జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-65

0
11

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

క్ష్మాం సంతాపయతా గాఢమాషాఢేనేవ వారిదాః।
సూహభట్టేన సంశుష్య పరాభూతా యయుర్దిశః॥
(జోనరాజ రాజతరంగిణి 1047)

[dropcap]భా[/dropcap]రతదేశంలోని అన్ని ప్రాంతాలు విదేశీ ముష్కరుల దారుణ మారణకాండను ఏదో ఓ సందర్భంలో అనుభవించాయి. మందిరాల విధ్వంసంతో పాటు, గ్రామాల దహనాలు, లభించిన శాస్త్రాల  దహనాలు జోరుగా సాగాయి. శాస్త్రం తెలిసిన వారనేకులు మతం మారటమో, ప్రాణాలు కోల్పోవటమో సంభవించింది. అక్కడక్కడా కొందరు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతూ కూడా తమ వద్ద ఉన్న శాస్త్రాల ప్రతులను వెంటబెట్టుకుని పారిపోయారు. తరువాత తరాల వారికి వాటి విలువ తెలియక పారేశారు. చెదలు పట్టి పాడయ్యాయి. కొందరు ప్రతులు చేయించారు. అలా చేయించిన ప్రతులలో ఎన్ని మూలాన్ని యథాతథంగా అనుసరించాయో, ఎన్ని వ్రాయసకాండ్రకు అర్థం కాక  రూపాంతరం పొందాయో, ఎన్నిటిలో వ్రాయసకాడి సృజనాత్మకత పరవళ్ళు తొక్కి కొత్త శ్లోకాలను మూలానికి జోడించిందో ఎవరికీ తెలియదు. అసలు ఎన్ని కావ్యాలు, ఎన్ని చారిత్రక రచనలు పరశురామప్రీతి అయి పంచభూతాల్లో కలిసిపోయాయో తెలియదు. మిగిలినవి అక్కడక్కడా శ్లోకాలు సరిగా లేక, వేర్వేరు ప్రతుల్లో భిన్నమైన శ్లోకాల సంఖ్యలతో లభ్యమవుతున్నాయి. ఆ లభ్యమైన వాటిలో ఏది సరైనదో, ఏది చేర్చిన శ్లోకాలతో ఉన్నదో గుర్తించి నిర్ణయించటం కష్టం. ఎంత సాహిత్యాన్ని, ఎంత చరిత్రను, ఎన్ని మహోన్నత వ్యక్తిత్వాలను మనం తిరిగి తెలుసుకోలేనంతగా కోల్పోయామో మనకు తెలియదు. అయినా సరే, జరిగింది తాము కూడా కళ్లారా చూసినట్టు, తమ మనసుల్లో  మొలిచిన ఊహలను నిజమన్నట్టుగా భ్రమిస్తూ, వాదిస్తూ, ప్రచారం చేసే అభ్యుదయ, ఆధునిక మేధావులను చూసి నవ్వాలో, ఏడవాలో, ఆగ్రహించాలో, జాలిపడాలో తెలియదు.

