సిరివెన్నెల పాట – నా మాట – 14 – వారణాసి శాశ్వతత్వాన్ని చెప్పే గీతం

0
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

భంభం భోలే శంఖం మోగెలే

~

చిత్రం: ఇంద్ర

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: హరిహరన్ & శంకర్ మహదేవన్

సంగీతం: మణిశర్మ.

~

పాట సాహిత్యం

పల్లవి:
భంభం భోలే శంఖం మోగెలే
డండం డోలే చెలరేగిందిలే
తద్దినకదిన్ దరువై సందడి రేగెనే
పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా
శివాలందలహరి మహాగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి ॥భంభం భోలే॥
చరణం:
వారణాసిని వర్ణించే నా గీతిక
నాటి శ్రీనాథుని కవితే వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణిక
అల్లదే మోగింది చిరుఘంటిక
ఢమరఢమకాలై ఎదలయలే కీర్తన చేయగా
నమకచమకాలై పదగతులే నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా ॥విలాసంగ॥
కోరస్:
కార్తిక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా
చరణం:
ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే
మన్నుకాదు మహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచేది ఈ నగరమే
చరితలకు అందనిదీ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే
తరలి రండి తెలుసుకోండి కాశీ మహిమ ॥విలాసంగ॥

భారతదేశం, ధర్మ భూమి, కర్మభూమి, మోక్ష భూమి. భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు, మోక్ష క్షేత్రాలుగా పేరుపొందిన ఏడు మహానగరాలు ఉన్నాయి. ఆ సప్త మోక్ష పట్టణాలలో కాశీ క్షేత్రం ఒకటి.  ముక్తి సాధనకు సోపానం, కాశీ దర్శనం. హిందూ ధర్మంలో ఆధ్యాత్మికతకు, భక్తి తత్వానికి కేంద్రం- కాశీ పుణ్యక్షేత్రం. అసంఖ్యాక శివాలయాల సమాహారం – సకల పాపాలను హరించే గంగా తీర్థం.. కాశీ క్షేత్రం. అక్కడ పితృ కర్మలు ఆచరించినా, అక్కడే తుది శ్వాస వదిలినా, మోక్షం లభిస్తుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనే పవిత్ర సంకల్పం ప్రతీ హిందువు మదిలోను ఉంటుంది. హిందూ పురాణాలలో సైతం, అతి ప్రాచీన నగరంగా, అత్యంత పవిత్ర క్షేత్రంగా విలిసిల్లింది ఈ కాశీనగరం లేదా వారణాసి(బనారస్).

ఆ కాశీ నగరాన్ని వర్ణిస్తూ సిరివెన్నెల వ్రాసిన ఈ గీతం గురించిన నేపథ్యం, ఆయన అటువంటి స్ఫూర్తిని ఎక్కడ నుండి పొందారు, అన్న విషయాలను గురించి ఒకసారి తెలుసుకుందాం.

సీతారామశాస్త్రి తండ్రి డా. సి.వి. యోగి భారతీయ సనాతన ధర్మం పరమావధిగా జీవితం గడిపిన కర్మయోగి. భారతీయతను, వేదవాఙ్మయాన్ని, పురాణాల ప్రామాణికతను, భారతీయ సంస్కృతికి సంబంధించిన దేవతారాధనను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. భగవద్గీతను అద్వితీయమైన గ్రంథంగా నిరూపిస్తూ అందులోని సారాంశాన్ని ఉపనిషత్తులకు అన్వయించేవారు. సంస్కృతం భారతదేశానికి రాజభాష కావాలని అభిప్రాయపడేవారు. అది దేశభక్తికి, సమైక్యతకు దోహదం చేస్తుందనేవారు. ఆయన వృత్తి రీత్యా హోమియో వైద్యులట! క్రమశిక్షణకు మారుపేరైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యులు కూడానట! ఆ ఆధ్యాత్మిక, ధార్మిక, జాతీయ భావనల ప్రభావం సిరివెన్నెలపై పడటంలో ఆశ్చర్యంలేదు.

