నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-43

1
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

హైదరాబాదులో  క్యాంప్‍బెల్ జాన్సన్ ..

[dropcap]తా[/dropcap]ను భారత్ వదిలి వెళ్ళే లోగా హైదరాబాద్ సమస్యను పరిష్కరించాలని కంకణం కట్టుకున్నాడు మౌంట్‍బాటెన్. తన పదవీ కాలాన్ని  హైదరాబాద్ సమస్య పరిష్కారం సాధన ద్వారా  విజయవంతంగా ముగిద్దామని ఆలోచించాడు మౌంట్‍బాటెన్.

మే ఒకటవ తారీఖున ఆయన నిజమ్‍కు ఓ లేఖ వ్రాశాడు. ఇంకా ఆరు వారాల  కాలంలో తాను భారత్ విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతాడు,  కాబట్టి నిజామ్ ఢిల్లీ వచ్చి తనను కలవగలడా అని అడిగాడా ఉత్తరంలో.

అంతకు ముందు డిసెంబరు నెలలో నేను మౌంట్‍బాటెన్‍ను కలిసినప్పుడు హైదరాబాద్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో తన పద్ధతిని చెప్పాడు నాతో. ఒక్కసారి నిజామ్ ఢిల్లీ వస్తే, భారత్‍తో విలీనం ఒప్పందంపై ఆయనతో సంతకం పెట్టించటం అంత కష్టం కాదు అన్నది అతని అభిప్రాయం. దాంతో సమస్య పరిష్కారమైపోతుంది. ఈ తన ఆలోచననను ఆచరణలో పెట్టాలని ప్రయత్నించాడు. నిజామ్ ఢిల్లీ వస్తే, ఆయనతో సంతకం పెట్టించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు మౌంట్‍బాటెన్.

ఇంగ్లండ్‍లో నిజామ్ తరఫున వాల్టర్ మాంక్టన్ తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాడు. లేబర్ పార్టీ ప్రభుత్వంతో చర్చలు ఆరంభించాడు.

మౌంట్‍బాటెన్ బెంగుళూరు పర్యటనలో ఉన్నప్పుడు, సర్ మీర్జా ఇస్మాయిల్ – గవర్నర్ జనరల్‍కూ, నిజామ్‍కూ నడుమ సమావేశం ఏర్పాటును ప్రస్తావించాడు. హోష్ ద్వారా నిజామ్ మీర్జా ఇస్మాయిల్‍కు సమాచారాన్ని అందించేవాడు. 1 మే 1948న మీర్జా, మౌంట్‍బాటెన్‍కు ఉత్తరం వ్రాశాడు.

“మీరు మీ అభిప్రాయాన్ని మరింత శక్తిమంతంగా వివరించి ఉండాల్సింది. అతని అభిప్రాయాలు విని ఉండాల్సింది. ఈ రకంగా సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయి ఉండేది. ఈ విషయంలో నేను ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు.” [మై పబ్లిక్ లైఫ్, సర్ మీర్జా ఇస్మాయిల్, పేజీ 112]

నాతో తాను స్వయంగానూ, హోష్ ద్వారానూ సర్ మీర్జా చర్చిస్తుండేవాడు. అయితే అంత తెలివైన రాజకీయవేత్త కూడా అలా హజ్రత్ గురించి సరైన అంచనా వేయలేకపోవటం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది.

అనారోగ్యం నుంచి కోలుకుని ముస్సోరీలో విశ్రాంతి తీసుకుంటున్న సర్దార్‌తో మే నెలలో నేను కొద్ది  కాలం గడిపాను.

హైదరాబాద్ నుంచి నన్ను తప్పించి, నా స్థానంలో ఓ మిలిటరీ అధికారిని నియమించాలని కొందరు సర్దార్‍కు సూచించారు. ఢిల్లీలోని కొందరి అభిప్రాయం ఏమిటంటే, హైదరాబాద్ వ్యవహారాల నుంచి నన్ను దూరం పెడితే, సమస్య త్వరగా పరిష్కృతమవుతుందన్నది. సర్దార్ నా మీద విశ్వాసం ఉంచి, వారి సలహాలను   పెడచెవిన పెడుతున్నాడని వారికి కినుకగా ఉండేది. నాకీ కథ అంతా సర్దార్ నవ్వుతూ చెప్పారు. వారి సూచనలకు తన స్పందనను కూడా చెప్పారు.

