[box type=’note’ fontsize=’16’] కశ్మీరుకు చెందిన అత్యంత ప్రాచీన పురాణం, నీలమత పురాణం , తెలుగు అనువాదం.[/box]
[dropcap]శ్రీ[/dropcap]నివాసం హరిం దేవం వరదం పరమేశ్వరమ్|
త్రైలోక్యనాథం గోవిన్దం ప్రణమ్యాక్షరమవ్యయమ్|| (1)
పరీక్షిద్వంశభృచ్ఛ్రీమాన్ నృపతిర్జనమేజయః|
పప్రచ్ఛ శిష్యం వ్యాసస్య వైశంపాయ నమన్తికాత్|| (2)
దైవ ప్రార్థన తరువాత రాజు జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు.
మహాభారతం కథను జనమేజయుడికి వినిపించినది వైశంపాయనుడు. వైశంపాయనుడు వ్యాసమహర్షి శిష్యుడు. జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు. సర్పయాగం తలపెట్టి నిర్వహించి సర్పాలను నాశనం చేస్తున్న జనమేజయుడిని మహర్షులు సర్పయాగం నిర్వహణ నుంచి విరమింపజేస్తారు. ఆ తరువాత వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత గాథ వినిపిస్తాడు.
‘నీలమత పురాణమ్’ ఆరంభం ఇది. ఇది జనమేయజుడికి వైశంపాయనుడు వినిపించిన పురాణం.
అమరకోశం ప్రకారం పురాణానికి నిర్వచనం:
”సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశోమన్వంతరాణిచ
వంశాను చరితమ్ చేతి పురాణం పంచ లక్షణమ్”
‘సర్గ’ అంటే సృష్టి ఆవిర్భావం గురించి వివరించేది. ‘ప్రతి సర్గ’ అంటే ప్రపంచాలు నాశనం అయి తిరిగి సృష్టి సంభవించటం గురించి చెప్పేది. వంశ – వంశావళిని వివరించేది. మన్వంతరం – మను జీవితకాలం మన్వంతరం. వంశానుచరిత అంటే సూర్య, చంద్ర వంశాల వారి వంశవృక్షాలను, వారి చరిత్రను వివరించేది. ఈ అయిదు లక్షణాలు ఉన్నదాన్ని ‘పురాణం’ అంటారు. అయితే, విష్ణు, వాయు, మత్స్య, భాగవత పురాణాలు మినహా మిగతా ఏ పురాణం కూడా ఈ నిర్వచనంలో ఒదగదు. నీలమత పురాణం కూడా!
భారతీయ ప్రాచీన వాఙ్మయంతో ఒక సమస్య ఉంది. ఏ రచన కూడా ఈ కాలానికి చెందినది అని ఖచ్చితంగా చెప్పటం కష్టం. ‘కల్హణ రాజతరంగిణి’ ఏ కాలంలో రాసిందో నిర్ణయించడం సులభం. ఎందుకంటే కల్హణుడి జీవితకాలం గురించి అంచనా వేసే వీలుంది. రాజతరంగిణిలో కూడా కల్హణుడు తన జీవితకాలంలో తాను చూసిన విషయాలను ప్రస్తావించాడు. ఆనాటి చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దాంతో రాజతరంగిణి రచన కాల నిర్ణయంలో కష్టం లేదు. కానీ ‘నీలమత పురాణం’ గురించిన ప్రస్తావన రాజతరంగిణిలో ఉంది. కాబట్టి రాజతరంగిణి కన్నా ముందరిది ‘నీలమత పురాణం’ అనడంలో ఎలాంటి సంశయం లేదు. సమస్యల్లా ‘ఎంత ముందరిది?’ అన్న విషయం దగ్గరే వస్తుంది.
