[box type=’note’ fontsize=’16’] వైకల్యంతో ఉన్నవారంతా సమస్యలను అధిగమించి విజయాలు చవి చూడాలన్న లక్ష్యంతో 2003లో గైడింగ్ లైట్ ఫౌండేషన్ని ప్రారంభించారు భవాని శంకర్. ఆ సంస్థలో తానూ భాగమై, సంస్థ కార్యక్రమాలకు ఊతమిచ్చారు గురజాడ శోభ పేరిందేవి. గైడింగ్ లైట్ ఫౌండేషన్ గురించిన ప్రత్యేక వ్యాసమిది. [/box]
సంస్థ నేపథ్యం:
[dropcap]”మా[/dropcap]మ్ మీకొక వ్యక్తిని పరిచేయం చేస్తాను. అతనికి మిమ్మల్ని చూస్తే ప్రాణం లేచి వస్తుంది” అంది నా విద్యార్థిని అనిత. నేను నవ్వి ఊరుకున్నాను.
”నిజం మామ్. రేపు త్యాగరాయ గానసభలో ఘంటసాల అవార్డు అందుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి కార్యక్రమం ఉందిగా. ఆయన మీద మీరు రాసిన ప్రశంసా పత్రం అభినందన వేదిక మీద చదువుతారుగా, అక్కడికి అతన్ని రమ్మంటాను” అని చెప్పి వెళ్ళిపోయింది అనిత.
ఆంధ్రమహిళాసభలో పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (ఓపెన్ యూనివర్సిటీ) విద్యార్ధులకి పాఠాలు చెప్పిన రోజులవి.
మర్నాడు నేను వెళ్ళేటప్పటికే అనిత అక్కడ సిద్ధంగా వుంది. కానీ నాకు తనతో మాట్లాడే టైం లేకపోయింది. అభినందన సంయుక్త కార్యదర్శిగా స్టేజి ఆరంజిమెంట్స్ విషయం మీద దృష్టి పెట్టి వెళ్ళిపోయాను. కార్యక్రమం అయ్యేసరికి తొమ్మిది దాటింది.
అప్పుడు అనిత ఒకతని చేతిని పట్టుకుని నా దగ్గరికి తీసుకొచ్చింది. గాగుల్స్ పెట్టుకున్న అతను కనిపించాడు. అనిత అతన్ని నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం తీసుకువచ్చి ఉంటుంది అనుకున్నాను. నిరాశా నిస్పృహలకు లోనైన వారిని వెన్ను తట్టి ముందుకు నడపడం నా జీవితంలో భాగమైపోయి అప్పటికే చాలా కాలమైంది. నేను సైకియాట్రిస్ట్‌ని కాను. సైకోలోజిస్టుని కాను. డాక్టర్ని అసలే కాను అని యెంత చెప్పినా మీరు సమస్యల్లో వున్నవారిని చూస్తున్నారుగా సహకరిస్తున్నారుగా ఆ అనుభవంతో చెప్పండి అని బ్రతిమాలతారు. దాంతో నాది కానీ కౌన్సిలింగ్ రంగాన్ని నేను చేపట్టే పర్టీస్థితి ఏర్పడింది. ప్రతీ, సమస్యని తపస్సుగా తీసుకుంటూ వచ్చాను. వీలుపడినవి నేను పరిష్కరించినా అసాధ్యమైనవి సoబంధిత నిపుణులవైపుకు మళ్లిస్తుంటాను. ఇతనిది అలాంటిదేదో సమస్య అయ్యి ఉంటుంది. అందుకీ ఏకాంతంలో మాట్లాడాలనుకుంటున్నాడు అనుకున్నాను.
”నమస్కారం మేడమ్” అన్నాడు చలువ కళ్లద్దాల వ్యక్తి నవ్వుతూ. నమస్కారం అన్నాను అతన్నీ పరిశీలనగా చూస్తూ.
”ఇతనికి మీ అవసరం చాలా ఉంది. అందుకే తీసుకుని వచ్చాను” అంది అనిత.
”చెప్పండి” అన్నాను తేరిపార చూస్తూ.
”ఇప్పుడు మీ పరిచయం అయిందిగా రేపు చెప్తాను. నన్ను మీ తమ్ముడు అనుకుంటూ మా అంధులకు మీరు చేయూతగా ఉండి తీరాలండి. ప్లీజ్” గబ గబా అన్నాడు.
