధన పరిధి కేవలం కవిత్వం వరకే పరిమితం కాబట్టి దాని ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం.

అయితే పూర్తి పద్యాలలో రూపొందించబడిన తొలి పద్య నాటకాన్ని రచించిన కవి వావిలాల వాసుదేవ శాస్త్రి. క్రీ.శ. 1874లో ఈయన రచించిన ‘సీజరు చరిత్రము’, ఇంగ్లీషులో షేక్స్పియరు మహాకవి రచించిన ‘జూలియస్ సీజరు’ నాటకానికి తెలుగు అనువాదం. షేక్స్పియరు ఆంగ్ల నాటకాలలోని పోయెటిక్ వర్స్ తెలుగు కవులకు పద్య నాటకాలను వ్రాయాలన్న ప్రేరణ ఇచ్చి ఉంటుందని చెప్పుకోవాలి.

“ఇంగ్లీషు ద్వారా పాశ్చాత్య దేశములలోని సాహితీ ప్రక్రియలతో మన దేశపు పండితులకు పరిచయము కలిగినది. ఆ పరిచయముతో వారు తమ దేశీయులకు ఆ ప్రక్రియలను అదే రూపమున అందించవలెనను ఉత్సాహముతో రచనా వ్యాసంగమును సాగించిరి. తత్ఫలితముగా తెలుగులో సంపూర్ణ పద్య నాటకాలు అవతరించుటకు అవకాశము కల్గినది. వావిలాల వాసుదేవశాస్త్రిగారి ‘సీజరు చరిత్రము’ (షేక్స్పియరు ‘జూలియస్ సీజరు’ కు అనువాదము) మొట్ట మొదటి పద్య నాటకము” అని వివరించారు ప్రముఖ కవి, విమర్శకులు డా. తిరుమల శ్రీనివాసచార్య.

క్రీ.శ. 1876లో ప్రథమ ముద్రణ పొందిన ఈ పద్య నాటకం గురించి తెలుగు అకాడమి వారు ప్రచురించిన తెలుగు సాహిత్య కోశం (ఆధునిక సాహిత్యం) ద్వారా ఈ క్రింది వివరాలు తెలుస్తున్నాయి.

“తెలుగులోకి అనూదితమైన ఇంగ్లీషు నాటకాలలో ఇదే మొదటిది. తెలుగులో తొలి విషాదాంత నాటకం కూడా ఇదే. జూలియస్ సీజర్ (క్రీ.పూ. 100-44) గొప్ప రాజకీయ వేత్త, మంచి వక్త. చరిత్రలో ప్రసిద్ధి కెక్కిన మహావీరుడు. ఇతడు రోమను సేనాపతిగా రోమును (క్రీ.పూ. 49-44) ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తూ ఉండగా హత్య చేశారు. ఆయన చరిత్రను తెలిపే రచన ఇది. అనువాదం సరళంగా ఉంది. మూలంలోని అంకాలు రంగాలు యథాతథంగా ఉంచారు. పాత్రల పేర్లు మార్చలేదు. మూలంలోని పద్యాలకు చేరువగా ఉండే విధంగా రచనలో తేటగీతి వాడారు. కొన్ని హిందీ సంప్రదాయాలను కథానుగుణంగా ప్రవేశపెట్టారు. రచనలో వాడుక భాషా పదాలు, అన్య భాషా పదాలు కూడా వాడారు. వచనం వాడలేదు. ఈ అనువాదం రెండు నెలల్లో పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. పీఠిక ఇంగ్లీషులో కూడా ఉంది.”

సంస్కృత భాషా సాహిత్యంలోని కావ్యాలను మాత్రమే అనువదించడం ఎరిగిన ఆంధ్ర కవుల మధ్య, ఒక ఆంగ్ల సాహిత్య గ్రంథాన్ని, అందునా ఒక నాటకాన్ని అదే ప్రక్రియగా తెలుగులోనికి అనువదించాలన్న తలంపు కలగడం ఆనాడు నిజంగా ఒక సాహసమే అని చెప్పాలి. ఇందుకు దోహదమయిన కారణాన్ని కవి తన గ్రంథ పీఠికలో ఇలా వివరించారు – “ఆదిని తొలి తెలుంగు బొత్తంబుల వలె దీని నానా విధ వృత్తములతో బ్రబంధాకృతిని రచియింపం దలంపు గలిగె. కాని యిప్పటి వారికి నాటక రీతియందే యభిరుచి యెక్కువ యని కొందరు నా స్నేహితులు సలహాలు ఇచ్చిన కతన దొంటి యభిప్రాయము మాయించి, నాటక వైఖరిని మొదటి నుండి తుది వరకుం దేట గీతినే వ్రాయుట తగునని యెంచి యాతీరున వ్రాసినాడ.” ఆ విధంగా నవ్య మార్గంలో వెలువడ్డ ఈ తొలి తెలుగు పద్య నాటకంలో పాత్రల పేర్లను మార్చకుండా యథాతథంగా ఉంచడం వల్ల కవి చరిత్ర పట్ల తన నిజాయితీని చాటుకొన్నారని భావించాలి. ఇక కథానుగుణంగా తెలుగు సంప్రదాయాలను, నుడికారాలను ప్రయోగించడం శాస్త్రిగారి సంప్రదాయ దృష్టిగా కన్న, ఒక ఆంగ్ల కథలో వాటిని మేళవించడం ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయాలను రంగరించిన ఒక నవ్య మార్గంగా అంగీకరించాలి.