రాజతరంగిణిలో నీలమత పురాణం ప్రస్తావన స్పష్టంగా ‘మూడవ గోవిందుడి’ కాలంలో వస్తుంది. బౌద్ధులు విజృంభించటం వల్ల ప్రాచీన సంప్రదాయాలు, సంస్కారాలు అదృశ్యం అవుతూండటంతో కోపించిన నాగులు కశ్మీరులో మంచు తుఫానులను కురిపిస్తుంటారు. వాటినుంచి ప్రజలను కాపాడేందుకు ‘చంద్రదేవుడు’ అనే వ్యక్తి నాగులను శాంతింపజేస్తాడు. మంచు తుఫానుల బారి నుంచి ప్రజలను రక్షిస్తాడు. అయితే అతడు ఒక నియమం విధింపజేస్తాడు. అదేమిటంటే దేశమంతా నీలమత పురాణాన్ని వ్యాపింపజేయాలి (చూ. ; ‘రాజతరంగిణి’లో మొదటిభాగం 55వ అధ్యాయం, శ్లో:182-186: ‘కల్హణ రాజతరంగిణి కథలు’లో ‘ప్రజా పుణ్యైః సంభవంతి మహీభుజః’ కథ, పేజీ 58-64). దాంతో కశ్మీరులో మళ్ళీ శాంతి నెలకొంటుంది.
‘రాజతరంగిణి’ ప్రకారం ఈ కథ మూడవ గోవిందుడి కాలంలో జరిగింది. ‘రాజతరంగిణి’ ప్రకారం నీలమత పురాణాన్ని చంద్రదేవుడు రచించాడు. కానీ అంతకు ముందే అమలులో ఉండేది నీలమత పురాణం. ప్రజలు విస్మరించిన సంప్రదాయాలు, సంస్కారాలు, పూజా విధానాలను క్రోడీకరించి చంద్రదేవుడు గ్రంథస్తం చేశాడు. ‘రాజతరంగిణి’ ప్రకారం ఈ కథ లౌకికాబ్దం 1894లో జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం ఈ లౌకికాబ్దాల లెక్కలు తీస్తే ఇది క్రీ.పూ. 1182వ సంవత్సరం అవుతుంది. ఇక్కడే వస్తుంది సమస్య!
కల్హణుడు ఇచ్చిన తేదీ సరైనదిగా భావిస్తే మొత్తం మనం ఏర్పాటు చేసుకుని, నమ్ముతున్న చరిత్రను తిరగ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసుకున్న చరిత్ర ప్రకారం గౌతమ బుద్ధుడు పుట్టింది క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో. అది నిజమైతే కల్హణుడు ఇచ్చిన తేదీని ఆమోదించలేము. ఎందుకంటే క్రీ.పూ. 1182 సంవత్సరం నాటికల్లా బుద్ధుడు మరణించి, బౌద్ధం వ్రేళ్ళూనుకుని దేశమంతా విస్తరిస్తోంది. బౌద్ధులు దేశమంతా విస్తరించి సనాతన సంప్రదాయాలపై ఆధిక్యం సాధిస్తున్నారు. ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ లాంటి పరిస్థితి ఇది.
కల్హణుడిది ప్రామాణికం అనుకుంటే నీలమత పురాణం క్రీ.పూ. 1182 నాటిది. బుద్ధుడు అంతకు కొన్ని వందల సంవత్సరాలకు ముందు పుట్టి ఉండాలి. బుద్ధుడు క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో పుట్టేడని, అదే నిజమని నమ్మితే ‘నీలమత పురాణం’ క్రీ.పూ కాదు, క్రీ.శ. లోనిదై ఉండాలి. ఎప్పటిదై ఉంటుంది?
