‘అధ్యయన భారతి’ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారి రచనలు- ఒక అవగాహన: వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య వైభవం

1
4

[box type=’note’ fontsize=’16’]”శ్రీ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారి రచనలలోని విశేషత మనం స్వయంగా చదివి అందలి ఆనందాన్ని ఆస్వాదించే విధంగా ఉంటాయి” అంటున్నారు చివుకుల శ్రీలక్ష్మి ” ‘అధ్యయన భారతి’ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారి రచనలు- ఒక అవగాహన: వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య వైభవం” అనే వ్యాసంలో. [/box]

[dropcap]తె[/dropcap]లుగు వాజ్మయాన్ని పదిలపరచాలనే ఆశయంతో వేయి సంవత్సరాల చరిత్రను అధ్యయనం చేస్తే నిలబడగలిగిన మహనీయులను గణన చేసినప్పుడు భవిష్యత్ తరాల వారు ‘అధ్యయనభారతి’ గా ప్రముఖుల ప్రశంసలు పొందిన డాక్టర్ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారి గురించి, సాహిత్యానికి అతను అందించిన అపురూపమైన రచనల గురించి తప్పక తెలుసుకోవాలి.

ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారు విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలానికి చెందిన లింగాలవలస గ్రామంలో భవానమ్మ, రామావతారం దంపతులకు 10-02-1944 నాడు జన్మించారు. ప్రాథమిక విద్య గజపతినగరంలోనే పూర్తిచేసి 1955 నుండి 1963 వరకు విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ పూర్తిచేసారు. కళాశాల నుండి బయటకు అడుగుపెడుతూనే

 “వేయివిద్యలు వెలసిన వీధియందు

రేగిపోయిన ధూళినై సాగిపోదు

 పరమగురువులు నేర్పిన పాఠమెల్ల

 బ్రతుకు బ్రతుకంత తలచుచు పరవశింతు!”

అని పాడుకుని రాసుకున్నప్పటికీ తన రచనల ద్వారా సుగంధభరిత చందనమై ప్రజల మనోవీధిలో ఆఘ్రాణించబడుతూనే ఉన్నారు. కథ, కవిత్వం, వ్యాసం, అనువాదం, సంకలనం, విమర్శ ఏదైనా నిత్య అధ్యయనశీలిగా, పరిశోధకునిగా తనదైన ముద్రను నిలుపగలిగిన మేధావి.

 1976-79 సం:ల మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావుగారి పర్యవేక్షణలో పి.హెచ్.డి. పట్టం కొరకు క్షేమేంద్రుని ఔచిత్య ప్రస్తానాన్ని పింగళి సూరన కావ్యాలకు అన్వయిస్తూ సిధ్ధాంత గ్రంథాన్ని సమర్పించారు.- ఔచిత్య ప్రస్తానం-సూరన కవిత్వం -కళాపూర్ణోద్యయం, ప్రభావతీ ప్రద్యుమ్నం-ఔచిత్య సమీక్ష అను రెండు గ్రంథములుగా ప్రచురించబడింది.

1987లో ‘ఔచిత్య ప్రస్థానము- సూరన కవిత్వము’ రసజ్ఞ సంస్థ వారిచే ప్రచురింపబడింది. ఉపాధ్యాయుల వారు తన పరిశోధనా గ్రంథము కనుక దీనిని ఆచార్య ఎస్.వీ.జోగారావుగారికే అంకితమిచ్చారు.

“అత్యంత క్లిష్టమైన ఈ పరిశోధనలో రచనయందును, ప్రణాళికయందును, విషయచర్చయందును, విశ్లేషణమునందును, క్రోడీకరణమునందును, సత్యసాధనమందును, సారాంశ సమీక్షణమందును, నాగరికమైన దృష్టితో నైకముఖమైన ప్రజ్ఞను ప్రదర్శించినాడు” అని సాక్షాత్ పర్యవేక్షకులైన జోగారావుగారే అన్నారు.

ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపట్ల సమాన ఆదరణ చూపిన సద్విమర్శకుడు. సమీక్షకునిగా స్వీయనియంత్రణను కలిగిఉండడం ప్రతిభ. విశ్లేషణ, విమర్శ కలగలిపిన ప్రత్యేకశైలి అతనిది. సంస్కృత విమర్శాప్రమాణాలను ఆంధ్రసాహిత్య సమీక్షారీతులను తెలుగుభాషకు ఔచిత్యపరంగా అందచేసి విమర్శకు పట్టంకట్టిన మహనీయుడు. మంచి కవి కావాలంటే సృజనాత్మక ప్రతిభ అవసరం అనీ, మంచి సాహిత్య విమర్శకుడు కావాలంటే కింగ్ ఫిషర్ లాంటి ఒడుపూ, లాఘవం, సునిశిత ప్రజ్ఞా విశేషం కావాలనీ భావించారు.

 తెలుగుభాషా సాహిత్యసంస్కృతుల అధ్యయన- అధ్యాపనలో ప్రవీణులైన ఉపాధ్యాయుల వారి రచనలు ఆనాటి ‘భారతి’ పత్రిక నుండి నేటి ‘మిసిమి’ పత్రిక వరకూ ఉత్తమ సాహిత్య పత్రికలన్నింటిలో అతని వ్యాసాలు ముద్రింపబడ్డాయి. అనేక విశ్వవిద్యాలయాల సెమినార్లలో పరిశోధనాపత్రాలు సమర్పించారు. నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాలలో ఎం.ఏ.దూరవిద్యా విద్యార్ధులకు కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు పునశ్చరణ తరగతులలో పాఠాలు బోధించారు.

అలంకారశాస్త్రం, సౌందర్యశాస్త్రం, నాట్యశాస్త్రం, శైలీ శాస్త్రం భూమికలుగా పరిశోధనలు కొనసాగించి నాలుగు ప్రామాణిక గ్రంథాలను వెలువరించారు.

‘యశోధర’ ఖండకావ్యం. పద్మభూషణ గ్రహీత డా.సి.నారాయణరెడ్డిగారికి అంకితమిచ్చారు. గౌతముడు సిధ్ధార్ధుడైన తరువాత 7 సం;లకు కొలియలకు, శాక్యులకు నడుమ రోహిణీ నదీజలాల విషయమై తలయెత్తిన వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం కపిలవస్తు నగరానికి వెలుపల విడిది చేసి శుధ్ధోదనుని ఇంట ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చే సమయంలో శుధ్ధోధనుడు-గౌతమి -యశోధర -రాహులుడు ఎవరికివారే సిధ్ధార్ధుని గురించి మనసులలో అనుకున్న భావాలను అద్భుతమైన కావ్యరూపంలో మనకు అందించారు. అందరి మనోభావాలు గ్రహించిన బుధ్ధుడు వారికి మానసిక సాంత్వన కలిగిస్తాడు.

“నిదురనునుంటివీవికను మేల్కొని నిజమును గనుము

వదులుము రాగబంధముల విశ్వము వాకిట నిల్వు

బదులుగ నేమి కోరకుము బంధ విభంజన తప్ప

హృదయము నిమ్ము దీనజనసేవకు హృష్టవుకమ్ము!”

అనే బుధ్ధుని ప్రభోధముతో ముగించడం ఉపాధ్యాయుల వారి ప్రతిభకు నిదర్శనం.

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రసిధ్ధ తెలుగుకవి నన్నెచోడుని ‘కుమార సంభవం’ మహాకావ్యాన్ని సవిమర్శనమైన పీఠిక, లఘుటీకతో లఘుపరిచయముతో ప్రచురించారు.