ఇక ఈ నాటక రచనా పద్ధతిని పరిశీలిద్దాం – ఆంగ్ల నాటకంలోని పాత్రల పేర్లు యథాతథంగా ఉంచిన కవి సంబోధనలలో తెలుగు తనాన్ని ప్రవేశ పెట్టడం ఒక నవ్యత. ఆంగ్లంలో షేక్స్పియర్ మహాకవి –

“Marcus Brutus:

I Kiss thy hand, but not in flattery, Caesar” అని తృతీయాంకం ప్రథమ రంగంలో బ్రూటస్‍తో అనిపించిన సంభాషణను వాసుదేవ శాస్త్రి తెలుగులో అనువదిస్తూ,

“బ్రూట – సీజరా! పెట్టుమీ నీదు చేతి ముద్దు

కాని, యిద్ది ముఖ ప్రీతి గాదు సుమ్మీ!” అని వ్రాసారు. ఇలా సీజర్‌ను ‘సీజరా!’ అని, కాసియస్‌ని ‘కాస్యసా!’ అని, జూలియస్‌ని ‘జూలియసుడ!’ అని, బ్రూటస్‌ను ‘బ్రూటసుండ!’ అని తెలుగు విభక్తులతో సంబోధనగా పిలిచినట్లు వ్రాయడం కవి చమత్కృతికి నిదర్శనం. “Great Caesar!” అన్న సంబోధనను “సీజరేంద్ర” అని, “O mighty Caesar!” అన్న సంబోధనను “సర్వ శక్తిమత్ సీజరేంద్ర!” అని కవి చేసిన అనువాదం పాఠకులను ఆకర్షిస్తుంది. అయితే ఒక చోట ఆంగ్ల కవి “No, my Brutus అని బ్రూటస్ భార్య అన్నట్లుగా వ్రాసిన సంభాషణకు “కాదు, మామక బ్రూటసా!” అని వ్రాయడం కాస్త ఎబ్బెట్టుగా తోస్తుంది.

అయితే క్రొత్తదనాన్ని ప్రవేశ పెడుతున్నప్పుడు, అందులోని మంచి చెడ్డలు, ఉచితానుచితాలు ఆ ప్రవేశ పెట్టే వ్యక్తి కన్న, ఆ తరువాత చర్చించే విమర్శకులకే సులభంగా అవగతమవుతాయన్న విషయం మరవకూడదు. ఆ విధంగా శాస్త్రిగారు అభినందనీయులేగాని మరొకటి కాదు. వాసుదేవ శాస్త్రి తమ అనువాదంలో సముచితంగా తెలుగుతనాన్ని ప్రవేశపెట్టిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

“Pray to Gods” అని మూలంలో ఉంటే- “తేర్చికొండయ్య ముక్కోటి దేవతలను” అని అనువదించారు.

“Your ear is good” ఉంటే – “పాము చెవులు గదా నీవి” అని తెలుగు చేసారు

“Look at the calendar” అని ఉన్న చోట – “పంచాంగ మరసి చెప్పుమా!” అని ఆంధ్రీకరించారు.

“Farewell both” అన్న దానికి “శుభమస్తు మనకు” అని, “Good morrow! Brutus!” అన్న దానికి “ప్రొద్దునే నీకు శుభమస్తు, బ్రూటసుండ!” అని అనువాదాన్ని అందించారు.

“Wilt thou lift up Olympus?” అన్న వాక్యాన్ని, “మేరువుం బయికెత్తగా గోరుకొందె?” అని అనువదించడం, కవి చాతుర్యానికి తార్కాణం.

“Fortune is merry” అన్న దానిని “అల యదృష్టము మూడు పూవులనె, యారు కాయలను గాయనున్నది.” అంటూ తెలుగు నుడికారంతో పరిమళింపజేసారు అనువాద కవి. మరొక చోట – “That’s as much to say, they are fools that marry? – You’ll bear me a bang for that, I fear” అన్న దానిని, “వివాహమైన యంద రరయమి గలరని యనుట కాదె? పలువురం దీనిచే దూఱ బలికె దీవు – కడకు నీ పెండ్లి యౌను, జాగ్రత్త సుమ్మీ!” అంటూ వ్యంగ్య వైభవాన్ని పండిస్తారాయన.

ఇలా తెలుగు నుడికారాలను సంభాషణానుగుణంగా ప్రయోగించడమే కాకుండా, కవి అక్కడక్కడా హైందవ పురాణ ప్రసక్తిని కూడ సమయోచితంగా ప్రయోగించారు. ఉదాహరణకు –

“First Citizen:

We’ll burn the house of Brutus” అన్న సంభాషణను – “బ్రూటసుని యిల్లు పరశురాముని కీడుదము” అని ఆంధ్రీకరించి, అగ్నికి ఆహుతినీయడాన్ని ‘పరశురామప్రీతి’గా వ్యవహరించడాన్ని గుర్తుచేసారు కవి.

తెలుగు సాహిత్య జగత్తులో ‘సీజరు చరిత్ర’ను తొలి పద్య నాటకంగా రచించి, నూతన ప్రక్రియను ప్రారంభించడమే కాకుండా, ఇలా ఆ రచనలో కూడా ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతి, సంప్రదాయాలను రంగరించి నవ్యతకు పట్టం కట్టిన వావిలాల వాసుదేవ శాస్త్రి అభినందనీయులు, చిరస్మరణీయులు.

అయితే ఈయన ఘనత ఇంతటితోనే ఆగిపోలేదు. తొలి తెలుగు స్వతంత్ర సాంఘిక నాటకాన్ని కూడా ఈయనే రచించారు. క్రీ.శ. 1880లో ముద్రితమైన ఆ నాటకం పేరు – ‘నందక రాజ్యము’. కవి ఈ నాటకాన్ని కూడా ‘సీజరు చరిత్రము’ లాగే ఆసాంతం తేట గీతి ఛందస్సులోనే రచించారు. అయితే ఈ విషయంలో ఆ రోజుల్లో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్లు తెలుస్తున్నది. ‘వివేక వర్ధని’ గ్రంథంలో ‘సీజరు చరిత్రము’ గ్రంథంపై వెలువడిన సమీక్షలో (క్రీ.శ. 1876) ఇలా ఉంది –

“గ్రంథకర్తగారును మరికొన్ని ఇంగ్లీషు నాటకములందెనిగించి, లోకోపకార పారీణులగుదురని యెన్నుచున్నాము. ఈ సారి వ్రాయునపుడైన బుస్తకము కడవరకు నొకే పద్యము వలె వ్రాయక నాటకమున కనుకూలముగా వేరు వేరు పద్యముల నుపయోగింతురని గ్రంథకర్త గారిని కోరుచున్నాము”.

