[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
ప్రకరణం 7 – కాకతీయుల కాలం నాటి మతసంప్రదాయాలు – స్త్రీలు: మూడవ భాగం
కూతురు పుట్టాలని నోచే నోములు:
[dropcap]కొ[/dropcap]డుకు పుట్టాలని పూజలు, యాగాలు, నోములు చెయ్యడం, మాంగల్య రక్షణకోసం నోములు, వ్రతాలు, పూజలు చెయ్యడం, మంచి భర్త రావాలనో, సిరిసంపదలు కలగాలనో, కుటుంబసభ్యుల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం పూజలు చెయ్యటం ప్రాచీనకాలం నుంచీ ఈనాటి వరకు ఉన్నది. కానీ పుత్రికల కోసం ఏ కాలంలోనైనా పూజలు చేశారా! అందునా స్త్రీలకు ప్రాధాన్యత నిచ్చిన, కాకతీయుల కాలంలో కూతుళ్ళు కావాలని ఎవరైనా కోరుకున్నారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. బహుశా స్త్రీ సంతానం కలిగితే లాభం చేకూరే కులాలలో ఈ పూజలు ఉండవచ్చు, ఉంటే పుత్రికను కోరుకునేవారు ఏ దేవతను ప్రార్థించి ఉంటారు. కాకతీయుల కాలంలో శక్త్యారాధన ఎక్కువగా ఉండేది. పుత్రిక కోసం హిమవంతుడు మేనక శక్త్యారాధన చేసినట్లు నన్నెచోడుని కుమారసంభవంలో ఉన్నది.
వారిరువురు సద్విధిశ
క్త్యారాధన సేసి రతిశయ స్థిర భక్తిన్
గోరిక వదలక, తమ కడు
పార సతీదేవి కూత్రురై జన్మింపన్.
బహుశా పుత్రికను కోరుకునే వారు శక్తి పూజ చేసేవారు కాబోలు. కుమార్తెను సుపుత్రి, కులదీపకురాలు అని మన్నించిన కుటుంబాలవారు పై విధంగా శక్తిపూజ చేసేవారని భావించవచ్చును.
వేశ్యలు ఆదిశక్తి వంశంలో పుట్టిన వారని అంటారు. బసవ పురాణంలోని ముగ్ధసంగయ్య కథలో ఒక వేశ్య తాము ఆదిశక్తి పార్వతీదేవి సంతతివారమని చెప్పుకొన్నది.
శ్రీ నందనుని గెల్చి శివుని మెప్పించి మేన నర్ధము గొన్న మెలత వర్గంబు
జగములన్నియు దనశక్తి గావించు జగదేకసుందరి సంతతిమేము.
దాన్ని బట్టి కాకతీయుల కాలంనాటికి వేశ్యలు సాక్షాజ్జగదంబా సమానులని, పార్వతి వంశంలో పుట్టిన వారు అని భావించేవారని కనుకనే శైవభక్తులందరూ వారిని వేశ్యలని పిలవక రుద్రగణికలని పిలిచే వారని అనుకోవచ్చును. శైవ దేవాలయ భోగాలవారు కూడా పుత్రికల కోసం బహుశా శక్తి పూజ చేసే వుంటారని దాన్ని బట్టి భావించవచ్చు.
శక్తి పూజే కాక అక్కల ఆరాధన కూడా సంతానం కాంక్షించి చేసేవారు అని క్రీడాభిరామాన్ని బట్టి తెలుస్తుంది.
“ఇదె యీ యింటి యజమానుండు సంతానకాంక్షియై ప్రతిబంధనోదనార్థంబు యక్షకన్యలం బరీక్షారాధనంబు సేయుచున్నవాడు గావలయు మాణిభద్ర కులోద్వహులైన దేవతలు కామవల్లి శ్రీమహాలక్ష్మీతో గూడియ పేక్షిత కార్యంబమనకు నవ్యాక్షేపంబనం చేయుదురు గాక”
ఇంతకు ముందు చెప్పినవి కులస్త్రీలు చేసే నోములు – ఇప్పుడు వేశ్యలు చేసే నోములు, పూజల గురించి తెలుసుకోవాలి.
