రావణుని యశోవైభవం

5
3

(బాపు గారి ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో రావణుడి పరాక్రమాన్ని, యశస్సుని, వైభవాన్ని వర్ణించే సి. నారాయణ రెడ్డి రచించిన పాటని విశ్లేషిస్తున్నారు గోనుగుంట మురళీకృష్ణ.)

[dropcap]న[/dropcap]టీనటులు కావ్యాలలో వర్ణించినట్లు వేషధారణ చేసుకోవటం, అక్కడ వర్ణించినట్లుగానే చూడటం, నడవటం, ఆ పాత్ర స్వభావాన్ని మనసులో నిలుపుకుని అదే విధంగా ప్రవర్తించటం చేస్తారు. ఆ కథ ఇప్పుడు మన కళ్ళముందు జరుగుతుందేమో అనిపిస్తుంది అలాంటి చిత్రాలను చూస్తుంటే! అందుకే చలనచిత్రాలను దృశ్యకావ్యాలు అని అంటారు. అటువంటి దృశ్యకావ్యం అనదగిన అసలైన చిత్రాలు బాపు తీసిన చిత్రాలు. బాపు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ప్రతి ఫ్రేమూ ఒక చక్కటి పెయింటింగ్‌లా ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి ‘సంపూర్ణ రామాయణం (1972)’. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందంటే చివరలో రావణవధ ముగిసి శ్రీరామపట్టాభిషేకం జరుగుతూ ఉంటే అందరూ చెప్పులు విప్పి లేచి నిలబడి చూశారు.

ఈ చిత్రంలో రాముడుగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ, రావణుడిగా యస్.వి.రంగారావు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరాముడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీరాముడిని తెలియని తెలుగువాడు ఉండదు. ఆయనతో సరివీరుడు రావణుడు. రావణుడు ఎంతటి ప్రతాపవంతుడు అంటే రాముడు తప్ప ఆయన్ని జయించేవారు ఎవరూలేరు. రావణుడి పరాక్రమాన్ని, యశస్సుని, వైభవాన్ని వర్ణించే ఒక చక్కటి గీతం ఈ సినిమాలో ఉంది. అది రావణుడి కొలువులో నాట్యగత్తెలు పాడే పాట. ఈ పాటను సి. నారాయణ రెడ్డి రచించగా పి.లీల, జిక్కి గానం చేసారు. జూనియర్ కాంచన, జూనియర్ పద్మిని నర్తించారు. ఆ పాటను ఒకసారి చూద్దాం.

“ఎవ్వడు నిను మించువాడు ఈరేడు లోకాల ఎందైన కనరాడు”

ఈరేడు అంటే పద్నాలుగు అని అర్థం. భూమి కింద ఏడులోకాలు, భూమి పైన ఆరులోకాలు ఉన్నాయి. నిన్ను మించినవాడు ఎవరున్నారు? పద్నాలుగు లోకాలు వెతకిచూసినా ఎక్కడా కనబడడు అని నాట్యం చేస్తూ గానం మొదలు పెట్టారు నర్తకీమణులు. మొదటి చరణంలో రావణుని పరాక్రమం వర్ణిస్తున్నారు ఇలా..

“మదనుడవని అందునా వాడు మాడిపోయిన వన్నెకాడు

చూడ రూపమైనా లేనివాడు,

ఇంద్రుడవని అందునా వాడు ఒడలెల్ల పొడలున్నవాడు

నీ కొడుకన్న హడలున్నవాడు,

ధనపతివని అందునా వాడు నిను కొలిచే బానిసీడు

నీ ముంగిట పడి ఉన్నవాడు

నర సుర కిన్నెర గరుడులలో నీ సరితూగు రేడు మచ్చునకైన లేడు”

మన్మథుడిని అనంగుడు అని అంటారు. అంటే అంగాలు (శరీర భాగాలు) లేనివాడు, ఆకారం లేనివాడు అని అర్థం. మన్మథుడికి ఆకారం ఎందుకులేదు అని అంటే, శివుడు హిమవత్పర్వతం పైన తపోదీక్షలో ఉన్నాడు. పార్వతి ఆయన్ని వివాహం చేసుకోవాలనే కోరికతో, ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజూ పూజిస్తూ ఉంది. ఆ సమయంలో మన్మథుడు వచ్చి తన పంచబాణాలు శివుడి మీద ప్రయోగించాడు. తపోభంగమై శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. అప్పటినుంచీ అనంగుడు అని పేరు వచ్చింది. శివుడి తపస్సు భంగం చేయాల్సిన అవసరం అతడికి ఏమిటి అని అడిగితే వెనకటి కథ కొంచెం చెప్పాల్సిఉంటుంది.

