[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ముక్కుపుడక’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఎం[/dropcap]త పని చేశావే
ఓ ముక్కుపుడకా
అందమంత దాచేసి
ఆడ దాగుండినావా
సొగసుగా ఉంటదని
నిను చేరదీస్తే
నా సోకునంతా
దోచేసినావా
ఇంత ఇంతిని కూడా
అంతలా మాయ చేసి
అందమంతా లాగేసినావా
ముక్కు మీద ఎక్కేసి
ముత్యంలా మెరిసేసి
నన్నే చూడు అంటూ
నాకే నగుబాటు తెచ్చినావా
సౌందర్యమంటే
నీ ముక్కు పుడకేనని
అంతగా జనం అంటూంటే
ఇపుడు కదా తెలిసొచ్చే
నీ అసలు కధ
నీవు లేకున్నా
నా ముక్కుకేం తక్కువ
సంపెంగ సొంపు అది
ఇంపైన రూపం నాది
అందుకే అంటున్నా
ఓ ముక్కుపుడకా
ఇకపై నా వెంట పడకా
నాకు నేనే సాటి
నీవు ఎప్పటికీ రాకు పోటీ