నేను  సైనిక పరమైన సంసిద్ధత గురించి తెలుసుకుని ఉండడం కోసం , రక్షణ మంత్రిత్వ శాఖ తోనూ, దక్షిణ కమాండ్ జనరల్ గోడ్డార్డ్ తోనూ, అప్పటి చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మేజర్ జనరల్ చౌధరీ తోనూ మాట్లాడుతూండేవాడిని.

ఒకవేళ ఏదైనా సమస్య ఉత్పన్నమైనతే నేను నా కార్యాలయాన్ని బెంగుళూరుకు మార్చాల్సి ఉంటుంది. మైసూరులో యుద్ధానికి సిద్ధంగా ఉండే నాలుగు బెటాలియన్లను ఏర్పాటు చేయమని నేను సర్దార్‌పై, రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్‍పై ఒత్తిడి తెస్తున్నాను.

ఒకవేళ భారత ప్రభుత్వానికి, హైదరాబాద్‍కు నడుమ ఒప్పందం జరిగే పక్షంలో రజాకార్ల అవసరం తీరుతుంది. అప్పుడు వేల సంఖ్యలో ఉన్న పనిలేని రజాకర్లను, ఇతర ప్రాంతాల నుండి రజాకార్లలో చేరేందుకు హైదరాబాద్ వచ్చిన ముస్లింలను నియంత్రించటం కష్టమవుతుంది. వాళ్ళు శాంతిని ఏర్పాటు చేసే మార్పును స్వీకరించటం, రాజీపడటం కష్టం. అలాంటప్పుడు కనీసం 10,000 సంఖ్యలో సైనిక దళాలు కానీ, పోలీసులు  కానీ సిద్ధంగా లేకపోతే శాంతి ఒప్పందాన్ని అమలు చేయటం కష్టం.

ఒకవేళ ఎలాంటి ఒప్పందం కాకపోతే, సమస్య పరిష్కారం కాకపోతే, రజాకార్లు అడ్డూ అదుపూ లేకుండా విశృంఖల విహారం చేస్తుంటే, అప్పుడు ఈ అశాంతి దక్షిణ భారతంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అరికట్టేందుకు శిక్షణ పొందిన దళాలు అవసరం అవుతాయి.

కాబట్టి పోలీసులతో పాటు శక్తివంతమైన రక్షణ దళాల అవసరం ఉంది. అప్పటి మైసూరు గృహశాఖా మంత్రి శ్రీ మరియప్ప, సహాయ సహాకారాలతో బెటాలియన్లను ఏర్పాటు చేసే పని సులభతరం అయింది.

బెంగుళూరులో నాకు ఓ ఆసక్తికరమైన అనుభవం కలిగింది. ఓ ముసలి బేగం వెంట రాగా, హైదరాబాదు నుంచి వచ్చిన కొందరు అందమైన యువతులు, మైసూరులోని మిలిటరీ అధికారులతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. వాళ్ళు పార్టీలు ఇస్తూ మిలిటరీ వారిని ఆకర్షించసాగారు. నృత్యాలు, డిన్నర్లు,  చాలా సేపటి వరకూ  రాత్రి భోజనాలతో వారి గృహాలు కళకళలాడేయి.

దక్షిణ ప్రాంతాల లోని వారు వేసవి కాలంలో చల్లదనం కోసం బెంగుళూరు వస్తారు. గత సంవత్సరం హైదరాబాదు లోని పెద్ద కుటుంబీకులు, సెలవులో ఉన్న భారత మిలిటరీ అధికారులు వేసవి కాలం ఇక్కడ గడిపారు. 1947 నుండి 1948 నడుమ జరిగిన మార్పులు హఠాత్తుగా సంభవించటంతో, హైదరాబాదు నుంచి వచ్చిన వారు ఏర్పాటు చేసిన పార్టీలలో పాల్గొన్న మిలిటరీ అధికారులు తమ చుట్టూ సంభవిస్తున్న మార్పులను గమనించలేకపోయారు. హైదరాబాదు వారితో స్వేచ్ఛగా మాట్లాడేరు. నిఘా విభాగాల ద్వారా అందిన సమాచారం ప్రకారం వారి సంభాషణలు అధికంగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలలో మిలిటరీ కదలికల గురించి సాగింది.