తారకాసురుడు అనే రాక్షసుడు శివపార్వతులకు పుట్టే పుత్రుడి వల్ల తప్పితే మరణం లేకుండా బ్రహ్మ నుంచీ వరం కోరుకుంటాడు. వరగర్వంతో లోకాలను పీడిస్తూఉంటాడు. అప్పటికి శివుడు, భార్య సతీదేవి మరణంతో విరక్తుడై తపస్సు చేసుకుంటూ ఉంటాడు. వైరాగ్యంతో ఉన్న అయన్ని వివాహోన్ముఖుడిని చేయటానికి దేవతలు మన్మథుడిని నియోగిస్తారు. ఇక్కడ నాట్యగత్తెలు “నిన్ను మన్మథుడు అని అందామా అతడు మాడిపోయిన దేహం కలవాడు, కనీసం చూడటానికి రూపం కూడా లేనివాడు, పోనీ ఇంద్రుడు అని అందామా అంటే అతడికి శరీరం అంతా పొడలు (చూపులు) కలవాడు, అందులోనూ నీ కొడుకు పేరు వింటేనే భయంతో హడలిపోతాడు” అని చెబుతున్నారు.

ఇంద్రుడికి శరీరం నిండా కళ్ళు ఎందుకు ఉన్నాయి అని అడిగితే అందుకు మరో కథ ఉన్నది. ఒకసారి బ్రహ్మదేవుడు అతిలోక సౌందర్యవతి అయిన అహల్యని సృష్టించి, భూలోక ప్రదక్షిణం మూడుసార్లు చేసి ఎవరు ముందు సత్యలోకం చేరుకుంటారో వారికి ఆమెని ఇచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. ఇంద్రుడు, వరుణుడు, యముడు వంటి దిక్పాలకులు అందరూ పందెంలో గెలవాలని వెంటనే అక్కడినుంచీ వెళ్ళిపోతారు. గౌతమ మహర్షి మాత్రం తన ధర్మశాస్త్ర విజ్ఞానంతో ముమ్మారు గోప్రదక్షిణం చేసి భూప్రదక్షిణం చేసిన ఫలాన్ని పొందుతాడు. ఇంద్రాది దేవతలు తిరిగి వచ్చేసరికి అహల్యాగౌతముల వివాహం జరిగిపోతుంది.

అహల్య మీద కన్నువేసిన ఇంద్రుడు ఎలాగైనా ఆమెని పొందాలనే ఉద్దేశంతో సమయం కోసం కాచుకుని ఉన్నాడు. ఒకరోజు రాత్రి కోడి రూపం దాల్చి మహర్షి ఆశ్రమప్రాంతంలో కొక్కోరొక్కో అని కూశాడు. తెల్లవారుజాము అయిందనే ఉద్దేశంతో గౌతముడు నదీస్నానానికి బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళిన తర్వాత నభోమండలంలోని నక్షత్రరాశిని చూసి “రాత్రి మూడవజాము అయినా గడవలేదు. వేళకాని వేళలో కోడికూత ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉంది” అనుకుంటూ ఆశ్రమానికి తిరిగివచ్చాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముడి రూపంలో అహల్యతో ఉన్నాడు. మహర్షిని చూసి కళవళ పడ్డాడు. గౌతముడు ఆగ్రహంతో “కామాతురుడవై కాని పని చేసినందుకు నీ కాయమంతా కళ్ళతో నిండిపోయి అందవిహీనుడవు అయిపో!” అని శపించాడు. అప్పటినుంచీ ఇంద్రుడికి సహస్రాక్షుడు అనే పేరు వచ్చింది. అహల్యను కూడా పాషాణం కమ్మని శపించాడు.

అహల్య భర్త పాదాల మీదపడి “స్వామీ! మీ రూపంలో వస్తే మీరే అనుకున్నాను. ఇందులో నా దోషం ఏముంది?” అన్నది. గౌతముడు నిజం గ్రహించి శాంతించాడు. “నోరు జారింది. వెనక్కు తీసుకోలేను. పరపురుష స్పర్శతో అపవిత్రమైన నువ్వు పరమాత్మ స్పర్శతో పవిత్రమౌతావు” అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఈ కథలు మూలకావ్యంలో ఉన్నాయా లేవా అని మీమాంసలో పడకూడదు. సినిమా అనేది వినోద సాధనం. ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి ప్రాచుర్యంలో ఉన్న అన్ని కథలను తీసుకుంటారు.

