[‘దిక్చక్రం’ అనే సాహితీ వ్యాస సంపుటిని వెలువరించిన శ్రీ ఆడెపు లక్ష్మీపతి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం ఆడెపు లక్ష్మీపతి గారూ.
ఆడెపు లక్ష్మీపతి: నమస్కారమండీ
~
ప్రశ్న 1. సాహిత్య వ్యాసాల పుస్తకానికి దిక్చక్రం అని పేరు పెట్టటంలో మీ ఉద్దేశం ఏమిటి?
జ: ఆంగ్ల పదం Horizon/The Horizon కి దిగంతం, దిజ్మండలం, దిక్చక్రం, క్షితిజం, భూవలయ రేఖ.. మొదలైన అర్థాలున్నాయని మనకు తెలుసు. ఫిగరేటివ్‌గా తీసుకుంటే, అవగాహనకి/పరిజ్ఞానానికి సంబంధించిన అవధి, పరిధి, పరిమితి (boundary) అనే అర్థాలూ వస్తాయి. ఎత్తైన ప్రదేశంలో స్థానం తీసుకుని దృష్టిని చాలా దూరం వరకు, దిగంతాలకి సారిస్తే, వీలయితే చూపుని 360 డిగ్రీ కోణంలో తిప్పగలిగితే, అపరిచిత పరిసరాల్లోకి ప్రవేశించి కొత్త దృశ్యాలను మన దృగావరణం లోకి లాక్కోగలుగుతాము. జిజ్ఞాసతో వైవిధ్యభరితమైన రచనల్ని, ప్రపంచ ప్రసిద్ధుల ఫిక్షన్, నాన్ ఫిక్షన్, డ్రామా, పోయెట్రీ.. చదివితే మన సాహిత్య పరిజ్ఞాన పరిధి విస్తారమవుతుంది; కొత్త రచనా రీతులు, ప్రక్రియాపరంగా వినూత్న పోకడలు పరిచయమవుతాయి; పలు విషయాల గురించిన మన అవగాహన ఇతోదికమై ఒక రచన ‘మెరిట్’ని లేదా నాణ్యతని శాస్త్రీయంగా తూచగలిగే పరికరాలు దొరుకుతాయి. విస్తృతంగా చదివే అలవాటు మూలంగా నాకు అలవడిన కొత్త చూపుతో- జనరల్‌గా వర్తమాన తెలుగు సాహిత్య ప్రక్రియల -కథ, కవిత్వం, నవల – తీరుతెన్నులను పరిశీలిస్తూ, ప్రత్యేకించి కొందరి రచనలలని విశ్లేషించడం.. ఈ సంపుటిలోని 34 వ్యాసాల్లో మీరు చూస్తారు. కొత్త రచనారీతులు, వాదాలు, తాత్విక ధోరణులను పరిచయం చేస్తూ విశ్లేషించిన మరో 14 వ్యాసాలు కూడా వున్నాయి. ప్రస్తుత తెలుగు సాహిత్యంలో చలామణిలో వున్న కొన్ని స్థిరాభిప్రాయాలకు, సూత్రీకరణలకు కించిత్ భిన్నంగానూ, ప్రముఖ పాశ్చాత్య వాదాలు, తాత్విక ధోరణులను తెలుగు రచనలకి అన్వయించిన తీరులోని gaps పూరించేవిగానూ.. నా వ్యక్తీకరణలున్నాయని ఓపెన్ మైండ్‌తో నా వ్యాసాలు చదివినవారు అర్థం చేసుకొనే వుంటారు. సంపుటిలోని వ్యాసాల విషయపరమైన విస్తృతి (range of subjects), వస్తుపరమైన వైవిధ్యం (diversity of topics) స్ఫురించేలా, horizon కి సందర్భోచిత సమానార్థక పదం ‘దిక్చక్రం‘ అని భావించి పుస్తకానికి ఆ పేరు పెట్టాను.
ప్రశ్న 2. పుస్తకంలో ముందుమాటలున్నాయి. వివిధ సెమినార్లలో ఇచ్చిన సాహిత్య ఉపన్యాసాలున్నాయి. పుస్తక సమీక్షలున్నాయి. విమర్శలున్నాయి. వీటన్నిటినీ ఒకేగాటన కట్టి సాహిత్య వ్యాసాలుగా పరిగణించవచ్చంటారా?
జ: 2. ‘దిక్చక్రం’ లోని 45వ వ్యాసంలో ‘సాహిత్యం’ కి విపులమైన నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశాను. ఒక విషయం గురించి చెప్పిన మాటల సముదాయం, పలు అంశాలకు సంబంధించిన వివరాల క్రోడీకరణ, ఒక జాతి ఆచార వ్యవహారాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన ఉమ్మడి సూత్రావళి, ఒక అనుభవం ఆధారంగా వ్యక్తీకరించిన భావాల సంచయం.. ఏదైనా కానీయండి – సమూహం లోని వారందరూ పంచుకునే ఉద్దేశంతో లిఖిత రూపం తీసుకున్న దాన్ని, లేదా మౌఖికంగా ప్రచారంలో ఉన్నదాన్ని, లేదా అలాంటి వాటిని అన్నీ కలిపి ‘సాహిత్యం’ అంటాము.
