సమకాలీనం-7

0
13

[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]

19. వైద్యం – సామాన్యునికి పూజ్యం

కం॥
ఆరోగ్యమె భాగ్యంబది
తీరగు వైద్యంబు ప్రజలు తిరముగ బొందన్
సరకారు పూనుకోవలె
సరియగు పరిపాలనంబు సాధించుటకున్

ఆ.వె.॥
వైద్యరంగమందు వెర్రి తలలు వేయు
వ్యాపార దృక్పథం బనవరతము
వైద్యుడన్న హరియె వరవిష్ణుడనెదరు
కాని వైద్యుడిపుడు తాను జలగ!

చం॥
జలబును దగ్గటంచు నొక చక్కని డాక్టరు జూడబోవగన్
యెలమిని టెస్టులన్నియును ఏర్పడజేయుచు, నానిమోపెడై
ఫలితములేని వైద్యమది భారము రోగికి కాగ, స్వార్థమున్
యలసతగూడి, ధర్మమును అవ్విధి హేళన చేతురిమ్మెయిన్

ఆ.వె.॥
వృత్తిబద్ధమైన నైతిక విలువల
వలువ లూడదీసి పరమదుష్ట
మార్గమాశ్రయించి మానవత్వము బాసి
కార్పొరేటు వైద్యమార్పువెలుగు

కం॥
సరకారు దవాఖానలు
నరకములను మాట నిజము, నమ్మిన రోగుల్
మరలుదురట శవములుగా
కరిమ్రింగినవెలగపండు కద వైద్యమహో!

సీ॥
ఉచిత వైద్యమటన్న యున్నత సిద్ధాంత
మదిగాలిలో చేరి మాసిపోయె
ఆరోగ్యసిరులను ఆర్భాట పథకాల
తమకు నచ్చిన రీతినమలుజేసి
అపరిశుభ్రతయును అరకొర వసతులు
నిత్యసత్యముకాగ, నేర్పులేని
వైద్యనాథులు వారి ప్రయివేటు క్లినికుకు
రోగుల రప్పించి బాగుచేయ

తే.గీ.॥
అన్ని తెలిసి దొరతనము మిన్నకుండ
నిస్సహాయులు నిరుపేదలుస్సురనగ
వేదవేద్యుగ పూజించు భిషకుడిపుడు
మనవత్వమె లేని వ్యాపారియయ్యె

కం॥
స్టెంటుకు వేయగ లక్షలు
ఘంటాపథ రీతి గొనుచు గడియించుచునా
స్టెంటుకు నసలగుమూల్యము
వింటే మతిపోవు నిజము, విపణిని జూడన్

ఆ.వె.॥
మూత్రపిండములను ముచ్చటగా తీసి
రోగి యెరుగకుండ సాగు ఘోర
కలిని గనిన మనము కలతను జెందదే
పాప భీతిలేదె, మనునె ధనము?

తే.గీ.॥
ప్రజల ప్రాణాలు రక్షింప భారమైన
ప్రభుత యదియేల? వైద్యులన్ ప్రాణహరుల
నదుపు చేయని చట్టాలు మనకు నేల?
ప్రజల యారోగ్యమును గాచువాడె ఘనుడు

శా॥
మారున్ మూలలనున్న పల్లెజనముల్ ప్రాణాలు బోవంగ తా
మీరీతిన్ వగనొంద నచ్చటికి మేమేరీతి పోమంచు, నే
మేరన్ కొంచెము జాలిలేక భిషగుల్ మేలైనపట్నాలలో
తీరన్ వారి ధనంపు దాహమటులన్ దీనార్తులన్ జూడరే?

20. దోపిడీ – ఎవరి పరిధిలో వారు!

చం॥
దొరతనముల్ సదా ప్రజల దోచెడు పెద్ద పరిశ్రమాధిపుల్
సరకును సేయకట్లు, తమ స్వంత విశాల కుశీల వర్తకం
బరయుచు లాభముల్, తగిన పన్నులు గట్టక, మోసపుచ్చినన్
నిరతము కొమ్ముకాచి, పెను నిద్దుర దూలు ప్రజల్ తపించగన్

కం॥
ప్రయివేటీకరణంబును
రయమున చేయుచును ప్రజల రంగము నిటులన్
నియమముగా, దయలేకను
మాయము జేయంగ దొడుగు, మతిహీనతతోన్

ఆ.వె.॥
మనకు ‘పబ్లికు సెక్టారు’ పనికిమాలి
నష్టములలోన నడచుచున్న
దాని పనితీరు మెరుగైన దారిమలచి
ప్రజల శ్రేయము నొనగూర్ప భారమగునె

కం॥
జాతీయ బ్యాంకులన్నియు
నేతలపనుపునను ఋణము నివ్వగ, కోట్లన్
జాతికి నామము బెట్టుచు
వేతురు తిష్ఠల విదేశ విడుదుల, సుఖులై!