నేనేదో చెప్పబోతుండగా ఆపి ”ప్లీజ్ కాదనకండి మమ్మల్ని నీట ముంచినా పాల ముంచినా మీదే భారం.” అన్నాడు…. క్షణం ఆగాడు
”అనిత మీ ఫోన్ నెంబర్ ఇచ్చింది. త్వరలో విపులంగా మాట్లాడతాను. యెంత ప్రయత్నించినా ఇలా ఇక్కడ గబగబా చెప్పలేకపోతున్నాను” అనేసి వెనుతిరిగాడు.
వృద్ధాప్య సమస్యల మీద ఒక పక్కన పీహెచ్‌డీ చేస్తూ మరో పక్కన సేవా కార్యక్రమాలు, వివిధ సంస్థలకు నాటకాలు ప్రశంసా పత్రాలు రాసిస్తూ ఎన్నో సమస్యలు ప్రజల దృష్టికి తెచ్చేలా వృద్ధులు, మహిళలూ ఆర్థికంగా వెనకబడిన వారి అంశాలకై పనిచేస్తూ జర్నలిస్టుగా కూడా చురుకుగా ఉండడం, ఇల్లు, భర్త, పిల్లల చదువు, అమ్మని చూసుకోడం వగైరాలతో అతని సంగతే పూర్తిగా మర్చిపోయాను.
ఒకరోజు అతను కాల్ చేసాడు. ‘మాట్లాడాడు.’ అతని పేరు కరణం భవాని శంకర్. అంధత్వంతో పుట్టిన అతను నాటి నుండి ప్రతీ పనిలోనూ ప్రతీ వ్యక్తితోనూ పోరాడుతూనే ఉన్నాడు. ప్రతీ రోజూ పోరాటమే. ప్రతీ నిముషమూ గెలవాలన్న ఆరాటమే. ”నీకు చేత కాదు” అని ఎవ్వరూ తనని అనకూడదన్న తాపత్రయంతో నిముషం నిముషం ప్రయత్నం…. అది విఫలం కావడం. దారి చెప్పమని ఎవ్వరినడిగినా సరిగ్గా చెప్పకపోడంతో ఎన్నోసార్లు బయటకి వెళ్లినప్పుడు ఇబ్బందులకు గురి కావడం. దాంతో కసిగా ఒంటరిగా తిరిగి ఊర్లోని అన్ని దార్లూ మెదడులో నిక్షిప్తం చేసుకోడం, గతుకుల రోడ్ల మీదా ట్రాఫిక్కు విపరీతంగా వుండే హైవేల మీదా, ఒంటరిగా కావాలని ప్రయాణిస్తూ, అనునిత్యం అన్ని చోట్లా కాలు జారిపడడo, ఒళ్ళంతా గాయాలున్నా మనసులోని గాయాన్ని గూర్చి బాధపడుతూ వుండడం… మరింత కసిగా ప్రయత్నించడం… వగైరాలన్నీ విపులంగా చెప్పాడు.. జాలి, హేళన తప్ప తమమీద సమాజానికి గౌరవం నమ్మకం లేదని వాపోయాడు. ఎన్నో ఆపరేషన్స్ అయ్యాయి. శరీరం పడి పడీ లేచి అతలాకుతలం అయ్యింది. అయినా తగ్గలేదు. ఆగలేదు… కసిగా చదువుకుని బ్యాంకు ఆఫీసర్ అయ్యానని చెప్పుకుపోయాడు… ‘రోజూ ఒంటరిగా రెండు బస్సులు మారుతూ ప్రయాణించడం, మోసాలు ఎదుర్కుంటూ పోవడం అలవాటయ్యాయి. కానీ నా తర్వాతి తరాలవారు ఆ పరిస్థితులను అధిగమించేలా వారిని మలచడం నా లక్ష్యం’ అన్నాడు. అతని పోరాటం నన్ను కదిలించింది. అతనన్న చివరి మాట ఆలోచింప చేసింది.
వైకల్యంతో ఉన్నవారంతా సమస్యలను అధిగమించి విజయాలు చవి చూడాలన్నది అతని లక్ష్యం. ఇంట్లో తల్లి తండ్రులు పట్టించుకోరు. వాళ్ళని మనుషులుగానే చూడరు. బయట పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంటుంది. అలాంటివారికి తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో 2003వ సంవత్సరంలో గైడింగ్ లైట్ ఫౌండేషన్ ని ప్రారంభించాడు భవాని శంకర్.