2000 సం: తరువాత ఉపాధ్యాయుల వారి దృష్టి కొంచెం మందగించడం చేత అతని శ్రీమతి రమణమ్మగారు అతని రచనలకు అవసరమైన సాహిత్యాన్ని చదివి వినిపించడం, సూచించిన అంశాలను రాసి పెట్టడం, ఆయన ధారణ చేసి చెపుతూంటే వ్రాయటం, మళ్ళీ వినిపించటం ఇలా అతను మేధ అయితే ఆమె చూపు, అతను గళం అయితే ఆమె కలం ఇలా అర్ధనారీశ్వర రూపంగా ఆదిదంపతులుగా సాహితీ ప్రస్థానం సాగుతూండేది.

2001లో విశాలాంధ్ర పబ్లిషర్స్‌చే ముద్రింపబడిన ‘కథాశిల్పి ‘చాసో’ చాగంటి సోమయాజులు గారు తక్కువ కథలు రాసి ఎక్కువపేరు గడించడానికి గల కారణాలను పాఠకులకు తెలిపేందుకు రచనల లోలోతులకు వెళ్ళి తెలుసుకున్న విషయాలను మానవుడి వేదనకు అద్దం పట్టగలిగేది, వేదనకు గల మూలాలను అన్వేషించగలిగేది కథే అన్న నమ్మకం. వేదనకున్న పీడన, ఆకలి,జబ్బు, వృధ్ధాప్యం, అజ్నానం, వ్యసనం, దరిద్రం, బానిసత్వం, అభద్రత వంటి బహుముఖరూపాలను ఆవిష్కరించడానికి కథకు మాత్రమే అవకాశముందని నమ్మిన చాసో కథారచన యజ్ఞంలా చేసారు. గురజాడ వారసత్వాన్ని తాను అందిపుచ్చుకుని ముందు తరాలకు అందించిన కథా శిల్పి చాసో.

2002 సం: లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి మేజర్ రిసెర్చ్ ప్రాజెక్ట్ కింద “కన్యాశుల్కం 19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు” పరిశోధనాగ్రంథం రచించారు. కన్యాశుల్కం నాటకాన్ని, సమకాలీన భారతీయ నాటకాలతో తులనాత్మకంగా పరిశీలించిన 730 పేజీల బృహత్ గ్రంథమిది. 19వ శతాబ్దం చివరి నాటికి ఆధునిక నాటకరంగం పరిణత స్థాయికి చేరిన బెంగాలీ, అస్సామీ, ఒరియా, మరాఠీ, కన్నడ, గుజరాతీ, హిందీ భాషలలోని నాటక వికాసాన్ని, నాటక ధోరణులను పరిచయం చేసి, కన్యాశుల్క నాటకాన్ని ఆ నేపఠ్యంలో తులనాత్మకంగా పరిశీలించారు.

2004 సం:లో ‘బాంధవ్యాలు’ పేరిట ఒరియామహాకవి జయంత మహాపాత్రో ‘రిలేషన్ షిప్’ పేరిట ఆంగ్లములో రాసిన కవితలను అనువదించి మనకు వచనకవితలుగా అందించారు. సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన ఈ గ్రంథానికి శివారెడ్డిగారు ముందుమాట రాసారు.

2004లో ‘నోబెల్ సాహిత్య పురస్కారోపన్యాసములు మిసిమి మాస పత్రికలో ప్రచురింపబడగా వాటిని విజయనగరానికి చెందిన ఎం.ఎస్.ఎం. ప్రచురణ వారు ముద్రించిరి. తనకు ఆంగ్లము నేర్పిన అంగర సోమశేఖర రావుగారికి అంకితమిచ్చారు. అనువాదం చేయడంలో పదపాండిత్యం ఎంత ఉండాలో ఇవి చదివితే తెలుస్తుంది.

