ప్రేమ లేఖ

0
4

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘ప్రేమ లేఖ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఏ[/dropcap]మిటండీ? అద్దం ముందు నుంచుని తెగ ముస్తాబవుతున్నారు. ఏంటి కథ?”

“కథంటే కథే వున్నది. పెళ్లిచూపులకు ఎలా ఫోటో తీసి పంపాలా? అని యాంగిల్ చూసుకుంటున్నాను.”

“మీ పెళ్లిచూపులా? అంత సీన్ కూడా వుందా? మీకు నేనుండగా మరో పిల్లనిస్తామంటూ ఎవరైనా వస్తారని కలలు గంటున్నారా ఏమిటి? మనకు అబ్బాయిలు కాకుండా అమ్మాయిలు పుట్టి వుంటే వాళ్లకి ఈపాటికి పెళ్లి సంబంధాలు వెతుకుతూండే వాళ్లం” అని నవ్వేసింది.

“అయితే మాత్రం నేను ముసలివాడి కిందకేం రాను. వస్తానోయ్ భార్యామణీ” అంటూనే అప్పుడప్పుడే తెల్లబడుతున్న మీసాలను సవరించుకుంటూ బయటకు నడిచాడు సత్యమూర్తి.

‘సుశీల కాకుండా మరొకరైతే పెళ్లిచూపుల మాట అనగానే ఇంతెత్తన ఎగిరేవాళ్లు. కాని తొందరపడకుండా ఎప్పుడూ నవ్వుతూ వుంటూ, నేనూ నువ్వులాటకే అన్నానని అర్థం చేసుకునే, సుశీలలాంటి భార్య దొరకటం తన అదృష్టమ’ని మరోసారి అనుకున్నాడు.

***

సుశీల మనసు ఇరవై ఏళ్ల గతంలోకి వెళ్లింది. తెలిసిన వాళ్ల ద్వారా బాలకోటయ్య కూతురుకు పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనలియర్. గీతమ్స్‌లో చదువుతున్నాడు. పెళ్లికొడుకును తనే స్వయంగా పరిశీలించుకోవాలని పెళ్లికొడుకు ఫోటో తోసహా గీతమ్స్ కాలేజీ ఫైనలియర్ వాళ్ల కాంపస్ తెలుసుకున్నాడు. అక్కడున్న చెట్టు కింద బెంచీ మీద కూర్చుని పెళ్లికొడుకు ఆచూకీ కనుకున్నాడు. బాలకోటయ్య పిల్లవాడి నడవడిక, అతడు కాలేజీకి వచ్చేపోయే వేళలు అన్నీ గమనించాడు. అతడు క్లాసు ఎగ్గొట్టి బయట తిరక్కుండా క్లాసులోనే బుద్ధిగా వుంటున్నడని అర్థమయింది. రెండు రోజులు గమనించాడు. మూడో రోజు మళ్లీ వెళ్లాడు. అతడు కనబడ్డాడు “చూడు బాబూ! నీ రికార్డులో నుంచి ఈ కాగితమేదో జారిపోయింది” అంటూ అందించాడు.

“థాంక్స్” అంటూ తీసుకుని పక్కనున్న మిత్రుడు సుధీర్‌తో “నిన్న నువ్వడిగిన మెకానికల్ డ్రాయింగ్ గీసాను. అందులో నుండి ఒక పేపరు జారినట్లుంది తీసుకో” అంటూ అందించాడు.

సుధీర్ పేపరు మడత విప్పాడు. “అపర ప్రవరాఖ్యుల వారూ! రోజూ ఇంతింత కళ్లేసుకుని మీ వంక ఆరాధనగా చూస్తున్న మీకు అర్థం కావటం లేదు. నన్ను, నా చూపుల్నీ ఈ పాటికే ఎవరైనా గమనించి వుండొచ్చు. ఇప్పటికైనా నన్ను గుర్తించండి. మీ, పి.యస్”.

‘మనవాడికి ఇలా ఈ పాత పద్ధతిలో ప్రేమ లేఖ వ్రాసిన పి.యస్ ఎవరు? ఏ బ్రాంచ్!’ అనుకుంటూ ఆ కాగితాన్ని మరో మిత్రుడికి, అతడి ద్వారా మరి కొందరికీ అందించాడు.

అక్కడున్న నలుగురు మిత్రులూ చదివి ముసిముసిగా నవ్వసాగారు “కంగ్రాట్స్ రా, ప్రవరాఖ్య! నీ పి.యస్.ను కనుక్కొని ప్రోసీడయిపో. ఆలస్యం చేయకు” అంటూ “మరోసారి కంగ్రాట్స్” అంటూ కాస్త బిగ్గరగానే గోల చేయసాగారు.

తనక్కావలసిన అబ్బాయి తెల్లబోవటం చూసి బాలకోటయ్య ముందు కొచ్చాడు. “మా మేనల్లుడు ఇక్కడ చదువుతున్నాడు. వాడి చదువు సంధ్యలు కనుక్కోవటానికి నేనిక్కడకు వచ్చాను. కింద కాగితం కనిపిస్తే అటుగా వచ్చిన ఆ బాబుదేమో అనుకుని ఇచ్చాను. ఏమీ అనుకోకండి” అంటూ ఆ పేపరు తీసుకున్నాడు.

“మావాడు నిజంగానే అపర ప్రవరాఖ్యుడండీ. వాడికెప్పడూ చదువు గోలే” అన్నారంతా.

***

తర్వాత బాలకోటయ్య కూతుర్ని చూచుకోవటానికి మగపెళ్లివాళ్లు పెళ్లిచూపులకొచ్చారు. పెళ్లికొడుకు పెళ్ళికూతురు తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనేమో ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఆ రోజు గీతమ్స్‌లో పేపరు నీదేనంటూ అందించినాయన.

“చూడు బాబూ! నా కూతురు సుశీల. మా ఇంటి పేరు పాలడుగు. నా కూతురే పి.యస్. ఆ పేరుతో నేనే ఆ ఉత్తరం వ్రాశాను. నిన్ను గురించి నీ మిత్రుల్ని, మీ ప్రొఫెసర్లను అడిగి తెసుకున్నాను. స్వయంగా చూశాను. సంతృప్తిపడ్డాను. మీరు మా అమ్మాయిని గురించి తెలుసుకోవచ్చు. ఆడపిల్లలు కన్నవారింట్లోనూ, అత్తింట్లోనూ నవ్వుతూ తిరగాలి. కంట తడి పెట్టకూడదు. ఆడపిల్ల నవ్వు నాలుగు విధాల చేటు చేయదు. ఇంటికి శుభాలను, సుఖాలను, సంతోషాలను ఇస్తుంది. నీ జీవితంలోకొస్తే నా కూతురు ఎప్పుడూ కళకళలాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ వుండగలదన్న నమ్మకం నాకు కలిగింది. నీకు ఈ సంబంధం నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం” అన్నాడు సత్యమూర్తితో.

బాలకోటయ్య ఊహలకు తగ్గట్టే పి.యస్ రోజూ ఇంతింత కళ్లతో ఆరాధనగా చూస్తూ సత్యమూర్తితో హాస్యోక్తులతో, నవ్వుకుంటూ, తుళ్లుకుంటూ కాపురం చేస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here