అయితే కవి తన ‘నందక రాజ్యము’ నాటక పీఠికలో దీనికి సమాధానమిస్తూ – “ఒక్క తేటగీతిలోనే వ్రాయుట వల్ల జదువు వారికి విసుగు పుట్టునని కొందరన్నారని విన్నాను గాని, నాకు మాత్రము సహజమగు వాక్రవాహమునకు దీనిలొ నున్నంత సమ మార్గము తక్కిన వానిలో లేదని స్పష్టముగా దెలిసియున్నది.” ఇదే అభిప్రాయాన్ని ఆయన ఆటవెలది పద్య రూపంలో కూడా చెప్పారు.

“తేటగీతమందె దీనిని వ్రాయంగ

మంచి దంచు తోచె మదిని నాకు

సాయమిండి నాకు సదయత బుధులార!

వావిలాల వాసుదేవశాస్త్రి.”

‘నందక రాజ్యము’ అనే పేరును బట్టి ఇది చారిత్రిక నాటకంగా అనిపిస్తుంది. కాని నంద వంశ రాజుల కథకు దీనికీ ఏ సంబంధం లేదు. దీనిలోని కథ సమకాలీన సంఘంలోని ఒక సమస్య. అందుకే ఇది తెలుగులో తొట్ట తొలి సాంఘిక నాటకం (క్రీ.శ. 1880) గా గుర్తించబడింది. తరువాతి కాలంలో ఇది కన్యాశుల్కం (క్రీ.శ. 1897), వర విక్రయం (క్రీ.శ. 1923) వంటి సామాజిక ప్రయోజనం గల సాంఘిక నాటకాలు వెలయడానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవాలి.

ఈ నాటకాన్ని కవి అప్పట్లో కృష్ణా మండలంలో నియోగి, వైదిక బ్రాహ్మణుల మధ్య చెలరేగిన కక్షలను దృష్టిలో ఉంచుకొని, వారికి ఐకమత్యాన్ని ప్రబోధించే సదుద్దేశంతో రచించినట్లు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని కవి ఈ నాటక గ్రంథం పీఠికలో ఇలా వివరించారు.

“ఇది నేను వ్రాయుటకు గల్గిన ముఖ్యోద్దేశము మన వారిలో, అందులో బ్రాహ్మణులలో బహుతరముగా గాన్పించుచున్నట్టి యైకమత్యమును సర్వవిధంబుల స్వీకరించి, దాని వల్ల మన మెల్ల మేలువడయ గోరవలయునని యెరింగించుటె గాని మరియొకటి కాదని స్పష్టముగా జెప్పుచున్నాడను. ఈ సంగతినే పొడి మాటలతో తెలియజేయక కథ యొకటి కల్పించి, యందులో బరస్పర వైరములు పెంచిన వారు శిక్షింపబడినట్లు కూర్చుట మంచిదని యెంచి, యిట్టి నా యభిప్రాయంబునె మన వారెల్లరు గైకొందురని తలంచి నాటక ధోరణిని వ్రాసితిని”.

ఇది నందుకుడనే జమీందారు పాలనలో జరిగిన కథ కాబట్టి కవి దీనికి ‘నందక రాజ్యము’ అని నామకరణం చేశారు. రాజోద్యోగులైన నియోగులు బాధించడం వలన వైదికులు పడుతున్న అవస్థల వర్ణనలతో ప్రారంభమయ్యే ఈ నాటకంలో, రాజ పురోహితుడైన శారదానందుని సహాయ సహకారాల వలన, వారు రాజుకు తమ స్థితిగతులను తెలియజేసుకొంటారు. వైదికుల ప్రతినిధిగా రామ దీక్షితులనే పాత్ర ద్వారా కవి చెప్పించిన పలుకులిలా ఉన్నాయి.

“భూపు సంపత్తికిని వారె మూల బలము

కావుననె వైదికులకు భూకాంతులు మును

పెక్కులుగ జీవనములు కల్పించినారు.

బహుదినంబులు పో, గుటుంబములు పెరిగి

పరకొ, పాతికొ చిక్క మా వారు సగము

తగ్గి జీవించుచుండిరి దాన దాన.

కాని యేలొ, యిటీవల హాని వచ్చె”

దానికి రాజోద్యుగుల పక్షాన దివాన్ (మంత్రి) – శరభోజిరావు పంతులు నక్క వినయాల పలుకులను చూడండి.

“ఇప్పుడీ దీక్షితులు విప్పి చెప్పినట్లు

వైదికుల పైని మాకున్న వైరమేమి?

మేము వారును నొక్కటై మెలగ గన్న

నైకమత్య ఫలంబుల ననుభవింప

గాను, మా సరివా రెందు గానరారు.

అయిన నా వేడ్క మాకిందు నబ్బదయ్యె;

స్వామి కార్య నిర్వహణము జగడమునకు

మూలమయ్యెను, నిజముగా భూపవర్య!”

అయితే రాజు నిజం తెలుసుకొని సుబ్బారావనే, లౌక్యంగా మెలిగి, అటు వైదికులకు, ఇటు నియోగులకు సామరస్యం సమకూర్చే వ్యక్తిని మంత్రిగా నియమించడంతో కథ సుఖాంతమవుతుంది.