వేశ్యలు చేసే నోములు – పూజలు – వ్రతాలు
కులస్త్రీలే కాక వేశ్యలు కూడా నోములు, వ్రతాలు చేసేవారు. దైవ చింతన, దానతత్పరత, దేవబ్రాహ్మణభక్తి వారికి ఎక్కువగానే ఉండేదని ఆ కాకతీయుల నాటి శాసనాలను, సాహిత్యాన్ని బట్టి తెలుస్తోంది. వేశ్యలు నోములు నోచినా అవి కులస్త్రీల నోములకన్నా భిన్నంగా ఉండేవి.
వేశ్యలు ఎక్కువగా సౌభాగ్యం కోరి నోము నోచేవారు. ఈనాడు సౌభాగ్యవతి అని కులస్త్రీలకు వాడడం కద్దు. అంతేకాదు. సౌభాగ్యమంటే సుమంగళీత్వానికి, మాంగల్యానికి పర్యాయపదాలుగా వాడడం వ్యవహారంలో ఉన్నది. కానీ ఈ సౌభాగ్యం అన్నది కాకతీయుల కాలంలో వేశ్యలకే ఎక్కువగా వాడారు. సౌభాగ్యం అంటే అదృష్టము, ధన్యత్వము, సౌందర్యం, వైభవము, సుభగత్వము, ప్రేమ, అనుగ్రహము, సిందూరము, శుభాకాంక్ష, వెలిగారము అని, వివిధాలైన అర్థాలున్నట్లు నిఘంటువులను బట్టి తెలుసుకోవచ్చు.
సౌభాగ్యవతి అంటే నిఘంటువు (సూర్యరాయాంధ్ర నిఘంటువు)లో పుణ్యస్త్రీ, భాగ్యశాలిని, మంచిభార్య అన్న అర్థాలు ఇచ్చారు. కానీ సౌభాగ్యం అంటే వైభవము, సుభగత్వము అదృష్టము, అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లోని సాహిత్యంలో వేశ్యలకి సౌభాగ్యమనే పదం వాడారనడానికి ఈ క్రింది వాక్యలు ఉదాహరణగా చూడవచ్చు.
‘సౌభాగ్యవతి రంభజంభారి చూచి, యెలమిమై దేవతా హిత కార్యమొకటి’, దేవవేశ్య అయిన రంభకు సౌభాగ్యవతి అన్నవిశేషణం వాడారు.
కేతన దశకుమార చరిత్రలో ఒక వేశ్యమాత తన కూతురును కులధర్మాన్ననుసరించి ఎలా పెంచిందో వివరిస్తూ సౌభాగ్యం కోసం నోములు నోమించానని చెప్పింది.
సౌభాగ్యమునకునుం జాలిన నోములు
నోమించి పడయంగ నూలుకొలిపి.
శాసనాల ననుసరించి వేశ్యలు లేదా భోగస్త్రీలు నోచే నోములు, చేసే పూజలు, వ్రతాల గురించి తెలుస్తుంది. కావ్యాలలోను వేశ్యలు ఆచరించే పూజలు, నోములు, ధర్మకార్యాలు, తీర్థయాత్రలు, ఉత్సవాల ప్రసక్తి ఉన్నది.
అలా భోగస్త్రీలు, వేశ్యలు చేసే కార్యాలన్నిటికీ ఖర్చు పెట్టవలసిన ధనం వీరి ప్రభువులు లేదా విటులే ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో ఆ స్త్రీ తన దగ్గరున్న ధనాన్ని వెచ్చించి చేయవలసి ఉన్నది. ఇది బహు అరుదుగా జరుగుతుంది. కొందరు పురుషులు వేశ్యలను ప్రేమ పేరుతో కపటనాటకమాడి ధనమీయకుండా సుఖిస్తూ ఉంటే ఆ వేశ్యల మాతలు గడుసువారై ఆ విటుల నుంచి నయానా భయానా ధనాన్ని రాబట్టడానికి చూచేవారు. ఇటువంటివారున్నట్లు పండితారాధ్య చరిత్రలో మల్హణుని కధను బట్టి, దశకుమార చరిత్రలో రాగమంజరి అనే వేశ్య తల్లి మాధవ సేన మాటలను బట్టి తెలుస్తుంది.
