[ఇటీవల వెలువడిన ‘కథా పరిమళాలు’ కథా సంకలనానికి సంపాదకత్వం వహించి, ప్రచురించిన శ్రీ ఎన్. కె. బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం ఎన్. కె. బాబు గారూ.
ఎన్.కె. బాబు: నమస్కారమండీ
~
ప్రశ్న 1. నేను మెచ్చిన నా కథలు అన్న కాన్సెప్ట్‌తో పలు పుస్తకాలు ప్రచురించారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?
జ: ఇక్కడ ‘నేను మెచ్చిన నా కథ’ అంటే ‘రచయిత మెచ్చిన తన కథ’ అని. ప్రతి రచయితకు తను వ్రాసిన కథల్లో తనకి ఏదో కథ బాగా నచ్చుతుంది. అది ఎక్కువ శాతం పాఠకుడికి కూడా నచ్చుతుంది. అప్పుడు ఆ కథ మరింతగా పాఠకలోకాన్ని అలరిస్తుంది అన్న నమ్మకంతో అలాంటి కథలు అన్నింటినీ ఒకచోట చేర్చి పాఠకులకు అందించాలన్న తలంపే ఈ ‘నాకు నచ్చిన నా కథ’ సంకలనాల ప్రచురణకు నాంది.
ప్రశ్న 2. ఆచరణలో మీరు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి?
జ: ఆచరణలో ఇబ్బందులు కంటే కొంతమందిలో అపనమ్మకం ఎక్కువగా చూశాను. ఇదివరలో ఇలాగే చాలామంది కథలు ఇవ్వండి ప్రచురిస్తాం అవి ఏళ్ల తరబడి అతి, గతి లేకుండా పోయారు. కొంతమంది అయితే డబ్బులు తీసుకుని కూడా ప్రచురణ చేయకుండా ఎగ్గొట్టారని చాలామంది వెనుకంజ వేశారు.
ప్రశ్న 3. మీ ఆలోచనకు రచయితల స్పందన ఎలా వుంది?
జ: ఎక్కువ శాతం నన్ను అభినందించిన వారే, మంచి స్పందన వచ్చింది. అయితే నేనంటే ఏమిటో, నా పబ్లికేషన్ అంటే ఏమిటో తెలిసిన వారు నన్ను బాగా ప్రోత్సహించారు. నా గురించి తెలియని వారు, నన్ను గురించి మిగతా వారితో చర్చించి మరీ కథలు పంపారు. వర్ధమాన రచయితలు అయితే ప్రముఖ రచయితల సరసన తమ కథను చూసుకోవచ్చుననే ఆలోచనే వాళ్లకు ఎంతో వివశులను చేసింది. వారి వారి అనుభవాలను నాతో సంతోషంగా పంచుకున్నారు కూడాను.
ప్రశ్న 4. ప్రచురణకర్తగా ఇలా కథల సంకలనాలు ప్రచురించటంలో మీ అనుభవాలేమిటి? సాధక బాధకాలేమిటి?