5 అంకాలు, 26 రంగాలతో ఉన్న ఈ నాటకంలో పాత్రల ద్వారా సందర్భాన్ని బట్టి, స్త్రీ విద్యను గురించి; ప్రాచీనాంధ్ర కవుల గురించి; అవధానాల గురించి; పాత, కొత్త నాటక ప్రదర్శనల గురించి ప్రస్తావించడం కవి ఆధునిక దృష్టిని తెలియజేస్తుంది. కవి ఈ నాటక రచనలో ప్రాచీన రూపక సంప్రదాయాలను ఉల్లంఘించడం విశేషం. భాష గ్రాంథికంలో కాకుండా సరళంగా ఉంటూ మధ్యమధ్యలో గ్రామ్య పద ప్రయోగాలు చేయడం నవ్యత.

“పూర్వపు గ్రామ్య వ్యవహారములిందు సుందరతరముగా నభివర్ణితములు. పద ప్రయోగమున నంత ప్రౌఢిమ పొడసూపదుగాని, స్వాభావికత పెద్దగా నున్నది” అని మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఈ నాటకానికి కితాబునిచ్చారు.

అయితే ఈ నాటకం ప్రదర్శన యోగ్యం కాదని ఒక విమర్శ ఉన్నది. ఏమైనా ఇది పద్య నాటకాల్లోనే కాకుండా, తెలుగు సాహిత్యంలోనే తొలి స్వతంత్ర సాంఘిక నాటకమన్నది నిర్వివాదాంశం.

ప్రదర్శన యోగ్యంగా లేని ‘మంజరీ మధుకరీయము’, ‘నందక రాజ్యము’ ఆయా ప్రక్రియలలో తొలి గ్రంథాలుగా పేర్కొంటే, ప్రదర్శన యోగ్యమై కూడ నాటికగా పేర్కొనబడని కావ్యం ఒకటున్నది. అది వీరేశలింగం పంతులు రచించిన ‘సరస్వతీ నారద విలాపము’, దీని రచనా కాలం క్రీ.శ. 1895. దీనిలోని వస్తువు గురించి, అందులోని అభ్యుదయాత్మక నవ్యత గురించి ఇంతకు ముందు అధ్యాయంలో చర్చించడం జరిగింది. అయితే నిర్వచనంగా పూర్తిగా పద్యాల రూపంలో ఉన్న ఈ కావ్యాన్ని ప్రదర్శన యోగ్యంగా నాటక రూపంలో మలచడం కందుకూరి వారు ప్రక్రియా పరంగా చూపిన నవ్యత. ఇందులో బహుళ అంకాలు, రంగాలు అంటూ లేకుండా, ఒకే ఘట్టంగా సాగడం వల్ల వీరేశలింగం పంతులు దీనిని బహుశః నాటక, లేక నాటిక అని ఉండకపోవచ్చు. విమర్శకులు కూడా దీనిని కావ్యంగానే పేర్కొంటూ ఉన్నారు. కాని దీని రూప లక్షణాలను పరిశీలిస్తే ఇది ఏకాంకిక అని నిర్ద్వంద్వంగా పేర్కొనవచ్చు. అందుకు సాక్ష్యంగా అందులోని కొన్ని భాగాలను పరిశీలిద్దాం.

“రంగము – దండ కారణ్యము

(వీణలు దాల్చి దుఃఖించుచు సరస్వతీ నారదులు వేరువేరుగా ప్రవేశించుచున్నారు)

సర – (నిటూర్పు విడిచి తనలో)

క:

ఈ పాపుల కతమున నా

రూపెల్లను మారిపోయె; గ్రూరాత్ములకున్

జేపడితి; మోసపోయితి;

నే పగిదిం బ్రతుకు గందునిక నే నకటా?

~

క:

దాయలలంకార మిషన్

గాయం బాపాదమస్తకంబును బొడవన్

గాయ పడి మామకాంగ ని

కాయమునొచ్చడును దేలు కరచిన భంగిన్ (అని విలపించుచున్నది)

నార – (తనలో)

క:

కట కట ! సంగీతంబున

కెటువంటి యవస్థ పట్టె నీ దేశములో

పటుతర మోదం బెవరికి

ఘటియింపదు నేడు నాదు గానంబుర్విన్.

………………………..

………………………..

పై భాగంలో ‘రంగము – దండ కారణ్యము’ అని పేర్కొనడం వల్ల, నాటికా ప్రదర్శనలో రంగ స్థలంపై ‘దండ కారణ్యము’ సెట్టింగ్ వేయవలెనని’ కవి తెలియజేస్తున్నారు.

కావ్యాలలో లాగే పద్యం ఛందస్సును సూచించే అక్షరాన్ని పద్యానికి ముందు ఇచ్చినా, సరస్వతి నిట్టూర్చెన్’, ‘నారదుడిట్లనియె’, ‘అనవిని నారదుండు’ వంటి వాక్యాలు పద్యాలలో లేకుండా, ఆయా పాత్రల ఆయా చర్యలను వచనంలో బ్రాకెట్లలో చూపడం నాటక లక్షణమే. అలాగే ఆయా పాత్రలు పలికే మాటలను డైరెక్టుగా పద్యాలలో ఇమిడ్చి, ముందు ‘సర – ‘ (అనగా సరస్వతి) అని, ‘నార -’ (అనగా నారదుడు) అని సూచించడం కూడా నాటక లక్షణమే. ఈ రచన ముగింపు భాగాన్ని కూడా పరిశీలిద్దాం.

“నార –

………………………………..

………………………………..

…………………………………

………………………………….

గీ.

పాట యెల్లను వెలయాండ్ర పాలు జేసి

జనని! తల మున్క దుఃఖాబ్ది మునిగియున్న

తల్లి వాంఛ దీర్చుట పుత్ర ధర్మ మగుట

వీపునను మోచికొని పోదు వేగరమ్ము

(ఇద్దరు నిష్క్రమించుచున్నారు)”

ఈ భాగంలో తుదకు ‘తెర వ్రాలును’ వంటి సూచనలు లేకున్నా, ‘ఇద్దరు నిష్క్రమించుచున్నారు’ వంటి సూచన బ్రాకెట్లో ఇవ్వడం కూడా నాటక లక్షణమే.