వేశ్యలు నోచిన నోములు చేసిన పూజలు, వ్రతాలు, ఉత్సవాలు:
దవన పున్నమ:
దవన పూర్ణిమ చైత్రశుద్ధ పౌర్ణమినాడు దేవుని విగ్రహాలను దవన పత్రాలతో పూజించటం ఆచారమని ఆచార్య కుందూరి ఈశ్వర దత్తుగారు తమ శాసనశబ్ద కోశంలో తెలిపారు. ఈ పున్నమినాడు దక్షారామ భీమేశ్వరుని డోలోత్సవం జరిపిస్తారు.
ఈ నోమును భోగస్త్రీలు, వేశ్యలు నోచినట్లు సాహిత్యంలో ఆధారాలున్నాయి. మత్స్యకులతిలకుడు ఒడ్డాది జయంతి రాజు కొడుకు ఒడ్డాది అర్జున దేవరాజు తమ దేవి అక్కాసానికి నోముగా ఈ దవనపున్నమ నాడు మడువాడ అనే గ్రామాన్ని ధారాపూర్వకంగా ఇచ్చినట్లు శాసనమున్నది.
శ్రీ భీమేశ్వర శ్రీ మహదేవర దవన పున్నమనాటి డోలోత్సవమునందు అహ బలి అర్చనలకు ఒడ్డాది అర్జున దేవండు ధారాపూర్వకంగా బెట్టను మడువాడను యూరు ఒక్కండు
ఈ దవన పున్నమ నాడు భోగస్త్రీలు, వేశ్యలు తమకు నాట్యం నేర్పే గురువుకు గురుకట్నం ఇచ్చేవారు. పండితారాధ్య చరిత్రలో పురాతన ప్రకరణంలోని మలహణుని కథలో ఒక వేశ్య తన సరిపిణి అనే ఆభరణాన్ని తాకట్టు పెట్టి దవన పున్నమ నాడు గురుకట్నం చెల్లించింది. అసలు వేశ్యల పూజలకు, పండుగలకు అయే ఖర్చు విటులే భరించాలి కాని మలల్హణుడు తన వేశ్యకు ఏమి ఇవ్వక పోవడంవల్ల ఆ వేశ్య తన ఆభరణాలనే అమ్మి నోము జరుపుకున్నది.
నూలి పున్నమ:
దీనినే జంధ్యాల పూర్ణిమ అంటారు. ఆ రోజుల్లో వేశ్యలు కూడా బాలభక్తులను పిలిచి పండుగ చేసేవారు. బహుశా వారికిష్టమైన వంటకాలతో భోజనం పెట్టేవారు. పండితారాధ్య చరిత్రలో మలహణుని వేశ్య నూలిపున్నమ నాడు తన నూపురాన్ని అమ్మి బాలభక్తులకు పండుగ చేసింది. అంటే తన విటుడు ధనమీయక పోయినప్పటికీ ఆమె విధిగా చేయవలసిన ధర్మకార్యమని దీన్ని బట్టి మనమర్థం చేసుకోవచ్చు.
వసంతోత్సవం:
గొప్ప, పేద, స్త్రీ, పురుష భేదం లేకుండా ఆనాటి జనులందరూ పాల్గొనే ఉత్సవం వసంతోత్సవం. వేశ్యలకు వారి ప్రియులకు నచ్చిన అతి ముఖ్యమైన పండుగ ఈ వసంతోత్సవం. ఆనాటి అన్ని కావ్యాలలోను ఈ వసంతఋతు ప్రారంభకాలంలో జరిగే ఉత్సవాలలో వేశ్యలు జారులు ఎలా ఆనందించేవారో వర్ణించబడింది. నన్నెచోడుని కుమారసంభవంలో చాలావిశదంగా వర్ణించబడ్డది. పండితారాధ్యచరిత్రలో మలహణుని వేశ్య ఈ వసంతోత్సవానికై తన హస్త కటకాలు అమ్మింది.