సాహిత్యం(లిటరేచర్) లోని ప్రధాన విభజన – ఫిక్షన్, నాన్ ఫిక్షన్, (లేదా క్రియేటివ్ నాన్ ఫిక్షన్). మనిషి జీవితాన్ని నేరుగా ప్రతిబింబిస్తూ భావోద్వేగాలు రేకెత్తించే సన్నివేశాలతో కూడినది ఫిక్షన్. కథ, నవల, నాటకం.. ఈ కోవకి చెందుతాయి. విమర్శనాత్మక/వివరణాత్మక/విశ్లేషణాత్మక/పరిశోధనాత్మక వ్యాసం, జర్నలిస్టిక్ రచన, వార్తాకథనం, చారిత్రిక ఉదంతం, స్వీయ చరిత్ర, యాత్రాకథనం, దినచర్య రచన.. నాన్ ఫిక్షన్ కిందికి వస్తాయి.
నిర్మాణపరంగా, ప్రయోజనపరంగా కథకి భిన్నమైనది వ్యాసం (essay) కదా! ఈ కోణంలో ‘దిక్చక్రం’ లోనివి వ్యాసాలు –వివిధ సాహిత్య ప్రక్రియల్ని విమర్శించిన/విశ్లేషించిన/వివరించిన వ్యాసాలు – అంటే సాహిత్య వ్యాసాలు. అయితే వాటిని రాసిన, వెలువరించిన సమయాలు, సందర్భాలు వేరు వేరు. కొన్ని ప్రసంగాలు, మరికొన్ని సమీక్షలు, విమర్శలు, ఇంకొన్ని ముందుమాటల రూపంలో వున్నాయి. Essentially they all are literary essays. అవి సాహిత్య వ్యాసాలు కాకుండా పోవడానికి ఏ సిద్ధాంతం అడ్డు పడుతున్నదో, ఏ అకడెమిక్ నియమం అభ్యంతర పెడుతున్నదో చెప్పండి. వాటిని సాహిత్య వ్యాసాలుగా పరిగణించవచ్చునా లేదా? అన్నదే పనికి మాలిన పండిత చర్చ.
ప్రశ్న 3. మీ సాహిత్య వ్యాసాలలో అసలు విషయం కన్నా దాని చుట్టూ ఉన్న అనేక విషయాల గురించి సమగ్రంగా వివరించటం కనిపిస్తుంది. ఇది వ్యాసాల పఠనీయతను తగ్గించే వీలుంది. ఇలా, సుదీర్ఘమయిన పరిచయం ప్రతి విమర్శవ్యాసానికీ అవసరం అంటారా?
జ: ఏ విషయమైనా కొంచెం భిన్నంగా చెప్పాలనుకుంటాను. కొందరి ‘కట్టే – కొట్టే –తెచ్చే’ విధానం నాకు నచ్చదు. ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం వ్యాసం రాయడం నా పధ్ధతి.. అసలు విషయం లోకి వెళ్ళే ముందర రెండు, మూడు అంచెల ఇంటలెక్చువల్ ప్లాట్‌ఫారం మీదికి పాఠకుడిని తీసుకు వస్తాను. విషయం గురించిన సాహిత్య చరిత్ర సహా ఇతర ప్రాసంగిక ప్రస్తావనలు, దాని ఆవిర్భావ, పరిణామ వికాసాలు, దాని ప్రస్తుత తీరుతెన్నులు -ఒక రకంగా ఉపోద్ఘాతంలా- వివరించి ఉద్దిష్ట టాపిక్ విశ్లేషణకి పూనుకుంటాను. ఈ పధ్ధతి పాఠకుడిలో జిజ్ఞాస రేకేత్తిస్తుందనీ, ఇనుమడించిన కుతూహలంతో పాఠ్యభాగం లోకి ప్రవేశిస్తాడని నా భావన. ఈ పధ్ధతి వలన వ్యాసం చదివించే గుణం కోల్పోతుందంటే నేనొప్పుకోను. నా ఈ పధ్ధతితోనే వ్యాసాలకు ఆకర్షణీయత పెరిగినట్టుగా చాలా మంది మిత్రులు చెప్పారు. కవిత్వానికి సంబంధించిన వ్యాసాల్లోని (ఉదా. ‘మూలమలుపు’, ‘బొమ్మలబాయి’) అనేక అంశాల ప్రస్తావనలు ఆసక్తికరంగా ఉన్నాయనీ, తమ అవగాహన స్థాయిని పెంచాయనీ కొందరు కవిమిత్రులు నాతో- అవి ‘పాలపిట్ట ‘ మాస పత్రికలో అచ్చయినప్పుడే – అన్నారు.
