అమ్మణ్ని కథలు!-2

1
4

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని అక్షరాభ్యాసం..

[dropcap]నా[/dropcap]కు ఐదేళ్లొచ్చాక ఒక మంచిరోజు చూసి, మా నాయన నన్ను మా ఊళ్లోని రెడ్డిగారి బడికి తీసుకుపోయారు. అది పంచాయితీ వాళ్ల బడే! రెడ్డిగారి ఇల్లు బాడుగకు తీసుకొని, అక్కడ బడి నడుపుతున్నారు కాబట్టి ఆ పేరు వొచ్చింది దానికి!

అమ్మ తలంటు పోసి, కొత్త లంగా, జాకెట్టూ తొడిగింది. రెండు జడలు వేసి పూలు పెట్టింది. దేవుడికి దండం పెట్టించింది. అమ్మానాన్నలకూ, పెద్దమ్మకూ, తాతగారికీ దండాలు పెట్టినాను.

బడిలో పిల్లలకు పంచడానికి మా జీతగాడు పుల్లయ్య పెద్ద గంప నిండా బొరుగులు, పప్పులు, బెల్లం కలిపిన తినుబండారాన్ని మోసుకొస్తున్నాడు (మా వూళ్లలో ఆ కాలంలో అదొక ఫేమస్ స్నాక్ లాంటిది మరి.). అయ్యవార్లకు, అయ్యవారమ్మలకూ ఇవ్వడానికి అమ్మ ఇంట్లో చేసిన లడ్డూలు పంపింది.

మరో జీతగాడు పడిగలప్ప అప్పుడే చాటకొండ సుబ్బరాయుడి అంగట్లో నించి తెప్పించిన ఇరవై ఐదు.. ముప్ఫయి పలకలు, బలపాల కట్టలూ పట్టుకొస్తున్నాడు.

మా నాయన రాక గురించి ముందే తెలుసుననుకుంటా.. పెద్దఅయ్యవారు (హెడ్ మాస్టరు, పెద్దసారు) సుబ్బారెడ్డి గారు నవ్వుతూ ఎదురొచ్చి “రాండి శాస్త్రిగారు! మీరు రావడం మాకు సంతోషం!” అంటూ నాయనను ఆహ్వానించి, ఒకటో తరగతి గదికి తీసుకుపోయారు.

పార్వతమ్మ అయివారమ్మను పరిచయం చేశారు. ఆమె నాయనకు నమస్కారం చెప్పింది. ఆమె గోముగా నన్ను దగ్గరికి లాక్కుని, “నా దగ్గర చదువు నేర్చుకుంటావా అమ్మణ్నీ!” అన్నది. తలూపాను సరేనంటూ.

“కొంచెం మొండిపిల్ల, అల్లరిపిల్ల అమ్మా మా అమ్మణ్ని. ఎట్లా దారికి తెచ్చుకుంటావో.. యేమో?” అన్నారు నాయన పార్వతమ్మ అయివారమ్మతో.

“అదేం లేదు శాస్త్రిగారూ! మనింటి పిల్లలకు పేరుందా? అపర సరస్వతులు.. ఈమె అక్కలకూ, అన్నలకూ నేనే కదా చదువు చెప్పిందీ.. నేను చూసుకుంటాను కదా..!” అని అభయమిచ్చింది పార్వతమ్మ అయివారమ్మ.

ఈమె నన్ను ఎట్లా దారికి తెచ్చుకుంటుందా.. అని ఆలోచిస్తూ నిల్చుకున్నాను.

అక్కడ అప్పటికే పెట్టి వున్న సరస్వతీ దేవి, విఘ్నేశ్వరుడి ఫోటోలకు చిన్నపూజ చేయించి, పప్పులు బొరుగులు, లడ్లు నైవేద్యం పెట్టారు మా నాయన. పలకలూ, బలపాలూ పిల్లలందరికీ నా చేత పంపకాలు చేయించారు.

ఆఖరుకు నాకు పలక మిగులుతుందో లేదోనని భయపడ్డాను. మిణుకు మిణుకుమంటూ చూస్తున్నాను. కానీ ఒక పెద్దపలక, ఒక బలపాల కట్ట మిగిలింది. పిల్లలకు పప్పులూ, బొరుగులూ పంచిపెట్టాడు పుల్లయ్య. పాత పేపర్లతో పొట్లాలు చేసుకుని అందులో పోయించుకున్నారు పిల్లలు పప్పులూ.. బొరుగులూ.

అప్పుడు నాయన నా చేత ఓనమాలు రాయించినారు పలకమీద.

