‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -26

3
3

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

కన్నడ అభివృద్ధి ప్రాధికార సంస్థకు అధ్యక్షుడిగా

[dropcap]జూ[/dropcap]న్ నెల 9వ తేదీ ఉదయం 11 గంటలు. హాస్టల్ గదిలో కూర్చుని నా ‘ఆత్మకథ’ చివరి అధ్యాయాలను వ్రాస్తూ ఉన్నాను. ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడింది ముఖ్యమంత్రిగారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను కర్ణాటక రాష్ట్రపు కన్నడ అభివృద్ధి ప్రాధికార సంస్థ (Kannada Development Authority)కి అధ్యక్షుడు కావాలని అడిగారు. నా సమస్యలను ఒకటి రెండు వాక్యాలలో తెలిపి, మీ కోసం మరియు కన్నడ కోసం ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. ఈ సంభాషణ రెండు నిముషాలు కూడా కొనసాగలేదు.

నాకైతే నమ్మడానికే కుదరడం లేదు. ఇలాంటి పదవికి చాలా పోటీ, ప్రయత్నాలు ఉండడం సహజం. అయితే ఎన్నడూ నేను కలలో కూడా ఇలాంటి స్థానాలకు ఆలోచన చేయలేదు. అయితే నాకు యిష్టమైన కన్నడ భాష పనిని కొంచమైనా చేయడానికి ఇదొక అవకాశం. అందువల్ల నాకు సంతోషం కలిగింది. అదే రోజు ఉదయం సుమారు 12-45 గంటల సమయానికి ముఖ్యమంత్రిగారి ప్రెస్ సెక్రెటరీ, నా మిత్రుడూ అయిన శ్రీ ఎస్.సి.జయశీలరావు ఫోన్ చేసి నాకు అభినందనలు తెలిపారు. ఇంత త్వరగా మీకు ఎట్లా తెలిసింది అని అడిగాను. పావుగంట క్రితం పత్రికాగోష్ఠిలో మీ మరియు మిగిలిన అకాడమీల అధ్యక్షుల పేర్లను ప్రకటించారు అని చెప్పారు.

ఇంకొక స్థానానికి సునాయాసంగా వచ్చిన అహ్వానం గురించి ఇక్కడ ప్రస్తావించడం సబబు.

మండల్ కమీషన్

1980ల మొదటిభాగంలో మాజీ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయిన శ్రీ కె.ఆర్.రామచంద్రన్ గారు ఒక రోజు ఫోన్ చేశారు. వారిని నేను బాగా ఎరుగుదును. “నరసింహయ్య గారూ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఎలా అడగాలని సంకోచిస్తున్నాను” అని మొదలుపెట్టారు. “ఏ విషయమైనా నిర్మొహమాటంగా అడగండి సార్” అన్నాను. “మీ స్వభావం నాకు తెలుసు. అడగడానికి నాకే ఎందుకో జంకు” అన్నారు. ఇలా ఒకటి రెండు సార్లు అటువైపు ఇటువైపు పీకులాడిన తరువాత వారు ధైర్యం చేసి “మీ కులం ఏమిటి?” అని అడిగారు. నేను వెంటనే “నా కులాన్ని నేను మరచిపోయాను” అని నవ్వుతూ చెప్పాను. “నాకు తెలుసు. మీకు ఈ కుల వ్యవస్థ మీద నమ్మకం లేదు అని. మీ కులం ఏమి అనేదానికంటే నాకు కావలసింది మీరు వెనుకబడిన వర్గాని (Backward Class)కి చేరినవారే కదా అనే విషయం” అన్నారు. “అవును” అన్నాను. “ఇదంతా ఎందుకు” అడిగాను. “కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. మన రాష్ట్రం ముఖ్య కార్యదర్శిగారు మీది ఏ వర్గమో తెలపండి అని అడిగారు. మరికొన్ని రోజులలో వారే మాట్లాడుతారు” అన్నారు. “నాకు ఏ కమీషన్ సభ్యత్వమూ వద్దు” అని చెప్పాను.

ఇది జరిగిన ఐదు రోజులకు రాష్ట్రప్రభుత్వం ముఖ్య కార్యదర్శి అయిన శ్రీ ఎన్.నరసింహరావుగారు ఫోన్ చేశారు. వారు దివాన్ మాధవరావు గారి అబ్బాయి. నేను సెంట్రల్ కాలేజీలో బి.ఎస్.సి. ఆనర్స్ చదువుతున్నప్పుడు వారు బి.ఎస్.సి. చదువుతున్నారు. వారితో మామూలు పరిచయం ఉంది. “నరసింహయ్యగారూ, కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల వారికి ఒక కమీషన్‌ను ఏర్పాటు చేస్తున్నది. దానికి మీరు సభ్యులు కావడానికి అంగీకరించాలి” అన్నారు. నేను నవ్వుతూ “అవన్నీ వద్దు. కుదరదు” అన్నాను. “అలా అనకండి. ఆ కమీషన్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. ఢిల్లీలో ఉండటానికి ఇల్లు, వాహనం, జీతం అన్నీ దొరుకుతాయి. ఇదొక అపూర్వమైన అవకాశం. ఎంతో మంది దీనికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అవకాశం మిమ్మల్ని వెదుకుకుంటూ వచ్చింది. వద్దు అనకండి” అని బలవంతం చేశారు. అంతా సావధానంగా విని “నాకు ఏ సౌకర్యాలూ అవసరం లేదు. నాకు ఇదంతా సాధ్యం కాదు” అని ఖచ్చితంగా చెప్పాను. ఇది జరిగిన కొన్ని నెలలకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసి దానికి మండల్ గారిని అధ్యక్షులుగా నియమించింది. అదే ఇప్పుడు అందరికీ సుపరిచితమైన మండల్ కమీషన్. ఈ విషయాన్ని నేను కొద్దిమంది స్నేహితులకు మాత్రమే చెప్పాను.

ఆశ్చర్యం గొలిపే మరొక వార్తను విని ఉన్నాను. 10-12 సంవత్సరాల క్రితం కమ్యూనిష్టు పార్టీ నాయకులూ, నా స్నేహితులూ ఐన శ్రీ ఎం.ఎస్.కృష్ణన్ గారు మా హాస్టల్‌కు వచ్చారు. వారు ఎందుకు వచ్చారో మరిచిపోయాను. బహుశా వారు నడుపుతున్న కళాశాల వార్షికోత్సవానికి ఆహ్వానించడానికి వచ్చారని అనుకుంటున్నాను. ఇలాగే మాట్లాడుతున్నాము. వారు హఠాత్తుగా “నరసింహయ్య గారూ, మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియదు అనుకుంటాను. ఇప్పటికి రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రపతి పదవికి విద్యారంగ నిపుణులనో, ఉన్నత న్యాయవాదులనో పోటీకి నిలపవచ్చు అని వామపక్షాలవారు, జనతాపార్టీ ఆలోచిస్తున్నప్పుడు మీ పేరు ప్రస్తావనకు వచ్చింది. మేము దానికి ఒప్పుకున్నాము. అయితే మా కూటమి యునైటెడ్ ఫ్రంట్ లోని ఒకరిద్దరు నాయకులు మా సలహాను విరోధించారు. అప్పుడు మీ పేరును వదిలివేయాల్సి వచ్చింది” అన్నారు. “నాకు ఇదేమీ తెలియదు. మొట్టమొదటిసారి మీ నుండే ఈ విషయాన్ని వింటున్నాను” అన్నాను.

ఆ స్థానానికి నిలుచోవడానికి అంగీకరించే వాణ్ణో, లేదో, గెలిచేవాణ్ణో, ఓడేవాణ్ణో అదంతా వేరే విషయం. అయితే నన్ను ఆ స్థానానికి పోటీ పడటానికి ఒక బలమైన ప్రతిపక్షాల కూటమి గుర్తించింది కదా అనేది పరమాశ్చర్యకరమైన విషయం. అప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నట్లు ఆ కూటమి సూచించిన శ్రీ నీలం సంజీవరెడ్డిగారు గెలుపొందారు.