ఓ వైపు పరిస్థితులు ఇలా సాగుతుండగా, మరో వైపు, హైదరాబాద్‍కు చెందిన తీవ్రమైన రజాకార్ సమర్థకుడు, ఓ ‘పైగా’ జాగీర్దారు, నన్ను హత్య చేసే ఉద్దేశంతో నా కదలికలను రహస్యంగా గమనిస్తున్నాడని తెలిసింది. ఇది తెలుసుకున్న మరియప్ప చురుకుగా నిర్ణయం తీసుకున్నాడు. జాగీర్దారు, అతని మిత్రులను బంధించి జైలులో పెట్టాడు. పార్టీలిస్తూ ఆనందిస్తున్న బేగమ్‍లు హైదరాబాద్‍కు వెళ్ళిపోయారు.

బొంబాయిలోని కొలాబాలోని ఓ ఫ్లాట్‍లో ఓ యువతి, హైదరాబాద్‍కు చెందిన బేగమ్‍లు ఉంటున్నారని, వారు మిలిటరీ అధికారులతో స్నేహం చేస్తున్నారన్న వార్తలు అందాయి. ఆ అమ్మాయి బొంబాయి, షోలాపూర్, పూనా వంటి ప్రాంతాలలోని మిలిటరీ సంబంధిత వివరాల పట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తోందని తెలిసింది. అప్పటి బొంబాయి గృహశాఖామంత్రి మొరార్జీ దేశాయి, నగరం వదిలి వెళ్ళమని ఆమెకు ఆజ్ఞలు జారీ చేశాడు. ఆమె ఈ ఆజ్ఞలను వ్యతిరేకించింది. నిరసన తెలిపింది. ఏడ్చింది. కానీ లాభం లేకపోయింది. ఆమె తల్లి, ఇంగ్లండ్ నుంచి పరుగున వచ్చి దక్షిణ సదన్‍పై దాడి చేసింది.  పెళ్ళికాని పిల్ల, ఒంటరిగా, ఎలాంటి పర్యవేక్షణా లేకుండా బొంబాయిలో అలా ఉండటం మంచిది కాదని ఒక ఆడపిల్ల తండ్రిగా నా నమ్మకం అని ఆమెకు నచ్చచెప్పాను. ఆమె లోని మాతృత్వ భావనలను జాగృతం చేయాలని ప్రయత్నించాను. ఒంటరి యువతి అలా నివసించటం ప్రమాదకరం అని చెప్పాను. కానీ ఆమె విషాదం మాత్రం తగ్గలేదు. తర్వాత తెలిసిందేమిటంటే, హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆ యువతి గ్రీన్‍లాండ్స్‌లో విదేశీ జర్నలిస్టులకు అతిథి మర్యాదలు చేయటంలో చురుకుగా వ్యవహరిస్తోందని.

ఇంతలో ఢిల్లీ లోని ప్రభుత్వానికి ఓ గొప్ప ఆలోచన వచ్చింది. శత్రువులు నిజామ్‍ను చుట్టుముట్టారు. అందుకని ఆయన భయంతో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచలేకపోతున్నాడు. కాబట్టి, మౌంట్‌బాటెన్, పత్రికా వ్యవహారాల అధికారి క్యాంప్‍బెల్ జాన్సన్, దౌత్యాధికారిలా హైదరాబాదు రావాలి. హైదరాబాదు వచ్చి నిజామ్ పరిస్థితిని అంచనా వేయాలి. క్యాంప్‍బెల్ జాన్సన్ అద్భుతం చేసి  నిజామ్‍ను ప్రభావితం చేయాలి. విలీనం సాధ్యమవ్వాలి. నిజామ్‍ను శత్రువుల నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాజ దౌత్యప్రతినిధిగా క్యాంప్‍బెల్ జాన్సన్, హైదరాబాదు ప్రభుత్వంతో, ఢిల్లీ లోని హైదరబాద్ ఏజంట్-జనరల్‍తో సంప్రదింపులు జరుపుతాడు.