నాయన నన్ను బడిలో దించేసి ఇంటికి వెళ్లిపోయినారు.

హాయిగా ఇంట్లో చల్లగా నీడపట్టున వుండి, బట్టలతో బొమ్మలు తయారు చేసుకొని, దర్జీసాయిబు దగ్గర రంగురంగుల గుడ్డపీలికలు తెచ్చుకునీ, చీరలు కట్టీ, పంచెలు కట్టీ.. బొమ్మల పెళ్లిళ్లు చేసుకునీ కాలక్షేపం చేసుకునే నాకు బడికెళ్లే శిక్ష ప్రారంభమైంది.

పోను పోను బడి అంటే గుదిబండలాగా అయిపోయింది నాకు.

పార్వతమ్మ అయివారమ్మను మోసం చేసి, ఇంటికి పారిపోయే దాన్ని అప్పుడప్పుడూ.

అదెట్లా అంటే, ఆమె పొద్దున తొమ్మిది గంటల వేళ హోటల్ నించి టిఫిన్ తెప్పించుకొని కిటికీలో ఆ పాకెట్ పెట్టుకొని, అటు తిరిగి నిలుచుకొని తింటుండేది. నేను మెల్లగా నా సంచీ తీసేసుకొని బయటికిపోయి, గోడపక్కన నక్కేదాన్ని. ఆమె టిఫిన్ తిని క్లాసువైపు తిరిగేసరికి ఇంటికి పరుగో పరుగు!

అమ్మ ‘అప్పుడే వచ్చేసినావేమే’ అంటే.. ‘కడుపునొప్పి, కాలునొప్పి’ అని చెప్పేదాన్ని. ఒక్కోసారి వినేది. అసలే లాయరు బుర్ర కదా ఆమెది.. క్రాస్ ప్రశ్నలు వేసి, నాకు తెలీకుండానే నిజం రాబట్టేది. అప్పటి అమ్మ మూడ్‌ను బట్టీ నాలుగు తిట్లో.. రెండు దెబ్బలో పడేవి. ‘ఇంట్లో బొమ్మలాట లాడుకునే సంతోషం ముందు అవెంతలే..’ అని దులిపేసుకునేదాన్ని.

కొట్టకముందే కొట్టినంతగా యేడవడం, లేదా దెబ్బ తగిలిందాని కంటే పేద్ద పెట్టున రాగం తీయడం, కాళ్లు నేలకేసి కొట్టడం, ‘ఇంకెప్పుడూ చెయ్యనమ్మా.. ఇదే చివరిసారి.. నన్ను వొదిలెయ్యమ్మా!’ అని దీనంగా వేడుకోవడం, ఇవన్నీ దెబ్బలు తప్పించుకునేటందుకు నేను పన్నే ఉపాయాలు!

ఒక్కోసారి అమ్మే నా గోల భరించలేక రాజీకి వొచ్చి, యేదో తినడానికి చేతిలో పెట్టేది.

అమ్మ ఎంత తెలివైనదైనా పదకొండు మంది పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం ఎంత కష్టం.. ఎంత కష్టం! అందునా నాలాంటి మొండిపిల్లను దారిలో పెట్టడమంటే సామాన్యమా?

అప్పట్లో పొద్దున ఎనిమిదింటి నించీ పదకొండు దాకా, మళ్లీ మధ్యాహ్నం రెండింటి నించీ ఐదు వరకూ బడి నడిచేది. పొద్దున పోవడం బాగుండేది కానీ, మధ్యాహ్నం బడి అంటే యేడుపొచ్చేది.

మా అన్నావాళ్లయితే మేడమీద మా తాతగారి పక్కన పండుకొని నిద్రపోయినట్టు నటించేవారు. ఆడపిల్లలకు తాతగారి దగ్గర అంత చనువు వుండేది కాదు.

పిల్లలను బడికి పిలుచుకొని పోవడానికి మిస్కిన్ సా అనే అతను ఒచ్చేవాడు.

అమ్మను మా గురించి అడిగితే ‘పైన పెద్దయ్యగారి దగ్గర వున్నారేమో పిలుచుకోనిపో’ అని చెప్పేది అమ్మ.

అతను వచ్చి “పెద్దయ్యా.. పిల్లోళ్లను బడికి పిల్చుకోని పోనీకి ఒచ్చినా..” అని వినయంగా తలగుడ్డ తీసి చెప్పేవాడు నసుగుతూ.