తోటి వారి విద్యకి, ఉద్యోగానికి సంబంధించిన సలహాలు ఇస్తూ సహకారం అందిస్తూ ఉన్న అతను సంస్థని పెట్టాడు కానీ దాన్ని ముందుకు నడపలేకపోయాడు. ఒకటీ రెండు కార్యక్రమాలు చేసాడు. అవి అతన్ని తృప్తి పరచలేకపోయాయి. ఒక పక్కన ఆర్థిక సమస్యలు, మరో పక్కన అంధత్వం, ఒంటరి పోరాటం, అడుగడుగునా మోసపోవడం వల్ల సంస్థ చీకట్లోనే మిగిలిపోయింది.
”నేను చీకట్లో ఉండిపోయినట్లుగా నా సంస్థ చీకట్లో వుండకూడదు. అంధులకు వెలుగునివ్వాలి’. అనుకున్నాడు. కానీ ఏం చేస్తే సంస్థ వెలుగులోకొస్తుందో అర్థం కాకుండా వుండిపోయాడు. ఆ విషయం అతన్ని నిత్యం బాధిస్తూనే వొచ్చింది.
‘అనిత అంత త్వరగా ఎవ్వరి గురించి ఒక నిర్ణయానికి రాదు. అలాంటి ఆమే మీ చేతిలోకి వస్తే సంస్థ ఎందరికో ఎన్నో విధాలుగా ఉపయోగపడగలుగుతుంది అని మరీ మరీ చెప్పింది. అందుకే ఇంతగా అడుగుతున్నాను. దయచేసి మా సంస్థకి మీరు తోడ్పడండి’ అని అతను మరీ మరీ అడగడంతో గైడింగ్ లైటుని గైడ్ చేసేందుకు నేను నడుము బిగించాను.
నా చేతిలోకొచ్చిన పదేళ్ల పాప లాంటి సంస్థ పదికాలాలపాటు నిలబడాలని నిశ్చయించుకుని భవాని శంకర్‌కి సాయపడడం ప్రారంభించాను. సంస్థకి అతను గుండెకాయ ఐతే నేను కన్నుగా మారాను. వారి సమస్యలను లోతుగా చూసాను. మనస్ఫూర్తిగా సహకరించడం ప్రారంభించాను.
నేను కార్యదర్శిగా భవాని శంకర్ అధ్యక్షుడిగా మా సంస్థ చేసిన ముఖ్య కార్యక్రమాలలో కొన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. నాకీ అవకాశం ఇఛ్చిన సంచికకి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.
వయసులో భవానీశంకర్ కంటే పెద్దదాన్నికావడం, సేవారంగంలోనూ అనుభవం ఉన్నదాన్ని కావడంతో నేను అక్కలాగే అతని మీద అభిమానాన్ని, అధికారాన్ని చూపిస్తూ ఉంటాను. కానీ వారి సమస్యలు వారి సాధకబాధకాలు అతనికే ఎక్కువ తెలుసు కనక ఆ విషయాల్లో నిర్ణయాలు అతనికే వదిలేస్తాను. అన్ని చూసి ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయించుకున్నాకే నిర్వహిస్తాము. ఏది చేసినా మా ఇద్దరిదీ ఓకే లక్ష్యం…. సంస్థ ఎందరికో సాయపడాలి. నిస్వార్ధంగా కేవలం అంధులకూ అనాధలకు ఉపయోగపడడానికీ మేము శ్రమించాలి అన్న తీర్మానంతోనే ఊపందుకున్నాం. సంస్థని మా ఎదుగుదల కోసం ఉపయోగించుకునే ఉద్దేశం మాకు ఏకోశానా లేదు. అతను కెనరా బ్యాంకు ఉద్యోగి. నేను వుద్యోగం నికరంగా ఏమి చేయకున్నా. ప్రతి వెయ్యి రూపాయల్లోనూ వందరూపాయలు నలుగురితో పంచుకునే గుణం ఉన్న దాన్ని. భర్త సహకారం, ప్రోత్సాహం పెద్దబాబు తోడ్పాటు అనంతంగా వున్నాయి నాకు. అందుకే కలిసికట్టుగా కృషిని ప్రారంభించాము. మాకు శక్తి, సామర్థ్యం ఉన్నంత కాలం సంస్థని ముందుకు తీసుకుపోతూ సంస్థని దీప స్తంభంగా చేసి ఎందరికో దారి చూపి వారి జీవితాలను వెలిగింపచేయాలన్న ఆశయం మాది. పిల్లల చదువులు, వైద్యం కోసం నేను ఖర్చు చెయ్యడం వీలైనంత సమయాన్ని వారికోసం వినియోగించడం ప్రారంభించాను. భవాని శంకర్ సమయాన్ని పూర్తిగా వారికై వెచ్చిస్తూ తానూ ఖర్చుపెడుతూ వచ్చాడు.