అలా ఇది ఒకే అంకంగా సాగిన ప్రదర్శన యోగ్యమైన సంపూర్ణ పద్య రూపకం. అందుకే దీనిని ఏకాంకిక పద్య నాటిక అనడంలో ఎవరికి ఏ అభ్యంతరం ఉండబోదు. బహుళాంకాలు, రంగాలు గల ‘సీజరు చరిత్రము’ (క్రీ.శ. 1874) తెలుగులో మొట్ట మొదటి పద్య నాటకమయితే, ‘సరస్వతీ నారద విలాపము’ (క్రీ.శ. 1895) తెలుగులో మొట్ట మొదటి ఏకాంకికగా అంగీకరించక తప్పదు.

ఖండ కావ్యం:

“ఖండ కావ్యం భవేత్కావ్య వస్యైక దేశాను సారిచ” అన్నాడు ప్రాచీన అలంకారికుడు విశ్వనాథుడు. అందుకు ఉదాహరణగా “యథా మేఘ దూతాదిః” అని చెప్పాడు.

దీనిని వివరిస్తూ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి – “మహా కావ్యములలో ఏక దేశములైన రసవత్ సంఘటనలను గాని, నగరార్ణవశైలర్తు చంద్రార్కోదయాదులలోనేదైన ఒకటిగాని తీసికొని రసభావ బంధురములైన రమణీయ రచనలు చేయవచ్చు. అట్టి వానికే ఖండ కావ్యములని పేరు” అని వ్యాఖ్యానించారు. విప్రలంభ శృంగారాన్ని తీసికొని రచింపబడిన కాళిదాస కృత “మేఘ సందేశమ్” ఖండ కావ్యాలలో పేరెన్నిక గన్నదిగా చెప్పవచ్చు.

ఈ వివరణ ప్రాచీన పద్ధతికి సరిపోయింది. కాని ఆధునిక జీవనంలో కవికి అనేక కొత్త విషయాలు కవితా వస్తువులుగా రూపొందాయి. అందుకే ఈ వివరణను కొంచెం ఆధునీకరించి విస్తృతిని పెంచిన వివరణ నిచ్చారు విశ్వనాథ సత్యనారాయణగారు. “మహా కావ్యముల నుండి రసవద్ఘట్టములు గాని, ఒక ఏక విషయమును గురించి వ్రాసిన కొన్ని పద్యములుగాని, విడిగా తీసినచో అవి ఖండ కావ్యములనబడును.” అంటారాయన.

దీనికంటే మరింత స్పష్టమైన వివరణనిచ్చారు ఆచార్య సి. నారాయణరెడ్డిగారు.

“ఖండ కావ్యమనగా చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యములుండి ఆశ్వాస విభక్తము కాని రచన కావచ్చును”. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా నవ్య కవిత్వంలో ప్రథమ గణ్యమైన ప్రక్రియగా రూపొందిన ఖండ కావ్య ఆవిర్భావానికి దోహదమైన పరిస్థితులను గూర్చి ఆయన ఇంకా ఇలా వివరించారు.

“పాశ్చాత్య విజ్ఞాన ఫలితముగా సమాజములో కల్గిన మార్పు; కవులనాదరించి గండపెండేరములు తొడుగు ‘కవితా ప్రావీణ్య ఫణీశులగు ప్రభువులు లేని లోటు’ ఈ ప్రక్రియకు దారి తీసినది. ఆంగ్ల నాగరికతా సంపర్కమువలన దేశీయుల జీవన విధానములో వెనుక ఎన్నడు లేని వేడి పుట్టినది. ప్రజలు త్వరజీవనమున కలవాటు పడిరి. వారికి మహాకావ్యములను పఠించు ఓపిక, తీరిక కొరవడినవి. స్వల్ప కాలములో అనల్పానందమును గూర్చు కవిత్వము కావలసి వచ్చినది. పత్రికలకు ప్రబంధములను ప్రచురించు అవకాశము లేకపోయినది. కవిత్వము కవులకు ‘జాంబూనదాంబరాగ్రహారముల’ను సమకూర్చు కాలము కాకుండ పోయినది. తీరిక కాలములో ఆత్మానందము కొరకు మిత్రుల మెప్పుకొరకు కవిత్వము వ్రాసికొనుటయే కాని, తిక్కన్న వలె ‘మహా కవిత్వ దీక్షావిధి’ పొందవలసిన అవసరము లేక పోయినది. ఈ పరిస్థితులిట్లుండగా ఆంగ్ల సారస్వతములోని రసగుళికలైన ఖండ కావ్యములతో తెలుగువారికి పరిచయమేర్పడినది. తెలుగు వారు వానిని చదివి ముగ్ధులై వాని ప్రభావముతో ఖండ కావ్య రచనకు పూనుకొనిరి. కాబట్టి ఖండ కావ్య సృష్టికి ప్రధాన హేతువు ఇంగ్లీషు కవిత్వమే”.

ఇలా ఆంగ్ల సాహిత్యంలోని సానెట్ లక్షణాల ప్రభావంతో తొట్టతొలుత ఖండ కావ్యములను రచించిన కవి ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ. క్రీ.శ. 1892లో ఈయన వెలువరించిన “ఆంధ్ర పద్యావళి” ఖండ కావ్య సంకలనంలో సంఘ సంస్కరణాశయంతో వ్రాసిన ఖండ కావ్యాలతో బాటు దాదాభాయి నౌరోజి వంటి స్వాతంత్య్ర యోధులను గూర్చి వ్రాసిన పద్యాలున్నాయి. రవివర్మ చిత్రాల గురించి వ్రాసిన ఖండ కృతి ఉంది. ఈ వివరాలన్నింటిని ఇంతకుముందు అధ్యాయం (19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో సంప్రదాయ వ్యతిరేకత, అభ్యుదయాత్మక నవ్యత)లో తెలియజేయడమైనది.