కశ్మీరు వంటి అల్లకల్లోల ప్రాంతంలో రాజతరంగిణితో సహా పలు ప్రాచీన గ్రంథాలు సజీవంగా లభించటం ఒక అద్భుతం. అయితే, జోనరాజ రాజతరంగిణి, కల్హణ రాజతరంగిణి తరువాత రచించినదే అయినా, అక్కడక్కడా అసంపూర్ణమైన శ్లోకాలతో, వేర్వేరు ప్రతులలో వేర్వేరు శ్లోకాల సంఖ్యలతో లభించాయి. అలా అధికంగా ఉన్న శ్లోకాలను, ప్రత్యేకంగా సంఖ్యలతో గుర్తించి, జోనరాజ రాజతరంగిణి చివర పొందుపరిచారు. అలా పొందుపరిచిన వాటిలో 1046 నుంచి 1078 వరకూ ఉన్నాయి. ఈ శ్లోకాలు సరిగ్గా శీర్యభట్టు, సుల్తాన్ జైనులాబిదీన్ రోగం నయం చేయటం, తన రోగం తగ్గిన తరువాత, జైనులాబిదీన్ శీర్యభట్టుకు ఐశ్వర్యాన్ని కానుకగా ఇస్తే, సన్యాసి అందమైన అమ్మాయిల వైపు కన్నెత్తి చూడకుండా తిరస్కరించినట్టు శీర్యభట్టు ఐశ్వర్యాన్ని తిరస్కరించిన తరువాత నుంచీ ఉన్నాయి. ఈ శ్లోకాల తరువాత – సుల్తాన్ వసతి గృహాలు నిర్మించి ఇవ్వటం, మరణించిన మహిళలు సూహభట్టును చూసి వెక్కిరింతగా నవ్వటం వంటి శ్లోకాలు ఉంటాయి. ఈ ప్రత్యేకంగా ఉంచిన శ్లోకాల ఆధారంగా శీర్యభట్టు ఐశ్వర్యాన్ని తిరస్కరించిన తరువాత జరిగిన విషయాలను ఊహించే వీలు చిక్కుతుంది. ఇంతకీ ఈ శ్లోకాలు  జోనరాజు రాసినవా? వేరేవరో రాసినవా అన్న విషయం తేలలేదు.

నిప్పు, గడ్డిని సంపూర్ణంగా బూడిద చేసిన తరువాతనే శాంతిస్తుంది. కానీ దయాళువైన మేఘం వర్షంతో – బూడిదగా మారిన గడ్డిని మళ్ళీ అందమైన పచ్చికబయలుగా మారుస్తుంది అంటూ ఆరంభమవుతాయి ఈ శ్లోకాలు.

ఈ ఉపమానం ఎందుకంటే, హింసించటం ద్వారా సూహభట్టు కశ్మీరును ఎడారి మార్చిన తరువాత, ఎండాకాలంలో ఎండిన మేఘాలు గాలికి తేలిపోయినట్టు, పండితులు కశ్మీరు వదిలి నలుదిశలా పారిపోయారు. ఇప్పుడు దయాళువైన సుల్తాన్, నలుదిశలా పారిపోయిన పండితులను, వారి నుండి విజ్ఞానం గ్రహించేందుకు, గాలి, వానల్లా కశ్మీరు రప్పించాడు అని చెప్పటం కోసం. అంటే దహనమై బూడిదైన కశ్మీరు పండితుల రాకతో మళ్ళీ చిగురించిన పచ్చికబయలు అయిందన్న మాట. అంటే , ఏ స్థాయిలో కశ్మీరు రూపాంతరం చెందిందో ఊహించవచ్చు.

జోనరాజు ఓ శ్లోకంలో కశ్మీరు నుండి జ్ఞానం వెడలనడిచిందనీ, కశ్మీరు జ్ఞానరహితం అయిందనీ, సుల్తాన్ జైనులాబిదీన్ ఆ విజ్ఞాన ప్రవాహాన్ని మళ్ళీ కశ్మీరు వైపుకు ప్రవహింపజేశాడనీ రాశాడు. ఈ శ్లోకం దానికి ప్రతిధ్వనిలా అనిపిస్తుంది.

వర్షా మరుదివ క్ష్మాపస్తద్విద్యా ప్రత్యయోత్సుకః।
అనాయయత్స తాన్సర్వా పండితాన్నిజమండమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1048)

ఎండాకాలం వేడికి అన్నీ ఎండిపోతాయి. వర్షాకాలంలో చల్లగాలి వీస్తుంది. చినుకులు ఎండిన జగతిని చిగురింప చేస్తాయి. మోడుకు ప్రాణం పోస్తాయి. గాలి, వర్షం వచ్చినట్టు పండితులు మళ్ళీ కశ్మీరులో అడుగుపెట్టారు. కశ్మీరు మళ్ళీ చిగురించింది.

ముక్తాహారోపమే దేశే విద్వద్రత్నాని నాయకః।
కాన్త్యా వా సుధియా తత్ర యథాయోగం న్యవీవిషత్॥
(జోనరాజ రాజతరంగిణి 1049)

కశ్మీరుకు ముత్యాల హారం వేసినట్టు, పండితులు, విద్వద్రత్నాలు కశ్మీరంలో అడుగుపెట్టారు. వారి వారి పాండితీ ప్రతిభలకు తగ్గట్టు సుల్తాన్ వారికి పదవులను ఇచ్చి గౌరవించాడు. వారికి కశ్మీరులో స్థిరనివాసం ఏర్పాటు చేశాడు సుల్తాన్.