సంస్థ చేపట్టిన కార్యక్రమాలు:
- ఆధునిక కాలంలో ఆహార కాలుష్యం, వేళకి భోజనం చేయకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అందరి ఆరోగ్యాలూ అంతంత మాత్రంగా ఉండడం వాస్తవమే. మా దివ్యాంగుల పరిస్థితి మరింత దీనంగా ఉండడం నన్ను బాధించింది. ముందు ఆరోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించాలి అనుకుని మా పిల్లల కోసం ప్రత్యేకంగా స్త్రీ వైద్య నిపుణురాలిచేత వైద్య శిబిరాన్ని నిర్వహించాను. ఆడపిల్లలందరూ కాల్షియమ్ ఐరన్ లోపాలతో రక్త హీనత, అతి నీరసం వగైరాలతో బాధ పడుతుండడంతో వారికి టానిక్‌లు టాబిలెట్లూ అందించాము. కొందరికి గుండె బలహీనంగా ఉండడం, నెలసరి రక్తహీనత వల్ల రాకపోవడం లాంటి సమస్యలున్నాయి. వాళ్ళ కూడా వైద్య సాయం నిపుణురాలైన డాక్టర్ ద్వారా అందించాము. వైద్య పరీక్షలు అవసరమైన వారికీ చేయించాము. ప్రత్యేకoగా మేము వైద్యం చేయిస్తున్న అమ్మాయిలు చాలామంది వున్నారు.
- పేదవారు తండ్రులను పోగొట్టుకున్నవారు ఎవ్వరూ లేనివారు మా సంస్థలో వున్నారు. వారు వివిధ కళాశాలల హాస్టళ్లల్లో వుంటున్నారు. వారికి బైటనుండి తోడ్పాటును అందించడం పారంభించాము. మా సంస్థ దత్త పుత్రిక సంతోషి. ఆమెకి ఎవ్వరూ లేరు; తండ్రి తాగి ఏదో వాహనం కింద పడి విగత జీవుడయ్యాడు. తల్లి తాగిన మత్తులో పిల్లని ముళ్ళ కంచె మీద పడేసుకుని ఆమె అంధత్వానికి కారకురాలైంది. దాంతో తాతయ్య భయపడి చిన్నారి సంతోషిని అనాథాశ్రమం ముందు వొదిలి పోయాడు. ఆమే బాధ్యతను పూర్తిగా మేము చేపట్టాము. వయసు వఛ్చినా తనకి నెలసరి రాలేదు. వైద్యం చేయించాము. ఆమె సమస్య తీరడంతో మా ఇంట్లో ఘనంగా పేరంటం చేసి పెద్దల ఆశీస్సులు బహుమతులూ అందించాము. అలాగే మా పిల్లల జన్మదినాలూ నిర్వహిస్తుంటాము.
- గురజాడ అప్పారావుగారి జన్మదినాన్ని పురస్కరించుకుని మా పిల్లలెందరికో గురజాడ మీద వక్తృత్వ పోఠీలు నిర్వహించాము. ఎంపీ 3 ప్లేయర్లూ ,స్టిక్లూ బ్రెయిలీ పాడ్ వగైరా ఇతర ఉపకరణాలూ అందించాముఏ కార్యక్రమాన్నీ చేసినా వంద మందికి భోజనం పెట్టడం మా పధ్దతి
- వారిచేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పిల్లలకి మంచి సంగీత విద్వాంసురాలిచేత సంగీత పాఠాలు చెప్పిస్తున్నాము. పాడుతా తీయగా మొదలైన టీవీ చానళ్లలో పాడే అవకాశం కల్పిస్తున్నాము. ప్రత్యేక తర్ఫీదు ఇప్పిస్తున్నాము.