కం॥
జీవిత బీమా సంస్థయు
చేవగు మన “స్టేటుబ్యాంకు”, శీఘ్రత నిధులన్
ఠావుల్ దప్పగ పెట్టును
కావరపు కుసంస్థలదు, కాదనగలమే?

సీ॥
దోపిడీ యన్నది ఈ ప్రపంచములోన
అన్ని స్థాయిలలోన నలరుచుండు
మాటనుకోకుండ ఆటోను యెక్కిన
తరువాత రెట్టింపు తానెయడుగు
ఎండకాలము తీసి, ఏ.సీలనట్లుగ
చిత్రశాలలు మనల ‘చీటు’ జేయు
మల్టిప్లెక్సులలోన ప్రతి వస్తువును గూడ
పదిరెట్లు ధరలను బాగ పెంచి

తే.గీ.॥
ప్లంబరైనను, విద్యుత్తుపనులవారు
కూరగాయలనమ్మెడువారునైన
దోచుకుంద్రు తమ పరిధి, బ్రోచునెవరు?
పౌరసేవలపొందుట తరమెమనకు

కం॥
చిన్నయు, పెద్దయు, యనుమా
టన్నది లేదిచట, దోపిడనునది మనకున్
అన్నిట దర్శనమిచ్చును
ఎన్నగ సహజంబు, మనిషి కేతగునిదియున్

ఉ॥
వృత్తిని నైతికంబయిన వర్తన కోరతగున్, స్వలాభమున్
చిత్తము చంపుకొంచు, విడి శీఘ్రముగా నపరాధ భావనన్
విత్తము నొందినన్ యదియు విస్తృత శాంతిని ఇవ్వలేదెటన్
మొత్తము నట్లు లేదు! జనమున్ గలరెందరొ శుద్ధ వర్తనుల్

21. ఆడంబర వివాహాలు

కం॥
సిరిగల వానికి సరియే
ధరభువినేకంబు జేసి ధాంధూములుగన్
జరుపవివాహము, తగునే
మరి సామాన్యులకునటుల మనగలుగుదురే!

ఆ.వె.॥
పులిని జూచి నక్క యెలమి వాతలు పెట్టు
కొనెడు చందమిదియె, తనకు చివర
వాతలేమిగులును ప్రాప్తించు నప్పులు
మనకు కుప్రతిష్ఠ మంచిదగునె?

చం॥
మనిషికి ఎంత కావలె? సమంబగు భోజన? మట్లుకాక, నీ
మనమది రోయ పెక్కులగు వ్యంజనముల్ తినమంచు బెట్టినన్
తినుటకు శక్తి చాలునె? విధింతురె శిక్షను తిండి పేరుతో?
గొనకొని ప్రేమ మీర నొక కూరయు, పప్పును బెట్ట చాలదే!

సీ॥
కల్యాణమంటపాల్ కమనీయరీతి, ము
స్తాబుజేయగ బెట్టు ధనము లక్ష
లవినీతిసొమ్మది యైన ఫర్వాలేదు
న్యాయార్జితంబును చేయగలమె?
‘డెస్టినేషను’ పెండ్లి ఠీవి మీరగజేసి
బంధుమిత్రులబంపి ఫ్లయిటు లోన
సువిలాస సౌఖ్యము సుందరహర్మ్యాల
విడుదల సమకూర్చివేడుకగను

తే.గీ.॥
వారి కమరించి కోట్లలో భారి గాను
ఖర్చుపెట్టుట ఐశ్వర్య గర్వమదియె
దాని చూపించుమార్గము దీనికన్న
యేదికలదిక? ధనముతో మదముకలుగు

ఆ.వె.॥
దిగువ మధ్యతరగతీరీతి కాకున్న
తాహతుకునుమించి తమధనంబు
పెండ్లి వేడుకలను పెనురీతిపెట్టంగ
తెలివిలేదె? మీరు తెప్పరిలుడు!

కం॥
వైవాహిక జీవితమది
కావలెనిద్దరికి సఫలగమ్యత తమదౌ
భావము, మేనును, యాత్మయు
ఆవిధమున నొకటి జేయననుబంధమగున్

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here