[box type=’note’ fontsize=’16’] బాలల కోసం సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న సీరియల్ సమ్మెట ఉమాదేవి రచించిన “నేటి సిద్ధార్థుడు“. ఇది నాల్గవ భాగం. [/box]
11
[dropcap]ఒ[/dropcap]క ఖండంలో నివసించు ప్రజలకు మరో ఖండంలోని ప్రజల జీవనవిధానం మాట తీరు కొత్తగా ఉన్నట్లు ఒకింత వింత గొలుపుతున్నట్లు ఉంటాయి.
ఆ దేశ రాకుమారుడే అయినా వచ్చింది తన ప్రజల మధ్యకే అయినా రాకుమారునికి మరో దీవికి వచ్చినట్లు ఉన్నది.
తాము ఒక మందిరం నుండి మరొక మందిరమునకు చేరుకొనుటకు కనీసం యాభయి అడుగులు నడవాలి. అలాంటిది ఇక్కడ ఈ పల్లెలో ఇళ్లన్నీ చిన్ననాడు తాము ఆడుకున్న బొమ్మరిళ్ల వలే ఉన్నవి. అంత చిన్న ఇళ్లలో ఎలా ఉంటున్నారో ఆశ్చర్యం వేసింది సిద్దార్థునకు. అంతకన్నా ఆశ్చర్యాన్ని వేదనను కలిగించిన విషయం అప్పుడే జరిగింది .
అక్కడ మరొక ఇంటి ముందు ఒక తల్లి తన కొడుకును కొడుతున్నది. అలా పిల్లలను కొట్టడం ఎప్పుడూ చూడని సిద్ధార్థుడు తల్లడిల్లిపోయాడు. అశ్వాన్ని ఒక పక్కన ఆపి పరుగు పరుగున వెళ్లి…
“పసివాడిని ఎందుకమ్మా అలా కొడుతున్నావు…?” కంగారుగాను కోపంగాను అడిగాడు.
“ఏమి చేయను నాయనా చక్కగా చదువుకోమ్మని బడికి పంపుతుంటే… బడికి వెళ్ళను అంటాడు. మేము చాలా పేదవాళ్లము అయినా వాడు ప్రయోజకుడు కావాలని బడికి పంపుతున్నాము. నాకున్న తపన వాడికి ఉంటే కదా!” తల కొట్టుకుంటూ ఆమె బాధపడింది.
“అయ్యో ఎందుకు వెళ్లనంటున్నాడో? కొన్నాళ్లు వదిలేయండమ్మా తరువాత తానే వెళ్తాడేమో.”
“లేదు బాబు..! వీడు ఎలాగయినా బడికి వెళ్ళాలి. లేకపోతే కొన్నాళ్ళు వాడు వెళ్ళక, కొన్నాళ్ళు మేము పంపక, ఆడు అటు చదువుకు.. ఇటు కొలువుకు పనికిరాకుండా పోతాడు. దానికి తగట్లు వాళ్ళ నాయనకు వీడు చదువుకోవడం అసలు ఇష్టం లేదు. ఎందుకు వాడిని బడికిపొమ్మని అంటావు. వాడేమయినా చదువుకుని రాచనగరిలో కొలువు చేస్తాడా..? ఇక చాలుగాని ఇక వాడిని చదువు మాన్పించి కాడి ఎత్తుకొమ్మను అంటాడు. వీడు ఇలా బడి మానడమే ఆయనకు కావలి.” ఆమె కంటతడి పెట్టింది.
సిద్దార్ధుడు ఆమె బాధ చూడలేకపోయాడు అలాగని ఆ బాబును కోప్పడలేక పోయాడు.
“బాబు..! నీ పేరు ఏమిటి..?
“నారాయణ..”
“నారాయణా..! ఎందుకు నీవు బడికి వెళ్ళాను అంటున్నావు .. ?