- త్రివేణి అనే అమ్మాయికి ఓవరీయన్ సిస్ట్ వొఛ్చి అది బరస్ట్ అయ్యే పరిస్థితి ఎదురయ్యింది, ఆమె తల్లి తండ్రులు పట్టించుకోలేదు. నేను గమనించింది బాధపడేది ఆ విషయమే. వైకల్యం వున్న పిల్లలంటే కన్నవారికి నిర్లక్ష్యం. ఎమర్జెన్సీలో భవానీశంకర్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించాడు. రెండున్నర కిలోల సిస్టును కడుపులోంచి తీసి ఆమెకి ఆరోగ్యం సమకూరేలా చూసినది గైడింగ్ లైట్ ఫౌండేషన్.
- పిల్లల పరీక్షలుకొన్నినేను అటు నేను ఇటు మా అబ్బాయి, భవాని శంకర్ వాళ్ళ అబ్బాయి రాసాము. దాంతోపాటు కొందరు నిరుద్యోగులకు ఉపాధిగా ఉంటుందని వారికి డబ్బిఛ్చి రాయిస్తున్నాము. విద్యార్థిని విద్యార్థులందరూ ఆర్ట్స్ సబ్జక్ట్ తీసుకున్నవారే కావడం వల్ల వారికీ తర్ఫీదు కూడా మేమిద్దరం ఇస్తుంటాము. విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఎంట్రన్స్ పరీక్షకి ప్రిపేర్ చెయ్యడం పాఠాలు చదివి పెట్టడం అన్ని మేమే చేస్తాము.
- అరటి పళ్లమ్ముకునే వ్యక్తికి, పోలియో వ్యాధి వల్ల సరిగ్గా నడవలేని అమ్మాయికి నేనే కన్యాదానం చేసాను. మా పిల్లందరికి పెళ్ళిళ్ళను చెయ్యడం మా ఉద్దేశం. ముందు వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాలి. అప్పుడు పెళ్లి సంగతిని చూస్తాము.
- మా పిల్లలకి ఆత్మవిశ్వాసం బాగా కలిగిస్తూ ఉంటాము. ఆత్మహత్య చేసుకునే యత్నంలో వుండే వారికి ఒత్తిళ్లతో నిరాశగా మిగిలే వారికి మా పిల్లలతో కౌన్సిలింగ్ చేయిస్తుంటాము. మాకు ఏదీ కనిపించదు. అయినా మేము ఆత్మహత్య చేసుకోవడం లేదు. మీరెందుకు చేసుకోవాలనుకుంటున్నారు అని వారి అడిగించుతూ ఆశావాదం కలిగిస్తూ ఉంటాము.
- మాతృదినోత్సవాన్ని విభిన్నంగా చెయ్యడం మా అలవాటు. చూడలేని మా పిల్లలకి నడవలేని జ్యోతిర్మయి గారు యెంత గొప్ప మాతృమూర్తో తెలియచేసే ప్రోగ్రాం చేసాము. అమ్మలను బాగా చూసుకోవాలని మా అమ్మ జన్మదినం రోజు నేను అమ్మకి జ్యోతిర్మయిగారి అబ్బాయి రామకృష్ణ జ్యోతిర్మయిగారికి సంతోషం కలిగించేలాగా ఉత్తమ మాతృమూర్తుల సత్కారం చేసి వారెందుకు ఉత్తములో తెలియ చేసాము. అమ్మలమీద పాటలు పాడించి కవితలు వారి చేత చెప్పించాము.
- మాతృదినోత్సవం రోజున పిల్లలందరిని పేదల వృద్దాశ్రమానికి తీసుకుని వెళ్ళాము. అక్కడి వారికి మా సంస్థ సభ్యులకి మాకు సాయపడుతున్న అమ్మలకి పిల్లచేత భోజనం వొడ్డించి సర్వ్ చేయించాము. వృద్దాశ్రమానికి ఫ్యాన్లు కొత్తవి ఇస్తూ ఇవ్వడంలో వుండే ఆనందం అపురూపమైనది అని వారికి తెలియచేప్పాము. సాయపడేవారికి కృతజ్ఞత చూవడం కనీస ధర్మమని వివరించాము.
- కులమతాలకతీతమైనది మానవత్వమని అంబేద్కర్ జన్మదినం చార్మినార్ దగ్గర దారూషఫా స్కూల్లో నిర్వహించినప్పుడు పిల్లలకి సమభావం గురించి తెలిపే కార్యక్రమం చేసాము. నేను భారతీయుడిని మానవతావాదిని ఆనే విషయం మీద వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను పంచాము.