2008 సం:లో ‘శ్రీరంగం నారాయణబాబు కవితావైశిష్ట్యం’ పై తాను వ్రాసిన వ్యాసాలతో పాటు అతనినెరిగిన ఇతర ప్రముఖ కవులైన రోణంకి అప్పలస్వామిగారు, చాగంటి సోమయాజులుగారు, పురిపండా అప్పల స్వామిగారి వ్యాసాలను కూడా కలిపి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించగా ద్వారం దుర్గా ప్రసాదరావుగారికి అంకితమిచ్చారు. నమ్మినదాన్ని బహిరంగంగా చెప్పే, ద్వంద్వ ప్రవృత్తిలేని విప్లవకవి ప్రజలకవి అయిన నారాయణబాబుగారి గురించి చెప్పే ‘గడ్డిపరక’ ఒక్కటి చాలు” అన్నది ఉపాధ్యాయుల వారి అభిప్రాయం.

2009 సం:లో ‘విశ్వనాథ సౌందర్యదర్శనం’ అజో-విభో- కందాళం ఫౌండేషన్ వారు ప్రతిభా-పాండిత్యాలలో మేరుశిఖరాల వంటి మేధావులను సత్కరించడం, సాహిత్యాన్ని ప్రచురించుకోవడంలో రచయితలకు చేయూతనివ్వడం తమ లక్ష్యం అంటూ ఈ పుస్తకాన్ని ప్రచురించగా ఉపాధ్యాయులవారు తన తల్లిదండ్రులకు అంకితమిచ్చారు. తనకు ఎంతో ఆరాధ్యుడైన విశ్వనాథ వారి కవిత్వాన్ని ప్రాక్పశ్చిమ సౌందర్యశాస్త్ర సిధ్ధాంతాలతో సమన్వయపరుస్తూ 380 పేజీలలో నాలుగు అధ్యాయాలలో భారతీయ సౌందర్యాన్ని; విశ్వనాథవారి కవిత్వం; విశ్వనాథుని సౌందర్య దర్శనం; అతనిలొని కళాతత్వాన్ని పాఠకులకు అందించడంలో ఉపాధ్యాయుల వారి కృషి అసామాన్యం.

2010 సం:లో ‘నేటి తెలుగు’ ఎమెస్కోసంస్థ ద్వారా తెలుగుభాషమీద అభిమానంతో ప్రముఖ దినపత్రికలలో తెలుగు భాషా సంస్కృతులను గురించి వ్రాసిన వ్యాసాలను ఎంపిక చేసి పుస్తక రూపంలో ప్రచురించిన మండలి బుధ్ధ ప్రసాద్ గారికే అంకితమిచ్చారు.

సాహిత్య అకాడమీ కోసం రాసిన మోనోగ్రాఫ్ మానపల్లి రామకృష్ణ కవి.

2010 సం:లో ప్రచురింపబడిన ‘చర్వణ’ సాహిత్య విమర్శనా వ్యాసాలు. తొమ్మిదిమంది ఆధునిక రచయితల సాధనలనూ, సంచయాలనూ, ఆశయాలనూ, ఆచరణలనూ, తాత్త్విక గవేషణనూ, సుందరస్వప్నాలనూ సృజనశీలురైన పాఠకులకు అందించే ప్రయత్నంలో ఈ వ్యాసాలు రచించినట్లు తెలిపారు.

రాయప్రోలు -నవదర్శనం;

చలం- సృజనసూత్రం;

విశ్వనాథ – విమర్శకుడుగా;

కృష్ణశాస్త్రి- పద్యశిల్పం;

పింగళి-కాటూరి- ఆధునిక కావ్యసృష్టి;

కొడవటిగంటి- సాహిత్య దృక్పథం;

గోపీచంద్ -తాత్విక చింతన;

జి.వి.కృష్ణారావు – సాహిత్య విమర్శకునిగా;

బుచ్చిబాబు- సాహిత్యావగాహన గురించి వ్యాసరూపంలో సోదాహరణంగా తెలిపారు. ఈ వ్యాసాలకు ధీటుగా విమర్శనా దృష్టితో సుదీర్ఘమైన ముందుమాట శ్రీ.కె.కె,రంగనాథ ఆచార్యులుగారితో వ్రాయించారు..