“ఏమి చెప్పను అన్నా..! ఉదయం నుండి సాయంత్రం వరకు ఏవో అర్థంకానీ పాఠాలు వినాలి. పచ్చని చేలో హాయిగా తిరిగే నాకు కాళ్ళు కట్టేసినట్లుంటుంది. రోజల్లా స్వేచ్ఛగా హాయిగా తిరిగే నాకు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒకే దగ్గర కూర్చుని అర్థంకానీ పాఠాలు వల్లే వేస్తుంటే నిద్ర వస్తున్నది. బడికి వెళ్లడం మొదలు పెడితే కొన్నేళ్లపాటు వెళ్ళాలి. బయటకు రాగానే మనకెవరూ కొలువులివ్వరు. ఆ కొలువుల కోసం మళ్ళీ కొన్నేళ్లు చదవాలి. ఈలోగ నేను ఎందుకూ పనికిరాకూండా పోతాను. నాకు వచ్చిన వ్యవసాయపు పనులు కూడా మరచిపోతాను. నిజం అన్నా! ఈ చదువులు నాకేమీ ఏమీ ఆసక్తికరంగా లేవు. వాళ్ళు నేర్పే జ్ఞానం నాకేమీ అక్కరలేదు. నేను బడికి పోను.” మొండిగా అన్నాడు.
“ఈ చదువులకన్నా హాయిగా పశువులను మేపుకోవడమో మరో వ్యయవసాయ పనులు చేసుకోవడమొ నాకిష్టం. ఇలా చెప్తే అమ్మేమో మనసు కష్ట పెట్టుకుంటున్నది. నువ్వన్నా మా అమ్మతో చెప్పన్నా.” అన్నాడు నారాయణ.
“అమ్మా..! నారాయణ నన్ను ‘అన్నా’ అన్నందుకు నన్ను నీ పెద్ద కొడుకు అనుకో. నా మాట మీద నమ్మకం ఉంచి కొన్నాళ్ళు వీడినీలా వదిలేయ్. తరువాత చదువుకుంటానంటే చదివిద్దువుగాని లేదా మానుకుంటానంటే మాన్పిద్దువుగాని..”
“భలే చెప్పినావులే అన్న. దా.. దా వేడి వేడిగా రెండు కంకులు కాల్చిస్తా తిని పో అన్నా.. “
“ఓ పెద్దయ్యా..! నువ్వు గూడా రా” అని జ్ఞానముని గారిని కూడా పిలిచాడు నారాయణ. వారిరువురినీ అరుగు మీద కూర్చోబెట్టి.. పొయ్యిలో నిప్పుల మీద గబా గబా నాలుగు కంకులు కాల్చి తెచ్చిచ్చాడు.
సిద్ధార్థుడు మొదట అవి వలుచుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ నారాయణ తల్లి వలిచి ఇచ్చింది. ఆ పిల్లవాడు గల గల కబుర్లు చెబుతూ పల్లె పాటలు పాడుతూ.. అలా కంకులు కాల్చిస్తుంటే అవి అమృతంలా అనిపించాయి. నారాయణ సిద్ధార్థుణ్ని ఎన్నో ప్రశ్నలు వేసాడు. అలాగే తన గురించీ.. తన పల్లె గురించి, తన నేస్తం గాళ్ళ గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పాడు. సిద్ధార్థుడు, జ్ఞానముని ఓ రెండు కంకులు తృప్తిగా తిని వారి దగ్గర సెలవు తీసుకున్నారు.
“ఓ అన్న ఈ దారిని ఎప్పుడయినా వస్తే మా ఇంటికాడే ఒక ముద్ద తినిపో అన్నా!” అని అన్నాడు నారాయణ. ఆ ఆప్యాయతకు కరిగిపోయాడు సిద్దార్థుడు. ఇన్నాళ్లు తల్లిదండ్రుల ప్రేమ, సోదరి ప్రేమ మాత్రమే తెలుసు సిద్దార్థునకు. బంధువులు కూడా ఒక రాచకుమారునికి ఇచ్చే మర్యాదతోనే పలకరిస్తారు. తన కన్నాఎంతో పెద్ద వాళ్ళుకూడా తనకు వంగి వంగి నమస్కారాలు పెట్టడం.. పక్కకు తొలగి పోవడం తెలిసిన వాడు ఇలా ఇంత చనువుగా దగ్గర కూర్చుని ఆప్యాయంగా పలకరిస్తూ అమాయకంగా దగ్గరయిన వారే లేరు. ఆ కాస్సేపట్లోనే నారాయణ అంటే అవాజ్యమయిన అనురాగం ఏర్పడింది రాకుమారుని మనసులో.
