వెంకన్న స్వామి ఆవేదనకు అక్షర రూపం ‘సప్తగిరీశా’ కవిత

0
4

[ప్రముఖ కవి, విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి, శ్రీ గంటా మనోహర్ రెడ్డి కలం నుండి జాలువారిన ‘సప్తగిరీశా’ అనే శీర్షిక గల కవిత పై విశ్లేషణా వ్యాసం అందిస్తున్నారు నరేంద్ర సందినేని]

[dropcap]తె[/dropcap]లుగు భాష చైతన్య సమితి సంస్థ ప్రచురించిన ‘శ్రీ వేంకటేశ్వర వైభవం’ కవితా సంకలనంలోని గంటా మనోహర్ రెడ్డి రచించిన ‘సప్తగిరీశా’ కవిత ఇది. ‘సప్తగిరీశా’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. కవిత నాకు చాలా నచ్చింది. నన్ను ఆలోచింపజేసింది. సప్తగిరీశా అంటే ఎవరు? సప్తగిరులపై వెలసిన శ్రీనివాసుడు అని అర్థమవుతుంది. తిరుమలలో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలు 1) శేషాద్రి 2) నీలాద్రి 3) గరుడాద్రి 4) అంజనాద్రి 5) వృషభాద్రి 6) నారాయణద్రి 7) వెంకటాద్రి. పచ్చని లోయలు, జలపాతాలు,అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులతో ఒక్కో శైలానిది ఒక్కో చరిత్ర అని చెప్పవచ్చు.

‘వెంకన్న స్వామి!

నీకేం? అనుకుంటుంది ఈ లోకం’

ఏడుకొండల పైన వెలసిన వెంకన్న స్వామి మహా విష్ణువు అవతారం అని చెప్పవచ్చు. వెంకన్న స్వామి వద్ద సకలం ఉన్నాయి. స్వామి గొప్పవాడు అనుకుంటుంది ఈ లోకం. స్వామి గొప్పతనాన్ని లోకం వేనోళ్ల కీర్తిస్తుంటుంది.

‘నీ ఆవేదన ఎవరికి తెలుస్తుంది?’

వెంకన్న స్వామికి ఆవేదన ఉంటుందా? అని మనలో సందేహాలు పొడచూపవచ్చు. అవును వెంకన్న స్వామికి ఆవేదన ఉంటుంది. కవి మనోహర్ రెడ్డి వెంకన్న స్వామి గురించి ఆలోచించారు. వెంకన్న స్వామికి గల ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు.

‘వచ్చిన ఆదాయం వడ్డీల చెల్లింపులకే సరిపాయే

అప్పులు ఎగ్గొట్టడానికి నీకు మనసు రాకపాయె

కుబేరుడి అప్పు తీరేదెన్నడో

కులాసాగా నీవు ఉండేదెన్నడో’

వెంకటేశ్వర స్వామి సందర్శనానికి భక్తులు ఏటా లక్షలాది మంది వస్తుంటారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు హుండీలో డబ్బులు వేస్తుంటారు. తిరుమలకు వచ్చిన భక్తులు హుండీలో వేసిన డబ్బులతో కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటుంది. అన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చినప్పటికి స్వామివారు ఆ డబ్బులు వడ్డీ చెల్లింపులకు సరిపోతుంది, స్వామి వారి వద్ద డబ్బులు మిగడం లేదంటున్నారు. వెంకన్న స్వామి డబ్బులు అప్పులు ఎగ్గొట్టే బాపతు కాదు. స్వామి నిజాయితీపరుడు. స్వామి న్యాయంగా మెదులుతారనే పేరు ఉంది. మనదేశంలో వ్యాపారవేత్తలుగా పేరుపొందిన కొందరు బ్యాంకులను కొల్లగొట్టి విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారికి ఎలాంటి శిక్షలు లేవు. స్వామివారు అప్పులు తీర్చే పనులు నిమగ్నమై ఉంటారు. స్వామివారికి అప్పులు ఎగ్గొట్టే ఆలోచన ఆయన మనసులోకి రాదు. వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర చేసిన అప్పు ఎలా తీరుతుంది? అని ప్రశ్నిస్తున్నారు కవి. వెంకటేశ్వర స్వామి ఆనందంగా ఉల్లాసంగా ఎప్పుడు ఉంటాడని ప్రశ్నిస్తున్నారు. స్వామివారి ఆనందం కోసం కవి మనోహర్ రెడ్డి తపిస్తున్నారు. వెంకన్న స్వామి గురించి ఆలోచించే వాళ్ళు ఈ కలియుగంలో ఎవ్వరు ఉండరు అని చెప్పవచ్చు. కాని కవి మనోహర్ రెడ్డి వెంకన్న స్వామి గురించి ఆలోచించడం చక్కగా ఉంది.