కావ్య సంజీవి – ప్రముఖ కవి శిఖామణి కవిత్వంపై విశ్లేషణ- సమకాలీన విశిష్టకవి గురించి, సమకాలీన విశిష్ట విమర్శకుడు రాయడం అనేది విశేషం. శిఖామణి కవిత్వాన్ని పాశ్చాత్య-భారతీయ విమర్శనా సిధ్ధాంతాల నేపథ్యంలో కవిత్వంలోని మంచి-చెడులను సంస్కారవంతంగా విశ్లేషిస్తూ ఎక్కడ పేలవంగా ఉన్నాయో, ఎక్కడ అసాధారణ ప్రతిభను ప్రదర్శించగలిగారో అతడెందుకు ఉదాత్తకవి అయినాడో సహేతుకంగా నిరూపించారు.

2011 సం:లో ‘అమృతవర్షం’ సంస్కృత నాటక విమర్శనా గ్రంథము. అ.జో.విభో- కందాళం వారి ప్రచురణ. తనికెళ్ళ భరణి గారికి అంకితమిచ్చారు. భాసుడు మరియు కాళిదాసు ఇద్దరు మహాకవుల రచనలను సాధర్మ్య, వైధర్మ్య పరామర్శపూర్వకముగా నిరూపించాలంటే ఆ ఉభయకవుల రచనలను కూడా అవగాహనాపూర్వకంగా చదివియుండకపోతే ఇలాంటి రచన సాధ్యపడదు. ఇందులో సంస్కృత సాహిత్య మర్మాలనెన్నింటినో ఆంధ్ర సాహిత్య లోకానికి అందించిన ప్రతిభాశాలి. ఆ సంస్థ వారు జీవితకాల సాఫల్య పురస్కారంతో గౌరవించారు.

2012లో ప్రపంచతెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం 150 మోనోగ్రాఫ్‌లను తయారు చేయించగా “ప్రాచీనకాలంలో అధికారభాషగా తెలుగు” అనే పుస్తకాన్ని ఉపాధ్యాయుల వారు రాసారు. ముందుగా అధికార భాష-భావన పరిచయం చేసారు. తెలుగుప్రాంత ఏలికలు అధికార భాషగా తెలుగుని అమలుపరచిన విధానం శాసనాలు, కైఫియత్తుల ఆధారంగా తెలిపారు.

2012 సం:లో గురజాడ అప్పారావుగారి 150వ జయంత్యుత్సవాలలో ప్రభుత్వం వెలువరించిన సావనీర్‌లో ప్రముఖుల వ్యాసాల సంకలనంలో ఉపాధ్యాయుల వారి పాత్ర ముఖ్యమైనది.

2013 సం:లో లక్ష్మణ చక్రవర్తిగారికి అంకితమిచ్చిన ‘రంగుటద్దాల గది’ గత మూడు శతాబ్దాలుగా విజయనగరంతో శాస్త్ర-సాంకేతిక- సాహిత్య-కళారంగాలలో ప్రత్యక్ష, పరోక్ష సాన్నిహిత్యం కలిగిన ప్రతిభావంతులను ముందుతరానికి పరిచయం చేసే వ్యాసాల సంపుటి.

2014 సం:లో ‘శబ్ద విరించి’ పేరుతో మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి పై వ్రాసిన వ్యాసాల సంపుటిని శ్రీ ఎన్.కె.బాబుకు అంకితమిచ్చారు.