జ: నేను ఎన్.కె.పబ్లికేషన్స్ పేరుతో ప్రచురణ సంస్థను 1997లోనే స్థాపించి, స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్ళ సందర్భంగా ‘స్వర్ణోత్సవ భారతి’ అనే వ్యాస సంకలనంతో ప్రారంభించాను. ఆ సంకలనాన్ని స్వతంత్ర సమరయోధులు మొట్టమొదటి పార్లమెంటేరియన్ అయిన కీ.శే. కందాల బాలసుబ్రమణ్య తిలక్ గారితో 1997 ఆగష్టు 15న ఆవిష్కరింప చేశాను. అప్పుడే వ్యాసాలను వివిధ రచయితలు నుండి సేకరించి, ఎడిట్ చేసి ప్రచురించాను. ‘అన్నప్రాసన నాడే ఆవకాయ’ అన్న చందాన నా ప్రచురణ సంస్థలో, ఆ మొదటి పుస్తకంతోనే నన్ను నేను మెరుగులు దిద్దుకోవడానికి సహాయపడింది. ఆ తరువాత కథ సంకలనాలు ప్రచురించాను. కొన్నిటికి సంపాదక బాధ్యతలు తీసుకున్నాను. ప్రచురణకర్తనూ, సంపాదకుడనూ నేనే కావడం వలన కొంత శాతం ఇబ్బంది తగ్గింది. ఇక రచయితల నుండి ఈ కథా సంకనాల ప్రచురణలు సమయంలో కొన్ని ఇబ్బందులు వాస్తవమే. నాకు సాహిత్యంపై ఉన్న మక్కువతో ఈ సంకలనాలను ప్రచురిస్తూ ఉంటే ఓ పాపులర్ రైటర్ “నా కథకు ఎంత ఇస్తారు” అని అడిగారు. పరస్పర సహకారంతో ఈ ప్రచురణను చేస్తున్నానని తెలుసు కదా. రచయితకు ఆవిష్కరణ రోజున పది పుస్తకాలను అందజేస్తాను. అలా రాలేని వారికి రిజిస్టర్ పోస్ట్ లో పంపిస్తాను. ఓ రచయితయితే ఏకంగా 24 పేజీలు కథను పంపారు. అతనిని నొప్పించడమెందుకని ప్రచురించాను. తరువాత సంకలనానికి కథ అడిగితే ఉచితంగా ప్రచురిస్తానంటే కథ ఇస్తానన్నారు. ఎన్ని కథలు వస్తే అన్నింటితోనే కథలను ప్రచురించగలనని చెప్పాను. ఇలా ప్రతి సంకలనానికి నా చేతి చమురు 35 నుండి 40% వరకు వదులుతుంది. అయినా సరే నా పాషన్ ఇది. ప్రచురిస్తూనే ఉంటాను.
ప్రశ్న 5. ఇందరు రచయితలతో ఎలా కోఆర్డినేట్ చేస్తారు? రచయితలు ఇగోయిష్టులు.. వారి ఇగోలను సంతృప్తి పరుస్తూ ఎలా ముందుకు సాగుతున్నారు?
జ: కథలను పంపిస్తున్న వారంతా ఎంతో బాగానే సహకరిస్తున్నారు. ఎవ్వరినుండి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే ఆరు సంకలనాలను ఈ పద్ధతిలో ప్రచురించాను. సుమారు 200 మంది కథకులు 300 కథలను ప్రచురించాను. అందరూ ఎంతో సంతృప్తిని వ్యక్తపరిచారు మనస్ఫూర్తిగానే. మంచి పని చేస్తున్నారు ముందుకు సాగమని చెప్తున్నది వారే.
ప్రశ్న 6. తెలుగులో పుస్తకాలకు ఆదరణ తగ్గిందంటారు. ఎందుకని? పాఠకులు తగ్గారా? వారిని ఆకర్షించే రచనలు తగ్గాయా? లేక ఇంకా ఏదయినా కారణం వుందా?
జ: తెలుగులో పుస్తకాలకు ఆదరణ తగ్గిందని అనుకోను. పుస్తకాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. పాఠకులు తగ్గిన శాతం తక్కువే మీరన్నట్లు. వారిని ఆకర్షించే రచనలు తగ్గాయి. అలాగే ఇతర మాధ్యమాల్లో పాఠకులకు కావాల్సినంత సాహిత్యం లభ్యం అవుతున్నది. ఎక్కువ శాతం లోభత్వముతో ఉన్నవాళ్లు ఉన్నారు. వాళ్లు ఉచితంగా లభించే పిడిఎఫ్‌లపై ఆధారపడుతున్నారు. ఓ తరం పాఠకులు మాత్రం పుస్తకాన్ని పట్టుకొని చదవడానికి ఇష్టపడుతున్నారు. పుస్తకం చిరంజీవి. ఎప్పటికీ ఆదరణ ఉంటుంది.