కన్నడ అభివృద్ధి అథారిటీ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇంకా 15 రోజులు కూడా కాలేదు. అందువల్ల అధ్యక్షుడిగా దాని అనుభవాన్ని వ్రాయడానికి కుదరదు. అయితే ఈ సందర్భంలో నాకు అత్యంత ప్రియమైన కన్నడ భాష పట్ల కొన్ని మాటలు చెప్పడం యుక్తం.

కన్నడ మన భాష. దీనిని అన్ని రంగాలలో పెంపొందించడం మనందరి కర్తవ్యం. నా అభిప్రాయంలో కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న వారందరూ కన్నడిగులే. వారి మాతృభాష ఏదే అయినా వారు వాస్తవంగా కన్నడిగులే.

విద్యామాధ్యమం కన్నడ కావాలని మొదటి నుండీ నొక్కి చెబుతూ ఉన్నాను. స్వాతంత్ర్యానికి పూర్వం హైస్కూలు స్థాయి వరకూ కన్నడ మీడియం ఉండేది. ఎక్కడో అక్కడొకటి ఇక్కడొకటి ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చాక, ఇంగ్లీషు వారు మన దేశాన్ని వదిలి వెళ్ళాక నిదానంగా ఇంగ్లీషు భాష వైపు మన అభిమానం మొగ్గి, ఇప్పుడు అదొక విడదీయలేని వ్యామోహంగా మారింది. బెంగళూరు వంటి పట్టణాలలో శిశువిహార్ నుండే ఇంగ్లీషు మొదలౌతుంది. ఇంగ్లీషు మీడియం వారిదే ఒక పెద్ద జాతి అయ్యింది. ఈ ఇంగ్లీష్ మీడియం జాతి మిగిలిన జాతులకన్నా ఎక్కువ అపాయకరమైనది. తమ దేశంలోనే వీరు పరదేశీయులైనారు. నాకైతే ఇది ఎక్కువ బాధను కలిగించింది. కనీస పక్షం ప్రాథమిక స్థాయిలోనైనా నిర్బంధంగా కన్నడ మాధ్యమం చేయండి అనే విజ్ఞప్తులకు అనేక విఘ్నాలు కలిగి ఆ విషయం ఉన్నత న్యాయస్థానం ముందు ఉన్నది. మన భాషలో పాఠం చెప్పండి అనడమే మా అపరాధం. దానికోసం మమ్మల్ని కోర్టుకు లాగారు.

బెంగళూరులో 60 సంవత్సరాలుగా ఉంటూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బెంగళూరులో కన్నడ భాషకు వచ్చిన వర్ణనాతీతమైన దుస్థితి గురించి 1956వ సంవత్సరంలో ప్రజావాణి పత్రికకు ‘అభిమానశూన్య బెంగళూరు’ అనే శీర్షికతో ఒక వ్యాసం వ్రాసి పంపాను. అది అచ్చయ్యింది. దానిని చదివి కు.వెం.పు.గారు ఆ వ్యాసం గురించి కొన్ని మంచిమాటలు చెప్పారట. అదే శీర్షికతో మా నేషనల్ హైస్కూలు అమృతోత్సవ ప్రత్యేక సంచికలో నా వ్యాసం ప్రచురితమయ్యింది. శీర్షిక ఒకటే కానీ ఈ మధ్యలో కన్నడ గురించి బెంగళూరులో అభిమాన శూన్యత ఎక్కువవుతూ వచ్చినందువల్ల సహజంగానే వ్యాసమూ పెద్దదయ్యింది.

భాష విద్యారంగానికి మాత్రమే పరిమితం కాదు. సాంస్కృతిక రంగంలోనూ దీని పాత్ర మహత్వపూర్ణమైనది. భాషకూ, సంస్కృతికీ చాలా దగ్గరి సంబంధం. ఒక సంస్కృతిని పెంపొందించాలంటే భాష అతి ముఖ్యం. మన సంస్కృతిని మన భాష ద్వారా మాత్రమే అభివృద్ధి చేయడం సాధ్యం. ఇంగ్లీషు ద్వారా మన సంస్కృతిని పెంపొందించడం సాధ్యం కాదు. అలా ప్రయత్నించడమూ మంచిది కాదు. అతి ఇంగ్లీష్ వ్యామోహం నుండి టెలివిజన్ మరియు ఇతర ప్రసార మాధ్యమాల దాడితో మన సంస్కృతికి ఎన్నడూ లేని ఆపద వచ్చింది. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సమయంలో ఒక ఇంగ్లీష్ ఉన్నత అధికారి భారతీయ ఉన్నత అధికారితో ఇలా అన్నాడట – “Yes, today you have won political independence. But do not forget we have left behind Western Culture – ఔను, ఈ రోజు మీరు రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందారు. అయితే మేము మాత్రం పాశ్చాత్య సంస్కృతిని ఇక్కడ వదిలి వెళుతున్నాం అనేది మరవకండి.” ఎంతటి కఠోర సత్యంతో, ముందు ఆలోచనతో కూడిన మాట! పాశ్చాత్య సంస్కృతి యొక్క సమస్యను మనం అనుభవిస్తున్నాము. మమ్మీ, డాడీ, కేక్, క్యాండల్ సంస్కృతి పార్థేనియం వ్యాపించినట్లు దేశమంతటా వ్యాపిస్తూ ఉంది. ఎంతటి సిగ్గుచేటయిన విషయం! ఇప్పుడు మనం ఇంగ్లీషు భాషకు గులాములం, పాశ్చాత్య సంస్కృతికి గులాములం. ఆర్థిక క్షేత్రంలో పరాధీనులమయ్యాము. ఇక మనకు మిగిలింది – బలహీన రాజకీయ స్వాతంత్ర్యం.

ఇప్పటికైనా మేల్కొని మనం ఒక క్రమబద్ధమైన ప్రయత్నంతో పాశ్చాత్య సంస్కృతి బంధాలను వదిలించుకోక పోతే వీటికి మన గులాంగిరీ సంపూర్ణ స్థాయికి చేరుతుంది.

బి.ఎం.ఎస్.విద్యా సంస్థల ట్రస్టుకు అధ్యక్షుడిగా

నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకరోజు నా పూర్వవిద్యార్థి, న్యాయవాది ఒకరు నన్ను బి.ఎం.ఎస్.సంస్థల ట్రస్టుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తున్నట్లు బహిరంగంగా కోర్టులో ప్రకటించారు అని చెప్పగా విని నాకు ఆశ్చర్యం కలిగింది. బి.ఎం.ఎస్. కాలేజీకి ఒక ట్రస్ట్ ఉన్నది నాకు తెలియదు. దానికి నన్ను ఎందుకు నామినేట్ చేశారనే విషయము నాకు తెలియదు. పైగా ఇలా నామినేట్ చేసిన ప్రధాన న్యాయమూర్తిని నేను చూడనే లేదు.