“నీ కొడుకన్న హడలున్నవాడు” అనటానికి మరో దుష్టాంతం ఉన్నది.

రావణుడి కుమారుడు ఇంద్రజిత్ బ్రహ్మ గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ “పన్నెండేళ్ళు నిద్రాహారాలు లేకుండా, భార్య గలిగి బ్రహ్మచర్యం చేసిన మానవుడి చేతిలో తప్ప ఎవరివల్లా మరణం ఉండదు” అని చెబుతాడు. ఇంద్రజిత్ అమరావతిపై దండెత్తి వెళతాడు. అప్పటికే ఇంద్రుడు భయంతో పాతాళానికి పారిపోయి నాగరాజు రక్షణ కోరుకుంటాడు. ఇంద్రుడు అతిథి మర్యాదను అతిక్రమించి నాగరాజు కుమార్తె సులోచనాదేవితో అధిక ప్రసంగం చేస్తుంటే, అదే సమయానికి అతడిని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు ఇంద్రజిత్. ఇంద్రజిత్‌ని చూడగానే భయంతో పారిపోతుంటే బంధించి లంకకు తీసుకువెళ్ళమని భటులను ఆజ్ఞాపిస్తాడు.. నాగరాజు ఇంద్రజిత్‌ని చూసి “నా లోకం వచ్చి నా అతిథిని అవమానిస్తావా! ఎప్పటికైనా నా చేతిలో నీ చావు తప్పదు” అని అంటాడు. సులోచన తండ్రిని వారించబోయినా వినిపించుకోడు.

“నన్ను చంపాలంటే పన్నెండేళ్ళు భార్య గలిగి బ్రహ్మచర్యం చేయాలి” అన్నాడు ఇంద్రజిత్.

“చేస్తాను”

“మానవుడిగా జన్మించాలి.”

“జన్మిస్తాను” అంటాడు నాగరాజు. సులోచనాదేవి ఇంద్రజిత్ సౌందర్య విక్రమాలకు ముగ్ధురాలై ప్రేమిస్తుంది. ఆమెను వివాహం చేసుకుంటాడు. మరుసటి జన్మలో నాగరాజు, దశరధుడు సుమిత్ర దంపతులకు లక్ష్మణుడుగా జన్మించి ఇంద్రజిత్‌ని వధిస్తాడు.

ఇక మూడవ లైన్‌లో “నిన్ను కుబేరుడని అందామా అంటే అతడు నిన్ను కొలిచే సేవకుడు. నువ్వు పిలిస్తే పలకటానికి నీ ముంగిట్లోనే పడిఉంటాడు” అని పాడుతున్నారు.

ధర్మాత్ముడు, సద్గుణవంతుడు అయిన విశ్రవసువు భరద్వాజ మహర్షి పుత్రిక అయిన ‘ఇలబిల’ను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు జన్మించిన వాడు కుబేరుడు (ఇలబిల పుత్రుడు కాబట్టి అతడికి ఐలబిలుడు అనే పేరు ప్రసిద్ధమైంది). కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మహిమాన్వితమైన పుష్పక విమానాన్ని వరంగా పొందాడు. తండ్రి ఆజ్ఞ మీద త్రికూటపర్వతం మీద ఉన్న లంకను నివాసంగా చేసుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి కైకసి అగ్నిహోత్రుడిని ఉపాసిస్తున్న విశ్రవసువు దగ్గరికి వెళ్లి కాలి బొటనవేలుతో నేలను రాస్తూ, క్రీగంట చూస్తూ నిలబడింది. ఆమె కోరిక తెలుసుకున్న విశ్రవసువు “ఇది దైవపూజా సమయం. నిషిద్ధవేళలో పుత్రోత్పత్తి కోరివచ్చావు కనుక నా వలన నీకు పుట్టబోయే పుత్రులు క్రూరకర్ములైన రాక్షసులు అవుతారు” అని చెప్పాడు.

కైకసి అయన పాదాల మీదపడి “స్వామీ! దురాచారులైన కొడుకులు నాకు వద్దు. నన్ను అనుగ్రహించు” అని వేడుకుంది. “నీ కడగొట్టు కొడుకు ధర్మపరుడు అవుతాడు” అని చెబుతాడు విశ్రవసువు. ఆయన దయవలన కైకసికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే పుత్రులు, శూర్పణఖ అనే పుత్రిక కలుగుతారు.