గౌరీవ్రతం:
ఈ వ్రతం చైత్ర, భాద్రపద, మాఘ శుద్ధ తదియల నాడు గౌరీ దేవిని గూర్చి చేసే వ్రతం అని శాసన శబ్ద కోశంలో ఉంది. ఒడ్డాది జయంతిరాజు కొడుకు అర్జున దేవుని దేవి అయిన శ్రీమతు పెదమున్నూంటి ప్రేకెటి వీరపనాయకుని కూతురు సూరమదేవి ఒడ్డాదిలోని అలికట్టనాడులోని సంకుభీమాపురం శ్రేష్ఠమాసం పున్నమనాడు అర్జునదేవుని చేత బడసి తమ తల్లిదండ్రుల ధర్మార్ధం ద్రాక్షారామ భీమేశ్వరునికి అర్పించిందని క్రీ.శ. 1252 నాటి దాక్షారామ శాసనంలో ఉన్నది. దీన్ని బట్టి వేశ్యలు లేదా భోగస్త్రీలు గౌరీవ్రతం చేసేవారని ఆ సందర్భంగా వారి విటులు లేక పతులు కానుకలుగా వస్తువులు గ్రామాలు దానం చేసేవారని తెలుస్తుంది. ఒడ్డాది రాజు అర్జున దేవుడే ఇంకొక సందర్భంలో అతని దేవి, ప్రేకేటి వీరప నాయకుని కూతురు కొండిక మున్నూంటి అడప అయిన అక్కాసానికి నోముగా మఱువాడ అనే గ్రామాన్ని ఇచ్చాడు. ఆమె దవనపున్నమ దినోత్సవం నాడు భీమనాధునికి అవి బలి అర్చనకై ఆ గ్రామాన్ని అర్పించింది. ఈమెను అర్జునదేవరాజు దేవి అని శాసనంలోని తెలుగు భాగంలో చెప్పారు. దానిపై ఉన్న సంస్కృత శాసన భాగంలో ప్రాదాదొడ్డాది భూపార్జున వరవనితా కోట దక్కాంబికేయం గ్రామం మడ్వాడ సంజ్ఞం సకల కృషియుతం వీరనాఖ్యాత్మజా ఉన్నది దీన్ని బట్టి అక్కాంబిక అర్జుదేవుని వరవనిత లేదా భోగస్త్రీ అన్నది స్పష్టం. భోగస్త్రీలు నోములకు పూజలకు వారి ప్రభువుల ఖర్చు పెట్టేవారని దాన్ని బట్టి చెప్పవచ్చును.
శివరాత్రి పండుగ:
శివరాత్రి శైవులకు మహాపర్వదినం సానిమున్నూర్వురు వంటి సాని సంఘాల వారందరికి శివరాత్రి ముఖ్యమైన పండుగ. ఆనాడు జంగమారాధన చేయడం శైవులకు విధి. శైవభక్తులైన వేశ్యలు కూడా ఆనాడు జంగమారాధన సలిపేవారు. అయితే దానికై అయే ఖర్చు వారి విటుల నుంచి గ్రహించేవారు. పండితాచార్య చరిత్రలో వేశ్యమాత మలహణునితో తన కూతురు శివరాత్రి నాడు జంగమారాధన చేయటానికై అతడేమీ ధనమివ్వక పోవటం చేతనే ఆమె తన ఉంగరాన్ని అమ్మి చేసిందని చెప్పి అతడిని నిందించింది. దీన్ని బట్టి వేశ్యల పూజల ఖర్చు విటులదే అని చెప్పవచ్చును.