తరువాత దీని విషయం ఏమి అని తెలుసుకున్నాను. బి.ఎం.ఎస్. కాలేజీ స్థాపకులైన శ్రీ బి.ఎం.శ్రీనివాసయ్యగారి కుమారుడు శ్రీ బి.ఎస్.నారాయణగారు వారి స్థానంలో వచ్చారు. వారు మరణించాక వారికి సంతానం లేని కారణంగా ఆ సంస్థ పరిపాలనను ఎవరు చూసుకోవాలి అనే విషయం వివాదాస్పదమై హైకోర్టు వరకూ వెళ్ళింది. కొన్ని సంవత్సరాలు ఈ వాద వివాదాలు హైకోర్టులో నడుస్తూ ఉంది. ఫలితం మాత్రం కనిపించలేదు. ఇదొక సివిల్ దావా అయినందువల్ల ఇది ముగియడానికి ఇంకా చాలా సమయం కావలసి ఉందని భావించి ఈ కాలేజీని క్రమబద్ధంగా నడపడానికి తాత్కాలికంగా ఐదు మంది సభ్యులతో ఒక ట్రస్టును నియమించారు. ఆ ట్రస్టులో ప్రభుత్వం నామినేట్ చేసిన ఒక సభ్యుడు, ఇతరులు ఇద్దరు, ఒక విశ్వవిద్యాయలం మాజీ ఉపకులపతి. దానికోసం ఆ స్థానానికి నన్ను నామినేట్ చేశారని తెలిసింది. దీనిని నేను అంగీకరించాలా వద్దా అని ఆలోచించాను. అప్పుడు నా వయసు 79 సంవత్సరాలు. పైగా నేషనల్ కాలేజీ, హైస్కూల్, అప్పర్ మిడిల్ స్కూలులతో కూడిన 11 సంస్థల జవాబుదారీ కూడా ఉంది. ఒక ఉన్నత న్యాయాలయపు ప్రధాన న్యాయమూర్తి నమ్మకంతో నన్ను నామినేట్ చేసినదానిని తిరస్కరించడం న్యాయమా అని ఒక వైపు ఆలోచన. వయసు మరియు నేను ఇప్పటికే మోస్తున్న జవాబుదారీ పనులు మరొక వైపు. మరుసటి రోజు హైకోర్టు పధాన న్యాయాధీశుల కార్యదర్శి నాకు ఫోన్ చేసి ఈ విషయమై నా నిర్ణయాన్ని తెలుపవలసిందిగా కోరారు. ఆలోచించడానికి రెండురోజుల గడువు అడిగాను. ఈ మధ్య ట్రస్టుకు ప్రభుత్వం నుండి నామినేట్ అయిన ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీ ఎం.ఆర్.శ్రీనివాసమూర్తి గారు నన్ను కలిసి ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసినదాన్ని అంగీకరించమని చెప్పారు. సరే అని అన్నాను. నా నిర్ణయాన్ని హైకోర్టుకు తెలిపాను.

బి.ఎం.ఎస్.ఇంజనీరింగ్ కాలేజీని ధర్మప్రకాశ రాజకార్య ప్రసక్త బిరుదాంకితులైన బి.ఎం.శ్రీనివాసయ్యగారు 1946లో బెంగళూరులోని బసవనగుడిలో స్థాపించారు. నేను అతి దగ్గరలో ఉన్న నేషనల్ కాలేజీకి భౌతికశాస్త్రపు అధ్యాపకుడినై అక్కడ భౌతిక శాస్త్ర అధ్యాపకుల కొరత ఉన్నప్పుడు నాలుగైదు నెలలు పార్ట్ టైం అధ్యాపకుడిగా పనిచేశాను. అప్పుడు బెంగళూరులో రెండే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజీ (ప్రస్తుతం యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ – యు.వి.సి.ఇ.) మరొకటి బి.ఎం.ఎస్.ఇంజనీరింగ్ కాలేజీ (బి.ఎం.ఎస్.పాలక మండలి నిర్వహణలో ఉండేది).

బి.ఎం.ఎస్.ఇంజనీరింగ్ కాలేజీ, ఈవినింగ్ ఇంజనీరింగ్ కాలేజీ, బి.ఎం.ఎస్.మహిళా కాలేజీ మరియు బి.ఎం.ఎస్.లా కాలేజీ – ఇలా నాలుగు సంస్థలను ట్రస్టు నడుపుతూ ఉంది. ఈవినింగ్ ఇంజనీరింగ్ కాలేజీ సహజంగానే పగటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలోనే ఉంది. మిగిలిన రెండు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీకి అర్ధ కి.మీ.కన్నా తక్కువ దూరంలో ఉన్నాయి. అందువల్ల వాటి పాలనను బాగా నిర్వహించవచ్చు. ఈ నాలుగు కాలేజీలను నడపడానికి ఒక్కొక్క బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఉంది. మూడు బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లకు – పగలు ఇంజనీరింగ్ కాలేజీ, సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజీ, మహిళా కాలేజీల పరిపాలన బాధ్యతను నాకు అప్పగించారు. నాకేమీ ఇలాంటి పాలన జవాబుదారీ కొత్త కాదు, కష్టమూ కాలేదు. నేను సామాన్యంగా రోజుకు ఒకసారి పగలు ఇంజనీరింగ్ కాలేజీ మరియు మహిళా కాలేజీకి వెళ్ళేవాడిని. సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజీ సమస్యలు పగలు ఇంజనీరింగ్ కాలేజీ సమస్యలంత లేవు. మహిళా కాలేజీలో కూడా అంతే. ఐతే 1500 మందికన్నా ఎక్కువ విద్యార్థులున్న పగలు ఇంజనీరింగ్ కాలేజీలో పరిపాలనా పరమైన, విద్యాపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. వీటికన్నా ఎక్కువ అధ్యాపకుల, ఇతర సిబ్బంది సర్వీస్ రూల్స్ గురించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నయితే అలాగే కొన్ని సంవత్సరాల నుండీ కొనసాగి వస్తున్నాయి. బోధనేతర సిబ్బంది వేతన స్కేళ్ళ సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి తాత్కాలికంగా కాకుండా ఒక శాశ్వత పరిష్కారంవైపు ధ్యాస పెట్టి వారందరికీ ప్రభుత్వ స్కేళ్ళు ఇవ్వాలని నిర్ణయించాము. మరియు దానిని అమలు చేశాము. అసంతృప్తితో ఉన్న సిబ్బంది వర్గానికి సంతోషం అయ్యిందని చెప్పాల్సిన అగత్యం లేదు. బోధనా సిబ్బందిలో కూడా చాలా తారతమ్యాలు నియమాలకు లోబడనివి ఉన్నాయి. కొన్నయితే ఎక్కువ క్లిష్టంగా ఉన్నాయి. వాటి చిక్కుముడులు విప్పడమే కష్టమయ్యింది. వాటిని వంతులవారీగా పరిష్కరించాము. వారికంతా చాలా సంతోషమయ్యింది.

కాలేజీకి చాలా భవనాల ఆవశ్యకత ఉండేది. అందులోనూ హాస్టళ్ళకు భవనాల అవసరం ఎక్కువగా ఉండేది. వసతి చాలా ముఖ్యం. భోజనం హోటల్లోనో, ఎక్కడో చేయవచ్చు. అయితే స్నానాల గది, శుభ్రమైన శౌచాలయం లేకపోతే చదువు కొనసాగించడం కష్టమయ్యేది. బి.ఎం.ఎస్.కాలేజీకి దేశంలో మంచిపేరు ఉంది. అందువల్ల చాలామంది ఢిల్లీ, కలకత్తా, ముంబాయి వైపు నుండి ఈ కాలేజీలో ప్రవేశం పొందడానికి కాచుకుని ఉంటారు. అలాగే దక్షిణ భారతం, మన రాష్ట్రం బయట నుండి కూడా డిమాండు ఉంది. ఇందువల్ల హాస్టళ్ళకు తట్టుకోలేని ఒత్తిడి. ఈ సమస్యను పరిష్కరించడానికి సుమారు 250 మందికి సరిపడే ఒక హాస్టల్‌ను నిర్మించారు. అలాగే ఆడపిల్లలకూ 100 కన్న ఎక్కువ విద్యార్థినులకు సరిపోయే మరొక భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతానికి సమస్య పరిష్కారమయ్యింది. ప్రతి సంవత్సరం ఈ డిమాండు పెరుగుతూనే ఉంది.

పుస్తక భండారానికీ భవనం ఆవశ్యకత ఉంది. పుస్తక భండారం విద్యాసంస్థ ఆత్మ ఉన్నట్లు అందువల్ల చాలా చర్చలు జరిపి ఒక భవనాన్ని కట్టించాము. ఈ లోటుకు ఒక శాశ్వత పరిష్కారం లభించింది.