ఒకసారి కుబేరుడు తండ్రిని చూడటానికి పుష్పక విమానంలో అక్కడికి వచ్చాడు. అతడి వైభోగం చూసిన కైకసి రావణుడితో “మీ అన్న ధనపతి ఎంత వైభోగంగా ఉన్నాడో చూడు. నువ్వు కూడా అలా అభివృద్ధి చెందటానికి ప్రయత్నించు” అన్నది. దానికితోడు రావణుడి మంత్రి “ఒకప్పుడు లంక రాక్షసుల నివాసం. విష్ణువుకి భయపడి రాక్షసులు అక్కడినుంచీ పారిపోయారు. అప్పటినుంచీ కుబేరుడు లంకను నివాసంగా చేసుకున్నాడు. వాస్తవంగా లంక మనదే!” అని చెప్పాడు. ఆ మాటతో కుపితుడైన రావణుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి, అమోఘ వరాలను పొంది, కుబేరుడి మీదకు దండెత్తి, అతడిని వెళ్ళగొట్టి లంకను, పుష్పకవిమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

“ధనపతి నిన్ను గొలిచే బానిసీడు” అని నర్తకీమణులు పాడటానికి అర్థం ఇదే! మానవులు, దేవతలు, కిన్నెరులు, గరుడులు (పక్షి జాతులు) లలో నీతో సరి సమానమైన రాజు మచ్చుకు ఒక్కడు కూడా లేడు అని గానం చేసారు. మొదటి చరణంలో రావణుడి వీరరసాన్ని వర్ణించిన కవి, రెండవ చరణంలో శృంగార రసాన్ని వర్ణిస్తున్నాడు ఇలా..

“కొసచూపే చాలురా అది కుసుమాంగులకు జ్వాలరా,

మిసిమి నవ్వే చాలురా అది రసవాహినుల డోలరా,

మగువల కెరలించు మగసిరి నీదేరా,

వగలను రగిలించు సొగసులు నీవేరా

అసమాన రమ్య రసికావతంస అసురవంశ సరసి రాజహంస”

ఇక్కడ మిసిమి అంటే నూతన కాంతి, కెరలించు అంటే అతిశయించు, సరసి అంటే సరోవరం అని అర్ధాలు. నీ క్రీగంటి చూపే చాలు అది స్త్రీల మనసులను మండించే జ్వాల లాంటిది. నూతన కాంతులను వెదజల్లే నీ చిరునవ్వే వారిని శృగార రసవాహినులలో డోల లూగిస్తుంది. అతివలను సంమోహనంతో అతిశయింప చేసే మగసిరి నీది, వగలను రగిలించే సొగసులు నీవి అని గానం చేస్తున్నారు నట్టువరాళ్ళు. వగ అంటే విరహంతో కూడిన దిగులు.

రావణుడి సౌందర్యాన్ని సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణ చేసే సందర్భంలో చాలా బాగా వర్ణిస్తాడు వాల్మీకి. విశాలమైన వక్షస్థలంతో, బలిష్టమైన బాహువులతో, గుండ్రటి భుజాలతో, పౌరుషాన్ని సూచించే గుబురు మీసాలతో మహారాజ లక్షణాలతో ఉంటాడు రావణుడు. తెల్లటి తల్పంమీద నిద్రిస్తున్న అతడు గంగానదీ జలాల మధ్య పడుకున్న ఏనుగులాగా ఉన్నాడట. అతడికి తగినదే భార్య మండోదరి కూడా! ఆమె కూడా సౌందర్యవతే! ఎంత అందగత్తె అంటే ఆమెని చూసి సీతేనేమో అని హనుమతుడు కూడ పొరపడేటంత! రావణుడు మరణించిన తర్వాత విలపిస్తూ “ఇంద్రియనిగ్రహం లేక పరకాంతా వ్యామోహంతో నువ్వు సీతాదేవిని చెరపట్టావు. అంతేకానీ సౌందర్యంలోగానీ, చాతుర్యంలోగానీ ఆమె కన్నా నేను ఎందులో తక్కువ?” అంటుంది మండోదరి.

సరే! మళ్ళీ పాట విశ్లేషణ లోకి వస్తే “అసమానమైన రమ్యదీప్తి కలవాడా, రసికులలో మేలుబంతి వంటివాడా, రాక్షసవంశం అనే సరోవరంలో విహరించే రాజహంస వంటివాడా!” అని కీర్తిస్తున్నారు. ఇక చివరి చరణంలో రావణుడి అమోఘ వైభవాన్ని ఇలా ప్రస్తుతిస్తున్నారు.