యాత్రలు:
వేశ్యలు కూడా కులస్త్రీల లాగా దైవభక్తితో యాత్రలు చేసేవారు. ముఖ్యంగా శైవమతం ఏ వర్గాన్నీ నీచంగా చూడక సమానత్వాన్ని ప్రతిపాదించడం వల్ల వేశ్యలు కూడా నిస్సంకోచంగా ధర్మకార్యాలు చేస్తూ తీర్థయాత్రలు చేసేవారు. వారు వీరభద్రుని యాత్రకు, శివరాత్రి సందర్భంగా శ్రీశైలయాత్రకు వెళ్ళేవారని పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రవల్ల తెలుస్తున్నది.
వీరభద్రుని యాత్రకు వెలదులు పోగా తన బిడ్డ ముత్యాల హారాన్ని తాకట్టు పెట్టి వెళ్ళిందని వేశ్యమాత మలహణునితో అన్నది.
శివరాత్రి సందర్భంగా శ్రీశైలయాత్రకు పోయే పణ్యాంగనల ప్రసక్తి పండితారాధ్య చరిత్రలో ఉన్నది.
ఈ యాత్రలకయే ఖర్చు కూడా వేశ్యల ప్రియులు, విటులే భరించేవారు. ఆ విధంగా మల్హణుడు చేయలేదని, తన కూతురు ముత్యాల హారాన్ని తాకట్టు పెట్టవలసి వచ్చిందని వేశ్య మాత చెప్పినట్లు పండితారాధ్య చరిత్రలోని మల్హణుని కథ వల్ల తెలుస్తుంది.
కోటకేతరాజు ఉంపుడు గత్తెలయిన సూరమదేవి ప్రోలమదేవి అనేవారు బుద్ధుని దీపారాధనకై నేతికి గొట్టెలను గొల్ల బోయలకు దానం చేశారు. ఈ సందర్భంలో కోటకేతరాజు ధాన్యకటకంలోని బుద్ధ దేవునికి కండ్రవాటిలోని క్రంతేరు, కొంతపడుమటి సీమలోని మేడికొండూరు, డొంకిపఱ్ఱు అనే గ్రామాలను దానం చేశాడు. కోటకేతరాజు శైవుడై ఉండి కూడా బుద్ధోపాసన చేసే తన ప్రియురాళ్ళ ప్రీతికై పై దానాలను చేసి ఉంటాడు. దీన్ని బట్టి వేశ్యలు ఏ మతాన్ననుసరించినా వారి విటులు వారిదానాలకై సొమ్మువెచ్చించేవారన్నమాట.
దశ కుమార చరిత్రలో వేశ్యమాత కూడా ఈ విషయాన్నే చెప్పింది.
బండువులు శోభనంబులు బహు విధంబు
లైన నోములు సమకట్టి జానుమీఱి యల్లు తండంబుచే ధనమెల్ల గొనుచు
ఆమె మాటలను బట్టి విటుల చేత ఈ దాన ధర్మాలకు ఖర్చు పెట్టించటం వేశ్యమాత విధులలో ఒకటి అని తెలుస్తుంది.
యాత్రలు – ఉత్సవాలు:
స్త్రీలు తీర్థయాత్రలలో జాతరలలో, ఉత్సవాలలో రకరకాల విద్యలను ప్రదర్శించేవారు అని పండితారాధ్య చరిత్రను బట్టి చెప్పవచ్చును. దేవాలయాలలో సేవలు చేసేవారు అంటే రంగ భోగాదికములకు నిర్వహించేవారు, వేశ్యలు, ఆటపాటలతో ప్రజలను రంజింప చేసి జీవిక గడుపుకొనేవారు, ఈ యాత్రలలో ఎంతో ఉత్సాహంలో పాల్గొని ఈ క్రింది విధంగా తమ విద్యలను ప్రదర్శించి యాత్రికులను రంజింపజేసేవారు అని పండితారాధ్య చరిత్రను బట్టి తెలుస్తున్నది.