నాకు క్రీడలు చాలా ఇష్టం. ముఖ్యంగా బాస్కెట్ బాల్, హాకీ ఆటలలో చాలా పరిణతి ఉంది. మా నేషనల్ కాలేజీవారు ఈ రెండు క్రీడలలో జాతీయస్థాయి టీములపై చాలా పందాలు ఆడారు. అదీకాక క్రీడలు కూడా విద్యలో ఒక విడదీయలేని అంగం అని నా ఖచ్చితమైన అభిప్రాయం.

బి.ఎం.ఎస్.కాలేజీలో ఒక మంచి ఇండోర్ స్టేడియం అవసరం ఉంది. ఈ కొరతను పోగొట్టడానికి చాలా చర్చల తరువాత ఒక దివ్యమైన ఇండోర్ స్టేడియం నిర్మాణమయ్యింది. ఇదొక అపురూపమైన విజయం. ఈ స్టేడియంలో బాస్కెట్ బాల్ ఆడవచ్చు. లేదా దానికి బదులుగా నాలుగు షటిల్ కాక్ కోర్టులు అవుతాయి. అప్పుడు నాలుగు కోర్టులలోనూ ఒకే సారి ఆడవచ్చు. దీనితో పాటు క్యారమ్స్, చెస్ మొదలైన ఆటలను స్టేడియంలోని మిగిలిన భాగంలో ఆడవచ్చు. ఈ స్టేడియంలో సుమారు 300 మంది కూర్చోవచ్చు. అందువల్ల దీనిని సభాప్రాంగణంగా కూడా ఉపయోగించవచ్చు. ఇలా స్టేడియం క్రీడలకే కాక సభలు నడపడానికీ ఉపయోగపడుతోంది.

ఇవికాక కొన్ని అసంపూర్ణ కట్టడాలను కట్టి ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అతిముఖ్యం. చాలా శతాబ్దాలనుండి వస్తున్న ఈ సంస్కృతి మన అమూల్యమైన ఆస్తి. దానిని మనం పెంపొందించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు ఒకరకమైన విద్యయే. అందువల్ల ఈ కార్యక్రమాలకు ఎక్కువ ప్రోత్సాహాన్నివడానికి అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన ఒక సమితిని ఏర్పాటు చేశాము. ఒక విద్యా సంస్థకు వార్తా సమీక్ష అవసరం. దీనివల్ల సంస్థలో ఏఏ కార్యక్రమాలు నడిచాయి అని తెలుస్తుంది.

మహిళా కాలేజీలోను ముందు నుండీ కొనసాగుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపించాము. మహిళా కాలేజీ ఆవరణ పెద్దగా లేదు. అంత మంచి స్థలంలో అంత దొరికిందే ఎక్కువ. ఎక్కువ క్రీడలు ఆడటానికి స్థలం లేదు. అయినా విద్యార్థినులు క్రీడలలో మిగిలిన జట్లలో లేదా అవకాశం ఉన్న చోట అభ్యాసం చేసి కొన్ని క్రీడలలో మంచి స్థాయికి చేరారు. వారి సాంస్కృతిక కార్యక్రమాలూ చాలా బాగున్నాయి.

2002 సెప్టెంబర్ నెలలో బి.ఎం.ఎస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఒక కొత్త కాలేజీని యలహంకకు కేవలం నాలుగైదు కి.మీ. దూరంలో ఉన్న ఒక ప్రశాంతమైన 20 ఎకరాల స్థలంలో పాలకవర్గం మొదలుపెట్టింది.

ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. వయస్సు 82 అయ్యింది. మా నేషనల్ సంస్థలలో ముఖ్యంగా నాలుగు కాలేజీలలో కొన్ని విద్యాపరమైన నియమాలు జారీ అయ్యాయి. పని పెరిగింది. నేను 2002 అక్టోబర్ నెలలో నన్ను అక్కడి నుండి విడుదల చేయాలని బి.ఎం.ఎస్.ఉన్నత అధికారులకు ఉత్తరం ఇచ్చాను. ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు కొనసాగాలని బలవంతం చేశారు. నేను ఒప్పుకోలేదు. వీడ్కోలు చెప్పాను.

నా పదవికి కొన్ని సౌకర్యాలు ముఖ్యంగా అలవెన్సులు, మీటింగుల ఫీజులు ఇచ్చేవారు. నేను వినయంతో వాటినన్నింటిని నిరాకరించాను. ఐతే ఇంజనీరింగ్ కాలేజీ, మహిళా కాలేజీలను చూస్తే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ఆ కాలేజీలలో అధికారం లేకపోయినా 10-15 రోజులకు ఒకసారి వాటిని సందర్శిస్తూ ఉంటాను.

ఆ కాలేజీలకు శుభం కలగాలని కోరుకుంటాను.

పోరాటపథం

ఇది నా ఆత్మకథ చివరి అధ్యాయం. నేను నడిచివచ్చిన దారిని సింహావలోకనం చేసుకున్నప్పుడు నా జీవితమే ఒక అద్భుతం అనిపిస్తుంది. కొన్ని ముఖ్య సంఘటనలు నా జీవితానికి కొత్త అర్థవంతమైన మలుపులు తిప్పాయి. నేను లోయర్ సెకండరీ పరీక్షలో పాస్ అయ్యి చదువు కొనసాగించడానికి సౌకర్యం లేక నా విద్యాభ్యాసానికి మంగళం పాడినప్పుడు ఒక సంవత్సరం తరువాత హోసూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ ఎం.ఎస్.నారాయణరావుగారు నన్ను చదువుకై బెంగళూరుకు పిలుచుకుని రావడం నా జీవితంలో నడిచిన అత్యంత ప్రముఖ ఘటన. అది జరగకపోతే నా చదువు ముందుకు సాగడానికి సాధ్యమే అయ్యేదికాదు. ఇంకేం బి.ఎస్.సి. ఆనర్స్ డిగ్రీ చేతికి అందుతుంది అనుకున్న సమయంలో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో దూకడం, నేషనల్ కాలేజీలో అధ్యాపకుడైన ఒక సంవత్సరానికే ‘మైసూర్ చలో’ ఉద్యమంలో పాల్గొనడానికి ఉద్యోగానికి రాజేనామా చేయడం వంటి సాహసోపేత నిర్ణయాలు ఇప్పుడు నేను నడచివచ్చిన దారి దిశనే మార్చగలిగిన సంఘటనలు. ఇవన్నీ ఆకస్మిక సంఘటనలో లేదా వ్యవస్థీకృతమైన సంఘటనలో నాకు తెలియదు. జీవన విధానానికి మలుపు తిప్పదగిన ఇలాంటివే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఇంకా కొందరి జీవితంలోనూ జరిగి ఉండవచ్చు.

నా బాల్యంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ మొదలైన జాతీయ నాయకులు నా ఆలోచనలను, విలువలను రూపొందించారు. నేను అన్నింటినీ గంభీరం (Serious)గా తీసుకుంటాను. అందువల్లే నేను ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనింది. శ్రీ రామకృష్ణాశ్రమంలో రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు స్వామీ వివేకానంద నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపారు. నిస్వార్థ సేవయే వీరి ముఖ్య సందేశం. స్వామీ వివేకానంద గారి “They alone live who live for others. The rest are more dead than alive. – పరులకోసం ఎవరు బ్రతుకుతారో వారిదే నిజమైన బ్రతుకు. మిగిలినవారు జీవచ్ఛవాలు” అన్న సూక్తి నా మనసులో ముద్రపడింది. ఒకటి రెండు సంవత్సరాలు సావధానంగా ఆలోచించి అన్ని సాధక – బాధకాలను పరిగణనలో తీసుకుని పెళ్ళి చేసుకోకూడదని అంతిమ నిర్ణయం తీసుకున్నాను. ఇది కూడా నేను తీసుకున్న అత్యంత ముఖ్య నిర్ణయాలలో ఒకటి.