వీరి పథకంలో భారత ఏజంట్-జనరల్ అన్నవాడు ఒకడున్నాడన్న స్పృహ కూడా లేదు. క్యాంప్‍బెల్ జాన్సన్ హైదరాబాదు వస్తున్నాడనీ, అతనికి మర్యాదలు చేసి జాగ్రత్తగా చూసుకోమని సర్దార్ నుంచి నాకు సమాచారం అందింది. అతను ఏ ఉద్దేశంతో వస్తున్నాడో నాకు తెలియదు. ఇలా అతను హైదరాబాద్ వ్యవహారాలలో తల దూర్చటం నాకు నచ్చలేదు. క్యాంప్‍బెల్ జాన్సన్ ఏం సాధించాలనుకుంటున్నాడోనని ఆలోచించాను.

నేను వెంటనే హైదరాబాద్ తిరిగి వచ్చాను. క్యాంప్‍బెల్ జాన్సన్ వంటి ప్రధాన వ్యక్తిని తగిన రీతిలో గౌరవించాలి. కాబట్టి, నా సెక్రటరీ అతడిని విమానాశ్రయంలోనే కలిశాడు. దక్షిణ సదన్‍కి డిన్నర్‍ కోసమని ఆహ్వానించాడు. నేను హైదరాబాదులో ఉండటం క్యాంప్‍బెల్ జాన్సన్‍ను ఆశ్చర్యపరిచింది. ఆయన లాయక్ అలీ అతిథి. లాయక్ అలీకి తప్ప ఎవరికీ తన రాక గురించి తెలియదని అతననుకున్నాడు. తనకు ఆతిథ్యం ఇస్తున్న లాయక్ అలీ ఆమోదం తెలిపిన తరువాతనే నా ఆహ్వానాన్ని మన్నిస్తానన్నాడు.

ఇది గమ్మత్తయిన పరిస్థితి. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పంపిన దూత, హైదరాబాదుకు వచ్చాడు. కానీ, అతడు వచ్చింది, నేను ఎంత స్నేహంగా ఉంటాలని ప్రయత్నిస్తున్నా, అన్ని ప్రయత్నాలను తిప్పి కొడుతున్న హైదరాబాద్ ప్రధానమంత్రి అతిథిగా. అతను హైదరాబాద్ ప్రధాని ఇస్తున్న ఆతిథ్యాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నాడు. కానీ అతను హైదరాబాదు ఎందుకు వచ్చాడో, అతడి రాక ఉద్దేశమేమిటో, నాకు ఏ మాత్రం తెలియదు. ఆయన నా ప్రమేయం లేకుండా ఎంతో మందిని సంప్రదిస్తున్నాడు. ఇదంతా నాకు తెలియదని అనుకుంటున్నాడు. ఇదే సమయానికి నిజామ్ కానీ, ఇత్తెహాద్ కానీ ఎన్ని రకాలుగా నన్ను దూషించవచ్చో, నా పట్ల వ్యతిరేకత  ప్రదర్శించవచ్చో, విమర్శించవచ్చో అన్ని రకాల దూషణలు, వ్యతిరేకత, విమర్శలతో నాపై దాడి చేస్తున్నారు. దీన్ని బట్టి నిజామ్‍ మాత్రమే కాదు, మౌంట్‌బాటెన్ కూడా నాకు వ్యతిరేకం అని అర్థమవుతోంది.