తేలిక పడ్డ మనసుతో విశ్రాంత గృహానికి చేరుకున్నాడు. ఒక్కసారి తన సోదరి వాసంతిక మాట్లాడాలని అనిపించింది. కానీ ఇప్పుడు రాచనగరికి తిరిగి వెళ్తే మళ్ళీ ఇలా సంచారానికి తిరిగి రానివ్వరు. తన విహారాన్ని మధ్యలో ఆపి రాచనగరికి వెళ్ళకూడదు. దృఢంగా మనసులో అనుకున్నాడు.
ఈ లోకంలో బాధలున్నాయి. విలువయిన అనుబంధాలున్నాయి. ఈ లోకంలో అంతులేని దుఃఖం ఉంది. అద్భుతమయిన ఓదార్పు ఉన్నది. ఎన్నో రకరకాల సమస్యలున్నాయి. ఏంతోమంది స్వాభిమానులున్నారు అనుకున్నాడు.
మధ్య మధ్యలో రాజుపంపిన వేగులవారితో జ్ఞానముని గుణాధీశుడు ఇతర భటులు సిధార్థుని పర్యటన గురించి చెబుతోనే ఉన్నారు రాజమాత కుమారుని రాక ఆతృతగా కోసం ఎదురు చూస్తున్నదని తెలిపారు. సిద్ధార్థుడు ప్రతిచోట వారికీ తానూ క్షేమమంగానే ఉన్నానని తెలుపుతూనే ఉన్నాడు.
ఒక్కో రోజు గడుస్తున్నకొద్దీ రాజుకు ప్రజలకు మధ్య దూరం ఎంతున్నదో అతనికి అర్ధంకావడం మొదలు పెట్టింది. తెల్లవారి మరో ఊరికి పయనమయ్యారు.
12
“గురువుగారు తీవ్రంగా దాహం వేస్తున్నది.. దగ్గరలో ఏక్కడా బావిగాని చెరువుగాని ఉన్నట్లు లేదు ఎలా ఏమిచేద్దాం..?
“అయ్యో నాయనా..! నీవు కనుసైగ చేస్తే పదిమంది బంట్లు పరుగు పరుగున వచ్చి అమృత సమానమయిన మధుర ఫలరసాలు అందించేవారు. ఇవాళ గుక్కెడు నీటికయి బాధపడుతున్నావు కదా.. ఇప్పటికే మనం రాచమందిరం వదిలి వచ్చి అయిదు రోజులవుతున్నది. ఇక ఈ నీ పర్యటన ఇంతటితో ఆపి రాచనగరికి మరలి వెళదాము నాయనా..”
“గురువర్యా..! నా పర్యటనలో కలిగే చిన్న చిన్న ఇబ్బందులను ఆటుపోట్లను గురించి నేను ముందే ఊహించాను..! ఇలా ఎండలో తిరుగుతున్నందుకు ఒక్క క్షణం కూడా నేను కూడా నేను బాధపడడం లేదు. పైగా బోలెడన్ని అనుభవాలను పోగేసుకుంటున్నానని సంతోష పడుతున్నాను. కనీసం ఏడు రోజులయినా పర్యటించనిదే వెనుతిరుగలేను..”
“అంతే కాదు గురువర్యా..! సృష్టిలో ఎన్నిమధురపానీయాలున్న దప్పికగొన్నవారి దాహం తీర్చేది మాత్రం మంచినీరే కదా. నాకు మధురపానీయములు వలదు. మంచినీరు మాత్రమే కావాలి.. “
“నీ మీద ఉన్న పుత్ర వాత్సల్యంతో ఈ రీతిగా బాధపడుతున్నానుగాని, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మీరు ఆ నిర్ణయంనుండి వెనుతిరగరని నాకు తెలుసును కదా నాయనా..!”
“సరే కుమారా..! ఆ ఇంటి ముందు అశ్వాన్ని ఆపండి. మనం వారిని మంచినీరు అడుగుదాం..”
ఒక చెట్టు కింద అశ్వాన్ని ఆపి ఎదురుగా కనపడుతున్న ఇంటి ఆవరణాలోనికి ప్రవేశించారు.
ఆ ఆవరణ ఓ చాలా మంది మనుష్యులు చాలా విచారంగా కనపడ్డారు వారికి. అక్కడ అరుగు మీద ఉన్న మంచం పైన ఒకామే పడుకున్నది ఆమెకు దగ్గరలో కూర్చుని కొందరు వారిలో వారే మాట్లాడుకుంటున్నారు. సిద్ధార్థునికి జ్ఞానమునికి వారు మంచినీరు ఇచ్చారు. ఎండలో వచ్చారు కాసేపు కూర్చుని వెళ్ళమని మర్యాద చేశారు. ఒక మంచం మీద కూర్చున్న సిద్ధార్థుడు.