ప్రశ్న 4. ఇందులోని వ్యాసాలు అన్నీ చదివిన తరువాత మీకు ఇప్పుడొస్తున్న కథల పట్ల అసంతృప్తి వున్నట్టు అనిపిస్తుంది. మీరు బాగున్నవి అంటున్న కథలలోనూ ఏదో ఒక లోపం ఎత్తి చూపిస్తున్నారు?
జ: 4. ఔను. నా అసంతృప్తి బాహాటంగా వ్యక్తపరిచాను. తగినంత భావజాల సంపత్తి వుండీ పాత్రలకు సరైన డైరెక్షన్ ఇవ్వలేక పోయిన వాళ్ళ పట్ల, కథాశిల్పం పై మంచి పట్టు, సునిశిత పరిశీలనా శక్తి వుండీ విషాదంతాలపై మక్కువ ప్రదర్శించిన వారి పట్ల నాకు అసంతృప్తి వుంది. పర్ఫెక్షనిస్టుగా వ్యవహరించడం, లోపాలు ఎత్తి చూపడం నా అభిమతం కాదు, కానీ కథ ద్వారా మనం ఏమి కమ్యూనికేట్ చేస్తున్నాం అనేదానిపై మనకు స్పష్టత వుండాలి. కథలో జీవిత చిత్రణ, పాత్రల సంకట స్థితులు, కథనంలో మలుపులు వాస్తవికంగా, సహజంగా ఉంటేనే సరిపోదు – యథాతథ స్థితి మారాలన్న సందేశామూ అంతర్లీనంగా వుండాలి. అయితే రచయిత తీర్పరి కాడు, నీతిప్రబోధకుడు కాడు, ప్రవక్త కాడు. కానీ అరాచకవాది, నిరాశావాది, యథాతథవాది కూడా కాడు. ‘2008 కథా సింహావలోకనం’, ‘క్రొంగొత్త రంగుల కాన్వాసు కథ-2002’, ‘కూరాడు’.. మరి కొన్ని వ్యాసాల్లో సమకాలీన తెలుగు కథా సాహిత్యంపై నా కోణంలోంచి ఒక మేర సమగ్ర విశ్లేషణ వుందనుకుంటున్నాను. ‘మంచి కథ’ అని దేనిని అనవచ్చునో కూడా చెప్పే ప్రయత్నం చేశాను.
ప్రశ్న 5. మీ వ్యాసాల్లో అధిక శాతం ఉదాహరణలు విదేశీ రచనల గురించే వుంటున్నాయి. ఇది మీ పాండిత్య ప్రదర్శననా? లేక తెలుగు రచయితల రచనలు ఎంతమంది ఎంతగా పొగిడినా, ఎన్ని అవార్డులు వచ్చినా అంతలోనే తిరుగాడుతున్నాయన్న సున్నితమైన నిరసననా?
జ: 5. ‘దిక్చక్రం’ లో 6 వ్యాసాలు తెలుగు కవిత్వం పై, 21 వ్యాసాలు తెలుగు కథపై, 7 వ్యాసాలు తెలుగు నవలపై, 14 వ్యాసాలు మనం తెలుగు సాహిత్యంలోకి స్వీకరించిన నూతన, పాశ్చాత్య సాహితీ ధోరణులపై వున్నాయి. అంటే మొత్తం 34 (70%) వ్యాసాలు తెలుగు రచనలపైనే వున్నాయన్నది స్పష్టం. అయితే ఒకటి ఒప్పుకుంటాను –ఈ వ్యాసాల్లోని విశ్లేషణ, విమర్శ పై కొంత మేరకు నా ‘విదేశీ సాహిత్య’ అధ్యయన పరిజ్ఞానం ప్రభావం వుంది. సందర్భానుసారం పాశ్చాత్య రచనల్ని, విదేశీ రచయితలను, కవులను ఉటంకించాను. ఆధునిక సాహిత్యానికి, కొన్ని వాదాలకి సంబంధించిన మౌలిక భావనలు పాశ్చ్చాత్యులవే అన్న సత్యం మనం విస్మరించరాదు. ప్లాట్, స్టోరీల నడుమ వ్యత్యాసం గురించి ఇ. ఎం. ఫోర్‌స్టర్ వివరణ, కథానిర్మాణ క్రమంలోని దశలను సూచించే ‘ఫ్రే ట్యాగ్స్ త్రిభుజం’, అస్తిత్వవాదంలో, free will, authenticity, bad faith ల గురించి సార్త్ర నిర్వచనం, ‘God is dead’ అన్న నీషే ఉవాచ, post-modernism కి, surrealism కి, magical realism కి భావజాలపరమైన తాత్విక పునాది వేసిన లాటిన్ అమెరికన్, అమెరికన్, ఫ్రెంచ్ సాహిత్యకారుల ఉటంకింపులు, కవిత్వంలో linguistic ecology, central metaphor, alienation గురించి ప్రసిద్ధ పాశ్చాత్య కవుల (అసలు free verse/verse libre ప్రక్రియనే వాళ్ళ నుంచి తీసుకున్నాం) మాటలు.. ప్రస్తావించుకోక తప్పదు. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలు ప్రస్తుత స్థితికి రావడానికి ఎన్నో దశలు దాటాయి, ఎందరి నుంచో ప్రేరణ, స్ఫూర్తి పొందాయి. కొంత పుంతలు తొక్కడం, ప్రయోగవాదం నిరంతరం కొనసాగేవే. Enlightenment తర్వాతి పారిశ్రామిక యుగ ప్రభావం, ఇంగ్లీష్ భాష సంపర్కం, పాశ్చాత్యుల నుంచి ప్రేరణ.. లేకపోయివుంటే మన సాహిత్య ప్రక్రియలు, కళారూపాలు ప్రాచీన, ప్రబంధయుగాలు దాటి ముందుకు పోయేవి కావు. భిన్నకోణంలోంచి విశ్లేషించే నా పధ్ధతి కొందరికి పాండిత్య ప్రదర్శనలా కనపడితే నేనేమీ చేయలేను. దిక్చక్రం లోని వ్యాసాలు ఏ స్థాయిలో informative గా, educative గా వున్నాయి, అవి చెబుతున్న కొత్త విషయాలేమిటి, మన రచయితలు, కవులు వీటి నుంచి తెలుసుకోదగ్గ అంశాలు ఏమైనా ఉన్నాయా.. అన్న కోణంలోంచి వ్యాసాలు చదవాలి. Rose bush is known for flowers, not for thorns. గులాబి పొదలో పనిగట్టుకుని ముళ్ళను ఏరే వాడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నవాడయి వుండాలి, లేదా ఫ్రెంచి కవి పాల్ వాలెరీ చెప్పినట్టుగా ‘రెండో ఉద్దేశం మనసులో పెట్టుకున్న వాడయి’ వుండాలి. ఆయన ఇలా అన్నాడు: ‘One reads well only when one reads with some personal goal in mind. It may be to acquire some power. It may be out of hatred for the author.’ ‘నేను ఇంగ్లీష్ బుక్స్ చదవనండీ, నాకు తెలుగే ప్రధానం’ అని చెప్పుకునే, ‘సమీక్షకుడు/విమర్శకుడు’ అన్న మూర్ఛబిళ్ళ తగిలించుకున్న ప్రబుద్ధులు, ‘తెలుగు రచనల్లో ప్రయోగాలు’ అంటూ పుస్తకాలు వెలువరిస్తారు. సదరు ‘ప్రయోగాల’కి ప్రేరణ ఆంగ్ల సాహిత్యమన్నది వాళ్లకి తెలియదా? ‘అబ్బే. మ్యాజిక్ రియలిజం అనీ.. ఆ ఇజం అనీ సాహిత్యంలో కొత్త పోకడలు, ప్రయోగాలు నాకు తెలియదండీ..’ అనే ఒక మహానుభావుడు, మ్యాజిక్ రియలిస్ట్ కథకుడిగా పేరుపొందిన ఒక దివంగత రచయిత స్మారక సభలో ‘అతనివి అద్భుతమైన కథలు, యువరచయితలు అతని రచనా పద్ధతిని నేర్చుకోవాలి, ఆ రచయిత గొప్పకథలపై యూనివర్సిటీ స్థాయిలో రెండు రోజుల సెమినార్ నిర్వహించాలి’.. అని ఉపన్యాసం దంచుతాడు! ఈ వైరుధ్యానికి కారణం ఒక రకమైన కాంప్లెక్స్. ఇంగ్లీష్ పుస్తకాలు చదవలేక పోవడం ఒక బలహీనత, ఆ బలహీనతని ఏదో పవిత్ర నియమంగా ఫోకస్ చేయడం పరమ అజ్ఞానం. ఇంగ్లీష్ సాహిత్యం చదవగలిగీ, అందులో ఏమీ లేదని కొట్టి పారేస్తూ ‘అన్నీ మన వేదాల్లోనే వున్నాయిష’ అనే ధోరణిలో ప్రగతి నిరోధక గత కాలాన్ని వైభవీకరించడం కన్సర్వేటివ్ మనస్తత్వపు megalomania.
ఇకపోతే నాకు నచ్చిన తెలుగు నవలలు, కథలు, కవిత్వం గురించీ నా వ్యాసాల్లో చెప్పాను. అయితే అంతర్జాతీయ ఖ్యాతికి, నోబెల్ పురస్కారానికి మన తెలుగు రచనలు ఎందుకు అర్హత సాధించలేకపోతున్నాయి అన్నదే నా బాధ, విచారం. మనలో ఏదో కొరవడిందని నా అభిప్రాయం. కొత్త రచనా రీతులు, నూతన శిల్ప సంవిధానాలు, ప్రయోగాలు మనవాళ్ళు పరిశీలించాలి, వాటిని స్వాయత్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ అంశాలను చర్చిస్తూ, ‘క్లాసిక్’ లక్షణాల్ని వివరిస్తూ, కొత్త రచనా రీతుల్నిపరిచయం చేస్తూ.. నా అవగాహన మేరకు కొన్ని వ్యాసాలు రాశాను. అవి మనవాళ్ళకు ఉపయోగ పడతాయని నా ఉద్దేశం.