సీతారామశాస్త్రి కూడా సినీరంగంలో అడుగుపెట్టక ముందునుంచి తన రచనల్లో సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికీ పెద్దపీట వేశారు. తండ్రి అడుగుజాడల్లో సంఘ సభ్యునిగా క్రమశిక్షణను పాటిస్తూ సంప్రదాయాన్ని గౌరవించేవారు. ఆయన శివారాధన తత్పరతకు ‘శివదర్పణమ్’ పేరుతో ప్రచురించిన గ్రంథమే నిదర్శనం. ఆయన సద్గురు శివానందమూర్తికి ప్రియశిష్యులు. సినిమాల్లో అవకాశం వున్న తావుల్లో భక్తిపారవశ్యంతో ఆ పరమశివునిపై అనేక గేయాలను రాశారు. పరమ శివుని పైనే కాక, ఎందరో ఇతర దేవతమూర్తులపై భక్తి పూర్వకమైన గేయాలు సినిమాల కోసం వ్రాశారు. ఆ జంగమయ్యపై మన సీతారామయ్య వ్రాసిన కొన్ని ఆణిముత్యాలను ఈ సందర్భంగా పరిశీలిద్దాం.

శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తమ పద, లయ విన్యాసంతో పరమశివుని మెప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ‘సహస్ర భావ పుష్ప మాలిక’గా 1000 గీతాలను వ్రాయాలని సంకల్పించి, గత కొంతకాలంగా వ్రాస్తూ వచ్చారట. అభిమానుల ప్రోత్సాహంతో తొలి విడతగా 54 గేయాలను ‘శివ దర్పణం’గా ముద్రించారట. అందులో మచ్చుకు ఒక పద్యం.

“ఊహకైన అందవేమి ఉమామహేశా, ఉన్నావు గద ఊ అనవేమి హిమాలయేశా? ఉండబట్టలేక ఇలా ఉన్నమాటనేశా, ఉలుకొచ్చైనా ఊడిపడవా అనే చిన్ని ఆశ!”

….

“ఎంత కష్టపడి కూడబెట్టితిని పిసరంత భక్తి, పరమేశా, పాడుచేయకు పరీక్ష బెట్టి..”

ఇక సినీ గేయాలు పరిశీలిస్తే, ఆయన వ్రాసిన గంగావతరణం ముందుగా చిత్రసీమలోకి వచ్చినా, అత్యంత ప్రజాదరణ కల్పించి, అరంగేట్రం చేయించింది మాత్రం ‘సిరివెన్నెల’ చిత్రమే.. అందులోనూ.. ఆ ఆది భిక్షువు.. కురిపించిన జ్ఞాన భిక్షతో.. అవతరించిన తొలి పాట..

‘ఆది బిక్షువు వాడిని ఏది కోరేదీ.. బూడిదిచ్చే వాడినేది అడిగేది..’ అంటూ ఆ కైలాసనాథునిపై, నిందాస్తుతిగా మొదలుపెట్టి ఆయనపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు సిరివెన్నెల.

‘అందెల రవమిది పదములదా.. అంబరమంటిన హృదయముగా..’ (స్వర్ణకమలం)పాటలో శివ పంచాక్షరిని అద్భుతంగా మనసు పులకించేలా పలికించారు.. ‘నయన తేజమే నకారమై, మనో నిశ్చయం మకారమై, శ్వాస చలనమే శికారమై, వాంచితార్థమే వకారమై, యోచన సకలము యకారమై’ అనే పంచాక్షరీ మంత్రంతో తాను పరమేశ్వరానుగ్రహం పొంది, మనకు కూడా అందించారు.