కేవలం ఖండ కావ్యాలను రచించడమే కాకుండా పలు ఖండ కావ్యాలను కలిపి ఒక సంకలనంగా ఖండ కావ్య సంపుటిని ముద్రించే సంప్రదాయానికి కూడా సాంఖ్యాయన శర్మగారే ఆద్యులు. 19వ శతాబ్ది చివరి దశాబ్దంలో వెలువడిన వీరి “ఆంధ్ర పద్యావళి” స్ఫూర్తితో 20వ శతాబ్ది నవ్య కవిత్వ యుగంలో అనేకమైన ఖండ కావ్య సంకలనాలు వెలువడ్డాయన్న సత్యాన్ని అంగీకరించక తప్పదు.

గేయకావ్యం:

సంకీర్తనాచార్యుడు అన్నమయ్య తొలి తెలుగు గేయ కవిగా ప్రసిద్ధుడు. ఇతని తరువాత రామదాసు (కంచర్ల గోపన్న), క్షేత్రయ్య, ఆ పైన 19వ శతాబ్దిలో త్యాగరాజు వంటి చాలా మంది వాగ్గేయకారులు గేయ కవితా పుష్టికి కృషి చేసిన వారే. వీరి రచనలు, పదాలు, కీర్తనలు, కృతులుగా వెలువడి ప్రసిద్ధినొందాయి. ఇవిగాక ఆ రోజులలో జానపద, పౌరాణిక గేయాలు జన వ్యవహారంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే గేయ కవితను కావ్య రచనకు వినియోగించిన ఘనత మాత్రం మండ కామశాస్త్రి, శిష్టు కృష్ణమూర్తి గార్లదే. గేయ ఛందస్సులతో సాగిన వీరి ‘ఆంధ్ర తులసీ రామాయణము’ (1879) అనే అనువాద కావ్యం ఆంధ్ర సాహిత్యంలో మొట్ట మొదటి గేయ కావ్యం. ‘19వ శతాబ్దం తెలుగు కవిత్వంలో ఛందస్సు పరమైన నవ్యత’ అన్న అధ్యాయంలో ఈ విషయాన్ని సవిస్తరంగా, సోదాహరణంగా వివరించడం జరిగింది.

“ఆంధ్ర తులసీ రామాయణము” గేయ ఛందస్సులతో సాగిన తొట్ట తొలి సంపూర్ణ గేయ కావ్యమైతే, ఒక ప్రబంధంలో వివిధ పద్య ఛందస్సులతో బాటు కీర్తనలను, పాటలను ప్రవేశపెట్టి మొట్ట మొదటిసారిగా వాటికి కావ్య గౌరవాన్ని సంతరించిన కవి – ‘బిల్వేశ్వరీయము’ (1893) ప్రబంధ కర్త కొక్కొండ వేంకట రత్నశర్మ పంతులు. ఈ ప్రబంధంలో బిల్వాంబ, బిల్వేశుల కల్యాణ సందర్భంలో అనేక సంప్రదాయ గీతాలను రచించి పొందు పరిచారు.

“గౌరి కల్యాణ వైభవమే! గౌరి కల్యాణ వైభవమే!” అనే పల్లవితో ప్రారంభమయ్యే ‘కల్యాణ గీతము’-

“హిమవంతు కూతురై – యింపు సొంపొందె!

హిమకరమౌళిని

హితమొంద బొందె!

వలరేని పగవాని – వానికి జెలిగ

నలరించె బెండ్లియై – యయ్యె నెచ్చలిగ!”

వంటి చరణాలతో సాగి ఆకట్టుకొంటుంది. ప్రాసలు, యతులతో బాటు ఈ చరణాలలో అంత్య ప్రాసలను కూడ కవి పాటించడం గమనార్హం. ఇదే వరుసలో ఈ ప్రబంధంలో పెళ్ళి ముచ్చట్లకు సంబంధించిన ‘నలుగు పాట’, ‘ఆనంద గీతము’, ‘శోభన గీతము’, ‘మహా శోభన గీతము’, ‘లాలి పాట (లేక) తొట్ల పాట’, ‘పూలబంతులాట పాట’, ‘మంగళ గీతము’ లను రచించి, ఆ ఘట్టాన్ని చదువుతున్నంతసేపు ఒక పెళ్ళి సందడిని కళ్ళకు కట్టేలా చేశాడు కవి పుంగవుడు.

“ఆనంద మానంద మాయెను – మన

సీనమ్మ పెండ్లి కూతురాయెను – మన

సీనయ్య పెండ్లి కొడుకాయెను –

సీనమ్మ బిల్వాంబ – సీనయ్య బిల్వేశుడు!!”

అని సాగే ‘ఆనంద గీతము’, మరియు –

“శోభనమే శోభనమే! శ్రీ బిల్వేశులకు శోభనమే!

ఈ పెండ్లి కూతునకు, నీ పెండ్లి కొడుకునకు

జూపు జూపులనంగ శోభనమే శోభనమే!”

అని సాగే ‘మహా శోభన గీతము’ – ఇంకా

“లాలి శ్రీతను మధ్య – లాలి మాయమ్మ!

లాలి శ్రీ బిల్వేశ – లాలి మాయయ్య!”

అని సాగే లాలి పాటల స్థానంలో ఏ పద్యాలు వ్రాసినా ఆ ఘట్టంలోని సహజ రామణీయకత అబ్బదు కదా! ఇలా ఒక పద్య కావ్యంలో సందర్భానుసారం గేయ కవిత్వాన్ని సమ్మిశ్రితం చేసి 19వ శతాబ్దిలోనే ప్రక్రియా పరమైన నవ్యతను చూపారు కొక్కొండ వేంకట రత్నం పంతులుగారు.