ప్రశ్న 6. మొత్తంగా చదివితే మీరు కూడా కొందరు రచయితలకు, కొన్ని రకాలయిన కథలకు మాత్రమే పరిమితమయి విమర్శనా వ్యాసాలు రాశారన్న అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా పదే పదే కొందరు రచయితల పేర్లే ప్రస్తావిస్తూండటం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఈ ఆరోపణకు మీ సమాధానం ఏమిటి?
జ: నేను ప్రధానంగా కథా రచయితను. సాటి తెలుగు రచయితల పట్ల గౌరవమే కాని చులకన భావం లేదు. విశిష్ట ప్రక్రియ అయిన కథ potential ని గుర్తెరిగి చక్కటి కథలు రాసిన వాళ్ళని నేను ప్రశంసించాను. నాకు ఏ రచయితపై గుడ్డి అభిమానం లేదు, కథ ‘మెరిట్’ ని చూసి మెచ్చుకుంటాను. కొందరి పేర్లు తరచూ ప్రస్తావించిన సందర్భాలూ ఉండవచ్చు. అందుకు కారణం సాహిత్య ప్రయోజనం గురించిన వారి భావజాలంతో, దృక్పథంతో నాకు ఒక మేరకు ఏకీభావం వుండటం. అంతకు మించి మరేమీలేదు.
ప్రశ్న 7. ముందుమాటలో మీరు నిర్దిష్ట అంశాన్ని fossilized భాషలో metaphorical గా చెప్పటం కవిత్వం అవుతుందన్నారు. Fossilized భాష అంటే ఏమిటి? ఫాజిల్ అంటే శిలాజము అన్న అర్థం వస్తుంది. అల్ఫాంట్జప్పుడు ఫాజిలైజ్డ్ భాష వాడకం ఏ రకంగా వాంఛనీయం?
జ: కవిత్వ నిర్మాణంలో ఒక ముఖ్య నియమం గురించి సీనియర్ కవి ఆర్. పార్థసారథి తాను సంకలించి, సంపాదకత్వం వహించిన ‘Ten Twentieth Century Indian Poets’ (ఆక్స్‌ఫర్డ్ ఇండియా పేపర్ బ్యాక్స్) పుస్తకం ముందుమాట చివరి పేరాలో ఇలా రాశాడు: “A poem ought to, in effect, try to arrest the flow of language, to anaesthetize it, to petrify it, to fossilize it. Ultimately, it is the reader who breathes life in to the poem, awakening it from its enforced sleep in the language.” అదే పుస్తకంలో పార్థసారథి ఇంకో విలువైన మాట అన్నాడు: “In our time poetry is becoming increasingly concise. It is moving towards metaphor and away from comparison: poetry, essentially as metaphor.” ఈ మాటల భావాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం నేను నా వ్యాసంలో చేశాను. (ఈలియట్ కూడా దాదాపు ఇదే భావాన్ని మరోలా చెప్పాడు: “Poetry is best enjoyed only when it partly understood”) దీన్ని అర్థం చేసుకుని ఆచరించే తెలుగు కవి నిజంగానే ఎదుగుతాడు. ఇంకా ఇంకా నేర్చుకునే సన్నద్ధత మన సాహిత్యకారులు అలవర్చుకోవాలి. పై సూత్రీకరణలు/ఉవాచలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి, అర్థం కాకపొతే మీలాంటి వాళ్ళను అడగాలి.
ప్రశ్న 8. అలాగే ముందు మాటలో కథ మేధో (మేధా సరైన పదం) సంబంధమైనది అంటే ఆలోచనల్లోంచి వచ్చేది. కవిత్వం హృదయ సంబంధమైనది. అంటే అనుభూతుల్లోంచి వచ్చేది. రెండింటికి ప్రేరణ బహిర్ వాస్తవికత అన్నారు. అంటే కథా సృజనకు హృదయం, కవిత్వ సృజనకు మేధ అనవసరమనా మీ అభిప్రాయం. ఈ విషయాన్ని వివరిస్తారా?
జ: 8. ఇది నేను కొత్తగా చెప్పిందేమీ కాదు – ఇది గతంలో ఎందరో కవులు, పండితులు చెప్పిన పాత మాట అని అందరికీ తెలిసిందే. వివేచిస్తే, ఆలోచిస్తే ఈ మాట లోని సత్యం ఎవరికైనా బోధపడుతుంది. కథా సృజనకు హృదయం, కవిత్వ సృజనకు మేధ అనవసరమని నేను అభిప్రాయపడుతున్నట్టు ఎవరైనా పెడర్థం తీస్తే వాళ్ళ అజ్ఞానానికి నేను నవ్వి ఊరుకుంటాను అంతే.