వేడుకతో జిందు వాడంగ నుబ్బి
గోడంగి యాటల గునినెడునారు
బ్రన్నని నిజదేశభాషల జతుల
కన్ని కోడంగాట లాడెడువారు,
భ్రమరముల్ సాళెముల్ బయకముల్ మెఱసి
రమణ బంచాంసి పేరణి యాడువారు,
బ్రమధ పురాతన పటు చరిత్ర ములు
గ్రమమొంద బహు నాటకము లాడువారు,
లలితపదాంగ రసకళాలంకార రేఖ
లలవడ బహు రూపమాడెడు వారు
గరణముల్ మెరవణుల్ గతులు జిత్రములు
నరుదుగ వెడ్డంగ మాడెడు వారు
నమరాంగనల్ దివినాడెడు మాడ్కి
నావియద్గతి బక్షులాడెడు నట్టి
నమరంగ గడలపైనాడెడు వారు
భావన మ్రోకుల పై నాడువారు,
భారతాది కథల జీరమఱు గుల
నారంగ బొమ్మల నాడించు వారు,
గడు నద్భుతంబుగ గంబసూత్రంబు
లడరంగ బొమ్మల నాడించు వారు,
నాదట గంధర్వయక్ష విద్యాధ
రాదులై పాడెడు నాడెడువారు
విధమున బ్రచ్ఛన్న వేషముల్ దాల్చి
యధికోత్సవము నట్లాడు వారు
యాత్రలలో పాల్గొన్న ఈ భక్తులు స్త్రీ పురుషులనే వ్యత్యాసాన్ని మరిచి చిందు, కోడంగి ఆట, బ్రమరాలు, సాళెములు బయకములు, పేరణి వంటి దేశీ నృత్యాలు ప్రదర్శిస్తూ, పురాతన భక్తుల చరిత్రలు నాటకాలాడుతూ, బహురూప నృత్యం చేసేవారు. ప్రత్యేకించి స్త్రీలు అమరాంగనలు లేక దేవతాస్త్రీలు స్వర్గంలో ఆడినట్లు గడలపైన నర్తిస్తూ, ఆకాశంలో పక్షులలాగా త్రాటిపైన నర్తిస్తూండేవారు. చీరలు, తెరల వెనుక నుంచి బొమ్మల నాడిస్తూ భారతాదికథలు చెప్పేవారు, ఈ విధంగా ఉత్సవాలు, తీర్థయాత్రలలో స్త్రీపురుషులందరూ పాల్గొనేవారు.
మైలారు దేవుని వీర భటులు తమ శివ భక్తి అతిభయంకరమైన చర్యల ద్వారా ప్రదర్శించుకోవడమే కాక గొరగ పడుచు చేత గొండ్లి ఆడించేవారు. చిన్న పిల్లలైనా ఆ బాలికలు తమ విద్యను చూపఱులకు ఆశ్చర్యం కలిగే విధంగా ప్రదర్శించేవారు.
వెనుకకు మొగ్గవాలి కడు విన్నను వొప్పగ దొట్టెనీళ్ళలో
మునిగి తదంతరస్థ మగు ముంగర ముక్కున గ్రుచ్చుకొంచులే
చెను రసనా ప్రవాళమున శీఘ్రముగ్రుచ్చెను నల్లపూసపే
రను పమలీల నిప్పడుచు పాయములిట్టివి యెట్టునేర్చెనో
పుణ్యాంగనలు తమ భర్తలతో యాత్రలకు వెళ్ళేవారు. పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో పాల్కురికి సోమనాధుడు ఆ కాలంలో శివరాత్రి సందర్భంగా శ్రీశైల యాత్ర చేసే పుణ్యాంగనలను ఈ విధంగా వర్ణించాడు.