“ఏమైంది ఆమెకు.? ఇక్కడ ఉన్నవారందరూ చింతాక్రాంతులయి ఉన్నారు ఎందులకు?” ఆందోళనగా అడిగాడు.
“ఏమయిందంటే ఏమి చెప్పమంటారు..? అదిగో అక్కడ అరుగుమీద ఆ మంచంమీద ఉన్నామె గురించే మా అందరి బాధ. ఆమె మా అన్నగారు భానురావు భార్య. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. అక్కడ రోదిస్తున్నది మా వదినగారి తల్లి. ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు మా అన్నగారి పిల్లలు..”
ఈసారి ఎవరూ వివరించనవసరం లేకుండానే మనిషి జీవితంలో అనారోగ్యం అనేది ఒక విపత్కరమయిన స్థితి అని దానివలన మనుష్యులు దయనీయమయిన స్థితికి చేరుకుంటారని అర్దమయ్యింది సిద్దార్థునకు. చైతన్యం లేకుండా మంచానికి అతుక్కుపోయినట్లున్న ఆమెని చూసి మనసు ద్రవించిపోయింది.
“అయ్యో..! ఆమెకు ఆరోగ్యం బాగోకపోతే వైద్యులకు చూపించలేదా.?” అని అడిగాడు బాధగా.
“చూపించాము. ఇక్కడకు దగ్గరలో కొద్దీపాటి వైద్యం తెలిసిన ఒక చిన్న వైద్యుడు ఒకాయన ఉన్నాడు. ఎవ్వరికీ ఏమిజరిగినా మాకు అతనే దిక్కు. ఇంతకాలం ఆయనకు తోచిన వైద్యం చేస్తూ వచ్చాడు. ఆమె రోజు రోజుకు నీరసపడి పోతున్నది తప్ప కోలుకోవడం లేదు. ఏమిటయ్యా ఆమె పరిస్థితి అని వైద్యున్ని నిలదీసాం. ఇప్పుడాయన ఆయన నాకు తోచిన వైద్యం నేను చేసాను. ఆమె కోలుకోలేదు ఇప్పుడు నేనేమి చేయలేను…” అని చేతులెత్తేశాడు.
“అదేమిటి అతను తప్ప మరే వైద్యులు లేరా..?
“లేదు సిద్దన్నా..! దగ్గరలో మరెక్కడా సరయిన వైద్యశాలే లేదు. రాచనగరిలో ఉన్న ప్రధాన వైద్యశాలకు తీసుకెళ్లి అక్కడ మందులు ఇప్పించే స్తోమత మా అన్నకు లేదు. మా వదిన అనిన మా అన్నకు మా కుటుంబమంతటికీ అమితమయిన ప్రేమ. కానీ ఒక వారం రోజులనుండి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మా అన్న చాలా దిగులు పడిపోయాడు. ఇక ఆమె మీద ఆశలు వదులుకుని దుఃఖంలో మునిగిపోయి పిచ్చివాడిలా అయినాడు.” చాలా విచారంగా చెప్పాడు వాసుదేవ్.
“అదేమిటి వైద్యం చేయించడానికి సొమ్ములు లేకుంటే ఇక వైద్యం చేయించారా.? అలా వదిలేస్తారా.?” సిద్ధార్థుడు ఆవేశంగాను బాధగాను అడిగాడు
“అంతే కదా బాబు.! ఇక ఏమి చేయగలం..?” ఈ పరిస్థితి మా ఒక్కరిదే కాదు. అనారోగ్యం పాలయిన చాలా మంది పరిస్థితి ఇదే. మాలాంటి సామాన్యులు రాచనగరి దాకా వచ్చి వైద్యం చేయించాలంటే ఎలా కుదురుతుంది.? మా ప్రయాణానికి, దారి ఖర్చులకు, తిండికి, బండికి, మందులకు సొమ్ములు ఎక్కడనుండి తెస్తాము.? మేమే కాదు మాలాంటి అనేక మంది సామాన్యులు ఇలాగే సరయిన వైద్యం చేయించలేక భగవంతుని మీద భారం వేసి ఊరుకుంటుంటాము.”