‘బిల్వేశ్వరీయము’లో అత్యధిక భాగం పద్యాలు కాగా సందర్భానుసారం అక్కడక్కడా గేయాలున్నాయి. అయితే సుప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన ‘ప్రహ్లాద భక్తి విజయము’ మరియు ‘నౌకా చరిత్రము’ లో అత్యధిక భాగం కీర్తనలుండి అక్కడక్కడా కందము, సీసము, ద్విపద వంటి ఛందస్సులలో పద్యాలున్నాయి. త్యాగరాజు జన్మించింది 1767లో. ఆయన ఈ పరిణత కావ్యాలను కనీసం 35 సంవత్సరాల వయస్సులో రచించాడనుకొన్నా, ఈ గ్రంథాలు 19వ శతాబ్ది తొలి చరణంలో వెలువడి ఉండాలి. త్యాగయ్య వీటిని సంగీత రూపకాలన్నాడు. కొందరు వీటిని నృత్య నాటికలన్నారు. ఒక రకంగా ఇవి ఆ రోజుల్లో నూతన ప్రక్రియలనే భావించాలి. అయితే అక్కడక్కడా పద్యాలు, ఒకటి రెండు దరువులు, అత్యధికంగా కీర్తనలతో సాగిన ఈ సంగీత రూపకాలు రచనా పరంగా ‘యక్షగానం’ ప్రక్రియను పోలి ఉంటాయి. ప్రదర్శన పరంగా ‘యక్షగానం’ ప్రక్రియకు, త్యాగరాజు ఆవిష్కరించిన ‘సంగీత రూపకం’ లేదా ‘నృత్య నాటిక’ ప్రక్రియకు గల భేదసామ్యాలను వివేచిస్తూ సంగీత, నృత్య రంగ నిపుణులు తులనాత్మక అధ్యయనం చేయవలసి ఉన్నది. (ఈ పరిశోధన విస్తృతి కవిత్వ రచనా పద్ధతి వరకే పరిమితం కాబట్టి, ఈ విషయంలో ఇంకా వివరాలలోకి వెళ్ళలేకపోతున్నాను.)

వాగ్గేయకారుల రచనలన్నీ గేయ కవితలే అయినా అన్నమయ్య రచనలను ‘పద కవిత’ లంటారు. రామదాసు రచనలను కీర్తనలంటారు. త్యాగరాజు రచనలను కృతులంటారు. ఆ రకంగా ‘సంగీత రూపకం’ తోబాటు, 19వ శతాబ్దిలో ‘కృతి’ అన్నది గేయ కవిత్వంలో త్యాగరాజస్వామి ఆవిష్కరించిన ప్రత్యేక ప్రక్రియ అని చెప్పాలి. ఈ ప్రక్రియ విశిష్టతను, కీర్తనతో ఈ ప్రక్రియకు గల భేదాన్ని ప్రఖ్యాత సంగీత విద్వాంసులు డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణగారు ఇలా వివరించారు.

“శ్రీ త్యాగబ్రహ్మము పూర్వులు రచించిన కీర్తనలు గాక ‘కృతి’ రచన యొనర్చి, లక్ష్య లక్షణ సమన్వయముతో విశిష్ట సంగీత సాంప్రదాయమునకు స్వయం స్రష్టయై ‘త్యాగబ్రహ్మ’ యను తన పేరును సార్థక మొనర్చుకొన్నారు. కీర్తన యందు, పల్లవి తరువాత చరణములన్నియు ఒకే తీరుగా నుండుట కలదు. కృతియందట్లు గాక అను పల్లవి వేరుగా నుండి, చరణమైన పిదప, ‘చరణాను పల్లవి’ యనునది కూడా నుండును. అనగా పల్లవి తర్వాత నున్న అనుపల్లవి వలనే చరణానుపల్లవియు ఉండి కృతికి రాగ భావ విస్తృతిచే రమ్యతను చేకూర్చును”.

ఇందుకు ఉదాహరణగా ఒక త్యాగరాయ కృతిని పరిశీలిద్దాం.

పల్లవి:

గంధము పుయ్యరుగా – పన్నీరు

గంధము పుయ్యరుగా ॥ గంధము ॥

అనుపల్లవి:

అందమైన యదునందనుపై

కుందరదన లిరువొందగ – పరిమళ ॥ గంధము ॥

1వ చరణము:

తిలకము దిద్దరుగా – కస్తూరి

తిలకము దిద్దరుగా –

చరణానుపల్లవి:

కలకలమను ముఖ కళ గని సొక్కుచు

పలుకుల నమృతము లొలికెడి స్వామికి ॥ గంధము ॥

2వ చరణము:

చేలము గట్టరుగా – బంగరు

చేలము గట్టరుగా –

చరణానుపల్లవి:

మాలిమితో గోపాల బాలులతో

నాలమేపిన విశాల నయనునికి – ॥ గంధము ॥

3వ చరణము:

హారతు లెత్తరుగా – ముత్యాల

హారతు లెత్తరుగా –

చరణానుపల్లవి:

నారీ మణులకు వారము యౌవన

మవారిగ నొసగెడు వారిజాక్షునికి – ॥ గంధము ॥

4వ చరణము:

పూజలు సేయరుగా – మనసార

పూజలు సేయరుగా –

చరణానుపల్లవి:

జాజులు మరి, విరజాజులు, దవనము

రాజిత త్యాగరాజనుతునికి – ॥ గంధము ॥

19వ శతాబ్దిలో త్యాగరాయ కృతులతో గేయకవిత శిఖరాయమాన ప్రాభవాన్ని సంతరించుకొన్న మాట నిర్వివాదాంశం.