గుఱునేరి కట్నముల్ గొంగులక్రింద
జెఱగులు నొడి చుట్లు సిక్క నిండించి
చెలువగు పైనంబు చెప్పులు మెట్టి
పలుచని తొల్లు కుప్పసములు పూని
పదపడి యలతి దుప్పట్లు గొంగెడలు
వదలకుండగ మీద వల్లరుల్ సుట్టి
తొడవులు నిజతనుద్యుతులకు మాటు
వడునని యాత్మలో భావించి తొడక
మొదలి మంగళ సూత్రములు ధరియించి
యలసియు నలయని యట్ల నాధులకు
జిలిబిలి లావుల బిగువు సూపుచును
గొమరు దలిర్ప నెక్కుళ్ళ దిగ్గుళ్ళ
దమతమ పతుల హస్తము లూది కొనుచు
గరముప్పతిలు నలికంబుల చెమట
గరతలాంగుళముల గమిచివై చుచును
చెమట తుడుచుకుంటూ, మామిడి, వటవృక్షాల నీడలో సేద దీర్చుకొంటూ, పెదవులు ఎండిపోతే తాంబూల సేవనంతో తడుపుకుంటూ, ఎండకు ముఖం వాడకుండా చూచుకుంటూ, చేతులలో రక్తం ఊరకుండా చేతులు నడుముకానించుకుంటూ, తొడలు ఒరుసుకోకుండా మల్లయా అంటూ, భర్తల చేయూతతో శ్రీశైల పర్వతం ఎక్కేవారు ఆనాటి పుణ్యస్త్రీలు.
పణ్యస్త్రీలు అంటే వేశ్యలు కూడా శివరాత్రి సందర్భంగా యాత్రలకు వేళ్ళేవారని ముందు చెప్పడమైంది. వీరభద్రుని యాత్రకు వెలదులు పోతూంటే పతకం కుదువ పెట్టి ఒక వేశ్య తానూ వెళ్ళిందని పండితారాధ్య చరిత్రలో ఉన్నది. పుణ్యాంగనలకు గౌరవమిచ్చి తోటి ప్రయాణీకులలో తుంటరివారు ఏమీ అనేవారు కాదు కానీ పణ్యాంగనలని ఏమీ అనకుండా వదిలేవారు కాదు. ఏదో ఒకటి అని కనుసైగలు చేస్తూ, గేలి చేస్తూ, వాళ్ళపైన సరసంగా పూలగుత్తులు విసరడం వంటివి చేసేవారు మిండజంగాలు. వారిని దగ్గరికి పిలవడం, మేలమాడుతూ, వారి వెనకబడటం తాంబూల మందీయటం వంటి సరస సల్లాపాలు చేసేవారు.
ఆ విధంగా యాత్రలలో పాల్గొనే వారిలో పుణ్యాంగనలు యోగులు, శీలవంతులు, సన్యాసులు వంటివారు తప్ప పైన చెప్పబడిన మిండ జంగాలు, పణ్యాంగనలు, రకరకాల ఆటపాటల్లో పాల్గొంటూ ఉండేవారని పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో చెప్పబడింది.
స్త్రీపురుష భేదం, కులమత, జాతి, వర్గ వివక్ష చూపని శైవ మత వ్యాప్తి వల్ల అన్ని దేశాల, జాతుల, మతాలవారు, స్త్రీలు, పురుషులు, సంఘంలోని అన్ని వర్గాల వారు ఉత్సాహంతో శైవ సంబంధమైన ఉత్సవాలలో, తీర్థయాత్రలలో పాల్గొనేవారు. అని పండితారాధ్య చరిత్రలోని పర్వతప్రకారణంలోని క్రింది వాక్యాల వల్ల తెలుస్తున్నది.
“మాళవ, కాశ్మీర, మాగధ, సింధు, గౌళ, తురుష్క, కొంకణ, శూరసేన, బంగాళ, కాంభోజ, పాండ్య, కళింగ, బర్బర, సింహళిక, కరహాట, సౌరాష్ట్ర, లాట, ప్రశస్త దేశముల నారాదిగాగ చెంపారు దేశములయందును మధ్య దేశానీకి మర్త్య సందోహమును నట్ల సహజ భాషలను మసలి యొండొరులతో మాటలాడుచును”—- అటువంటి శైవ మత మిచ్చిన ప్రోత్సాహంతో స్త్రీలు అత్యుత్సాహంగా పైన చెప్పిన యాత్రలు, ఆ సందర్భంగా జరిగే వేడుకలు, నినోదాలలో స్వేచ్ఛగా పాల్గొనే వారని గ్రహించవచ్చును.