పాశ్చాత్యుల ప్రకారం ‘నీలమత పురాణం’లోనే బుద్ధుడి జన్మదినాన్ని సనాతన ధర్మానుయాయులు కూడా ఓ ఉత్సవంలా జరుపుకోవటం ఉంది కాబట్టి, క్షేమేంద్రుడు రాసిన ‘అవదాన కల్పలత’లో కూడా ఈ ప్రస్తావన ఉంది కాబట్టి, క్షేమేంద్రుడి కాలం క్రీ.శ. 900 – 1165 గా తీర్మానించారు కాబట్టి, పాశ్చాత్య లెక్కల ప్రకారం బుద్ధుడు దశావతారాలలో ఒకటి అవడం క్రీ.శ. 1000 సంవత్సరం ప్రాంతంలో జరిగి ఉంటుంది కాబట్టి, నీలమత పురాణం క్రీ.శ. ఆరు, ఏడు శతాబ్దాలలో రచించి ఉంటారని తీర్మానించారు. ఒక దెబ్బతో క్రీ.పూ. 1182 నాటి రచన, క్రీ.శ. 6-7 శతాబ్దాలకు దూకిందన్నమాట.
ఈ లెక్కలలో ఏ లెక్కకూ ప్రామాణికం లేదు. ఏ లెక్కకూ ఆధారం లేదు. అంతా ఊహ. బుద్ధుడు క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటి వాడని తీర్మానించారు కాబట్టి, దాన్ని కేంద్రంగా చేసుకుని మిగతా అన్నింటినీ దాని చుట్టూ తిప్పి ఊహించి నిర్ణయించుకున్నారన్న మాట. అంతే కాదు, క్షేమేంద్రుడి కన్నా నాలుగు, అయిదు వందల సంవత్సరాల క్రితం రాసినదనడానికే ఆధారమూ లేదు. కానీ అలా ఓ తేదీని ఊహించారు, నిర్ణయించారు, ప్రకటించారు. ప్రచారం చేశారు. పదే పదే అంటుంటడంతో అది స్థిరపడింది. ప్రామాణికం అయింది, అంతే తప్ప క్రీ.శ. ఆరు, ఏడు శతాబ్దాల కాలంలో నీలమత పురాణం రచించారనడానికి ఋజువులు లేవు. ఉన్నది కేవలం ఊహ. అంటే మన పూర్వీకులు తమ పుస్తకాలలో పొందుపరిచిన నిజాల కన్నా పాశ్చాత్యుల ఊహలే మనకు ప్రామాణికాలయ్యాయన్నమాటా.
కల్హణుడు చెప్పిన మూడో గోవిందుడిని ఆమోదిస్తాం. నీలమత పురాణాన్ని చంద్రదేవుడు రచించాడన్న దాన్ని ఆమోదిస్తాం. కానీ కల్హణుడు చెప్పిన క్రీ.పూ. 1182 ని మాత్రం ఆమోదించమట. ఎందుకంటే, అది ఆమోదిస్తే పాశ్చాత్యుల తేదీలు, సిద్ధాంతాలు తలక్రిందులు అవుతాయి. అదీ కథ. ఇదెలా ఉంటుందంటే, ఒక రాజు, ఒక పండితుడు దారిలో పోతున్నారట. వారికి మేకలు కాస్తున్నవాడు కనిపించాడు. రాజు ‘వీడేమిటి, గాడిదలు కాస్తున్నాడు?’ అని అడిగాడట. ఇప్పుడు, అవి గాడిదలు కావు, మేకలు అంటే పండితుడి మెడ పోతుంది. అందుకని ‘అవును రాజా… గాడిదలు కాస్తున్నాడేంటి వీడు’ అన్నాడట పండితుడు. దాంతో రాజు అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎవరు ఎంత చెప్పినా, చివరికి మేకల యజమాని అవి మేకలు అని అన్నా రాజు ఒప్పుకోలేదు. ఆ పండితుడు ఒప్పుకోలేదు, సైనికులు ఒప్పుకోలేదు. దాంతో ఆ రాజ్యంలో మేకలను గాడిదలనడం ఆనవాయితీ అయ్యిందట. మన చరిత్ర నిర్ణయంలోనూ, తేదీల నిర్ణయంలోనూ ఇదే జరిగింది. ‘ఇది నిజం’ అని నిరూపణ ఉన్న దానిని నమ్మక, ‘నా ఊహ నిజం’ అన్న బలమున్న వాడి ఊహే నిజం అయిందన్న మాట.