మా తాతకు అరికాలిమంట నెత్తికెక్కేది. “ఎవడ్రా.. పిల్లలకు ఎండపూట చదువు చెప్పేది? ఎవడు ఆ హెడ్ మాస్టరు.. నా ముందుకు రమ్మను.. వాడికి బుద్ధుందా లేదా? ఎండవేళ పిల్లలు హాయిగా పండుకోకుండా యేం చదువులు చెబుతార్రా? ఎండలో చెమటలు కారుతుంటే యేం చదువులు చదువుతారు పసిపిల్లలు! పొద్దున చదివింది చాల్లే. మిగతా రేపు పొద్దున చెప్పుకోమను మీ అయ్యవారిని..” ఇంకా యేదో చదువుతూనే వున్నారు తాత.

మిస్కిన్ సా తలగోక్కుంటూ “సరే సామీ.. ఇదే మాట సెబ్తా!” అని వెళ్లిపోయేవాడు.

అతను వెళ్లిపోయింతర్వాత కాసేపు తాత దగ్గర పండుకోని, మెల్లగా దొంగల్లా లేచి వొచ్చి ఆడుకునేవారు మా అన్నగార్లిద్దరూ.

ఆ సమయంలో నేను, జయ అక్కడుంటే తాతగారి ఛత్రఛాయలో మా బడికి నామాలు పెట్టేవాళ్లం. కింద వుంటే మాత్రం మా అమ్మ బలవంతాన బడికి పంపించేసేది.

అక్కడికి పోయి పెద్ద ఒరగబెట్టేదేమీ లేదు. అంతగా చదువుకునేదేమీ లేదు. మా క్లాసు టీచరు నరసన్న అయివారు నల్లమందు భాయీ అట. ఎప్పుడూ నిద్రపోతూ వుండేవాడు.

మేమంతా ఆడుకున్నంతసేపు ఆడుకోని, పలకల మీద ముగ్గులు నేర్చుకోనీ.. గోలగోల చేసేవాళ్లం! పెద్దసారు వొచ్చి, నరసన్న అయివార్ని నిద్రలేపి “ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిలేదా?” అని తిట్టి వెళ్లిపోయేవాడు.

అప్పుడు లేచి హడావిడి పడిపోయి, యేవో ఎక్కాలూ అవీ వల్లె వేయించేవాడు. అట్లా రెండో తరగతి అయిపోయింది.

సెలవులయిపోవచ్చిన తర్వాత మా పెద్దన్న ఒకరోజు “ఇంక బడి తెరుస్తారు. అమ్మణ్ని మూడో తరగతిలోకి పడ్తుంది. నేను యేడులో పడతాను” అన్నాడు.

నాకు భయం వేసింది. “మూడో తరగతిలోకి పడడం అంటే నన్ను మూడోతరగతి గదిలోకి విసిరి పడేస్తారా అన్నా?” అని అడిగాను భయం భయంగా.

“అవునే అమ్మణ్నీ.. నువ్వు రెండో తరగతి గదిలో వున్నావు కదా.. రెండో తరగతి అయివారు విసిరి నిన్ను మూడో తరగతి రూములోకి విసిరేస్తారన్నమాట! అక్కడ మూడో తరగతి అయివారు నిన్ను పట్టుకుంటాడు” అన్నాడు.

“దెబ్బలు తగలవా మరి?” అన్నాను బిక్కుబిక్కుమంటూ.

“తగిల్తే తగుల్తాయి. వాళ్లకేం పోయిందీ? మరి మూడో తరగతి లోకి నిన్ను పడేయాల గదా.. పడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వుండు.. దెబ్బలు తగలకుండా. తగిలినా రెండ్రోజుల్లో దెబ్బలు తగ్గిపోతాయిలే!” అని వెళ్లిపోయాడు.

నేను బాగా దిగులుపడిపోయినాను.

బడి తెరిచేరోజు భయంభయంగా రెండో తరగతి గదిలోకి పోతే.. “అమ్మణ్నీ.. నువ్వు పక్కరూములోకి పో.. నువ్వు ఇప్పుడు మూడోతరగతిలో పడినావు..” అన్నాడు నరసన్న అయివారు.

‘అమ్మయ్య.. విసిరేం పడెయ్యరులే.. అన్న చెప్పినవన్నీ అబద్ధాలే!’ అనుకున్నాను.

మూడో తరగతి అయివారమ్మ సువర్ణమ్మ నన్ను ఆప్యాయంగా పిలిచి ఒళ్లో కూచోబెట్టుకుంది.

అట్లా నేను మూడో తరగతిలోకి పడ్డాను.. దెబ్బలేం తగలకుండానే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here