“ఆ పక్క వీధిలో ఒక పూర్ణ గర్భిణీ, పడమటి సందులో కామెర్లతో బాధపడుతున్న ఒక చిన్నబాలుడు, కాళ్లు నెప్పులు, కీళ్ళనెప్పులతో కొందరు వృద్ధులు.. ఇలా వైద్యం చేయించుకోలేక రోగంతో మగ్గిపోతున్నవారు.. మృతువుతో పోరాడుతున్నవారు ఉన్నారు ఎందరో ఉన్నారు. ఏమి చేస్తాము” వాసుదేవ్ వాళ్ళ నాన్నగారు బాధపడుతూ చెప్పారు.
“అదేమిటి ఈ సమస్యలని ఈ దేశాన్నేలే రాజుగారికి విన్నవించుకోలేదా..?
“రాజుగారి దగ్గరకు వెళ్లే శక్తే ఉంటే వైద్యమే చేయించుకునే వాళ్ళముకదా.! అయినా ఆయన మా దేశ రాజూ. ఆయనతో మాకు తగవులెందుకు.?
“అంటే కేవలం మీరు రాజుగారిని చేరుకోలేనందువలన మీకు వైద్యంగాని న్యాయంగాని జరగడం లేదన్నమాట.” బాధగా అన్నాడు సిద్ధార్థుడు
“కాదు.. కాదు.. రాజుగారు మమ్ములను చేరుకొనేందుకే మాకీ కష్టాలు” వాసుదేవ్ పౌరుషంగా అన్నాడు.
“ఊరుకో వాసుదేవ్. వ్యాపారనిమ్మిత్తం తిరుగుతూ అలసిపోయి ఉన్నారు వారు. వారికి మన గోడు చెప్పి బాధపెట్టడం సమంజసం కాదుకదా! అయినా ఇంటికి వచ్చిన వారిముందు ఏమిటీ దురుసుమాటలు..” అని వాళ్ళ నాన్న కోప్పడ్డారు.
“అతను అన్నదాంట్లో తప్పేమి ఉంది.? ప్రజలకు వైద్య, విద్యావసారాలు చూడడం రాజు కర్తవ్యం. అది మరచిన రాజుకు అది గుతూ చేయడం అవసరం.” ఆవేశంగా అన్నాడు సిద్ధార్థుడు.
“బాబు..! నీవు చిన్నవాడివి. నీకేమీ తెలియదు. నీ ఈ మాట రాజుగారికి చేరిందంటే.. ఆ రాజ భటులు నిన్నూ మమ్ముల్ని బ్రతుక నివ్వరు. కాసంత దాహం పుచ్చుకుని మీ పని మీరు చూసుకొండి బాబు.” భానూరావ్ అన్నాడు. సిద్ధార్ధుని వైపు తిరిగి..
“అదేమీ కాదు బాబు..! మా రాత బాగుండలేదు. అందుకే అది మంచాన పడింది. దానికి ఆయుష్షున్నంత కాలం.. మా పిల్లలకూ నాకు అదృష్టం ఉన్నంత కాలం బ్రతుకుతుంది. లేదంటే ఆ భగవంతుణ్ణి చేరుకుంటుంది. మమ్ముల్ని దురదృష్టవంతుల్ని చేసి తానూ అదృష్టవంతురాలవుతుంది అంతే..” అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగాడు. అది చూడలేక భారమయిన గుండెతో సిద్ధార్థుడు వెనుకకు మరలాడు .
13
పంచభక్ష పరమాన్నాలు తినే రాకుమారునికి మూడు రాళ్ల పొయ్యి పెట్టి రొట్టె చేసి ఇస్తుంటే ఆ భటుని మనసు వికలమయ్యింది. రాజుగారి బంధువులు దగ్గరలో బసచేశారని చెప్పి కొందరు ప్రాంతీయ అధికారుల ఇంట ఎదో ఒకటి వండించి తెచ్చి రాకుమారునికి గురువుగారికి పెడుతున్నారు భటులు. కానీ ఈవేళ రాకుమారుడు ఎటూగాని ప్రాంతంలో తన పర్యటన ఆపెయ్యడంతో వేళ కాని వేళ సరయిన ఆహారం సమకూర్చ లేకపోయారు. కానీ సిద్ధార్థుడు ఇవ్వన్నీ ఆలోచించే స్థితిలో లేడు. అతని పర్యటనలో తానూ స్వయంగా తెలుసుకుంటున్న విషయాలమీదనే అతని దృష్టంతా ఉంది. పెట్టిన రొట్టె కొన్ని ఫలములు ఎటువంటి అభ్యంతరం లేకుండా తినేసాడు.