2014 సం:లో ‘తెలుగువచనశైలి’ భాషా సాంస్కృతికశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రచురింపబడింది. మండలి బుధ్ధప్రసాద్ గారి చేతులమీదుగా వ్యావహారిక భాషోద్యమకర్తలైన గిడుగు, గురజాడలకు అంకితమిచ్చారంటే వ్యవహారిక భాష పట్ల అతనికి గల నిబధ్ధత తెలుస్తుంది. ఈ గ్రంథం ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారి సర్వంకష ప్రతిభకు పరాకాష్ట. తెలుగు సాహిత్యానికే మణిపూసలాంటి ఈ గ్రంథంలో వచనశైలి స్వరూప స్వభావాలు, ప్రాచ్య పాశ్చాత్య భావనలు, ప్రాచీన, అర్వాచీన శైలులు, శైలీ బేధాలు, శైలీ దోషాలు సునిశితంగా చర్చించారు. రచయిత తనలోని దోషాలను ఎలా చూసుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో తెలుపుతూ ఉత్తమ రచయితకు సృజనాత్మకతతో పాటు చక్కని శైలి కూడా ఉంటే అతని రచన యొక్క సౌందర్యం ఇనుమడిస్తుందని తెలిపారు. శైలీ బేధాలు తెలిపేటందుకు కొందరు రచయితల రచనలను ఉదహరించారు.ఇంత వివరంగా శైలి గురించి తెలిపిన గ్రంథం మరే భారతీయభాషలోనూ లేదు. చక్కని ప్రణాళికతో, ఇంతకుముందు ప్రచురింపబడిన ఇతర గ్రంథాల జోలికి పోకుండా విస్తృత విషయపరిజ్ఞానంతో వ్రాయబడిన ఈ గ్రంథం యువరచయితలకు పాఠ్యగ్రంథంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా తెలుగుశైలి సంప్రదాయాలను సాంగోపాంగంగా వివరిస్తూ గ్రంథాన్ని వ్రాయడం ఇతరులకు సాధ్యమయ్యే పని కాదు.

వీరు అనేక పత్రికలలో వ్యాసాలు విస్తృతంగా వ్రాసారు. ఇతని చొరవతోనే అకాడమీవారిచే ఆదిభట్ల నారాయణదాసుగారి ‘రుబాయితులు’ పునర్ముద్రణ పొందింది. ‘నా ఎరుక’ కూడా పునర్ముద్రణ పొందగా రెండింటికీ పీఠికలు వ్రాసారు.

2014 సం:లో ‘గిరాంమూర్తి’ స్వయంగా ముద్రించుకుని మనసు-రాయుడుగారికి అంకితమిచ్చారు. వాడుక భాషకోసం గిడుగు 1.వ్యాసావళి; 2.ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజము; 3.గద్య చింతామణి; 4.బాలకవి శరణ్యము అనే నాలుగు పుస్తకాలు వెలువరించినా ప్రస్తుతం అలభ్యం కావడంతో గిడుగు రచనలను పాఠకులకు తేలికభాషలో పరిచయం చేయడానికి గిరాంమూర్తి రాసారు. వ్యావహారిక భాషోద్యమకారునిగా, ఉద్యమ నిర్మాణకారునిగా, అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తగా, ఆదివాసీ భాషావేత్తగా, తులనాత్మక భాషావేత్తగా, సవరభాషా నిఘంటునిర్మాతగా,. గిరిజన వాచకాలు రూపకర్తగా గిడుగువారి బహుముఖ ప్రతిభను మనకు తెలియజేస్తారు.

2015 సం:లో తన అమెరికా ప్రయాణాన్ని ‘వసంతం నుండి శిశిరం’ దాకా అమ్మ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురణ చేసి తన అన్నగారి కొడుకు-కోడలూ అయిన సుచిత్ర-ప్రసాద్‌లకు అంకితమిచ్చారు. 2013 ఏప్రెల్ నుండి అక్టోబర్ వరకూ అమెరికాలోని బంధువుల ఇళ్ళలో గడిపిన సమయాన్ని ఒక విలక్షణమైన రీతిలో రాసారు. అమెరికాలోని సిలికాన్ తెలుగు విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవానికి కూచిభొట్ల ఆనంద్ గారిచే ఆహ్వానించబడి, గౌరవించబడ్డారు.

మేధాసంపత్తిగల ఒక ప్రముఖ సాహితీవేత్తగా అమెరికాను దర్శించిన ఉపాధ్యాయుల వారు అక్కడి జీవన విధానం- వ్యవస్థల స్వరూపం- సామాజిక- చారిత్రక- సాంస్కృతిక- రాజకీయ పరిస్థితులను వివిధ కోణాలలో దర్శించి పాఠకులకు అందించే ప్రయత్నమే ఈ రచన.