ప్రశ్న 9: మీ భావజాలం, సాహిత్యం, వివిధ సాహితీ ప్రక్రియలపై, ప్రత్యేకించి కథలపై, మంచి కథలు రాసిన వారిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: నా భావజాలం, నా దృక్పథం ‘దిక్చక్రం’ ముందుమాటలో చూచాయగా చెప్పాను. సాహిత్యం గురించి, దాని ప్రయోజనం గురించి నాకు నిర్దిష్ట అభిప్రాయాలున్నాయి ; అలాగే వివిధ ప్రక్రియల గురించి కూడా. ‘తెలంగాణ కథ..’, ‘..వస్తు శైలి శిల్పాల పరిశీలన’, ‘కథ – ఉపాంగాల పరిచయం..’, ‘కథా సింహావలోకనం ‘..తదితర వ్యాసాల్లో చాలా అంశాలపై చర్చ వుంది. కొన్ని కథలపై, కొందరు రచయితలపై, స్యూడో సమీక్షలు, విమర్శలపై నిర్మొహమాటంగా నా అభిప్రాయాలు చెప్పాను. ఇప్పుడు మీరు ప్రస్తావించిన రచయితలే కాకుండా, భావజాలపరంగా నేను ఏకీభవించని రచయితల కథల పైనా, ప్రయోగశీల కథలపైనా పాజిటివ్ వ్యాఖ్యలు చేశాను. కథలను కథలుగానే చూశాను, రచయితలను బట్టి కాదు. ఉదా. పులికంటి, భరాగో, శీలావీర్రాజు, కరుణకుమార, అల్లం శేషగిరిరావు, చంద్రలత, ప్రతిమ.. ప్రభ్రుతులు. నాకు నచ్చిన కథలను మెచ్చుకున్నాను. ‘ఒక రకం’ రచయితల్నివెనుకేసుకు రావడం, సాహిత్యాన్ని ‘పార్శ్వాల వారీగా’ విభజించి చూడటం నా వ్యాసాల్లో నేను చేయలేదు. ఎవరికైనా అలా కనిపించి వుంటే అది వారి దృష్టిలోపం.
ప్రశ్న 10. మీరు తెలుగులో మాజిక్ రియలిజం రచయితల పేర్లలో కేశవ రెడ్డి, మునిపల్లె రాజు, వి. చంద్ర శేఖర రావు వంటి కొందరి పేర్లే ప్రస్తావించారు. వీరంతా ద్వితీయ తరం రచయితలు. తొలి తరం రచయితలయిన విశ్వనాథ వంటి మాజిక్ రియలిజం రాసిన రచయితల ప్రస్తావనే మీ ఏ వ్యాసంలో లేదు. ఇది కావాలని చేసిందా? లేక వారి రచనలు మీరు నిర్వచించుకున్న మాజిక్ రియలిజం పరిథిలోకి రాలేదా? విస్మరించినట్టు కాదా?
జ: మ్యాజిక్ రియలిజం అయిదు దశాబ్దాల క్రితం సాహిత్యం లోకి ప్రవేశించిన పదం. ఇదొక narrative mode/technique. కొలంబియా రచయిత మార్క్వెజ్ నవల – ‘One Hundred Years of Solitude’ ద్వారా ఇది వ్యాప్తిలోకి వచ్చింది. రియలిజం, ఫాంటసి మేళవించుకున్న ఈ కథన రీతి పచ్చి సామాజిక వాస్తవికత పక్కనే మానవాతీత అద్భుత ఘటనల్ని పెట్టి లాటిన్ అమెరికన్ ప్రజా జీవితాన్ని దృశ్యమానం చేస్తుంది. అక్కడి క్రూర రాజ్య వ్యవస్థను, ప్రజా కంటక నిరంకుశ పాలనను విమర్శించేందుకు లాటిన్ అమెరికన్ రచయితలు, కొందరు యూరోపియన్ రచయితలు ఈ narrative technique ఎంచుకున్నారు. వారు ఏ ఉద్దేశంతో ఈ టెక్నిక్ వాడారో, ఏమి ప్రయోజనం సాధించారో ఆ కథా, నవలా సాహిత్యం చదివితేనే మనకు అర్థమవుతుంది. మ్యాజిక్ రియలిజంలో ఫాంటసి (అద్భుత, మానవాతీత ఘటన) ఒక భాగం. మానవాతీత ఘటనలున్నాయి కాబట్టి భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో మ్యాజిక్ రియలిజం ఎప్పటినుంచో వుంది అని కొందరి వాదన. తొలి తరం రచయితలయిన విశ్వనాథ, మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటి వారి రచనల్లో మాజిక్ రియలిజం వుంది అనడం మరో కొత్త వాదన. ఆధునిక వైద్య రంగంలో సర్జరీ ద్వారా అవయవ మార్పిడి పద్ధతులు వచ్చాక, ‘ప్రాచీన కాలంలోనే మన భారతీయులకు ఈ విజ్ఞాన రహస్యాలు తెలుసు, గణేశుడికి ఏనుగు తల అలానే అమర్చారు’ అని పలికే వారికి ఏం చెబుతాం? నవ్వి వూరుకోవాల్సిందే. ఇక వ్యాసంలో నేను ప్రస్తావించిన పేర్ల గురించి. ‘..మునిపల్లె రాజు, డా. వి. చంద్రశేఖరరావు, గోపిని కరుణాకర్, డా. కేశవరెడ్డి – తమ కథల్లో/నవలల్లో మ్యాజిక్ రియలిజం వాడారు అని సమీక్షకులు, విమర్శకులు చెప్పుకొచ్చారు’ అని మాత్రమే అన్నాను. ‘మొత్తానికి, ఇలా, వర్తమాన విమర్శారంగంలో మ్యాజిక్ రియలిజాన్ని ఎవరికీ తోచినట్టు వారు అన్వయించుకునే వైఖరి చలామణిలో వుంది’ అని ఇప్పుడూ ముక్తాయిస్తాను.