రాజా సరోతోపితానర్ధవృత్తిదానేన పండితాన్।
ఆప్యాయ యజ్ఞలేనేవ మాలాకరో మహీరుహాన్॥
(జోనరాజ రాజతరంగిణి 1050)

తోటమాలి మొక్కలను నాటి వాటికి నీరు పోసి పెంచినట్టు, సుల్తాన్, పండితులను గౌరవించాడు. వారికి జీవికను ఏర్పాటు చేశాడు.

ఆలోచిస్తే, జైనులాబిదీన్ సాధించిన పని మామూలు పని కాదనిపిస్తుంది. భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయిన వారిని మళ్ళీ కశ్మీరం రప్పించటం ఒక ఎత్తయితే, వారి విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ, వారిని గౌరవిస్తూ, వారికి జీవికను ఏర్పాటు చేయటం, వారు భయం లేకుండా జీవనం కొనసాగించేట్టు చేయటం సామాన్యమైన విషయం కాదు.

నాశితం సూహభట్టేన యద్యాత్కశ్మీర మండలే।
యోజితం శీర్యభట్టేన రాజ ప్రార్థనాయాథ్ తత్॥
(జోనరాజ రాజతరంగిణి 1051)

రాజు ప్రార్థనను పురస్కరించుకుని, కశ్మీరులో సూహభట్టు నాశనం చేసిన దాన్నంతా శీర్యభట్టు పునరుద్ధరించాడు.

సుల్తాన్ అందించిన ఐశ్వర్యాన్ని కాదని, కశ్మీరులో మళ్ళీ పండితుల నివాసాలు ఏర్పాటు చేయాలని శీర్యభట్టు కోరాడని ఒక కథ ప్రచారంలో ఉంది. కానీ ప్రక్షిప్తాలుగా భావిస్తున్న ఈ శ్లోకాలలో కూడా అలాంటి కథ లేదు. రాజు అభ్యర్థనను అనుసరించి, శీర్యభట్టు తన తోటి పండితులను కశ్మీరంలోకి రప్పించటం ద్వారా, సూహభట్టు దుశ్చర్యల వల్ల కశ్మీరానికి జరిగిన నష్టాన్ని పూడ్చాడని అంటున్నదీ  శ్లోకం.

ప్రవర్త్య యుగాయాన్నాది నాగానాం భట్టుశీర్యకః।
తురుష్కా ప హ్యతాం భూమిం విదగ్ధేభ్యో న్యదాపయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1052)

భట్టశీర్యుడు కశ్మీరులో పునరుద్ధరణ ప్రారంభించాడు. తీర్థయాత్రలను పునరుద్ధరించాడు. తురుష్కులు దోచుకుని ఆక్రమించుకున్న భూమిని ఎవరిది వారికి తిరిగి ఇప్పించాడు. అనూహ్యమైన విషయం ఇది ఈ కాలంలో కూడా.

కశ్మీరులో ఆర్టికల్ 370 ని తొలగించటంతోటే, ఇతర ప్రాంతాల వారు తమ ప్రాంతానికి వచ్చేసి, కొనేసి, ఆక్రమించేస్తారని, తమ ప్రత్యేకత పోతుందన్న భయాన్ని పలు కశ్మీరీయులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికీ కశ్మీరులో బయటివారు వచ్చి భూములు కొనలేదు. కానీ అంతా ఒకే దేశం అయినప్పుడు బయటివారు ఎవరు? దేశంలో పలు ప్రాంతాలలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు వచ్చి స్థిరపడుతున్నారు. ఎవరి అస్తిత్వమూ ప్రమాదంలో పడలేదు. తమిళనాడు తమిళులది, బెంగుళూరు కన్నడిగులది, కేరళ మలయాళీలది, ఆంధ్ర తెలంగాణాలు తెలుగు వారివి – ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నది. బయటి నుంచి వచ్చి స్థిరపడిన వారు తాము స్థిరపడిన ప్రాంతం అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క కశ్మీరు మాత్రమే దేశంలోని ఇతర ప్రాంతాల వారి రాక వల్ల తన అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతుంది?