పెళ్ళి చేసుకోవాలి అనేది అత్యంత్య సహజమైన, బలమైన ఒత్తిడి. పెళ్ళి చేసుకోకుండా ఉండాలి అంటే, పెళ్ళి చేసుకోవాలన్న ఒత్తిడికి సరితూగే అంతే బలమైన, మక్కువైన ప్రయోజనం, లక్ష్యం జీవితంలో ఉండాలి. ఆలోచనలు అడ్డదిడ్డంగా పోకుండా వాటికి కళ్ళెం వేసే ఎల్లప్పుడూ చేతినిండా పని, క్రమశిక్షణతో కూడిన జీవితం, ఏదైనా సాధించాలనే హఠం ఉండాలి. అప్పుడు ఆలోచనలు పక్కదారి పట్టే సంభవం తక్కువ అవుతుంది.

నా పెళ్ళి విషయమై చాలా మంది నన్ను అడుగుతారు. ఒకసారి ఒకరు అడిగినప్పుడు “అయ్యో, నేను పెళ్ళి చేసుకోవాలి అనే విషయాన్నే మరిచిపోయాను” అని ఉత్ప్రేక్షతో కూడిన లఘుధాటి (Lighter Vein) లో చెప్పాను. మరొకసారి ఒక సభలో ఒక స్త్రీ “మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా సార్?” అన్నారు. “ఏమి కావాలన్నా ఆడగమ్మా” అన్నాను. “మీరెందుకు పెళ్ళి చేసుకోలేదు సార్” అని అడిగారు. “ఏమమ్మా, ఈ ప్రశ్న అడిగి నాకు బాధను కలిగిస్తున్నావు కదమ్మా. మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేగేలా చేశావు. ఈ విషయం నా జీవితంలో మనసుకు వేదన కలిగించే అధ్యాయం. ఒకసారి ఒకరిని ‘పెళ్ళి చేసుకొంటావేమమ్మా’ అని అడిగాను. దానికి వారు ‘అయ్యో, అందరినీ వదిలిపెట్టి మిమ్మల్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు. ముందుకు వెళ్ళండి’ అన్నారు. మనసుకు చాలా బేజారయ్యింది. ఇక ఎవరినీ అడగకూడదని అనుకున్నాను. ఇంతకు ముందు ఎక్కడో చదివిన ‘మరల ప్రయత్నించు, మరల ప్రయత్నించు’ అనేది జ్ఞాపకం వచ్చింది. నా విద్యాభ్యాసపు పరీక్షలలో మరల ప్రయత్నించే అవకాశం నాకు చిక్కలేదు. అందువల్ల ఈ సందర్భంలో అయినా ఇంకొక సారి అంతిమంగా ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నాను. తొందరపడకుండా పూర్వాపరాలను ఆలోచించి, ధైర్యం చేసి ‘నీవు నన్ను పెళ్ళి చేసుకొంటావేమమ్మా’ అని ఇంకొకరిని అడిగాను. ఆవిడ ‘మీ మొఖాన్ని మీరు రోజూ అద్దంలో చూసుకుని కూడా నన్ను పెళ్ళి చేసుకోమని అడుగుతున్నారు కదా? మీకు ఎంత ధైర్యం ఉండాలి’ అని ముఖం మీద కొట్టినట్లు చెప్పారు. ఆ షాక్ నుండీ నేను ఇంకా తేరుకోనే లేదు. ఆ రోజు నుండి ఆ ఆలోచనే వదిలివేశాను” అని చెప్పాను. ఒక నిముషం ఆ సభ అల్లకల్లోలం అయ్యింది. అందరూ పడీపడీ నవ్వారు. ఆమె మాత్రం “మీరు ఎప్పుడూ సీరియస్ విషయాలకు హాస్యపు లేపనం పూస్తారు. మీరు ఇంతసేపు చెప్పింది అంతా అబద్ధం” అన్నారు.

నేను పుట్టింది ఆదివారం నాడు. అయితే నా జీవితంలో ఆదివారమే లేదు అని వెనుక ఎక్కడో చెప్పాను. ఇది అక్షరాలా నిజం. ఇంతవరకూ నాకు ఏ ఆదివారమూ, సెలవురోజూ లేదు. నేను చేసే పని ఎక్కువ శ్రమతో కూడినదైనా నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. అయినా అప్పుడప్పుడూ ఒంటరితనం గుర్తుకు వస్తుంది. అయితే ఆ ఆలోచన కాలవ్యవధి చాలా కొంచెమే.

ఉదయం నుండి సాయంత్రం 7-8 గంటలవరకూ పని, భోజనం అయ్యాక కూడా చదువు, చేయడానికి పని ఉండే ఉంటుంది. పడుకున్న 5-10 నిముషాలకు నిద్ర వస్తుంది. రెండు సంవత్సరాల క్రితం ఒక మానసికవైద్యులు మీకు నిద్ర బాగా వస్తుందా అని అడిగారు. పడుకున్న తరువాత 5-10 నిముషాలు చాలు అన్నాను. మీరే పుణ్యాత్ములు అన్నారు.

నేను మొదటి నుండీ స్వతంత్రంగా ఆలోచించే స్వభావాన్ని అభ్యాసం చేసుకుంటూ వచ్చాను; దేనినీ ప్రశ్నించకుండా ఒప్పుకోను. నేను మూఢనమ్మకాలను, మాయమంత్రాలను, జ్యోతిష్యాన్నీ కటువుగా విమర్శిస్తూ వచ్చాను. మాయలు, మూఢనమ్మకాల గురించి నా ఖచ్చితమైన అభిప్రాయాలను వెనుక చాలా వివరంగా చెప్పాను. జ్యోతిష్యం గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలను చెప్పడం ఉచితం అనిపిస్తుంది.

మనిషిపై గ్రహాల ప్రభావం ఉంది అనే నమ్మకంపై నిర్మించిన సౌధమే జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్యం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నాయి. ఆ తొమ్మిదిలో సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువులు ఉన్నాయి. సైన్స్ ప్రకారం సూర్యుడు గ్రహం కాదు. ఒక నక్షత్రం. చంద్రుడు ఉపగ్రహం. రాహుకేతు గ్రహాలు లేనే లేవు. ఈ విషయాలన్నీ ఒక హైస్కూలు విద్యార్థికి తెలుసు. జ్యోతిష్కుల తొమ్మిది గ్రహాలలో నాలుగు తప్పుడు లెక్కాచారంతో కూడి ఉన్నాయి. దీనితో జ్యోతిష్యం కథ ముగిసింది కదా! దానికి పునాదే గట్టిగా లేక పోయింది. అందువల్ల దాని మీద కట్టిన జ్యోతిష్యం అనే సౌధం కుప్పకూలి పోయింది.

రాహువే లేనప్పుడు రాహుకాలం ఎక్కడనుండి వస్తుంది? రాహుకాలం చెడ్డది అనే భావన చాలామందిలో ఉంది. అది నిజమయితే రాహుకాలంలో బయలు దేరే బస్సులకు, రైళ్ళకు, విమానాలకు ప్రమాదాలు జరగాలి. ప్రమాదాలకు రాహుకాలానికీ ఏ సంబంధమూ లేదు. జాతకాలు కూడా జ్యోతిష్యం ఆధారంగానే రచింపబడతాయి. పిల్లవాడు పుట్టినప్పుడు గ్రహాల స్థానం ఆధారంపై జాతకం వ్రాస్తారు. ఆ జాతకంలో పిల్లవాని జీవితంలోని అన్ని విజయాలు, ప్రముఖ ఘట్టాలు కలిగి ఉంటాయి అనే నమ్మకం ఉంది. ఇది శుద్ధ అబద్ధం. విమాన ప్రమాదంలో చనిపోయే వందలాది మంది జాతకాలలో వారంతా ఇలాగే మరణిస్తారని ఏ జ్యోతిష్యుడూ వ్రాయడానికి సాధ్యం కాదు. 1962లో అష్టగ్రహకూటమి వల్ల అనాహుతం జరుగుతుందని బొబ్బలు పెట్టిన జ్యోతిష్కుల భవిష్యత్తు మట్టి కరిచింది. జ్యోతిష్యులు చెప్పేది అస్పష్టం. గోడ మీద పెట్టిన దీపం లాంటిది. ఒక్కొక్కసారి జ్యోతిష్యం కాకతాళీయంగా నిజం కావచ్చు. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు సరియైన సమయాన్ని చూపుతుంది!

చాలామందికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలా ఉందో అలాగే పూజాపునస్కారాలవల్ల వ్యక్తుల మరియు సమాజ కళ్యాణం జరుగుతుందన్న నమ్మకమూ ఎక్కువగా ఉంది. స్వతంత్రంగా ఆలోచిస్తే వీటికి అర్థంలేదు. మనయొక్క ఏ కీర్తి ప్రతిష్ఠలకు పూజాదికాలకు సంబంధం లేదు. ప్రపంచంలో లక్షలాది మంది చింతనాపరులూ, దార్శనికులూ, రాజకీయ నాయకులూ పూజా, ప్రార్థనల సహాయం లేకుండానే గణనీయమైన స్థానాలను గెలుచుకున్నారు. విశ్వవిఖ్యాత ఐన్‌స్టైన్, రసెల్ వంటివారికి ఇలాంటి నమ్మకాలకూ సంబంధమే లేదు. అజ్ఞయవాది(Agnostic) జవహర్లాల్ నెహ్రూ గారు 12 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. అలాగే నాస్తికులు జ్యోతిబసు సుమారు 12 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ ఎక్కువ సమయం అధికారంలో ఉండి రికార్డును సృష్టించారు. ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి.

ఇంకొక సహించరాని విషయం ఏమిటంటే దేవునికి వజ్రవైఢూర్యాలతోనూ, వెండి బంగారాల నగలతోనూ అలంకరించడం. దేవునికి ఇదంతా ఎందుకు? ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇలాంటి శ్రీమంతులైన దేవుళ్ళ అమూల్యాభరణాలను మనం – మనుషులం కాపాడాలి. తనను తానే కాపాడుకోలేని దేవుడు మనలను ఎలా కాపాడుతాడు? మనల్ని మనమే కాపాడుకోవాలి.

విశ్వశాంతికోసం యజ్ఞ యాగాదులను మన దేశంలో ఆచరిస్తారు. ప్రంపంచంలోని అనేక దేశాలలో సుఖశాంతులున్నాయి. మన దేశంలోనే ఎప్పుడూ హింస, అశాంతి. అయినా విశ్వశాంతి పేరుతో వీలైనంత దోపిడీ, విలువైన వస్తువుల దహనం చెప్పలేనంతగా జరుగుతూనే ఉంది.

నదులలో, ‘పవిత్ర’మైన నదులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది మరొక మూఢనమ్మకం. సంవత్సరంలో కొన్ని రోజులు ‘పవిత్ర’ నదులలో స్నానం చేసి పుణ్యం మూటకట్టుకోవడానికి తొక్కిసలాట. గంగానది అత్యంత పవిత్రమైన నది అనే నమ్మకం చాలామందికి ఉంది. అయితే గంగానంది వంటి కలుషితమైన నది మరొకటి లేదని శాస్త్రీయంగా నిరూపించబడింది. గంగానదిని మనమే శుద్ధి చేయవలసిన పరిస్థితి వచ్చింది. చర్మాన్ని కడిగితే ఖర్మం పోతుందా?

మనలో నిదర్శనానికన్నా ప్రదర్శనానికే ఎక్కువ విలువ. బంట్రోతు మొదలుకొని రాష్ట్రపతి వరకూ చాలా మంది తమ తలనీలాలను దేవునికి సమర్పిస్తారు. తలలు బోడులు కావడానికన్నా తలపులు బోడులవతున్నాయి. ఇలాగే చాలా మూఢనమ్మకాల ప్రస్తావనను శాస్త్రీయంగా విశ్లేషించడం అవసరం. భయం మరియు అహేతుకమైన భావనలే మూఢనమ్మకాల ఆస్తి.

నేనిలాగే మూఢనమ్మకాలను, మాయలను, అర్థరహితమైన సంప్రదాయాలని విమర్శిస్తే చాలామందికి అనుమానం వచ్చి నాకు దేవునిపై నమ్మకం ఉందా? అని అడుగుతారు. చాలామంది తమ స్వార్థానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారు. ఇలాంటి లావాదేవి దేవునిపై నాకు నమ్మకం లేదు. అయితే ఒక చైతన్యశక్తి ఉండవచ్చన్నది నా నమ్మకం. దేవుడు ఉన్నాడా లేడా అనే సమస్య శతాబ్దాల నుండీ బుద్ధిజీవులను పీడిస్తోంది. ఎంత ఆలోచించినా ఈ సమస్యకు సమాధానం లభించలేదు. దేవుడు ఉన్నాడు లేదా లేడు అనేది నమ్మకం అవుతుంది. దేవుడు ఉన్నాడని శాస్త్రీయంగా నిరూపించడం సాధ్యం కాదు. అలాగే లేడు అని ధృవీకరించడం కూడా సాధ్యపడదు. అందువల్లే ప్రపంచంలోని అనేకమంది చింతనాపరులు, తత్వవేత్తలు, అజ్ఞేయతావాదులు దేవుడు ఉన్నాడని చెప్పరు. లేడనీ చెప్పరు. “దేవుడు, ఆత్మ మొదలైన వాటి గురించి చర్చించడం వ్యర్థం. అందువల్ల మంచిపని చేయి మరియు మంచివాడివి కా – Do good and be good” అని బుద్ధుడు పదేపదే తన శిష్యులకు బోధించేవాడు. ఇది అత్యంత వ్యవహారికమైన practical ఉపదేశం. దేవుడు లేకపోతే పోనీ మనుష్యుడు ఉన్నాడు కదా. అందువల్ల మన ధర్మానికి మనుష్యుడు కేంద్రబిందువు కావాలి. దేవునిపై నిజంగా నమ్మకం ఉంటే వారు చెడ్డపనులు చేయరాదు; లంచం పుచ్చుకోరాదు; కర్తవ్య ప్రజ్ఞతో ప్రామాణికంగా పనిచేయాలి.

నేను దేవుని గురించి, ఆత్మగురించి, పునర్జన్మ గురించి చాలా ఆలోచించాను, పుస్తకాలను చదివాను, ఉపన్యాసాలను విన్నాను. అయితే శాస్త్రీయంగా వీటిని దేనినీ ధృవపరచడంలో విజయుణ్ణి కాలేదు. పునర్జన్మ ఉండవచ్చని నా నమ్మకం. పునర్జన్మ నమ్మకం లేక పోతే ప్రజలు తాడూబొంగరం లేని జీవితాన్ని గడపడానికి పుష్టి లభించి విపత్తు సంభవిస్తుంది. వీటి గురించి నేను ఎంత ఆలోచించినా చివరకు నాకు ‘సేవ’యే దేవుడు. విద్యాసంస్థలు, ఆసుపత్రులే దేవస్థానాలు. దయ, జాలి, మానవతా విలువలే దేవుడు. అయితే ఇంతమాత్రం నిజం అనిపిస్తుంది; ఈ విశ్వం నిగూఢరహస్యాన్ని శాస్త్రవేత్తలు కానీ, ధార్మిక వ్యక్తులు కానీ, ఋషులుగాని, మునులు గానీ తెలుసుకోలేక పోయారు. విజ్ఞాన శాస్త్రానికి ఈ విశ్వం పుట్టుక గురించి అంతిమంగా చెప్పడానికి కావడం లేదు. వారి ప్రయత్నాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. అందువల్ల సైన్స్ దేవుడు మరియు ఆత్మ గురించి ఏమీ చెప్పడం లేదు. ఎందుకంటే అవి లేబొరేటరీలలో శాస్త్రీయ పరీక్షకు చిక్కలేదు. అయితే కొందరు తమ తపఃశక్తి ద్వారా, దివ్యజ్ఞానం (Intuition) ద్వారా దేవుడిని సాక్షాత్కారం చేసుకున్నట్టు చెబుతారు. అది వారి వ్యక్తిగత అనుభవం అయ్యింది. దీనిని పబ్లిక్‌గా నిరూపించడం సాధ్యం కాదు. అదీకాక ఇలాంటి దివ్యపురుషులు మామూలు మనుష్యుల మాదిరిగానే ఉంటారు కానీ వారికి ఏ విధమైన అతీంద్రియ శక్తి గానీ, ప్రకృతికి అతీతమైన శక్తి గానీ ఉండదు. ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఒక్కడూ పుట్టలేదని నా భావన.