ప్రశ్న 11. మీరు శ్రీపాద తరువాత తెలుగు రచయితలు నాటకీయ శిల్పం గురించి మరచిపోయారని రాశారు. నాటకీయ శిల్పం అంటే ఏమిటి? నాటకీయత కథలో అంతర్భాగం. అదిలేక పోతే కథలు జీవంలేని వాక్యాలుగా మిగిలిపోతాయి. నాటకీయత లేకుండా రాసిన కథలు పాఠకుల మెప్పు పొందుతాయా?
జ: ఏ కథలోనైనా ఇతివృత్త నిర్మాణ పరంగా, పాఠకుడి అంతర్నిహిత కుతూహల ప్రేరకాలు మీటేలా, భావోద్వేగాలు రేకెత్తేలా సన్నివేశాల, సంఘటనల కూర్పు ఉండాల్సిందే. కథా నిర్మాణ పరంగా ఇది ‘నాటకీయత’. జనరల్‌గా దీన్ని dramatization of ideas అంటాము. కథకు, వ్యాసానికి తేడా ఇక్కడే వుందని మనకు తెలుసు. కథను ‘నాటకీయ శిల్పం’లో మలచడం అంటే ఒక నాటికలో లాగా కేవలం డైలాగ్స్ రూపంలో కథను నడిపించడం, ఇతివృత్తం unfold చేయడం. కథను డ్రామా లాగా నేరేట్ చేయడం. గతంలో శ్రీపాద, అంపశయ్య నవీన్ కొన్ని కథలు ఈ పద్ధతిలో రాశారు. నా కథ ‘ముసల్దాని ముల్లె’ కు ఇదే పధ్ధతి అవలంబించాను. ఇది అర్థం చేసుకోలేని నేటి రచయితలేవరికైనా కథ, నాటకీయ శిల్పం గురించి ఇలాంటి చొప్పదంటు సందేహాలు వస్తున్నాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది.
ప్రశ్న 12. సైన్స్ ఫిక్షన్ అంటే నిజంగా ఏమిటి అనే వ్యాసంలో మీరు సాహిత్యం కన్నా సినిమాలను ఎక్కువగా ప్రస్తావించారు. ఎందుకని?
జ: ఇంగ్లీష్‌లో సైన్స్ ఫిక్షన్ కథలు పాతిక దాకా చదివాను. ఇవి ఎక్కువగా స్పెక్యులేషన్, ఫాంటసి, ఫ్యూచరిస్టిక్, డైస్తోపియాన్ కథలు. గ్రహాంతరయానం, గ్రహాంతర వాసులతో సంపర్కం, అటూ ఇటూ రూపం మారగల రోబోమనుషులు, వారి ప్రవర్తన.. గురించిన థీమ్స్. తెలుగులో అందరికంటే సదాశివరావు రాసినవే మెరుగైనవి. నా వ్యాసంలో నేను ప్రస్తావించింది ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమా కథ మాత్రమే. మీరు సరిగా గమనించినట్టు లేదు -ఎక్కువగా రచనలే ప్రస్తావించాను. అన్ని కథల థీమ్స్ చెప్పేందుకు నిడివి చాలదు. కారెల్ కాపెక్ సైన్స్ ఫిక్షన్ నాటకం ‘ రోసమ్స్ యూనివర్సల్ రోబోస్’ ఇతివృత్తం కొంచెం వివరంగా చెప్పాను. సైన్స్ ఫిక్షన్, ఫాంటసిల నిర్వచనాలు, ఉదాహరణలు; ఫాంటసి, సైన్స్ ఫిక్షన్, ఎకో ఫిక్షన్‌ల మధ్య తేడా వివరించాను.