అమెరికాను ఆధునిక మునివాటికగా భావిస్తూ అక్కడి చెట్లనూ, పూలనూ వర్ణించిన తీరు అక్కడ పండుగలను సామూహికంగా జరుపుకోవడం, స్త్రీ-పురుష తారతమ్యాలు లేకుండా పనిపాటలు చేసుకోవడం, అక్కడి విద్యా విధానాన్ని- ప్రార్ధనా గీతాలలోని భావాన్ని ఆస్వాదించగలగడం, రచయితతో పాటు రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలను సుఖవంతంగా చేయిస్తారు. న్యూయార్కులో గడిపిన అనుభవాన్ని కవితాత్మకంగా ఇలా అంటారు.

 “దిక్కులన్నీ మాకు దివిటీలు పట్టాయి /

 వీధులన్నీ వెలుగు వాకలుగ మారాయి

 …… అర్ధరేతిరి కూడ ఆనందతీర్ధమై /

 అలుపూ-సలుపూ లేని హాయి సమకూడింది.

ప్రకృతిలోని మార్పులను ఇంగ్లీషు కవులు ఎంత అద్భుతంగా వర్ణించి చూపారో అంతకంటే అద్భుతమైన తెలుగు అనువాదాన్ని మనకు అందించారు. ఆయా ఋతువుల మార్పులను ప్రత్యక్షంగా అనుభవించి, ఆనందించి వసంతఋతువులో అమెరికా వెళ్ళి శిశిర ఋతువులో స్వదేశానికి తిరిగి వచ్చారు,

ప్రసిధ్ధ దాక్షిణాత్య ఆధునిక కవుల పేరిట కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం వారు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ కవులను పరిచయంచేయాలని తరువాత ఇతర భాషలలోకి అనువదించాలని మొదలుపెట్టిన బృహత్ ప్రణాళికలో మొదటి అవకాశం ఉపాధ్యాయుల వారికే ఇచ్చారు. ఉత్తమ సాహితీవేత్తగా, విశేష పాండిత్యం కలిగియుండి, అధిక పరిశ్రమ చేయగలిగిన ఉపాధ్యాయుల వారు రాయప్రోలు సుబ్బారావుగారు రచించిన ఖండ కావ్యాల సంపుటి లోంచి కొన్ని ఖండికలను కూర్చి విశ్వవిద్యాలయానికి అందించడంతో పాటు అభినవ కవితకు ఆద్యుడైన రాయప్రోలువారి రమ్యలోక మాధురీ దర్శనాన్ని పాఠకులచేత చేయించారు.

ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారు తన రచనల ద్వారా తెలుగు భాషామ తల్లిని విలువైన సువర్ణాభరణాలతో అలంకరించారు. అందుకేనేమో సంతృప్తి చెందిన ఆమె భారతదేశంలో అరుదైన Ravindranath Tagore National Research Fellowship కి ఎంపిక చేసింది. ఈ గౌరవాన్ని పొందిన ప్రప్రథమ, ఏకైక తెలుగు రచయిత నెలకు రూ:50,000/ లు గౌరవవేతనం ఇందుకోసమై భారతీయ ధార్మికత మీద రాసిన గ్రంథరాజం “షానామా- మహాభారతం తులనాత్మక పరిశీలన”. ఆసియాలోని కొన్ని దేశాల ఇతిహాసాలతో పోల్చిచూస్తూ రాసిన గ్రంథమిది.

పర్షియన్ ఇతిహాసమైన షానామా; సుమేరియన్ ఇతిహాసమైన గిల్గమెష్; అరేబియన్ ఇతిహాసమైన అంతర అండ్ అబ్లా; జపాన్ ఇతిహాసమైన గంజిగాథా; చైనా ఇతిహాసమైన రిటర్న్ ఆఫ్ ది రెడ్ చాంబర్; భారతదేశపు ఇతిహాసాలైన రామాయణ-మహాభారతాలు పరిశీలించి రాత్రి-పగలూ శ్రమపడి 80% పూర్తిచేయగలిగారు.

