భయంగా వుంటుంది

0
3

[శ్రీ సాంబమూర్తి లండ రచించిన ‘భయంగా వుంటుంది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]న్నపేగునే ఐనా
ఏ మాటా అనడానికి ఆడ్డానికీ
భయంగా ఉంటుంది

నీలో రెక్క విప్పుకునేందుకు
ఒక సముద్రం ఆరాటపడుతోందని తెలుసు

చీడపీడలు పట్టే కాలంలో
నిన్ను ఒంటరిగా వదిలేయలేను
ఎటు పడితే అటు ఎగరడాన్ని మాత్రమే
స్వేచ్ఛ అనుకునే రుతువులో
నా అనుభవాన్ని వృథాగా పారేయలేను

నువ్వు చేతిని విదిలించుకున్నావని
బాధగా ఉండదు
ఫ్రెండ్షిప్ డే కి నేన్నీకు గుర్తుకు రానందుకే
దిగులుగా వుంటుంది

వయసు కారడివిలో
ఎక్కడ తప్పిపోతావో అని భయం
ఇంత రంగుల రద్దీలో
జీవితానికి ఎక్కడ దూరమవుతావోనన్న ఆందోళన

తాడనుకుని చేసిన స్నేహం
పామై ఎదురయ్యే చేదు గతానికి
నిన్ను దూరంగా ఉంచాలని ఆశ

సీ సీ కెమెరా అని
నువ్వు నిక్ నేమ్ పెట్టినా పరవాలేదు
సీతాకోకచిలుక ముసుగేసుకుని
ఏ బల్లో గుంపులోకి చేరిందోమోనని భీతి

మరీ ఒక్క మందలింపుకే
ఊపిరిని బలిపెట్టే
సున్నితత్వం గురించి విన్నపుడల్లా
నిలువునా వణికిపోతుంటాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here