ప్రశ్న 13. మీ పాతికేళ్ల అధ్యయన శ్రమకి పుస్తక రూపం దిక్చక్రం అని సారస్వత పరిషత్ పురస్కార సభలో మీరన్నారు. గత యేడు పుస్తక ఆవిష్కరణ సభలో ఇది అందరూ చదవాల్సిన మంచి గ్రంథం కానీ ఒక స్టాండర్డ్ ఉన్న పాఠకులను దృష్టి లో పెట్టుకుని రాసినట్టుగా వుంది, పదాలు గొట్టుగా, ఆంగ్ల పదాలు విరివిగా ఉన్నందున దీన్ని అందరూ సులువుగా చదవ లేరేమో అని సంగిశెట్టి శ్రీనివాస్ గారన్నారు. మీరేమంటారు? మీ లక్ష్యం, ఉద్దేశం నెరవేరలేదని మీరూ భావిస్తున్నారా?
జ: ఈ వ్యాస సంపుటి పై అంపశయ్య నవీన్ ‘తంగేడు’లో, విహారి ‘పునాస’లో, నర్సన్ ‘మన తెలంగాణ’లో, వేల్పుల నారాయణ ‘విశాలాంధ్ర’లో విపులమైన సమీక్షలు రాశారు. నర్సన్, నారాయణ, విహారి గార్లు పూర్తి పాజిటివ్ వ్యాఖ్యానాలతో పుస్తకం ప్రత్యేకతని మెచ్చుకున్నారు.
నవీన్ గారు నా కృషిని ప్రశంసిస్తోనే నాది మేర మీరిన మేధ అన్నారు. సంగిశెట్టి గారు ‘నవ తెలంగాణ’లో రాసిన అభినందన వ్యాసంలో పుస్తకం విశిష్టతను అంగీకరిస్తూనే వ్యాసాల్లోనీ గొట్టు, ఆంగ్ల పదాలకు పాదసూచికల్లో తెలుగు అర్థాలు ఇచ్చి వుంటే సగటుస్థాయి పాఠకులు, పరిశోధక విద్యార్థులు పూర్తి ప్రయోజనం పొందగలిగే వారు అని వ్యాఖ్యానించారు.
సంగిశెట్టిగారి అభిప్రాయంతో కొంత మేరకు ఏకీభవిస్తాను.
అయితే చాలా చోట్ల ఆంగ్ల పదాలు అలాగే వదలడానికి సమానార్థక తెలుగు పదాలు మరింత జటిలంగా కనపడతాయి అన్న నా భయం కారణం. Predicament, mortality, linguistic ecology, metaphor.. వంటి పదాలే తీసుకోండి. Mortality అంటే చనిపోయే సహజగుణం. దీన్ని ఇట్లా కాకుండా క్లుప్తత కోసం మర్త్యత అన్నాను.ఇది కొందరికి జటిలంగా కనబడటం సహజం. వ్యాసాల్లో భాష సరళం చేయడానికి నేను ప్రత్యేక శ్రధ్ధ తీసుకోలేకపోయాను. అంత వ్యవధి లేదు. ఇది ఒక రకంగా లోపమే. ఇది కంటెంట్ పరంగా పలు ప్రత్యేకతలున్న పుస్తకమే అయినా భాషా జటిలత కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే అని వి. రాజారామ మోహన్ రావు గారు అన్నారు, అయితే ఆ వెంటనే రచయిత తన భావాలు, అభిప్రాయాలు వ్యక్తీకరిస్తూ రాసుకుంటూ పోతాడు, భాష గురించి తీరిక చేసుకోవడం అన్ని వేళలా కుదరదు కదా అని అంగీకరించారు.
ఏదేమైనా సగటు పాఠకులను దృష్టిలో వుంచుకుని భాష కొంచెం సరళం చేసే ప్రయత్నం నేను చేసి వుండాల్సింది అని అంగీకరిస్తాను.
ప్రశ్న 14. మీ తర్వాతి ప్రణాళిక ఏమిటి? మలి ముద్రణలో కొన్ని సవరణలు చేస్తారా?
జ: ఔను. భాష విషయంలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటాను. పుస్తకంలో ఇప్పుడున్నవన్నీ విషయ ప్రధానమైన వ్యాసాలు.
రాబోయే ఎడిషన్‌లో ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ప్రచలితంగా వున్న వివిధ వాదాలు కేంద్రంగా వ్యాసాలు రాసి చేర్చుతాను. కొత్తగా రాస్తున్న యువరచయితలు, కవులకు ప్రత్యేకంగా ప్రయోజన కరంగా వుండగల పాఠ్య అంశాల వంటి వ్యాసాలు కూడా ప్రయత్నిస్తాను.
~
సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని వెచ్చించి సంచికకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మీపతి గారూ.
ఆడెపు లక్ష్మీపతి: ధన్యవాదాలు.
***
దిక్చక్రం (సాహిత్య వ్యాసాలు),
రచన : ఆడెపు లక్ష్మీపతి
పేజీలు: 426
వెల: ₹ 300/-
ప్రచురణ : ఆదిత్య (లిటరరీ) పబ్లికేషన్స్, హైదరాబాద్,
ప్రతులకు: ఏ. రామలక్ష్మి, 9701227207
నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్, 9000 413 413
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/dikchakram-sahitya-vyasalu