కథాగమనం- పాత్రలూ- ఉపాఖ్యానం -సన్నివేశాలూ- సంస్కృతీ – సమాజస్థితిగతులు వంటి అంశాలలో షానామా-మహాభారతాల మధ్య ఎన్నో సామ్యాలను సోదాహరణంగా చూపించారు. వీటిని లోతైన అధ్యయనం ద్వారానే తెలుసుకోగలం. అని తెలిపిన ఉపాధ్యాయుల వారు ‘అధ్యయన భారతి’ అన్న బిరుదుకు అత్యంత శోభను తెచ్చిన కారణ జన్ములు.

2015 ఏప్రెల్ 27 సాయంత్రం 04-30 నిమిషాలకు మనలను వదలి వెళ్తున్నా  తాను భువిపై వదలిన సాహితీ సంపదను అందుకునే వారికోసం తాను చేయగా మిగిలిన సాహితీసేవ చేయగలిగే వారసుల కోసం చూసుకున్నారేమో??

 

అత్యంత ప్రతిభాశాలిని కోల్పోయినపుడు అంజలి ఘటించిన ప్రముఖులు ఇట్లా అన్నారు.

  • సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి. – శిఖామణి
  • సద్విమర్శకు ప్రథానోపాధ్యుడు -ఎర్రాప్రగడ రామకృష్ణ
  • ఉత్తరాంధ్ర తెలుగుతేజం- రామతీర్థ
  • సాహిత్య తత్త్వవేది- ద్వానా శాస్త్రి
  • నిలువుటద్దంలాంటి మూర్తిమత్వం- లక్ష్మణచక్రవర్తి
  • విమర్శకు సహృదయత అద్దినవాడు- అశోక్ కుమార్
  • విశిష్ట సాహితీ పరిశోధక కృషీవలుడు- సూర్య దినపత్రిక
  • విశిష్ట విమర్శకుడు- అక్కిరాజు రమాపతిరావు

పత్రికలూ, పత్రికాథిపతులూ, సహరచయితలూ, అధికారులూ అంజలి ఘటించారు.

01-12-2017 న అతని శ్రీమతి రమణమ్మ గారు, అతని సాహితీ మిత్రుడు శ్రీ ఎన్.కె.బాబు షానామాను పుస్తక రూపంలో మనకు అందించారు.

ఉపాధ్యాయుల వారి సుదీర్ఘమైన సాహితీ ప్రయాణంలో అనేక బిరుదులూ, పురస్కారాలు వారి బాటలో పూలజల్లులై కురిసాయి.

1955-1963:సం: సంస్కృతకళాశాలలో ‘ఉత్తమ శీలవంతుడు'( బెస్ట్ కాండక్ట్)

2003 సం:లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి ‘ఉత్తమ విమర్శక’ పురస్కారం

2004 సం:లో అవంత్స సోమసుందర్ ‘ ఉత్తమ విమర్శ’ పురస్కారం పొందారు.

2009 సం:లో విజయభావన సంస్థ వారిచే ‘అధ్యయన భారతి’ బిరుదు పొందారు.

2012 సం:లో ప్రతిష్టాత్మక అజో-విభో- కందాళం ఫౌండేషన్ వారి జీవితకాల సాఫల్య పురస్కారం పొందారు. సంస్కృత నాటక విమర్శ వ్యాసముల సంపుటి ‘అమృతవర్షం’ ప్రచురించారు.

శ్రీ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారి రచనలలోని విశేషత మనం స్వయంగా చదివి అందలి ఆనందాన్ని ఆస్వాదించే విధంగా ఉంటాయి. కళాశాలల, విశ్వవిద్యాలయ స్థాయిలలో పాఠ్యపుస్తక రూపంలో అందించగలిగితే విద్యార్థులకు తెలుగు భాషపట్ల గౌరవం పెరిగే అవకాశమున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here