స్వర్గం, మోక్షం ఉందో లేదో నాకు తెలియదు. వాటి గురించి నేను పట్టించుకోను. అవి ఉన్నా, నాకు స్వర్గమూ వద్దు, మోక్షమూ అక్కరలేదు. కోట్లాదిమంది ఈ ప్రపంచంలో కష్టనష్టాలతో బ్రతుకుతున్నప్పుడు వారినంతా వదిలి నేను స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ నాకు లేదు. స్వర్గంలో చేయడానికి పనిలేదు. ఎదుర్కోవడానికి సమస్యలు లేవు, సవాళ్ళు లేవు, దివ్యపురుషులు లేరు అన్న తరువాత అక్కడ ఊరికే కూర్చుని ఏమి చేయాలి? పునర్జన్మ ఉంటే నాకు వచ్చే జన్మలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిరంతరంగా పనిచేసే అవకాశం లభిస్తే చాలు, నాకు ఇంకేమీ అక్కరలేదు.

నా జీవితంలో నేను చాలామందికి కృతజ్ఞుడై ఉండాలి. మా తల్లిదండ్రులకు, అందులోనూ బీదరికపు వేడిలో మగ్గుతూ అవిశ్రాంతంగా కష్టపడుతూ నన్ను సాకిన తల్లికి ఎంత కృతజ్ఞుడిగా ఉన్నా చాలదు. ఇంకా ఏ దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. అయితే తల్లియే దేవత అనడంలో నాకు ఏ సందేహమూ లేదు. మా వూరినుండి బెంగళూరుకు తీసుకువచ్చి, నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన మలుపును తిప్పి నా ఉన్నత విద్యాభ్యాసానికి గట్టి పునాది వేసిన శ్రీ ఎం.ఎస్.నారాయణరావు గారికి నేను అత్యంత కృతజ్ఞుడినై ఉండాలి. నేను చదివిన నేషనల్ హైస్కూల్, పనిచేసిన నేషనల్ కాలేజీలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎంతో ఎక్కువ సహకారాన్నిచ్చాయి. వాటితో పాటే నేనూ పెరిగాను. మా సంస్థ అన్ని పాఠశాలలు, కాలేజీలు నా పనిపాటలలో ఎక్కువ సహకారాన్ని ఇచ్చాయి, ఇస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా అభిమానంతో మాట్లాడే వందలాది విద్యార్థులు, స్నేహితులూ, శ్రేయోభిలాషులు నా మనసుకు ఎక్కువ సంతోషాన్నిస్తున్నారు.

నా జీవితమంతా పోరాటమే అయ్యింది. విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనే పోరాటం. క్విట్ ఇండియా మరియు మైసూరు చలో పోరాటం. అధ్యాపకుడయ్యాక అన్ని కాలేజీలను పరీక్షలలో ఓడించాలనే పంతం; ధన సేకరణ, భవనాలను నిర్మించడం, పథకాలను కార్యరూపం దాల్చడం – అంతా పోరాటమే. దివ్యపురుషులపై పోరాటం అత్యంత కష్టతరమైన పోరాటం. నేను జీవితంలో ఒంటరివాడిని. పోరాటాలలో కూడా ఒంటరివాడినే. నా మనస్తత్వమే పోరాటానిది. నా స్వగ్రామమైన హోసూరుకు సుమారు నెలకొకసారి వెళతాను. అక్కడ మా పాఠశాల ఉంది. వెళ్ళే దారిలో గౌరీబిదనూరులో మా కాలేజీ ఉంది. మా వూరిలో నాకు ఎవరూ బంధువులు లేరు. వెళ్ళినప్పుడంతా అక్కడి జనప్రియ వైద్యులు డా.హెచ్. ఎన్. సుబ్రహ్మణ్య గారి ఇంటిలోనే ఉంటాను. వారి శ్రీమతి చిన్మయాంబ అక్కడి నేషనల్ హైస్కూలులో ఉపాధ్యాయినిగా ఉన్నారు. ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె. చిన్న సంసారం.

డాక్టర్ హెచ్.ఎన్. సుబ్రహ్మణ్య గారితో డాక్టర్ హెచ్. నరసింహయ్య

ఒకరోజు భోజనం చేస్తున్నాము. అప్పుడు డా.సుబ్రహ్మణ్య గారి మేనమామ శ్రీ హెచ్. ఎన్. రామరావు కూడా ఉన్నారు. వీరు నాకన్నా రెండు మూడు సంవత్సరాలు పిన్నవారు. పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాము. “నీవు చనిపోయాక అక్కడి నేషనల్ హైస్కూలు ఆవరణలోనే నిన్ను సమాధి చేయాలి” అని వారు చెప్పారు. అక్కడ సమాధి చేయడానికేమో కావలసినంత విశాలమైన స్థలం ఉంది. అయితే సమాధి చేయడంలో, శవాన్ని పూడ్చి పెట్టడంలో నాకు నమ్మకం లేదు. దహనం చేయడం శాస్త్రీయం. అయితే బీదవారికి ఇది దుబారా. నాకు వారు సమాధి గురించి చెప్పిన మాట ఆశ్చర్యాన్ని కలిగించింది. “సమాధి గిమాధిలో నాకు విశ్వసం లేదప్పా. నన్ను కాల్చాలి (చచ్చిపోయాక)” అన్నాను. “అదంతా నీవు ఎట్లా చెబుతావు. చచ్చాక నీ అభిమానుల ఇష్టప్రకారమే జరుగుతుంది” అని నవ్వుతూ చెప్పారు. నేను మిన్నకుండిపోయాను.

ఉదయం బస్సులో హోసూరు నుండి బెంగళూరు వచ్చేటప్పుడు ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించాను. నా ఇష్టప్రకారం ఒక వీలునామా (will) వ్రాయడమే దీనికి పరిష్కారం అని నిర్ణయించుకున్నాను. నాకు సన్నిహిత స్నేహితులు, పూర్వ విద్యార్థులలో 15 మందిని ఎన్నుకున్నాను. వారికి వ్యక్తిగతంగా నా సమస్యను తెలిపాను. నా శవసంస్కార సమితిలో సభ్యులు కావాలని కోరాను. సంతోషంగా సభ్యులు అవుతాము అని చెబితే అది అపార్థానికి దారి తీస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సభ్యతగా ఒప్పుకున్నారు. ఇలా 15 మందితో కూడిన నా శవ సంస్కార కమిటీని నియమించుకున్నాను. వీరితోపాటు నా సంస్థ అధికారులూ ఉన్నారు. నా వీలునామాలో ఏమి చేయాలి అనే దానిని సూచించాను. ముఖ్యాంశాలను మాత్రం తెలుపుతున్నాను.

నా శవాన్ని దహనం చేయాలి. బెంగళూరులోనే దహనం చేయాలి. చాలా దూరప్రాంతంలో మరణిస్తే అక్కడే దహనం చేయవచ్చు. నా కళ్ళను మింటో ఆసుపత్రికి ఇచ్చాను. (మొత్తం శరీరాన్నే ఆసుపత్రికి ఇవ్వాలని అనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచన విరమించుకున్నాను.) ఏ ధార్మిక అంత్య సంస్కారాలలో నాకు సుతరామూ నమ్మకం లేదు అని చెప్పాల్సిన అగత్యం లేదు. బూడిదను కాల్చిన చోటనే వదిలివేయవచ్చు. లేకపోతే దానిని ఒక చెట్టు అడుగుభాగంలో వేయవచ్చు. అయితే ఈతచెట్టు మొదలులో మాత్రం వేయకండి. ఈతచెట్టుకూ నాకూ ఏ సంబంధమూ లేదు. అందువల్ల నా బూడిదతో ఈత చెట్టును పెంచడం సరికాదు. నేను చచ్చాక మా సంస్థలు దేనికీ సెలవు ప్రకటించకూడదు.