కృతులుగాని, కీర్తనలు గాని హిందూ మతంలో దేవుళ్ళను కీర్తించేందుకు వినియోగిస్తున్న తరుణంలో అనగా 19వ శతాబ్ది పూర్వార్థంలోనే మొట్ట మొదటిసారిగా అన్యమతానికి చెందిన దేవుని కీర్తించేందుకు కీర్తనలను రచించిన కవి పురుషోత్తమ చౌదరి. ‘ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు’ బిరుదాంచితుడైన పురుషోత్తమ చౌదరి – త్యాగరాజు రచించిన ‘ప్రహ్లాద భక్తి విజయము’ సరణిలో ‘రక్షణ చరిత్ర’ (The History of Salvation); ‘నిస్తార రత్నాకరము’ (The Jewel mine of Salvation) అన్న సంగీత రూపకాలను క్రీ.శ. 1846లో రచించాడు. ఇవి తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి క్రైస్తవ సంగీత రూపకాలుగా చెప్పవచ్చు. అంతే కాకుండా ఈయన ‘సత్య భజన’ పేరిట ఒక భజన గీతాల సంకలనాన్ని క్రీ.శ. 1874లో రచించాడు. ఈ భజన గీతాల గ్రంథంలో కవి ప్రతి కీర్తనకు ముందు తెలుగు వర్ణమాలలో ఒక్కొక్క అక్షరాన్ని అక్షర క్రమంలో ప్రారంభాక్షరంగా ఉపయోగిస్తూ ఒక కంద పద్యాన్ని రచించారు. ఇలా ‘అ’ నుండి ‘క్ష’ వరకు అక్షరాలను వినియోగిస్తూ ఒక్కొక్క కంద పద్యం, దాని క్రింద ఒక కీర్తన చొప్పున రచించి కవి ఒక నవ్య మార్గాన్ని తొక్కాడు. దీనిని కవి ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా పేర్కొనక పోయినా, ఈ కావ్య వైశిష్ట్యాన్ని కావ్యారంభంలో ‘అక్షర మాలికా కందాలంకార’ భజన గీతాల సంకలనంగా పేర్కొన్నారు.

తెలుగు సాహిత్యంలో విభక్తులను ఉదహరిస్తూ స్తుతి రూపంలో ఉండే ‘ఉదహరణము’ అనే లఘు కృతిని, ఒక విశిష్ట సాహితీ ప్రక్రియగా అంగీకరించినప్పుడు పురుషోత్తమ చౌదరి సృజించిన ఈ నవ్య మార్గ రచనను ఒక నూత్న ప్రక్రియగా అంగీకరించక తప్పదు. ఈ ప్రక్రియకు కవి పేర్కొన్నట్లుగా ‘అక్షర మాలిక’ అని నామకరణం చేయడం సముచితమని నా సూచన.

ఈ గ్రంథం వివరాలలోనికి వెళితే, మొదట ‘అ’ కారంతో ప్రారంభించిన పద్యం –

“అవనియు నాకాశంబును

రవి శశితారా గణములు – రాత్రి దివసముల్

ఎవని మహాత్మావచనో

ద్భవమయ్యెను నాత్రియేక దైవము గొలతున్”

ఈ పద్యం క్రింద –

“దైవంబు గొలుతున్ – నా తండ్రి

యెహూవాను దలతున్” అన్న కీర్తనను పొందుపరిచాడు కవి.

ఆ తరువాత ‘ఆ’ కారంతో

“ఆదము వలనను వచ్చెను

హా దుర్గతి పుడమి నరుల – కది పోగొట్టన్

మోదమున నవతరించితి

వో దేవ! త వాంఘ్ర దాస్య మొసగవె మాకున్”

అన్న పద్యాన్ని రచించారు. దాని క్రింద ‘ఆనంద భైరవి’ రాగంలో

“తవాంఘ్ర దాస్యము నొసంగవే

భక్త వత్సలా! మమ్ము గావవే”

అన్న కీర్తనను రచించాడు కవి.

అలాగే ‘ఇ’ కారంతో

“ఇమ్మానుయేలు నరరూ

పమ్మున యవతారమూని, పాపాత్ముల రా

రమ్మని బిలచుచు వారియ

ఘమ్ములు హరియించి బ్రోచు – కరణా నిధియై!”

అన్న పద్యం – దాని క్రింద

“కరుణానిధియై క్రీస్తుడు వచ్చె ధరణికి నరుడై –

నరజాతి దురవస్థ దరిశించి, తత్పాప

పరిహారము కొరకై యర్పణ సేయ దేహము” ॥ కరుణానిధి ॥

అన్న కీర్తన ఉన్నాయి.

ఇలా అన్ని అక్షరాలతో వరుగా సాగిపోతుంది. ఈ గేయ కావ్యం. ఇవిగాక కవి ఇంకా ఎన్నో క్రైస్తవ మత కావ్యాలను రచించాడు. ఆ ఇతర రచనల గురించి సవిస్తరంగా మరొక అధ్యాయంలో చర్చిస్తాను.

మొత్తానికి తెలుగు సాహిత్యంలో క్రైస్తవ మత వ్యాప్తికై నడుం కట్టిన మొట్ట మొదటి వాగ్గేయకారుడు పురుషోత్తమ చౌదరి అన్నది అక్షర సత్యం.

ఇదిలా ఉంటే దేవుళ్ళను స్తుతించేందుకు వినియోగించే కీర్తనను 19వ శతాబ్దిలోనే ఒక కవి హాస్య వ్యంగ్య స్ఫోరకంగా ఒక గుడ్డి గుర్రాన్ని వర్ణిస్తూ రచించి గేయ కవిత్వంలో వస్తు పరంగా అత్యాధునికను ప్రదర్శించారు. రాయభట్టు వీర రాఘవ రాజ కవి రచించిన ఈ కీర్తన ఇలా ఉంది –

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here