అంతలో ఉన్నట్లుండి చల్లగాలి వీచసాగింది. మరి కాస్సేపటిలో దాని ఉధృతి పెరిగింది. అక్కడ ఉన్న భటులకు ఆందోళన పెరిగింది. గురువుగారేమో పెద్దవారు. రాకుమారులా నవ యువకులు. ఈ ఈదురుగాలి బాగా పెరిగి వానపడితే ఇద్దరూ ఆ గుడారంలో తలదాచుకోలేరు. తప్పకుండా తడిచి పోతారు. ఒకవేళ వాన బాగా పెరిగి కుంభవృష్టిగా మారితే అందరూ ఇబ్బంది పడవలసిందే. అందుకే గురువుగారితో ఈ విషయం చర్చించారు.
“గురువుగారు..! మరి కాసేపట్లో పెద్దవాన కురిసేలా ఉంది మీ అందరిని తక్షణం సురక్షితమయిన ప్రదేశానికి తరలించాలి మీరు అశ్వంమీద ప్రయాణం చేయగలరా మిమ్ముల్ని భటులు పక్క ఊరిలోకి తీసుకెళతారు.” గుణాధీశుడు అన్నాడు.
“నన్ను సరే ఎలాగయినా తీసుకెళతారు. కానీ రాకుమారులు వారు, వాన పడుతుంది పక్క ఊరికి వెళదాం అంటే రారు. రాజు కావలసిన వాడు ఎండకు వానకు దడిస్తే ఎట్లా అని సులువుగా అనేస్తారు. అలాగని ఇక్కడే ఉంటే వర్షంవల్ల వారు అనారోగ్యంపాలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాణి మాలినీదేవి వారి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన పడుతున్నారు..” సాలోచనగా అన్నారు.
“సరే మీరు కూడా త్వరగా రొట్టెలు తిని అశ్వములను సిద్ధం చేయండి. నేను రాకుమారునితో మాట్లాడి ప్రయాణం చేయిస్తాను.” అన్నారు గురువుగారు.
గాలి అంతకంతకు పెరిగి గుడారం అంచులు కదిలిపోతున్నాయి. ఇదేమీ పట్టని రాకుమారుడు చూస్తూ వాన పడుతున్న దృశ్యాన్ని గుడారం కిటికీ నుండి చూస్తూ నిలుచున్నారు. జ్ఞానముని రాకుమారుని సమీపించి..
“రాకుమారా ఏమి ఆలోచిస్తున్నారు.. ? అని అడిగాడు
“ఏమున్నది గురువుగారు..! చిరుజల్లు పడుతున్నది. ప్రకృతి రమణీయంగా మారింది. మట్టివాసన బహు బాగున్నది. ఈ వానలో తడవవలెనని మనస్సువ్విళ్ళూరుతున్నది.”
“రాకుమారా మట్టి వాసనలు తెలిసినాయి. ప్రకృతి రమణీయత తెలిసింది. రాకుమారులు.. ఈ దేశానికి కాబోయే రాజుగారు ప్రకృతి ఆరాధకులు అవ్వడం మంచిదే. కానీ మనం వచ్చిన కార్యం మరచుట మంచిదా నాయనా..?”
“వచ్చిన పని మరిచానా.? ఎందులకు అట్లా అంటున్నారు గురువర్యా..? ఆశ్చర్యంగా అడిగాడు
“మీరు సామాన్య ప్రజలనూ, వారి జీవితాలను దగ్గరనుండి పరిశీలించడానికి వచ్చారు. పల్లెల్లోనూ నగరాల్లోనూ సామాన్యప్రజల జీవనం ఎటుల ఉన్నదో తెలుసుకొనుటకు వచ్చారు. అవునా ..?
“అవును.. “
“అటులయిన ఇట్టి సమయమున ప్రకృతిని ఆరాధించుటకంటే.. ఇట్టి అకాల వర్ష సమయాన పల్లె ప్రజలు జీవనం ఎట్లా ఉంటుందో ఎందుకు పరిశీలించకూడదు.? మీరు అలా పర్యటిద్దాం అంటే ఇక్కడకు చాల దగ్గరలో ఒక పల్లె ఉన్నది కూడా..”