క్యాంప్‍బెల్ జాన్సన్ నిజామ్‍ను కలిశాడు. కానీ అతను ఏ అద్భుతాన్ని సాధించేందుకు వచ్చాడో, ఆ అద్భుతాన్ని చేసే అవకాశం అతనికి లభించలేదు. ఎందుకంటే, అతను నిజామ్‍ను ఎన్నిసార్లు కలిసినా, లాయక్ అలీ వెంట ఉండేవాడు. నిజామ్ తన పట్టు వదలలేదు. ఎట్టి పరిస్థితులలోనూ తాను ఢిల్లీ రానని పట్టుదలగా చెప్పాడు నిజామ్. హైదరాబాద్ వచ్చే సమయం గవర్నర్ జనరల్‍కు లేదు. కాబట్టి ఇక్కడి నుంచే వీడ్కోలు పలకటం తప్ప నిజామ్ ఏం చేయగలడు? అయినా ఒక్క నెలలో మౌట్‍బాటెన్ ఏం సాధించాలనుకుంటున్నాడు?

రాజకీయ పరంగా నిజామ్ గమ్మత్తయిన హాస్య చతురతను ప్రదర్శించాడు. తాను నిస్సహాయుడనని అన్నాడు. తాను హైదరాబాదుకు రాజ్యంగ పరంగా అధికారి మాత్రమే. క్యాబినెట్‍ను సంప్రదించకుండా తానే నిర్ణయం తీసుకోలేనని అన్నాడు. వ్యక్తిగతంగా తానెలాంటి హామీలు ఇవ్వలేనన్నాడు. అదే సమయానికి రాజ్యాంగ పరమైన రాచరికానికి అర్థం లేదన్నాడు. క్యాంప్‍బెల్ జాన్సన్‍కు ముస్లిం జీవిత తత్వంపై ఆసక్తి కలిగించాలని ప్రయత్నించాడు.

ఆ రోజు రాత్రి డిన్నర్ కోసమని క్యాంప్‍బెల్ జాన్సన్ నన్ను కలిశాడు. మౌంట్‍బాటెన్ తరఫున తాను వచ్చానని చెప్పాడు. నిజామ్‍ను కలిశాననీ, నిజామ్ ఏమీ చేయలేక, ఏం జరిగితే అదే జరుగుతుందని భావిస్తున్నాడని చెప్పాడు. నిజామ్ తమకు సహాయం చేసేందుకు సిద్ధంగా లేడన్నాడు. ఇప్పటికీ నిజామ్‍కు హైదరాబాదుపై పట్టు ఉందని, అతను తలచుకుంటే పరిస్థితిని చక్కబరచగలడు అని చెప్పాను నేను. అయితే ప్రస్తుతం నిజామ్ పాలన వల్ల కానీ, కమ్యూనిస్టుల వల్ల కానీ సామాన్య ప్రజానీకం అనుభవిస్తున్న బాధల పట్ల క్యాంప్‍బెల్ జాన్సన్‌కు ఎలాంటి ఆసక్తి  ఉన్నట్లు అనిపించలేదు.

మరుసటి రోజు జాన్సన్, లాయక్ అలీ, రజ్వీ, ఎల్ ఎద్రూస్‍తో స్నేహపూరితమైన సంభాషణలు జరిపాడు. నా గురించి విమర్శాపూర్వకమైన వ్యాఖ్యలు విన్నాడు. ఆయన ఓ ప్రెస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. లాయక్ అలీ ఇచ్చిన పార్టీలో కొందరు నాయకులను కూడా కలిశాడు. ఆ పార్టీలో జెనెరివాల్, రజాకార్ల నాయకులు బహిరంగంగానే వాదులాడుకున్నారు. ఆ తరువాత, ఆయన జనరల్ ఎల్ ఎద్రూస్‍తో కలిసి వరంగల్ వెళ్ళాడు. 18వ తారీఖున న్యూఢిల్లీ తిరిగి వెళ్ళిపోయాడు.

 హైదరాబాదు పాలకులలో  భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేని బలహీనమైన స్థితిలో ఉందన్న అభిప్రాయాన్ని క్యాంప్‍బెల్ జాన్సన్ పర్యటన  పెంచింది. రాజు దౌత్యాధికారితో జరిగిన చర్చలు నిజామ్ గర్వాన్ని పెంచాయి, రజాకార్ల అహంకారాన్ని ఇనుమడింపచేశాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here