వినోద క్రీడలు – స్త్రీలు
జలక్రీడలు:
ఆ కాలంలో వసంతోత్సవ సందర్భంగా జరిగే స్త్రీల వినోద క్రీడలలో జలక్రీడలు ముఖ్యమైనవి. నన్నె చోడుడు కుమార సంభవంలో ఆ నాటి స్త్రీలు ఎన్ని రకాల జలక్రీడలాడేవారో ఎలా ఈతలు కొట్టే వారో చక్కగా వర్ణించాడు.
నెలతలు కొంద ఱక్కొలని నీరుల లోపల గ్రుంకి పోయి మై
బలసిన భూషణ ద్యుతులు పర్వగ నొక్కట లేచిరక్కడన్
వెలుగుచు నాగ కన్యకలు వేడుకతో జలకేళి సల్పగా
నొలసి రయంబున న్నెగసిరో యని చూపఱు మెచ్చి చూడగన్.
~
స్తనములు సకుంత లాస్యము
వలములపై దోప వికచవనజంబును మూ
గునళుల గవ చక్కవ చే
కొనుక్రియ వెల్లీత యీదె గోమలి కొలనన్
డా. అమరేశం రాజేశ్వర శర్మగారు ‘నన్నెచోడుని కవిత్వము’ అనే తమ గ్రంధంలో నన్నెచోడుడు జలక్రీడల నెంత మరోహరంగా వర్ణించాడో తెలిపి ఆ కాలంలో జలక్రీడల విశేషాలను నన్నెచోడుని సీస పద్యంలో చూపించారు.
కరమొప్ప గాముక కామినీ తతిప్రీతి
గూడి జలక్రీడ లాడ దొడగి
(1) పంకజాకరములో గ్రుంకి యాడెడువారు
(2) వేడుక జల్లు బోరాడువారు
(3) ననురాగమున నీది యాడెడువారు
(4) నా హ్లాదంబుతో నోలలాడు వారు
(5) బెనగి యొండొరు బట్టుకొని ముంచు వారు
(6) నొండొరులపై జలధారలొత్తువారు
(7) కమల మృదు బిసములు కల్హార కుముదోత్పలములు బెఱికికొని నయమున బ్రణయ మొదవ సంకులముగ నొండొరులతో నాట లాడువారు
(8) తన్నులాడు వారు.
ఇందులో వారు తెల్పిన క్రీడా విశేషాలు
- క్రుంకి నీటిలో ఆడే ఆట – ఇది దాగుడు మూతల వంటిదే. ఒక దొంగ మిగిలిన వారిలో ఒకరిని ముట్టుకొని దొంగని చెయ్యాలి. కానీ విశేషమేమంటే ముట్టుకొనటానికి వెళ్ళేటప్పుడు నీటిలో మునిగే వెళ్ళాలి. ఈ లోపుగా అక్కడివాడు వెళ్ళి పోవచ్చును. కనుక దొరకటం కష్టం.
- చల్లు బోరాడుట – జనం రెండుజట్లుగా చీలిపోయి పరస్పరం చేతిలో నీరు చల్లు కొవటం. కొందఱు హస్తలాఘవంతో చాలా దూరం నీటిని చిమ్మ గల వారుంటారు. ఎదుటి వారు చల్లే నీరు ముఖంపైన పడుతుంది కనుక కన్నులు కనిపించక, ఊపిరి ఆడక అవతలి పక్షం వారు పారి పోవలసి ఉంటుంది. ఇదొక విధమైన జలక్రీడ.
- ఈది ఆడటం –
- ఓలలాడటం – ఓల యనేది ఒక సంకేతం దొంగ ఎవరి పేరు చెప్పి ఈ సంకేత శబ్దాన్ని ఉచ్చరిస్తే వారు నీటిలో మునిగి వేరొక చోట తేలాలి. ఆ విధంగా నీటిలో మునిగి పారిపోనివారు ఆటలో దొంగగా పరిగణింపబడేవారు.
ఈ ఆటలన్నీ ఆనాడు ఆంధ్ర దేశీయాలని నన్నెచోడుడు వర్ణించడం వల్ల తెలుస్తున్నది.
(సశేషం)