ఇలాంటి ప్రశ్న ఆనాడు ఎవరూ అడిగి ఉండరు. అడిగినా రాజు తన శక్తితో అందరి నోళ్ళూ మూయించి ఉంటాడు. నిరసనను అదిమిపెట్టి ఉంటాడు. ఇది జైనులాబిదీన్ గొప్పతనానికి నిదర్శనం. తాను స్వయంగా ఇస్లామీయుడు అయి ఉండి, కాఫిర్‍లకు నిలువ నీడ లేకుండా చేయాలనే ఛాందసాన్ని అణచిపెట్టి, కాఫిర్‍లకు భద్రత కల్పించి, గౌరవం ఇచ్చి రాజ్యంలో కీలకమైన పదవులనిచ్చి, ఎలాంటి తిరుగుబాటును ఎదుర్కోకుండా యాభై ఏళ్లు పాలించగలిగాడు జైనులాబిదీన్. అందుకే ఒక్కోసారి ప్రపంచంలోని రాజులందరిలోకి అత్యుత్తమ స్థానంలో జైనులాబిదీన్‍ను కూర్చోబెట్టవచ్చనిపిస్తుంది.

ఉదయే దాపితే తేన హిందు కానా మఖండిత।
శీర్యభట్టాయ చుకుపుః సర్వే యవనదానవాః॥
(జోనరాజ రాజతరంగిణి 1053)

ఈ శ్లోకం సున్నితమైనది. సుల్తాన్ నీడలో ఉంటూ జోనరాజు ఇలాంటి శ్లోకం రాయటం, ఇంతవరకూ జోనరాజు భావవ్యక్తీకరణను పరిశీలిస్తే, అనౌచిత్యం అనిపిస్తుంది. అసంబద్ధం అనిపిస్తుంది.

‘హిందు కానా’ అన్న పదం గతంలోనూ వాడేడు జోనరాజు. ‘యవనదానవాః’ అనటం కూడా అనౌచిత్యం అనిపించదు. ఎందుకంటే, గతంలో మిడతల దండుల్లా మ్లేచ్ఛులు, యవనులు, కశ్మీర సంస్కృతిని నాశనం చేశారని అన్నాడు. కానీ మొత్తంగా శ్లోకార్థం చూస్తే, ‘దేవతల శత్రువులు యవనదానవులు’ అనటం, జోనరాజు పద్ధతి కాదనిపిస్తుంది. బ్రాహ్మణులను భూదేవతలుగా భావిస్తారు. పండితుల శత్రువులు కాబట్టి, యవనులను దానవులు అనవచ్చు. దానవులు అంటే దేవతలతో వైరం పూనినవారు. కానీ జోనరాజు ఇంత ఘాటుగా నిజం చెప్పటాన్ని ఊహించటం కష్టం. ఎంతయినా సూహభట్టును రాక్షసుడిగా చిత్రిస్తూ, అతని మీద దోషం నెట్టేసినవాడు ఇంత సూటిగా నిజం చెప్తాడనిపించదు.

ఏది ఏమైనా, పండితుల భూములు పండితులకు ఇప్పించటంలో శీర్యభట్టు యవనులకు శత్రువయ్యాడు అన్నది శ్లోకార్థం. కానీ ఈ శ్లోకాలు చదువుతుంటే పండితులను కశ్మీరులో స్థిరపరిచిన పేరు శీర్యభట్టుకు లభిస్తున్నట్లు తోస్తుంది. కానీ అందుకు జైనులాబిదీన్ ను  బాధ్యుడిని చేస్తేనే జోనరాజుకు లాభం కాబట్టి, ఈ ఖ్యాతి అంతా శీర్యభట్టుకు ఆపాదించిన  శ్లోకాలు జోనరాజు రాశాడనిపించదు.