ప్రశ్న 7. మీరు కొత్తగా ప్రచురించిన పుస్తకంలో మీకు బాగా నచ్చిన కథ ఏది? ఎందుకు?
జ: ఇది చాలా చిక్కు ప్రశ్న. 200 మంది రచనల్లో ఒక్కటి ఎన్నుకోవడం అంటే మిగతా 199 మందిని హర్ట్ చేయడమే అని నా ఉద్దేశం. అందుకే మరో మార్గం అవలంబించాను. ఓ రోజు ముంబైలో వాన పడుతుంది. ఓ కుటుంబంలోని భర్త ఓ చోట, భార్య ఓ చోట, పిల్లలు ఓ చోట ఆయాతో, ఆయా భర్త మరోచోట ఉండిపోతారు. అప్పుడు వాళ్ళ మానసిక స్థితి, వాతావరణం ఇదంతా ఓ కథ. ఈ కథను చదివిన ఓ పెద్దాయన, విమర్శకులు కూడాను చాలా బాగుందండి అన్నారు. ఓ కొత్త టెక్నిక్ ఈ కథలో ఉంది. ఇలా ఎవరూ ఇప్పుడు రాయడం లేదు అన్నారు. అంతటి పెద్దవారు ప్రశంసను పొందిన ఆ కథ పేరు ‘వాన’. రచయిత నేనే.
ప్రశ్న 8. ఈ పుస్తకాల ప్రచురణలో ఏదయినా మరపురాని అనుభవాన్ని వివరిస్తారా?
జ: ప్రత్యేకమైన అనుభవాలంటూ ఏమీ లేవు. కానీ ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళు చాలామంది తారస పడుతున్నారు. నా వెనకే ఉంటూనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగకూడదని చూస్తున్న వాళ్ళున్నారు. అయినా నా తెగువను చూసి వాళ్ల పాచికలు పారలేదని వాళ్ళ మొహాలు చెబుతున్నాయి. ఇది నాకు గర్వంగా కూడా ఉంటుంది
ప్రశ్న 9. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: భవిష్యత్తు ప్రణాళికలు అంటే ఇలా తెలుగు కథకులు అందర్నీ కలుపుకుంటూ నిరంతరం కథలను ప్రచురించాలని ఆశ. గురజాడ నుండి నేటి వరకు ఉన్న రచనల నుండి పేరెన్నిక గన్న కథలను ఎన్నుకొని ఓ సంకలనం తేవాలని ఉంది. ఇప్పుడు బాలసాహిత్య రచయితల నుండి కథలని సేకరించి ప్రచురిస్తున్నాను.
ఈ కథ సంకలనాల ప్రచురణలో నాకు నిరంతరం తోడుగా ఉంటూ నాకు సహకారాన్ని అందిస్తున్న మంజరి, మేడ మస్తాన్ రెడ్డి, సుగుణరావు, అడపా రామకృష్ణ గార్లకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా తెలుపుకునే అవకాశం దొరికింది. సంతోషం.
~
సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని వెచ్చించి సంచికకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబు గారూ.
ఎన్.కె. బాబు: ధన్యవాదాలు.
***
కథా పరిమళాలు
(56 మంది కథకుల 56 కథలు)
సంపాదకత్వం: ఎన్. కె. బాబు
ప్రచురణ: ఎన్.కె. పబ్లికేషన్స్
పేజీలు: 404
వెల: ₹ 350
ప్రతులకు:
ఎన్. కె. బాబు
24-8-1, సమీర్ రెసిడెన్సీ,
విజయనగరం. ఆం.ప్ర. 535002
ఫోన్: 9440343479
nkbabu.publisher@gmail.com
ఆన్‍లైన్‌లో
https://logilitelugubooks.com/book/katha-parimalalu-n-k-babu