‘శివ పూజకు చిగురించిన సిరిసిరిమువ్వా.. మృదు మంజరి పదమందున పూసిన పువ్వా..’ అనే పాటను స్వర్ణకమలం చిత్రం కోసం రాసి ప్రేక్షకులను రసగంగలో తేలించారు.

‘ఆనతినీయరా హరా.. సమ్మతినీయరా సన్నుతి చేయగా..’ అని, ఆ నీలకంఠుని ప్రార్థిస్తూ.. ఏ వంకా లేని నా వంక నీ దయా వీక్షణాన్ని ఒకసారి సారించమని, తన్మయత్నంతో ప్రార్థిస్తారు స్వాతికిరణం చిత్రంలో..

సంకీర్తన.. చిత్రం కోసం, ‘ఓంకార వాక్యం… ఉరగ పుంగవ భూషితాంగం..’ అంటూ శివ స్తుతి చేశారు.

మనం ప్రస్తుతం విశ్లేషించుకుంటున్న ‘భంభం భోలే శంఖం మోగెలే’ అనే పాట కాశీ మహత్యాన్ని, ఆ విశ్వేశ్వరునిపై తన భక్తి పారవశ్యాన్ని కురిపిస్తూ, ‘ఇంద్ర’ (2002) చిత్రం కోసం సిరివెన్నెల వ్రాశారు. చిత్రంలో కథానాయకుడు ‘గైడ్’ పాత్రలో కాశీ గురించి వర్ణించే సందర్భం కోసం వ్రాసిన రసగుళిక లాంటి ఈ పాట, లయ ప్రధానమైన మణిశర్మ సుస్వర సంగీత లహరితో ఎంతో ప్రజాదరణ పొందింది.

భంభం భోలే శంఖం మోగెలే

డండం డోలే చెలరేగిందిలే

తద్దినకదిన్ దరువై సందడి రేగెనే

పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా

శివాలందలహరి మహాగంగ ప్రవాహంగా మారి

విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి ॥భంభం భోలే॥

కోరస్:

కార్తిక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా

ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా

ఒక దృశ్య కావ్యంలా, అపురూపమైన కాశీ పట్టణాన్ని మన మనో నేత్రాలకు పరిచయం చేస్తుంది ఈ గీతం. గంగా తీరంలో హారతి సమయంలో వినిపించే శంఖనాదాలు, డమరుక వాద్యాలు, తద్దినక అంటూ కదిలే పదాలు.. పొద్దులెరగకుండా పారవశ్యంతో కదిలే భక్తజన సందోహాలు.. ఆ దృశ్యం శివానందలహరిలా, మహాగంగా ప్రవాహంలా, ముందుకు సాగుతూ.. మనకు విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.. అంతటి మహిమాన్వితమైనది ఆ కాశీపురి.. అంటూ సిరివెన్నెల తన భక్తి గంగలో మనల్ని కూడా మునకలు వేయిస్తారు.

శివానందలహరి అంటే బ్రహ్మానంద సాగరం. అది సత్ చిత్ ఆనందం. ఆత్మ చైతన్యం జాగృతమైన వారు ఆ సచ్చిదానందంలో నిరంతరంగా మునిగి ఉంటారన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని పల్లవిలో ఆవిష్కరించారు. అటువంటి శివానందలహరి కాశీపురంలో మహాగంగ ప్రవాహంగా సాగుతోందని, శివలీలామృతాన్ని మనసారా ఆస్వాదించమని మనకు పిలుపునిస్తున్నారు సిరివెన్నెల. మనసారా ఆ శంకరుని సేవిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భరోసా ఇస్తున్నారు.