“నిజభుజ కంపిత రజతాచలాగ్ర శేఖరా సురభీకరా!

అసదృశ విక్రమ చకచ్చకిత విషకంధరా, దశకంధరా!

రాజ్యరమా, భాగ్యరమా, విజయరమా రమణ,

అస్త్ర శస్త్ర గదా ఖడ్గ సుప్రయోగ నిపుణ,

అనంత మూర్తీ, దిగంత కీర్తీ, విజయా, సదయా, అజరా, అమరా!”

ఇక్కడ రజతాచలము అంటే కైలాసపర్వతం, దృశ అంటే దృష్టి, చకితము అంటే సంభ్రమం, విషకంధరుడు విషాన్ని కంఠంలో దాచుకున్నవాడు అని అర్థాలు. వెండికొండను ఎత్తినప్పుడు కంపించిన భుజాలు కలవాడా, దేవతలకు భయం కలిగించేవాడా! చూడ శక్యము గాని పరాక్రమం కలిగిన పరమశివుని వంటివాడా, పదితలలు కలిగినవాడా, రాజ్యానికి, భాగ్యానికి, విజయానికి ప్రభుడవైనవాడా! అస్త్రాలు, శస్త్రాలు, గద, ఖడ్గం, మొదలైన ఆయుధాలు ప్రయోగించంటంలో నిపుణత కలిగినవాడా! అని కీర్తిస్తున్నారు.

ఇక్కడ అస్త్రాలు, శస్త్రాలు మధ్య కొద్దిగా వ్యత్యాసం ఉంది. శస్త్రం అంటే ఆయుధం, చేత్తో పట్టుకుని యుద్ధం చేసేది. అస్త్రం అంటే మంత్రయుక్తంగా ప్రయోగించేది, బాణమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని విసిరేస్తారు (రాముడు దర్భపుల్లని మంత్రించి కాకి మీద వేస్తాడు. అది బ్రహ్మాస్త్రమై వెంటబడుతుంది).

అనంతమైన ఆకారం కలిగినవాడా, దిగంతాల వరకు వ్యాపించిన కీర్తి కలవాడా, విజయము, దయ కలిగినవాడా! జరామరణాలు లేనివాడా! అంటూ కీర్తిస్తూ నర్తించారు నర్తకిలు. ఇదీ సంపూర్ణ రామాయణం చిత్రంలో రావణుని వర్ణించే నృత్య గీతం!

శ్రీరాముడిగా యన్.టి.రామారావు లబ్ధప్రతిష్ఠుడు. మొదట్లో ‘యన్.టి.ఆర్. లేని రామాయణమా!’ అని పెదవి విరిచిన ప్రేక్షకులే తర్వాత బ్రహ్మరథం పట్టారు ఈ సినిమాకి. ఉత్తమ దర్శకుడిగా బాపు గారికి అవార్డ్ వచ్చింది. కానీ అయన ఎప్పుడూ తన గురించి చెప్పుకోలేదు. ఆ సంవత్సరం ప్రభుత్వం బాపుకి పద్మశ్రీ అవార్డ్ ప్రకటించింది అనే వార్త ముళ్ళపూడి వెంకట రమణ సంతోషంగా బాపు ఇంటికి వచ్చి చెప్పారు.

“అదేదో గొప్ప వాళ్లకి ఇచ్చే అవార్డ్ కదండీ! మీకు ఇస్తామని అంటున్నారేమిటి?” అన్నది బాపు భార్య అమాయకంగా. “అదే నాకూ అర్థం కావటం లేదే!” అన్నారు ఆయన అంతకన్నా అమాయకంగా.

ముళ్ళపూడి వారికి నవ్వొచ్చింది. “నువ్వు కూడా గొప్పవాడివేలేయ్యా! త్వరగా బయలుదేరు” అన్నారు. సీతాకల్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త కన్నప్ప, ముత్యాలముగ్గు వంటి కళాఖండాలకు దర్శకత్వం వహించారు బాపు. టి.వి.లో బాపు చిత్రం వస్తుంది అని ప్రకటిస్తే ప్రేక్షకుల మనసులో సుమధుర పరిమళం వంటి భావవీచిక కదలాడుతుంది ఇప్పటికీ!

Images courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here