“నిజమే గురువుగారు..! నిక్కము పలికినారు. సరయిన సమయానికి నాకు కర్తవ్యాన్ని గుర్తుచేశారు. మనం తక్షణం ఈ అకాలవర్షంలో ప్రజల ఇబ్బందులు తెలుసుకొని తీరాలి. భటులారా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.” ఒకింత వేగిరపాటుగా అన్నాడు సిద్ధార్థుడు. గురువుగారు భటులకు సైగ చేయగా వారు అశ్వములను సిద్ధం చేయుటకు బదులుగా గుర్రపుబండిని సిద్ధం చేశారు.
“కుమారా..! గుర్రపుబండి వద్దు అనవద్దు. అసలే వాన మొదలయ్యింది. ఆపయినా కాస్త నా వయసును గురించి అలోచించి వచ్చి నా పక్కన కూర్చోనుము.” అని చెప్పాడు జ్ఞానముని. సిద్ధార్థుడు మారు మాట్లాడకుండా గురువుగారి ప్రక్కన కూర్చున్నాడు.
బండి శరవేగంతో ముందుకు సాగిపోయింది. కానీ ఆ పల్లె చేరడం చాల కష్టం అయ్యింది. వర్షం బాగా పెరగడంతో జడి వానలో కూర్చోవడం కూడా చాల ఇబ్బందిగా తయారయ్యింది. అతి కష్టం మీద దగ్గరలోని పల్లెకు చేరుకున్నారు. ఆరబోసిన పత్తినీ మిరపకాయలనూ లోపలి చేర్చుకుంటూ కొందరు రైతులు.. గాలికి కదిలి పోతున్న ఇంటి పై కప్పులను కూలిపోకుండా కాపాడుకుంటూ కొందరూ కనపడ్డారు. కొందరు ఇంట్లోనే ఉండి భయంగా భయంగా తొంగి చూడడం కనపడింది.
పిల్లలు వరండాలో నిల్చొని పడవలు చేసి నీళ్ళల్లోకి వదులుతున్నారు. మరి కొందరు ధాన్యాన్ని లోపలి చేరవేసుకోవడానిని చాలా పాట్లు పడసాగారు. కొందరు పశువులు తడిచి పోకుండా చూసుకోవడంలో మునిగి పోయారు. కొందరు అయ్యో కళ్ళంలోని పంట ఏమవుతోందో అని వాపోసాగారు. సిద్ధార్థుడు, గుణాధీశుణ్ణి తీసుకుని ఇలా ఆ పల్లెలో మూడు నాలుగు వీధులు తిరిగి వచ్చాడు. కాసేపటికి వాన మరింత విపరీతంగా కురవసాగింది. చెట్టుకింద నిలిచిన గురువుగారిని సిద్ధార్థుని గుణాధీశుణ్ణి చూసి ఒక గృహస్థు బయటకు వచ్చి..
“ఓయి బాటసారులారా.! ఎవరు మీరు.? ఇంత జడివానలో ఎక్కడకు తిరుగుతున్నారు.?” అని అడిగాడు.
“మేము తివాచీల వ్యాపారులం. వ్యాపారనిమిత్తం ఈ పల్లెకు వచ్చాము.” అన్నాడు సిద్ధార్థుడు.
“అయ్యా..! మీరు తివాచీలు కొంటారో..! అమ్ముతారోగాని బాగా తడిచిపోయారు. ముందు లోనికిరండి. తలలు తుడుచుకుని పొడి దుస్తులు మార్చుకుని కాస్త సేదతీరండి. ఆ తరువాత మాట్లాడుకుందాం.” అన్నాడు.
“నిజంగా తామెవరో..! అతనెవరో..!” అతని కరుణాపూరిత వాఖ్యాలకు సిద్దార్థుడు, జ్ఞానముని కరిగిపోయారు.
తలలు తుడుచుకుని, దుస్తులు మార్చుకుని అక్కడి పరిసరాలు బాగా గమనించారు. అక్కడ ఆ ఇంట్లో అప్పటికే చాలమంది ఆడవారు చేరి ఆందోళనగా ఏదో మాట్లాడుకుంటున్నారు. లోనికి బయటకు తిరుగుతున్నారు. ఇంతలో ఎవరో పెద్దగా అరుస్తుండడం విని సిద్ధార్థుడు చాలా ఆందోళన పడ్డాడు.