- పిల్లలను విహారానికి తీసుకువెళ్లి ఆటలపాఠీలు క్విజ్ వంటివి నిర్వహించి బహుమతులిస్తుంటాము.
- దివ్యాంగులలో చూడలేనివారు నడవలేనివారి మధ్య సన్నిహిత సంబంధాలు కలిగించే ఉద్దేశంతో గూడ్వే ఫౌండషన్‌కి మా పిల్లలను తీసుకుని వెళ్లి చూపించాము. ఒక రెండు రోజులు అక్కడ ఉంచి వారి మధ్య సఖ్యత కుదిరేలా చూసాము.
- పేదరికం,అజ్ఞానం, మురికి వాడల్లోనూ గ్రామాల్లోనూ జీవించే వారికి వారి పిల్లలకి విద్యాభ్యాసం విలువ తెలియచెప్పే ఒప్పించి వారిని స్వయంగా పాఠశాలల్లో చేరుస్తూ ఉంటాము.
- మా పిల్లలు చూడలేరు. చూడగలిగినా, నడవగలిగినా మానసిక ఎదుగుదల లేని వారు పసిపిల్లలతో సమానం. వారికి తోడ్పడడం సమయాన్ని వెచ్చించడం ముఖ్యమని మన కంటే సమస్యల్లో వుండే వారు ఎందరో ఉంటారని వారికి సాయపడాలని ప్రాక్టీకల్‌గా మానసిక సమస్యలున్న పిల్లల పాఠశాలకు తీసుకెళ్లి చూపించాము. ఆ పిల్లలకి పాఠీలు అవసరమైన బహుమతులు పంచాము.
- లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని, హెలెన్ కెల్లెర్ జన్మదినాన్ని రకరకాల పద్దతులలో చేస్తూ ఉంటాము.
- కళ్ళకి నల్లబట్ట కట్టుకుని ఊరేగింపులో యువతని తోడ్కుని నడిపించాము. చూడకుండా నడవడం యెంత కష్టమో అర్థం చేసుకుని వారికి సాయపడమని సమాజానికి తెలియచెప్పమనే కార్యక్రమంలో భాగమది.
- హనుమాన్ చాలీసా శ్రీరామ నవమి రోజున పాడించి అందరికి తాంబూలాలూ ప్రసాదాలు పంచడం చేయించాము.
- డాన్స్ చెయ్యడం, మిమిక్రీ, మైమ్ లాంటి ప్రతిభలు ఏ కాస్త వున్నా కొండంత ప్రోత్సహిస్తాము.
- కాన్సర్, హెచ్ ఐ వీ, ఎయిడ్స్ లాంటి వ్యాధులతో బాధపడే పిల్లలకి సహకరిస్తున్నాము.
- వారి అవసరాలను చూసి సాయపడుతున్నాము. వారిని ఎదిగేందుకు నిత్యం చేయూతగా ఉండేందుకు యత్నిస్తున్నాము.
ఆశలూ ఆశయాలు
- పిల్లల కోసం ఒక ఇన్‌స్టిట్యూట్, హాస్టల్ పెట్టి వాళ్లకి అటు కంప్యూటర్ ట్రైనింగ్ ఇటు స్పోకెన్ ఇంగ్లీషులో ట్రైనింగ్ ఇవ్వడం.
- అన్ని రకాల వాయిద్యాలూ మా దగ్గరే నేర్పేలాగా శిక్షకులను ఏర్పాటు చేసుకోడం.
- మా పిల్లలని ఒక కల్చరల్ గ్రూపుగా చేసి మరింత తర్ఫీదు ఇప్పించి వివిధ ప్రాంతాల్లో వారి కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యడం.
- పసి మొగ్గల్లాంటి అనాథలను అక్కున చేర్చుకుని వారిని అత్యద్భుత భారతీయ పౌరులుగా తీర్చిదిద్దడం.
- కుల మత ప్రాంతీయ బేధాలను పక్కన పెట్టి మానవతావాదాన్ని పెంపొందిస్తూ ఉండడం మా లక్ష్యాలు.
మా ప్రయత్నాలకి సహృదయుల తోడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నాము. మరిన్ని వివరాలకు కొరకు 9866273346, 9246546584 లలో సంప్రదించవచ్చు.