మహాపద్మాఫణీంద్రాంభః సంభేదేః కుంభకేన సః।
బద్ధోపి దృతివస్థిత్త్యా యవనేంద్రాన్ వ్యలక్షయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1054)

‘మహాపద్మఫణీంద్రాంభ’ – ఆ కాలంలో మహాపద్మఫణీంద్ర సరస్సు పేరు పొందినది, ఈ కాలంలో ‘వులూర్ లేక్’గా గుర్తించారు. ఈ సరస్సు ఒడ్డున కూర్చుని ఊపిరి బిగపట్టి యవనేంద్రుడిపై దృష్టి నిలిపాడు శీర్యభట్టు. ఇంతకు ముందు శ్లోకంలో ‘యవనదానవులు’ అన్నాడు. బహుశా, తపస్సు ద్వారా యవనేంద్రుడిని అదుపులో పెట్టాడు శీర్యభట్టు అని భావమేమో! ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటం కుదరటం లేదని జోనరాజ రాజతరంగిణికి భాష్యం రాసిన పండితులు కూడా అభిప్రాయపడ్డారు.

తాపో యస్యాహ్ని శైలాన్జ్వలయతి స రవిః సాయమక్ష్ణాపిగమ్యః
స్వగ్రావ్ణః శుష్యతోహ్ని ద్రవయతి న శశీ పూరకః సాయమబ్ధేః।
కారుణయ దేవలోకే నిజమతి సకలం స్వేచ్ఛయా దర్శయిత్వా
తం తద్రాగ్యా వసానాత్ప్రథ మమధ మహంస్తూర్ణ మంతర్దధాతి॥
(జోనరాజ రాజతరంగిణి 1055)

ఉదయం పూట కొండలను సైతం మండించే సూర్యుడిని సాయంత్రం కంటితో కూడా చూడవచ్చు. ఉదయం వేడి వల్ల ఎండిపోయిన రాతిని ద్రవీభవింప చేయలేని చంద్రుడు తన వెన్నెలతో సముద్రాన్ని నింపుతాడు. అలాగే ఒక గొప్ప వ్యక్తి ప్రపంచానికి తన తెలివిని, స్థానాన్ని ప్రదర్శిస్తాడు. సమయం అనుకూలం కానప్పుడు తన తెలివిని దాచివేస్తాడు.

కలౌ పాతకినాం పుంసాం స్పర్శదర్శన విహ్వలా।
అవశ్యం శారదా దేవీ తదాంతర్ధాన మాశ్రయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1056)

పాపుల, ధూర్తుల స్పర్శకు, దర్శనానికి భయపడి శారదా దేవి అంతర్ధానమైపోయింది.

ముఖే స్వేదో భుజే కంపః పాదస్పర్శో విదాహితా।
జాతు జాత్వభవద్దేవ్యా నో తదా హి తథా కచిత్॥
(జోనరాజ రాజతరంగిణి 1057)

దేవి పాదాలు తాకినంతనే ముఖం చెమటతో తడిసిపోవటం, భుజాలు కంపించటం గమనించవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడా ఇది కనిపించటం లేదు.

ద్రోహార్జితాద్ధనాద్ భాగం ప్రసాదేన నియుజ్యతి।
కశ్మీర లోకే సా దేవీ నానుగ్రహపరా హ్యభూత్॥
(జోనరాజ రాజతరంగిణి 1058)

ద్రోహ, మోసం, కపటం ద్వారా ఆర్జించిన ధనాన్ని తనకు అర్పించటం పట్ల నిరసనతో దేవి కశ్మీర ప్రజలపై అనుగ్రహాన్ని ప్రసరించేందుకు విముఖంగా ఉంది.

దుర్వామాత్రేన తుష్యంతి విశుద్ధేన హి దేవతాః।
ప్రాణైరపి న మాలిన్య దూషితైర్జాతుచిత్పునః॥
(జోనరాజ రాజతరంగిణి 1059)

భగవంతుడికి పవిత్రమైన మనస్సుతో గడ్డి అర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు. అదే దుష్ట బుద్ధితో తన ప్రాణాన్ని అర్పించినా భగవంతుడికి సంతోషం లేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here