వారణాసిని వర్ణించే నా గీతిక

నాటి శ్రీనాథుని కవితే వినిపించగా

ముక్తికే మార్గం చూపే మణికర్ణిక

అల్లదే మోగింది చిరుఘంటిక

ఢమరఢమకాలై ఎదలయలే కీర్తన చేయగా

నమకచమకాలై పదగతులే నర్తన చేయగా

ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా॥విలాసంగ॥

శ్రీనాథడు రచించిన కాశీఖండాన్ని ఆమూలాగ్రం చదివిన సిరివెన్నెల, పాట రాసే సమయానికి కాశీని స్వయంగా సందర్శించలేదట! అందుకనే వారణాసిని వర్ణించడంలో, శ్రీనాథుడు అందించిన వివరాలనే తన పాటలో వినిపించారు. అక్కడ ఉన్న మణికర్ణికా ఘట్టం మొదలైన ప్రదేశాలను పాటలో పొందుపరిచారు.

ముక్తికి మార్గం చూపే మణికర్ణికను చూడంగనే ఎదలో చిరుఘంటిక మోగిందట! గుండె చప్పుళ్లే ఢమరుకాలై మోగుతుంటే, నటరాజును అర్చించడానికి నమకచమకాలే పదగతులయ్యాయి.  (శ్రీరుద్రంలో నమక చమకాలు భాగమని మనందరికీ తెలుసు!) తన్మయత్వంతో ప్రతి అడుగు ప్రదక్షణగా మారి, ఆ సర్వేశ్వరుని కృపలో తరిస్తోందన్న అపురూప భావాన్ని ప్రదర్శించారు సిరివెన్నెల.

ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే

మన్నుకాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచేది ఈ నగరమే

చరితలకు అందనిదీ కైలాసమే

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే

గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే

తరలి రండి తెలుసుకోండి కాశీ మహిమ.. ॥విలాసంగ॥

ఈ పాట రాసిన ఎంతో కాలానికి సిరివెన్నెల కాశీ సందర్శనం చేశారట! ఆ కాశీ నగరం తను వర్ణించినట్టే ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారట! ఇదంతా శివానుగ్రహమే అని ఎంతో మురిసిపోయారట! శివయ్యపై  ఇంత అవ్యాజమైన భక్తి ఉన్న సీతారామశాస్త్రి నిస్సందేహంగా శివైక్యం చెందివుంటారు.

కాశీ క్షేత్ర మహాత్మాన్ని వర్ణించే ఎన్నో గ్రంథాలు, సాహిత్య సుమాలు ఉన్నప్పటికీ.. పాట బలం పాటకు ఉంటుంది. భక్తి పారవశ్యంలో ఒక పుణ్య క్షేత్రాన్ని దర్శించినప్పుడు, అక్కడ ఉన్న మట్టి రేణువుతో సహా పవిత్రంగా అనిపిస్తుంది. అది కాశీ అయితే, అణువణువులో శివ దర్శనం లభిస్తుంది. అక్కడ ప్రతి శిలా ఒక శివలింగమే. అక్కడ లభించే పాద ధూళి విభూతి సమానమే. చరితార్థమైన ఆ పురాతన నగరం ఎప్పటికీ ఒక క్రాంతి ధామమే. ఆత్మజ్ఞాన జ్యోతులతో వెలుగొందే ఒక కాంతి నగరమే!

అక్కడ ప్రవహించే గంగలో శివయ్య కరుణ పొంగుతుంటే, అక్కడ వీచే గాలిలో ఓంకారం వినిపిస్తుంది.. భక్తితో వినగలిగితే. ఈ భువికైలాసం శంకరుని నివాసం. ‘చిరంజీవిగా నిలిచే ఈ నగరమే’.. అనడంలో వారణాసి శాశ్వతత్వాన్ని చెప్పడమే కాక, కథానాయకుడి పేరు కూడా వచ్చేలాగా పదవిన్యాసం చేయడం శాస్త్రి గారికేమీ కొత్త కాదు. కాశీ మహిమను ప్రతివారు తెలుసుకొని తరించమని, ఒక గైడ్ పాత్ర ద్వారా మనందరికీ సందేశమిస్తున్నారు.. శివ పూజకై చివురించిన సిరి సిరి వెన్నెలపువ్వు.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here