వచ్చిన చిక్కు ఏమిటంటే మన వాళ్ళు లెక్కలలో దిట్టలు. పెద్ద పెద్ద ఆధునిక యంత్రాలతో చూసి తెలుసుకుంటున్న విషయాలను వారు తమ మేధ ద్వారా దర్శించి ప్రకటించారు. ‘సమయ గణన’ అందులో ఒకటి. ‘కాల గణన’లో సెకనులో లక్షవ వంతు వరకూ గణించి నామకరణం చేశారు. ఆకును ఒక సూదితో గుచ్చేందుకు అవసరమయ్యే సమయాన్ని ‘అల్పకాల’ అంటారు.
30 అల్పకాలాలు = 1 తృటి
30 తృటులు = 1 కాలా
30 కాలాలు = 1 కాస్థా
30 కాస్థాలు = 1 నిముష (ఒక మాత్ర)
4 నిముషాలు =1 గణిత
10 గణితాలు = 1 కాతువిర్పు (అంటే నిట్టూర్చే సమయం)
ఇలా ఒక పురాణంలోని ‘కాలమానాన్ని’ చూస్తూ పోతే వారు ప్రతి విషయాన్ని ఎంత సూక్ష్మంగా, ఎంతో తీవ్రంగా, ఎంత లోతుగా విశ్లేషించేవారో తెలుస్తుంది. పైగా వారు ప్రతీ విషయంలోనూ ఖచ్చితంగా ఉండేవారు. ఒక పదాన్ని ఉచ్ఛరించడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించి, ఏ కార్యక్రమం ఎంత సమయంలో కావాలో నిర్ణయించేవారు. గ్రహగతుల విషయంలోనూ ఇంతే. దేన్నీ తేలికగా, అల్లాటప్పాగా వదలలేదు. పాయింటు తరువాత పది సున్నాల తరువాత ఒకటి (0.00000000001) కదా అని వదిలేయలేదు. అలాంటి వారు ఇచ్చిన లెక్కలను నమ్ముతామా?
‘అప్పుడయింది అది అన్నాము కాబట్టి, ఇది ఇంతలో అయిపోవాలి’ అని ఊహ ప్రకారం నిర్ణయించి నిర్ధారించేవారిని నమ్ముతామా? అంటే మనం ‘ఊహాత్మాక నిర్ధరాణనే నమ్ముతాం’ అంటున్నాం. మన పూర్వీకుల కన్నా మనల్ని బానిసలు చేసినవారిపైనే విశ్వాసం ఉంచుతాం అంటున్నాం.
కాబట్టి ‘నీలమత పురాణం’ ఎప్పటిది, అన్న మీమాంసను పక్కనబెట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. కల్హణుడి ప్రకారం క్రీ.పూ. 1182 అనుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ‘రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‍లా ఉండాలి’ అంటారు. కాబట్టి పురాణాలను పఠించేడప్పుడు పురాణాలను ‘నమ్మి’ ముందుకు సాగాలి. నమ్మకం లేకపోతే ముందుకు సాగినా లాభం లేదు. నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా పురాణాలు చదివితే పురాణం అర్థం కాదు, పైగా అపార్థం అవుతుంది. కాబట్టి ‘నీలమత పురాణం’ అత్యంత ప్రాచీనమైనది. క్రీ.పూ. 1182 కన్నా పాతది అని నమ్ముతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. నమ్మనివారు ఇక్కడే ఆగాల్సి ఉంటుంది. ముందుకు వస్తే అది వారి ఇష్టం! పూర్వీకులపై విశ్వాసం, గౌరవాలతో ముందుకు సాగుదాం.
(ఇంకావుంది)