‘ఇద్దరు దేవేరులున్నా

ఏ కాంతా చింతలేని

ఏకాంత సేవ నీది’

వెంకటేశ్వర స్వామికి ఇద్దరు పట్టపురాణులు ఉన్నారు. ఇద్దరు పట్టపురాణులు ఉండి కూడా ఏ పట్టపురాణి కూడా వెంకన్న స్వామి చెంత ఉండి ఆయనను సేవించడం లేదు. వెంకన్న స్వామికి ఇద్దరు పట్టపురాణులు ఉన్నప్పటికీ ఏకాంత సేవ నీది అనడం, స్వామి వారు ఏకాంత సేవలోనే గడుపుతున్నారు అనడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వెంకన్న స్వామికి ఏకాంత సేవ ఉంటుందా? స్వామివారు ఏకాంత సేవలో గడుపుతున్నారని కవి మనోహర్ రెడ్డికి ఎలా తెలిసింది? స్వామి వారి గురించి అలోచించి స్వామివారి ఏకాంత సేవ గురించి తెలియజేయడం భావం చక్కగా ఉంది.

‘గుండెను రాయి చేసుకుని

భార్య వియోగ బాధను భరించిన

రామావతారుడివి కదా’

కలియుగ వెంకటేశ్వర స్వామిని రాముని అవతారం అంటున్నారు. రావణుడు సీతను అపహరించగా రాముడు గుండెను రాయి చేసుకున్నాడు. రాముడు సీతా వియోగ బాధను అనుభవించాడు. అట్లాంటి రాముని అవతారం వెంకన్న స్వామి అని కవి మనోహర్ రెడ్డి అంటున్నారు.

‘ఇప్పుడు రాయిగా మారావేమిటి స్వామి?’

వెంకన్న స్వామి రాయిగా మారడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నాడు. నిజంగా వెంకన్న స్వామి రాయిగా మారి తిరుమలలో కొలువై ఉన్నాడు. స్వామి నీవు రాయిగా ఎందుకు మారినావు? రాతి విగ్రహంలో స్వామి కొలువై ఉంటే ఎలా? అని మనలో ప్రశ్నలు తలెత్తుతాయి. రాయిగా మారిన వెంకన్న స్వామికి ప్రజల ఈతి బాధలు ఎలా అర్థమవుతాయి. రాయికి హృదయం ఉండదు. రాయి మనిషిలా ఆలోచించదు. రాయి హృదయం కరగదు. కరగని రాయిలా ఎలా ఉండిపోయావు స్వామి? అని కవి మనోహర్ రెడ్డి ప్రశ్నించడం చక్కగా ఉంది.

‘కొల్హాపూర్ దేవేరి అలక తీరేదెన్నడో?

తిరుచానూరు అమ్మవారు నీ చేరువ చేరేదెన్నడో?’

కొల్హాపూర్‌లో కొలువైయున్న మహాలక్ష్మి మాత వెంకన్న స్వామిపై కోపంతో అలిగింది. ఆ మహాలక్ష్మి అమ్మ వారి అలక ఎలా తీరుతుంది. స్వామీ, మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి నీవు ఎప్పుడు వెళ్తావు అని ప్రశ్నిస్తున్నారు కవి. తిరుచానూరు పద్మావతి దేవి నీ సన్నిధికి ఎప్పుడు చేరుతుంది, స్వామీ పద్మావతి దేవి నీతో ఎప్పుడు కలిసి ఉంటుంది అని కవి మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

‘నిరంతర ఊరేగింపులే గాని

ఊరడింపులకి నోచుకోని స్వామివి నీవు’

తిరుమలలో వెంకటేశ్వర స్వామికి రకరకాల పూజలు చేస్తూ స్వామివారిని ఊరేగిస్తుంటారు. స్వామిని ఓదార్చేవాళ్ళు ఎవ్వరు లేరు. స్వామిని ఓదార్చి ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవారు ఎవ్వరూ లేరు. స్వామి వారి ఓదార్పు గురించి కవి మనోహర్ రెడ్డి భావం చక్కగా వ్యక్తం చేశారు.

‘కోరికల బాకాలతో నిన్ను

నిద్రకు దూరం చేస్తున్న

మనుషులం మేము’

కోరిక అనగా ఏదైనా వస్తువు, పదార్థము లేదా వ్యక్తికి కావాలని అనిపించడం. ఒక కోరిక తీరగానే మరో కోరిక ఏర్పడుతుంది. అసలు మానవునికి వచ్చే అన్ని కోరికలు తీరడం సాధ్యం కాదు. మనుషులు కోరికల బాజాలు వాయిస్తూ స్వామి నిన్ను నిద్రపోనియడం లేదు. మనుషులు అవసరమైన న్యాయమైన కోరికలు కోరాలి. కాని మనుషులు అనవసరమైన కోరికలు కూడా కోరుతూ స్వామివారిని ఇబ్బంది పెడుతున్నారు. ఏడుకొండలు ఎక్కి వెంకన్న స్వామిని దర్శిస్తే కోర్కెలు తీర్చే దేవుడు అని చెప్తున్నారు. వెంకన్న స్వామిని నిద్రపోనీయడం లేదు. మనుషుల కోరికల తీరు గురించి ప్రశ్నిస్తున్నారు కవి. వెంకన్న స్వామి కూడా నిద్రపోవాలి. వెంకన్న స్వామి నిద్రపోతేనే మనుషుల కోరికలు సరైనవేనా అని స్పందించి న్యాయం చేయగలరు. మనుషుల మతిమాలిన కోరికలు ఉంటే స్వామివారు వాటిని విస్మరించగలరు. వెంకన్న స్వామికి గుబులు పుట్టిస్తున్న మనుషుల కోరికల తీరు గురించి కవి మనోహర్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు.