నా శవసంస్కార కమిటీ సభ్యులు ఒకరు నన్ను ‘అక్కడ’ స్వాగతించడానికి ముందుగా వెళ్ళడం బాధాకరమైన విషయం. శవసంస్కారమైన పిమ్మట నేను నా కమిటీ సభ్యులకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను చెప్పడం కుదరదు కనుక ముందుగానే నా వందనాలను విల్లులో వ్రాసి నా కర్తవ్యం నిర్వహించాను. అక్కడితో ముగుస్తుంది నా ఈ కథ.

—oOo—

అనువాదకుని మాట

డా. హెన్.ఎన్.గారి ఆత్మకథను తెలుగు పాఠకులకు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరీబిదనూరులోని ఎ.ఇ.ఎస్.నేషనల్ కళాశాలలో రెండేళ్ళు చదివినప్పుడు వీరిని పలుసార్లు అతి సమీపంగా చూసే, వీరి ప్రసంగాలు వినే భాగ్యం నాకు కలిగింది. డా.నరసింహయ్యగారి జీవితాన్ని పరిశీలిస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. వీరిది సాధారణమైన జీవితమే అయినా ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. వీరి నిరాడంబరత్వం, ఆలోచనలు, సాటి మనుషులతో ముఖ్యంగా విద్యార్థులతో, పిల్లలతో వారి ప్రవర్తన, బోళాతనం, సమాజంపట్ల వీరికున్న చింత, మూఢనమ్మకాలపై, మహిమలపై వీరికున్న వ్యతిరేకత, హేతువాద దృక్పథం, ప్రశ్నించే తత్త్వం, శాస్త్రీయ దృష్టికోణం, పరిపాలనా దక్షత, హాస్యప్రవృత్తి మొదలైనవన్నీ పాఠకులను ప్రభావితం చేస్తాయి. స్వాతంత్ర్య సమరంలో, విద్యాక్షేత్రంలో వీరి పాత్ర మరువలేనిది.

కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నరసింహయ్యగారి జీవితంలో అనేక మలుపులున్నాయి. చదువు పట్ల వీరికి ఉన్న అభిమానం, నిబద్ధత, ఉత్తమ ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ప్రాధ్యాపకుల అండ వీరికి లభించడం మొదలైనవి వీరిని అమెరికాలోని విశ్వవిద్యాలయంనుండి న్యూక్లియర్ ఫిజిక్స్‌లో డాక్టరేట్ సంపాదించడానికి దోహదపడ్డాయి. అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా, విధానపరిషత్‌లో విద్యారంగ ప్రతినిధిగా, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షునిగా, బి.ఎం.ఎస్.విద్యాసంస్థల ట్రస్టు అధ్యక్షునిగా వీరు విద్యారంగంలో చేసిన ప్రయోగాలు, తెచ్చిన మార్పులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి వీరు చేసిన కృషి వెలకట్టలేనిది. వీరు మానవతావాది, హేతువాది అయితే నిరీశ్వరవాది మాత్రం కాదు. వీరు దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అయితే దేవుని పేరుతో ప్రజలలో ప్రబలిన మూఢనమ్మకాలకు వ్యతిరేకి. దేవునికి ప్రజలకు మధ్య దళారులుగా వ్యవహరించే దొంగ పూజారులు, కపట బాబాలు, బూటకపు స్వామీజీలు మొదలైనవారికి తీవ్ర వ్యతిరేకి. వారు చేసే మోసాలు, మాయలు, మహిమలు వంటి వాటిని ప్రతిఘటించారు, పోరాడారు. నిజమైన స్వామీజీలంటే వీరికి ఎనలేని గౌరవం. వీరిది హేతువాద దృష్టి. దేనినైనా ప్రశ్నించనిదే అంగీకరించే స్వభావం కాదు. సైన్సు విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా, పరిశోధకునిగా, శాస్త్రవేత్తగా వీరు వైజ్ఞానిక దృక్పథంతో వ్యవహరించారు. బెంగళూరు సైన్స్ ఫోరమ్ స్థాపించి పలువురు శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు ఇప్పించి ప్రజలలో శాస్త్రీయ అవగాహన కల్పించారు. మూఢాచారాలను రూపుమాపడానికి తమవంతు ప్రయత్నం చేశారు. వీరికి సంస్కృతి, కళలు, క్రీడలు అన్నా ఎక్కువ ప్రీతి. నేషనల్ విద్యాసంస్థలలో నాటకాలకు ఎక్కువ ప్రోత్సాహాన్ని అందించారు. స్వయంగా కోలాటం వంటి కళలను నేర్చుకుని ప్రదర్శించారు. హాకీ, బాస్కెట్ బాల్, టెన్నిస్ వంటి క్రీడలను ఆడారు. క్రీడలకు తగిన ప్రోత్సాహమిచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ బెంగళూరులో నెలకొల్పడానికి వీరు కూడా ముఖ్యకారకులు. వీరి పాలనాదక్షతకు ఈ ఆత్మకథలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వీరికి పద్మభూషణ్ మొదలుకుని ఎన్నెన్నో పురస్కారాలు, గౌరవాలు, హోదాలు అప్రయతంగా, అయాచితంగా లభించాయి. వీరు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా తమ వినయాన్ని, అణకువను, నిరాడంబరతను వదులుకోలేదు. అదీ వీరి గొప్పతనం.

ఈ ఆత్మకథను వీరు తమ జ్ఞాపకాల ఆధారంగా వ్రాశారు. దీనిలో కొన్ని విషయాలు చర్వితచర్వణంగా కనిపిస్తాయి. వీరు ఈ ఆత్మకథను ఒక వారపత్రికలో ధారావాహికగా వ్రాయడం దీనికి ఒక కారణం కావచ్చు. దానిని వారి శైలిగా పాఠకులు స్వీకరిస్తారని భావిస్తున్నాను. దీనిలో కొంత స్వోత్కర్ష కూడా ఉందని నరసింహయ్యగారే ఒకచోట పేర్కొన్నారు. అయితే వాస్తవాలను తెలిపే క్రమంలో అది తప్పలేదని వీరి భావన.

ఈ ఆత్మకథను నేను తెలుగు భాషలోనికి యథాతథంగా అనువదించాను. అనువాదకునిగా అక్కడక్కడా కొంత స్వేచ్ఛను తీసుకున్నా అది ఉపేక్షణీయమైనదే. కన్నడ భాష గుబాళింపును తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో అక్కడక్కడా కొన్ని కన్నడ పదాలను (వాటి సమానార్థకాలు తెలుగు భాషలో ఉన్నా) యథాతథంగా వాడాను. వీటిని పాఠకులు ఆమోదిస్తారని భావిస్తున్నాను.

ఈ ఆత్మకథను కన్నడ నుండి తెలుగులోనికి అనువాదం చేయడానికి అనుమతిని ప్రసాదించిన నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫ్ కర్ణాటక ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ హెచ్. ఎన్.సుబ్రమణ్య గారికి నేను ఋణపడి ఉన్నాను. ఈ అనువాదంలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన స్నేహితులు, బంధువులు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ ఆత్మకథను ధారావాహికగా వారం వారం ప్రచురించిన ‘సంచిక’ వెబ్ పత్రిక బృందం వారికి ముఖ్యంగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కొల్లూరి సోమ శంకర్ గార్లకు నా నమస్కారాలు. చదివి ప్రోత్సహించిన సంచిక పాఠకులకూ నా వందనాలు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here