“బాబు మా అమ్మాయికి ఇది ప్రసవ సమయం. అందుకే చుట్టుపక్కల ఆడవారు వచ్చి ఉన్నారు లోపల మంత్రిసాని ఉన్నది. నా కూతురు నెప్పులు తట్టుకోలేక చాలా అవస్థ పడుతున్నది.” అని చాల విచారంగా చెప్పాడు.
గురువుగారు అతనికి ధైర్యవచనాలు చెప్పారు కానీ సిద్దార్థుడు ఒక స్త్రీ బిడ్డకు జన్మ నివ్వడానికి ఎంతటి బాధను అనుభవిస్తున్నదో మొదటిసారి చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఒక అరగంట ఆమె బాధతో తీవ్రంగా అరిచిన తరువాత మంత్రసాని వచ్చి..
“అయ్యా మీ అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది.” అని చెప్పింది.
“మహాలక్ష్మి పుట్టిందన్నమాట. మంచిఘడియలోనే పుట్టిందిలే. ఆ తల్లిని సంతోషంగా ఉండమను” అని అన్నారు గురువుగారు.
“అయ్యో..! ఆడపిల్లట. మళ్ళీ ఆడపిల్లేనట.! అంటూ అందరూ గుసగుసలు పోయారు.
“అయ్యో దేవుడా.! మళ్ళీ ఆడపిల్లే పుట్టిందా.? ఓ భగవంతుడా మాకెందుకింత క్షోభ.! తల్లీ నా కూతురికి, దానికి పుట్టిన బిడ్డకు ఇంత విషమిచ్చి చంపెయ్యమ్మా.” అని పెద్దగా అంటూ ఏడవసాగాడు… ఆ ఇంటి యజమాని.
“అదేమిటండీ అంతమాట అంటారు.? ఇప్పుడే కదా మాతో ఏంతో కరుణగా దయగా మాట్లాడారు. మేమెవరో తెలియని మాకు ఆశ్రయమిచ్చారు. అలాంటిది ఇపుడే పుట్టిన బిడ్డనూ, మీ కడుపున బుట్టిన బిడ్డనూ చంపెయ్యమంటారా.? ఇదెక్కడి అన్యాయమండీ.?”అడిగేసాడు సిద్ధార్థుడు. గురువుగారి కంటి సైగలను కూడా పట్టించుకోకుండా.
“అవునయ్యా నా కూతురిని నేను చంపేయ్యమంటున్నాను. నేను కరుణామయుణ్ణి కాను కసాయి వాడిని. నా కూతురిని నేను చంపకుంటే అక్కడ దాని అత్తింటి వాళ్ళు రోజు రోజు దాన్ని చంపుకుతింటారు. మళ్ళీ ఆడపిల్లని కన్నావు కదే అని దాన్ని తిట్టడమే కాదు నా అల్లునికి మళ్ళీ పెళ్లి చేస్తాము అంటారు. నా కూతురు పిచ్చిదయిపోతుందయ్యా.!” మళ్ళే కంటతడి పెట్టాడు. సిద్ధార్థుడు తెల్ల ముఖం వేసుకుని అన్నీ వింటున్నాడు.
అతను ఉన్మాదిలా” దానికింత విషమిచ్చి చంపేయి..” అని ఆతను అరుస్తుంటే చుట్టూ చేరిన అతని భార్యా అతని బంధువులు ఓదారుస్తున్నారు..
“కుమార రాజా వారు వర్షంలో తడవకూడదని తెలివిగా పల్లెకు తెచ్చాను” అనుకుని సంబరపడుతున్న జ్ఞానముని “అయ్యో ఎందుకు సిద్దార్ధుణ్ణి ఇక్కడకు తీసుకోవచ్చానా?” అని బాధ పడసాగాడు. కానీ చిత్రంగా సిద్ధార్థుడు గురువుగారిని సమీపించి..
“గురువర్యా ఈ రాత్రి నన్ను ఇక్కడకు తీసుకువఛ్చి నాకు ఎంతో మేలు చేశారు. మీకు బహుదా ధన్యవాదాలు.” అని చెప్పాడు. ఈ లోగా భటులు వచ్చి పల్ల్లెలో మరో చోట ఒక రాచ అధికారి ఇంట బస ఏర్పాటు చేశాము రమ్మని గురు శిష్యులను పిలుచుకు వెళ్లారు.
(ఇంకా ఉంది)