‘అన్నమయ్య మళ్లీ జన్మించి జోల పాట పాడేదెన్నడో

ఓ తండ్రి! హాయిగా నీవు నిద్రపోయేదెన్నడో’

అన్నమయ్య వెంకన్న స్వామి పై వేలాది పాటలు రాశాడు. ‘అన్నమయ్య నీకు జోల పాట పాడి నిన్ను నిద్రపుచ్చేవాడు. అన్నమయ్య ఈ గడ్డపై మళ్లీ జన్మించాలి. అన్నమయ్య స్వామి వారికి తన్మయత్వంతో జోల పాట పాడి నిన్ను నిద్రపుచ్చాలి’. అన్నమయ్య మళ్లీ వచ్చి జోల పాట పాడితే వెంకన్న స్వామి హాయిగా నిద్రపోతాడు అని కవి మనోహర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. కవి మనోహర్ రెడ్డి మరిన్ని కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


గంటా మనోహర్ రెడ్డి తేది 13-10-1957న రైతు కుటుంబంలో జన్మించారు. ఇబ్రహీంపూర్ గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లాకు చెందినవారు. తల్లిదండ్రులు సత్యమ్మ, తండ్రి నరసింహారెడ్డి. తండ్రి నరసింహారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. నానమ్మ సందమ్మ, తాత మాణిక్ రెడ్డి. తాత మాణిక్ రెడ్డి కూడా రైతే. మనోహర్ రెడ్డి ప్రాథమిక విద్య ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లోనూ, దుద్యాల ప్రభుత్వ పాఠశాల  లోనూ సాగింది. మాధ్యవిక విద్య జడ్.పి.హెచ్.ఎస్. ప్రభుత్వ పాఠశాల కొడంగల్‌లో. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కొడంగల్‌లో చదివారు. డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్‍౬లో చదివారు. ఈడి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ మహబూబ్ నగర్‌లో చేశారు. ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, హైదరాబాద్‌లో చదివారు. ఎం.ఫిల్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, హైదరాబాద్‌‍లో చదివారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ నుండి డిప్లమా ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (డీ.డీ.ఇ) పట్టా పొందారు. మనోహర్ రెడ్డి 24-09-1983 నాదు జడ్.పి.హెచ్.ఎస్. ప్రభుత్వ పాఠశాల కనకమామిడి, టీచర్‌గా అపాయింట్ అయ్యారు. 1990 సంవత్సరం వరకు టీచర్ గా పనిచేశారు. మనోహర్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి గ్రూప్ 2 ఏ లో సెలెక్ట్ అయ్యారు. తేది 09-02-1990 నాడు సహాయ వాణిజ్య పన్నుల అధికారిగా హైదరాబాదులో అపాయింట్ అయ్యారు. వివిధ హోదాల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల అధికారిగా తేది 31-03-2016 నాడు రిటైర్ అయ్యారు.

24-04-1983 రోజున మనోహర్ రెడ్డి వివాహం శోభా రాణితో మోకిల గ్రామంలో జరిగింది. మనోహర్ రెడ్డి,అత్తా మామలు పట్లోల్ల సంగమ్మ, నారాయణ రెడ్డి, మోకీల గ్రామం,శంకర్ పల్లి మండలం,రంగారెడ్డి జిల్లా కు చెందిన వారు. మనోహర్ రెడ్డి,శోభా రాణి దంపతులకు ముగ్గురు సంతానం.

గంటా మనోహర్ రెడ్డి రచిన ‘ఘంటా పథం’ (1981) కవితా సంపుటి; ‘తారా పథం’ నవల(1981) పుస్తక రూపంలో వెలువడ్డాయి. వీరి కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.

వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ‘ఘంటారావం’ మినీ కవితల ధారావాహిక ప్రసారం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనోహర్ రెడ్డి హైదరాబాద్‍లో స్వగృహంలో భార్యా, పిల్లలు, మనుమలు, మనుమరాల్లతో విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడుపుతున్నారు. మనోహర్ రెడ్డి వివిధ సాహిత్య సంస్థల సమావేశాలలో పాల్గొంటూ – సాహిత్య పఠనం కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here